Editorial
-
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్‌లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
‘సర్వోన్నత’ న్యాయం!
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం. నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్‌ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు. షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి. కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది. ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్‌గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి. -
సరికొత్త సాంకేతిక సవాలు
మరో సంచలనాత్మక సాంకేతిక ప్రయోగం జరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఒకడుగు ముందుకేసి, విప్లవాత్మకమైన ఛాట్‌బాట్ ‘ఛాట్ జీపీటీ’ని సృష్టించిన ‘ఓపెన్ ఏఐ’ సంస్థ గురువారం మరో ముందంజ వేసింది. సరికొత్త జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) మోడల్‌ను ఆవి ష్కరించింది. రాతపూర్వక సమాచారాన్ని వీడియోగా మార్చే ‘సోరా’ అనే ఈ మోడల్ ఆసక్తి రేపు తోంది. సోరా అంటే జపనీస్‌లో ఆకాశమని అర్థం. సృజనకు ఆకాశమే హద్దంటూ ఏఐ వినియోగంతో చేసిన ఈ కొత్త ప్రయోగం ఏ మంచికి, ఎంత చెడుకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది. యూజర్ ఇచ్చిన సమాచారానికి కట్టుబడి ఉంటూ, నాణ్యతలో రాజీ లేకుండా గరిష్ఠంగా ఒక నిమిషం నిడివి వీడియోలను సృష్టించడం ‘సోరా’ ప్రత్యేకత. కోరినట్టుగా జెన్ఏఐ వేదికలు బొమ్మల్ని సృష్టించడం, సమాచార ప్రతిస్పందనలు అందించడమనేది కొన్నేళ్ళుగా జరుగుతున్నదే, అంతకంతకూ మెరుగవుతున్నదే. టెక్స్›్ట నుంచి బొమ్మలను ఇప్పటికే సృష్టిస్తున్నప్పటికీ వీడియో తయారీ సంక్లిష్టమైనది. అందుకే, ఆ పని వెనుకబడింది. తీరా ఇప్పుడు ఓపెన్ఏఐ ప్రయోగాత్మకంగా ‘సోరా’ను ముందుకు తెచ్చింది. దాని పని తీరుకు ఉదాహరణగా మంచు కురుస్తున్న టోక్యో నగర వీధుల దృశ్యాల్ని సృష్టించింది. వాస్తవికమని భ్రమింపజేస్తున్న ఆ వీడియోను చూసి అబ్బురపడనివారు లేరు. నిజానికి, టెక్స్›్ట నుంచి వీడియో సృష్టి అనే సాంకేతిక ప్రయోగం బరిలోకి ఇప్పటికే కొన్ని ఇతర సంస్థలూ ప్రవేశించాయి. గూగుల్, మేటా, అంకురసంస్థ రన్‌వే ఎంఎల్ లాంటివి ఈ సాంకేతికతను ఇప్పటికే చూపాయి. గూగుల్ ‘లూమియర్’ గత నెలలో విడుదలైంది. సమాచారం, లేదంటే ఛాయా చిత్రాల ఆధారంగా 5 సెకన్ల నిడివి వీడియోను సృష్టించడాన్ని ‘లూమియర్’ చేసి చూపింది. అలాగే, రన్‌వే, పికా లాంటి ఇతర సంస్థలు సైతం తమవైన వీడియో సృష్టి మోడల్స్‌ను ముందుకు తెచ్చాయి. నిమిషం నిడివి గల వీడియోలు సృష్టించే ‘సోరా’ విషయానికొస్తే, సంక్లిష్ట సన్నివేశాలు, పలు రకాల పాత్రలు, ప్రత్యేక తరహా కదలికలు, కచ్చితమైన నేపథ్యంతో కూడిన దృశ్యాలు ఈ ‘సోరా’తో సాధ్యమట. వస్తువులనూ, మనుషులనూ అచ్చంగా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే చూపుతుందట. అయితే, ఈ మోడల్ ఇంకా నిర్దుష్టంగా తయారుకాలేదనీ, సంక్లిష్ట సమాచారమిస్తే గందరగోళ పడవచ్చనీ దాన్ని రూపొందించిన ఓపెన్ఏఐ సైతం ఒప్పుకుంటోంది. అలాగే, కుడి, ఎడమల విషయంలో కాస్తంత తడబాటుకు గురికావడం లాంటి బలహీనతలూ ‘సోరా’లో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పుడు, విద్వేషపూరిత సమాచారాలకు వేదిక కాకుండా ఉండేలా... భద్రతా నిపుణులతో, విధాన నిర్ణేతలతో ఓపెన్ఏఐ చర్చించనుంది. అందుకే, ప్రస్తుతానికి ‘సోరా’ను సామా న్యులకు అందుబాటులో ఉంచలేదు. విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్లు, సినీ రూపకర్తలకు మాత్రం దీన్ని వాడుకొనే వీలు కల్పించింది. సృజనశీలురకు మరింత ఉపయోగపడేలా చేయాల్సిన మార్పులు చేర్పులపై వారి స్పందన తీసుకోనుంది. మొత్తానికి, ఏఐతో ప్రపంచం మారిపోతోంది. గత రెండు దశాబ్దాల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో అపరిమిత డేటా సేకరణ, సమాచార విప్లవం వచ్చింది. ఇటీవలి జెన్ఏఐ పుణ్యమా అని ఆ భారీ డేటాను ఆసరాగా చేసుకొని, కీలక నిర్ణయాలు తీసుకొనేలా ఏఐ వ్యవస్థలు, అప్లికేషన్ల అభివృద్ధి జరిగింది. దాదాపు 30 వేల కోట్ల పదాలను వాడుకొని ఛాట్‌జీపీటీ సిద్ధమైంది. సుమారు 580 కోట్ల చిత్రాలు – రాతపూర్వక సమాచారం ఆధారంగా ఏఐ ఆధారిత ఇమేజ్–జనరేటింగ్ అప్లికేషన్లు డాల్–ఇ, మిడ్‌జర్నీ లాంటివి శిక్షణ పొందాయి. ఏఐ వినియోగం పలు రంగాల్లో ఉపయుక్తమైనా, దాని వల్ల సమాజానికి సవాళ్ళూ అధికమే. సృజనశీలుర కృషిని అనుమతి లేకుండానే ఏఐ మోడల్స్ శిక్షణకు వాడుకోవడంపై పెద్ద కంపెనీలపై పలువురు కేసులేశారు. ఏఐని సర్వసిద్ధం చేయడానికి ఇప్పుడున్న డేటా సరిపోక, కొరత వస్తుందనీ అంచనా. ట్విట్టర్‌ను కొన్న ఎలాన్ మస్క్ నుంచి ప్రసిద్ధ రచయిత యువల్ నోవా హరారీ దాకా పలువురు ‘భారీ ఏఐ ప్రయోగాలకు విరామం ఇవ్వా’లంటూ నిరుడు బహిరంగ లేఖ రాయడం గమనార్హం. అమెరికా నుంచి ఇండియా దాకా ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఏఐ సృష్టి వీడియోలతో మోస పుచ్చే ప్రమాదం ఉంది. తప్పుడు ప్రచారంతో నైతిక, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రంగంలో ఏఐతో చిక్కులు రాక మానవు. అయినా ఇప్పటికీ ఏఐ పర్యవేక్షణ టెక్ సంస్థల చేతిలోనే నడు స్తోంది. ప్రభుత్వాలింకా నిద్ర మేల్కోలేదు. యూరోపియన్ యూనియన్ మాత్రం డిసెంబర్లో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా సమగ్రమైన ఏఐ నిబంధనలవి. అయితే, తుది ఆమోదం పొందిన రెండేళ్ళ తర్వాత కానీ చట్టం అమలులోకి రాదు. ఇక, ఏఐ దుర్వినియోగంపై రచ్చతో ఓపెన్ఏఐ, మరో 19 టెక్ సంస్థలు ఎన్నికల డీప్‌ఫేక్‌ల నిరోధానికి కృషి చేస్తామన్నాయి. పైకి ఏమంటున్నా, సోరా లాంటి ఏఐ టూల్స్ శిక్షణకు ఎక్కడ నుంచి, ఎంత వీడియోలు వాడుకున్న సంగతి కూడా ఓపెన్ఏఐ లాంటి సంస్థలు బయటపెట్టడం లేదు. ఛాట్‌జీపీటీ లాంటి జెన్ఏఐ టూల్స్ శిక్షణకై తమ కాపీరైట్ ఉల్లంఘించారంటూ ఇప్పటికే పలువురు రచయితలే కాదు, సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ సైతం ఓపెన్ఏఐ, దాని వ్యాపార భాగస్వామి మైక్రోసాఫ్ట్‌పై కేసులు పెట్టాల్సి వచ్చింది. అమెరికన్ సంపన్నులు, వారి వెంట చైనీయులు ఇప్పటికే ఏఐ రేసులోకి దిగారు. ప్రస్తుతానికి భారతీయులం వెనుకబడివున్నా, అనివార్యమవుతున్న ఈ మార్పును అందిపుచ్చుకోక తప్పదు. ఏఐ ఓ సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారి తీస్తుందని నిపుణుల అభిప్రాయం. అందుకే, కేవలం ఏఐ వినియోగదారులుగా మిగిలిపోకుండా, ఏఐ ఆవిష్కర్తలం కావాలన్నది వారి సూచన. -
పారదర్శకత అవసరం!
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫిబ్రవరి 15 చరిత్రాత్మక దినమని ప్రజాస్వామ్య ప్రియుల అభిప్రాయం. కేంద్రంలోని మోదీ సర్కార్ తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకం (ఈబీఎస్) రాజ్యాంగ విరుద్ధమనీ, పారదర్శకత లోపించిన ఈ పథకం కింద వివిధ పార్టీలకు బాండ్ల రూపంలో నిధులిచ్చిన దాతల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ వెల్లడించాలనీ సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పునివ్వడమే అందుకు కారణం. 2018 నుంచి రాజకీయ పార్టీలకు పాడి ఆవుగా మారిన ఈ పథకం రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణాన్ని ఉల్లంఘిస్తోందనీ, దాతలకుండే గోప్యత హక్కు కన్నా పౌరుల సమాచార హక్కే ముఖ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. బాండ్ల రూపంలో డబ్బులిచ్చిన దాతలు, అందుకున్న పార్టీలు, అందిన నిధులతో సహా మొత్తం వివరాల్ని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వెల్లడించాలన్న సుప్రీమ్ ఆదేశం పాలక వర్గాలకు దెబ్బే! గత ఆరేళ్ళుగా జనం దృష్టి పడకుండా తప్పించుకున్న వివరాలన్నీ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాయి. అలాగే, కొన్నేళ్ళుగా అనుమాని స్తున్న కార్పొరేట్ల– రాజకీయపార్టీల క్విడ్ ప్రోకో బంధంపై ఎంతో కొంత బయటపడవచ్చు. ఈ పథక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం కోర్ట్ తీర్పుపై ఇంకా మౌనముద్ర వీడలేదు. న్యాయశాఖ మంత్రి మాత్రం తీర్పును పరిశీలిస్తున్నా మనీ, సవాలు చేయదలిచినదీ లేనిదీ నిర్ణయిస్తామనీ వెల్లడించారు. నిజానికి, ఎన్నికల్లో లెక్క చూపని అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల బాండ్లను తెచ్చామన్నది పాలకుల వాదన. కోర్ట్ తీర్పుతో మళ్ళీ అదే ధన ప్రవాహ పరిస్థితి తలెత్తుతుందని వారి మాట. కానీ, ఏ కార్పొరేట్ సంస్థల నుంచి, ఏ పార్టీకి, ఎంత నిధులు బాండ్ల రూపంలో వస్తున్నాయో తెలియని గోప్యమైన ఎన్నికల బాండ్ల వ్యవస్థ వల్ల కూడా మరో రకంగా జరుగుతున్నది అదే! అంతా గోప్యమే గనక సంస్థలు స్వప్ర యోజనాలు ఆశించి బాండ్ల రూపంలో పార్టీకి నిధులు కట్టబెట్టడం, ప్రతిగా వాటి ప్రయోజనాలను పాలకులు నెరవేర్చడమన్నది అచ్చమైన ‘క్విడ్‌ప్రోకో’యే! వివరాలు వెల్లడించాలన్న కోర్ట్ తాజా ఆదేశంతో ఈ ‘నీ కిది... నాకది’ పందేరాలు బట్టబయలవుతాయి. ఈ తలనొప్పి ఎందుకని బాండ్ల బదులు నేరుగా డబ్బులిస్తే అడ్డుకోవడం అప్పుడైనా, ఇప్పుడైనా కష్టమే. అందుకే, కోర్ట్ తీర్పు సర్వ రోగ నివారిణి కాకున్నా, ఎన్నికల నిధుల్లో పారదర్శకతనే అంశంపై మరోసారి చర్చ రేపగలిగింది. లెక్క తీస్తే, 2017–18 నుంచి 2022–23 వరకు 12 వేల కోట్ల పైచిలుకు విలువైన ఎన్నికల బాండ్లు అమ్మకమయ్యాయి. చిత్రమేమిటంటే అందులో 55 శాతం, అంటే రూ. 6,564 కోట్ల మేర నిధులు అధికార బీజేపీకే దక్కాయి. ఈ అయిదేళ్ళలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు దక్కిన బాండ్లు 9.5 శాతమే. మరో మాటలో రూ. 1,135 కోట్లే. ఈ మొత్తం డబ్బులు ఎవరిచ్చారు, ఎంతిచ్చారన్నది దేవరహస్యం. ఆ గోప్యత చెల్లనేరదన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. ఆ ఆదేశాలను పాటిస్తామంటూ భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి, ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ) సైతం రోజుకో రకం అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదట్లో బాండ్లపై అభ్యంతరం చెబుతూ, ఇది వట్టి తిరోగమన చర్య అని పేర్కొంది. కారణాలేమో కానీ, తీరా సుప్రీమ్ ముందు తన మాట మార్చేసి, ఎన్నికల బాండ్లను సమర్థించింది. పథకాన్ని ఆపు చేయరాదని వాదించింది. ఇప్పుడేమో సుప్రీమ్ ఆదేశాల్ని పాటి స్తామంటోంది. వెరసి, బాండ్లపై ఈసీకి ఏపాటి నిర్దిష్టమైన అభిప్రాయముందో అర్థమైపోతోంది. చెల్లిస్తున్న వారి పేరేమీ లేకుండా ఏ సంస్థ అయినా వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల వంతున ఎంతైనా ఓ పార్టీకి ఇచ్చే వీలు ఈ బాండ్ల పథకం కల్పించింది. అందుకు తగ్గట్టే, అపరిమిత రాజకీయ విరాళాలకు వీలు కల్పిస్తూ, కంపెనీస్ యాక్ట్‌లోని 182వ సెక్షన్‌ను 2017లో ప్రభుత్వం సవరించింది. గతంలో రూ. 20 వేల పైన వచ్చే ప్రతి విరాళానికీ పార్టీలు రికార్డులు సమర్పించాలని ఆదాయపన్ను చట్టం. పాలకులు దాన్నీ మార్చేశారు. ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తం ఎంతన్నది చెబితే చాలంటూ ఎన్నికల బాండ్లకు మినహాయింపు కల్పించారు. ఈ సవరణల్ని సుప్రీమ్ తాజాగా కొట్టేసింది. గత మూడేళ్ళలో సదరు సంస్థకొచ్చిన సగటు నికర లాభంలో 7.5 శాతమే గరిష్ఠంగా ఇవ్వాలనే మునుపటి పరిమితిని మళ్ళీ తెచ్చింది. అపరిమిత కార్పొరేట్ ఫండింగ్ దోవలో డొల్ల కంపెనీలతో అక్రమ ధనాన్ని పార్టీలకు చేరవేయకుండా అడ్డుకట్ట వేసింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ. 2,994 కోట్లని చెబుతున్నా, అసలు ఖర్చు 55 – 60 వేల కోట్లని అంచనా. అందుకే, ఎన్నికల బాండ్ల కథ గోప్యంగా సాగుతోందంటూ సుప్రీమ్ కొట్టేయడం సరైనదే! నిర్ద్వంద్వమైన, సమగ్రమైన ఆ తీర్పును స్వాగతించాల్సిందే! అంత మాత్రాన ఇకపై అంతా పారదర్శకత నెలకొంటుందనుకోలేం. అలాగే, సుప్రీమ్ మాట సర్కార్‌కు ఎదురుదెబ్బే అయినా, కావాలనుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్లో చట్టం ద్వారా కొత్త రూపంలో బాండ్లకు పాలకులు తెర తీసినా ఆశ్చర్యం లేదు. అయితే, కోర్ట్ తన పని తాను సమర్థంగా చేసింది గనక, ఇప్పుడా తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని, ఆచరణలో పెట్టాలి. చట్టబద్ధమైన ఎస్బీఐ, రాజ్యాంగబద్ధమైన ఈసీ అందులో ముందుండాలి. ఎన్నికల్లో అక్రమ ధనాన్ని అడ్డుకట్టాలంటే పాలకులు సైతం చిత్తశుద్ధి చూపాలి. పార్టీ విరాళాలిచ్చేందుకు వీలుగా సంస్థలు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు లాంటి ఆలోచన చేయాలి. పారదర్శకత నెలకొల్పడం పెను సవాలే కానీ, ప్రజలు, పార్టీలు, బడా సంస్థలు... అందరూ త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. సుప్రీమ్ తీర్పు ఆ దిశలో తొలి అడుగైతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది! -
పైజామా జేబులో బొంగరం
‘అర్ధరాత్రి సమయం. అమ్మ నగలన్నీ వేసుకుంది. తక్కినవి మూట కట్టుకుంది. నాకంటే ఆరేళ్లు చిన్నది చెల్లెలు. దానికి పాలు బాగా తాగించి భుజాన వేసుకుంది. నేను మాత్రం నాకున్న ఒకే ఒక ఆస్తి బొంగరాన్ని నా పైజామా జేబులో పెట్టుకున్నాను. అందరం కాందిశీకులంగా మారి ఆవలి సరిహద్దుకు బయలుదేరాం. చీకటి. భీతి గొలుపుతున్న అరణ్యమార్గం. అందరి కళ్లు చీమ చిటుక్కుమన్నా రెప్పలు విప్పార్చి భయంతో, కోపంతో మొరిగినట్టుగా చూస్తున్నాయి. నడిచాం.. నడిచాం.. అమ్మ రక్తపు వాంతి చేసుకుంది. చెల్లి భుజం నుంచి జారి మట్టిలో కలిసిపోయింది. నేను నా బాల్యాన్ని అక్కడే భూస్థాపితం చేసి ఇటువైపుకు చేరుకున్నాను’... గుల్జార్ కవిత ఇది. దేశ విభజన సమయంలో అతనికి పన్నెండు పదమూడేళ్లు ఉంటాయి. నేటి పాకిస్తాన్ లోని జీలం నుంచి వాళ్ల కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. రెఫ్యూజీ క్యాంప్‌లో గుల్జార్ బాల్యం గడిచింది. ఇక్కడకొచ్చాక కూడా వీళ్లుంటున్న రోషనారా రోడ్, సబ్జీమండీల్లో నరమేధాన్ని చూశాడు. ‘మా స్కూల్లో రోజూ ప్రేయర్ చదివే కుర్రాణ్ణి చంపారు’ అంటాడు. ‘సబ్జీమండీలో శవాల మీద పాత కుర్చీలు, విరిగిన మంచాలు వేసి తగలబెట్టడం చూశాను’ అంటాడు. ‘ఇరవై ముప్పై ఏళ్లు అవే పీడకలల్లో వెంటేడేవి’ అని వగస్తాడు. సిక్కులు కష్టజీవులు. గుల్జార్ తండ్రి టోపీలు, చేతిసంచుల దుకాణం తెరిచాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన సిక్కులు ‘మా ఊరివాడు ఒక్కడు కనిపించినా చాలు’ అని వెతుక్కుంటూ తిరిగేవారు. కొందరు గుల్జార్ తండ్రి దగ్గరకు వచ్చి గుల్జార్ వాళ్ల ఇంట్లోనే తల దాచుకునేవారు. ‘మా ఇల్లే ఒక రెఫ్యూజీ క్యాంప్‌గా మారింది. నాకు పడుకోవడానికి చోటే లేదు’ అని చెప్పుకున్నాడు గుల్జార్. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. గుల్జార్‌కు కరెంటు లేని స్టోర్‌రూమ్ ఇవ్వబడింది. ఒకడే కుర్రవాడు.. తోడుగా లాంతరు. వీధి చివరకు వెళ్లి పావలా ఇస్తే వారంలో ఎన్ని పుస్తకాలైనా అద్దెకు తెచ్చుకోవచ్చు. అలా గుల్జార్ పఠనం స్టోర్‌రూమ్‌లో లాంతరు కింద మొదలైంది. ‘ఒకరోజు ఒక పుస్తకం అద్దెకు తెచ్చుకున్నాను. అది ఇంతకుముందు చదివిన పుస్తకాల వలే లేదు. చదివాను. మరసటి రోజు అదే రచయిత రాసిన మరో పుస్తకం చదివాను. భలే అనిపించింది. ఆ తర్వాత ఆ రచయిత సెట్ అంతా ఉర్దూలో ఉంటే తెచ్చుకుని చదివాను. దారీ తెన్నూ లేని ఒక కాందిశీక పిల్లవాడి జీవితాన్ని మార్చడానికే బహుశా ఆ రచయిత నాకు తారసపడ్డాడేమో. అతని పేరు రవీంద్రనాథ్ టాగోర్’ అంటాడు గుల్జార్. ఇంటి నిండా కాందిశీక బంధుమిత్రులు ఉండిపోవడంతో గుల్జార్‌కు జరిగిన మరో మంచి బొంబాయిలో ఉన్న సోదరుడి దగ్గర ఉండమని తండ్రి పంపించడం. అక్కడే గుల్జార్ సొట్టలుపోయిన కార్లకు పెయింట్ వేసే పని మొదలెట్టాడు. అప్పటికే అతడికి రంగులు తెలుసు. బొమ్మలు తెలుసు. కవిత్వంలోని పదచిత్రాలు తెలుసు. ‘ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ’ (పి.డబ్బ్యు.ఏ) వారాంతపు మీటింగ్‌లకు వెళ్లి కవిత్వం చదివితే సినీకవి శైలేంద్ర మెచ్చుకుని బిమల్ రాయ్‌కు పరిచయం చేశాడు. ‘కార్లకు పెయింట్ వేయడం కంటే సినిమాల్లో రాస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి’ అని బిమల్ రాయ్ ‘బందిని’లో మొదటి పాట రాయించాడు– ‘మోర గోర అంగ్ లైలె’. తర్వాత గుల్జార్ హృషీకేశ్ ముఖర్జీకి ప్రధాన అనుచరుడయ్యాడు. ఆ తర్వాత సాగిందంతా గుల్జార్ జైత్రయాత్ర. గుల్జార్ కవి, రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, సినీ కవి, మాటల రచయిత, దర్శకుడు. అనువాదకుడు, బాలల రచయిత, టెలివిజన్ డైరెక్టర్... ‘హర్ ఫన్ మౌలా’. సకల కళాకోవిదుడు. ‘నేను నా దేశవాసుల మనోఫలకం మీద కవిగా మిగలాలని కోరుకుంటున్నా’ అని అభిలషిస్తాడు గుల్జార్. అయితే మన దేశంలో పాప్యులర్ కల్చర్‌లో ఉన్న వ్యక్తి సీరియస్ సాహిత్యంలో ఎంత పని చేసినా ఎంతో ఎరుకతో వ్యవహరిస్తే తప్ప సాహిత్యముద్రను ముందువరుసలో పొందలేడు. గుల్జార్ సాహిత్యకృషి కంటే అతని సినిమా కృషే ఎప్పుడూ ముందుకొస్తూ ఉంటుంది. గుల్జార్ కవిత్వానికి ఉన్న పాఠకుల కంటే అతని సినిమా పాటలకు ఉన్న శ్రోతలు విస్తారం కావడమే కారణం. చిత్రమేమిటంటే గుల్జార్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వచ్చినప్పుడు ఆనందించినవారు ఎందరో మొన్న ‘జ్ఞానపీఠ్’ ప్రకటించినప్పుడు సంతోషించినవారు అందరు. ఇలా ‘దాదాసాహెబ్’, ‘జ్ఞానపీఠ్’ రెండూ అందుకున్న సృజనమూర్తి మన దేశంలో ప్రస్తుతానికి మరొకరు లేరు. ‘ఎప్పుడైనా ఒంటరిగా కూచుని నా కవిత్వం మొత్తం చూసుకున్నప్పుడు ఇందులో ఇంత ఉదాసీనత ఎందుకుందా అని బెంగటిల్లుతాను’ అంటాడు 90 ఏళ్లకు సమీపిస్తున్న గుల్జార్. జీవితాన్ని, ప్రేమను, మానవీయ అనుబంధాలను, ప్రకృతి ప్రదర్శించే ఐంద్రజాలంలో పొందగల ఆనందాలను... ఊరటను, చిన్నచిన్న ఫిర్యాదులను, పెద్దపెద్ద సర్దుబాట్లను రాస్తూ వచ్చిన గుల్జార్ ఈ దేశపు వర్తమాన ముఖచిత్రాన్ని అనునిత్యం న్యూస్పేపర్లలో చూసి ఉదాసీనత చెందుతూనే ఉంటాడు. మరల మరల ప్రేమను పంచాల్సిన సంకల్పాన్ని పొందుతూనే ఉంటాడు. కత్తులు నిద్రలేచే రాత్రులు మరోమారు దేశంలో అరుదెంచకూడదని కలవరపడే గుల్జార్, పైజామా జేబులో బొంగరాన్ని దాచుకుని బుగ్గలపై కన్నీటి చారికలతో మిగిలిన మరో బాలుడి గాథ ఈ దేశం భవిష్యత్తులో వినరాదని దుఆ చేస్తాడు. హిందీని, ఉర్దూను కలిపి తాను మాట్లాడేభాషను ‘హిందూస్తానీ’గా పేర్కొనే గుల్జార్ తన పేరుకు తగ్గట్టు ఈ హిందూస్తాన్ ఒక పూలతోటై విరబూయాలని, సుగంధాలను వెదజల్లుతూనే ఉండాలని కలంతో సందేశాలను పంపుతూనే ఉంటాడు. -
విశ్వవిజేతల కార్ఖానా!
తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోని ఈ వారపు ఘటనల్లో ఎన్నదగ్గవి రెండు: పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రారంభించేందుకు సన్నాహంగా ఒక బృందం పాఠశాలల పరిశీలనకు బయల్దేరింది. రెండవది – ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్‌తో ఒక ఒప్పందం చేసుకున్నది. మొదటిది పాఠశాల విద్యకు సంబంధించినదైతే, రెండోది ఉన్నత విద్యకు సంబంధించిన అంశం. చంద్రబాబు యాచిస్తున్న పొత్తు కౌగిలిని బీజేపీ ప్రసాదిస్తుందా లేదా, జనసైనికులు ఆశిస్తున్న సీట్ల ప్యాకేజీని టీడీపీ అంగీకరిస్తుందా లేదా వగైరా పొలిటికల్ మిర్చి ముందు పై రెండు వార్తలను మీడియా చప్పిడి వార్తలు గానే పరిగణించి ఉండవచ్చు. యెల్లో మీడియా అయితే ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ యెల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది. ఒత్తిడి పెరిగింది. ఫలి తంగా దాని వార్తా ప్రాథమ్యాలు మరింత అదుపు తప్పాయి. ‘రాజధాని ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ‘ఫైల్స్ కాదు పైల్స్’ (మొలలు) అన్నారెవరో! పెత్తందారీ పైల్స్ అనే పేరు పెడితే బాగుండేదన్నారు. యెల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్టయింది. అందుకే యెల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. యెల్లో మీడియాకు తోడయిన ఇంకో కామ్రేడరీ వార్త ‘విధ్వంసం’ పేరుతో పుస్తకావిష్కరణ. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ’ అంటారు గదా! అట్లాగే పెత్తందారీ బాధ యెల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెంటికీ మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఆ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ను ప్రవేశ పెడితే ఏం ప్రయోజనముంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. వాటిని గురించి చర్చించడానికి ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామ దశ గురించిన ప్రాథమిక అవగాహన మనకు ఉండాలి. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్‌గా అవతరిస్తున్నది. ఈ మార్కెట్‌ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రించనున్నది. గ్లోబల్ విలేజి గురించి తరచూ మాట్లాడుతుంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ ఏక కుటుంబంలో ఏకైక సంధాన భాష అవసరం కూడా ఏర్పడింది. ఎలిజర్ బెన్ యెహుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచ మంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని వందేళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాషయ్యే లక్షణాలున్నాయనే భాషావేత్తలు కూడా చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లిషు చాలాదూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కార ణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసు కొనిపోవలసిన అవసరం ఉన్నది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం – ఇంగ్లిషు భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం – వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది – గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికివచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టిపుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశమంతా కలిపి కేవలం 210 అత్యున్నతస్థాయి ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన ‘భట్టీయం’ పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యాబోధన ఉంటుంది. మన సంప్రదాయ పద్ధతిలో ఇరవై ఎక్కాలు గడగడ చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేక పోవడం మనకు తెలిసిందే. భట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితోపాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యాబోధనను రాష్ట్రంలోని 40 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం (2025–26) నుంచి ఒకటో క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి ప్లస్ టూ వరకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్‌లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత (విజన్) లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారీ నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమనీ, దాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలి వేయాలనీ బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టు గానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయేవిధంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచశ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్, పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యా ర్థులు ప్రపంచ మార్కెట్లో పోటీపడటానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు. అప్పటివరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురికావలసిందేనా? అలా జరగ కూడదన్న లక్ష్యమే ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా. కేంబ్రిడ్జి, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీ రింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందు బాటులోకి వస్తాయి. కరిక్యులమ్‌లో భాగమవుతాయి. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్, వెల్త్ మేనేజిమెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తు న్నారు. ఈ వర్టికల్స్‌కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసు కున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో పది పదిహేనేళ్లు నిర్విఘ్నంగా కొన సాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు. అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితోపాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు. వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవా త్మకమైన ప్రగతిశీలతకు విత్తనాలు చల్లుతున్న శుభఘడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి. బురద చల్లాలి. విధ్వంసం జరుగుతున్నదని ఓండ్రపెట్టాలి. అభివృద్ధి ఎక్కడు న్నదని మొరగాలి. మూలశంక వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రద ర్శించాలి. ఇప్పుడదే జరుగుతున్నది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు. ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు. క్రీస్తుశకం రెండో శతాబ్దం నుంచి ఆరేడు శతాబ్దాల మధ్యకాలంలో భారతీయ మేధావులు చేసిన ఆవిష్కరణలు సామాన్యమైనవి కావు. శూన్యాంకాన్ని (జీరో) ప్రసాదించి ప్రపంచ గణితశాస్త్రాన్ని మలుపుతిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతు లను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞులైన భాస్కర – బ్రహ్మగుప్త – వరాహమిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కణాదుడు, తత్వవేత్త – రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామా ణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగశాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించినవారే. కానీ ఆనాటి విజ్ఞాన మంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానీకానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్క రణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. వందలాదిమంది శాస్త్ర వేత్తలు ఉద్భవించేవారు. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే రెండు మూడు శతాబ్దాల ముందే భారత్‌లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూర్ వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇంకా ఏమేమి జరిగి ఉండేవనేది ఒక అధ్యయనాంశం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లిష్ నేర్చుకోవద్దనీ, నాణ్యమైన విద్యను అభ్యసించ కూడదనీ పేదవర్గాలను మన పెత్తందార్లు శాసిస్తున్నారు. ఇదే దేశద్రోహం. ఈ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధ మవుతున్నారు. పెత్తందారీ – కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహ రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ...’ అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలనూ అపవిత్రం చేస్తున్నారు. పేదవర్గాలు ఈ పరిణామాలను గమనించాయి. సమరోత్సాహంతో నినదిస్తున్నాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇండొనేసియాలో కొత్త ఏలిక
సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టు బుధవారం జరిగిన ఇండొనేసియా దేశాధ్యక్ష ఎన్నికల్లో రక్షణమంత్రి, వివాదాస్పద మాజీ సైనికాధికారి జనరల్ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. అభ్యర్థుల్లో మిగిలినవారితో పోలిస్తే ఓటర్లకు బాగా పరిచయమున్న నేత గనుక తొలి రౌండులో ముందంజలో ఉంటాడని అందరూ అంచనా వేశారు. కానీ నెగ్గటానికి అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల వరకూ వెళ్లగలరని ఎవరూ అనుకోలేదు. ఇండొనేసియా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికీ కనీస ఓట్లు లభించకపోతే తిరిగి పోలింగ్ నిర్వహించకతప్పదు. గతంలో అధ్యక్ష పదవికి రెండు దఫాలు పోటీచేసి ఓడిన సుబియాంటోకు తాజా ఎన్నికల్లో సానుభూతితోపాటు యువత మద్దతు పుష్కలంగా దొరికింది. అందుకే ఆయనకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. సుబియాంటో చరిత్ర ఏమంత ఘనమైనది కాదు. దేశాన్ని దీర్ఘకాలం పాలించిన తన సొంత మామ, నియంత జనరల్ సుహార్తో ప్రాపకంతో సైన్యంలో ఉన్నత పదవులకు ఎగబాకి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. 1997 నాటి విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమ యంలో దాదాపు 20 మంది విద్యార్థి నేతల అపహరణలకు సుబియాంటోయే కారణమన్న ఆరోపణ లున్నాయి. వారందరూ సైన్యం చిత్రహింసలకు బలైవుంటారని మానవ హక్కుల సంఘాలు ఆరో పించాయి. చిత్రమేమంటే ఆ తర్వాత మరో ఏడాదికే సుహార్తోను గద్దెదించటానికి సుబియాంటో తోడ్పడ్డారు. ఆ తర్వాత తానే ఆ పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరినా అది సాధ్యపడలేదు. కనీసం సైనిక దళాల చీఫ్ కావాలని కలలుకన్నా సుహార్తో స్థానంలో అధ్యక్షుడైన బీజే హబీబి అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో ఆయనపై ఆగ్రహించి కొందరు సైనికులను వెంటబెట్టుకుని అధ్యక్ష భవనంపై దాడికి సిద్ధపడ్డారు. కానీ అది వికటించి సైన్యం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఆ తర్వాత జోర్డాన్ పరారై వ్యాపారవేత్తగా అవతరించారు. 2009 అధ్యక్ష ఎన్నికల నాటికి సొంతంగా ఒక పార్టీ స్థాపించి మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమికట్టి ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. కానీ ఆ కూటమి ఓటమి చవిచూసింది. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓటర్లు తిరస్కరించారు. ఆ తర్వాతే సుబియాంటోకు జ్ఞానోదయమైంది. రెండుసార్లూ తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో సంధి చేసుకుని రక్షణమంత్రి అయ్యారు. ఈసారి సైతం జోకోవియే పోటీచేసేవారు. కానీ అధ్యక్ష పదవికి వరసగా రెండుసార్లు మించి పోటీ చేయకూడదన్న నిబంధన కారణంగా ఆయన రంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఇండొనేసియా మూడో అతి పెద్ద ప్రజాతంత్ర దేశం. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా వున్న దేశం. ఆగ్నేయాసియాలో అతి పెద్ద పారిశ్రామిక దేశంగా ఒకప్పుడున్నా 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో దెబ్బతింది. ఆ తర్వాత క్రమేపీ వృద్ధి సాధిస్తూ 2012 నాటికి జీ–20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి వైపు దూసుకుపోతున్న నాలుగో అతి పెద్ద దేశంగా ఎదిగింది. 2020లో కోవిడ్ బారిన పడటమేకాక, ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నా నిరు ద్యోగం, అధిక ధరలు వేధిస్తూనే వున్నాయి. దానికితోడు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు తగాదాలున్నాయి. అయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకూ ఆ వివాదం అడ్డురాలేదు. అటు అమె రికా, భారత్‌లతో సాన్నిహిత్యం సాగిస్తూ ఇండొనేసియా ఆర్థికంగా పుంజుకుంటోంది. విదేశీ పెట్టు బడులను ఆకర్షిస్తోంది. అయితే దీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, ఉద్యమ చరిత్రగల ఇద్దరు నేతలను కాదని మాట నిలకడ, సిద్ధాంత నిబద్ధత లేని సుబియాంటోకు ఈ స్థాయిలో ప్రజలు నీరాజనాలు పట్టడం ఆశ్చర్యకరమే. యువతలో సుబియాంటో పేరు మారుమోగటానికి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. సర్వే నిర్వహించిన సంస్థలకు ఓటర్లు... మరీ ముఖ్యంగా యువ ఓటర్లు ఆయన గత చరిత్ర తమకు అనవసరమని చెప్పటం సుబియాంటోకున్న జనాకర్షణను తెలియజేస్తుంది. గతంలో దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన రెండుసార్లూ తన సైనిక గతాన్ని ఘనంగా చెప్పుకున్న సుబియాంటో ఈసారి ఆ జోలికి పోలేదు. సైనికాధికారిగా పనిచేసిన కాలంలో తూర్పు తైమూర్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారిని హతమార్చటం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యమించిన విద్యార్థి నేతలను మాయం చేసి వారి ప్రాణాలు తీయటంవంటి అంశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయనపై నిషేధం కూడా విధించాయి. మూడో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండొనేసియాలో క్రమేపీ వ్యవస్థలు బలహీనపడు తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సుబియాంటో తరఫున ఉపాధ్యక్ష పదవికి నిలబడిన 36 ఏళ్ల గిబ్రాన్ నేపథ్యమే ఈ సంగతి చెబుతుంది. కనీసం 40 ఏళ్లుంటే తప్ప ఉపాధ్యక్ష పదవికి పోటీచేయటానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా రాజ్యాంగ న్యాయ స్థానం చీఫ్ జస్టిస్‌గా వున్న గిబ్రాన్ మామ ఈ నిబంధనను సవరించి అతనికి సాయపడ్డాడు. దీనిపై ఆందోళన చెలరేగి చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాల్సివచ్చినా, ఆ తీర్పు మాత్రం రద్దుకాలేదు. 20 కోట్ల మంది ఓటర్లలో అత్యధికుల మనసు గెలుచుకున్న సుబియాంటో అంతంతమాత్రంగా వున్న వ్యవస్థలను మరింత బలహీనపరుస్తారని ఆయన ఎన్నికల ప్రసంగాలే చెబుతున్నాయి. మానవ హక్కుల చార్టర్, రాజ్యాంగ న్యాయస్థానం వంటివి కనుమరుగైతే ఇండొనేసియా తిరిగి నియంతృత్వంలోకి జారుకుంటుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజల అప్రమత్తతే ఆ ప్రమాదాన్ని నివారించాలి. -
బంధం బలపడుతోంది!
ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్‌లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్‌లోని వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్‌సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్‌లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్‌దేశాన్ని సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్‌సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట. అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్ ప్రపంచానికీ, ఇజ్రాయెల్‌కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. ఖతార్ సైతం భారత్‌లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్ – ఖతార్‌ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి. ఇంధనం, డిజిటల్ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్ – అరబ్ ఎమిరేట్స్ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి. -
వలసపోయిన మందహాసం
పురుటిలోనే సంధి కొట్టింది. కేంద్రంలోని అధికార ఎన్డీఏకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి పరిస్థితి ఒక్క మాటలో అదే. ఏడాదైనా కాక ముందే... ఎన్నికలు మరో రెండు నెలల దూరమైనా లేక ముందే... ఆ కూటమి అంతర్గత కుమ్ములాటలతో చతికిలపడిన పరిస్థితి. బిహార్ నుంచి మహారాష్ట్ర దాకా కూటమి నుంచి వలసపోతున్న నేతలు, సీట్ల పంపిణీ సమస్యలతో ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్న పార్టీలను చూస్తుంటే ఆ మాట అక్షరసత్యమని అర్థమవుతోంది. కొద్ది వారాల క్రితం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ‘ఇండియా’ కూటమికి గుడ్‌బై చెప్పి, ఎన్డీఏ గూటికి తిరిగొచ్చారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి, సోమవారం అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో కూడా నెగ్గారు. బిహార్‌లోనే కాదు... మహారాష్ట్రలోనూ ‘ఇండియా’ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మాజీ ఎంపీ మిళింద్ దేవరా గత నెలలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని వదిలేసి, శివసేనలో చేరారు. అది జరిగిన కొద్ది వారాలకే కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ హస్తాన్ని విడిచిపెట్టి, కమలం చేత ధరించారు. ఇలా సొంత కూటమిలోనే సవాలక్ష తలనొప్పులతో ఎన్నికలు రాకముందే బలహీనమైపోయింది. ఎన్డీఏకు సరైన ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పిన మాటలు రోజు రోజుకూ నీరుగారుతున్నాయి. ఈ దుఃస్థితికి కారణం ‘ఇండియా’ కూటమి పక్షాల స్వయంకృతం కొంతయితే, భారతరత్న పురస్కారాలు – ఈడీ – సీబీఐ లాంటి సామ దాన భేద దండోపాయాలతో పరవారిని కూడా తమ వారిని చేసుకొనేలా బీజేపీ నడుపుతున్న చాణక్య తంత్రం మరికొంత. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ కండువాలు మార్చే సీజన్ ప్రబలుతోంది. అధికారం, ఎన్నికల్లో విజయాలే పరమావధిగా ఒకప్పటి ‘ఆయా రామ్, గయా రామ్’ సంస్కృతిని బీజేపీయే మళ్ళీ యథేచ్ఛగా పెంచిపోషిస్తోందనే విమర్శ బలంగానే వినిపిస్తోంది. గమ్మత్తేమిటంటే, కీలక నేతలే కాదు... కూటములు మారుస్తున్న పార్టీలదీ అదే సంస్కృతి, అదే సరళి. నిరుడు బీజేపీని అడ్డమైన మాటలూ అని బయటకు వెళ్ళిన నితీశ్, ఆయన జేడీయూ ఇవాళ మళ్ళీ అదే కమలం పార్టీ చంకనెక్కారు. కొత్త కూటమితో మళ్ళీ సీఎం సీటులో కూర్చున్నారు. మహారాష్ట్ర సీఎం సహా అనేక ఉన్నత పదవులను అనుభవించిన అశోక్ చవాన్ 38 ఏళ్ళ కాంగ్రెస్ సాహచర్యాన్ని వదులుకొని, కమలనాథుల పంచన చేరారు. అవినీతి ఆరో పణల్ని ఎదుర్కొంటున్న ఆయన తీరా కాషాయ వస్త్రం కప్పుకొన్న మరునాడే రాజ్యసభ అభ్యర్థి కాగ లిగారు. ఎవరెప్పుడు ఎటుంటారో, తిరిగి వదిలొచ్చిన పార్టీలోకే వెళతారో తెలియకపోవడంతో ఇప్పుడు ‘ఆయా రామ్... గయా రామ్... మళ్ళీ ఆయేగా రామ్’ అనేది తాజా ఛలోక్తి అయింది. నిజానిజాలేమో కానీ, మధ్యప్రదేశ్‌లో మరో మాజీ సీఎం సైతం కాంగ్రెస్ గూడ్స్ బండి దిగిపోయి, బీజేపీ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతారని వార్త. వ్యక్తులు వెళ్ళిపోయినా, వ్యవస్థలు శాశ్వతమనే మాట నిజమే. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం కానీ, ‘ఇండియా’ కూటమి కానీ ముందున్న సవాళ్ళపై లోతుగా ఆలోచిస్తున్నాయా అన్నది ప్రశ్న. పార్టీని విడిచిపెట్టిపోయే ముందు రోజు సైతం అశోక్ చవాన్ రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసే కీలక సమావేశంలో ఉన్నారంటే, చుట్టుపక్కల ఏం జరుగుతోందో పార్టీ చూడలేకపోతోందని అనుకోవాలా? ఒకపక్క బీజేపీ కొత్త కూటములు కట్టడంలో, పాత దోస్తీలు వదిలించుకోవడంలో చాలా చులాగ్గా వ్యవహ రిస్తోంది. కాంగ్రెస్ మాత్రం కనీసం ఎన్నికల్లో పోటీకి సీట్ల పంపిణీలో సైతం అడుగులు ముందుకు వేయలేకపోవడం విచిత్రం. గడచిన పక్షం రోజుల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కానీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కానీ ఏకపక్షంగా తామే అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారంటే ఏమనాలి? చివరకు ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు మాత్రం ఇస్తామనే స్థాయికి తెగించిందంటే ‘ఇండియా’ కూటమిలో సయోధ్య ఏమున్నట్టు? పార్టీల మధ్య వలసలు వెక్కిరిస్తుంటే, మరోపక్క ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చలు కరవై, చట్టసభలు సైతం గౌరవం కోల్పోవడం మరో విషాదం. 1990 తర్వాత పార్లమెంట్ పనితీరు నానాటికీ తీసికట్టు నాగంభొట్లుగా మారింది. ఇటీవలే ఆఖరుసారి సమావేశమైన ప్రస్తుత 17వ లోక్‌సభలో అసలు డిప్యూటీ స్పీకర్ నియామకమే జరగలేదు. సాంప్రదాయికంగా ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి అనేదే భర్తీ కాకుండా అయిదేళ్ళు గడిచిపోవడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే, ప్రతిపక్ష ఎంపీలలో 70 శాతానికి పైగా సస్పెన్షన్‌లో ఉండగా కీలకమైన నేర సంస్కరణల చట్టాల లాంటివి ఆమోదం పొందాయి. ఒకే ఒక్క ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వడం తప్ప, ఏ ప్రశ్నకూ ప్రధాని మౌఖికంగా జవాబివ్వని లోక్‌సభా ఇదే. గద్దె మీది పార్టీలతో సంబంధం లేకుండా గత 30 ఏళ్ళుగా పెరిగిన ధోరణికి ఇది తార్కాణం. ఈ పరిస్థితులకు ఎవరిని తప్పుబట్టాలో, ప్రజలు ఏ పార్టీ వైపు ఆశగా ఎదురుచూడాలో తెలియని పరిస్థితి. మోదీ తరహా రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘ఇండియా’ కూటమి వైపు చూడవచ్చని కొందరు ఆశపడ్డా, ఇప్పుడదీ అంతంత మాత్రమేననే భావన కలుగుతోంది. నిజాలు ఏమైనా, అయోధ్య, అబూధాబీల్లో ఆలయాలతో అధికసంఖ్యాకుల్లో అనుభూతిపరంగా మార్కులు కొట్టేస్తున్న మోదీతో పోటీపడాలంటే ప్రతిపక్ష కూటమి ఇకనైనా కళ్ళు తెరవాలి. బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే, ఎంత మంచిదైనా ఆఖరి నిమిషపు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లు చాలవని రాహుల్ గాంధీ లాంటివారు గ్రహించాలి. కూటమిలో ఐక్యత కావాల్సిన కీలక క్షణాల్లో, నిర్ణయాలు తాత్సారం చేస్తే ఫలితాలు చేదుగా ఉంటాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, త్వరపడి తగు చర్యలు తీసుకోకపోతే... ‘ఇండియా’ కూటమి ఎన్నికల్లో పోటీకి ముందే చేతులెత్తేయాల్సి వస్తుంది. -
దౌత్య విజయం
అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్ అమీర్‌కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్ సిబ్బందిని ఖతార్ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు సోమ \వారం స్వదేశానికి చేరుకోగా, ఎనిమిదో వ్యక్తిని సైతం సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏణ్ణర్ధం పైగా అక్కడి జైలులో మగ్గుతూ, మరణదండనతో మృత్యుముఖం దాకా వెళ్ళి, చివరకు అన్ని అభియోగాల నుంచి విముక్తమై వారు తిరిగి రావడం అసాధారణం. ఇది భారత దౌత్య విజయం. బుధవారం ఖతార్‌లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్న వేళ వెలువడ్డ ఈ ప్రకటన విశేషమైనది. అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యానికీ, అరబ్ దేశాలతో మనం నెరపుతున్న స్నేహసంబంధాల సాఫల్యానికీ ఇది ఓ మచ్చుతునక. జరిగిన కథలోకి వెళితే, విడుదలైన ఈ 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినవచ్చాయి. అందులో నిజం లేదంటూ, వారిని విడుదల చేయాలని భారత్ ప్రయత్నిస్తూ వచ్చింది. గత ఏడాది కాలంగా భారత విదేశాంగ శాఖ అజెండాలో ఓ ప్రధానాంశం – ఈ నౌకాదళ మాజీ అధికారుల విడుదల. అందుకు తగ్గట్టే మంత్రిత్వ శాఖలో సంబంధిత విభాగం, అలాగే ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం నిర్విరా మంగా శ్రమించాయి. ప్రచారానికి దూరంగా తమ పని తాము చేస్తూ, చివరకు ఆశించిన ఫలితాన్ని సాధించాయి. విదేశాంగ శాఖ గల్ఫ్ డివిజన్‌కు మునుపు సారథ్యం వహించిన విపుల్ గత ఏడాది ఖతార్‌కు వెళ్ళి, ఆ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టడం సైతం కలిసొచ్చింది. ఆయన సంబంధిత వర్గాలన్నిటితో మాట్లాడి, ఒప్పించగలిగారు. అదే సమయంలో, జాతీయ భద్రతా సల హాదారైన అజిత్ దోవల్ సారథ్యంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం సైతం ఖతార్ రాజ ధాని దోహాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగించింది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహారం నడి పిస్తూ, మన మాజీ అధికారులు విడుదలై, తిరిగివచ్చేవరకు కథను గుట్టుగా నడిపించడం విశేషం. అసలు ఈ వివాదం ఏణ్ణర్ధం క్రితం మొదలైంది. 2022 ఆగస్ట్ 30న ఈ 8 మందిని అరెస్ట్ చేసి, ఏకాంతవాస శిక్ష విధించారు. ఖైదీలుగా ఉన్న మనవాళ్ళను ఆ ఏడాది అక్టోబర్ మొదట్లోనే భారత దౌత్య సిబ్బంది కలిశారు. నిజానికి, అరెస్టయినవారిలో అధికులు దహ్రా గ్లోబల్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు పనిచేస్తూ వచ్చారు. ఖతారీ నౌకాదళంలో ఇటాలియన్ యూ212 రహస్య జలాంతర్గాముల్ని ప్రవేశపెట్టడంలో సాయపడేందుకు వారు ఖతార్‌కు వచ్చారన్నది కథనం. జైల్లో పడ్డ తమ సిబ్బందికి సాయం చేసేందుకు సదరు ప్రైవేట్ సంస్థ సీఈఓ సైతం ప్రయత్నించక పోలేదు. కానీ, ఆయనా జైల్లో పడి, రెండు నెలలు ఒంటరి చెరను అనుభవించి, అనంతరం జామీను మీద బయటపడాల్సి వచ్చింది. గడచిన 2023 మార్చి వచ్చేసరికి మన అధికారులు పెట్టుకున్న పలు జామీను అభ్యర్థనలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఆ నెలాఖరున వారిపై ఖతార్ చట్టప్రకారం విచారణ మొదలైంది. చిత్రమేమంటే ఈ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ నవ్‌తేజ్ గిల్ లాంటి వారు భారత నేవల్ అకాడెమీ నుంచి పట్టభద్రులైనప్పుడు తమ ప్రతిభా ప్రదర్శనకు ఏకంగా రాష్ట్రపతి స్వర్ణపతకం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో బోధకుడిగా పనిచేశారు. మొదట్లో గత అక్టోబర్‌లో ఈ నౌకాదళ మాజీ అధికారులందరికీ మరణ దండన విధించారు. ఆపైన మన దౌత్య యత్నాలు, భారత ప్రభుత్వ జోక్యం కారణంగా దాన్ని నిరవధిక జైలు శిక్షగా మార్చారు. బందీలుగా ఉన్న అధికారుల క్షేమం కోసం మన దేశం ఖతార్ అమీర్ కార్యాలయంతో సంప్రతింపులు సాగిస్తూ వచ్చింది. గత ఏడాది దుబాయ్‌లో ‘కాప్–28’ సదస్సు వేళ భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇరు ప్రభుత్వాధినేతల స్నేహబంధం చివరకు పరిష్కారం చూపింది. మరోపక్క వీరు పనిచేసిన దహ్రా గ్లోబల్ సంస్థ నిరుడు మేలోనే దోహాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది. ఆ సంస్థలో అత్యధికులు భారతీయులే. వారు అప్పుడే భారత్‌కు తిరిగొచ్చేశారు. లెక్కచూస్తే, ఒక్క ఖతార్‌లోనే 8 లక్షల మంది భారతీయులు, 6 వేల భారతీయ కంపెనీలున్నాయి. రెండేళ్ళ క్రితమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.03 బిలియన్ డాలర్లుంది. ఇక, భారత్ చేసుకొనే ద్రవీభూత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే! వచ్చే 2048 దాకా ఆ దిగుమతుల కోసం 78 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని గత వారమే ఖతార్‌తో భారత్ కుదుర్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు కలిసొచ్చాయి. మొత్తం పశ్చిమాసియా సంగతికొస్తే 90 లక్షల మంది భారతీయులున్నారు. కొన్నేళ్ళుగా పశ్చి మాసియాలో, ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్‌ల వైపు భారత్ నిరంతరం స్నేహహస్తం చాస్తోంది. తాజా దౌత్య పరిష్కారం మన ఆ స్నేహానికి ఫలితం. పెరుగుతున్న భారత ప్రాబల్యానికి నిదర్శనం. ఈ ప్రాంత దేశాలన్నీ ఇంధన సరఫరాలో భారత్‌కు చిరకాలంగా సన్నిహితమైనా, విదేశాంగ విధానంలో పాకిస్తాన్ వైపు మొగ్గేవి. కొన్ని దశాబ్దాలుగా పాక్ అదృష్టం తలకిందులవడంతో, ఆర్థిక, భద్రతా అంశాల రీత్యా ఈ ప్రాంతంలో భారత్‌తో బలమైన సంబంధాలు అవసరమనే ఎరుక వాటికి కలిగింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో సమష్టి దౌత్య, భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, భారత్‌ను అవి ఇప్పుడు విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తున్నాయి. నౌకాదళ అధికారుల విడుదలకు అదీ ఓ కారణమే. ఏమైనా ఇదే అదనుగా పశ్చిమా సియా దేశాలతో భారత్ దోస్తీ బలపడితే, మరిన్ని దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు తథ్యం. -
ఇంకా వుంది!
ఎక్కడైనా ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం. పాకిస్తాన్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోని ఇటీవలి 12వ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి, తాజా ఫలితాలు చూస్తే... ఎన్నికలు ముగిశాయి కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రమేమిటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లు ఇరువురూ ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవడం! ఇక, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది. పోలింగ్‌కు ముందూ, తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికలను ప్రహస నంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని, ‘హైబ్రిడ్’ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్‌లో రిగ్గింగ్ సాగకుంటే, జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఇమ్రాన్‌కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ గద్దెనెక్కినా, కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది. ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒకపక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి, కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా, ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ)కు ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీతో జతకడితే తప్ప... సాంకేతికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడక పోవడం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టు వార్త. వేరొకపక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసి, జాతీయ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ... పాకిస్తాన్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు, చివరకు వాటి పర్యవసానాలు ఏమైనప్పటికీ... ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయడంలో పేరుమోసింది గనక ఎన్నికలు తూతూమంత్రమనీ, ప్రధాని ఎవరు కావాలన్నది మిలటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది. అందుకు తగ్గట్టే, గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్‌కు తరలివచ్చారు. వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి, ప్రస్తుతం దాని కరుణాకటాక్షాలకు దూరమైన ఇమ్రాన్, ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్‌లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. ఇమ్రాన్‌ను పోటీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్నా సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ, ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో నవాజ్ షరీఫ్ ‘పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ – నవాజ్’ (పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ) నిలిచాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడినా ప్రజాతీర్పు ఇమ్రాన్ వైపుందనేది స్పష్టం. దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. పీటీఐ సైతం తమ సమర్థనతో గెలిచినవారంతా పార్లమెంట్లో కలసి కట్టు కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా, ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగుదేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగడం వాంఛనీయం కాదు. రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో పీఎంఎల్, పీపీపీల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేర సారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది! ‘గులామీ న మంజూర్’ (బానిసత్వాన్ని సమర్థించబోము) అని వినిపిస్తున్న నినాదాల్నీ, మంగళవారం నుంచి పీటీఐ చేపట్టదలచిన నిరసనల్నీ కొట్టేయలేం. ‘ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైం’దన్న విమర్శల్ని నిజం చేస్తే అంత కన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం... పాకిస్తాన్ ప్రజల పాలిట శాపం. సరిహద్దు సమస్యలు, మరోమారు తలెత్తిన మతపరమైన హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికరంగ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్ కథ సశేషమే! -
పాటకు పట్టం
‘పాట’ అనే మాటలో ఎన్ని ఉద్వేగాల ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగిసిపడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జలయంత్రాలో! ప్రతి రాత్రీ వసంతరాత్రిగా, ప్రతి గాలీ పైరగాలిగా, బతుకంతా పాటలా సాగాలంటాడు ఒక కవి. ఏదో ఒక పాట వింటూనే జీవితం గడుపుతాం. చెవులను, మనసును తాకి హాయి గొలిపే పాటల తుంపరలలో తడుస్తూనే జీవన రహదారిలో సాగుతాం. మరి, బతుకే పాటైన మేటి పాటగాళ్ళ సంగతేమిటి! కాలికి గజ్జె కట్టి బుజాన కంబళి వేసుకుని జీవితమే ఆటగా, పాటగా గడిపిన గద్దర్లు; పాటల వియద్గంగలో జీవితాంతం మునకలేసిన వంగపండులు, పలుకే పాటై జీవనదిలా ప్రవహించే అందెశ్రీలు, పాటను పుక్కిటపట్టి రాగమే జీవనరాగంగా బతుకును పండించుకుంటున్న గోరటి వెంకన్నలు... చెప్పుకుంటూ వెడితే ఒకరా ఇద్దరా! ఆపైన, సినీగీతాన్ని వినీలాకాశానికెత్తిన కృష్ణశాస్త్రులు, శ్రీశ్రీలు, ఆత్రేయలు, సినారేలు, ఆరుద్రలు, వేటూరులు..! పేరుకు పాటైనా తీరులు ఎన్నో! కొన్ని పాటలు జాతి మొత్తంలో ఉత్తేజపు విద్యుత్తును నింపి ఉద్వేగాల అంచుల వైపు నడిపిస్తాయి. జనగణమన లాంటి అలాంటివి జనరంజకమై జాతి గళమెత్తి పాడుకునే గీతాలు అవుతాయి. తెలంగాణ ఉద్యమంతోపాటు ఉవ్వెత్తున ఎగసిన ఉద్రేకపు పొంగు పాటగా మారి అందెశ్రీ ఆలపించిన ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రగీతం ప్రతిపత్తిని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది. పాటలో పలికించలేని రసమే లేదు. ప్రజోద్యమాల అగ్నిశిఖలలోంచి నిప్పురవ్వల్లా పుట్టుకొచ్చిన పాటే ప్రేయసీప్రియుల యుగళగీతంగా మారి మోహరాగాలతో విరితావులనీనగలదు. ‘నీవే నేనుగా ఒకటైన చోట’ ‘వలపుల పూదోట’ పూయించగలదు. మనిషైతే మనసుంటే కనులు కరగాలని, కరుణ కురియా లని, జగతి నిండాలని ప్రబోధిస్తూ; ప్రకృతి సమస్తంలో ఇమిడి ఉన్న కారుణ్యాన్ని జాలిజాలిగా కరిగే నీలిమేఘం మీదుగా రూపుగట్టి మనల్ని నిలువునా కదిలించి కరిగించగలదు. తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోని ఉదయరాగానికి చూపుల్ని, హృదయగానానికి చెవుల్ని అప్ప జెబుతూనే కాలగర్భం లోలోతులకు వెళ్లి వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభ వేళను – మలయ మారుతాలతో, పుడమి పలుకు స్వాగతాలతో, తారకలే మాలికలై మలచిన కాంతితోరణాలతో ఉత్సవీకరించి మన కళ్ళముందు నిలపగలదు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్య రారా’ అంటూ; ‘అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్ద కదే... ఒంటరి బతుకైనా ఓపగలుగు తీపికదే’ అంటూ పాట లాలిగా జోలగా మారి వాత్సల్య రసంలో ఓలలాడించగలదు. పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ. నేల పొరలను చీల్చుకుని విత్తనం రెండు ముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్ళల్లో కవలశిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక అంటూ పాటను సృష్ట్యాదిన ప్రతిష్ఠిస్తారు. గగనాంతరసీమ గానసమూహమై పాటందుకుంటే, నేల రంగస్థలమై ఆటందుకుందంటారు. ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్న వేళ జంతుధ్వనుల నుంచి పుట్టిన సప్తస్వరాల అన్వయింపే ఏ పాట అయినా అంటూ పాటల భిన్నత్వంలోనే ఏకత్వాన్ని రూపిస్తారు. పురామానవ పరిణామ కోణం నుంచి గ్రీకు సాహిత్యాన్ని, ఇతర యూరోపియన్ భాషల సాహిత్యంతో బేరీజు వేస్తూ చర్చించిన జార్జి థామ్సన్ అనే పండి తుడు కూడా విచిత్రంగా ఇలాగే పాటను సాహిత్యపు ఆదిమదశలో నిలుపుతాడు. ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికి భిన్నంగా గ్రీకు కవిత్వం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ కవిత్వం మన వాల్మీకి రామాయణంలానే తంత్రీలయ సమన్వితంగా ఉంటుంది. వ్యాసభారతం కూడా వాగ్రూపంలో విస్తరించి చివరికి లిఖితరూపం పొందినదే. అలా చూసినప్పుడు నేటి మన పాటకవులందరూ వ్యాసవాల్మీకి పరంపరలోకే వస్తారు. లిఖితరూపంలోకి వచ్చాక కవిత్వం కాళి దాసాదులతో భిన్నమైన మలుపు తిరిగింది. తెలుగులో ఆధునిక కవిత్వం ఆదిలో పాటకు ప్రతిరూపంగా ఎలా వెలువడిందో వివరిస్తూ, అనంతరకాలంలో తెలుగునాట పాటకు ప్రచురణార్హత, కవితకు శ్రవ్యార్హత లేకుండా చేశారని అంబటి సురేంద్రరాజు ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటితో చదవడం కన్నా, చెవితో వినడమే కవితకు స్వాభావికమంటాడు. నిన్నమొన్నటి వరకు ఐరిష్ కవిత్వం ప్రధానంగా ఆశుసంప్రదాయాన్నే అనుసరించిందని జార్జి థామ్సన్ కూడా చెబుతూ; మొదట అచ్చులో చదివిన కొన్ని ఐరిష్ కవితలను ఆ తర్వాత ఒక రైతుగాయకుని నోట వినడం తనకు అపూర్వమైన అనుభవంగా వర్ణిస్తాడు. నిరక్షరాస్యులైన ఐరిష్ గ్రామీణుల పెదాలపై కవిత్వం నర్తిస్తూ ఉంటుందని, వారు మాట్లాడే మామూలు మాటలు కూడా కవితాత్మకంగా మారిపోతాయని అంటాడు. సామూహిక శ్రమలో భాగంగా పుట్టిన వాక్కు కవితాత్మకంగా మారి శ్రమకు చోదకంగా మారిందనీ, ఆదిమ కాలంలో పనిలో భాగంగా పాట పుట్టింది తప్ప కేవలం తీరిక సమయాల్లో పాడుకునేందుకు కాదంటాడు. పూర్తిగా లిఖిత సంప్రదాయంలో పెరిగిన కవిత్వం ఆలోచనామృతం కావచ్చు కానీ, సద్యస్పందన కలిగించే పాట ఆలోచనామృతమే కాక ఆపాతమధురం కూడా. ప్రజాక్షేత్రంలో, ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో సామాన్యజనం సహా అందరినీ ఉర్రూతలూగించే పాటకు పట్టం కట్టడం ఎంతైనా సముచితమూ, స్వాగతార్హమూ. పాట కవులందరికీ కోటిదండాలు. -
అబద్ధాలే ఆయుధాలు!
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్‌ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్‌స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది. ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ఫ్రంట్స్ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది. పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్‌కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్‌లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్‌ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్‌గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు. ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్‌లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్‌ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్‌మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్‌ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్‌గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్‌పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
లీకు వీరులకు బ్రేక్!
దశాబ్దాలుగా దాదాపు దేశవ్యాప్త జాడ్యంగా వున్న సమస్యకు సమగ్ర పరిష్కారం కోసం తొలి అడుగు పడింది. పోటీపరీక్షల్లో ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నేరగాళ్లని తేలితే రూ. కోటి వరకూ జరిమానా, అయిదేళ్ల వరకూ శిక్ష ఉంటాయని బిల్లు చెబుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీకుల్ని అరికట్టేందుకు చట్టాలున్నాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టులేదు. కేంద్రం తెచ్చిన చట్టం దాని పరిధిలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్,నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి వర్తిస్తుంది. ఈ నమూనాలో రాష్ట్రాలు కూడా చట్టాలు చేయాలని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన సూచన మంచిదే. పోటీ పరీక్షల చుట్టూ వేలాదికోట్ల వ్యాపారం నడుస్తోంది. ఒకప్పుడు ప్రధాన నగరాలు కొన్నిటిలో తర్ఫీదిచ్చే సంస్థలు కొలువుదీరేవి. అక్కడ వేలకు వేలు ఖర్చుపెట్టిన లక్షలాదిమంది విద్యార్థులు దర్శనమిచ్చేవారు. ఈమధ్య ఇది చిన్న నగరాలకూ, పట్టణాలకూ కూడా పాకింది. సివిల్ సర్వీసులు మొదలుకొని రాష్ట్రాల్లోని సర్వీసు కమిషన్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్మీ, పోలీసు విభాగాలు నిర్వహించే పరీక్షల కోసం పల్లెసీమల నుంచి సైతం వేలమంది తరలివస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలు సాధిస్తే జీవితాంతం చీకూ చింతా లేకుండా బతికేయొచ్చని నిరుద్యోగులు కలలు కంటున్నారు. కానీ ప్రశ్నపత్రాలతో వందలకోట్లు దండు కునే ముఠాలు ఈ కలల్ని కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల భర్తీని ప్రహసన ప్రాయం చేస్తున్నాయి. విజేతలవుతున్నవారిలో ఎవరు సచ్ఛీలురో, ఎవరు కాదో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతోంది. పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టే అంశంపై 90వ దశకంనుంచి ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలెట్టాయి. కానీ అవి ఆగిన జాడ లేదు. ఐఐటీ జేఈఈ ప్రశ్నపత్రాలు లీకయినట్టు తొలిసారి 1997లో మీడియాలో కథనాలొచ్చాయి. లక్నోలోని ఒక సంస్థ ఆ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలకు 12 గంటల ముందు తమ విద్యార్థులకు ఆ ప్రశ్నలు అందించినట్టు ఆ కథనాలు తెలిపాయి. ‘ఆఖరి నిమిషం టిప్స్’ ప్రోగ్రాం మాటున తమ దగ్గరున్న 700 మందిలో వందమంది విద్యార్థుల దగ్గర అదనంగా సొమ్ము వసూలు చేసి వారిచేత బట్టీపట్టించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. మొదటిరోజున ఒక విద్యార్థి తండ్రి జేఈఈ చైర్మన్‌కు ఈ సంగతి ఫిర్యాదుచేసినా కుమారుడి వైఫల్యంపై వేదనతో ఆధారం లేని ఆరోపణ చేశారని ఆయన కొట్టిపారేశారు. తమ నిర్వాకంపై ఆయనకు అంత నమ్మకం మరి! కానీ మరుసటి రోజు మ్యాథ్స్ పేపర్‌ను ఫాక్స్ చేశాక ఆయనకు తత్వం బోధపడింది. కావాలని అక్కడక్కడ చేసిన కొద్దిపాటి మార్పులు మినహా అది తమ ప్రశ్నపత్రాన్నే పోలివుందని గ్రహించి చివరి నిమిషంలో ఆ పరీక్షను రద్దుచేశారు. ఆ లీకేజీకి అప్పటి కాన్పూర్ ఐఐటీ డైరెక్టర్‌కు వున్న పుత్రప్రేమే కారణమని కథనాలొచ్చాయి. ఆ ఏడాది రూర్కీ ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశపరీక్షపై సైతం ఇలాంటి కథనాలే వెలువడినా అది రద్దు కాలేదు. ప్రశ్నపత్రాలు కైంకర్యం చేసి కోట్లాది రూపాయలు వెనకేస్తున్న మాఫియాతోపాటు కొన్ని సందర్భాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులకుండే స్వప్రయోజనాలు, అవతలివారిని రాజకీయంగా దెబ్బతీసే ఉద్దేశాలు కూడా ఈ లీకులకు కారణమైన ఉదంతాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్లో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గాలి ముద్దు కృష్ణమనాయుడు అప్పట్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకుకు నైతిక బాధ్యతవహిస్తూ తప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పార్టీ ప్రముఖ నాయకుడే ఈ లీకేజ్‌కి ఒడిగట్టారని ఆయన ఆరోపించటం ఎవరూ మరిచిపోరు. ప్రశ్నపత్రాలు సంపాదించే ఉద్యోగార్థుల్లో కొందరు గప్‌చిప్‌గా ఉండక సొమ్ము చేసుకోవాలని కక్కుర్తిపడిన సందర్భాల్లో లేదా తమ సన్నిహితులకు అందజేసినప్పుడు మీడియాకు వెల్లడై చాలాసార్లు చౌర్యం బయటపడుతుంటుంది. ఇలాంటివేమీ లేనప్పుడు అంతా సజావుగా సాగిపోతుంది. నిజాయితీపరులైన ఉద్యోగార్థులను లీకేజీ దెబ్బతీస్తుంది. ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలవుతాం. గత అయిదేళ్లలో 15 రాష్ట్రాల్లో లక్షా నాలుగువేల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయనీ, ఇందువల్ల కోటి 40 లక్షలమంది ఉద్యోగార్థుల భవి ష్యత్తు దెబ్బతిందనీ ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. ఈ లీకుల పర్యవసానంగా పరీక్ష రద్దు చేసినా, నిరవధిక వాయిదా వేసినా, పట్టించుకోకుండా వదిలేసినా దెబ్బతినేది నిరుద్యోగులే. నిరుడు తెలంగాణ, రాజస్థాన్‌లలో ప్రశ్నపత్రాల లీకు నిరుద్యోగ ప్రపంచాన్ని ఎంత కలవరపరిచిందో ఎవరూ మరిచిపోరు. అయితే లీకులకు కొన్ని సంస్థలు, వ్యకులను మాత్రమే బాధ్యులుగా చేయడంతో సరి పెట్టక రాజకీయ నాయకులు, ఏజెంట్లు, పోటీ పరీక్షల విభాగాల్లోవుండే అవినీతి అధికారులు వగైరాలతో కూడిన మాఫియా ముఠాలున్నాయని గుర్తిస్తే తాజా చట్టం మరింత కఠినతరం చేయ టానికి అవకాశం వుంటుంది. లీకు సంగతి వెల్లడికాగానే రంగప్రవేశం చేసేలా ఈడీ, సీబీఐ తరహాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థలను ఏర్పరచటంవల్ల బాధ్యులను గుర్తించటం వేగవంతమవుతుంది. ఈ కేసుల్లో నిందితుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా అవసరమే. ఇక లీకులవల్ల లబ్ధి పొందే ఉద్యోగార్థులను ఈ చట్టం పరిధినుంచి తప్పించటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి. ఈ లీకుల లబ్ధిదారుల్లో సైతం భయభక్తులుంటేనే సమస్యను అరికట్టడం సాధ్యమవుతుంది. -
పాక్‌లో ఎన్నికల ప్రహసనం
సైన్యం పడగనీడలో ఎన్నికల తంతుకు పాకిస్తాన్ సిద్ధమైంది. జాతీయ అసెంబ్లీకి గురువారం జరిగే పోలింగ్‌లో గెలిచేదెవరో ఎవరూ నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అయితే ఎప్పటిలాగే అక్కడ ప్రజాస్వామ్యం ఓటమి పాలవటం ఖాయమన్నది విశ్లేషకుల జోస్యం. 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం తన దయాదాక్షిణ్యాలతో అధికారంలోకొచ్చి తననే ధిక్కరించిన మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సైన్యం ఆగ్రహంతో వుంది. ఫలితంగా పదవి కోల్పోయి రెండు అవినీతి కేసుల్లో పదేళ్లు, పద్నాలుగేళ్ల్ల చొప్పున శిక్షపడి ఆయన జైలుపాలయ్యారు. చట్టవిరుద్ధంగా పెళ్లాడిన కేసులో మరో ఏడేళ్ల శిక్ష కూడా పడింది. భార్య సైతం ఈ కేసులో జైలుకు పోయారు. ఎలాగైతేనేం సకాలంలోనే ఎన్నికల తంతు మొదలైంది. ఇమ్రాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రికే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఏటికి ఎదురీదుతోంది. పీటీఐకి న్యాయస్థానాల పుణ్యమా అని బ్యాట్ గుర్తు గల్లంతుకాగా, పార్టీ అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగా బరిలో వున్నారు. పీటీఐ అభ్యర్థినని చెప్పుకున్నవారిని సైన్యం అరెస్టు చేసింది. వారి ఇళ్లపై దాడులకు తెగబడింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన వెంటనే అజ్ఞాతంలోకి పోగా, ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థుల కుటుంబాలకు సైతం వేధింపులు తప్పలేదు. కొందరు అభ్యర్థులు పీటీఐతో తెగదెంపులు చేసుకున్నామని ప్రకటించి, బతుకుజీవుడా అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మొన్న జరిగిన పీటీఐ ఎన్నికల ప్రచారసభలో వేదికపై రెండు డజన్లమంది బిక్కుబిక్కుమని కూర్చోగా, ఆ సభకు కనీసం మైక్ పెట్టుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదనీ, పోస్టర్లు వేయనీయలేదనీ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కథనం. యధాప్రకారం ఇక్కడి అభ్యర్థి కూడా కేసుల్లో చిక్కుకుని పరారీలో వున్నాడు. ఇమ్రాన్ ఖాన్‌ను అందలం ఎక్కించిన 2018 నాటి ఎన్నికల్లో కూడా ఆయన ప్రత్యర్థులను సైన్యం వేధించిందిగానీ, పాక్ 76 ఏళ్ల చరిత్రలో ఇంతటి అణచివేత ఎప్పుడూ లేదని పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నారు. నిరుడు ఏప్రిల్‌లో పదవీభ్రష్టుడయ్యాక ఆయన సైన్యాన్ని తూర్పారపట్టడం మొదలెట్టారు. రాజకీయ నేతలకు సైన్యంపై ఎంతటి ఆగ్రహావేశాలున్నా దాన్ని ‘అధికార వ్యవస్థ’ పదం చాటున నిందించటం అలవాటు. ఇమ్రాన్ ఆ సంప్రదాయానికి స్వస్తిపలికారు. నేరుగా సైన్యాన్నీ, దాని అధినేతలనూ ఉద్దేశిస్తూ దూషించారు. పైగా నిరుడు మే నెలలో ఇమ్రాన్‌కు అనుకూలంగా పీటీఐ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకుంది. ఊహకందని రీతిలో సైనిక కార్యాలయాలపైనా, సైనిక ఉన్నతాధికారుల నివాసాలపైనా యువజనం దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ సైన్యానికి ఆగ్రహం కలిగించాయి. తమ దయతో అందలం ఎక్కినవాడు తమనే సవాలు చేయటం సైనికాధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. రంగంలో వున్న రెండు ప్రధాన పక్షాలు– మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్–ఎన్), మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగాయి. ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీవుండటం ఆనవాయితీ. ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ నెగ్గిన 2018 ఎన్నికలొక్కటే దీనికి మినహాయింపు. చెప్పాలంటే ఇతరులకన్నా పీపీపీ చాలా ముందుగా ఎన్నికల బరిలోకి దిగింది. విస్తృతంగా ప్రచారం చేసింది. మొదట్నుంచి బలంగా వున్న సింద్ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీ బలహీనపడింది. ప్రచారావకాశాలు బొత్తిగా లేని పీటీఐకి యువత బలమైన శక్తిగా వున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారు సాగిస్తున్న ప్రచారం రెండు పార్టీలనూ బెంబేలెత్తిస్తున్నది. పాకిస్తాన్లో మరీ ముఖ్యంగా... బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వాల్లో భారీయెత్తున హింస చోటుచేసుకున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించటాన్నిబట్టి ఈ ఎన్నికల సరళి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులకు ఈసారి పెద్దగా చోటు దక్కలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ అంటున్నది. ఈ విషయంలో మీ సంజాయిషీ ఏమిటని పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి ఆ సంస్థ తాఖీదులు పంపింది. పాకిస్తాన్ పార్లమెంటులో మహిళా కోటా 22 శాతం వుంది. దీంతోపాటు చట్టప్రకారం ప్రతి పార్టీ మహిళలకు తప్పనిసరిగా 5 శాతం స్థానాలు కేటాయించాలి. అయితే ప్రధాన పార్టీలు మూడూ ఈ విషయంలో మొహం చాటేశాయి. ఎన్నికలు, గెలుపోటముల సంగతలావుంచితే... రాబోయే ప్రభుత్వానికి చాలా సవాళ్లున్నాయి. నిరుడు మే నెలలో పాకిస్తాన్ దాదాపు దివాలా అంచులకు చేరింది. ఆఖరి నిమిషంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 300 కోట్ల డాలర్ల రుణం అందించి ఆదుకుంది. ఆ సాయం కూడా వచ్చే నెలాఖరుతో ఆగిపోతుంది. దాన్ని పొడిగించేలా చూసుకోవటం, అందుకు సంస్థ విధించబోయే షరతులకు తలొగ్గటం కొత్త పాలకులకు తప్పనిసరి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికంతో సతమతమవుతున్న ప్రజానీకంలో ఇది మరింత నిరాశానిస్పృహలను రేకెత్తిస్తుంది. ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామిక రంగానికి కూడా సహకారం అందకపోవచ్చు. మన దేశంతో ఆది నుంచీ పాకిస్తాన్‌ది శత్రుపూరిత వైఖరే. దీనికితోడు దశాబ్దాలుగా పాక్‌లో వుంటున్న వేలాదిమంది అఫ్గాన్ పౌరులను నిరుడు వెనక్కి పంపటంతో తాలిబన్ పాలకులతో తగాదాలు మొదలయ్యాయి. ఇవన్నీ దేశంలో మిలిటెన్సీ మరింత పెరగటానికి దోహదపడతాయి. వీటిని ఒడుపుగా ఎదుర్కొంటూ, సైన్యానికి ఆగ్రహం కలగకుండా చూసుకోవటం కొత్త పాలకులకు జీవన్మరణ సమస్య. ఇన్ని భారాలు మోసేదెవరో తాజా ఎన్నికలు తేల్చబోతున్నాయి. -
Uttarakhand UCC Bill: ఆచరణ సాధ్యమేనా?!
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టి దేశంలోనే ఆ దిశగా తొలి అడుగేసిన రాష్ట్రమైంది. ఉమ్మడి పౌరస్మృతిపై బీజేపీ ఆరాటం ఎవరికీ తెలియంది కాదు. ఆవిర్భావం నుంచీ బీజేపీ ఆ మాట చెబుతూ వస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూసీసీ ఆ పార్టీ వాగ్దానాల్లో కీలకాంశం. రాష్ట్రాల్లో అంతకుముందూ, ఆ తర్వాతా బీజేపీ అధికారం అందుకున్నా ఎక్కడా ఉమ్మడి పౌరస్మృతి ఇలా బిల్లు రూపంలో చట్టసభ ముందుకొచ్చిన వైనం లేదు. మధ్యప్రదేశ్, అస్సాం, గుజరాత్‌లలో బీజేపీ ప్రభుత్వాలే వున్నా ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. ఆ రకంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఇతరులకన్నా చాలా ముందున్నట్టు లెక్క. దేశంలో ప్రస్తుతం ఒక్క గోవాలో మాత్రమే యూసీసీ అమల్లో వుంది. అయితే అది 1867లో అప్పటి పోర్చుగీస్ పాలకులు తెచ్చిన చట్టం. రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం యూసీసీ గురించి చర్చ జరిగింది. దాన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడగా మైనా రిటీ వర్గాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో అంతకుమించి ముందుకు కదల్లేదు. చివరకది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 44వ అధికరణ అయింది. దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటానికి రాజ్యం కృషి చేయాలని ఆ అధికరణ నిర్దేశించింది. ఆదేశిక సూత్రాలు రాజ్యం అమలు చేసి తీరాల్సినవి కాదు గనుక న్యాయస్థానాల తీర్పుల్లో ఉటంకించటానికి మాత్రమే ఆ అధికరణ పనికొచ్చింది. 1985లో షాబానో కేసులోనూ, 1995లో సరళా ముద్గల్ కేసు లోనూ వెలువరించిన తీర్పుల్లో ఉమ్మడి పౌరస్మృతి దేశ సమైక్యతకూ, సమగ్రతకూ తోడ్పడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనాలు అభిప్రాయపడ్డాయి. 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతిపై భిన్నవర్గాల అభిప్రాయాలు సేకరించి, న్యాయనిపుణులతో కొన్ని నెలలపాటు చర్చించి ‘ఈ దశలో అది అవసరమూ కాదు, వాంఛనీయమూ కాద’ని తేల్చింది. చిత్రమేమంటే ఆ తర్వాత ఏర్పడ్డ 22వ లా కమిషన్ యూసీసీపై ప్రజాభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రకటనలు విడుదల చేసింది. అది జరిగి మూడేళ్లు గడిచింది కాబట్టి ప్రజల తాజా అభిప్రాయమేమిటో తెలుసుకోదల్చుకున్నామని లా కమిషన్ సమర్థించుకుంది. ఉమ్మడి పౌరస్మృతి చుట్టూ మొదటినుంచీ వివాదాలు అల్లుకుంటూనే వున్నాయి. దాన్ని తీసుకు రావటం, సజావుగా అమలు చేయటం భిన్న మతాల, సంస్కృతులకు నిలయమైన భారత్‌లో సాధ్యంకాదన్నది కొందరి అభిప్రాయం. ముఖ్యంగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత తది తర వ్యవహారాలతో ముడిపడివుండే అంశాల్లో వేర్వేరు మతాలకు వేర్వేరు సంప్రదాయాలున్నాయి. దాదాపు అన్ని పర్సనల్ చట్టాలూ మహిళలపై వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఈ దశలో అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటం అంత సులభం కాదు. 50వ దశకంలో హిందువులకు వర్తించేలా అయిదు చట్టాలు– హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనర్ల సంరక్షకత్వ చట్టం, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, హిందూ ఆస్తి స్వాధీనతా చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాలే సిక్కు, బౌద్ధ, జైన మతస్తులకు కూడా వర్తిస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతస్తులకు వేర్వేరు పర్సనల్ చట్టాలున్నాయి. ఆ మతాల్లో కూడా కొన్ని అంశాల్లో ఏకరూపత లేదు. సంప్ర దాయాల పరంగా చూస్తే వివాహాలకు సంబంధించి హిందూమతంలోనే భిన్నమైన ఆచరణలు న్నాయి. అవిభాజ్య హిందూ కుటుంబాలకు వర్తించే పన్ను రాయితీల వంటివి వేరే మతస్తులకు వర్తించవు. ఇక ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, మిజోరంలలో స్థానిక సంప్రదాయాలను పరిరక్షించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. రాజ్యాంగంలోని 25వ అధికరణ పౌరులందరికీ ఏ మతా న్నయినా ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కును ఇస్తున్నది. ఇన్ని అవరోధాలను దాటుకుని అందరికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావటం అంత సులభమేమీ కాదు. 2019లో కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టానికి ఏమైందో మన కళ్లముందే వుంది. అందులోని కఠిన నిబంధనల కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ అవసరాలకు తగినట్టు చట్టానికి సవరణలు తీసుకొచ్చాయి. వలస పాలకుల హయాంలో రూపొంది ఇంతవరకూ అమల్లోవున్న సాక్ష్యాధారాల చట్టం, కాంట్రాక్టు చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం వగైరాలకు దాదాపు అన్ని రాష్ట్రాలూ వందల సవరణలు చేసుకున్నాయి. కనుక ‘ఒకే దేశం–ఒకే చట్టం’ ఆదర్శనీయమైనంతగా ఆచరణసాధ్యం కాదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై చర్చ, ఆమోదం మంగళవారమే ఉంటాయని ప్రభుత్వం చెప్పినా మరింత సమయం అవసరమన్న విపక్షాల వినతితో అసెంబ్లీ స్పీకర్ దాన్ని సవరించారు. ఆ సంగ తలా వుంచితే ఒక్క ఆదివాసీలు మినహా అన్ని మతాలవారికీ వివాహం, విడాకులు, ఆస్తి హక్కు వగైరా అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని బిల్లు చెబుతోంది. ఆఖరికి సహజీవనం చేసే జంటలు సైతం తమ బంధాన్ని రిజిస్టర్ చేయించుకోవాల్సిందేనని బిల్లు నిర్దేశిస్తోంది. సహజీవనంలోకి వెళ్లిన నెలలోగా రిజిస్టర్ చేసుకోవాలనీ, అలా చేయకపోతే మూడునెలల కారాగారం తప్పదనీ హెచ్చరిస్తోంది. రిజిస్టర్ చేయించుకున్న సహజీవనం ద్వారా జన్మించే సంతానాన్ని మాత్రమే సక్రమ సంతానంగా గుర్తించటం సాధ్యమంటున్నది. ఉత్తరాఖండ్‌లో నివసించే వేరే రాష్ట్రాలవారికి సైతం ఇది వర్తిస్తుందని చెబుతోంది. ఇలా పౌరుల వ్యక్తిగత అంశాల్లోకి రాజ్యం చొరబడటం సబబేనా? అసలు దేశమంతటికీ వర్తించే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని 44వ అధికరణ నిర్దేశిస్తుండగా, ఒక రాష్ట్రం అలాంటి చట్టం తీసుకురావటం రాజ్యాంగబద్ధమేనా? -
గ్రామీ అవార్డుల పంట!
సంగీతం ఎల్లలెరుగదు. అది విశ్వభాష. ఏ ప్రాంతానిదో తెలియదు... ఎవరు మాట్లాడే భాషో తెలియదు... కనీసం దాని భావమేమిటో కాస్తయినా అర్థంకాదు. కానీ శ్రుతిలయలు జతకలిసి హృదయాలను స్పృశించినప్పుడు ఆ రాగలహరిలో మునకేయని మనిషంటూ వుండరు. అందుకే ఆదివారం రాత్రి అమెరికాలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల ఉత్సవంలో మన సంగీత దిగ్గజాలు జకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, రాకేష్ చౌరాసియా అవార్డుల పంట పండించారు. విఖ్యాత తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్ ఏకంగా మూడు పురస్కారాలు అందుకున్నారు. నిరుడు జూన్‌లో శక్తి బ్యాండ్ తరఫున విడుదలైన ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు శంకర్ మహదేవన్‌తో కలిసి ఆయనకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ పురస్కారం లభించగా, సొంతంగా రూపొందించిన ‘యాజ్ వి స్పీక్’ ఆల్బమ్‌కు పాష్తో కేటగిరిలో మరో రెండు పురస్కారాలొచ్చాయి. ఇదే ఆల్బమ్‌కు ఫ్లూటు అందించిన రాకేష్ చౌరాసియాకు సైతం రెండు అవార్డులొచ్చాయి. ఎనిమిది గీతాలతో రూపొందించిన ‘దిస్ మూమెంట్’కు శంకర్ మహదేవన్ గాత్రం సమకూర్చగా, జకీర్ తబలా, జాన్ మెక్లాగ్లిన్ గిటార్, గణేష్ రాజగోపాలన్ వయోలిన్ రాగాలు అందించారు. శక్తి బ్యాండ్ విలక్షణమైనది. దాని స్థాపన వెనకున్న ఉద్దేశాలు ఉన్నతమైనవి. 1973లో మెక్ లాగ్లిన్ నేతృత్వంలో అవతరించిన ఆ బృందం ఖండంతరాల్లోని సంగీత దిగ్గజాలను ఒక దరికి చేర్చి ప్రాచ్య, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తరతరాలుగా ప్రపంచ సంగీత ప్రియులను అబ్బురపరుస్తోంది. ఇప్పుడు గ్రామీ పుర స్కారాల ఉత్సవంలో ఎందరో సంగీత దిగ్గజాల సృజనను దాటుకుని ‘దిస్ మూమెంట్’ విజేతగా నిలిచిందంటే అది సాధారణమైనది కాదు. నిజానికి శక్తి బ్యాండ్ ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి దాదాపు 45 ఏళ్లవుతోంది. అనంతరం నిరుడు ‘దిస్ మూమెంట్’ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఆల్బమ్ ఎన్నో ప్రశంసలు అందుకుంది. జకీర్ హుస్సేన్ గ్రామీ అందుకోవటం ఇది మొదటిసారి కాదు. 1992, 2009లలో కూడా గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నాడు. అరవై ఆరేళ్ల గ్రామీ పురస్కారాల చరిత్రలో ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ 1967లో తొలిసారి ఆ అవార్డు గెలుచుకుని భారత సంగీతానికి ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనను 1972, 2001 సంవత్సరాల్లోనూ గ్రామీ అవార్డులు వరించాయి. 2008లో ఏఆర్ రెహమాన్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి రెండు గ్రామీ అవార్డులు గెలుచుకోగా మన దేశానికి ఒకేసారి ఆరు పురస్కారాలు లభించటం ఇదే తొలిసారి. విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా కుమారుడిగా జకీర్ హుస్సేన్‌కు ఆ విద్య చిన్ననాడే పట్టుబడింది. పట్టుమని పన్నేండళ్ల ప్రాయానికే దేశదేశాల్లోనూ కచేరీలు ఇవ్వగలిగాడు. ఇరవయ్యేళ్ల వయసుకే ఏటా 150 సంగీత కచేరీలు నిర్వహించేంత తీరికలేని విద్వాంసుడు కావటం జకీర్ ప్రత్యేకత. 70వ దశకంలో ప్రపంచాన్ని విస్మయపరిచిన బీటిల్స్ బృందంతో జతకట్టి అందరితో ఔరా అనిపించుకున్నాడు. సంగీతంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందటమే కాదు... ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించి ఎందరినో తీర్చిదిద్దిన ఘనత జకీర్ది. తాను ప్రపంచంలో ఉత్తమ తబలా విద్వాంసుణ్ణి కాదని, ఎందరో విద్వాంసుల్లో ఒకడిని మాత్రమేనని చెప్పుకొనే వినమ్రత జకీర్ సొంతం. తనకు తబలా నేర్పాలని ఏడేళ్ల వయసులో తండ్రి అల్లారఖాను అడిగినప్పుడు ‘బేటా ఇందులో నిష్ణాతుణ్ణి కావాలని అత్యాశపడకు. ఒక మంచి విద్యార్థిగా ఎదగాలని కోరుకో. అప్పుడు మెరుగ్గా తయారవు తావు’ అని సలహా ఇచ్చారట. తండ్రికిచ్చిన మాట ప్రకారం రోజూ తెల్లారుజామున మూడు గంట లకు లేచి తబలా వాద్యంలో మెలకువలు నేర్చుకోవటం ఆయన ప్రత్యేకత. తాను పుట్టిపెరిగిన ముంబై నగరంలో అందరూ గాఢనిద్రలో వుండేవేళ ఆయన సంగీత సాధన మొదలయ్యేది. అందుకే మరో అయిదేళ్లకే కచేరీలు చేసే స్థాయికి జకీర్ ఎదిగాడు. ఈ కళలో మరేదో నేర్చుకోవాలన్న నిరంతర తపన, ఎప్పటికప్పుడు తనను తాను పునరావిష్కరించుకోవటం అనే గుణాలే జకీర్‌ను ఉన్నత శిఖరా లకు చేరుస్తూ వచ్చాయి. తన సంగీతయానంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో విద్వాంసులను కలుసు కునే అవకాశం లభించటం, వారినుంచి ఎన్నో సంగతులు నేర్చుకోవటం తన ఉన్నతికి దోహద పడ్డాయంటారు జకీర్. కొందరు సంగీత విద్వాంసులు అభిప్రాయపడినట్టు ఆయన సృష్టించిన మేళనాలు వాటికవే విప్లవాత్మకమైనవి కాదు. కానీ తన వాద్యంపై ఆయన సాధించిన అసాధారణ మైన పట్టు, సంక్లిష్ట స్వరాల మలుపులకు అనుగుణంగా అలవోకగా తబలాను పలికించటం, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకోవటం జకీర్ విశిష్టత. ఒక సంగీతకారుడన్నట్టు కళాత్మకమైన సృజనే సంగీత నియమాలను సృష్టిస్తుంది. నిబంధనలు సంగీతాన్నీ, సంగీతకారులనూ సృజించలేవు. జకీర్ అయినా, గుక్కతిప్పుకోకుండా ఎంతటి సంక్లి ష్టమైన స్వరాలనైనా ఏకబిగిన పలికించగల శంకర్ మహదేవన్ అయినా, వేణుగాన విన్యాసంలో పేరుప్రఖ్యాతులు గడించిన రాకేష్ చౌరాసియా అయినా గాల్లోంచి ఊడిపడరు. ఎప్పటికప్పుడు తమను తాము ఉన్నతపరుచుకోవాలన్న తపన, నిరంతర అధ్యయన శీలత వారిని ప్రపంచంలో ఉత్త ములుగా నిలుపుతాయి. ఏ రంగంలో ఎదగదల్చుకున్నవారికైనా దగ్గరదారులంటూ ఉండవు. సంగీత ప్రపంచాన మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన ఈ ముగ్గురూ రాగలకాలంలో ఎందరికో ఆదర్శనీయులవుతారు. -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్‌స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
అక్షౌహిణులు సిద్ధం!
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్మోహన్రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్‌రెడ్డి. ‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్‌కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్‌సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్‌సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్‌కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్‌ను రాష్ట్ర కాంగ్రె స్కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్‌ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్‌ను ప్లస్‌గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇంత నాటకీయత దేనికి?!
జార్ఖండ్ చుట్టూ ఈ వారమంతా చోటుచేసుకున్న పరిణామాలు దేశ ప్రజానీకాన్ని నివ్వెరపరిచాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జాడ తెలియడం లేదనీ, ఆయన గురించి జనవరి 27 నుంచి వెదుకుతున్నామనీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత నెల 28న చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 30 గంటల పాటు ఆయన ఆచూకీ లేదు. ఢిల్లీ వెళ్లారన్న సమాచారం ఉన్నా అక్కడి నివాసంలో ఆయన అధికారు లకు చిక్కలేదు. అన్ని మార్గాలనూ దిగ్బంధించి వెతుకులాడిన దర్యాప్తు అధికారులకు చివరకు నిరాశే మిగిలింది. జనవరి 31న ఆయన తనంత తానే రాంచీ నివాసంలో ప్రత్యక్షం కావటం, గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించటం, అటుపై ఆయన్ను రాత్రి 9.30కి ఈడీ అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. హేమంత్ స్థానంలో కొత్త సీఎంగా ‘జార్ఖండ్ టైగర్’గా పేరున్న చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ నెల 5 లోపు బలపరీక్ష నిరూపించుకోవాల్సిన నేపథ్యంలో జేఎంఎం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు తరలివచ్చారు. రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారో లేదోనన్న ఆందోళన సమసిపోయాక, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం ఎలా అన్నది జేఎంఎంకు సమస్యగా మారినట్టుంది. కూటమి సర్కారులో భాగస్వామి అయినకాంగ్రెస్ మిత్రధర్మంగా తెలంగాణలో తలదాచుకోవటానికి చోటిచ్చింది. ఈ వ్యవహారంలో ఈడీ పట్టుదల... ఏదేమైనా దానికి చిక్కరాదన్న హేమంత్ తీరు... మీడియాకు కావలసినంత మేతనిచ్చాయి. ముఖ్యమంత్రి హోదాలో వున్న నాయకుణ్ణీ, అందులోనూ ఒక ఆదివాసీ నేతనూ వెంటాడటం అంత అత్యవసరం ఎందుకైందో బోధపడదు. ఆయనపై వున్న కేసులు తీవ్రమైనవే కావొచ్చు, వాటి విషయమై ప్రశ్నించాలని ఈడీ అధికారులు భావించివుండొచ్చు... దాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఫోర్జరీ పత్రాలతో ఆయన రాంచీలోనూ, వేరేచోట్లా భూములు కాజేశారని ఆ సంస్థ ఆరోపణ. కానీ ఆయన చట్టానికి దొరక్కుండా తప్పించుకుపోయే సాధారణ వ్యక్తేమీ కాదు. అలాగని బ్యాంకులకు వేలకోట్లు ఎగనామంపెట్టి విదేశాలకు పోయిన కొందరిలా వ్యాపారో, పారిశ్రామికవేత్తో కాదు. ఆయన ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్న నాయకుడు. జార్ఖండ్ సీఎం. జనం మధ్యనే ఉండి, వారి మద్దతుతో రాజకీయాల్లో కొనసాగదల్చు కున్నవారు. హేమంత్ సోరెన్ ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లను బేఖాతరు చేయటం వల్ల వారంలో పూర్తయ్యే దర్యాప్తు నెలరోజులు పట్టొచ్చు. లేదా మరికొన్ని నెలలు కొనసాగొచ్చు. ఈలోగా మిన్ను విరిగి మీద పడుతుందా? ఇప్పటికే 41 చోట్ల సోదాలు చేసి, అయిదు సర్వేలు నిర్వహించామని ఈడీ చెబుతోంది. హేమంత్ ఢిల్లీ నివాసంలో నిర్వహించిన దాడిలో భారీగా నగదు, కీలకమైన పత్రాలు లభించాయన్నది ఈడీ ప్రకటన సారాంశం. ఈ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నా రని హేమంత్ సోరెన్ ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈడీ సిబ్బందిపై కేసు కూడా పెట్టారు. దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతు న్నాయి. ఈ ఏడాది ఆఖరుకు జార్ఖండ్ అసెంబ్లీ గడువు కూడా ముగుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ కేసుల్లో ఇరికించి అరెస్టు చేయాలనుకోవటం అప్రదిష్ట పాలు చేయటానికేననీ, తనను రాజకీయంగా దెబ్బతీసే కుట్రనీ హేమంత్ చేస్తున్న ఆరోపణ జనం విశ్వసించే అవకాశం లేదా? హేమంత్ కూడా ఇంత నాటకీయతకు తావివ్వకుండా ఉండాల్సింది. రాజకీయంగా ఆయన ఇబ్బందులు ఆయనకుండొచ్చు. తన అరెస్టు ఖాయమని తెలిశాక తదుపరి సీఎం ఎవరన్న అంశంలో గృహచ్ఛిద్రాలు కమ్ము కున్నాయి. సతీమణి కల్పనా సోరెన్ వైపు ఆయన మొగ్గుచూపగా, హేమంత్ దివంగత సోదరుడి సతీమణి, ఎమ్మెల్యే సీతా సోరెన్ పేచీకి దిగటం సమస్య అయిందంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో, మెరుగైన పాలన అందించటంలో హేమంత్ సర్కారుకు మంచిపేరే ఉంది. జార్ఖండ్ ఏర్పడి 24 ఏళ్లు కావస్తుండగా 2014–19 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మినహా ఏ ప్రభుత్వమూ పూర్తిగా అయిదేళ్లూ పాలించలేకపోయింది. అస్థిరత్వమే రాజ్యమేలిన ఆ రాష్ట్రంలో తొలిసారి 2019 ఆఖరులో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమికి 47 స్థానాలు లభించాయి. 81 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో అధికార కూటమికి ఇంత మెజారిటీ ఉండటం అదే మొదటిసారి. చిత్రమేమంటే అంతకు ఆర్నెల్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి 12 గెల్చుకుంది. జార్ఖండ్‌లో గతంలో బీజేపీతో జేఎంఎం కూటమి కట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ మౌలికంగా రాష్ట్రంలో తనకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని గ్రహించాక గత దశాబ్ద కాలంగా బీజేపీతో పొత్తుకు జేఎంఎం సుముఖత చూపటం లేదు. పైగా ఆదివాసీలను హిందువులుగా చూపాలన్న సంఘ్ పరివార్ వైఖరికి భిన్నంగా వారిని ప్రత్యేక మతస్థులుగా గుర్తించాలని హేమంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణాల వల్లే ఈడీ ఆయన్ను వేధిస్తున్నదని ఆదివాసీలు నమ్మితే అది రాజకీయంగా బీజేపీకి నష్టంగా పరిణమిస్తుంది. ఏదేమైనా ఈ వ్యవహారంలో ఈడీ అత్యుత్సాహం ప్రదర్శించిందన్న అప్రదిష్టను మూటకట్టుకుంది. ఇప్పటికే ఆ సంస్థ తీరును విపక్షాలు తూర్పారబడుతున్నాయి. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా హేమంత్ సోరెన్ మాదిరే ఈడీ సమన్లను ధిక్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ సంయమనంతో వ్యవహరించి నిందకు తావులేకుండా చూసుకోవాలి. అలాగే జార్ఖండ్‌లో ఎలాంటి రాజకీయ అస్థిరతకూ బీజేపీ తావీయరాదు. -
పాక్ ప్రజాస్వామ్య ప్రహసనం
మరో ఎనిమిది రోజుల్లో దేశంలో ఎన్నికలు. ఆరు నెలలుగా జైలులో ఉన్న మాజీ ప్రధాని. అవినీతి ఆరోపణలతో కటకటాల వెనక ఉన్న ఆయనపై... రెండు రోజుల్లో మరో రెండు కేసుల్లో వేర్వేరుగా 10 ఏళ్ళు, 14 ఏళ్ళ శిక్షలు. కనీసం మరో పదేళ్ళ పాటు ప్రభుత్వహోదా ఏదీ నిర్వహించనివ్వని నిషేధం. పార్టీ ఎన్నికల చిహ్నానికి కూడా తిరస్కరణ. మాజీ ప్రధాని గారి పార్టీ వైపు మొగ్గకుండా యువతరానికి హితోపదేశాల ఊదరగొడుతున్న ఆర్మీ ఛీఫ్. ఇలాంటి నాటకీయ పరిణామాలు ఒక్క పాకిస్తాన్‌లోనే సాధ్యం. గతంలోనూ ఆ దేశంలో మాజీ ప్రధానులు పలువురు ఇలానే న్యాయ విచారణలు, జైలుశిక్షలు ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. నమ్మలేని ఈ న్యాయవిచారణల ద్వారా నేతల్ని బరిలో లేకుండా చేసే సిగ్గుమాలిన రాజకీయ దుస్సంప్రదాయం పాకిస్తాన్లో దీర్ఘకాలంగా ఉన్నదే. దాదాపు 14 వేల కోట్ల డాలర్ల అప్పులో కూరుకుపోయి, ఏటా ఆహార ధరలు 38.5 శాతం మేర పెరుగుతూ, ఆసియాలోనే అత్యధిక ద్రవ్యోల్బణంతో సామాన్యులు సమరం చేస్తున్న పొరుగుదేశానికి ఇది ఏ రకంగానూ మేలు కాదు. దేశరహస్య పత్రాలను లీక్ చేశారనే కేసులో కోర్టు మంగళవారం ఇమ్రాన్‌కు పదేళ్ళ జైలుశిక్ష ప్రకటిస్తే, మర్నాడే బుధవారం ప్రభుత్వ కానుకల అక్రమ విక్రయం (తోషాఖానా) కేసులో ఆయనకూ, ఆయన భార్యకూ కూడా చెరొక 14 ఏళ్ళ కారాగారవాస శిక్ష వేసింది. 150 కోట్ల రూపాయల జుల్మానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఏమైనా, 2022 ఏప్రిల్‌లో ప్రత్యర్థుల చేతిలో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఇప్పటికే అవినీతి ఆరోపణలపై మూడేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికలు అతి దగ్గరలో ఉండగా ఈ తీర్పులు, శిక్షల ప్రకటన యాదృచ్ఛికం అనుకోలేం. ఇప్పటికే పదేళ్ళ పాటు అన్ని రకాల ప్రభుత్వ పదవులకూ తమ నేతను అనర్హుణ్ణి చేసిన శక్తులు ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణకూ బ్రేకులు వేయదలిచారని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపిస్తోంది. తాజాగా శిక్షలు పడ్డ రెండు కేసుల్లోనూ తమ వకీళ్ళు పాకిస్తాన్ హైకోర్ట్‌కు అప్పీల్ చేశాక కథ కొత్త మలుపులు తిరగవచ్చని ఆ పార్టీ ఆశ. రావల్పిండిలోని అడియాలా జైలులో 9 బై 11 అడుగుల పరిమాణంలోని చిన్న జైలు గదిలో గడచిన ఆగస్టు నుంచి గడుపుతూ, హింసాకాండ నుంచి తీవ్రవాదం దాకా సుమారు 180కి పైగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు 71 ఏళ్ళ ఇమ్రాన్. కేసులు, కోర్టులు, శిక్షలతో సంబంధం లేకుండా ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ మెండుగా ఉంది. ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్‌ను సైతం ఈ అంతర్జాతీయ క్రికెటర్ పార్టీకి దూరం చేశారు. ఎదురుదెబ్బ తగిలినా, జనంలో ఆయన పట్ల సానుభూతి, సానుకూలత ఆ పార్టీ అభ్యర్థులకు కాస్తంత సాంత్వన. వారు గెలిచినా ఇండిపెండెంట్ల కిందే లెక్క. అసలు చిక్కంతా ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో కలసి సైనిక వ్యవస్థ ఆడుతున్న అధికార క్రీడతోనే! తెర వెనుక చక్రం తిప్పే పాక్ సైన్యం కొన్ని నెలలుగా వేలాది పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణల దెబ్బతో డజన్లకొద్దీ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ప్రధాన స్రవంతి మీడియాలో ఇమ్రాన్ పేరు నిషేధించారు. ఇమ్రాన్ ప్రత్యర్థులకు కలిసొచ్చేలా నియోజక వర్గాల సరిహద్దుల్ని తిరగరాశారు. చివరకు ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. మాజీ ప్రధాని 74 ఏళ్ళ నవాజ్ షరీఫ్‌కు మాత్రం తెర వెనుక అండ పుష్కలం. అచ్చం ఇమ్రాన్ లానే అవినీతి ఆరోపణలతో 2017లో ఆయన పదవీచ్యుతుడయ్యారు. పదేళ్ళ జైలుశిక్ష పడింది. కానీ, వైద్య చికిత్సకంటూ 2018లో బెయిల్ మీద లండన్ వెళ్ళిన ఆయన తప్పించుకొని ప్రవాసంలో కాందిశీకుడిగా గడిపారు. చివరకు గత అక్టోబర్ 21 పాక్‌కు తిరిగొచ్చారు. వస్తూ్తనే జైలుశిక్ష రద్దయింది. రాజకీయాల నుంచి జీవితకాల నిషేధమూ ఎత్తేశారు. నాలుగోసారి ప్రధాని పీఠానికై పోటీ చేస్తున్న ఆయనకు గతంలో మూడుసార్లు ఆయనను గద్దె దింపిన సైన్యమే మళ్ళీ సాయంగా నిలవడం పాక్ రాజకీయ వైచిత్రికి తార్కాణం. ఇవన్నీ చూశాకే ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలుండవని విశ్లేషకులు తీర్మానించేశారు. పాక్ ఓటర్లలో 40 శాతం మంది నిరక్షరాస్యులే. అయి తేనేం, ప్రజానీకానికి సైతం ఎన్నికల ప్రక్రియపై భ్రమలు ఎంతగా తొలగిపోయాయంటే, బరిలో మిగిలిన పార్టీల ప్రచారానికి సైతం స్పందన అంతంత మాత్రమే. అయితే, ఇమ్రాన్‌కు కోర్టు శిక్షలతో పాక్‌లో రాజకీయంగా చీలిక పెరగవచ్చు. అస్థిరత హెచ్చి, ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదం రావచ్చు. రేపు ఫలితాలు వెలువడిన తర్వాతా దేశంలో సుస్థిరత నెలకొనే అవకాశాలు అత్యల్పం. పాక్ అధికార వ్యవస్థపై సైనిక యంత్రాంగపు క్రీనీడ విస్తరించి, ప్రజాస్వామ్య రాజకీయ ప్రక్రియను పూర్తిగా బలహీనపరిచింది. సైనికాధికారులు తమ పరిధిలోకి ఏ మాత్రం రాని రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ నుంచి మతం, విదేశాంగ విధానం దాకా విద్యార్థులతో ముచ్చటిస్తుండడమే అందుకు మచ్చుతునక. అన్ని రకాలుగా సందేహాస్పదమైన ఈ ఎన్నికల ద్వారా, సైనిక వ్యవస్థ అండతో వచ్చే బలహీన పౌరప్రభుత్వం రేపు పరిపాలన ఎంత అందంగా చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పాక్ ఆర్థిక, జాతీయ భద్రతా రంగాల్లో దాని పని తీరు ఏమంత గొప్పగా ఉంటుందో వివరించనక్కర లేదు. దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించడమెలాగో తమకు తెలుసని గతంలో అప్పటి పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఒక సిద్ధాంతం చెబితే, ఇప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్ సిద్ధాంత ప్రవచనం చేస్తున్నారు. వెరసి, ఈ ఫిబ్రవరి 8 నాటి ఎన్నికలు చివరకు ఓ తంతుగానే మారడం ఖాయం. బాహాటంగా పగ్గాలను సైన్యం చేత పట్టకున్నా, పేరుకు ఎన్నికైన పౌర ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా పనిచేయనిచ్చే పరిస్థితి మాత్రం ఉండదనేది నిస్సందేహం. -
తప్పొకరిది! శిక్ష అందరికా?
అంతకంతకూ తీవ్రమవుతున్న పాలస్తీనా సంక్షోభం వారం రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చేసిన ప్రాథమిక నిర్దేశం ఒకవైపు, పాలస్తీనా శరణార్థులకై ఏర్పాటైన ఐరాస సహాయ సంస్థ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ (అన్రా)కు నిధులు ఆపేస్తున్నట్టు అమెరికా, మరో 8 దేశాలు ప్రకటించడం మరోవైపు, అమెరికా శిబిరాలపై డ్రోన్ దాడులు ఇంకోవైపు... ఇలా అనేక పరిణామాలు సంభవించాయి. గాజా యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి ‘హమాస్’ ఆకస్మిక దాడి, అపహరణలు, హత్యల్లో ‘అన్రా’ సిబ్బంది కొందరు పాలుపంచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపణ. 190 మంది దాకా ‘అన్రా’ ఉద్యోగులు ఇస్లా మిక్ జిహాదీ తీవ్రవాదులైన ‘హమాస్’ వర్గీయులుగానూ వ్యవహరించారని అది అంటోంది. అయితే కొందరు తప్పు చేశారని గాజాలోని లక్షల మందికి ప్రాణాధారాన్ని ఆపేయరాదని ఐరాస అభ్యర్థన. ఎప్పుడో 1948లో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం సందర్భంగా దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతంలోని తమ ఇల్లూ వాకిలీ వదిలేసి పోవాల్సొచ్చింది. ఆ శరణార్థుల సాయానికై 1949లో ‘అన్రా’ ఏర్పాటైంది. గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, జోర్డాన్లలో విద్య, ఆరోగ్యం, సహాయ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థ ద్వారా సుమారు 59 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు సాయం పొందుతున్నారు. ఇప్పటికే మానవీయ సంక్షోభంలో చిక్కుకున్న గాజాలోని ప్రజానీకానికి తిండి, నీళ్ళు అందిస్తున్నది ప్రధానంగా ఈ సంస్థే. అమెరికా లాంటి పలు దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఆ సంస్థపై ఆరోపణలు చేసి, నిరూపించకుండానే నిధులు ఆపేస్తే లక్షలాది అమాయకుల పరిస్థితి ఏమిటి? ఐరాస శరణార్థి సహాయ సంస్థకు నిధులిచ్చే దేశాల మాట అటుంచితే, అసలు సామాన్య పౌరులకు కష్టం వాటిల్లకుండా చేయగలిగినదంతా చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిర్దేశించింది. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూ, అమాయకుల ఆయువు తీస్తోంది. ఆ మధ్య కొద్దివారాల పాటు గాజాలోని ప్రధాన నగరం నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన ఇజ్రాయెల్ సోమవారం మళ్ళీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధంలో ఇప్పటికే 26.5 వేల మంది పాలస్తీనీయులు మరణించారు. తీరం వెంట ధ్వంసమైన భవనాల శిధిలాల కింద ఇంకెన్ని వేల మృతదేహాలున్నాయో తెలీదు. అంతకంతకూ క్షుద్రమవుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇక, గాజా ప్రకంపనలు ఇతర చోట్లకూ విస్తరించాయి. ఆదివారం సిరియా సరిహద్దు సమీపంలోని జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగాయి. అమెరికా సైనికులు ముగ్గురు మరణించారు. ఈ దాడులు ఇరాన్ అండతో సిరియా, ఇరాక్లలో నడుస్తున్న తీవ్రవాద వర్గాల పని అన్నది అమెరికా మాట. ఆ పాపంలో తమకేమీ భాగం లేదన్నది ఇరాన్ ఖండన. నిజానికి, ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక శిబిరాలపై పదులకొద్దీ దాడులు జరిగాయి. అమెరికాకు ప్రాణనష్టం మాత్రం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ భీకర ప్రతీకార యుద్ధాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్న అగ్రరాజ్య విస్తృత రక్షణ వ్యవస్థల్ని దాటుకొని మరీ ఈ దెబ్బ తగలడం గమనార్హం. దాంతో, అమెరికా అధినేత సైతం ఇరాన్ మద్దతున్న తీవ్రవాదవర్గాలపై ప్రతీకార దాడులు చేయాలని హూంకరించారు. అలాగని నేరుగా ఇరాన్‌పై దాడికి దిగలేదు. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నేతలు కోరినా, అది తేనెతుట్టెపై రాయి వేయడమే. ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా నిలబడి కలబడుతున్న తీవ్రవాద బృందాలే అందుకు సాక్ష్యం. ప్రాంతీయ పోరాటాల్లో తలదూర్చినప్పుడల్లా తలబొప్పి కడుతూనే ఉందని అగ్రరాజ్యం మర్చి పోకూడదు. పశ్చిమాసియాలో ఇప్పటికే దానికి అనేక శత్రువులున్నారు. ఇరాన్‌పై దుందుడుకుగా ప్రవర్తిస్తే పరిస్థితి చేయి దాటుతుంది. చివరకు ఈ యుద్ధం ప్రపంచ స్థాయిలో పెద్దదవుతుంది. ఇటీవల ఎర్రసముద్రంలోని దాడులతో అస్తుబిస్తు అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి అది మరో అశని పాతం అవుతుంది. అది గ్రహించే అమెరికా అనివార్యంగా సంయమనం చూపాల్సి వచ్చింది. ఇంకోపక్క మరో విడత కాల్పుల విరమణకై అరకొర ప్రయత్నాలు సాగుతున్నా, అవేవీ ఫలించడం లేదు. తాజాగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అధినేత ఆదివారం ప్యారిస్‌లో ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్‌కు చెందిన ఉన్నతాధికారులను కలిశారు. మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తే, మరొక సారి కాల్పుల విరమణ పాటించేలా చర్చించి, ఒప్పించాలని ప్రయత్నం. కానీ, ఫలితం శూన్యం. ఇజ్రాయెల్ సైనికచర్యను తప్పుబడుతూ దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసు తేలేసరికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఐసీజే గురువారం ఇచ్చిన ప్రాథమిక నిర్దేశం ఏ పక్షం వైపూ మొగ్గకుండా ఆచరణాత్మక ధోరణిలో సాగింది. గాజాలో అత్యవసర ప్రాథమిక సేవలు, మానవతా సాయం అందించాలని టెల్ అవీవ్‌ను కోరింది. అదే సమయంలో హమాస్ చేతిలోని బందీల పట్ల ఆందోళన వెలి బుచ్చుతూ, వారి విడుదలకు పిలుపునిచ్చింది. ఇలాంటి సమతూక ధోరణినే ఆశ్రయిస్తూ అమెరికా, ఐరోపా సమాజం సహా పాశ్చాత్యదేశాలన్నీ చర్చలతో పరిష్కారానికి మనసు పెట్టాలి. అంతు లేని యుద్ధానికి ఇజ్రాయెల్‌ను అనుమతిస్తున్న తమ విధానాలపై పునరాలోచన చేయాలి. ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇరుపక్షాలనూ అంగీకరింపజేయాలి. కొందరు తప్పు చేశారని, ‘అన్రా’ నిధులను ఆపి అందరినీ శిక్షించడం శాంతిస్థాపనకు దోహదం చేయదని గ్రహించాలి. -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్‌లో నడుపుతున్న సర్కార్‌కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది. తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు. తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు. కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు. ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్‌సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు. పోనీ ఆ డిమాండ్‌కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్‌పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జ్లను సైతం నియమించేసింది. గత వారం బులంద్‌షహర్‌లో సభతో ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్‌గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్ను పలచన చేసింది. కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్‌లో బలం తగ్గుతున్న నితీశ్‌కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్‌లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్‌సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం. నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం. మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే! -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్‌ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్‌కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం.