బీడు.. పోగొండ గోడు
బుట్టాయగూడెం: పోగొండ రిజర్వాయర్‌తో రైతుల ఆశలు నెరవేరలేదు. పాలకుల నిర్లక్ష్యంతో రైతుల పంటకు నీరందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన ఉండటంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం మండలం చింతలగూడెం సమీపంలో పోగొండ రిజర్వాయర్ నిర్మాణానికి 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా రూ.26.02 కోట్ల నిధులను విడుదల చేశారు. పనులకు శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత పనులు మందకొడిగా సాగాయి. అధికారులు పనులకు సంబంఽధించి అంచనాలు వేయడంతో 2014లో రూ.85.50 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పదేళ్లపాటు కొనసాగిన ఈ పనులకు సుమారు రూ.129.50 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెరిగింది. పూర్తి స్థాయిలో పనులు జరగకుండానే 2018 ఫిబ్రవరి 19న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా హడావుడిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కనీసం భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం కూడా అందించలేదని రైతులు విమర్శిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు పరిహారం విషయంలో, పూర్తి స్థాయిలో పనులపై కనీసం నోరు మెదపడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
7,600 ఎకరాలకు నీరందేలా లక్ష్యం
పోగొండ రిజర్వాయర్ ద్వారా బుట్టాయగూడెం మండలంలోని రాచూరు, లంకాలపల్లి, కుమ్మరిగుంట, లక్ష్ముడుగూడెం, రామన్నగూడెం గ్రామాల్లో సుమారు 4,000 ఎకరాల బీడు భూములకు సాగు నీరు అందించాలన్నదే లక్ష్యం. వీటితోపాటు కొయ్యలగూడెం మండలంలోని 3,600 ఎకరాలకు స్థిరీకరణ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది.
పూర్తికాని పంట కాల్వలు
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి ఆరేళ్లు గడుస్తున్నా పంట కాల్వల పనులు నేటికీ పూర్తి కాలేదు. కుడి కాల్వ పరిధిలో 5 గ్రామాల పరిధిలో 1000 ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలో 500 ఎకరాలు సాగునీరు అందించేందుకు పంట కాల్వలు నేటికీ పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. దీనితో ఆయా గ్రామాల పరిధిలో సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో పంట కాల్వల ఏర్పాటుకు భూమిని కోల్పోయిన 1400 మంది రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికై న పరిహారం చెల్లించడంతోపాటు పంట కాల్వలు పూర్తి చేసి తమ పొలాలకు సాగు నీరు అందించేలా కృషి చేయాలని పోగొండ రైతులు కోరుతున్నారు.
పంట కాల్వల్లో పారని నీరు
అసంపూర్తిగా పోగొండ రిజర్వాయర్ పనులు
పనులు పూర్తి చేసి నీరు అందించాలంటున్న 13 గ్రామాల రైతులు
Comments
Please login to add a commentAdd a comment