తెరపైకి చరణ్‌రాజ్ వారసుడు
నట వారసులు తెరంగేట్రం చేయడమనేది సాధారణమయింది. ఇప్పటికే చాలా మంది తెరపైకి వచ్చారు. నటుడు చరణ్‌రాజ్ తనయుడు తేజ్‌రాజ్ సైతం త్వరలో తెరపైకి రానున్నారు. కోలీవుడ్‌లో నీతిక్కు దండనై చిత్రం ద్వారా చరణ్‌రాజ్ పరిచయమయ్యారు. తర్వాత తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఒరి యా, బెంగాలీ తదితర భాషల్లో వివిధ రకాల పాత్రలను పోషించి శభాష్ అనిపించుకున్నారు.
ఇప్పుడు ఆయన తన కుమారుడు తేజ్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. చరణ్‌రాజ్ మాట్లాడుతూ తనను అన్ని భాషల్లో నటుడిగా అంగీకరించారన్నారు. తన కుమారుడికి నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఈ దిశగానే తానూ ప్రోత్సహిస్తున్నానని వెల్లడించారు. తేజ్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేయడానికి చాలామంది దర్శకులు ముందుకొచ్చారని తెలిపారు. అయితే తొలి చిత్రం ఏమిటన్నది త్వరలోనే ప్రకటన వెలువడనుందని చెప్పారు.
దర్శకుడు బాలుమహేంద్ర ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందానని తేజ్‌రాజ్ తెలిపారు. రఘురాం మాస్టర్ వద్ద నృత్యంలో, పాండియన్ మాస్టర్ వద్ద స్టంట్స్‌లో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. సినీ రంగంలో తప్పక ఎదుగుతానని ధీమా వ్యక్తం చేశారు.