సిరుల తల్లి.. వరాల కల్పవల్లి
భీమవరం(ప్రకాశం చౌక్): భక్తుల పాలిట కొంగు బంగారం.. భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్‌ల కోసం విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్ తదితర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిలువెత్తు స్వర్ణమయం
మావుళ్లమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తుల నుంచి బంగారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 72 కిలోల బంగారం సేకరించగా 63 కిలోల వరకూ ఆభరణాలు తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. 100 కిలోలు బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించాలనే లక్ష్యంగా ఆలయ అధికారులు, ఉత్సవ నిర్వాహకులు దాతలను ప్రోత్సహిస్తున్నారు.
రూ.90 లక్షల వ్యయంతో..
నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దాదాపు రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షలతో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆఖరి తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావలు ఏర్పాటుచేస్తారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బుర్రకథలు, 15 వరకూ సినీసంగీత విభావరి కార్యక్రమాలు ఉంటాయి. ఇలా కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
భారీగా భక్తుల రాక
అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో నెలరోజుల పాటు ఆలయం వద్ద జన సందడి నెలకొంటుంది. ఆలయం వద్ద సెట్టింగ్‌లు, విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
లక్షల మందికి అన్నదానం
ఆలయం వద్ద నెల రోజులపాటు భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహిస్తారు. రోజుకు సుమారు 7 వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే ఆఖరి రోజు మహా అన్నదానం నిర్వహిస్తారు. సుమారు లక్ష మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. అమ్మ వారి అన్న ప్రసాదం స్వీకరించడాన్ని జిల్లా ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తారు.
60 ఏళ్లుగా ఉత్సవాలు
గత 60 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఉత్స వాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకై క ఉత్సవంగా మావుళ్లమ్మ ఉత్సవాలు నిలుస్తున్నాయి. గతంలో ఉత్సవాల్లో భాగంగా సినీ, కళారంగ ప్రముఖులను సన్మానించి బంగారాన్ని బహూకరించేవారు. కరోనా విపత్తు సమయం నుంచి సన్మాన కార్యక్రమాలను నిలిపివేశారు.
కొంగు బంగారం
మావుళ్లమ్మ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
జనవరి 13 నుంచి నెల పాటు నిర్వహణ
ప్రత్యేక పూజలు, కళా ప్రదర్శనలు
రూ.90 లక్షలతో జాతర మహోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment