చిరు వ్యాపారులపైకి దూసుకువచ్చిన తుపాకి గుళ్లు
మాధవరం–కాటిమాయకుంట అటవీ ప్రాంతంలో ఘటన
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐలు
రాయచోటి/కడప అర్బన్: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాధవరం–కాటిమాయకుంట గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పేల్చిన తుపాకీ గుళ్లు పూసలు, చిక్కు వెంట్రుకల వ్యాపారుల కడుపుల్లో దూసుకుపోయాయి. ఈ ఘటనలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరొకరు మృత్యువాత పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో అటవీ ప్రాంత ప్రదేశంలో తుపాకీని పేలచ్చారు. అసలు ఆ సమయంలో గ్రామాలు తిరిగి పూసలు అమ్ముకునే వారికి ఆ అటవీ ప్రాంతంలో పనేముంది.. వీరినే తుపాకులతో మూడు సార్లు ఎందుకు కాల్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాలలోకి వెళ్లితే... సంబేపల్లె మండల కేంద్రంలో సల్ల రమణ (30), నీలకంఠ హనుమంతు(45) కుటుంబంతో కలిసి చుట్టుపక్కల గ్రామాలలో పూసలు, చిక్కు వెంట్రుకలు, డబ్బా రేకులతో తయారుచేసిన కొన్ని పరికరాలను అమ్ముకుని జీవనం సాగించేవారు. అలాగే వారికి కొన్ని మేకలు కూడా ఉన్నాయి. స్థానికంగా మేకలకు తగిన ఆహారం లేకపోవడంతో రాయచోటి రూరల్ మండల పరిధిలోని కాటిమాయకుంట అటవీ ప్రాంత పరిధిలో వాటిని మేపుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో సమీప గ్రామాల్లో పర్యటిస్తూ చిరు వ్యాపారం ద్వారా బియ్యం, డబ్బులు పొంది కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కొండ అవతల ఉన్న మాధవరం గ్రామ పరిధిలోని మద్దెలకుంట గ్రామానికి బయలు దేరినట్లు ప్రమాదంలో గాయపడిన రమణ తెలిపారు. ఐదు గంటల సమయంలో రెండు గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తుపాకీ తూటాలు మా పొట్టల్లోకి దూసుకు వెళ్లాయన్నారు. ఈ దాడిలో సల్ల రమణ(30) కడుపులోకి తూటాలు చొచ్చుకెళ్లాయి. అలాగే పక్కన ఉన్న నీలకంఠ హనుమంతు(45) కడుపులోకి మరో తూటా దూసుకు వచ్చిందని బాధితుల నోట వినిపించాయి.
తూటాలకు గాయపడి రక్తం పారుతున్నా వాటిని బిగ పట్టుకుని అక్కడ నుంచి కేకలు వేస్తూ కాటిమాయకుంట సమీపంలో తామున్న ప్రదేశాలకు (గుడారాల వద్దకు) చేరుకున్నామన్నారు. అక్కడ నుంచి ఆటోలో రక్తంతో తడిచిపోయిన వారిద్దరు చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఇరువురికీ కడుపులో తూటాలు ఉండటంతో మెరుగైన అత్యవసర చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నీలకంఠ హనుమంత మృతిచెందాడు. రమణ పరిస్థితి విష మంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే తుపాకులతో కాల్చిన ప్రదేశంలో ఎవరున్నది చూడలేదని, సమీపంలో స్కూటర్ ఉన్నట్లు గుర్తించామని వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ
తుపాకులతో కాల్చిన ప్రదేశాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ చంద్రశేఖర్ సందర్శించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించడంతో పాటు గ్రామ పరిధిలో నాటు తుపాకులు ఉపయోగించే వారి వివరాలను సేకరించాలని కింది స్థాయి సిబ్బందిని డీఎస్పీ ఆదేశించారు. అలాగే జాగిలాలతో ఆ ప్రాంతంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తుపాకులతో కాల్చిన వారు అడవి జంతువుల కోసం వచ్చారా? లేక మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలపై విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. జరిగిన సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ సాగిస్తున్నట్లు ఆయన వివరించారు.
భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తున్నాం
మా జీవనం ఊరూరూ తిరిగి చిక్కు వెంట్రుకలు సేకరించుకుంటూ, పూసలు అమ్మడం, డబ్బా రేకులతో తయారు చేసిన చాటలు అమ్ముకోవడం, వారిచ్చిన చిల్లర, బియ్యంతో కుటుంబాన్ని పోషించుకోవడం మా వృత్తి అని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటికి తోడు కొన్ని మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తుపాకీ తూటాలకు గాయపడ్డ మా బిడ్డలను రక్షించుకోవడానికి మా దగ్గర ఆర్థికస్తోమత లేదంటూ ఆ మహిళలు ఆసుపత్రి ఆవరణంలో బోరున విలపించారు. మా బిడ్డలపై ఎందుకు కాల్పులు జరిపారో తెలియదని వాపోయారు.
వ్యాపారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతంలో తుపాకుల కాల్పులకు అక్కడి వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment