కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కేంద్ర శాస్త్ర సాంకేతిక, భౌగోళిక శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనపై కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జిల్లాకు వస్తున్న మంత్రి జితేంద్ర సింగ్ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కేంద్ర మంత్రి పర్యటన కోసం హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యు కేషన్, వ్యవసాయం – అనుబంధ రంగాలు, ఆర్థిక రాబడులు – స్కిల్ డెవలప్‌మెంట్, కనీస మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల వారీగా జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మంత్రి పర్యటన ఇలా..
కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మూడురోజులపాటు జిల్లాలో పర్యటిస్తారు. తొలిరోజు తిరుపతి నుంచి బయలుదేరి కడపకు చేరుకుని రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. మరుసటిరోజు సీకే దిన్నె మండలం నాగిరెడ్డిపల్లెను సందర్శిస్తారు. అక్కడి విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం, వాటర్ కన్జర్వేషన్ ప్లాన్ స్టాల్‌ను సందర్శిస్తారు. అనంతరం జమ్మలమడుగు మండలం మోరగుడికి వెళతారు. అక్కడ స్వయం సహాయక సంఘాలతో సమావేశమై వివిధ అంశాలను పరిశీలిస్తారు. రహదారులు, డ్రైయిన్స్, తాగునీరు, హౌసింగ్ వంటి గ్రామాభివృద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. అనంతరం గండికోటను సందర్శిస్తారు. మరుసటిరోజు ఉదయం 10 గంటలకు కడప నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్‌పోర్టుకు వెళతారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment