TS Special
-
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ నెల 18తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 29న పోలింగ్ జరగనున్నారు. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రజల వద్దకు ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు ధరణి పోర్టల్ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వారి సలహాలు, సూచనలు, అభిప్రాయాల మేరకు ముందుకెళ్లాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం నియమించిన కమిటీ నిర్ణయించింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సునిశిత అధ్యయనం చేయాలని, వారి వద్దకు వెళ్లి ప్రత్యేక ఫార్మాట్లో వారి మనోగతం తెలుసుకుని క్రోడీకరించాలని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చింది. అయితే నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలా? గ్రామసభల ద్వారా వారి నుంచి సమస్యలు తెలుసుకోవాలా? లేదంటే అభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలా? అలా ఏర్పాటు చేయాల్సి వస్తే ఏయే స్థాయిల్లో, ఏ పద్ధతుల్లో అభిప్రాయాలు తెలుసుకోవాలన్న దానిపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ఈ విషయంలో కమిటీ తుది నిర్ణయానికి రాలేదు కానీ, ప్రాంతాల వారీగా రైతుల సమస్యలు తెలుసుకుని వారి అభిప్రాయాలు, ఆలోచనల మేరకు పని చేయాలని మాత్రం నిర్ణయించింది. అలాగే ఈ పోర్టల్ ద్వారా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి? కమిటీ ఎలా ముందుకెళ్లాలి? రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి? చట్టాల పరిధి ఏంటి? చట్టాల మార్పునకు అవకాశాలెలా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల్లో భూసమస్యలను పరిష్కరిస్తున్న తీరు తదితర అంశాలపై సభ్యులు 2 గంటలకు పైగా చర్చించారు. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, మెంబర్ కనీ్వనర్ నవీన్ మిత్తల్‌తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. సభ్యులందరూ విడివిడిగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. కమిటీ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చిన సభ్యు లు.. ఈనెల 17న మరోమారు భేటీ అయి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. 15 రోజుల్లో తొలిదఫా సూచనలు ధరణి పునర్నిర్మాణం కోసం అవసరమైన నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఒక్కసారే తుది నివేదిక కాకుండా పలు దఫాలుగా మధ్యంతర నివేదికలు సమర్పించాలని, తొలిదఫా సలహాలు, సూచనలు 10–15 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించారు. నాంపల్లిలోని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కేంద్రంగానే కమిటీ పనిచేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. రైతుల ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలిసింది. గతంలో రైతుల వినతులను పట్టించుకోలేదని, కలెక్టర్ స్థాయిలో నిర్ణయాధికారాలున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో గ్రీవెన్స్ పరిష్కార అధికారాలను వికేంద్రీకరణ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సభ్యులు చర్చించారు. గ్రీవెన్స్‌తో పాటు సాంకేతిక పరమైన సమస్యలను ఎలా డీల్ చేయాలన్నది కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద ధరణి పోర్టల్‌తో సంబంధముండే అన్ని భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని, ఇతర రాష్ట్రాల్లో భూసమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు. కాగా ‘పునర్నిర్మాణమంటే చాలా పెద్ద టాస్క్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. ట్వంటీ ట్వంటీ ఆడాల్సిందే. ట్వంటీ ట్వంటీలో ప్రతి బంతిని కీలకంగా పరిగణించినట్టు గానే మేం ప్రతి అంశాన్ని కీలకంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే..’ అని సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. గత తప్పులు పునరావృతం కానివ్వం: కోదండరెడ్డి సమావేశానంతరం ధరణి కమిటీ సభ్యులు సునీల్‌కుమార్, మధుసూదన్, లచ్చిరెడ్డిలతో కలిసి కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సవరించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. పోర్టల్ ఎవరు నిర్వహిస్తే బాగుంటుందన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ముందుకెళతామని, సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. -
హత్య చేసి.. ప్లాస్టిక్ కవర్లో కట్టి పడేసి..
మెదక్: కుటుంబ కలహాలతో బంధువులే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నేరం ఎక్కడ బయటపడుతుందో అని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టి ఓ రహదారి కల్వర్టు కింద పడేశారు. ఐదు నెలల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం మృతుడి అస్థి పంజరాన్ని గుర్తించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం సీఐ నయీముద్దీన్ కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రిజేష్ గోస్వామి(26) జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోగల పోచమ్మ బస్తీలో నివాసం ఉంటూ ఓ పరిశ్రమలో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గతేడాది ఆగస్టు 6న గోస్వామి కనబడటం లేదని అతని భార్య ఆర్తిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. గోస్వామి హత్యకు గురయ్యాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గోస్వామి బంధువులను తమదైన శైలిలో విచారించారు. దీంతో గోస్వామిని తామే హత్య చేసినట్లు బంధువులు అజయ్, సీతు, రాజన్, విజయ్ అంగీకరించారు. మృతదేహాన్ని ఖాజీపల్లి ప్రధాన రహదారి కల్వర్టు కింద ఓ ప్లాస్టిక్ సంచిలో పడేసినట్లు నిందితులు వెల్లడించారు. ఎస్సీ రూపేశ్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ నయీముద్దీన్ తోపాటు పోలీ సులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోస్వామి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే కనిపించింది. మృతదేహంపై ఉన్న బట్టల ఆధారంగా కుటుంబ సభ్యులు గోస్వామి మృతదేహంగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొన్ని కారణాల వల్ల గోస్వామి తన చెల్లిని కాపురం చేసేందుకు పంపకపోవడంతో కక్ష కట్టి అత్తారింటికి చెందిన బంధువులే హత్య చేసినట్లు సీఐ వివరించారు. -
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. విధి నిర్వహణ లో మరణించిన సిబ్బంది వారసులకోసం కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చే యాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 1,600 కుటుంబాలు ఈ పథకంకోసం ఎదురు చూస్తున్నాయి. వాటిల్లో 813 దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు బస్ భవన్‌కు ఫార్వర్డ్ చేశారు. ఇప్పట్లో ఈ నియామకాలు వద్దని గతంలో ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశించటంతో మిగతా దరఖాస్తులు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా 813 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, కారుణ్య నియామకాలపై ఎన్ఎంయూ నేత నరేందర్, టీజేఎంయూ నేత హన్మంతు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ధన్యవాదాలు తెలిపారు. అయితే నియామకాలు తాత్కాలిక పద్ధతిలో కాకుండా రెగ్యులర్ బేసిస్‌లో చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు. ఆ కుటుంబాలకు న్యాయం: మంత్రి పొన్నం ‘ఆర్టీసీలో నియామకాలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కండక్టర్ నియామకాలు చేపట్టాం. దానిలో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు దీంతో న్యాయం జరుగుతుంది’. -
పక్కాగా ధరణి అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్‌ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్‌ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది. నిషేధిత భూములు పెద్ద సవాల్! కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్‌గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు. రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి. కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు. గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధిత జాబితాలో పట్టా భూములు రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్ -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన సూచనలు చేయాలని కోరారు. అన్ని దేశాలతో సత్సంబంధాలకి తమ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద 13 దేశాల దౌత్యవేత్తలు, ఇతర ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి రేవంత్‌రెడ్డి స్వాగతం పలుకుతూ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాం«దీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకతతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ రాష్ట్రంగా ఆవిర్భావం తాము ప్రకటించి అమలు చేస్తోన్న ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు సీఎంతో అమెజాన్ బృందం భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. రాష్ట్రంలో అమెజాన్ సంస్థ పెట్టిన పెట్టుబడులు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ ప్రణాళికల వంటి అంశాలను ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. -
'భయో' ఫెర్టిలైజర్
సాక్షి, హైదరాబాద్ : బయో ఫెర్టిలైజర్ పేరిట బలవంతంగా ‘గోల్డ్ కంపోస్ట్’తమకు అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి కొనాల్సిందేనని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో బహుళజాతి కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నా, గోల్డ్ కంపోస్ట్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రోమోర్ కంపెనీకి చెందిన బయో ఫెర్టిలైజర్ 40 కేజీల బస్తా రూ. 300 వరకు మార్కెట్లో ఉండగా, స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’ధర మాత్రం ఏకంగా రూ. 472 ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్ నుంచి ఒత్తిడి పెరగడంతో ప్యాక్స్‌లు గోల్డ్ కంపోస్ట్‌ను కొనుగోలు చేయక తప్పడంలేదు. అయితే రైతులు కొనుగోలు చేయనిచోట ఆ మేరకు ప్యాక్స్‌ల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి పూర్తిస్థాయిలో దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో అప్పటినుంచి ఈ ఫెర్టిలైజర్‌ను అంటగట్టే పనిలో మార్క్‌ఫెడ్ నిమగ్నమైంది. జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ మేనేజర్లకు ఇండెంట్ పెట్టి మరీ దీనిని విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, డీలర్లు, ప్యాక్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. టెండర్లు లేకుండానే ఒప్పందం... బయో ఫెర్టిలైజర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని గతేడాది మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. పంటలకు రసాయన ఎరువులను తగ్గించేందుకు ’మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో సేంద్రియ ఎరువును మార్కెట్లోకి తీసుకొచ్చింది. వరి, మొక్కజొన్న, పత్తితోపాటు ఉద్యాన పంటలకూ వినియోగించేలా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో పెద్ద ప్లాంట్ నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు. ఈ సంస్థతో మార్క్‌ఫెడ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎరువుల దుకాణాలతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని మార్కెఫెడ్ నిర్ణయించింది. ఈ సేంద్రియ ఎరువును వరి, టమాటా, మిరప, మామిడి, బత్తాయి, నిమ్మ, నారింజ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ సహా అన్నిరకాల పూలతోటలు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పసుపు, చెరకు పంటలకు ఉపయోగించడం వల్ల నేల సారవంతమవుతుందని, అధిక దిగుబడి వస్తుందని మార్క్‌ఫెడ్ చెబుతోంది. అయితే ఇలాంటి సేంద్రియ ఎరువులకు ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు జాతీయస్థాయిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు విశ్వ ఆగ్రోటెక్తో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ పిలవకుండా ఏకంగా ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో దానికి నామకరణం చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వానికి చెందిన మార్క్‌ఫెడ్ పేరును ఉపయోగించుకోవడంపై ఉద్యోగులు, కొందరు అధికారుల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంబంధిత కంపెనీ పేరు పెట్టుకుంటే సరేననుకోవచ్చు. అంతేకానీ మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్ అని నామకరణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మార్క్‌ఫెడ్ బోర్డులో ఆమోదం తెలుపుకోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌లో ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి సహా కొందరు పెద్దస్థాయి వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ కంపెనీతో వారికి లోపాయికారీ సంబంధాలు ఉన్నాయన్న చర్చా జరుగుతోంది. అందుకే టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకొని మార్కెట్లోకి ప్రవేశపెట్టారని చెబుతున్నారు. అంతేకాదు అధిక ధరకు విక్రయించడంపై రైతులు, డీల ర్లు, ప్యాక్స్ నిర్వాహకులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వందృష్టిసారించాలన్న విన్నపాలు తమకు భారంగా మారిన గోల్డ్ కంపోస్ట్ ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. గ్రోమోర్ వంటి కంపెనీ ఉండగా, నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కంపెనీకి ప్రాధాన్యం ఇవ్వడంపైనా విమర్శలున్నాయి. ఏ ప్రమాణాల ప్రకారం ఆ కంపెనీతో అవగాహనకు వచ్చారో కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
చేతులు లేకున్నా చెక్కుచెదరలేదు
కాగజ్‌నగర్‌టౌన్: పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. కాళ్ల వేళ్లే కుంచగా మారి అందమైన బొమ్మలెన్నో వేశాయి..కంప్యూటర్ కీ బోర్డుపై టక్టక్ శబ్దం వినిపిస్తూ ఎన్నో ఎంట్రీలు చేశాయి. ఆర్థిక ఇబ్బందులెన్ని ఎదురైనా నిరుత్సాహపడకుండా పీజీ వరకూ చదివి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు జాకీర్‌పాషా. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఆటో డ్రైవర్ షేక్ బాబా–మెహరా దంపతుల మొదటి సంతానమైన జాకీర్ పాషా డిగ్రీ వరకు కాగజ్‌నగర్‌లోనే చదివాడు. ఆపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నాడు. పీజీ చదువుతుండగానే కంప్యూటర్ కోర్సులు కూడా పూర్తి చేశాడు. ♦ జాకీర్‌పాషా కాళ్లతో పెయింటింగ్స్ వేయడమే కాకుండా.. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాడు. ♦ హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలను కాళ్ల సాయంతో నాటి ఆదర్శంగా నిలిచాడు. ♦ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా కేంద్రానికి వెళ్లి కాలి సాయంతో ఓటుహక్కు వినియోగించుకున్నాడు. ♦ తాజాగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి పలువురు ఆపరేటర్లను ఎంపిక చేశారు. అందులో జాకీర్పాషాకు అవకాశం దక్కింది. కాళ్లతోనే వివరాలను అప్లోడ్ చేస్తున్నాడు. రుణంరాలేదు.. కొలువూదొరకలేదు గత నవంబర్‌లో తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వెలువడిన రుణాల కోసం జాకీర్‌పాషా దరఖాస్తు చేసుకున్నా, ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన కొలువు ఇప్పించాలని పలుమార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సైతం కొలువు ఇప్పించి ఆదుకోవాలని దరఖాస్తు సమరి్పంచాడు. ప్రభుత్వ సాయంకోసం ఎదురుచూపు మాది నిరుపేద కుటుంబం. నాతోపాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. నాన్న ఆటో నడిపితే వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నా. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగావకాశం కల్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే నా కుటుంబానికి మేలు జరుగుతుంది. – జాకీర్ పాషా, దివ్యాంగుడు -
పక్కా ప్లాన్‌తోనే...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పశువులను చంపుతున్నాయన్న ప్రతీకారంతోనే కొందరు పులులను మట్టుబెట్టుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో రెండు పులుల్లో ఒకటి స్పష్టంగా ఇదే కారణంగా చనిపోయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. తమ పశువులను చంపి తింటున్న పులులను లేకుండా చేయాలని భావించి వాంకిడి మండలం సర్కెపల్లికి చెందిన పశువు యజమాని, ముగ్గురు పశువుల కాపరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇందుకోసం ఉచ్చులు, విష ప్రయోగం కూడా చేసినట్టు తెలుస్తోంది. కళేబరంపై గడ్డి మందు చల్లి.. ఇటీవలే ఓ రైతుకు చెందిన పశువును పులి చంపి తినేసింది. సాధారణంగా ఒకసారి వేటాడితే, పులి ఆ మాంసాన్ని వారం దాకా భుజిస్తుంది. మళ్లీ వస్తుందని తెలుసుకొని ఎద్దు కళేబరంపై గడ్డి మందు చల్లి మట్టుబెట్టారు. మొదట ఉచ్చులు కూడా వేసినట్టు సమాచారం. గడ్డి మందు చల్లిన పశువు కళేబరాన్ని తిని ఎస్9 మగపులి చనిపోగా, ఆ పరిసరాల్లోనే ఉన్న ఎస్6కు చెందిన రెండు పిల్లల జాడ ఇంకా తెలియదు. వాటిని ట్రేస్ చేస్తేనే అసలు విషయం తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ పులిపై ఎలా విష ప్రయోగం చేశారో నలుగురు నిందితులు బుధవారం అడవిలో అధికారుల ముందు యథాతథంగా చేసి చూపించారు. కేసు దర్యాప్తులో భాగంగా చనిపోయిన పశువుల రైతుల వివరాలు అటవీ అధికారులు సేకరిస్తుండగా, నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో కాగజ్‌నగర్ పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పరిహారంలో జాప్యం కాగజ్‌నగర్ రేంజ్ దరిగాం, సర్కెపల్లి పరిధిలోనే ఆరు పులులు ఉన్నాయి. తరచూ పశువులపై దా డులు చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అయితే నిబంధనల ప్రకారం పశువుల విలువ మేరకు వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కానీ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో పశువులను చంపుతున్నాయనే కోపంతోనే కొందరు విష ప్రయోగం చేసి పులుల మరణానికి కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి.పులుల సంరక్షణ పకడ్బందీగా చేస్తున్నామని చెప్పే అధికారులు కిందిస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరో పశువుపై దాడి రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ రేంజ్ ఉట్పల్లి శివారులో ఓ పశువును పులి చంపేసింది. అప్రమత్తమైన అధికారులు కెమెరాలు బిగించారు. అక్కడకు మళ్లీ భుజించేందుకు పులి వస్తే ట్రేస్ అవుతాయి. ఇక్కడ సంచరించే ఆరింటిలో రెండు చనిపోగా, మరో నాలుగింటి జాడపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అటవీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
కొత్త టీఎస్పీఎస్సీకి లైన్‌క్లియర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది. సర్కారీ కొలువుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది. దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. మిగతా ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు. కొత్తగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే అప్పటివరకు ఉన్న కమిషన్ పదవీ కాలం పూర్తి కావడమో లేక రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడమో జరగాలి. కానీ చైర్మన్, ముగ్గురు సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖలపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ఆమోదం లభించడంతో కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన చైర్మన్, ముగ్గురు సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించడంతో పాటు ఎప్పట్నుంచో ఖాళీ గా ఉన్న 4 స్థానాలు, అలాగే పదవీ విరమణ చేసిన సభ్యుడి స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసే అవకా శం ఉందని తెలుస్తోంది. తద్వారా టీఎస్పీఎస్సీ కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే రాజీనామాలు సమర్పించని ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. పరీక్షలు, ఫలితాలు పెండింగ్‌లోనే.. వాస్తవానికి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా మార్గం సుగమం అయిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లోనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్తగా ఉద్యోగ ప్రకటనల జారీ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన, ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యి ఏడాది గడుస్తోంది. పలుమార్లు పరీక్ష తేదీలు వెల్లడించి చివరి నిమిషంలో వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను వెల్లడించలేదు. వివిధ కేటగిరీల్లో దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించినా ప్రక్రియ ముందుకు సాగలేదు. అలాగే కొత్తగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయడంలేదు. ఇవన్నీ ముందుకు సాగాలంటే చైర్మన్, ఇతర సభ్యుల నియామకం అత్యంత అవసరం. కాగా టీఎస్పీఎస్సీ నియామకాలకు సంబంధించి సీఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ముమ్మర కసరత్తు టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి గత నెలలో అధికారులను ఆదేశించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి స్వయంగా యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించారు. సీఎం ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాల కోసం మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. సిట్ దర్యాప్తుపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా నిర్ణయం: రాజ్‌భవన్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని వచ్చిన విమర్శలను రాజ్‌భవన్ తోసిపుచ్చింది. రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొంది. చట్టపరమైన విధానాలకు లోబడి అత్యంత శ్రద్ధతో ఒక్కరోజులోనే రాజీనామాల ఆమోద ప్రక్రియను గవర్నర్ పూర్తి చేశారని తెలిపింది. గవర్నర్ బుధవారం రాజీనామాలను ఆమోదించిన వెంటనే ఈ మేరకు వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం రాజీనామాలను గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాత తన రిమార్కులు, అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాను జత చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపించారని తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంపై సిట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు.. గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలను సమీక్షించడంతో పాటు అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయసలహా తీసుకుని తిరిగి ఫైల్‌ను ఈ నెల 9న సీఎం ద్వారా గవర్నర్‌కు పంపించిందని వెల్లడించింది. సిట్ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావానికి తావు లేకుండా చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిరుద్యోగ యువత ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా.. ఈ ప్రక్రియలో రాజ్‌భవన్ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుందని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన విధులు, న్యాయ సూత్రాలు, పారదర్శకత, జవాబుదారీతనం పరిరక్షణకు గవర్నర్ కట్టుబడి ఉన్నారని తెలిపింది. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. -
పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతర ప్రక్రియ అని, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హరితహారంపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్షించారు. అటవీ, గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, అలాగే చనిపోయిన మొక్కలను మార్చే విధానంపై వివరాలన్నీ వీలైనంత త్వరగా ఆన్లైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇంటి అవసరాలకు ఉపయోగకరమైన, అలాగే కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ ఇంటి ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలను పంపిణీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కోరారు. హరితహారం కార్యక్రమం పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులను సవరించుకోవాలని మంత్రి అన్నారు. ఫారెస్టు అధికారులపై దాడులు చేస్తే కఠినచర్యలు భద్రాద్రి జిల్లా ఇల్లెందు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్టు అధికారులపై దాడులు చేయడాన్ని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జరిగిన దాడిపై విచారణకు ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్న ఫారెస్టు అధికారులపై ట్రాక్టర్‌ను ఎక్కించి చంపడానికి దుండగులు చేసిన ప్రయత్నంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నా రు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. -
గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి
రాష్ట్రానికి సమగ్ర విద్యుత్ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత కొత్తగా సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం విద్యుత్ రంగ నిపుణులతో సైతం విస్తృతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్ విధానానికి రూపకల్పన చేస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న అన్నిరకాల పీపీఏలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర అంశాలతో పాటు పీపీఏలకు సంబంధించిన నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, విద్యుత్ కొనుగోలు ధరలు నివేదికలో ఉండాలని అన్నారు. అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను కూడా వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, భవిష్యత్తులో పెరిగే రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి వీలుగా కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, ఎన్నికల హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. జెన్కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులు, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరుపై ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని సీఎం స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ కొత్త విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణంలో ఉన్న విద్యుత్ కేంద్రాలను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. విద్యుత్ దురి్వనియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి/ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్రఫ్ ఫారూఖీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి కూడా సమీక్షలో పాల్గొన్నారు. వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్: సీఎం ఫిబ్రవరిలో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనులు వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దామగుండం దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఈ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తారని చెప్పారు. అదే స్థలంలో ఆలయాభివృద్ధి పనులు కూడాచేపడ్తారన్నారు. ఇండియన్ నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ నేతృత్వంలోని బృందం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. రాడార్ స్టేషన్ నిర్మాణం విశేషాలను వివరించింది. నేవీకి సంబంధించిన భారీ పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారని, దీంతో పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. కాగా పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని సమన్వయం చేసుకుని త్వరలో పనులు ప్రారంభించాలని నేవీ అధికారులకు సీఎం సూచించారు. కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్ దాస్, రాజ్బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మేడిగడ్డ: విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీస్‌లో విజిలెన్స్ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తోంది. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మెడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తోంది. -
ఫార్ములా-ఈ రేసింగ్: ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్‌పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
TS: ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమించారు. తెలంగాణ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా పాలన నోడల్ అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు. కోటి అయిదు లక్షల దరఖాస్తు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన-అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో కోటి అయిదు లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర రేషన్ కార్డు, భూములు తదిరల అంశాల నుంచి 20 లక్షలు వచ్చాయన్నారు. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు. అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నారు. కారు కూతలు కూస్తే ఊరుకోం ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ధరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 40 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తామెక్కడ చెప్పలేదని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని అన్నారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా, మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన మాట అమలు చేస్తామని తెలిపారు. -
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం
సాక్షి, నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గంది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానానికి 47మంది కౌన్సిలర్ హాజరయ్యారు. వీరిలో 41మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలపడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా. న్యూట్రల్‌గా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు పిల్లిరామరాజు మీగత ఇద్దరు సభ్యలు అవిశ్వాసం తీర్మానానికి హాజరు కాలేదు. నూతన చైర్మన్ ఎన్నుకునే వరకు తాత్కాలిక చైర్మన్‌గా.. ప్రస్తుత వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. -
KPHB: కేపీహెచ్బీలో కారు బీభత్సం.. మాజీ మంత్రి మేనల్లుడు..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి.. ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. కేపీహెచ్బీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నలుగురు స్నేహితులతో సోమవారం తెల్లవారుజాము వరకు ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో రాంగ్ రూట్లో కారును నడిపి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. అగ్రజ్ను అరెస్టు చేసిన పోలీసులు బ్రిత్ అనలైజ్ పరీక్ష చేశారు అందులో ఆల్కహాల్ 90% సేవించినట్టు వచ్చింది. దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్‌లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్‌రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్‌పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
ఆశలన్నీ.. ఆన్‌లైన్‌లోకి!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’కు విశేష స్పందన లభించింది. అభయ హస్తం ఆరు గ్యారంటీల పథకం అమల్లో భాగంగా ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు అందాయి. స్వీకరణ క్రతువు రెండు రోజుల క్రితమే ముగిసింది. అర్జీలను ఆన్లైన్లో క్రోడికరించే అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ పూర్తిచేసింది. ఈ నెల 17 లోగా ఆర్జీల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఆశించిన స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు లేక పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. ఎనిమిది రోజులు.. ప్రభుత్వం 2023 డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలవు రోజులు మినహా ఎనిమిది రోజుల పాటు అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,53,277 దరఖాస్తులు అందాయి. 16 మున్సిపాలిటీల నుంచి 2,61,807 దరఖాస్తులు రాగా, 21 మండలాల పరి«ధిలోని 558 గ్రామ పంచాయతీల నుంచి 2,91,470 దరఖాస్తులు అందాయి. వీటిలో మెజార్టీ దరఖాస్తులు గృహలక్ష్మి, రేషన్‌కార్డులు, చేయూత పథకాలకు సంబంధించినవే కావడం గమనార్హం. రేషన్‌కార్డులు, ‘గృహజ్యోతి’కి డిమాండ్ ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా అభయహస్తం, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 నివాసాలు, మున్సిపాలిటీల పరిధిలో 2,88,361 నివాసాల నుంచి అర్జీలు పెట్టుకున్నారు. మెజార్టీ దరఖాస్తులు గృహజ్యోతి, రేషన్ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. మున్సిపాలిటీల నుంచి అందిన అర్జీల్లో 47,551 రేషన్‌కార్డులకు సంబంధించినవే కావడం విశేషం. ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో క్రోడికరించే ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో సాంకేతిక సిబ్బంది లేకపోవడం ఈ పనులకు ఇబ్బందిగా మారింది. -
ఎయిర్‌పోర్టు మెట్రోపై మేధోమథనం
హైదరాబాద్: ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో ఫేజ్– 2పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్, ఎంజీబీఎస్, ఫలక్‌నుమా మార్గాల్లో చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న రూట్లో చాంద్రాయణగుట్ట వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్త ఎయిర్పోర్ట్ రూట్, చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్‌పై ఆదివారం మెట్రో భవన్లో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మేధోమథన సమావేశంలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను పొడిగించి అక్కడి నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఈ మార్గంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద కొత్తగా హైకోర్టు భవనం అందుబాటులోకి రానున్న దృష్ట్యా మైలార్‌దేవ్‌పల్లి నుంచి నూతన హైకోర్టు భవనం మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఎనీ్వఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రోస్టేషన్లు, డిపోల ఏర్పాటు, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర సాంకేతిక అంశాలు, ప్రయాణికుల లగేజీ తనిఖీలు, సెక్యూరిటీ చెకింగ్లు వంటి అంశాలను సైతం సమగ్రంగా చర్చించారు. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)ను సిద్ధం చేయాలని చెప్పారు. అమీర్‌పేట్ తరహాలో చాంద్రాయణగుట్ట వద్ద అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ అందుబాటులోకి రానున్న దృష్ట్యా దాని నిర్మాణంపై ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్ ఎస్కె దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్మెహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇక్కత్’కు ఇక్కట్లు!
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ) కలిగిన ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నేతన్న నేసే పట్టుచీర డిజైన్‌ను బట్టి గరిష్టంగా రూ.20 వేలు పలుకుతుండగా ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో వస్తున్న చీరలు కేవలం రూ.600కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారులు దెబ్బతింటున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సుమారు 50 వేల చేనేత వృత్తి దారుల జీవనోపాధిపై ప్రింటెడ్ చీరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చేనేత డిజైన్లు కాపీకి గురికాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రాండ్ ఇమేజ్‌పై దెబ్బ పట్టుదారానికి రంగులద్ది డిజైన్లు కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ చీరలకు మహిళల్లో విశేష ఆదరణ ఉంది. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టు చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా ఉంది. అలాంటి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో చీర ధర పడిపోవడం, ఏది అసిలీనో ఏది నకిలీనో గుర్తించలేకపోవడం, ఆన్లైన్లో మోసాలు జరగడం లాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ చీరలు రూ.600 నుంచి రూ.1000 లోపే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు. భారీగా పడిపోయిన అమ్మకాలు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 12,000 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతినెలా ఒక జియో ట్యాగ్ కళాకారుడితోపాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు ఉంటారు. అంటే సుమారు 36 వేల మంది నేరుగా వృత్తిలో ఉన్నారు. నెలకు ఒక చేనేత కుటుంబం ఐదు చీరలు తయారు చేస్తుంది. ఇలా తయారైన చీరలతో గతంలో నెలకు రూ. 40 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరలు రాకతో రూ.20 కోట్లకు అంటే సగానికి సగం వ్యాపారం పడిపోయిందని నేతన్నలు చెబుతున్నారు. మూట వ్యాపారం దాకా విస్తరణ పోచంపల్లి ప్రింటెడ్ పట్టు చీరలు ఇప్పుడు గ్రామాల్లో మూట వ్యాపారం దాకా వచ్చాయి. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే లభించే ప్రింటెడ్ చీరలు ఇప్పుడు పల్లెల్లోనూ అమ్ముతున్నారు. ప్రింటెడ్ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టు చీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రింటెడ్ చీరలను అదుపు చేయాలి జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరలను పోలిన ప్రింటెడ్ చీరల తయారీని ప్రభుత్వం అరికట్టాలి. ఇటీవల పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రచనా సాహు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుజరాత్లో ప్రింటెడ్ చీరల తయారీని, షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలను నిరోధించాలి. కల్యాణ లక్ష్మి నగదు సహాయంతోపాటు పోచంపల్లి పట్టు చీరను వధువుకు ఇవ్వాలి. ఇక్కత్ వృత్తిని కాపాడాలి. – తడ్క రమేష్, చేనేత సంఘం నాయకులు, పోచంపల్లి మాల్స్‌పై మరిన్ని దాడులు చేస్తాం పోచంపల్లి పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించి దాడులు చేస్తున్నాం. ప్రతి డిజైన్‌ను కాపీతో ప్రింట్ చేసి చీరలను విక్రయిస్తున్నారు. చేనేత వృత్తిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. త్వరలో మరిన్ని దాడులు చేయబోతున్నాం. – వెంకటేశ్వర్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారి