సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు

Published Wed, Jan 8 2025 2:12 AM | Last Updated on Wed, Jan 8 2025 2:12 AM

సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు

సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు

రామగిరి(నల్లగొండ), మిర్యాలగూడ టౌన్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. తద్వారా ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర రాజధానితోపాటు, వివిధ ప్రధాన పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంత ఊర్లకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు పూనుకుంది. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణికులతో బస్సుల్లో రద్దీ నెలకొననున్న నేపథ్యంలో రూట్ల వారీగా బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏ డిపో నుంచి ఎన్ని బస్సులు నడిపించాలో కూడా ఇప్పటికే నిర్ణయించారు. స్పెషల్‌ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులు ఉండనున్నాయి. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల ద్వారా అదనపు చార్జీలు వసూలు చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఏడు డిపోల నుంచి..

నల్లగొండ రీజియన్‌ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, నల్లగొండ డిపోల నుంచి మొత్తం 400 బస్‌ సర్వీసులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, తిరిగి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణిలకు రద్దీని బట్టి బస్సులను నడిపిస్తారు. ముఖ్యంగా 9వ తేదీన 38, 10న 110, 11న 130, 12న 90, 13న 32 బస్సులను నడపనున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్‌ బస్టాండ్‌ వద్ద జిల్లాకు చెందిన ఇద్దరు డిపో మేనేజర్‌లతో పాటు డిప్యూటీ ఆర్‌ఎం స్థాయి వారిని సిబ్బందిగా నియమించారు.

ఫ పండుగ వేళ ప్రయాణికుల

సౌకర్యార్థం నడపనున్న ఆర్టీసీ

ఫ రద్దీకి అనుగుణంగా రూట్ల వారీగా బస్సులు

ఫ 9 నుంచి 13 తేదీ వరకు.. తిరిగి 15 నుంచి 20 వరకు..

ఫ ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు

ప్రయాణికులకు ఇబ్బందులు కలగనీయం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నల్లగొండ రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే మా లక్ష్యం. బస్సులకు రిజర్వేషన్ల అవకాశం కూడా కల్పించాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. చార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఒకవేళ సంస్థ నిర్ణయం తీసుకుంటే చార్జీల పెంపు ఉంటుంది.

– జానిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement