News
-
మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు?
పెద్దపల్లి, గోదావరిఖని: రామయ్య(పేరు మార్చబడింది)అనే కార్మికుడికి కంటిచూపు మందగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే కళ్లు పరీక్షించి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. అతడి సొంత కుమారుడికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఊర్లో ఒకపేరు, గనిపై మరోపేరు ఉండటంతో ఇలా నాలుగేళ్లుగా సతాయిస్తోంది. ఆ యువకుడికి ఉద్యోగం లేక, పట్టుపైసా(గ్రాట్యుటీ) రాక ఆ కుటుంబం అప్పులపాలైంది. ఈచిక్కుముడి విప్పేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కార్మికుల సభ సాక్షిగా మారుపేర్ల మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి రామయ్యలు సింగరేణిలో 600మందికిపైగా ఉన్నారు. నిరక్షరాస్యులు కావడంతో.. సుమారు 40ఏళ్ల క్రితం ఊళ్లో ఏ పేరు ఉందో, బొగ్గు గనిపై ఏ పేరు ఉందో కార్మికులకు ఎవరికీ తెలియదు. నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. ఇలా కాలం గడిచి పోయింది. ఇప్పుడు సింగరేణిలో కంప్యూటర్ యుగం వచ్చింది. ఆ నాటి పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా తన తండ్రి పేరులో అక్షరదోషం ఉందనేసాకుతో తమ పిల్లలకు ఉద్యోగాలివ్వడం అంశాన్ని పక్కన బెట్టారు. ఇలా ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా కేసులు పేరుకుపోయాయి. గత గుర్తింపు యూనియన్ ఈవిషయంపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. భవిష్యత్‌పై హామీ ఇవ్వాలి.. మెడికల్ ఇన్వాలిడేషన్‌లో విజిలెన్స్ విచారణ పేరుతో నిలిచిపోయిన సింగరేణి సంస్థలోని సుమారు 600మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మారుపేర్ల మార్పు అంశం తెరపైకి వచ్చినా ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు, అధికార పార్టీ నేతలు.. కార్మికులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
'పదో తరగతి పరీక్షల' పేరుతో విద్యార్థినిలపై అసభ్యకరంగా..
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నాడని నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తరగతి గదులను విడిచి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సీనియర్ ఉపాధ్యాయుడినంటూ పదో తరగతి పరీక్షలు నా చేతిలోనే ఉంటాయని విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పాడు. దీంతో వారు అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మను వివరణ కోరగా ఈ విషయాలు తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎంఈఓ భూమారెడ్డిని వివరణ కోరగా రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు -
ఈ రూట్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు రెండు రూట్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్మెంట్ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. తక్కువ భూసేకరణతో.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పి–7 రోడ్ రూట్లో, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా, బార్కాస్, పహాడీషరీఫ్ రూట్లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్ రూట్ 31 కి.మీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్లలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టు రూట్‌ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్షిప్ వరకు భవిష్యత్‌లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. నిర్మాణంపై ముందుకు సాగేదెలా..? రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ రూట్లను ఎల్అండ్టీ సంస్థ పీపీపీ మోడల్లో నిర్మించగా ఎయిర్‌పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌ను నిలిపివేసి కొత్త అలైన్మెంట్లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్ రూట్‌ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్బీనగర్– ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లలోనే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్లు పూర్తయితే గానీ ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. రియల్ ఎస్టేట్ డీలా పడే ప్రమాదం.. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్ భూమ్ కనిపించింది. తాజాగా ఈ రూట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
'ప్రవచనం' కాలక్షేపం కోసం కాదు!
తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం: రామకథ యథార్థ తత్త్వాన్ని తెలియచెప్పడమే లక్ష్యంగా తాను రామాయణాన్ని ప్రవచిస్తున్నానని, కాలక్షేపం కోసం కాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఉద్ఘాటించారు. రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో రుషిపీఠం మండల దీక్షగా శ్రీరామ మహాయజ్ఞం నిర్వహిస్తోంది. 42 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణ సారాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించి, రామభక్తులను పులకింపచేస్తున్నారు. జనవరి 23వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ ప్రవచన మహాయజ్ఞం సాగనుంది. సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన గోదావరీ తీరం రామకథా ప్రవచన, స్మరణాలతో మారు మోగుతోంది. ‘రాజ’మహేంద్రి ‘రామ’మహేంద్రిగా మారింది! ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో సామవేదం ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరకాండ అవాల్మీకం కాదు.. లోకంలో ఉత్తరకాండ వాల్మీకి మహర్షి విరచితం కాదనే మాట గట్టిగానే వినపడుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గలో ఫలశృతి చెప్పాక, తదనంతరం కథ ఉండదని వీరి వాదన. బాలకాండలో మహర్షి స్వయంగా చెప్పారు, షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్లు....‘తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి’....బాలకాండలో స్పష్టంగా చెప్పారు. రామాయణంలో 24 వేల శ్లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఉత్తరకాండలోని శ్లోకాలు కలుపుకుంటేనే ఈ సంఖ్య వస్తుంది. పురాణాదులలో అవతార పురుషుల ఆవిర్భావం చెప్పినట్లు, అవతార పరిసమాప్తి కూడా చెప్పడం సంప్రదాయం. రామావతార పరిసమాప్తి ఉత్తరకాండలో చూస్తాం. రామాయణంలోని కొన్ని సందేహాలకు మనకు ఉత్తరకాండలో సమాధానాలు కనపడతాయి–ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడిని చూసిన రావణుడు వచ్చినవాడు నందీశ్వరుడా అని అనుమానపడతాడు. రావణ, నందీశ్వరుల నడుమ జరిగినది మనకు ఉత్తరకాండలోనే గోచరిస్తుంది. ఉత్తరం అనే మాటకు సమాధానం అని అర్థం చెప్పుకోవచ్చు. నేటికీ చెదరని రామాయణ ప్రాధాన్యం! ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు, దాడులు చేసినా రామాయణం ప్రాచుర్యం, ప్రాధాన్యం కోల్పోదు. త్రేతాయుగమైనా, కలియుగమైనా, ఏ యుగమైనా మానవధర్మం శాశ్వతమైనది. రాగద్వేషాలు, మానవ సంబంధాలు మారవు. మన స్వభావాలను తీర్చి దిద్దేది రామాయణం. ఈ భూమిపై చెట్లు, పర్వతాలు, నీరు ఉన్నంత కాలం రామాయణం ప్రచలితం కాక మానదు. ఇది బ్రహ్మవాక్కు. -
'ఓ మహిళా.. జర పదిలం!' లేదంటే?
ఆదిలాబాద్: 'రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైనా నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర రూట్లతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది. ప్రయాణ ప్రాంగణాల్లో పురుషుల కంటే మహిళ ప్రయాణికులే ఎక్కువగా ఉండడంతో దీనిని అదునుగా తీసుకున్న చిల్లర దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు, ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహిళలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.' పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల వద్ద మహిళల రద్దీ.. ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు అధికంగా వస్తున్నారు. పల్లె వెలుగులతో పోల్చితే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా స్టాపులు ఉండడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు మండల కేంద్రాలకు, పల్లెలకు ప్రయాణించేవారు మాత్రం పల్లె వెలుగు బస్సులు ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రధాన పట్టణాలకు వెళ్లేవారు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంల వద్ద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వద్ద మహిళా ప్రయాణికులు ఉండడంతో చిల్లర దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి దొంగతనాలు గతంలో నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి రద్దీ సమయంలో ప్రయాణించే మహిళలు విలువైన నగలు ధరించకూడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తమ హ్యాండ్ బ్యాగులో సైతం విలువైన వస్తువులు, ఖరీదైన మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది కూడా నిఘా పెంచడంతోపాటు ఎప్పటికప్పుడు మైకు ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. దీనితోపాటు సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చోరీ ఘటనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులు అందించే వాటర్ బాటిల్ నీరు, తినుబండరాలు వంటివి వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే ఆర్టీసీ భద్రత సిబ్బందికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో కొన్ని ఘటనలు ఇలా.. గతంలో తరచుగా హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లు, నగలు, డబ్బులు పోయినట్లు ప్రయాణికుల నుంఛి ఫిర్యాదులు అందాయి. కొందరు చిల్లర దొంగలు బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేయడమే పనిగా పెట్టుకొని మాకం వేస్తారు. అందులో కొన్ని ఘటనలు ఇలా.. • గత నెలలో బస్సు ఎక్కుతున్న మహిళ చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కొని పరిగెడుతుండగా అక్కడే ఉన్న ఆర్టీసీ భద్రత సిబ్బంది ఆ దొంగను పట్టుకొని మొబైల్ ఫోన్ సంబంధిత మహిళకు ఇచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు. • పనిమీద జిల్లా కేంద్రానికి వచ్చినా ఓ వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు నగలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఇలా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నాం! మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో కంటే ప్రస్తుతం మహిళల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, పోలీసుల సాకారం కూడా తీసుకుంటున్నాం. అదనపు సెక్యూరిటీని కూడా బస్టాండ్‌లో విధులు నిర్వహించేలా చూస్తున్నాం. మహిళా హోంగార్డులు, పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నాం. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. – ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డీఎం, నిర్మల్ -
'ఆర్టీసీ ఫుల్.. ఆటో నిల్' ఇదేమి ఖర్మరా మాకు! : ఆటో డ్రైవర్లు
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో ఆటోవాలాలు ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఆటో డ్రైవర్లకు ప్రయాణికుల్లేకపోవడంతో ఖాళీగానే కాలం గడుపుతున్నారు. మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతుండటంతో.. కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు గిరాకీలు దొరకక పూట గడవని పరిస్థితి నెలకొందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజీవ్ రహదారిలోని మొగ్ధుంపూర్ స్టేజీ వద్ద ఆటోలున్నా.. మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కారు. బస్సు ఎక్కుతున్న మహిళలను చూస్తున్న ఆటో డ్రైవర్లు ఇదేమి ఖర్మరా మాకు అంటూ బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జీవీఎంసీ కౌన్సిల్.. 18 అజెండా, 27 సప్లిమెంటరీ అంశాలపై చర్చ!
విశాఖపట్నం: మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్న జీవీఎంసీ సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా.. మిచాంగ్ తుపాను కారణంగా వాయిదా పడింది. ఆ రోజు వాయిదా పడ్డ 18 అంశాలతో పాటు మరో 27 అంశాలు నేడు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. ► 2023–24 ఏడాదిలో డిసెంబర్ 13 నుంచి మార్చి 31, 2024 వరకు జోన్–4 టౌన్‌కొత్తరోడ్డు వద్ద గల సీసీఎస్ ప్రాజెక్ట్ నిర్వహణలో భాగంగా అద్దె ప్రాతిపదికన టిప్పర్లు, బ్యాక్ హోయ లోడర్‌కు పరిపాలన ఆమోదం, ఎన్బీసీ, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణపు మార్గదర్శకాలకు అనుగుణంగా అంచనా విలువ రూ.99.47 కోట్లతో ముడసర్లోవలోని 4.37 ఎకరాల్లో జీవీఎంసీ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వ పరిపాలన ఆమోదానికి సభ్యులు చర్చించనున్నారు. ► సాగర్‌నగర్‌కు ఎదురుగా బీచ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న బీచ్ స్థలంలో ఎకోఫ్రెండ్లీ తాబేలు బీచ్ అభివృద్ధి, ఉద్యానవన విభాగంలో గ్రీనరీ అభివృద్ధి, పర్యవేక్షణకు కాంట్రాక్ట్ పద్ధతిలో 8 మంది జోనల్ హర్టికల్చర్ అధికారుల నియామకం, పూర్ణామార్కెట్ జంక్షన్ నుంచి టౌన్‌కొత్తరోడ్డు జంక్షన్ వరకు రూ.1,34,02,077 అంచనా విలువతో రోడ్డుకిరువైపులా ఉన్న 55 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ► రూ.1,46,45,690 అంచనా విలువతో రీడింగ్ రూమ్ జంక్షన్ నుంచి పాతపోస్టాఫీస్ జంక్షన్ వరకు 69 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు, రూ.62,01,254 అంచనా విలువతో చౌల్ట్రీ జంక్షన్ నుంచి పూర్ణామార్కెట్ జంక్షన్ వరకు 21 ఫీడర్ పిల్లర్ బాక్స్‌లు, భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటు అంశాలు చర్చకు రానున్నాయి. ► పెదగదిలి జంక్షన్ వద్ద తూర్పు దిక్కున రూ.1.72కోట్లతో వంతెన నిర్మాణం, పడమర వైపున రూ.1.73 కోట్లతో వంతెన నిర్మాణం, కొత్త గాజువాక జంక్షన్ నుంచి వంటిల్లు జంక్షన్(కణితి రోడ్డు) వరకు 15వ ఆర్థిక సంఘం నిధులతో బీటీ హాట్ మిక్స్ రోడ్డు విస్తరణ, పునరుద్ధరణ పనులు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాల మార్పుపై చర్చించనున్నారు. ► గుండాల జంక్షన్ వద్ద రూ.1,98,90,000తో జీ 2 తరహాలో జీవీఎంసీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, పీఎఫ్ కాలనీలో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 96వ వార్డు వేంకటేశ్వరస్వామి ఆలయ ఘాట్‌రోడ్డు హాట్మిక్స్తో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 95వ వార్డు పురుషోతపురం వద్ద గల మహతి స్కూల్ నుంచి కంఫర్ట్ హోమ్స్ వరకు బీటీ రోడ్డు తదితర అంశాలను చర్చించి ఆమోదించనున్నారు. ► 90, 91, 92 వార్డుల్లో గిరి ప్రదక్షిణ రోడ్డు విస్తరణ, సెంటర్ డివైడర్లు, ఆర్సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం, సమగ్ర మొబిలిటీ ప్లాన్ తయారీ, సీఎం ఈ–బస్ సేవా పథకం, మధురవాడ, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు, గృహ అవసరాలకు 66 ఎంఎల్డీ నీటి సరఫరా, పంపిణీ, ముడసర్లోవలో నీటి శుద్ధి కర్మాగారం నిర్మాణంతో పాటు కేబీఆర్ నుంచి ట్రాన్స్మిషన్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు షరతులతో కూడిన విస్కో ప్రాజెక్ట్స్ తదితర అంశాలపై సభ్యులు చర్చిస్తారు. -
'సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ' కి విశేష స్పందన!
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఆదివారం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్లో గల శ్రీ విశ్వ పాఠశాలలో జరిగిన పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా చేసి, మొదటిగా మ్యాథ్స్ బీ, ఆ తరువాత స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు. మ్యాథ్స్ బీ సెమీఫైనల్ కాగా, స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ స్థాయిలో జరిగింది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే జరిగిన పరీక్షలో ప్రతిభ చాటిన విదార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సత్తా చాటిన విద్యార్థులు ఫైనల్‌కు వెళ్లనున్నారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షపై ఎంతో ఆసక్తి కనబరిచి, వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. -
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!
పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది. ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్‌రహదారి సిగ్నల్స్ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉమ్మడి జిల్లాకు.. ఆత్మీయ 'చంద్రమోహను'డు!
సాక్షి, వరంగల్: కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం కన్నుమూశారు. అందరికీ ఆత్మీయుడైన చంద్రమోహన్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థల కళాకారుడు, డిప్యూటీ డీఈఓ బూర విద్యాసాగర్‌గౌడ్ అధ్యక్షతన 1993లో వరంగల్ నటరాజ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ నాటిక ప్రదర్శనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు నటులు రాళ్లపల్లి, పీజేశర్మ, సాయికుమార్, నటి కిన్నెర, వందేమాతరం శ్రీనివాస్ నటించారు. చంద్రమోహన్‌తో కలిసి భోజనం చేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ అజయ్‌కుమార్ (ఫైల్) ఈ మేరకు రంగస్థల కళాకారుడు బూరవిద్యాసాగర్ గౌడ్, మైక్రోఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌కుమార్, ఓరుగల్లు శారదానాట్యమండలి నిర్వాహకుడు జేఎన్ శర్మ, పద్యనాటక కళాకారుడు జూలూరు నాగరాజు, ఫ్రెండ్స్ కల్చరల్ సొసైటీ నిర్వాహకుడు బిటవరం శ్రీధరస్వామి, జేబీ కల్చరల్ సొసైటీ జడల శివ తదితరులు చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్ అడుగు ఎత్తుంటే సినీ ఇండస్ట్రీని ఏలే వారని మహానటుడు ఎన్టీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నటులు ప్రశంసించారని, చంద్రమోహన్‌కు నాటకాలంటే ప్రాణమని వరంగల్‌కు చెందిన కళాకారులు గుర్తు చేసుకున్నారు. -
చుక్కేసి.. హోర్డింగ్ ఎక్కేసి.. పైన పక్కేసి.. గురక పెట్టేసి..
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: తాగిన మైకంలో హోర్డింగ్ ఎక్కిన యువకుడు అక్కడే నిద్రపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ వద్ద చోటు చేసుకుంది. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన మేస్త్రీ పని చేసే రవీందర్ అలియాస్ రవి ఆదివారం మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుని అక్కడే ఉన్న హోర్డింగ్ ఎక్కి నిద్రపోయాడు. హోర్డింగ్‌పై రవీందర్‌ను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు, మూడో టౌన్ పోలీసులు చేరుకున్నారు. వారి సూచన మేరకు స్థానికులు హోర్డింగ్ ఎక్కి రవీందర్‌ను కిందికి దింపారు. ఇవి చదవండి: 'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్! -
హైదరాబాద్‌లో.. సినీనటి 'పాయల్ రాజ్‌పుత్' సందడి!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్ డివిజన్ మదీనాగూడలో సినీనటి పాయల్ రాజ్‌పుత్ శుక్రవారం సందడి చేసింది. హైదరాబాద్‌లో జోస్ అలుక్కాస్ 4వ నూతన షోరూంను ఆమె సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుక్కాస్‌లో ఆభరణాలన్నీ నాణ్యతో కూడి అందంగా ఉన్నాయన్నారు. శుభమాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్, ఫెస్టివల్ ఎడిషన్, పరంపర కలెక్షన్స్, ఐవీ కలెక్షన్స్ లాంటివి జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక బ్రాండ్స్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
దాతలూ దయచూపండి!
సాక్షి, పెద్దపల్లి: హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కార్మికుడు పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యానికి డబ్బు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన నాగపూరి శ్రీనివాస్‌గౌడ్ నాలుగు నెలల క్రితం హైబీపీతో పక్షవాతానికి గురికాగా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అతడికి భార్య శ్రీలత, ఇద్దరు కూతుర్లు అంజలి, భార్గవి ఉన్నారు. శ్రీనివాస్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. మంచానికే పరిమితం కావడంతో వైద్యంకోసం కుటుంబసభ్యులు తెలిసినవారి వద్ద రూ.10లక్షల వరకు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అయినా కోలుకోలేదు. నాలుగు నెలల నుంచి కుటుంబ పోషణ భారం కావడంతో ఇద్దరు ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. వైద్యానికి దాతలు సాయం చేస్తే కోలుకుంటాడని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మూత్రపిండాల్లో రాళ్లు తొలగింపునకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని కుటుంబసభ్యులు రోదిస్తూ తెలిపారు. ఆపరేషన్‌కు రూ.5లక్షలు అవుతాయని, తమ వద్ద చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు మానవత్వంతో సా యం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. - దాతలు సాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ : 96761 73272 -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
పత్తి తూకంలో ‘రిమోట్’ మోసం! ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా..
సాక్షి, వరంగల్: కాంటాలో సాంకేతిక పరికరాన్ని ఉపయోగించి రిమోట్ ఆపరేషన్ సహాయంతో తూకంలో మోసం చేస్తున్న ఓ దళారీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తమను మోసం చేశాడని ఆగ్రహంతో రైతులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన హసన్‌పర్తి మండలం నాగారంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధి అంబాలకు చెందిన ప్రైవేట్‌గా వ్యాపారి గడ్డం వెంకటేశ్వర్లు పరకాల, సూదన్‌పల్లి, పెంబర్తి, అంబాల, కమలాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి అక్కడే పత్తి తూకం వేసి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నాడు. మార్కెట్ ధర కంటే మరో రూ.100 అదనంగా చెల్లిస్తుండడంతో రైతులు ఆసక్తితో ముందుకు వచ్చారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న అంబాలకు చెందిన కర్ణాకర్ తన యజమాని సూచన మేరకు రెండు నెలలుగా ఆయా గ్రామాలకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. అయితే వచ్చిన దిగుబడికి.. తూకం వేసిన తర్వాత వ్యత్యాసం కనిపించినా రైతులకు ఏం జరుగుతున్నదో అర్థం కావడంలేదు. మోసాన్ని గుర్తించింది ఇలా.. సోమవారం ఉదయం నాగారంలోని రాజిరెడ్డి ఇంటికి కర్ణాకర్ వచ్చి పత్తి కాంటా వేశాడు. తొలుత 92.6 కిలోల తూకం వచ్చిన పత్తి.. సెకండ్ల వ్యవధిలోనే 74.1 కిలోలకు చేరింది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గుమస్తా చేతులను పరిశీలించారు. ఏదో జరుగుతున్నదని గమనించి వెంటనే అతడి జేబులను తనిఖీ చేయగా రిమోట్ దొరికింది. దీంతో భయపడిన గుమస్తా ఆ రిమోట్‌ను బయటికి విసరగా.. రాజిరెడ్డి కుటుంబ సభ్యులు వెతికి తీసుకుని వచ్చారు. ఎలక్ట్రానిక్ కాంటాకు రిమోట్ కనెక్షన్.. సదరు దళారీ ఎలక్ట్రానిక్ కాంటాను రిమోట్ కనెక్షన్ ఇచ్చాడు. పత్తి తూకం వేసినప్పుడు జేబులో నుంచి ఒకసారి రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తే 15 కిలోలు, రెండుసార్లు చేస్తే 30 కిలోలు తక్కువ తూకం వచ్చేలా కాంటాలో సాంకేతిక పరికరాన్ని బిగించి రిమోట్‌కు అనుసంధానం చేశాడు. ఓవైపు రైతులు తూకం నమోదు చేస్తుండగా.. మరో వైపు దళారీ రిమోట్‌తో ఆపరేట్ చేయడంతో క్వింటాకు 15 కిలో ల నుంచి 30 కిలోల పత్తి తగ్గుతోంది. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కర్ణాకర్‌ను రైతులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తన యజమాని వెంకటేశ్వర్లు సూచన మేరకు రిమోట్ వాడుతున్నట్లు తెలిపారు. అప్పుడే అక్కడికి చేరిన వెంకటేశ్వర్ల్లును రైతులు ప్రశ్నించగా.. తనకేమీ తెలియనట్లుగా నటించడంతో రైతులు అతడికి కూడా దేహశుద్ధి చేశారు. గుర్తించకుంటే.. పత్తి తూకం వేయగా 92.6 కిలోలు వచ్చింది. ఆ వెంటనే 74.1 కిలోలకు తగ్గింది. అనుమానం వచ్చి అతని జేబులు పరిశీలించగా రిమోట్ కనిపించింది. గుర్తించకుంటే మూడు క్వింటాళ్ల పత్తి మాయమయ్యేది. – రాజిరెడ్డి, రైతు మూడు క్వింటాళ్లు మాయం.. ఇటీవల మార్కెట్ ధర కంటే వంద రూపాయలు అదనంగా ఇస్తామంటే ఇంటి వద్ద పత్తి అమ్మిన. అయితే 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. తూకంలో 12 క్వింటాళ్లు వచ్చింది. తూకంలో మోసం చేసి మూడు క్వింటాళ్ల పత్తి మాయం చేశాడు. – లింగారెడ్డి, రైతు -
'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి
సాక్షి, ఆదిలాబాద్: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి ఓ యువతి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని సంజీవయ్య కాలనీకి చెందిన ప్రకాశ్‌కు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ మండలం బురుగూడకు చెందిన శిరీషతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి జరగాల్సిన క్రమంలో పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా ప్రకాశ్ పెళ్లికి నిరాకరించడంతో శిరీష యువకుడి ఇంటికి వచ్చింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. దీంతో తీవ్ర చలిలోనే ప్రకాశ్ ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఎంబడి శ్రీకాంత్ అక్కడకు చేరుకొని ఇరు పక్షాల నుంచి వివరాలు సేకరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువతి వినకుండా ఆందోళన కొనసాగిస్తోంది. ఇవి చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే.. -
ఏంటి? మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!
సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్‌ఫోన్ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్– ఏ60ఎస్ సెల్‌ఫోన్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీకు ఆర్డర్ పెట్టాడు. సెల్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్ బాయ్ ఫోన్ వచ్చిందంటూ ఓ బాక్స్ అందజేశాడు. ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్ బాయ్ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్‌కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్ బాయ్ వెంటనే సంబంధిత కొరియర్ కంపెనీకి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్ ప్రకారం సెల్‌ఫోన్ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు. -
వైభవంగా 'జక్కంపూడి వారి పెళ్లి సందడి..' ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం!
సాక్షి, తూర్పుగోదావరి: స్థానిక శాసనసభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు, వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లో అంగరంగ వైభవంగా జరిగింది. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభిమానమంతా ఉవ్వెత్తున ఎగసివచ్చిందా అన్నట్టుగా అభిమాన గణం భారీఎత్తున తరలివచ్చి, ఆయన ద్వితీయ కుమారుడైన గణేష్ దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా దివాన్‌చెరువుకు హెలికాప్టర్లో వచ్చి, నూతన వధూవరులైన జక్కంపూడి గణేష్, సుకీర్తిలను ఆశీర్వదించి, కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలో కొంతమంది సీఎంతో సెల్ఫీలకు రిక్వెస్టు చేయడంతో అందుకు ఆయన చిరునవ్వుతో వారికి అవకాశం ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువర్గంలోని వారు, అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో.. ఆహ్వానితులలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సెట్టింగ్‌లను తలపించేలా చేసిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. వివాహ రిసెప్షన్ వేదికపై యశస్వి కొండేపూడి మ్యూజిక్ బ్యాండ్ లైవ్‌తోపాటు సింగర్ శిల్ప, యాంకర్ దీప్తి నల్లమోతు, మిమిక్రీ రాజు, గోవింద్ డ్యాన్స్ టీమ్ లైవ్ ప్రోగ్రామ్స్ అలరించాయి. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నం, ‘పెట్టా తులాల్’ కేరళ నృత్యం, ప్రకృతి ఒడిలోకి వచ్చామా అనే రీతిలో ఆసక్తి ఉన్నవారు ఫొటో షూట్లు తీసుకునేలా వేసిన సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భోజన సదుపాయాల గురించి ప్రస్తావిస్తే .. ‘ఆహా .. ఏమి రుచి, తినరా మైమరిచి..’ అనేవిధంగా 24 రకాల వంటకాలతో ఆహార ప్రియుల మదిని దోచారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం.. జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కి గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్లో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్లోని హెలిపాడ్‌పై దిగిన ఆయనకు ఆహ్వాన కర్త, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తల్లి జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆహ్వానం పలికారు. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, వంక రవీంద్రనాఽథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, కొండేటి చిట్టిబాబు, జె.శ్రీనివాస్‌నాయుడు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, సుమన్, హీరో విశ్వక్‌సేన్‌లు గణేష్, సుకీర్తిలకు ఆశీస్సులు అందజేశారు. -
దుర్గామాత శోభాయాత్రలో.. విగ్రహాన్ని ఢీకొన్న వ్యాన్! ఒక్కసారిగా చెలరేగిన గొడవ..
సాక్షి, నిజామాబాద్: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్ర గొడవకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత శోభాయాత్ర ప్రారంభమైంది. ముదిరాజ్ సంఘానికి సంబంధించిన దుర్గామాత విగ్రహాన్ని శోభాయాత్రకు తరలిస్తుండగా అదే సమయంలో రెడ్డి యూత్‌కు సంబంధించిన డీసీఎం డీజే వ్యాన్‌ను తీసుకెళ్తున్నారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ రెడ్డి వర్గానికి చెందినవాడు కావడంతో కావాలనే తమ దుర్గామాత విగ్రహాన్ని ఢీకొన్నాడని దీంతో దుర్గామాత చేతులు విరిగి పోయాయని, వెనుక ఉన్న ఇనుప స్టాండ్ ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరి వ్యక్తులపై పడి ప్రమాదం సంభవించేదని వారు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సంఘ సభ్యులు డీసీఎం వ్యాన్ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గొడవ పడొద్దని సూచించినా వారు వినలేదు. బుధవారం ఉదయం విగ్రహం ధ్వంసమైన చోటే టెంట్ వేసుకుని 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు. సీఐ రామన్ పోలీస్ బందోబస్తు మధ్య ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల సభ్యులతో మాట్లాడారు. విగ్రహం ధ్వంసం కావడానికి కారకులైన రెడ్డి సంఘం నుంచి రూ. 5లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా పెద్ద మనుషుల ఒప్పందంతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసి ఇస్తామని రెడ్డి సంఘం వారు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. విరిగిన దుర్గామాత చేతులను ప్లాస్టర్‌తో అతుకబెట్టి పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి, వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ బీరయ్య, బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు బొంబాయి మల్లయ్య, బంజ శివకుమార్, పున్నం రాజయ్య, మర్కంటి దాకయ్య, జగ్గ బాల్‌రాజు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అత్యంత వృద్ధ శునకం ‘బాబి’ ఇకలేదు
లిస్బన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా పేరున్న ‘బాబి’ 31 ఏళ్ల వయస్సులో శనివారం తుదిశ్వాస విడిచింది. పోర్చుగల్‌లోని కాన్క్వెయిరోస్ అనే ఊళ్లో 1992 మే 11న ఈ కుక్క పుట్టింది. అప్పటికి బాబి యజమాని లియోనల్ కోస్టా వయస్సు 8 ఏళ్లే. మంచి ఆహారం, స్వచ్చమైన గాలి, అమితమైన ప్రేమ..ఇవే బాబి ఇన్నేళ్లపాటు జీవించడానికి కారణాలని లియోనల్ చెప్పారు. బాబి మొత్తం 31 సంవత్సరాల 165 రోజులపాటు జీవించినట్లు తెలిపింది. బాబి స్వచ్చమైన రఫీరో డో అలెంటెజో జాతికి చెందింది. ఈ జాతి శునకాల సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు.