Latest News
-
కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల సంబంధిత ఆపరేషన్ జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 71 ఏళ్ల షిండే గతరాత్రి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే షిండే అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశముంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షిండే హాజరుకానున్నారు. అయితే ఎప్పడు ఆయన ఢిల్లీకి వెళతారనేది తెలియలేదు. శస్త్ర చికిత్స తర్వాత తన తండ్రి బాగానే ఉన్నారని షిండే కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి తెలిపారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బాంటియా, ఇతర ఉన్నతాధికారులను శనివారం షిండే కలిశారు. హజ్ హౌస్‌లో చవాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వర్లీలో నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. -
తెరపైకి చరణ్‌రాజ్ వారసుడు
నట వారసులు తెరంగేట్రం చేయడమనేది సాధారణమయింది. ఇప్పటికే చాలా మంది తెరపైకి వచ్చారు. నటుడు చరణ్‌రాజ్ తనయుడు తేజ్‌రాజ్ సైతం త్వరలో తెరపైకి రానున్నారు. కోలీవుడ్‌లో నీతిక్కు దండనై చిత్రం ద్వారా చరణ్‌రాజ్ పరిచయమయ్యారు. తర్వాత తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఒరి యా, బెంగాలీ తదితర భాషల్లో వివిధ రకాల పాత్రలను పోషించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన తన కుమారుడు తేజ్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. చరణ్‌రాజ్ మాట్లాడుతూ తనను అన్ని భాషల్లో నటుడిగా అంగీకరించారన్నారు. తన కుమారుడికి నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఈ దిశగానే తానూ ప్రోత్సహిస్తున్నానని వెల్లడించారు. తేజ్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేయడానికి చాలామంది దర్శకులు ముందుకొచ్చారని తెలిపారు. అయితే తొలి చిత్రం ఏమిటన్నది త్వరలోనే ప్రకటన వెలువడనుందని చెప్పారు. దర్శకుడు బాలుమహేంద్ర ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందానని తేజ్‌రాజ్ తెలిపారు. రఘురాం మాస్టర్ వద్ద నృత్యంలో, పాండియన్ మాస్టర్ వద్ద స్టంట్స్‌లో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. సినీ రంగంలో తప్పక ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు. -
చిరంజీవి రాజీనామా చేయాలి: ఏయూ విద్యార్ది జేఏసీ
రాష్ట విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్రమంత్రి చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏయూ విద్యార్థి జేఏసి ఆదివారం విశాఖపట్నంలో డిమాండ్ చేసింది. చిరంజీవి ఫ్యామిలి నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చు,కానీ రాష్టంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని ఏయూ జేఏసీ విద్యార్థలు ఈ సందర్భంగా హెచ్చరించింది. విద్యార్థుల దీక్షా శిబిరాన్ని స్థానిక టీడీపీఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదివారం సందర్శించారు. అనంతరం వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. అలాగే విశాఖపట్నం తొలి పార్లమెంట్ సభ్యుడు కేఎస్ తిలక్ కూడా ఏయూ విద్యార్థి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడిందన్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్‌ను చూడలేకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. మద్దలెపాలెం వద్ద ఆందోళనకారులు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఏయూ విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారం ఆరో రోజుకు చేరింది. -
తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం: దిగ్విజయ్
హైదరాబాద్ నగరం అటు సీమాంధ్రకు ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధాని కాదని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం అయ్యే అవకాశం కూడా లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆదివారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. 10 ఏళ్ల వరకు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్బాగం అవుతుందని తెలిపారు. ఆ క్రమంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. గతంలో చంఢీగఢ్ నగరాన్ని పంజాబ్‌కు ఇస్తామని వాగ్దానం చేశారు, కానీ చివరకు హర్యానా- పంజాబ్‌కు ఉమ్మడి రాజధాని అయిందని గుర్తు చేశారు. కానీ అలాంటి సంఘటన నేడు పునారావృతం కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయంతో సీమాంధ్రలో ఆగ్రహా జ్వాలలు మిన్నాంటాయి. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రజలు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలో ఆ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా హైదరాబాద్ నగరాన్ని రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి లేకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం కాంగ్రెస్ హైకమాండ్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
కోటి దాటిన ఇ- ఐటీ రిటర్న్‌లు
ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య కోటి దాటింది. వేతనాలు తీసుకుంటున్న వారే అత్యధికంగా ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్టు తాజా గణంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 31 నాటికి 1,03,21,775 ఇ-రిటన్స్ దాఖలయినట్టు బెంగాళూరులోని ఆదాయపన్ను శాఖకు చెందిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) తెలిపింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్లపైగా ఇ-రిటర్న్‌లు ఫైల్ అయినట్టు వెల్లడించింది. తాజాగా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారిలో 7,81,252 మంది వేతన జీవులు ఉన్నారు. గతేడాది 64 లక్షల మంది ఉద్యోగులు ఇంటర్నెట్ ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే గడువును ఆగస్టు 5 వరకు పొడిగిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటర్న్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ కాగా ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే ఈ-ఫైలింగ్‌కు విపరీతమైన ఆదరణ రావడంతో గడువును పొడిగించింది. గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్యలో 46.8 శాతం వృద్ధి నమోదయ్యింది. -
బలరాంపురం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర ఆదివారం బలరాంపురం నుంచి ప్రారంభమైంది. సరవదేవిపేట, అయ్యవారిపేట,లొద్దపుట్టి మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం పట్టణం చేరుకుంటారు. దాంతో ఆమె ప్రారంభించిన పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇచ్చాపురంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. నేటితో ఆమె ప్రారంభించిన పాదయాత్ర 230వ రోజుకు చేరుకుంది. 9 నెలల కాలంలో 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగింది. 3,112 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్రలో భాగంగా నడిచి దేశరాజకీయ చరిత్రలో ఓ సంచలన రికార్డును సృష్టించారు. -
కేసీఆర్ రెచ్చగొట్టడం మానుకోవాలి: పొన్నం
సీమాంధ్ర ఉద్యోగులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు శాంతియుతంగా విడిపోయే వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. ఉద్యమాల్లో నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. విగ్రహాలు కూల్చివేతకు బాధ్యులయిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో పలువురు నేతల విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాంతం వదిలి వెళ్లాలని, వారికి ఆప్షన్లు లేవని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. -
చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌నేత మైసూరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల 3 ప్రాంతాలకు నదీజలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర నదీజలాల బోర్డు ఏర్పడితే ప్రాజెక్ట్‌లు వట్టిపోతాయని మైసూరారెడ్డి తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నిర్ణయంతో దేశం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేదన్న ఒకే ఒక్క స్వార్థంతో రాష్ట విభజన చిచ్చుపెట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. విదేశీయురాలైన సోనియాకు దేశ సమగ్రతపై ఏమంత అవగాహన ఉందని దాడి వీరభద్రరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికి రెండో రాజధానిగా చేయాలి లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
రసూల్‌ను తీసుకోకపోవడం దురదృష్టకరం
కాశ్మీర్ క్రికెటర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్‌ను చివరి వన్డేలో ఆడించకపోవడం దురదృష్టకరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లి సమర్థించుకున్నాడు. జట్టులో స్థానంలో ఎంతో మంది ఎదురు చూస్తున్నారని చెప్పాడు. జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు రిజర్వు బెంచ్ ఆటగాళ్లు రెండు నెలలు నుంచి ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. రవీంద్ర జడేజా స్థానంలో రసూల్‌ను ఆడించాల్సిందని అడిగిన ప్రశ్నకు... ఏ మ్యాచ్‌ను తాను తక్కువగా తీసుకోనని స్పష్టం చేశాడు. భారత జట్టు తరఫున ఆడిన తొలి కాశ్మీర్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరిన పర్వేజ్ రసూల్‌కు జింబాబ్వే టూర్లో నిరాశే ఎదురైంది. ఆఖరి వన్డేలోనూ తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. దీంతో భారత జాతీయ జట్టులో అరంగేట్రం కోసం రసూల్ మరి కొంతకాలం వేచి చూడక తప్పడం లేదు. ఈ సిరీస్ ద్వారా ఉనాద్కట్, మోహిత్, పుజారా, రాయుడులకు వన్డేల్లో అరంగేట్రం అవకాశం కల్పించిన భారత్... రసూల్‌ను మాత్రం విస్మరించింది. వన్డే సిరీస్ గెలిచిన తర్వాత కూడా రసూల్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. స్వదేశంలో పక్కనబెట్టడం కంటే ఇది మరీ దారుణంగా ఉందని ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. తుది జట్టులో రసూల్‌కు అవకాశం కల్పించకపోవడాన్ని కేంద్ర మంత్రి శశి థరూర్ కూడా తప్పుబట్టారు. -
రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా
రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. అనంతరం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ ప్రసంగిస్తూ... మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో నెహ్రూ ప్రధానిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కలపి పెళ్లి చేస్తే, ఆ ఇంటి కోడలు సోనియా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకాలు ఇస్తుందని హరికృష్ణ ఎద్దేవా చేశారు. గతంలో పాండవులు, కౌరవుల మధ్య శకుని వైరం సృష్టిస్తే, నేడు తెలంగాణ, సీమాంధ్రల మధ్య సోనియా, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న దుష్ట క్రీడలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా నిలదిశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్రం ఐదు కమిటీలను వేసిన సంగతిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు. -
భారత ఎంబసీపై దాడిని ఖండించిన అమెరికా
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకోవడాన్ని గర్హనీయమని అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు. అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్‌లో భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. -
సీమాంధ్రలో కొనసాగుతున్న నిరసనలు
సీమాంధ్రలో సమైక్య రాష్ట ఉద్యమం పొగలు సెగలు కక్కుతుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న బంద్ ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తురు ఎమ్మెల్యే సీకేబాబు చేపట్టిన దీక్షకు జిల్లావాసుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమైనాయి. తిరుపతిలో ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసనల హోరు ఉధృతమైంది. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి చూస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని అధ్యాపక బృందం తమ కుటుంబసభ్యులతో ఆదివారం యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేయనుంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో నిరసనల హోరు ఊపందుకుంది. నగరంలో బంద్ ఐదో రోజు కూడా కొనసాగుతోంది. సమైక్యాంధ్ర మద్దతుగా ఏలూరు పట్టణంలోని జూట్ మిల్లు ఎదుట ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో పలు పార్టీలకు చెందిన నేతలతోపాటు, స్థానికులు, జూట్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు. . -
పాతబస్తీలో బోనాలు ప్రారంభం
పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. మరోవైపు ఆషాఢ బోనాలకు పాతబస్తీలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, మీరాలంమండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్‌షాహీ శీతల్‌మాత మహంకాళి, గౌలిపురా నల్లపోచమ్మ, అక్కన్నమాదన్న మహంకాళి తదితర ఆలయాల్లో నేడు బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలూ కలుగకుండా సకల ఏర్పాట్లూ చేసినట్టు మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ చెప్పారు. ఈ ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఉపముఖ్యమంత్రి రాజనర్సిం హతోపాటు తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారి ఆలయాలను సందర్శిస్తారన్నారు. మంత్రి గీతారెడ్డి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. కాగా, బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ఆలయాల వద్ద అధికారులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని రాకేష్ తివారీ ఆరోపించారు. -
సర్కారు రుణానికి ‘విభజన’ దెబ్బ!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రుణ సమీకరణపై విభజన ప్రభావం కొంత మేర పడింది. గతంలో సెక్యూరిటీ బాండ్లను విక్రయించి సేకరించిన రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వడ్డీ చెల్లించేది. కానీ రాష్ట్ర విభజన ప్రకటన మరుసటి రోజు సేకరించిన రుణంపై ఎక్కువ శాతం వడ్డీ పడింది. సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు కొనుగోలు చేసి ఆ మేరకు రుణాలు ఇస్తుంటాయి. ఆ రుణాలపై ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా సేకరించిన రుణంపై 7.57 శాతం నుంచి 8.22 శాతం మధ్య వడ్డీ చెల్లించేది. మిగతా రాష్ర్ట ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ కన్నా మనరాష్ట్ర ప్రభుత్వమే తక్కువ వడ్డీ చెల్లించే ది. అయితే గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణంపై... మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సుస్థిరత ఆధారంగా వడ్డీ శాతం హెచ్చు తగ్గులుంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు రాజకీయ అస్థిరత నెలకొన్న సందర్భాల్లో ప్రభుత్వం చేసే రుణాలపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాజకీయ స్థిరత్వం ఉంటే తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రంలోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని, అటు రాజకీయంగాను ఇటు ఆర్థికపరంగాను వ్యత్యాసాలు వస్తాయనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే సెక్యూరిటీ బాండ్లను జాతీయ బ్యాంకులు అధిక వడ్డీకిగానీ కొనుగోలు చేయడం లేదని ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. ఎంత తేడా..! గతనెల 31న రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణం సేకరణకు సెక్యూరిటీ బాండ్లను విక్రయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 9.48 శాతం వడ్డీకిగానీ వాటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ముందుకురాలేదు. చివరికి ఆ వెయ్యి కోట్ల రూపాయల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అదేరోజు హర్యానా ప్రభుత్వం రూ.500 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది. అలాగే పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు రూ.500 కోట్ల చొప్పున రుణ సేకరణకు బాండ్లను విక్రయించగా 9.05 శాతం వడ్డీ పడింది. తమిళనాడు ప్రభుత్వం రూ.400 కోట్ల రుణం సేకరించగా 9.10 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. అంటే అన్ని రాష్ట్రాల కంటే మనరాష్ట్రమే అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నమాట! మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.1000 కోట్ల రుణానికి సెక్యూరిటీ బాండ్లను విక్రయించగా కేవలం 8.22 శాతం వడ్డీయే పడింది. అలాగే మే నెలలో మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని సేకరించిన సమయంలో 7.57 శాతం వడ్డీయే చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9.46 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర విభజన ప్రభావమేనని, ఇక ముందు కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
దుర్గాశక్తి సస్పెన్షన్‌పై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి సస్పెండయిన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. అక్రమాలపై చర్యలు తీసుకున్న ఆమెకు అన్యాయం జరగకుండా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. దీన్ని యూపీ పాలక పక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బీజేపీలు ఎద్దేవా చేశాయి. హర్యానా, రాజస్థాన్‌లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల లావాదేవీల వ్యవహారంలో సస్పెండయిన ఐఏఎస్‌లకు కూడా న్యాయం జరిగేలా ఆమె ప్రధానికి మరో రెండు లేఖలు రాయాలని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ చురకలంటించారు. హర్యానాలో వాద్రా లావాదేవీపై చర్యలు తీసుకున్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా సస్పెన్షన్, రాజస్థాన్‌లో వాద్రా భూముల వ్యవహారంలో సస్పెండయిన ఇద్దరు ఐఏఎస్‌లకు సంబంధించి సోనియా లేఖలు రాయాలన్నారు. కాగా, అక్రమాలపై చర్యలు తీసుకున్నందుకే నాగ్పాల్పై చర్య తీసుకున్నారని జనం అనుకుంటున్నారని సోనియా.. మన్మోహన్‌కు జాతీయ సల హా మండలి చైర్పర్సన్ హోదాలో రాసిన లేఖలో తెలిపారు. ‘మనం నాగ్పాల్కు అన్యాయం జరగకుండా చూడాలి. చట్టం అమల్లో చొరవ చూపే అధికారులను కాపాడాల్సిన అవసరముందని ఈ ఉదంతం చెబుతోంది’ అని పేర్కొన్నారు. లేఖ అవసరం లేదు: రాజ్‌నాథ్ ఈ లేఖ వ్యవహారం పట్ల బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానిపై వాగ్బాణాలు సంధించారు. కాంగ్రెస్ చీఫ్‌నుంచి లేఖకోసం ఎదురు చూడకుండానే ప్రధా ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. సోనియా లేఖ రాయకుండా మన్మో హన్‌కు నోటిమాటగా చెప్పినా సరిపోయేదన్నారు. నాగ్పాల్పై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నందుకే సోనియా ప్రధానికి లేఖరాశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షీ లేఖీ అన్నారు. గౌతమబుద్ధ నగర్ జిల్లాలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న నాగ్‌పాల్‌ను యూపీ ప్రభుత్వం గత వారం సస్పెండ్ చేయడం తెలిసిందే. నాగ్‌పాల్ చట్టపరమైన ప్రక్రియ పాటించకుండా ఓ మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని, అందుకే స్పస్పెండ్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. -
అఫ్ఘాన్‌లో భారత ఎంబసీపై ఆత్మాహుతి దాడి
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పెంచిపోషిస్తున్న హక్కానీ నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం మేరకు.. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని ముగ్గురు ఉగ్రవాదులు.. జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వైపు ఒక కారులో దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు ప్రారంభించారు. భారీగా పేలుడు పదార్థాలను ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కారు దిగి రాయబార కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కాల్చేశారు. దాంతో మరో ఉగ్రవాది కారులో ఉన్న బాంబులను పేల్చేశాడు. అదే సమయంలో సమీపంలోని మసీదుకు వెళుతున్న చిన్నారులతోపాటు, వీసాల కోసం వచ్చినవారు మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యిపడింది. అయితే.. భారత అధికారులకు, రాయబార కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ఢిల్లీలోని భారత అధికారవర్గాలు వెల్లడించాయి. రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడుల వంటి ఘటనలతో భారత్ భయపడబోదని, అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం తాము అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. -
ఆగని ‘ప్రత్యేక’ హింస
దిఫు/గువాహటి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతాలనూ ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలంటూ ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ మొదలైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు హింసకు పాల్పడుతూనే ఉన్నారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో వివిధ బోడో సంఘాల ఆందోళనకారులు శుక్రవారం రాత్రి ఆరు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అలాగే దిఫు, దోల్డోలి స్టేషన్ల మధ్య మరోసారి పట్టాలను తొలగించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం శనివారం వరుసగా రెండో రోజు కూడా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో కవాతు నిర్వహించింది. మరోవైపు ప్రత్యేక బోడోలాండ్‌ను ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అస్సాంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రాష్ట్రం నుంచి తమ ప్రాంతాన్ని విభజించి కామత్పుర్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆల్ కోచ్-రాజ్‌బోంగ్షీ స్టూడెంట్స్ యూనియన్ శనివారం గవర్నర్ జె.బి. పట్నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాగా, కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో తిరిగి శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పంపిన ఇద్దరు మంత్రులు దిఫు పట్టణం చేరుకొని వివిధ రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులతో చర్చలు చేపట్టారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌ను కేంద్రానికి తెలియజేస్తామని రాజకీయ నేతలకు హామీ ఇచ్చినట్లు అనంతరం వారు విలేకరులకు తెలిపారు. కాగా, అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ఆందోళనకారుల డిమాండ్లను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శనివారం నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రజలు ఉమ్మడి కుటుంబంగా జీవించాలని కోరుకుంటున్నారని చెప్పారు. స్తంభించిన డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ర్టంగా ప్రకటించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) శనివారం ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్‌తోపాటు కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, మూతపడ్డాయి. రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డార్జిలింగ్‌కు సమీపంలోని రామమ్, రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో రోజుకు 80-100 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు. -
తెలంగాణలో గిరిజనం.. సీమాంధ్రలో దళితులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన సామాజిక వర్గాల నిష్పత్తిలో కూడా మార్పులకు కారణం కానుంది. తెలంగాణ, రాయలసీమ..ఆంధ్రా ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న వివిధ సామాజిక వర్గాల జనాభాలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొంతమేర హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల విషయంలో పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలు ఏర్పాటయితే ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ రెండు సామాజిక వర్గాల్లో మార్పులు జరుగుతాయి. తెలంగాణలో షెడ్యూల్డు తెగల(ఎస్టీ)కు చెందిన జనాభా నిష్పత్తి ఏకంగా రెండు శాతం పైగా పెరగనుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల జనాభా మొత్తం జనాభాలో 7 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అది 9.3 శాతానికి చేరనుంది. అంటే తెలంగాణ జనాభాలో సుమారు 10 శాతం మంది ఎస్టీలే ఉండనున్నారు. ఇక ఎస్సీల విషయంలో తెలంగాణలో వీరి జనాభా స్వల్పంగా తగ్గనుంది. ప్రస్తుత రాష్ట్రంలో 16.41 శాతం మంది ఎస్సీలుండగా, తెలంగాణ జిల్లాల వరకు లెక్కలు కడితే తెలంగాణలో వారి జనాభా 15.4 శాతం కానుంది. ఇక సీమాంధ్ర ప్రాంతాలలో ఎస్టీల సంఖ్య భారీగా తగ్గనుంది. ఇప్పుడున్న 7 శాతం ఎస్టీలు, ఆంధ్ర జనాభాలో 5.3 శాతానికి పడి పోనున్నారు. అదే ఎస్సీల విషయానికి వచ్చినప్పుడు అది 16.41 నుంచి 17.1 శాతానికి పెరగనుందని జనాభా లెక్కలు చెపుతున్నాయి. ఇదే ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు మార్చాల్సి ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. అయితే, 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలకు 6.6 శాతం అంటే 7 శాతం విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండగా, 2001 కంటే ముందున్న 6 శాతం రిజర్వేషన్లనే కొనసాగిస్తున్నారు. ఎస్సీల విషయంలో కూడా 2001 లెక్కల ప్రకారం 16.1 అంటే 16 శాతం ఇవ్వాల్సి ఉండగా 15 శాతమే కల్పిస్తున్నారు. అయితే, కొత్త రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన ఈ రంగాల్లో రిజర్వేషన్లు మారితే తెలంగాణలో ఎస్టీలకు 9 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఆంధ్రలో ఎస్టీలకు 5 శాతం, ఎస్సీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఇక చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే లెక్కల ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు జరిగితే, రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో మార్పులుండే అవకాశాల్లేవు. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఎస్టీలకు రెండు స్థానాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎక్కువ ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే ఎస్టీల జనాభా తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఆంధ్రలో విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. ఎస్సీల జనాభా ఆంధ్రలో గుంటూరులో ఎక్కువగా ఉండగా, తెలంగాణలో కరీంనగర్లో ఎక్కువ మంది ఎస్సీలున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలో ఎక్కువగా ఎస్టీలుంటారు. ఎస్సీల విషయంలో ఆంధ్రలోని కృష్ణా జిల్లా విజయవాడ (అర్బన్)లో, తెలంగాణలో అయితే వరంగల్‌లోని హన్మకొండ మండలంలో ఎక్కువ గా ఉన్నారు.