ఉప కులాల సమాచారం ఇవ్వండి
● అధికారులకు ఏకసభ్య కమిషన్ రాజీవ్‌రంజన్ మిశ్రా ఆదేశం
● కమిషన్‌కు వెల్లువెత్తిన వినతులు
కడప సెవెన్‌రోడ్స్: ఉప కులాల వారీగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఉన్న షెడ్యూల్డ్ కులాల సమాచారాన్ని అందజేయాలని ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్‌మిశ్రా జిల్లా అధికారులను ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ సభా భవనంలో తొలుత అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024–25 నాటికి జిల్లాలో 3165 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అధికారులు వివరించారు. ఇందులో మాలలు 1923, మాదిగలు 1069, ఇతరులు 173 మంది ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ ఆది ఆంధ్ర, రెల్లి, డెక్కలి తదితర ఎస్సీ ఉప కులాలకు చెందిన వారు ఎవరూ లేరా? అంటూ ప్రశ్నించారు. సర్వీసు రిజిష్టర్లలో మాల, మాదిగ, ఇతరులు అని మాత్రమే ఉన్నాయని అధికారులు బదులిచ్చారు. మిగతా జిల్లాల్లో ఉప కులాల వారీగా వివరాలు ఇస్తున్నారని, కేవలం ఈ జిల్లా లో మాత్రమే ఉపకులాలను ఇతరుల్లో చూపుతున్నారని తెలిపారు. ఉద్యోగాలతోపాటు విద్య, స్వయం సహాయక సంఘాలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రభుత్వ పథకాల్లో ఉన్న ఎస్సీల వివరాలను ఉపకులాల వారీగా తమకు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ డేటా సేకరిస్తున్నారని, నిర్దిష్ట సమయంలోపు వివరాలను కమిషన్‌కు సమర్పిస్తామన్నారు. జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతి పాల్గొన్నారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ
రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి సామాజిక న్యాయం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు పిచ్చుక బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథ్, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షులు కేఎన్ రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, బేడ బుడగజంగం రాష్ట్ర నాయకుడు కొండయ్య తదితరులు కోరారు. ఉమ్మడి రిజర్వేషన్లు నష్టదాయకమన్నారు.
● 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని అభ్యుదయ చైతన్యవేదిక గౌరవాధ్యక్షులు రాజేశ్వరరావు కోరారు. వర్గీకరణ జిల్లా ప్రాతిపదికన జరగరాదని కోరారు.
బుడగజంగాలను ఆదుకోండి
ఎస్సీ కులాల్లోని తాము బిక్షాటన చేస్తూ కడు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నామని ఏపీ బుడగజంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు, నాయకులు పస్తం అంజి కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరిస్తే ఉప కులాలైన తమకు న్యాయం జరగుతుందని తెలిపారు.
● ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి మాదిగ, ఉపకులాలకు న్యాయం చేయాలని సీమాంధ్ర దళిత ప్రజాసేన అధ్యక్షులు పెద్దుళ్లపల్లె ఓబులపతి, మల్లికార్జునలు కోరారు.
● ఎస్సీల్లో డక్కలి, ఆరమాల, సాయిమాల వంటి 59 కులాలు ఉన్నాయని ఏపీ దళితమిత్ర సంఘం అధ్యక్షులు కైపు రామాంజనేయులు పేర్కొన్నారు.
● జనాబా దామాషా మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని సీపీఐ అనుబంధ దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి కె.మునెయ్య కమిషన్‌ను కోరారు.
క్షేత్ర స్థాయిలో విచారణ జరగాలి
షెడ్యూల్ కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలో కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని జిల్లా దళిత ఫోరం చైర్మన్ భూశిపాటి కిశోర్‌కుమార్, నాయకులు శ్రీరాములు, డాక్టర్ పెంచలయ్యలు కోరారు. ఎస్సీ వర్గీకరణ తగదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జయరాజ్, జై భీమ్ మాల మహాసేన నాయకులు సంపత్‌కుమార్, చైతన్య, సీహెచ్ వినోద్‌కుమార్‌లు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment