ఇరాక్‌లో జగన్ పుట్టినరోజు వేడుకలు
తాడేపల్లిగూడెం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జగన్ అభిమానులు ఇరాక్‌లో ఘనంగా జరిపారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి శివ ఆధ్వర్యంలో 20 కిలోల భారీ కేక్ కట్ చేసి జగన్ పట్ల అభిమానం చాటుకున్నారు.
ఉద్యాన వర్సిటీ వీసీకి అవార్డు
తాడేపల్లిగూడెం : ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో 35 సంవత్సరాలుగా చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్‌కు అవార్డు దక్కింది. బెంగళూరులో ఇన్‌సెక్ట్ ఎన్విరాన్‌మెంటు జర్నల్, రష్వీ ఇంటర్నేషనల్ పైటోసానిటరీ రీసెర్చ్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అబ్రహం వర్గీస్ ఇన్‌సెక్ట్ నేచర్ ట్రస్టు ఈ అవార్డును వీసీకి ప్రధాన చేసింది. తీపి నారింజ, ఉల్లి, పసుపు, పులుపు నిమ్మ, సుగంధ ద్రవ్యాలలో అత్యుత్తమ సేవలకు వీసీకి అత్యుత్తమ మొక్కల రక్షణ 2024 అవార్డు వచ్చింది.
ట్రిపుల్ ఐటీలో గణిత దినోత్సవం
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆదివారం జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. గణితం హెచ్‌ఓడీ సీహెచ్ సుబ్బారెడ్డి నేతృత్వంలో స్టూడెంట్ మిత్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ వై.నరసింహారెడ్డి పాల్గొని గణిత ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. అన్ని శాస్త్రాలకు గణితమే మూలమన్నారు. గణితంలో రాణిస్తే అన్ని శాస్త్రాల్లో రాణించడం సులువవుతుందన్నారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ మాస్టర్, మ్యాథ్స్ స్క్వేర్ పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాచర వెర్రియ్యనాయుడు, రాజేష్ బండారి రూపొందించిన మ్యాథ్స్ రేసర్ అనే వెబ్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా చైతన్యమే రాజ్యాంగానికి రక్షణ కవచం
తణుకు అర్బన్: రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాజ్యాంగానికి రక్షకులుగా ఉండాల్సిన న్యాయమూర్తులు దానికి విరుద్ధంగా తీర్పులు ఇస్తున్న పరిస్థితుల్లో పౌరసమాజ సంస్థలు కల్పించే ప్రజా చైతన్యమే రాజ్యాంగానికి రక్షణ కవచమని మాజీ పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. తణుకు రాజ్యాంగ ప్రచార వేదిక సమన్వయకర్త డీవీవీయస్ వర్మ అధ్యక్షతన ఆదివారం స్థానిక సురాజ్య భవన్‌లో నిర్వహించిన పౌర సంస్థల, ప్రజాసంఘాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని పౌర సంస్థలకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా రిపబ్లిక్ భావన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. సంధానకర్తలుగా ఏఐటీయుసి నాయకులు కోనాల భీమారావు, సీఐటీయు నాయకులు పీవీ ప్రతాప్, సామాజిక న్యాయపోరాట సమితి వ్యవస్థాపకుడు పి.మురళీకుమార్, వివిధ రంగాల ప్రముఖులు డా.గుబ్బల తమ్మయ్య, ఎస్.మనోరమ, డా.రమేష్ వ్యవహరించారు. అడబాల లక్ష్మీ, డి.సోమసుందర్, డా.జి.అబ్బయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment