TS Special
-
TS: ‘కల్యాణ’ కానుకేదీ?
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన ఇప్ప లక్ష్మయ్య తన కుమార్తె వివాహం 2022 జూన్‌లో చేశాడు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాడు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కల్యాణ కానుక అందలేదు. క్రమం తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు నెలరోజుల్లో వస్తుందని చెబుతున్నా.. అలాంటి నెలలెన్నో గడిచిపోతుండటంతో లక్ష్మయ్య సాయంపై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన బి.అమృత తన కుమార్తె వివాహం గతేడాది ఫిబ్రవరి 9న చేసింది. వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పథకం అర్హత, సాయం కోసం అధికారులను అడిగినప్పుడల్లా.. వివరాలను సంబంధిత అధికారులకు పంపించామని, ప్రభుత్వం నిధులు ఇచి్చనప్పుడు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాయం అందుతుంతో లేదో ఆమెకు అర్థం కావడం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పడకేసింది. కుమార్తెల వివాహాలు చేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. ఏడాది, ఏడాదిన్నర దాటుతున్నా ‘కల్యాణ’ కానుక జాడ లేక పోవడంతో..సమీప భవిష్యత్తులోనైనా వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాటికే వధువు కుటుంబానికి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని (కానుక) అందించాలనేది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం. దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలు, క్షేత్రస్థాయిలో విచారణ నేపథ్యంలో అర్జీదారులంతా వివాహం తర్వాతే దరఖాస్తు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ పూర్తి చేసిన తర్వాత అర్హతలను ఖరారు చేసి, లబ్దిదారు కుటుంబానికి చెక్కు రూపంలో సాయం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోగా.. క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలన కూడా ఆగిపోయింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అర్జీదారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగడం లేదు. రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 1,04,613 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విడుదల కాని నిధులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఆ మేరకు బకాయిలు కూడా పేరుకుపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 2023–24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు పథకాలకు సంబంధించి 1,32,046 దరఖాస్తులు అందగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో 69,715 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జత (క్యారీ ఫార్వర్డ్) చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులతో 2023–24 డిసెంబర్ నెలాఖరు నాటికి వచ్చిన వాటిని కలిపితే మొత్తం దరఖాస్తులు 2,01,761. వీటిలో 97,148 దరఖాస్తులను అధికారులు విడతల వారీగా పరిష్కరించి క్లియర్ చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.972.60 కోట్లు విడుదల చేసింది. కానీ 1,04,613 దరఖాస్తులకు సంబంధించి రూ.1,047.68 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల జరగక చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాగా ప్రస్తుత బకాయిల్లో బీసీ, ఈబీసీ కేటగిరీల వారి దరఖాస్తులకు సంబంధించినవే సగానికిపైగా ఉండడం గమనార్హం. కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? రాష్ట్రంలో గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికాకంలోకి వచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గత ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్..అధికారంలోకొస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో బంగారం సంగతి సరే బకాయిల సంగతి ఏమిటనే ఆందోళన, ఆయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఏడాదిన్నరకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో..ఆయా పథకాలకు అర్హతలున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేటగిరీ వారీగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలు (రూ.కోట్లలో) సంక్షేమ శాఖ పెండింగ్ దరఖాస్తులు చెల్లించాల్సిన బకాయిలు బీసీ, ఈబీసీ 55541 556.29 మైనారిటీ 23599 236.28 ఎస్సీ 14267 142.90 ఎస్టీ 11206 112.21 మొత్తం 104613 1047.68 -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు చార్జింగ్ అందించడానికి అన్ని ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా సౌర విద్యుత్‌ను పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని జలాశయాలపై సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటిని తక్షణమే పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ రాయితీలను ప్రజలకు వివరించండి రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి గృహ వినియోగదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కల్పించి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే..రూ. 18 వేలు రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మూడు కిలో వాట్స్ నుంచి పది కిలో వాట్స్ వరకు కిలో వాట్ కు రూ. 9 వేలు లెక్కన ప్రభుత్వం రాయితీ ఇస్తోందనీ, దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. -
తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు
సాక్షి, హైదరాబాద్: డిజిటైజేషన్, డిస్టెన్స్ లెర్నింగ్ మెథడాలజీ, ఆన్లైన్ అప్రోచ్, డిజిటల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తెలంగాణలో ఇటీవలే రూ.వెయ్యి కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రాచీన భారతం ఎన్నో ఆవిష్కరణలకు భూమికగా నిలిచిందని.. ఆధునిక భారతం విశ్వమిత్రగా వ్యవహరి స్తోందని పేర్కొన్నారు. ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదంతో దేశయువత భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థల రెండో ఎడిషన్ ‘ఇన్వెంటివ్, ఆర్అండ్డీ ఇన్నోవేషన్ ఫెయిర్’ను ధర్మేంద్ర ప్రధా న్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థలు కలిపి మొత్తం 53 విద్యా సంస్థల నుంచి 120 ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టారు. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్, ఈ–మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ స్పేస్, ఇండస్ట్రీ 4.0 తదితర ఇతివృత్తాలతో వీటిని రూపొందించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతాం ప్రజల రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఐఐటీలకు ప్రధాని మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న కల సాకారంలో స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా నిలుస్తాయని.. ఇన్వెంటివ్–2024 వంటి సమావేశాలు రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు మరింత పెరిగేలా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ అంతా సహకారం అందించాలని కోరారు. దేశ జీడీపీలో కనీసం 25 శాతా నికి దోహదపడేలా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. ఆ దిశగానే ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్, ఎఫ్‌డీఐ లిబరలైజేషన్’వంటి విధానాలను కేంద్రం తీసుకొచి్చందన్నారు. డిజిటల్ పబ్లి క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొమైన్లో 46 శాతం గ్లోబల్ డిజి టల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని, మనదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని చెప్పారు. 2014లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడవి లక్షా 20వేలకు చేరాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు సమాజానికి మంచిది కా దని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు. -
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
17, 18 తేదీల్లో ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి వస్తుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపో తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. బుధ,గురువారాల్లో రికార్డు స్థాయిలో 101 శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఈ రెండు రోజుల్లో టీఎస్ఆర్టీసీకి రూ.45.1 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 33.93 లక్షల కి.మీ.మేర తిరిగి 48.94 లక్షలమంది ప్రయాణికులను గమ్యం చేర్చాయి. ఆ రోజు 101.62 శాతం ఓఆర్‌తో రూ.22.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 18వ తేదీన 34.18 లక్షల కి.మీ.మేర బస్సులు తిరిగ్గా 50.60 లక్షలమంది ప్రయాణికులు గమ్యం చేరారు. 101.92 శాతం ఓఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ట శాతం కావటం విశేషం. ఆ రోజు రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక రోజులో ఇంత ఆదాయం నమోదు కావటం కూడా ఇదే తొలిసారి కాగా, గతేడాది జనవరి నెలలో 17వ తేదీనాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి రూ.92 కోట్లు ఎక్కువ నమోదు కావటం విశేషం. -
లండన్ థేమ్స్‌లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్‌కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్‌సాగర్ చుట్టూ, ఉస్మాన్‌సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్‌లోని లండన్‌లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్‌పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
నీటి వాటాలు తేలకుండా కేఆర్‌ఎంబీలోకి ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నా రు. శుక్రవారం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రాజకీయా లు, ఆ తర్వాత అభివృద్ధిపై చర్చించాలన్నదే తమ విధాన మని హరీశ్‌రావు చెప్పారు. బీఆర్ ఎస్‌కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటి కోసం ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు వారం రోజుల్లోగా (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందని, అదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరు గుతుందన్నారు. కేంద్రం జూలై 2021లోనే ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధి లోకి తేవాలని ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాద నను కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కృష్ణా నీటిని ఏపీకి 50%, తెలంగాణకు 50% పంపిణీ చేయాల్సిందిగా తాము షరతు విధించామని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగ ర్కు విడుదల చేయాలని మరో షరతు పెట్టినట్లు వెల్లడించారు. ఏక పక్షంగా నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా ప్రాజె క్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీలో ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే రాష్ట్రానికి ఆత్మహత్యా సదృశ్యమేనన్నారు. జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్‌రావు చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ ఆయకట్టుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు. హైదరాబాద్ తాగునీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
హాంకాంగ్‌లో చూసి కొత్త ఆలోచన
కొమరం భీమ్: ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లిన యువకుడు అక్కడ వేసిన డ్రాగన్‌ఫ్రూట్ పంటను చూడడంతో తనకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తమ చేనులో కూడా డ్రాగన్ ప్రూట్ పంట వేయాలనుకుని విషయం తన అన్నతో చెప్పాడు. అతను కూడా సై అనడంతో పంట సాగుకు ముందుకు వచ్చారు. ఏడాదిక్రితం పంట వేయగా ప్రస్తుతం ఫలాలు ఇస్తుంది. హాంకాంగ్‌లో చూసి ఆలోచన జన్నారం మండలం దేవునిగూడ గ్రామానికి చెందిన కల్లెం రవీందర్‌రెడ్డి, జమున దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో తల్లి జమున కూలిపని చేస్తూ వారిని డిగ్రీ వరకు చదివించింది. పెద్ద కుమారుడు శివకృష్ణారెడ్డి వ్యవసాయం వైపు వెళ్లగా సాయికృష్ణారెడ్డి ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ ఎక్కువశాతం మంది డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుండడంతో పంట గురించి తెలుసుకున్నాడు. జగిత్యాల రైతు వద్ద అవగాహన జగిత్యాల జిల్లా అంతర్గావ్కు చెందిన రైతు శుభాష్‌రెడ్డి డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నట్లు శివకృష్ణారెడ్డి యూట్యూబ్‌లో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి రైతు వద్ద పంట గురించి పూర్తిగా తెలుసుకుని తమ్మునికి వివరించాడు. అతను సరే అనడంతో తమకున్న ఎకరం 10 గుంటల భూమిలో 2022 డిసెంబర్లో అదే రైతు వద్ద నుంచి రూ.80కి ఒక మొక్క చొప్పున 2 వేల మొక్కలు కొనుగోలు చేశారు. 500 సిమెంటు దిమ్మెలు తీసుకువచ్చారు. ఒక్కో దిమ్మె చుట్టూ నాలుగు మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీటిని అందించారు. మొత్తంగా రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. అందుతున్న ఫలాలు గతేడాది డిసెంబర్లో మొక్కలు నాటగా 2023 నవంబర్‌లో కాయలు కాశాయి. మొదటి దశలో ఆశించినంత కాయకపోవడంతో వాటిని సొంతానికి వాడుకున్నారు. ఏటా జూన్ నుంచి నవంబర్ వరకు పంట చేతికి వస్తుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.150 ఉందని, ఎకరం పది గుంటల్లో సుమారు 2 టన్నుల పంట వచ్చే అవకాశం ఉందన్నారు. ఒక్కసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు ఫలాలు వస్తుంటాయని, మొక్క పెరిగిన కొద్దీ కత్తిరిస్తూ ఉంటే ఏటా పంట చేతికి వస్తుందన్నారు. ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కొత్త ఆలోచనతో సాగు ఉపాధి కోసం హాంకాంగ్ వెళ్లా. అక్కడ ఆన్లైన్ పనిచేస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్లగా ఎక్కువగా డ్రాగన్‌ఫ్రూట్ పంట కనిపించేది. అదే పంటను మా భూమిలో కూడా వేయాలని కొత్త ఆలోచనతో వచ్చింది. అన్నతో చర్చించి మా భూమిలో మొక్కలు నాటాం. ఇప్పుడు మొదటి క్రాపు చేతికి వచ్చింది. – సాయికృష్ణారెడ్డి సబ్సిడీ ఇవ్వాలి మా తమ్మునికి వచ్చిన ఆలోచనతో ఎకరం పది గుంటల్లో మొక్కలు నాటాం. డ్రిప్‌తో నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.6 లక్షలు ఖర్చు వచ్చింది. వచ్చే జూన్ వరకు రెండో క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆయిల్‌పాం పంట మాదిరి డ్రాగన్‌ఫ్రూట్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుండు. ఖర్చులు తగ్గుతాయి. – శివకృష్ణారెడ్డి -
సెల్ మాయ.. పల్లె పరాయి!
ఏడుకొండల.. వెంకటరమణ తిరుపతికొండలు.. తిరిగినవాడ తిరుమనిరేకులు.. దిద్దినవాడ హరిలో రంగ హరి.. అయ్యవారికి దండంపెట్టు అమ్మవారికి దండంపెట్టు పిల్లపాపలు సల్లంగుండని గొడ్డుగోదలు సంపదనివ్వని పెట్టరా బసవన్న దండంబెట్టు సిరిసిల్ల: ఈ పాటలు.. ఆ మాటలు.. పల్లెతల్లి ఒడిలో లీలగా వినిపిస్తున్నాయి. పాడేది హరిదాసు. మాట్లాడేది గంగిరెద్దాయన. పట్టణాలకు చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లిన వాళ్లు పల్లెకు చేరారు. కానీ మనసు విప్పి మాట్లాడుకునుడే లేదు. సెల్‌ఫోన్ చేతికొచ్చాక ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తుండ్రు. పక్కింటి వాళ్లతో మాట్లాడే సమయం లేదు. ఆనాటి ఆప్యాయతలు లేవు. అనురాగాలు కానరావు. పండగ వచ్చిందంటే నాకు ఎంతో సంబురం. ఎక్కడెక్కడో ఉండే నా వాళ్లంతా నా దరికి చేరుతారు. వాళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నా ఒడిలో బతికే వాళ్లకు ఒకప్పుడు చేతినిండా పని. ఇంటి నిండా ధాన్యం. ఊరు సుట్టూ వాగులు, కాలువలు. తుకాలు పోసి.. పొలాలు దున్నతూ.. నాట్లు వేస్తూ.. ఉషారుగా ఉండేవారు. బోగి మంటలు.. భోగభాగ్యాలతో కళకళలాడే పల్లెల్లో మునుపటి సందడి కనుమరుగైంది. ముచ్చట్లు మరిచిపోయిండ్రు పల్లెలకు చేరిన పట్నమోళ్లు సెల్ఫోన్లతోనే ఆడవట్టిరి. నాటి ముచ్చట్లు లేవు.. మంచీ చెడు అర్సుకునే ధ్యాసే లేదు. వాట్సాప్‌లలో మెస్సేజ్‌లు.. ఫేస్‌బుక్కుల్లోనే పలకరింపులు. సంక్రాంతికి చలి సంకలెత్తనిత్తలేదు. ఒకప్పుడు గండ్రపేగులు కట్టుకొని, గొంగడిబొంతలు సుట్టుకుని గజగజ వణుక్కుంట నాగండ్లు కడుదురు. మరీ ఇప్పుడు కాలం మారింది. అన్ని పనులు ట్రాక్టరే చేస్తుంది. మాగికాలం నాట్ల పనికిపోతే మంచి కూలి వస్తుంది. కానీ పైసలకు లెక్కలేదు, మనుషులకు విలువ లేదు. హరిదాసులు ఏమైరి ఒకప్పుడు సంకురాత్రి అంటేనే గంగిరెద్దుల ఆట లు, హరిదాసుల పాటలు. ఇంటింటికీ తిరిగి ధాన్యమడుక్కుందురు.గిప్పుడు వాళ్ల తిరుగుడు లేదు.. మనం పెట్టుల్లేదు. ఒకప్పుడైతే కాలుపెట్ట సందులేకుండా ఇంటినిండ ధాన్యం ఉండేది. గొబ్బెమ్మలు చేసే పెండ నుంచి అరిసెలు చేసే బెల్లం దాకా అన్నీ కొనుడేనాయె. ఇక నవధాన్యాలు, రేగుపండ్లు.. జీడిపండ్లంటరా.. ఎన్నడో దేవునికి ముట్టినయి. కడపల మీద పిజ్జాలు.. బర్గర్లు పెట్టే కాలమొచ్చింది. సకినాలు ఎటుపాయే సంకురాత్రి అనంగనే సకినాలు గుర్తుకొత్తయి. కుంచెడు బియ్యం నానబోసి దంచి.. తవ్వెడు నువ్వులు.. చారెడు ఓమ గలిపి సకినాలు వొత్తే నెల్లాల్ల గాసమైతుండే. గారప్పులు.. అరిసెలు.. మురుకులు.. ఎన్నెన్ని పిండివంటలో. పల్లీలు.. నువ్వులు.. బబ్బెర్లు.. పెసర్లు.. అన్ని మన పొలంల పండినయే. మరిప్పుడు చేసుడు బందాయే.. ఆన్లైన్ బుకింగ్లాయే. అంతా మాయలాగే.. పొద్దు పొడిసినా పొగమంచు పోకపోతుండే. చలిమంటలు ఏసుకుని పడుసు పోరగాండ్లు, నడివయసోళ్లు.. ముసలోళ్లు కూసుందురు. ఊరు ముచ్చట్లు పెడుదురు. కోడిపుంజు కోసుకుని వాసన బియ్యంతో బిర్యానేసుకుంటే కమ్మటి వాసన. ఇప్పుడు పారంకోడి కూర రుచి లేదు.. వాసన అసలే లేదు. వానాకాలం పోయింది. సలికాలం.. ఎండ కాలమాయె. ఊరు పచ్చదనాన్ని కోల్పోయే. నా పొలిమేరలోకి సెల్‌టవర్లు వచ్చి మనుషులను దూరం చేసే. పండగన్న మాటే కానీ.. రైతు ముఖంల ఆ నవ్వేలేదు. రైతు సల్లంగుంటే సబ్బండ వర్ణాలకు పనుంటుండే. కులవృత్తి నమ్ముకున్నోళ్ల నుంచి గంగిరెద్దు, హరిదాసు వరకు అందరికీ గాసం దొరికేది. ఇప్పుడు అందరూ ఒకే చోట ఉన్నా మనసువిప్పి మాట్లాడుకునుడు లేదు. అంతా సెల్‌ఫోన్ మాయ. నా మనసులోని బాధను చెప్పిన. పండుగ పూట నా వేదన విన్నందుకు అందరికీ వందనాలు. ఇగ ఉంట బిడ్డ. బంగారు కాలంబోయింది.. బంగారమస్సోంటి మనుషులు పోయిండ్రు.. ఇంక రానురాను ఎంతగతికుందో.. ఇట్లు మీ అందరి క్షేమం కోరే పల్లెతల్లి -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
వద్దంటే భర్త డ్యూటీకి వెళ్లాడని..
హైదరాబాద్: నెల రోజుల క్రితమే నేపాల్‌లో వివాహం చేసుకుని భర్తతో నగరానికి వచ్చిన నేపాల్‌కు చెందిన యువతి అదృశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్ఐ నరేష్ కుమార్ సమాచారం మేరకు... హిమాయత్‌నగర్ బ్లూ ఫాక్స్ రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేసే సోను తాప నెల క్రితం నేపాల్‌లోని తన పక్క గ్రామం అంజ్‌కోట్‌కు చెందిన ఊర్మిళ (22) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే భార్య ఊర్మిళను నగరానికి తీసుకొచ్చాడు. హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ హాల్ లేన్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీన మధ్యహ్నం 2 గంటల సమయంలో భర్త సోను డ్యూటీకి వెళ్తుండగా ఊర్మిళ ఈ రోజు డ్యూటీ వెళ్లవద్దని చెప్పిందని, అయినా సోను డ్యూటీకి వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో భార్య ఊర్మిళ తాను తన అమ్మవారి ఇంటికి నేపాల్‌కి తిరిగి వెళ్లిపోతున్నట్లు భర్తకు మెసేజ్ చేసింది. వెంటనే భర్త ఇంటికి వచ్చి చూడగా తాను కనిపించలేదని తన అమ్మవారింటికి వెళ్లిందని అనుకున్నాడు. అయితే రెండు రోజులు గడిచినా నేపాల్‌కి వెళ్లిందో లేదో అని ఊర్మిళ అమ్మవారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయడం లేదని, భర్త నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్కుమార్ తెలిపారు. -
టెట్.. ఇదేమి టెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో..: టెట్‌లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్‌లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్‌లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్ చెప్పే టీచర్‌కు సైన్స్, సైన్స్ చెప్పే టీచర్‌కు మేథ్స్‌లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్‌గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. టెట్‌పై ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్‌నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. - పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్‌పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి) డిపార్ట్మెంటల్ పరీక్షలా నిర్వహించాలి టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్మెంటల్ టెస్ట్లా చేపడితే మేలు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) -
‘దళితబంధు’ ఉంటుందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని దాదాపు 11,108 మంది లబ్ధిదారులు తమ ఖాతాల్లో ఆరునెలలుగా ఉన్న సుమారు రూ.436.27 కోట్ల డబ్బును విత్ డ్రా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున ఎన్నికలకు ముందు 1.31 లక్షల మంది దళితులతో జాబితాను నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ పథకంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వీరందరిలోనూ పథకం అమలుపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. 11వేలమందికి చెందిన.. రూ.436.27 కోట్లు ! పథకంలో ఎంపికైన కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం, లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, వారి చేత వ్యాపారాలు ప్రారంభించే లక్ష్యంతో 2021 ఆగస్టు 16న అప్పటి సీఎం కేసీఆర్ ఆ పథకానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి వేదికగా ఈ పథకాన్ని ఆరంభించారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని 18వేలమంది దళితులను పథకాన్ని ఎంపిక చేశారు. వీరిలో 11,315 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పు న ఇవ్వగా.. మిగిలిన వారికి రూ.10 లక్షలలోపు ఆర్థిక సాయం అందజేశారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వం తొలిదశలో తొలుత రెండురకాలుగా అమలు చేసింది. ఒకటి సాచురేషన్ (ఎంపిక చేసుకున్న ప్రాంతంలో) మోడ్, రెండోది టార్గెట్ మోడ్ (నియోజకవర్గాల వారీగా) విధానం. ఇందు లో టార్గెట్ మోడ్‌లో 11,387 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. వారిలో 1413 మందికి రూ.126.66 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖాతాల్లో వేసింది. సాచురేషన్ పద్ధతిలో మొత్తం 26,395 మందికి పథకాన్ని వర్తింపజేసింది. అందులో 9695 మందికి 309 కోట్లను విడుదల చేసింది. ఈ రెండు విధానాల్లో కలిపి 11,108 మంది ఖాతాల్లో మొత్తం రూ.436.27 కోట్లను ప్రభుత్వం ఖాతాల్లో వేసినా.. వారికి విత్‌డ్రా చేసుకునే వీలు మాత్రం ఇవ్వలేదు. రెండో జాబితాలో దయనీయం.. టార్గెట్ మోడల్లో పథకం ప్రారంభించిన ప్రభుత్వం మొత్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గాల్లో 1,31,500 మంది లబ్ధిదారులను రెండోదశలో ఎంపిక చేసింది. వారికి పథకం కోసం అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చింది. లబ్ధిదారులకు జారీ చేసేందుకు హార్డ్ కాపీలు కూడా సిద్ధం చేసింది. వీరి కోసం రూ.749 కోట్లు కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. కానీ, ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ఎంపికైన 1,31,500 మంది లబ్ధిదారులకు ఆఖరునిమిషంలో డబ్బులు రాకుండా నిలిచిపోయాయి. దాంతో ఈ పథకం అమలుపై కలవరం నెలకొంది. సలహాదారులకు రాజభోగాలు వివిధ విభాగాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను, నాయకులను రాజీనామా చేయిస్తోన్న కొత్త ప్రభుత్వం దళితబంధులో నామినేటెడ్ పోస్టుల వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దళిత బంధు కోసం ఇద్దరిని నామినేటెడ్ విధానంలో నెలకు రూ.2.50లక్షల చొప్పున వేతనాలు, వారికి ఐదుగురు సెర్ఫ్ సిబ్బందిని రిసోర్స్ పర్సన్ల (ఆరీ్ప)లుగా నియమించింది. వీరికి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఇస్తున్నారని సమాచారం. వీరు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలు తీరును పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఆరునెలలుగా దళితబంధు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా వీరిని కొత్త ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తోంది. వీరు జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో.. ఆయా జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఖర్చుల పేరిట చుక్కలు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. వీరికి కారు, డ్రైవర్, ఆఫీస్ బాయ్, ట్రావెల్ అలవెన్సు తదితరాలు అదనం కావడం కొసమెరుపు. వెంటనే జమ చేయాలి మొదటి విడతగా విడుదలైన నిధులతో వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్నాం. ఏడాదిన్నర అవుతున్నా రెండో విడుత ఇవ్వాల్సిన మిగతా మొత్తం మా ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులను అడిగితే దాటవేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెండో విడుత నిధులను విడుదల చేసి మా ఖాతాల్లో జమ చేయాలి. – పర్లపల్లి రాజు, దళితబంధు లబ్ధిదారుడు, హుజూరాబాద్ నిధుల కోసం ఎదురుచూస్తున్నాం దళితబంధు పథకంలో మొదటి విడతలో వచి్చన నిధులతో మినీ సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాం. రెండో విడుత నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి దుకాణాన్ని నడిపించాల్సి వస్తోంది. రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మలి విడత డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలి. – గజ్జల అంజయ్య, లబ్దిదారుడు, హుజూరాబాద్ -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
రెండేళ్లలో పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘యాదాద్రి’లో ఎందుకీ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఇంకా ఎందుకు పూర్తి కాలేదంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీహెచ్ఈఎల్తో జరిగిన ఒప్పందం ప్రకారం 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి 3 యూనిట్ల నిర్మాణం పూర్తి కావాలి. మొత్తంగా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలి. కానీ ఇంత జాప్యం జరగడానికి కారణాలు ఏమిటి? కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు ఆహా్వనించకుండా..నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు పనులు ఎందుకు అప్పగించారంటూ’భట్టి ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో ఇంధనశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజారిజీ్వతో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. థర్మల్ కేంద్రం నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్ఈఎల్తో జరిగిన సంప్రదింపులు, అగ్రిమెంట్ విలువ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధనశాఖ కార్యదర్శిని భట్టి విక్రమార్క ఆదేశించారు. రూ.34,500 కోట్ల అంచనాలతో యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2015 జూన్ 6న ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు ? అని ఆయన మండిపడ్డారు. ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడమే కారణం: బీహెచ్ఈఎల్ రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు అప్పగించిన పనుల విలువ ఎంత అని భట్టి అడగ్గా.. రూ.20,444 కోట్లు విలువ చేసే పనులు బీహెచ్ఈఎల్కు అప్పగించారని, మిగిలిన పను లు జెన్కో, ఇతర సంస్థలు చేపట్టాయని బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. తమకు ఇచి్చన పనుల్లో రూ.15,860 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేశామని, రూ.14,400 కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగాయన్నారు. రూ.1,167 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లింపులు ప్రతినెలా చేయలేదని, ఒక్క మార్చి(2023) నెలలోనే 91 శాతం చెల్లింపులు జరిపిందన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము కూడా సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేకపోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదన్నారు. పర్యావరణానికి సంబంధించిన మరికొన్ని అనుమతులు ఏప్రిల్ 2024 నాటికి తీసుకొస్తే..సెప్టెంబర్ 2024 నాటికి రెండు యూనిట్లు, డిసెంబర్ 2024 లోగా మరో రెండు యూనిట్లు, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ను పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కొప్పు సదాశివమూర్తి, డైరెక్టర్ తజీందర్గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
పత్తి రైతుల ఆందోళన
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సమ్మెను సాకుగా చూపుతూ ఆదిలాబాద్‌లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్‌లో నాలుగు రోజులుగా ట్రాన్స్పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది. సయోధ్య కుదిర్చినా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘టీఎస్పీఎస్సీ’కి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్, సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలేపింది. రాజ్యాంగబద్ధమైన ఈ పోస్టులకు ఇప్పటివరకు అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా..తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కొత్త సర్కారు ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఆహ్వనిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. www. telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పూరించిన దరఖాస్తును secy-ser-gad@telangana.gov. in ఈమెయిల్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు. మూడు పేజీల దరఖాస్తు టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు పేజీల దరఖాస్తును రూపొందించింది. విద్యార్హతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగి అయితే నియామకం వివరాలు, విధులు, సాధించిన విజయాలు తదితర పూర్తి సమాచారాన్ని పొందుపరచాలి. అకడమిక్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగం, హ్యుమానిటీస్ లేదా వారి పనిని గుర్తించే రంగానికి సంబంధించిన వివరాలను, నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. తమ ప్రత్యేకతలు, విజయాలను 200 పదాల్లో వివరించాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడాలని సీఎస్ తెలిపారు. సెర్చ్ కమిటీ ద్వారా పరిశీలన చైర్మన్, మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమ్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్లను గవర్నర్ నియమిస్తారు. ఆరి్టకల్ 316 ప్రకారం టీఎస్పీఎస్సీ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరో సభ్యురాలి రాజీనామా టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. ఆరేళ్ల పాటు కొనసాగాల్సిన తాను రెండున్నరేళ్లకే రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల టీఎస్పీఎస్సీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ మార్పు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. -
కలిసి పనిచేద్దాం..
సాక్షి, హైదరాబాద్: గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన అరుణ్‌తివారీ, చిన్నబాబు ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తక రచయిత అరుణ్‌తివారీ, కేన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
జనవరి చలి ఏదీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎముకలు కొరికే చలి ఉండాలి. కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో చలికి బదులు ఉక్కపోత ఉంటోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సగటున 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలోని వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే మూడురోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతటా అధికమే... రాష్ట్రంలో అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఐఎండీ అధికారుల గణాంకాల ప్రకారం అదిలాబాద్‌లో సాధారణం కంటే 9.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ సమయంలో 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 డిగ్రీలు నమోదవుతోంది. నిజామాబాద్‌లో సాధారణం కంటే 5.7 డిగ్రీ సెల్సియస్, రామగుండంలో 5.5 డిగ్రీ, భద్రాచలంలో 4.3 డిగ్రీ, మెదక్‌లో 3.8 డిగ్రీ, హైదరాబాద్‌లో 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రిపూట చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. గురువారం ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
పందెం కోడికి ఆర్టీసీ వేలం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోడిని వేలంపాటలో దక్కించుకోవచ్చంటూ ఆర్టీసీ డిపో–2 మేనేజర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటన చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ కోడి కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం! అసలేం జరిగిందంటే...? ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు. కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు. అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు. ఇంతకీ సర్కారు వారి పాట ఎంత ఉంటుందో..? ఆ కోడి యజమాని వస్తాడా? రాడా..? ఇంతకీ వేలం పాటలో దేవుని పాట ఎంతకు మొదలవుతుంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది.