బంగారు వ్యాపారులకు కుచ్చుటోపి
– రూ.60 లక్షల బంగారు, వెండితో మాయం
పోరుమామిళ్ల : పోరుమామిళ్లకు చెందిన వసీం జ్యువెలర్స్ యజమాని మహబూబ్‌బాషా రూ. 60 లక్షల విలువ చేసే బంగారు, వెండితో పరారయినట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. అతను ఎప్పుడు ఊర్లో నుంచి మాయమయ్యాడో తెలియదుకానీ గురువారం ప్రొద్దుటూరు నుంచి బంగారు వ్యాపారస్తులు పోరుమామిళ్లకు వచ్చి ఎస్‌ఐ కొండారెడ్డికి ఫిర్యాదు చేయడంతో సమాచారం వెలుగు చూసింది. శుక్రవారం ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహబూబ్‌బాషా ప్రొద్దుటూరు బంగారు వ్యాపారుల వద్ద బంగారు, వెండి తెచ్చి ఇక్కడ అమ్ముకుని తెచ్చినచోట సొమ్ము చెల్లించేవాడు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరుతో పాటు చాగలమర్రి, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లోని 12 మంది వద్ద నగలు తెచ్చి పోరుమామిళ్లలో అమ్మి కొంత కొంత మొత్తం అప్పు ఇచ్చిన వారికి చెల్లించేవాడు. ఇటీవల ప్రొద్దుటూరు వ్యాపారులకు జమ ఇవ్వకపోవడం, ఫోన్‌లో సమాధానం లేకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఇక్కడకు వచ్చారు. మహబూబ్‌బాషా నెల నుండే ఓ ప్లాన్ ప్రకారం అందరి వద్ద రూ. 60 లక్షల బంగారు, వెండి తీసుకుని, జమ ఇవ్వకుండా భార్య హర్షత్ ఉన్నీసాతో పరారైనట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్‌తోనే మోసం చేసినట్లు వ్యాపారులు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా బంగారు షాపు యజమాని మహబూబ్‌బాషా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
విద్యార్థి అదృశ్యం
జమ్మలమడుగు రూరల్ : మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన వెంకట హిమవంతు అనే విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాల నుంచి అదృశ్యం కావడంతో తండ్రి మురళి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రామక్రిష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన వెంకట హిమవంతు జమ్మలమడుగు పట్టణంలోని రామిరెడ్డిపల్లె రహదారిలో నున్న జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా ఈ నెల 18న రాత్రి 10 గంటల సమయంలో తన పక్క రూంలో ఉన్నటువంటి మునిశివ అనే విద్యార్థితో గొడవపడ్డాడు. ఈ విషయమై వాచ్‌మెన్ ఇరువురిని పిలిచి మందలించాడు. గొడవ జరిగిన విషయాన్ని వాచ్‌మెన్ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. 19వ తేదీ ఉదయం పరీక్ష రాసిన అనంతరం మధ్యాహ్నం సమయంలో వెంకట హిమవంతు పాఠశాల ప్రహరీ దూకి పారిపోయాడు. ఈ విషయమై ప్రిన్సిపాల్ కెవిఎస్ రామకృష్ణారెడ్డి విద్యార్థి తల్లిదండ్రులతో కలసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి ఆవు మృతి
గాలివీడు : విద్యుత్ తీగలు తగిలి పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలోని చోటు చేసుకుంది. పెద్దూరుకు చెందిన రియాజ్ అహమ్మద్‌కు చెందిన పాడి ఆవు శుక్రవారం మేతకు వెళ్లిన క్రమంలో పెద్దూరు పక్కనే వరిమళ్ళలో ఉరుసు జరిగే ప్రాంతంలో 11 కేవీ విద్యుత్ తీగలు డిస్క్ కట్ అయిన కారణంగా కిందకు వేలాడుతున్నాయి. ప్రమాదవశాత్తు పాడి ఆవుకు తీగ తగిలి మృతి చెందినట్లు సమాచారం. మరో 20 రోజుల్లో పాడి ఆవు ప్రసవించాల్సి ఉండగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగల ధాటికి పాడి ఆవు విగత జీవులై పడివుండటం చూపరుల హృదయాన్ని కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేరళ ట్రెక్కింగ్‌కు ఎన్‌సీసీ విద్యార్థి
చిట్వేలి : ఆల్ ఇండియా కేరళ ట్రెక్కింగ్‌కు చిట్వేలి జెడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ విద్యార్థి పులి దిలీప్ కుమార్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు ఏబిఎన్ ప్రసాద్, ఎన్‌సీసీ ట్రూప్ అధికారి పసుపుల రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేది వరకు కెడెట్ దిలీప్ కుమార్ జాతీయస్థాయిలో కేరళలో జరిగే ట్రెక్కింగ్‌లో పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment