ముదినేపల్లి రూరల్: చిరువ్యాపారికి జీఎస్టీ రూ.కోటి చెల్లించాలని నోటీసు వచ్చిన వైనమిది. మండలంలోని శ్రీహరిపురంనకు చెందిన పంచకర్ల విజయబాబు కూల్‌డ్రింక్‌ల వ్యాపారం చేస్తుంటాడు. ఇందుకు సంబంధించి జీఎస్టీ నంబరు కోసం గతేడాది మార్చి 23న విజయవాడలోని ఏసీటీవో కార్యాలయంలో సిబ్బందిని సంప్రందించారు. కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బిల్లా కిరణ్ జీఎస్టీ నంబరు కోసం ఆధార్, పాన్‌కార్డు, ఫొటో అందించాలని విజయబాబును కోరాడు. ఈమేరకు తన ఆధారాలను కిరణ్‌కు పంపించారు. ప్రతినెలా విజయ్‌బాబు వ్యాపారానికి సంబంధించి కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలను ఫోన్‌లో తెలిపేవారు. ఈమేరకు రిటర్న్‌లు కిరణ్ దాఖలు చేసేవాడు. ఈనేపథ్యంలో గత ఆగస్టు 3న సేల్స్‌టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్‌భాస్కర్ సిబ్బందితో సింగరాయపాలెం వచ్చి విజయబాబు దుకాణాన్ని తనిఖీ చేశారు. విజయ్‌బాబుకు కేటాయించిన జీఎస్టీ నంబరుపై రూ.66,65,76,256 లావాదేవీలు జరిగాయని వీటిపై రూ.కోటి వరకు పన్ను చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు తాను చేయలేదని విజయ్‌బాబు తెలుపగా స్థానిక సచివాలయ ఉద్యోగులతో పంచనామా నిర్వహించారు. తనకు విధించిన పన్నుపై విజయ్‌బాబు గత నవంబరు 25న అకౌంటెంట్ కిరణ్‌ను నిలదీయగా తనవల్ల తప్పు జరిగిందని ఒప్పుకుని తానే పన్ను చెల్లిస్తానని తెలిపాడు. అప్పటినుంచి ఇప్పటివరకు పన్ను చెల్లించకుండా కిరణ్ తనను మోసం చేశాడంటూ విజయ్‌బాబు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment