Editorial
-
షణ్ముఖ కూటమి... సిద్ధమా?
ఒకే ఒక్కడు సిద్ధం! ‘జో జీతా వొహీ సికిందర్’ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలి కింది. ఏమా జనం? లక్షలాది నింగి చుక్కలు ఒక్కచోటనే రాలిప డ్డట్టు లేదూ! బీదాబిక్కీ జనం, బడుగు బలహీనవర్గాల ప్రజలే వారంతా! తమ జీవితాలకు గొడుగు పట్టిన జగన్మోహన్రెడ్డి జైత్రయాత్రకు తాము సైతం అన్నట్టుగా తరలివచ్చారు. యుద్ధా నికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో వారంతా శ్రుతి కలి పారు. జన హోరుపై గౌరవంతో సముద్రుడు తన కెరటాలను అవనతం చేశాడేమో! జన సాగర సందడిలో అలల చప్పుడు వినిపించలేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు సిద్ధమ య్యారు సరే! మరి ప్రత్యర్థుల సంగతి? ఆ ప్రత్యర్థి ఏకవచ నమా? బహువచనమా అనే సందేహం అవసరం లేదు. బహు వచనంగా కనిపించే ఏకవచనం. చంద్రబాబు బహురూపి. ఒక రూపం నుంచి మరో రూపంలోకి పాదరసంలా ప్రవహించగల నేర్పరి. పాదరసం ఒక లోహం. కానీ సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో కనిపిస్తుంది. ఈయనా అంతే – ద్రవరూపంలో కని పించే ఒక లోహ విశేషం. ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ఆరు రూపాల్లోకి ప్రవహించారు. ఇందులో కొన్ని పాత రూపాలే. కొన్ని కొత్తవి. ఆరు ముఖాల వాడిని సంస్కృతంలో షణ్ముఖం అంటారు. తమిళ సంప్రదాయంలో ఆర్ముగం అంటారు. ఇప్పుడు మన ఆర్ముగం చంద్రబాబు ఆరు ముఖాలతో ఆరు శిబిరాలను తన కోసం సన్నద్ధం చేసుకున్నారు. ఇందులో మొదటి ముఖం తనదైతే, రెండోది యెల్లో మీడియా లీడర్ రామోజీది. వీరిద్దరు సియామీ కవలలు. ఇద్దరిలో ఎవరిది ఒకటో నెంబరో తేల్చడం కష్టం. పొలిటికల్ ఫేస్ కనుక బాబునే ఒకటి అనుకుందాం. ఇక మూడో ముఖం జగమెరిగిన జనసేనాధిపతి. తన కోవర్టుల సాయంతో కబ్జా చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ నాలుగో ముఖం. తాను కొనుగోలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఐదో ముఖం. ఈ సిక్ యూని ట్ను ‘కొనుగోలు’ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ‘కనుగోలు’ సేవలు ఉచితంగా లభిస్తాయట! ఇక సందర్భాన్ని బట్టి తనకు ఉపయోగపడే పనులు చేసిపెడుతూ, అప్రకటిత ఓఎస్డీగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖ ఆరో ముఖం. ఇందులో ఎవరికి నిర్దేశించిన పాత్రను వారు పోషిస్తూ చంద్రబాబుకు తోడ్పాటునందిస్తుంటారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే చంద్రబాబు, యెల్లో మీడియాలు తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి నుంచే జగన్ సర్కార్‌పై యెల్లో మీడియాలో దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. కాకపోతే ఆరు శిబిరాలను సమయాత్తం చేసి ఆరు ముఖోటాలను తగిలించడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు షణ్ముఖ కూటమి సిద్ధమైంది. షడ్యంత్రం కూడా ఎప్పుడో సిద్ధమైంది. ఆరు రకాల మాయోపాయాలను ఉప యోగించి నడిపే కుట్రను ‘షడ్యంత్రం’ అని పూర్వం అనేవారు. శాస్త్ర ప్రకారం చేసే కుతంత్రమన్నమాట. మన ఆర్ముగం మాస్టారు ఆరు రకాలేం ఖర్మ... అరవై రకాల మాయోపాయాలను ఏకకాలంలో ప్రయోగించగల నేర్పరి. కీలకమైన ఆరు మాయలను చెప్పాల్సి వస్తే దాంట్లో మొద టిది మోసం లేదా వెన్నుపోటు లేదా నమ్మకద్రోహం. గూగుల్ ఇమేజెస్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే వచ్చే బొమ్మల్లో 90 శాతానికి పైగా చంద్రబాబు బొమ్మలే కనిపిస్తాయి. అకడమిక్ ఆసక్తి ఉన్నవారెవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెన్నుపోటు కేటగిరీలో బాబు, యెల్లో మీడియాలు యూనివర్సల్ పేటెంట్ హోల్డర్లు. మిగిలిన నాలుగు ముఖాలకు కూడా తరతమ భేదా లతో ఈ లక్షణం ఉన్నది. మాయోపాయాల్లో రెండోది – దుష్ప్ర చారం లేదా గోబెల్స్ ప్రచారం. తప్పుడు ప్రచారాలకు ఆది గురువుగా పేరొందిన గోబెల్స్ మహాశయుడు ఇప్పుడు కనుక బతికి వుంటే యెల్లో మీడియా బడిలో మరోసారి ఓనమాలు దిద్దుకునేవాడు. యెల్లోమీడియా ఘనత ఈ రంగంలో దిగంతా లకు వ్యాపించింది. మూడో మాయోపాయం – అవకాశవాద పొత్తులు. నాలు గోది – వ్యవస్థలను దురుపయోగపరచడం. ఐదవది – పార దర్శకత లేమి. ఆరవది – గోముఖ వ్యాఘ్రంలా పెత్తందారీవర్గ స్వభావాన్ని దాచిపెట్టడం. ఈ ఆరు లక్షణాల్లో చంద్రబాబుకు, యెల్లో మీడియాకు ఉన్న ప్రావీణ్యతను గురించి కొత్తగా చెప్పన వసరం లేదు. వీరు కూడగట్టుకున్న కొత్త మిత్రులందరిలోనూ ఈ లక్షణాలు అంతో ఇంతో కనిపిస్తాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకొక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలు మార్లు రుజువైంది. మాట నిలకడ లేదని కూడా ఆయన పదేపదే నిరూపించుకుంటున్నారు. ఒక నమ్మదగిన నాయకుడుగా స్థిరపడలేకపోయాడు. చంద్రబాబు ప్రయోజ నాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శిస్తారు. అదొక సహజ వ్యతిరేకత. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఓట్లు పరోక్షంగా తనకు లభించేట్టుగా పన్నిన కుతంత్రమేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశమే ఎక్కువ. పవన్ కల్యాణ్ పార్టీని ఎన్టీఏ కూటమిలో చేర్పించడం కూడా చంద్రబాబు వ్యూహమేనని తెలియని వారెవరూ రాష్ట్రంలో లేరు. తన పార్టీ ఎంపీలను, పైరవీకార్లను కూడా బీజేపీలో చేర్పించింది చంద్రబాబేనన్న సంగతి జగమెరిగిన సత్యమే. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే మాత్రం లోకానికి నిజం తెలియకుండా ఉంటుందా? గడిచిన ఎన్నికల్లో జరిగిన దారుణ పరాభవంతో బాబుకు జ్ఞానోదయమైంది. రాష్ట్రంలో యాభై శాతం ఓట్లను అప్పటికే స్థిరపరచుకున్న జగన్‌తో పోరా డాలంటే తన బలం సరిపోదనీ మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలనీ ఆయనకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే కాదు, జగన్ అను కూల ఓటర్లలో కూడా ఏదో ఒకరకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనల్లోంచే ఈ షణ్ముఖ కూటమి పుట్టింది. బీజేపీలో చేరిన బాబు కోవర్టులు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కల్యాణ్‌ల ప్రయత్నాలతో పాటు తన పాత పరిచ యాలతో చేసిన లాబీయింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్రశాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలిగా వచ్చారు. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఆ వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబు మార్చేసు కున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దానితోపాటు ఈగలు తోలుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరి పించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలిగా వేయించుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిశోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియా చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డీకే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డీకేకూ, చంద్రబాబుకూ దోస్తీ కుదిరింది. ఆ దోస్త్ ద్వారా రాయ బారం నడిపి, షర్మిలను ఇక్కడికి డిప్యుటేషన్ వేయించుకున్నా డని కాంగ్రెస్ వర్గాల భోగట్టా.. దీన్నే చావు తెలివితేటలంటారు. ప్రభుత్వ అనుకూల వోటును ఎంతోకొంత చీల్చడం కోసం కాంగ్రెస్ కొంపను బాబు అద్దెకు తీసుకున్నారు. నెగిటివ్ ఓటును చీల్చడం సాధ్యమవు తుందేమోగానీ పాజిటివ్ ఓటును చీల్చలేమన్న కనీస అవగా హన అనుభవజ్ఞుడైన బాబుకు లేకపోవడం ఒక విషాదం. విశ్వస నీయతను కోల్పోవడంలో పవన్ కల్యాణ్ కంటే పదిరెట్ల వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై ఆమె వ్యక్తం చేసిన విరుద్ధ అభిప్రాయాలు వింటే చాలు, ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతా లేదనే విషయం ఎవరికైనా అర్థమ వుతుంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేకపోయినా చంద్రబాబు పడుతున్న పాట్లను వివరించడానికే ఈ ప్రస్తావన! అంతకన్నా ప్రాధాన్యత లేదు. సీపీఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అదొకప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం పోరాడిన పార్టీ. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తుంటే టీడీపీ పలురకాలుగా అడ్డుపడింది. ఆ పార్టీకి సీపీఐ వంతపాడటం విచిత్రం. ఈ అయిదేళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ షణ్ముఖ కూటమి ఆపసోపాలు పడుతున్నది. ఆయన చేసిందేమిటి? ఆయన ఎటువంటి వ్యక్తి! ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయ చరి త్రలో ఏ నాయకుడి మీద జరగనంత దుష్ప్రచారాన్ని జగన్ మీదా యెల్లో మీడియా సాగించింది. వ్యక్తిత్వ హననానికి ఉండ వలసిన హద్దులన్నీ చెరిపేసి బర్బర మనస్తత్వాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కయి ఒకే ఒక్క యువకుడిని వేధించడం, రాజకీయ అంకురాన్ని మొలకెత్తకుండా కేసులు పెట్టడం, పదహారు నెలలు జైల్లో ఉంచడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అవి తప్పుడు కేసులనీ, రాజకీయ కేసులనీ అర్థం కావడానికి మనిషికి కామన్ సెన్స్ ఉంటే చాలు. జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లమని గులామ్‌నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన అప్పట్లో సోనియా గాంధీ కోటరీలోని ముఖ్యవ్యక్తి. ముఖ్యమంత్రిని చేయనందుకే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని అప్పట్లోనే దుష్ప్రచారాన్ని సృష్టించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సంతకాలు సేకరించారని ఓ అభాండం వేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న యువకుడిపై ఇటు వంటి అమానవీయ దాడి చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి. ఆయనకు సంతకాల సేకరణతో ఎటువంటి సంబంధం లేదని అప్పట్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ ఇంట ర్వ్యూలో భట్టి విక్రమార్క కూడా ఈ ఆరోపణను నిర్ద్వంద్వంగా ఖండించారు. రోశయ్యను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నిండు పేరోలగంలో ప్రతిపాదించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డే అనే సత్యాన్ని దాచేస్తే దాగుతుందా! ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం. ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం! తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికి ముప్పయ్యారేళ్ల వయసున్న జగన్మోహన్రెడ్డి తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాల సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నిండు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను ఆయన వేసుకున్నారు. ‘పదవులూ, అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యమ’ని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కష్టాల పాలవుతావని నాయకత్వం హెచ్చరించింది. ఖాతరు చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా పదేళ్లపాటు కష్టాలు కడగండ్లతో కూడిన కడలిని ఈదవలసి వచ్చింది. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. పదేళ్లలో ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయననొక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనాదక్షునిగా తీర్చిదిద్దింది. షడ్ యంత్రాన్ని తిప్పికొట్టగల ఆరు అద్భుతమైన లక్షణాలు ఆయన అయిదేళ్ల పాలనలోంచి మనం గ్రహించవచ్చు. విశ్వస నీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్య – ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం. ఈ లక్షణాలు ఫలితాలివ్వడం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతు న్నది. నిన్నటి భీమిలి సభలో అదే ఆత్మవిశ్వాసం సమర శంఖం పూరించింది. ‘వైనాట్ 175?’ అని ఆ విజయశంఖం ప్రశ్నించింది. ‘యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా?’ అని ఆ సింహ నాదం ప్రశ్నించింది. సిద్ధం.. సిద్ధం.. సిద్ధం – లక్షలాది గళాల్లో ఓ తారకమంత్రం మార్మోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Nitish Kumar: నితీశ్ కొత్త అవతారం!
గాలి ఎటు వీస్తున్నదో... అది ఏ గమ్యం చేరుతుందో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తెలుసున్నంతగా దేశంలో మరే రాజకీయ నాయకుడికీ తెలియదని ఇప్పటికే ముద్రపడింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన మరోసారి ఈ విన్యాసానికి తెరలేపారు. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో చొరవ తీసుకుని, నాలుగైదు సమావేశాల్లో కూడా పాల్గొన్న నితీశ్ మరోసారి రంగు మార్చబోతున్నారని వారం రోజులుగా కథనాలు వస్తూనేవున్నాయి. మరికొన్ని గంటల్లో ఆయన కాషాయ కూటమి తీర్థం పుచ్చుకుని తరించబోతున్నారని కథనాలు వెలువడుతున్న దశలో కూడా ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. పరస్పర విరుద్ధ సంకేతాలిస్తూ కథను రక్తికట్టించటానికి ఆయన పార్టీ జేడీ(యూ) ప్రయత్నిస్తోంది. ఒకపక్క తదుపరి సర్కారు గురించి గవర్నర్‌తో మంతనాలు జరుపుతూ కూడా ‘మహాఘట్’ బంధన్ సర్కారు బాగానేవుంది. మీడియా కథనాలన్నీ ఊహాగానాలే’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా ప్రకటించటం ఎవరిని నమ్మించటానికో అర్థం కాదు. చిత్రమేమంటే మహాఘట్ బంధన్ కాపురాన్ని వదులుకోకుండానే... సీఎం పదవికి రాజీనామా చేయకుండానే ఆదివారం ఆయన నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కారులో ఉపముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎవరెవరుండాలనే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పట్నా–ఢిల్లీ మధ్య ఫోన్లైన్లు బిజీ అయిపోయాయి. బీజేపీలో బహిరంగంగానే హడావుడి కనబడుతోంది. ఎందుకిలా? ‘రాజకీయాల్లాంటి జూదం మరేదీ లేదు... అక్కడ కనిపించినంత ప్రస్ఫుటంగా మరెక్కడా వైపరీత్యాలు కనబడవు’ అని వెనకటికొక రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించాడు. నితీశ్ పోకడలు గమనిస్తే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఆయన ఒక కూటమిలో వున్నంత కాలం మరో కూటమి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. నితీశ్‌కు సీఎం పదవి కట్టబెట్టి ఆయన డిప్యూటీలుగా కొనసాగేందుకు రెండుచోట్లా నేతలు సిద్ధంగావుంటారు. కూటములను మార్చటంలో నితీశ్‌ను తలదన్నే నేత దేశంలో మరెవరూ ఉండకపోవచ్చు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడొక్కరే బహుశా ఆ విషయంలో నితీశ్‌తో పోటీపడగలరు. ఎన్డీయేతో తన దశాబ్దకాల అనుబంధాన్ని 2013లో నితీశ్ తెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం అప్పట్లో ఆయనకు అభ్యంతరం అనిపించింది. తీరా 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడటంతో సీఎం పదవికి రాజీనామా చేసి జీతన్‌రాం మాంఝీని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఆ వైరాగ్యం మూన్నాళ్ల ముచ్చటే అయింది. కొన్ని నెలలకే ఆయన్ను తొలగించి తిరిగి సీఎం అయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాగuŠ‡బంధన్ కూటమి కట్టి మరోసారి సీఎం అయ్యారు. కానీ రెండేళ్లు గడిచేసరికల్లా మళ్లీ ఎన్డీయే గూటికి చేరి మళ్లీ సీఎం అవతారమెత్తారు. మోదీ నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆమోదించారు. తీరా 2022లో దాన్నుంచి బయటపడి మరోసారి మహాగuŠ‡బంధన్ సర్కారుకు సారథ్యం వహించారు. తాజాగా ఎన్డీయే కూట మిలో ప్రవేశం ఖరారైందన్న కథనాలు నిజమైతే ఆయన ముచ్చటగా మూడోసారి రంగు మార్చి నట్టు! 2005లో తొలిసారి సీఎంగా అయినప్పుడు మొదలుకొని ఈ పదిహేడేళ్లలో ఆయన పదహారేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. చిత్రమేమంటే ఆయన ఎన్నిసార్లు యూటర్న్లు తీసుకున్నా బిహార్‌లో కాస్త అటూ ఇటూగా ఆయన ప్రతిష్టకు ఏనాడూ ఇబ్బంది కలగలేదు. లాలూ ప్రసాద్ యాదవ్, అటుపై ఆయన సతీమణి రబ్డీ దేవి ఏలుబడి సవ్యంగా వుంటే నితీశ్ ప్రాభవం ఈ స్థాయిలో ఉండేది కాదేమో! తన సొంత సామాజికవర్గం కుర్మీల బాగోగులు చూస్తూ బాగా వెనకబడిన కులాలనూ, మహాదళిత్ కులాలనూ సమాదరించి ‘కోటాలో కోటా’ కల్పించటం ఆయ నకు రాజకీయంగా కలిసొచ్చింది. అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతనీయటంవల్ల ఆధిపత్య కులాల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. అలాగే బీజేపీతో తరచు దగ్గరవుతున్నందుకు ముస్లింలలోనూ నితీశ్‌పై కినుకవుంది. కానీ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టేంత తీవ్ర వ్యతిరేకత ఆ వర్గాల్లో లేక పోవటం నితీశ్‌కు ఆమోదయోగ్యతను కల్పిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీల్లోనూ, దళితుల్లోనూఅత్యంత వెనకబడిన కులాల ఆదరణను సులభంగా పొందగలిగిన బీజేపీకి బిహార్‌లో నితీశ్ అండ దండలుంటేనే అది సాధ్యంకావటం జేడీ(యూ)కు తోడ్పడుతోంది. మన పార్లమెంటరీ పార్టీలకు సిద్ధాంత జంజాటం తక్కువ. కొంతకాలం క్రితంవరకూ వామ పక్షాల్లో, మితవాదపక్షాల్లో ఆ పట్టింపు ఎక్కువుండేది. కానీ ఓట్ల, సీట్ల వేటలో అది మసకబారింది. వామపక్షాలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తాయి తప్ప దాంతో జతకట్టినవారిపట్ల ఆ భావంవుండదు. వారు బయటపడిన మరుక్షణం పునీతులైనట్టే భావిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి వాలుకు తగినట్టు రంగులు మార్చే నితీశ్ వంటి వారి నుంచి మెరుగైన కార్యాచరణను ఆశించలేం. ఆ సంగతలావుంచి ఇప్పటికే తృణమూల్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోఇండియా కూటమితో పొత్తుండదని చెప్పిన తరుణంలో, పంజాబ్ ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్ సైతం అదే బాణీ వినిపించిన నేపథ్యంలో నితీశ్ నిర్ణయం ఇండియా కూటమిని నామమాత్రావశిష్టం చేస్తుంది. నిర్దిష్టమైన సిద్ధాంతం లేనివారినీ, సులభంగా రంగులు మార్చే వారినీ, సూత్రబద్ధ రాజకీ యాలు అనుసరించలేని వారినీ వెంటేసుకుని కూటమి కట్టినంత మాత్రాన మెరుగైన ఫలితాలు రావని, ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదని విపక్షాలు ఇప్పటికైనా గ్రహించటం ఉత్తమం. -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్‌సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్‌లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్‌లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్‌కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్‌లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్‌సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. -
కనువిప్పు కలిగించే కోత!
కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం సోమవారం ప్రకటించింది. వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక, 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది. దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్ పర్మిట్ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట. తాజా పరిణామం భారత్‌కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్ సంస్థలు ట్యూషన్ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్‌లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్‌ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్‌ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్‌కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్‌కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్‌డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్‌పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
అవిస్మరణీయ క్షణాలు
కొన్ని క్షణాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. భారత ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలసిన మందిర ప్రారంభం, అక్కడ అయిదేళ్ళ బాలరాముడి విగ్రహానికి సోమవారం జరిపిన ప్రాణప్రతిష్ఠాపన ఘట్టం అలాంటివే. మరో వెయ్యేళ్ళు గుర్తుండిపోయే రోజుగా మోదీ పేర్కొన్న మందిర ప్రారంభ దినాన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రామనామం ప్రతిధ్వనించింది. నేపాల్, బాలీ, ట్రినిడాడ్ సహా దేశదేశాల్లోని హిందువులు ఉత్సవం చేసుకున్నారు. వజ్రవైడూర్య ఖచిత స్వర్ణాభరణాలంకృత మందస్మిత బాలరామ రూపసాక్షాత్కారం, సాయంసంధ్యలో సరయూ తీరంలో లక్షల సంఖ్యలో దీపప్రజ్వలనంతో... అనంత కాలగతిలో ఒక చక్రభ్రమణం పూర్తి అయినట్టయింది. నాగరకతలో ఇదొక మహత్తర క్షణమనీ, రామరాజ్య స్థాపనకు తొలి అడుగనీ కొందరంటే... రామరాజ్యమంటే హిందూ రాజ్యం కాదు, ధర్మరాజ్యమనే గాంధీ భావనను ఇతరులు గుర్తుచేయాల్సి వచ్చింది. అనేక మతఘర్షణలు, దశాబ్దాల రాజకీయ, న్యాయ పోరాటాలు ఈ మందిర నిర్మాణం వెనుక ఉన్నాయి. రామ జన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాఖీ కట్టినట్టు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో కూలడం, చివరకు సుప్రీమ్ కోర్టు వేర్వేరుగా ఆలయ – మసీదు నిర్మాణాలకు ఆదేశాలివ్వడం... అలా అది ఓ సుదీర్ఘ చరిత్ర. వెరసి, అయిదు శతాబ్దాల తర్వాత రామ్ లల్లా (బాల రాముడు)కు అది మందిరమైంది. వేలాది ధార్మికుల మొదలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అశోక్ సింఘాల్, కల్యాణ్ సింగ్ లాంటి నేతల వరకు ఈ ఆలయ నిర్మాణ ఘట్టానికి ప్రేరకులు, కారకులు ఎందరెందరో. మూడు దశాబ్దాల క్రితం తమ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాన్ని ఎట్టకేలకు నెరవేర్చిన ఘనత మాత్రం మోదీకి దక్కింది. తెరపై రామ జన్మ భూమి ట్రస్ట్ లాంటి పేర్లున్నా, తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరో తెలియనిది కాదు. వచ్చే మేలో మరోసారి ప్రజాతీర్పు కోరి, వరుసగా మూడోసారి బీజేపీని గద్దెనెక్కించే పనిలో మోదీ ఉన్నారు. హడావిడి, అసంపూర్ణ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల అస్త్రంగా విమర్శకులు తప్పుబడుతున్నదీ అందుకే. కోట్లాది శ్రద్ధాళువుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదైనా, దేశమంతటా ఉద్వేగం రగిలించి, మందిరాన్ని సైతం మెగా ఈవెంట్‌గా మార్చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవనలేం. ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అన్న భావన నుంచి పక్కకు జరిగి, అత్యద్భుత ఆలయ నిర్మాణాలు అవసరమనే విధాన మార్పు వైపు దేశం ప్రయాణించింది. బీజేపీ, మోదీల మందిర రాజకీయాలు ప్రాంతీయ నేతలకూ పాఠమయ్యాయి. ఆలయాలు అనంత రాజకీయ ఫలదాయకమని అందరూ గుర్తించారు. అయోధ్య అక్షతలను ఇంటింటికి పంపే పని ఒకరు చేస్తే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ప్రతి ఇంటా బియ్యం, తాంబూలం సేకరించి, గత బుధవారం పూరీ క్షేత్రంలో ఆలయ విస్తరణ ప్రాజెక్ట్ ‘జగన్నాథ్ పరిక్రమ’ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శక్తిపీఠాల్లో ఒకటైన కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయ పునర్నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. మతానికీ, రాజకీయానికీ ముడివేసే ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళతాయో చెప్పలేం. అడుగడుగున గుడి, అందరిలో దేవుడున్నాడని భావించే భారతీయ సంస్కృతి నడయాడిన నేలపై... అయోధ్యలో మందిరావిష్కారం రోజునే మమత సర్వమత సౌభ్రాతృత్వ యాత్ర చేపట్టడం గమనార్హం. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ధార్మిక స్థలాల సందర్శన పెరుగుతోంది. ధార్మిక పర్యాటకంపోటెత్తుతోంది. భారత్‌లో ఏటా 20 కోట్ల మందికి పైగా కాశీని సందర్శిస్తారనీ, రోజుకు లక్ష మందికి పైగా తిరుపతికి వస్తారనీ లెక్క. ఇప్పుడీ జాబితాలో కొత్తగా అయోధ్య చేరనుంది. దేశంలోనే పెద్ద హిందూ దేవాలయంగా నిర్మాణమైన రామమందిరం, సరయూ నదీ తీరంలోని సామాన్య పట్నాన్ని మహానగరంగా మార్చేందుకు వేసిన మెగా ప్రణాళిక, ప్రచార హంగామాతో పరి వ్యాప్త మైన ధార్మిక వాతావరణం... అన్నీ కలసి పురాణ ప్రసిద్ధ శ్రీరామ జన్మస్థలి అయోధ్యను సరికొత్త ఆధ్యాత్మిక గమ్యంగా మారుస్తున్నాయి. చరిత్ర ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చి దిద్దడం మన వారసత్వ వైభవానికీ, పర్యాటక వాణిజ్యానికీ మంచిదే. కాకుంటే, రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులు, 85 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఒకప్పుడు రోజుకు 2 వేల మందికి పరిమితమైన ప్రాంతాన్ని రోజుకు 3 లక్షల పర్యాటకుల స్థాయికి తీసుకెళ్ళే క్రమంలో తగు జాగ్రత్తలూ ముఖ్యం. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన, మందిర ప్రారంభాలకు ఉత్సవం చేసుకోవడం సరే. ఈ సంబరాల వేళ సాటి వర్గాలను మానసికంగా ఒంటరివాళ్ళను చేస్తేనే కష్టం. సమస్త జనుల సౌభాగ్యానికి మారుపేరైన ‘రామరాజ్యం’ వైపు నడిస్తేనే సార్థకత. దేశంలోని అన్ని వర్ణాలు, వర్గాల మధ్య సమత, సమానత, సహనం, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనేలా చూడాల్సింది నాయకులే. ఆ కృషి చేస్తేనే అర్థం, పరమార్థం. శ్రీరాముడు చేసింది అదే. అలాకాక, ‘అయోధ్య అయిపోయింది... కాశీ, మథుర మిగిలింది’ లాంటి రెచ్చగొట్టే నినాదాలతో వైమనస్యాలు పెంచితే, దేశ సమైక్యతకే అది గొడ్డలిపెట్టు. మరో రావణకాష్ఠానికి మొదటి మెట్టు. ఈ దేశం నీది, నాది, మనందరిదీ అని అన్నివర్గాలూ అనుకోగలిగే ఏకాత్మ భావనే భిన్న సంస్కృతులు, ధర్మాల సమ్మిళితమైన భారతావనికి శ్రీరామరక్ష. పాత తప్పుల్ని తవ్వి తలకుపోసుకొనే పని మాని, కలసి నడవాల్సిన సమయమిది. ఆ దిశలో... నేటికీ కలగానే మిగిలిన నిరుద్యోగ నివారణ, దారిద్య్ర నిర్మూలన, స్త్రీలోకపు సశక్తీకరణ, పీడితజన సముద్ధరణ లాంటి లక్ష్యాలతో మన పాలకులు అడుగులు వేయాలని ఆశిద్దాం. అందరూ ఆ మహా సంకల్పం చెప్పుకొంటేనే ఏ సంబరానికైనా పుణ్యం, పురుషార్థం! -
సాహిత్య ఒడంబడికలు
59 ఏళ్ల ఆ వ్యాపారవేత్తకు నయంకాని చర్మవ్యాధి వస్తుంది. కాళ్లకు ఎప్పుడూ పట్టీలు కట్టాల్సిన పరిస్థితి. భార్య ఇష్టపడదు. అతణ్ణి తాకనివ్వదు. అసహనం కమ్ముకున్న వ్యాపారవేత్త విసిగిపోయి తన గోడౌన్ లో నివసించడం ప్రారంభిస్తాడు. ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి గురించి బెంగ. అతను తండ్రి బాగోగుల కోసం ఒక మహిళను తెచ్చి పెడతాడు. ఆ మహిళ ఆ వ్యాపారవేత్త పట్ల కారుణ్యమూర్తి అవుతుందా? మానవ స్వభావాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమేమిగా మారుతుంటాయి? తమిళ సాహిత్యంలో నిన్న మొన్న పూచిన కలం ముతురాస కుమార్ రాసిన ఇలాంటి కథలున్న సంకలనాన్ని ‘మీ భాషలోకి అనువదిస్తారా... మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) సైన్ చేస్తారా’ అని కన్నడ, మలయాళ పబ్లిషర్లతో సూటూ బూటూ వేసుకుని చర్చిస్తున్న లిటరరీ ఏజెంట్ అక్కడ కనిపించింది. ‘ఇమయం’ కలం పేరుతో పాతికేళ్లుగా రాస్తున్న స్కూల్ టీచర్ వి.అన్నామలై కిడ్నీ బాధితుల జీవితాన్ని నవలగా రాయడానికి ఏకంగా సైంటిస్ట్ అంతటి పరిశోధన చేశాడు. కిడ్నీ ఎలా పని చేస్తుంది, ఎందుకు పాడవుతుంది, పాడయ్యాక ఎలా ఎదుర్కొనాలి, ఇందులో మందుల, ఆస్పత్రుల గూడుపుఠానీ ఏమిటనేవి వివరిస్తూ ‘ఇప్పోదు ఉయిరోడు ఇరిక్కిరేన్ ’ పేరుతో నవల రాస్తే వెంటనే ‘ఐయామ్ ఎలైవ్.. ఫర్ నౌ’ పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువాదమైంది. అది సరిపోతుందా? స్పానిష్, టర్కిష్, నేపాలీ, లేదంటే తెలుగు భాషల్లోకి అనువాదమైతేనే కదా తమిళ నవల గొప్పదనం తెలిసేది! ‘అనువాదం చేయించి పబ్లిష్ చేస్తారా మరి’ అని మరో లిటరరీ ఏజెంట్ అక్కడ విదేశీ పబ్లిషర్ల డెస్క్‌ల దగ్గర తిరుగాడుతూ కనిపించాడు. ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024’ పేరుతో చెన్నపట్టణంలో జనవరి 16–18 తేదీల్లో మూడురోజులు సాగిన పుస్తక ప్రదర్శన నిజానికి ‘రైట్స్ హబ్’. ఇది తమిళనాడు ప్రభుత్వ పూనికతో, తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి అనువాదం చేసి అందించడానికి హక్కుల క్రయవిక్రయాలకు నియోగించిన వేదిక. మిగిలిన భారతీయ భాషల్లో రచయితలు తాము రాసిన పుస్తకాలను ఇతర భాషల్లో అనువదించుకోవడానికి పాట్లు పడాలి. కాని తమిళనాడు ప్రభుత్వం తన భాషా సాహిత్యాన్ని అనువాదం చేయించడానికి గత రెండేళ్లుగా ఈ రైట్స్ హబ్ నిర్వహించడమే కాదు అందుకు ‘తమిళనాడు ట్రాన్ ్సలేషన్ గ్రాంట్’ పేరుతో ఆర్థిక అండ కూడా అందిస్తోంది. అంటే మీరొక పబ్లిషరై ఒక తమిళ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి ప్రచురిస్తానంటే ఒక్కో పుస్తకానికి పేజీల సంఖ్యను బట్టి గరిష్ఠంగా రెండున్నర లక్షలు మంజూరు చేస్తుంది! రెండున్నర లక్షలు!! దానికి బదులుగా మీరు 500 కాపీలు ప్రచురిస్తే 50 కాపీలు, 1000 కాపీలు ప్రచురిస్తే 100 కాపీలు ప్రభుత్వానికి దఖలు పరచాలి. గ్రాంటు డబ్బుల్లో అనువాద ఖర్చులు, బుక్‌మేకింగ్ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు బాగానే సరిపోతాయి. కాపీలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు పబ్లిషర్లవే! ‘తమిళంలో గత వందేళ్లలో గొప్ప సాహిత్యం వచ్చింది. ప్రపంచ సాహిత్యానికి ఇది ఏ మాత్రం తక్కువ కాదు. మేము ఇప్పటి వరకు రష్యన్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ నుంచి అనువాదాలు బోలెడు చేసుకున్నాం. బయట దేశాల, భారతీయ భాషల సాహిత్యం తమిళ అనువాదాల ద్వారా చదివాం. ఇప్పుడు మీ వంతు. మా సాహిత్యాన్ని చదవండి. అనువాదం చేసుకోండి. మా సాహిత్యాన్ని మీకు చేరువ కానీయండి’ అని బుక్ ఫెయిర్ అనుసంధానకర్త, రచయిత మనుష్యపుత్రన్ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. గత సంవత్సరం నుంచి మొదలైన ఈ గొప్ప సంకల్పం సత్ఫలితాలను ఇస్తోంది. 2023లో జరిగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్ఫెయిర్లో దేశీయంగా, విదేశీయంగా 100కు పైగా తమిళ పుస్తకాల అనువాదాలకు ఎంఓయులు జరిగితే ఇప్పటికి 52 పుస్తకాలు వెలువడ్డాయి. వీటిలో చైనీస్, అరబిక్, మలయా, కొరియన్, కన్నడ, మలయాళ భాషల్లో వెలువడ్డ తమిళ పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు తమిళ కథారచయిత సుజాత కథలు తమిళం ద్వారా పాఠకులకు తెలుసు. ఇప్పుడు చైనీస్ ద్వారా మొత్తం చైనాకు తెలుసు. చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ 2024లో పాల్గొన్న 40 దేశాల పబ్లిషర్లు, భారతీయ భాషల పబ్లిషర్లు ఫెయిర్ ముగిసే సమయానికి 750 ఎంఓయులు చేసుకున్నారు. ఇవన్నీ తమిళం నుంచి ఇతర భాషలకు మాత్రమే కాదు... ఇతర భాషల నుంచి తమిళ లేదా ఏ భాషలోకైనా గానీ! అయితే తమిళనాడు ప్రభుత్వ ట్రాన్ ్సలేషన్ గ్రాంట్ మాత్రం తమిళం నుంచి ఇతర భాషల్లోకి అనువాదమయ్యే పుస్తకాలకే! తమిళ ప్రభుత్వం ఈ ఒడంబడికల కోసం ఎంత శ్రద్ధ పెట్టిందంటే ఇంగ్లిష్ రాని రచయితల, పబ్లిషర్ల తరఫున చర్చలు చేయడానికి 20 మంది లిటరరీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి మరీ రంగంలో దింపింది. ఎంత బాగుంది ఇది! ఏ ప్రభుత్వానికైనా తన సాహిత్య సంపద పట్ల ఉండవలసిన కనీస అనురక్తి ఇది!! మరి మన సంగతి? తెలుగు సాహిత్యం నుంచి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అనాసక్తి లేకపోవచ్చు. తమ సాహిత్యాన్ని కాపాడుకోవాలనుకునే తపన ఆ రెండు ప్రభుత్వాలకు తప్పక ఉండి ఉండొచ్చు. కాకుంటే సాహిత్య ప్రపంచం నుంచి, శాసనాధీశుల నుంచి, పాలనా వ్యవస్థలోని చదువరులైన ఐ.ఏ.ఎస్ అధికారుల నుంచి తగిన చొరవ, ఒత్తిడి కావాలంతే! ‘చలం రాసిన ‘మైదానం’ను కొరియన్ లోకి అనువదిస్తారా?’ అని ఒక లిటరరీ ఏజెంట్, ‘గుఱ -
దగుల్బాజీ పాత్రికేయం!
కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించడానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ? మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది? మీరు సింపతీ కోసం లీక్ చేసిన పడక సీన్ ఫోటోలను చూసి ఉన్నప్పటికీ... మిమ్మల్ని తిట్టకుండా ఉండటం సాధ్యం కావడం లేదు. ఇది ఒక్కడి తహతహ కాదు. లక్షలాదిమంది మానసిక స్థితి. ఉన్మత్త ప్రేలాపనలతో మీరు అచ్చొత్తి ఫ్రీగా పంచుతున్న మీ అశుద్ధ పత్రికను చదివిన పాఠకులు అస్వస్థతకు గురవుతున్నారు. మీ కడుపు నొప్పితో, మీ కక్కుడు పారుడు రోగంతో జనసమూ హంలో జుగుప్సాకర వాతావరణాన్ని తయారు చేస్తున్నారు జీ. మంచిది కాదు జీ. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కుతంత్రాన్ని పన్నుతున్నారో ఆ ప్రయోజనం నెరవేరేది కాదని మీకు తెలియదా? అయినా... ఏమో గుర్రం ఎగరకపోతుందా అనే దింపుడు కళ్లం ఆశతో ఇంత దిగజారుడుతనం వాంఛనీయం కాదు జీ! మీ పేరు చివర జీ అక్షరం వింతగా ఉన్నది జీ. అది పెట్టుడు పేరో, దత్త పేరో తెలియదు గానీ అందులో తెలుగు దనం, తెలుగు సంప్రదాయం లేదు జీ. ‘తెలుగు భాష కోసం పుట్టిన ఏకవీర నేనే’నని తమరు వీరతాళ్లు వేయించుకుంటారు కదా! ఈ మరాఠీ సంప్రదాయ పేరు అందుకు నప్పలేదు జీ. ఇంగ్లిషు పదాలకు మీ విషపత్రికలో చేసే తెలుగు అనువాదా ల్లాగే ఉన్నది. ‘పిల్లి కాదు మార్జాలం’ అన్నట్టుగా ‘కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్’ అన్నట్టుగా మీ పత్రిక అనువాదాలుంటాయి. ఇదీ అలాగే ఉన్నది. దగుల్బాజీ అనే మాట పారశీక సంప్రదాయం నుంచి వచ్చిందేమో కానీ శతాబ్దాల కిందనే తెలుగులో కలిసిపోయింది. కనుక చివర్లో జీ ఉన్నప్పటికీ అది తెలుగు మాటగానే రూపాంతరం చెందింది. ఆ మాటను జనసామాన్యం యథేచ్ఛగా వాడేస్తున్నప్పటికీ దాని అసలు అర్థం మోసగాడు అనే! ఈ పేరేదో బాగా అతికినట్టున్నది. చూస్తారా? మీరు మోసగాళ్లే కదా జీ. అలా అని పలు సందర్భాల్లో కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయిగదా జీ! ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించినట్టు న్నారు కదా! జీజే రెడ్డి సహకారంతో మీరు వ్యాపారంలో వేసిన తొలి అడుగుల్లో మోసం లేదా? యాభయ్యేళ్ల కింద మీరు విశాఖపట్నంలో ‘ఈనాడు’ ప్రారంభించినప్పుడు మిమ్మల్ని నమ్మి భూమి లీజుకిచ్చిన ఆదిత్య వర్మకు మీరు చేసిందేమిటి? మోసమే కదా! అది రుజువైంది కదా! దాన్ని దగుల్బాజీ వ్యవ హారం అంటారా అనరా? పైగా వర్మ భూమిని కొంతభాగం రోడ్డు విస్తరణకు అప్పగించి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమరు కైంకర్యం చేయలేదా జీ! దీన్నేమంటారు? ఈ వ్యవహారంలో మీ మీద ఫోర్జరీ కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించలేదా? ఫోర్జరీ కూడా మోసమే కదా! సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫిలిం సిటీలో వేలాది ఎకరాల భూమిని మీరు పోగేశారని రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదా? అది మోసం కాదా? ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని కూడా భోంచేశారు కదా! చిట్‌ఫండ్ పేరుతో ఫిలింసిటీలో ఉన్న 137 ఎకరాల భూమి చట్టప్రకారం చందాదారులకు దక్కాలి కదా? మీరెందుకు చంకలో పెట్టుకున్నారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మీరు వసూలు చేసిన 2600 కోట్ల డిపాజిట్లు మోస పూరితమైనవిగా రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయా, లేదా? చిట్‌ఫండ్స్ పేరుతో మీరు మోసగించారని చందాదారులు ఫిర్యాదులు చేశారా, లేదా? సీఐడీ కేసు నడుస్తు న్నదా, లేదా? ఇంకా చెప్పాలా? అబ్బబ్బ... తనువంతా ఇన్ని మచ్చలేంది స్వామీ? పైగా వేరొకరిపై నిత్యం అభాండాలా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా? ఎన్టీ రామారావు ఏమన్నారు? మీ పత్రిక ఓ చెత్త కాగితాల కట్ట. మీరు గోబెల్స్‌ను మించిన దుష్ప్రచారకులు. తిమ్మిని బమ్మిని చేయడమే మీ నైజం. చివరికి మీరు చరిత్ర పెంట కుప్పలోనే మిగిలిపోతారు. అవే మాటలు కదా ఆయనో ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ ఘడియలు తరుముకొచ్చి నట్టున్నాయి కదూ! అనారోగ్యంతో మంచం మీద ఉంటే మా నాన్న కాగితాల మీద సంతకాలు తీసుకున్నారనీ, నానా మాటలు అన్నారనీ స్వయంగా మీ కుమారుడే చెప్పిన విషయం మర్చిపోయారా? మీ విశ్వసనీయతకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకేముంటుంది? ఇంతటి ఘనత వహించిన తమరు చిత్తం వచ్చినట్టు కాకమ్మ కథలు చెబితే జనం నమ్ముతారా? ఈ కాకమ్మ కథలనూ, కనికట్టు రాతలనూ ఎవరూ ఊహించలేని అధమాధమ స్థాయికి తీసుకెళ్లారేమిటి జీ? పత్రికా ప్రమాణాల పాతాళం డైవింగ్‌లో మీ రికార్డులను మీరే బద్దలు కొట్టారు. హుర్రే! ఈ ఫీట్ ఇంకెవడి వల్లా కాదు. ఈ వయసులో అదేదో బూస్టర్ గోళీ వేసుకున్నట్టు ఇంత ఉన్మత్త ఆవేశమేమిటో? కారణముందిలే! అసలే జగన్మోహన్రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయన పేద వర్గాల రాజకీయ ప్రతినిధి. తమరు పెత్తందారీ వర్గాల కులగురువుగా నేమ్ ప్లేట్‌ను వాకిట్లో తగిలించుకున్నవారు. అయిదేళ్లుగా మీ వర్గం ఆటలు సాగడం లేదు. మీ కాకమ్మ కథలు పండటం లేదు. పేదలకు చదువు చెబుతున్న సర్కారు బళ్లు ఆధునికతను సంతరించు కున్నాయి. మీ పెత్తందారీ వర్గ పిల్లలతో సమానంగా పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుకోగలుగుతున్నారు. నాణ్యమైన వైద్యం పేదల ఇంటి ముంగిట్లోకి వచ్చింది. కార్పొ రేట్ వ్యాపారులకు సెగ తగిలింది. చిన్న రైతులకు వ్యవ సాయం గిట్టుబాటు కావడం మొదలైంది, లాభాల బాట వైపు కూడా పయనం ప్రారంభమైందని దేశదేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి చూస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో సామాన్య మహిళలు సైతం సంపద సృష్టిలో పాల్గొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. రిటెయిల్ వ్యాపారం అనూహ్య లాభాలనార్జిస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు దేశంలోనే అగ్రస్థానంలో పెరుగుతున్నది. కరోనా కాటేసిన కాలం పోగా మిగిలిన స్వల్పకాలంలోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. పెత్తందార్లు పంచుకు తినవలసిన సొమ్ము ప్రజల చేతుల్లో వృద్ధి పొందుతున్నది. జగన్మోహన్రెడ్డి మీద పెత్తందారీ వర్గా నికి కంటగింపు కలగడానికి ఈ కారణాలు చాలవా? తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి గురు పత్రిక నాయకత్వంలోని యెల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం కనిపించడం లేదు. నిరాశా నిస్పృహలతో ఆ మీడియా హద్దుల్ని దాటేస్తున్నది. మర్యాదలను అతిక్రమిస్తున్నది. సంప్ర దాయాలను చాపచుట్టేసింది. కనీస ప్రమాణాలను కూడా అటకెక్కించింది. గజ్జి సోకిన గ్రామ సింహాల్లా యెల్లో మీడియా వర్తిస్తున్నది. వారి ఖర్మ కొద్దీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఇప్పుడే వచ్చింది. పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహం. ప్రపంచంలో అంబేడ్కర్ విగ్రహా లన్నిటిలోకీ పెద్దది. విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంత మైన బందర్ రోడ్డుపై పద్దెనిమిదిన్నర ఎకరాల స్వరాజ్ మైదాన్ ఆయన స్మృతివనానికి వేదికైంది. పెత్తందారీ వర్గానికి ఇది మరో కంటగింపు కారణం. ప్రాంతీయ పెత్తందారీ వర్గా నికీ, ఆ వర్గం వైభవానికీ గుర్తు బందర్ రోడ్డు. ఈ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు పోనూ మిగిలిన ఖరీదైన భవనాల్లో ముప్పాతిక శాతానికి పైగా ఒకే వర్గ పెత్తందారీ కుటుంబాల వారివే. విజయవాడ నగరంలో ఏం జరగాలన్నా బందర్ రోడ్డు బాద్షాలు ఎస్ అంటే ఎస్! నో అంటే నో!! రాష్ట్ర విభజన తర్వాత బందర్ రోడ్డు మీదుగా ఒక మెట్రోలైన్‌ను కేంద్రం కేటాయించింది. మనవాళ్ల భవనాలు చాలా కూల గొట్టవలసి వస్తుంది కనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. చంద్రబాబు పార్టీకి అభివృద్ధి అంటే పెత్తందారీ వర్గం అభివృద్ధి మాత్రమే! వారికి నష్టం కలిగించే అభివృద్ధిని అస్సలు సహించరు. మెట్రోలైన్నే కాదు రోడ్డు విస్తరణను సైతం ఈ వర్గాలు అడ్డుకున్నాయి. ఇదే రోడ్డు మీద లీజుకు తీసుకున్న స్థలంలో తిష్ఠ వేసిన ‘ఈనాడు’ జీ రోడ్డు విస్తరణకు ససేమిరా అన్నారు. మూడు దశాబ్దాలపాటు భూ యజమానిని ముప్పుతిప్పలు పెట్టి రెండు దశాబ్దాల పాటు రోడ్డు విస్తరణను అడ్డుకొని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇరవై రోజుల కింద తట్టాబుట్టా సర్దుకొని, అన్ని గేట్లూ మూసుకొని తరలిపోవలసి వచ్చింది. చెన్నయ్‌లోని ‘ది హిందూ‘ కార్యాలయాన్ని ‘మౌంట్ రోడ్ మహావిష్ణు’ అనేవారట. అదేవిధంగా తన కార్యాలయాన్ని కూడా బందర్ రోడ్డు బాద్షాగానో, జాంగ్రీగానో పిలిపించు కోవాలని ఆయన ఆశించాడట! కానీ కథ అడ్డం తిరిగింది. వందేళ్ల కిందట ఒకసారి స్వరాజ్ మైదాన్‌లో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో దళిత సంఘాల సభ జరిగిందట! అప్పుడు స్థానిక పెత్తందార్లు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయం తలుపులు మూయించారట. దళితులు ఆలయానికి రాకూడ దన్న దుష్ట తలంపుతో! ఆ పెత్తందార్ల ఆటలు ఏదో రూపంలో సాగుతూ వచ్చాయి. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క! ఇప్పుడు బెజవాడంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేడ్కర్! జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత స్క్రీన్‌ప్లే మారింది. పెత్తందార్లు, వారి మీడియా కడుపు మంట ద్విగుణం, త్రిగుణం కావడానికి ఈ పరిణామాలన్నీ కారణం. ఆ కడుపు మంట ఫలితమే విగ్రహావిష్కరణ రోజున యెల్లో పత్రికల నిండా పరుచుకున్న అశుద్ధం. ఆ పద్దెనిమిది ఎకరాల్లో ఓ పెద్ద మాల్ కట్టించి తన వాళ్లందరూ వ్యాపారాలు చేసుకునేలా చూడాలని అప్పట్లో చంద్ర బాబు ప్లాన్ చేశాడట! మిగిలి ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యా లయాలను ఎక్కడికన్నా తరలిస్తే బందరు రోడ్డు మీద ఇక తమదే గుత్తాధిపత్యం. కలలు చెదిరిపోయి ఇప్పుడు అంబే డ్కర్ వచ్చి చేరాడు. అదే బందరు రోడ్డు మీద ముప్పయ్యేళ్ల క్రితం తమ పెత్తనాన్ని ధిక్కరించిన వంగవీటి రంగాను అడ్డు తొలగించుకోగలిగారు. ఇప్పుడెట్లా? మింగలేక కక్కలేక చస్తు న్నారు. అంబేడ్కర్‌పై ప్రేమ లేకున్నా అది బయటకు ప్రకటించలేరు. దళితులపై భూస్వాముల దాడులు, దౌర్జన్యాలకు ‘ఈనాడు’లో మొదటి నుంచి ప్రాధాన్యత లభించేది కాదు. కారంచేడులో దళితుల నెత్తురు ఏరై పారినప్పుడు కూడా ఆ పత్రికలో ఓ చిన్న క్రైమ్ వార్తగానే వచ్చింది. అటువంటి ‘ఈనాడు’ అంబేడ్కర్ ఆశయాల పట్ల గౌరవాన్ని నటిస్తూ ఒక దిక్కుమాలిన వార్తను అచ్చేసింది. ‘అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్’ అంటూ జీ పత్రిక ఒక ఫుల్పేజీని కేటాయించింది. అంబేడ్కర్‌కు ముడిపెడుతూ తలాతోకా లేని ఓ పది పాయింట్ల సొల్లు కార్చారు. ఈ చచ్చు పాయింట్లకు గ్రామసీమల్లోని ఏ సాధారణ పౌరుడైనా గట్టిగా సమాధానం చెప్పగలడు. అంత పారదర్శ కంగా జగన్ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తున్నది. మద్యనిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మద్యాన్ని పారిస్తున్నదట! దశలవారీ మద్య నియంత్రణకు వైసీపీ హామీ ఇచ్చిన మాట నిజం. ఆ హామీకి కట్టుబడి 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. మద్యం ప్రైవేటు వ్యాపారాన్ని రద్దు చేసి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసు కున్నది. 4,380 నుంచి 2,934 వరకు షాపుల సంఖ్యను తగ్గించారు. రాత్రి తొమ్మిది గంటల వరకే అమ్మకాలకు అనుమతి నిచ్చారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. సహజ వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా వినియోగించుకోవాలని అంబేడ్కర్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ‘ఈనాడు’ భాష్యం. ఇసుక మీద ప్రభుత్వానికి ఎవరి హయాంలో ఆదాయం వచ్చింది? గ్రానైట్, సున్నపు రాయి, మాంగనీస్, రోడ్ మెటల్... ఇలా మైనింగ్ కారక్రమాలన్నింటిలో ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది? ఈ లెక్క లేవీ చెప్పకుండా బట్టకాల్చి మీద వేసే బద్మాష్ గిరీకి ‘ఈనాడు’ పాల్పడింది. ఆదాయాలకు మూలమైన పరిశ్ర మలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవని అంబేడ్కర్ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వానికి భారీ పరిశ్ర మలను తీసుకు రావడం సాధ్యం కాలేదట. పైపెచ్చు కొన్ని పరిశ్రమలు పారిపోయాయట. రాష్ట్రంలో తమ కార్యక్రమా లను విస్తరించబోతున్నట్టు అమరరాజా గ్రూప్ అధికారికంగా ప్రకటిస్తే ఆ సంస్థ పారిపోయిందంటూ ‘ఈనాడు’ గీకి పారే సింది. జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయి. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటిద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి మీట్ జరిగింది. పార్టీ కార్యకర్తలకు కోట్లు వేసి నకిలీ ఒప్పందాలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా పోలిక ఉన్నదా?ఇంగ్లిష్ మీడియంలో చదువొద్దని అంబేడ్కర్ చెప్పారట. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదట! పేద వర్గాల ఇంగ్లిష్ చదువుల మీద పెత్తందార్లు ఎంత ద్వేషం పెంచుకున్నారో ఈ అభూత కల్పనను చూస్తేనే అర్ధమవు తుంది. ఇంగ్లిష్ మీడియంపై ఏ అంబేడ్కరిస్టుతోనైనా ఓ గంటసేపు మాట్లాడి ఉంటే ఎంతోకొంత జ్ఞానోదయమై ఉండేది. ప్రతిపక్షాలు, పత్రికలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని అంబేడ్కర్ చెబితే జగన్ ప్రభుత్వం వారిని రాచిరంపాన పెడు తున్నదట. అధికారంలో ఉన్న వారిని పచ్చి బూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసత్య ప్రచారాలకు తెగ బడినా సరే కేసులు పెట్టొద్దని అంబేడ్కర్ ఎక్కడ చెప్పాడో మాత్రం ఆ పత్రిక చూపెట్టలేకపోయింది. ఇటువంటి తలాతోకా లేని పాయింట్లతో కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన యెల్లో మీడియా గుండెలు గుభేల్ మనేలా, కళ్లలో గుంటూరు కారం మండేలా లక్షలాదిమంది పేద వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ జైత్రయాత్ర ఏప్రిల్‌లో ఎన్నికలు ముగిసేవరకే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగనున్నది. ‘తెలుగుదేశం’ రాజ కీయ కూటమి పెద్దలూ, యెల్లో మీడియా గద్దలూ అందరూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది. కౌంటింగ్ రోజున వారందరి ఇళ్ల ముందు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. కడుపు మంట అదుపు తప్పితే ఏమౌతుందో ఏమో! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పరిణతితో ప్రవర్తించాలి
ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాల్లేదన్నట్టు కొత్త తగువులు పుట్టుకొస్తున్న తీరు ఆందోళన కలిగి స్తోంది. ఇస్లామిక్ రాజ్యాలైన ఇరాన్, పాకిస్తాన్‌లు ఉగ్రవాదాన్ని అణిచే పేరిట పరస్పరం క్షిపణులతో, డ్రోన్లతో దాడులు జరుపుకోవటం తాజా పరిణామమైతే ఇంతవరకూ ఇరుపక్షాలకూ సర్దిచెప్పటా నికి ఎవరూ ప్రయత్నిస్తున్నట్టు లేదు. పాక్ గగనతలాన్ని అతిక్రమించిన ఇరాన్ విమానాలు సున్నీ మిలిటెంట్ సంస్థ జైష్ అల్ అదల్ స్థావరాలపై దాడులు చేయగా పాకిస్తాన్ సైతం ఇదే వంకతో ఇరాన్ భూభాగంపై బాంబులు కురిపించింది. ఇరాక్, సిరియాలపైనా ఇరాన్ దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతుండగా, మూడు నెలల క్రితం గాజాలో ఇజ్రాయెల్ మొదలెట్టిన దాడులు విరామం లేకుండా సాగుతూనేవున్నాయి. దాదాపు 24,000 మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలయ్యాయి. అటు ఎర్ర సముద్రంలో హౌతీలపై అమెరికా, బ్రిటన్లు చేస్తున్న దాడులు ఫలిస్తున్న సూచనలు కనబడటం లేదు. ఇండో–పసిఫిక్ప్రాంతం రానున్న కాలంలో పెను సవాలు కాబోతున్నదని అగ్రరాజ్యాలు అంచనా వేసుకుని పది హేనేళ్లుగా పథక రచన చేస్తుండగా తాజా పరిణామాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. దేశాల మధ్య ఉన్న విభేదాలు దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండిపోతే అవి ఏదో ఒక దశలో కొత్త బలాన్ని సంతరించుకుని మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పుడు ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలు, ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ప్రాంతాలు గమనిస్తే ఈ సమస్యలు కొత్తగా తలెత్తి నవి కాదని అర్థమవుతుంది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం చోటుచేసుకుని అప్పటి పాలకుడు ఇరాన్ షా పదవీచ్యుతుడయ్యేవరకూ ఇరాన్, పాకిస్తాన్ రెండూ అమెరికాకు గట్టి మిత్ర దేశాలు. మనతో 1965లోనూ, ఆ తర్వాత 1971లోనూ పాకిస్తాన్ తలపడినప్పుడు ఆ దేశాన్ని అన్నివిధాలా ఆదుకున్న చరిత్ర ఇరాన్‌ది. పాకిస్తాన్ విచ్ఛిన్నాన్ని సహించబోనని ఇరాన్ షా పరోక్షంగా మన దేశాన్ని హెచ్చరించాడు. అలాగని ఇరాన్–పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడూ ప్రశాంతంగా లేవు. అక్కడ స్థావరాలు ఏర్పర్చుకుని ఆ రెండింటినీ చికాకు పెడుతున్న బలూచిస్తాన్ మిలిటెంట్లకు కొదవ లేదు. కానీ ఇరాన్లో ఆయతుల్లా ఖొమైనీ ఏలుబడి తర్వాత అక్కడ షియాల ఇస్లామిక్ రాజ్యం ఏర్పడ్డాకే ఆ దేశానికి సున్నీ మెజారిటీ పాకిస్తాన్‌తో సమస్యలు బయల్దేరాయి. అటు పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో వుండగా, ఇటు ఇరాన్ అమెరికా విధించిన ఆంక్షలతో ఊపిరాడకుండా వుంది. ఇలాంటి గడ్డు స్థితిలో అక్కడ తక్షణం యుద్ధం తలెత్తే ప్రమాదం వుండకపోవచ్చు. అలాగని ఆ రెండు దేశాలూ ఒక అంగీకారానికి రాకపోతే ఏమైనా జరగొచ్చు. వాస్తవానికి ఇజ్రాయెల్ అస్తిత్వా నికి ఏ బెడదా లేకుండా చేయటానికీ, పశ్చిమాసియాలో తన పట్టు జారకుండా చూసుకొనేందుకూ అమెరికా చేయని ప్రయత్నమంటూ లేదు. పాలస్తీనా విషయంలో 1973 వరకూ ఏకతాటిపై ఉన్న అరబ్ దేశాలూ, ఇతర ముస్లిం దేశాలూ ఆ తర్వాత కాలంలో పరస్పరం విభేదించుకోవటంలో అమె రికా పాత్ర తక్కువేమీ కాదు. 1979లో ఇజ్రాయెల్–ఈజిప్టు మధ్య సయోధ్య కుదిర్చిన మాదిరిగానే 1994లో జోర్డాన్‌తో, ఈమధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, మొరాకోలతో ఇజ్రా యెల్‌కు సఖ్యతను ఏర్పర్చింది కూడా అమెరికాయే. మరోపక్క సిరియాలో బషర్ అల్ అసద్‌తో, యెమెన్‌లో హౌతీలతో, గాజాలో హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్లతో, లెబనాన్‌లో హిజ్బొ ల్లాతో జట్టుకట్టి అమెరికా అనుకూల ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించటంలో ఇరాన్ చాన్నాళ్లుగా బిజీగా వుంది. ఇజ్రాయెల్‌కు దగ్గరైన దేశాల్లో చాలా భాగం సున్నీ ఆధిపత్యంలోనూ, ఇరాన్ కూడగడుతున్న దేశాలు షియా ప్రాబల్యంలోనూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈమధ్యలో చైనా ఏడెనిమిదేళ్లుగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ఫలించి నిరుడు మార్చిలో ఇరాన్–సౌదీ మధ్య చర్చలు మొదలయ్యాయి. ఏదీ కారణం లేకుండా మొదలు కాదు. విస్తరించదు. బలూచిస్తాన్‌లో ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరించటంలో ఇరాన్, పాకిస్తాన్ రెండూ వైఫల్యం చెందటం వల్లే ఆ ప్రాంతం చాన్నాళ్లుగా భగ్గుమంటోంది. బలూచిస్తాన్‌లో అటు షియాలూ, ఇటు సున్నీలూ ఉన్నా జాతి, తెగల పరంగా ఆ వర్గాలమధ్య ఎన్నో వ్యత్యాసాలున్నా ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలూ, భాష వగైరాల్లో అక్కడి ప్రజల తీరుతెన్నులే వేరు. తాము అటు ఇరాన్‌కూ, ఇటు పాకిస్తాన్‌కూ చెంద బోమని, తమది ప్రత్యేక విధానమని వారి వాదన. స్వతంత్ర సిస్తాన్–బలూచిస్తాన్ ఏర్పాటులోనే తమ భవిష్యత్తు ముడిపడివున్నదని అక్కడి పౌరులు భావిస్తుంటారు. ఈ మైనారిటీల మనోభావా లను సకాలంలో గుర్తించి, సరిచేసేందుకు ప్రయత్నించివుంటే మిలిటెంట్ సంస్థల ప్రభావం అక్కడ వుండేది కాదు. కానీ అటు ఇరాన్, ఇటు పాకిస్తాన్ అణిచివేతనే నమ్ముకున్నాయి. పైగా మీ మెతక దనంవల్లే సమస్య ముదిరిందని పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. తాజా ఇరాన్ దాడుల వెనక పశ్చిమాసియా ఘర్షణలను విస్తరించాలన్న ఆలోచనలున్నాయని కొందరు విశ్లేషకులు అనుమానిస్తు న్నారు. కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలు ఇప్పటికే ప్రపంచాన్ని పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయేలా చేశాయి. రష్యానూ, ఇజ్రాయెల్‌నూ అదుపు చేసేందుకు ప్రయత్నించాల్సిన తరుణంలో మరో సంక్షోభాన్ని పెంచటం క్షమార్హం కానిది. కనుకనే పాకిస్తాన్, ఇరాన్ రెండూసంయమనం పాటించి చర్చలకు సిద్ధపడాలి. ఆ ప్రాంత మైనారిటీల మనోభావాలేమిటో తెలుసు కుని పరిణతితో ఆలోచిస్తే శాశ్వత పరిష్కారం అసాధ్యం కాదని గుర్తించాలి. -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
చైనా మెచ్చని తైవాన్ తీర్పు
కొన్ని ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో అమితంగా ఉంటుంది. జనవరి 13న తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలాంటివే. ఈ ఎన్నికల్లో అక్కడి ‘ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ’ (డీపీపీ) వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడం అనేక విధాల ప్రత్యేకమైనది. ద్వీపదేశమైన తైవాన్‌పై ఆధిపత్యం కోసం చైనా జోరుగా ప్రయత్నిస్తున్న వేళ, ఇండో– పసిఫిక్ ప్రాంతంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నవేళ వచ్చిన ఎన్నికల ఫలితాలు ఇక్కడి భౌగోళిక రాజకీయాల్లో కీలకమైనవి. 1.4 కోట్ల తైవానీయులు స్వయంప్రతిపత్తి గల ప్రజాస్వామ్యంగానే దేశం కొనసాగా లనీ, చైనాతో బంధంలో మార్పు అవసరం లేదనీ భావిస్తున్నట్టు ఫలితాలను వ్యాఖ్యానించవచ్చు. ఉపాధ్యక్షుడైన విలియమ్ లై చింగ్–తె తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డీపీపీ తరఫున పోటీపడి, చైనాతో సర్దుబాటు కోరుతున్న ప్రధాన ప్రతిపక్షమైన కెఎంటి (కుయో మిన్ తాంగ్) అభ్యర్థిపై గెలిచారు. అయితే, మునుపటి 2020 ఎన్నికల్లో అప్పటి డీపీపీ అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధిస్తే, ఈసారి అది 40 శాతానికి తగ్గింది. డీపీపీ పార్లమెంటరీ ఆధిక్యాన్ని కోల్పోయి, అతిపెద్ద పార్టీ కిరీటాన్ని ప్రతిపక్ష కెఎంటి పాల్జేయడం గమనార్హం. కొత్త విధానసభలో డీపీపీ 51, కెఎంటి 52 స్థానాలు గెలిచాయి. ఈ రెండు పార్టీల ద్విధాధిపత్యానికి గండికొడుతూ కొత్త రాజకీయ శక్తిగా అవతరించిన ‘తైవాన్ పీపుల్స్ పార్టీ’ (టీపీపీ) 20 శాతానికి పైగా ఓట్లతో, 8 స్థానాలు గెలిచింది. దేశీయ విధానంలో, చైనాతో వ్యవహారంలో అధికార పార్టీకి ఇది ఇబ్బందే. సభలో పట్టుకై ఇతర పార్టీలతో దోస్తీ కట్టాల్సి ఉంది. అలాగే, చైనా దూకుడు చూపుతున్నందున సైన్యాధిపతి అయిన తైవాన్ అధ్యక్షుడు ఇటు చైనా, అటు అమెరికాలతో నేర్పుగా వ్యవహరించాలి. నిజానికి స్వయంపాలక ప్రజాస్వామ్య దేశమైన తైవాన్ ఎన్నడూ కమ్యూనిస్టు చైనా నియంత్రణలో లేదు. అయితే, తైవాన్ ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా, ఆ దేశంపై తమదే ఆధిపత్య మంటూ డ్రాగన్ అహంకారం చూపుతోంది. ఎన్నికలను వ్యూహాత్మకంగా చక్కటి అవకాశంగా భావించిన బీజింగ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు శతవిధాల ప్రయత్నించింది. ఆర్థిక నిర్బంధాల మొదలు అసత్య ప్రచారారాలు, భద్రతా సవాళ్ళ దాకా అనేక అస్త్రాలు ప్రయోగించింది. తైవాన్ను కలిపేసుకోవాలని చైనా అసహనంతో తొందరపడుతుంటే, ‘ఒకే దేశం – రెండు వ్యవస్థల’ విధానం హాంగ్‌కాంగ్‌లో విఫలమవడం చూసిన తైవాన్ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తోంది. చరిత్ర చూస్తే 1895 నుంచి 1945 దాకా 50 ఏళ్ళు జపాన్ ఏలుబడిలో తైవాన్ ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందింది. తీరా 1945 ఆగస్ట్‌లో జపాన్ లొంగిపోవడంతో, తైవాన్ అప్పటి చైనా ప్రధాన భూభాగాన్ని ఏలుతున్న కెఎంటి పార్టీ హయాంలోకి వచ్చింది. అప్పట్లో తైవాన్‌లోని జపనీస్ ఆస్తులను కెఎంటి సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో, స్థానిక తైవానీయుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తైవాన్ జాతీయవాదుల ఉద్యమంగా మారిన ఆ నిరసనను 1947 ఫిబ్రవరి 28న కెఎంటి అణిచివేసింది. కెఎంటి సైన్యం 28 వేల మందిని పొట్టనబెట్టుకుంది. చియాంగ్ కై–షెక్ సారథ్యంలోని కెఎంటి జాతీయవాదులు 1949లో అంతర్యుద్ధంలో ఓటమి పాలై, తైవాన్‌కు తరలిపోయారు. అలా దాదాపు 20 లక్షల మంది కెఎంటితో కలసి చైనా నుంచి తైవాన్‌కు వలస వచ్చారు. ఇవాళ్టికీ 2.4 కోట్ల తైవాన్ జనాభాలో నాలుగోవంతు మంది ఈ ‘మెయిన్‌ల్యాండర్లే’. అంటే, చైనా భూభాగం నుంచి వలసదారులు, వారి సంతతే. కెఎంటి నియంతృత్వ పాలనలోనూ ఎలక్ట్రానిక్స్‌పై దృష్టి పెట్టిన తైవాన్ తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంది. 1975 వరకు అధ్యక్ష పాలనలోనే ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’గా నడిచింది. తరువాతి పరిణామాల్లో రాజకీయ సరళీకరణ ఆరంభమైంది. 1991 నాటికి ప్రజాస్వామ్య ప్రక్రియ ఊపందుకుంది. ఉపాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడిగా ఎదిన లీ తెంగ్–హుయి దేశాన్ని పూర్తి ప్రజాస్వామ్య దిశగా నడిపించడానికి ఉద్యుక్తుడయ్యేసరికి డ్రాగన్ తోక తొక్కినట్టయింది. 1996లో తొలిసారి స్వేచ్ఛాయుత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా తైవాన్ జల సంధిలో చైనా వందలాది క్షిపణులు ప్రయోగించింది. తైవాన్‌కు మద్దతుగా అమెరికా యుద్ధనౌకలను పంపాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో లీ అపూర్వ విజయం అందుకున్నారు. కాలక్రమంలో స్థానిక తైవానీ యుల ప్రయోజనాలకు కట్టుబడ్డ డీపీపీ వేగంగా జనాదరణ పొందింది. లీ పదవీ విరమణ తర్వాత 2000లో డీపీపీ అభ్యర్థే అధ్యక్షుడిగా గెలిచారు. గమనిస్తే, తైవాన్‌లో ప్రజాస్వామ్యం ఏర్పాటు నుంచి ఇప్పటి దాకా 2008, 2012లోనే కెఎంటి ‘మెయిన్‌ల్యాండర్’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కెఎంటి అభ్యర్థి సహా అధ్యక్ష పదవికి పోటీపడ్డ ముగ్గురూ మెయిన్ ల్యాండర్లు కాకపోవడం గమనార్హం. ఒకరకంగా ఇది అధికార డీపీపీ తైవానీ అస్తిత్వ రాజకీయాలకు రాజముద్ర. ఆసియా భౌగోళిక రాజకీయ చిత్రపటంలో తైవాన్ కీలకం. ప్రపంచ సాంకేతిక నాయకత్వ భవితవ్యంలోనూ ఆ దేశం అవిస్మరణీయం. ప్రపంచ సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో 60 శాతం పైగా, అత్యాధునిక చిప్‌లలో 90 శాతం పైగా అక్కడ చేసేవే. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్ల నుంచి కార్లు, ఉపగ్రహాల దాకా ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నిటికీ అవే ప్రాణాధారం. స్వయంప్రతిపత్తి గల తైవాన్ మనకు సహజ మిత్రదేశం. అలా తాజా ఎన్నికల ఫలితాలు సానుకూల పరిణామమే. గత 8 ఏళ్ళ లానే వచ్చే నాలుగేళ్ళూ ఢిల్లీతో బంధానికే తాయ్‌పే ఆసక్తి చూపుతుంది. దౌత్య సంబంధాలు లేకున్నా ఇప్పటికే 250కి పైగా తైవానీ కంపెనీలు భారత్‌లో 400 కోట్ల డాలర్ల మేర పెట్టు బడులు పెట్టాయి. అందుకే, తైవాన్ జలసంధిలో సుస్థిరత, ప్రశాంతత కొనసాగితే భారత్‌కు అది శుభవార్త. తరచూ సైనిక విన్యాసాలతో అస్థిరత రేపుతున్న చైనా సైతం తైవాన్ ప్రజాభీష్టాన్ని గౌరవిస్తే మేలు. -
దారితప్పిన మాల్దీవులు
ఏదో యథాలాపంగా, ఎంతో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన మాల్దీవుల పంచాయితీ ఆంతర్యం మన దేశానికి దూరం జరగటమేనని తాజా పరిణామాలు మరింత తేటతెల్లం చేస్తున్నాయి. భారత వ్యతిరేకతే అస్త్రంగా ఎన్నికల్లో ప్రచారం చేసి మొన్న నవంబర్‌లో అధికారంలో కొచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మెయిజూ ఇప్పటికీ అదే పోకడలు పోతున్నారు. లక్షద్వీప్‌లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఒక ఛాయాచిత్రాన్ని పోస్టు చేసినప్పుడు ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రాజుకున్న రగడ తర్వాత ఆ దేశం ఒకటొకటిగా చర్యలు మొదలుపెట్టింది. మన దేశం బహుమతిగా ఇచ్చిన రెండు తేలికపాటి అధునాతన ధ్రువ హెలికాప్టర్లు వెనక్కు తీసుకోవాలని కోరటంతో పాటు వచ్చే మార్చి 15లోపు దేశంలోవున్న భారత సైనిక దళాలను ఉపసంహరించాలని తుదిగడువు విధించారు. కేవలం 88 మంది సైనికుల వల్ల తమ దేశానికి ముప్పు ముంచుకొస్తుందంటూ హడావిడి చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే భారత పర్యటనకొచ్చే సంప్రదాయాన్ని పక్కనబెట్టి మెయిజూ టర్కీని ఎంచుకున్నారు. ఆ తర్వాత యూఏ ఈలో జరిగే కాప్–28 సదస్సుకెళ్లారు. తాజాగా ఈ నెల 8 నుంచి 12 వరకూ చైనాలో పర్యటించారు. ‘భౌగోళికంగా ఆకారంలో చిన్నదైనంత మాత్రాన మాల్దీవులు ఎవరి బెదిరింపులకూ లొంVýæద’ని హెచ్చరించారు. వీటన్నిటి వెనుకా ఉన్నదెవరో సులభంగానే పోల్చుకోవచ్చు. మనకూ, మాల్దీవులకూ వున్న బంధం చాలా పాతది. అలాగని భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కే శక్తులకు అక్కడ కొదవేమీ లేదు. దేశ ప్రజానీకంలోవున్న భారత్ అనుకూలతను ఎలాగైనా పరిమార్చాలని చాలామంది రాజకీయ నాయకులు ప్రయత్నించారు. ప్రత్యర్థుల విధానాలనూ, వారి కార్యాచరణనూ తప్పుబట్టడానికి సందు దొరకని ప్రతిసారీ భారత్ ప్రసక్తి తీసుకొచ్చి విమర్శించటం అక్కడ పరిపాటి. గతంలో అబ్దుల్లా యామీన్ సైతం మూడు దశాబ్దాల తన ఏలుబడిలో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, చైనాతో అంటకాగి దేశాన్ని నిండా ముంచారు. ప్రశ్నించినవారిని ఖైదు చేశారు. ఇది సరికాదంటూ తీర్పునిచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలను జైలుకు పంపారు. ఆయన నిర్వాకంలో ఆ దేశం చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించింది. వీటివల్ల చెల్లించాల్సిన వడ్డీలే అపరిమితంగా పెరిగిపోయాయి. 2013లో రెండోసారి అధికారంలోకొచ్చాక కూడా యామీన్ తీరు మారలేదు. చివరకు ఆయన విధానాలతో విసిగిన జనం 2018లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను గద్దెనెక్కించారు. నియంతృత్వ పోకడలకు పోలేదన్న మాటేగానీ... అవినీతిని అంతమొందిస్తానన్న వాగ్దానాన్ని సోలిహ్ నిలుపుకోలేకపోయారు. ఒక అవినీతి కేసులో యామీన్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడిన మాట వాస్తవమే అయినా, అది మినహా అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోయారు. ఉపాధి కల్పనలోనూ సొంత మనుషులకే ప్రాధాన్యమిచ్చారన్న ఆరోపణలు వినబడ్డాయి. ఈ అసంతృప్తిని ప్రస్తుత అధ్యక్షుడు మెయిజూ ఆసరాగా తీసుకుని అధికారానికి రాగలిగారు. అయిదున్నర లక్షలమంది జనాభాగల మాల్దీవుల్లో మూడులక్షలమంది సున్నీ ముస్లివ్ులు. మతం పేరుతో వీరిలో అత్యధికులను తనవైపు తిప్పుకోవాలని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టాలని అంతక్రితం యామీన్ ప్రయత్నించినా ప్రయో జనం లేకపోయింది. కాకపోతే ఈ రాజకీయ క్రీడ చివరకు సెక్యులర్ పార్టీల వైఫల్యంగా మారి మతతత్వ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మెయిజూ అయినా, మరొకరైనా దేశాభివృద్ధిలో భారత్ కీలకపాత్రను తోసిపుచ్చలేరు. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా భారత్‌దే. దీన్ని తగ్గించుకుందామని ప్రయత్నిస్తే వ్యయం పెరగటం మినహా ప్రయోజనం శూన్యం. ఇక మాల్దీవుల విదేశీ రుణాల్లోనూ సింహభాగం మన దేశానిదే. గతంలో చైనాతో సాన్నిహిత్యం పెంచుకుని ఎడాపెడా రుణాలు తీసుకుని శ్రీలంక ఆర్థికంగా ఎంత నష్టపోయిందో, ఎలా దివాలా తీసిందో అక్కడి పరిణామాలే తేటతెల్లం చేశాయి.అధికారంలోకొచ్చిన నాటి నుంచీ మెయిజూ పాలనపై దృష్టి నిలపడానికి బదులు చైనాను సంతుష్టిపరచటానికి సమయం వెచ్చిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఒకే తరహా వ్యవస్థలు,రాజకీయ భావాలుండటం సాధ్యం కాదు. ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా అధికారంలో కొచ్చాక బాధ్యతగా మెలగాలి. దేశ గరిష్ఠ ప్రయోజనాలు గీటురాయిగా ఉండాలి తప్ప, మూర్ఖత్వంతో అవతలివారిని నొప్పించటమే ధ్యేయం కాకూడదు. మెయిజూకు ఎన్నికల జాతరలో తలకెక్కిన మత్తు ఇంకా దిగినట్టు లేదు. లోగడ పాలించిన యామీన్‌కు చైనాతో ఉన్న సాన్నిహిత్యం, ఇటీవల గద్దె దిగిన సోలిహ్ భారత్ అనుకూల ధోరణి జగద్వితమే అయినా వారిద్దరూ ఇరు దేశాలకూ సమాన దూరంలో మెలుగుతామని ప్రకటించేవారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాల్లో ఎంతోకొంత దాన్ని చేసిచూపేవారు. మెయిజూకు ఆ పరిణతి లేదని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అది చాలదన్నట్టు ఇటీవల తైవాన్‌లో చైనాను గట్టిగా వ్యతిరేకించే పక్షమే తిరిగి అధికారంలోకి రాగా, తగుదునమ్మా అంటూ తమది ‘వన్ చైనా’ విధానమేనంటూ ప్రకటించారు. భౌగోళికంగా చూస్తే మాల్దీవులు 1,190 పగడపు దిబ్బల సముదాయం. కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం 185 దీవులు మాత్రమే. మన దేశానికి 400 కిలోమీటర్ల దూరంలోవుంటూ మన భద్రత రీత్యా హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న మాల్దీవులు భారత్ – చైనాల మధ్య సాగే పందెంలో తలదూర్చి బొప్పి కట్టించుకునే చేష్టలకు దూరంగా ఉండటం అన్నివిధాలా దానికే శ్రేయస్కరం. -
ట్రంప్ వైపే ‘అయోవా’!
అమెరికాలోని అయోవా రాష్ట్రం అందరి భయాలనూ నిజం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఆ రాష్ట్రంలోని పార్టీ ప్రతినిధులు పట్టం కట్టారు. దేశానికి ట్రంప్ బెడదను నివారించటంలో అయోవా రిపబ్లికన్లు తోడ్పడితే బాగుణ్ణని చాలామంది పెట్టుకున్న ఆశలు తలకిందయ్యాయి. ఇదే రేస్‌లోవున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అయోవాలో తగినన్ని ఓట్లు రాబట్టలేక పోటీకి స్వస్తిచెప్పారు. మెరుగ్గా ఓట్లు పడకపోతే పోటీ నుంచి తప్పుకుంటారేమోనని వివేక్ మద్దతుదారులు భయపడ్డారు. చివరకు అదే జరిగింది. మున్ముందు ఏమవుతుందన్నది పక్కనబెడితే అయోవాలో ట్రంప్ సాధించిన విజయం అనేక విధాల కీలకమైనది. ఇదే రాష్ట్రంలోని రిపబ్లికన్లు ఎనిమిదేళ్లక్రితం అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ను పట్టించుకోలేదు. అప్పట్లో ఆయనకు కేవలం 21 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేల్లో సైతం రిపబ్లికన్లలో అనేకులు విముఖంగానే వున్నట్టు తేలింది. కేవలం కార్మికవర్గ ఓటర్లు మాత్రమే ఆయన వైపు మొగ్గుచూపుతున్నారని, పార్టీలోని కాలేజీ గ్రాడ్యుయేట్స్‌లో అత్యధికులకు ట్రంప్ పోకడలు నచ్చటం లేదని ఆ సర్వేలు తెలిపాయి. వేరేచోట్ల ముందంజలోవున్న ట్రంప్‌ను అయోవాలో అడ్డుకోగలిగితే పార్టీ తరఫున దేశాధ్యక్షుడిగా పోటీ చేయటానికి తన అవకాశాలు మెరుగుపడతాయని డీశాంటిస్ లెక్కలేశారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. విధానాలకూ, నిబంధనలకూ కట్టుబడి ఉండటం ముఖ్యమా... లౌక్యంగా పోవటం మంచిదా అన్న మీమాంస చాలా పాతది. డోనాల్డ్ ట్రంప్ ఒక నీలి చిత్రాల నటి నోరునొక్కేందుకు తన న్యాయవాది ద్వారా ముడుపులు చెల్లించారన్న అభియోగం విచారణార్హమైనదేనని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నిర్ధారించినప్పుడు అనేకులు లబలబలాడారు. కేసులు పెడితే సానుభూతి వెల్లువెత్తుతుందని, ఆయన బలపడతాడని హెచ్చరించారు. కానీ డెమాక్రాట్లు వినలేదు. ఇక 2020నాటి అధ్యక్ష ఎన్నికల వ్యవహారం సరేసరి. ఓటమి తప్పదని గ్రహించిన ట్రంప్ వాటిని తారుమారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు ఓట్ల లెక్కింపును అడ్డుకోవటం కోసం కేపిటల్ హిల్ భవననానికి తరలిరావాలంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టారు. పర్యవసానంగా భారీయెత్తున హింస చోటుచేసుకుంది. పలువురు మరణించారు. ఈ ఉదంతాల్లో ట్రంప్‌పై కేసులున్నాయి. అదిగాక తనకు ప్రధాన పోటీదారు కాబోతున్న డెమాక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై విచారణకు ఆదేశించాలని 2019లో ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలో ఒకసారి... ఓట్ల లెక్కింపు సమయంలో మద్దతుదార్లను హింసకు ప్రేరేపించారన్న అభియోగంలో మరోసారి ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించింది. రెండుసార్లూ తమకు బలంవున్న సెనేట్‌లో రిపబ్లికన్లు ట్రంప్‌ను నిర్దోషిగా బయటపడేశారు. చివరకు జరిగేదేమిటో తెలిసి నప్పుడు ట్రంప్‌పై ఇదంతా అవసరమా అన్నది విశ్లేషకుల వాదన. కానీ డెమాక్రాట్లకు ఇదంతా పట్టలేదు. నిజానికి సానుభూతే అయోవాలో కొత్త ఓటర్లను ఆయనవైపు మళ్లించిందని తేలింది. తాజా ఎన్నికకు ముందు జరిగిన సర్వేల్లో ప్రత్యర్థుల కన్నా ట్రంప్ చాలా ముందున్నారు. ట్రంప్‌పై పెట్టిన కేసులన్నీ బోగస్‌వేనని పార్టీ ఓటర్లు చెప్పడం గమనించదగ్గది. నిజానికి అయోవాపై ట్రంప్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. 2016లో పార్టీలో తనపై పోటీచేసిన సెనెటర్ టెడ్ క్రజ్ రిగ్గింగ్‌తో గెలిచారని అప్పట్లో ఆయన గొడవ చేశారు. ఈసారి అదే పని డీశాంటిస్ చేయ బోతున్నారని గగ్గోలు పెట్టారు. కానీ అందుకు భిన్నంగా కార్మికవర్గ ఓటర్లతోపాటు గ్రాడ్యుయేట్లు కూడా ట్రంప్‌ను బలంగా సమర్థించారని తేలింది. ఇక్కడ డీశాంటిస్‌కు గట్టి మద్దతుందని అంచనా వేసిన నిక్కీ హేలీ ఆయనకు వ్యతిరేకంగా భారీయెత్తున ఖర్చుచేశారు. పైగా డెమాక్రటిక్ ఓటర్లు కొందరు హేలీ కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి, ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు. బహుశా అందుకే కావొచ్చు...డీశాంటిస్ కన్నా కాస్త మెరుగ్గా ఓట్లు సాధించి ఆమె ద్వితీయ స్థానంలో నిలిచారు. అయోవాతో మొదలైన రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వచ్చే జూన్ 4తో ముగుస్తుంది. పార్టీలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక కూడా రిపబ్లికన్లకు ట్రంపే నాయకుడిగా కొనసాగుతున్నారు. నోటి దురుసుతనం, ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకు పడటం లాంటివి ఆయనకు తోడ్పడుతున్నాయో... ఆ పార్టీయే అటువంటివారిని నెత్తినపెట్టుకునే స్థాయికి దిగజారిందో అనూహ్యం. ట్రంప్‌ను విమర్శిస్తే ఆయన మద్దతుదార్లు దాడి చేస్తారని పార్టీ లోని ప్రత్యర్థులే బెంబేలెత్తటం గమనించదగ్గది. ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. వలసదారులు దేశాన్ని విషపూరితం చేస్తున్నారని, వారిని తరిమికొట్టడమే తన ధ్యేయమని ఆ మధ్య ప్రకటించారు. తాను మళ్లీ అధికారంలోకొస్తే నియంతగా మారి వ్యతిరేకులందరినీ తుడిచిపెడతానని, అసమ్మతిని అణిచేస్తానని హెచ్చరించారు. పార్టీలో ఆయనతో పోటీపడుతున్నవారిదీ అదే బాణీ. తాను గెలిస్తే ఎఫ్‌బీఐని రద్దుచేస్తానని, ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఇంటికి పంపుతానని వివేక్ ఎలుగెత్తారు. ఉన్నంతలో నిక్కీ హేలీ కన్నా డీశాంటిస్ మెరుగే అయినా ట్రంప్ ముందు ఆయన నిలబడలేరని తాజా ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇటు డెమాక్రాట్లు సైతం 81 ఏళ్ల జో బైడెన్‌ను మించి మరెవరినీ ఎంపిక చేసుకోలేక ట్రంప్ సునాయాస విజయానికి పరోక్షంగా బాటలు పరుస్తున్నారు. -
శ్రీ సూర్యనారాయణా...
బతుకులో పండుగ కాని క్షణం ఏముంటుంది! జీవితాన్ని కేవలం జీవించడం కాదు, ఉత్సవీక రించుకోమని చెబుతుంది ఒక సూక్తి. కాకపోతే ఒక షరతు; మహాకవి చెప్పినట్టు, మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మనకేనని ఆనందించే పసికూనలమైపోవాలి అందరం. జీవితం అనుక్షణ ఉత్సవభరితమే అయినా ప్రకృతిలో మారే ప్రతి ఋతువూ, కాలం వెంబడి మనిషి వేసే ప్రతి కీలకమైన అడుగూ పెద్దపండుగ అవుతుంది. ధనూరాశి నుంచి మకరరాశి లోకి సూర్యుడి సంక్రమణాన్ని సంకేతించే అలాంటి పెద్ద పండుగే సంక్రాంతి. ఏటా నెల నెలా రాశి విడిచి రాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే ప్రతి సందర్భమూ సంక్రాంతే అయినా, మకర సంక్రాంతి మాత్రమే ఎందుకు మైలురాయి అయిందంటే; అప్పటికి మంచుపొరలు, చీకటి తెరలు క్రమంగా తొలగి వెలుగు వాకిళ్ళు తెరచుకోవడం మొదలవుతుంది. కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో పశువులు, పక్షులతో సహా ప్రకృతి సమస్తం భాగమై మనిషిలో కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అలా ప్రతి ప్రాణితోనూ, చెట్టుతోనూ, పుట్టతోనూ తన ముడిని గుర్తుచేసుకునే సందర్భమే సంక్రాంతి. ఆ మాటకొస్తే ఏ పండుగైనా అంతే. చిత్రవిచిత్రమైన రంగవల్లులను తీర్చిదిద్దేది, కొత్త బియ్యపు పిండిని చీమల వంటి సూక్ష్మజీవులకు ఆరగింపు చేసి భూతదయను చాటుకునేందుకేనని పెద్దలంటారు. ఒక్కోసారి తత్త్వం అడుగంటి తంతు మిగలడం కాలం చేసే మాయ. మనిషి ఊహలో తొలిదైవంగా ముద్రపడిన ప్రాకృతిక అద్భుతమే సూర్యుడు. పరోక్ష దేవతలకు భిన్నంగా ఆయన ప్రత్యక్ష దైవం. అందుకే సర్వసాక్షి, కర్మసాక్షి సహా ఆయన చుట్టూ ఎన్నో కల్పనలు. దేవతల్లో పెద్దాయన ఆయనే. ప్రపంచమంతటా తొలి కొలుపులు అందు కున్నవాడిగా ఆయన వైశ్విక దైవం. దేవుడి గురించిన తొలి ఎరుక కలిగించిన ఆ మెరుపు, మైమరపు ఋగ్వేదంతో సహా ఆదిమ కృతులన్నింటిలో నిసర్గసుందరంగా వ్యక్తమవుతాయి. మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఒకప్పుడు ప్రధాన దైవమైన సూర్యుడికి మన పౌరాణిక ప్రసిద్ధుడైన నారాయణుని పేరు చేర్చిన ఫలితంగానే ఆయన సూర్యనారాయణుడయ్యాడని గుంటూరు శేషేంద్రశర్మ అంటారు. ఒకప్పుడు పశ్చిమాసియాలో మిత్రారాధన పేరుతో వర్ధిల్లిన సూర్యారాధన ప్రభావం ఇతర మతాలపై ఎలా పడిందో అత్యంత ఆశ్చర్యకరంగా వివరిస్తాడు జి.జె.ఎం. ఫ్రేజర్ తన ‘గోల్డెన్ బౌ’ అనే బృహద్రచనలో. మన శ్రీరామచంద్రుడే కాక, ఒకనాటి పశ్చిమాసియా రాజులు, పర్షియన్ చక్రవర్తులు కూడా తమను సూర్యుడితో ముడిపెట్టుకున్నారు. ఆదిత్యçహృదయోపదేశం పొందిన తర్వాతే రాముడు రావణుని జయించగలిగాడని రామాయణం అంటుంది. సంక్రాంతినీ, సూర్యునీ లోతుగా తడిమిన కొద్దీ ఇంకా ఎన్నెన్ని విశేషాలో! సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఘట్టాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకొంటాం కానీ నిజంగా సూర్యుడికి గమనమంటూ ఉంటుందా? భూమే సూర్యుడి చుట్టూ ఒకింత వంపుతో తిరుగుతూ దూరమూ, దగ్గరా అవుతున్న క్రమంలోనే కాలాలూ ఋతువులూ ఏర్పడుతున్నాయి. మకర సంక్రాంతిని ఇప్పుడు జనవరి 15న జరుపుకొంటున్నాం కానీ, క్రీ.శ. 1000లో డిసెంబర్ 31న, క్రీ.శ.272లో డిసెంబర్ 21న జరుపుకొనేవారట. మరో తొమ్మిదివేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జూన్ నెలలో వస్తుందట. జ్యోతిశ్శాస్త్ర సంబంధమైన కాలగణనాలు ఇలాంటి విచిత్రాలను ఆవిష్కరిస్తే, శాస్త్రవిజ్ఞానం మరో రకమైన విలక్షణ దృశ్యానికి తెరతీసి ఒక్కోసారి వెన్నులో వణకు పుట్టిస్తుంది. సూర్యుడు ఎంత పెద్దాయనంటే, ఆయన వయసు 460 కోట్ల సంవత్సరాలకు పైనేనట. మరో 500 కోట్ల సంవత్సరాలు గతిస్తే, తన చుట్టూ తిరిగే భూమితో సహా అన్ని గ్రహాలనూ తనలో కలిపేసుకుని ఓ తెల్లని మరుగుజ్జు నక్షత్రంగానూ, ఆ తర్వాత నల్లని నక్షత్రంగానూ మారిపోతాడట. ఆ లోపల తన కేంద్రంలో నిరంతరాయంగా జరిగే కోట్ల టన్నుల హైడ్రోజన్, హీలియవ్ుల కలయిక నుంచి లక్షల టన్నుల పదార్థం శక్తిగా మారిపోయే క్రమంలోనే మన మనుగడకు అవసరమైన వెలుగు, వేడి లభిస్తున్నాయి. శీతోష్ణాల నిర్విరామ ఘర్షణ నుంచే జీవి పుట్టి మనతో సహా అనేక ప్రాణుల రూపంలో పరిణామం చెందడం వేరే కథ. మన ఊహకు అతీతమే కాక, మన నిత్యజీవన సంతోషాలకు ఏమాత్రమూ అడ్డురాని సూర్యుని వైశ్విక మూలాలను ఈ పండుగ వేళ మరీ లోతుగా తడమడమెందుకు? ప్రకృతితో మమేకమై వెలుగూ వేడిలో స్నానిస్తూ ఈ క్షణాలను మధురమధురం చేసుకుందాం. పొన్న,ఉల్లి, జాజి, సంపంగి, మల్లె, మంకెన, ములగ, ఆవ, వంగ, గుమ్మడి పూచాయలు ధరించే ఆ సూర్యనారాయణుడికి నోరారా మేలుకొలుపు పాడుకుందాం. కవయిత్రి కుప్పిలి పద్మ అన్నట్టు, ఒక్కుమ్మడిగా పండుగను పిలిచేందుకు ఈ చేతులతో చుక్కల ముగ్గుల్ని, రంగుల చామంతుల్ని పూయిద్దాం. ఎక్కడెక్కడి చుట్టాలనో ఏడాదికొకచోట కలిపే సారంగధర మెట్ట మీది తనివితీరని తిరునాళ్ళ పుట్టినిల్లు జ్ఞాపకాల నెగడు దగ్గర చలి కాగుదాం. చెట్టుకొకరుగా పుట్టకొకరుగా తుప్పల వెంటా పుంతల వెంటా పడి తిరుగుతూ, ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్క మొగ్గనీ తెంపకుండా, ఒక్క పువ్వునూ వదలకుండా మృదువైన పూల వేట సాగిద్దాం. -
రామ్... భీమ్... యుగధర్మం!
బాలరాముని అయోధ్య మందిరం ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది. ఇక వచ్చే వారం రోజులైతే నిజంగానే ‘‘అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామ మయం’’. ఏదో ఒక రూపంలో రామాయణ కావ్యం లేని వాఙ్మయం ఆసియా దేశాల్లో ఎక్కడా లేదు. భారతీయ సంతతి ప్రజలు నివాసముండని దేశాలు ఈ భూఖండంలో ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. రామా యణం భారతీయుల జీవన విధాన పారాయణంగా మారినందువల్ల ఆ సంప్రదాయాన్ని మనవాళ్లు దేశదేశాలకూ మోసుకొని వెళ్లారు. రామనామం పవర్ ఏమిటో బీజేపీ వాళ్లకు తెలిసినంతగా మరే రాజకీయ పార్టీకీ తెలియదు. మన దేశంలోని ఆబాల గోపా లాన్ని టెలివిజన్ ఛానెళ్ల ముందు కూర్చోబెట్టిన తొలి దృశ్య కావ్యం కూడా రామాయణమే. ఒక దశలో లోక్‌సభలో కేవలం రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తి రసాన్ని రణవ్యూహంగా మార్చుకున్న తర్వాతనే తొంభై సీట్లకు, మూడంకెలకు, ఆపై ప్రభుత్వ స్థాపన స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ప్రభుత్వంలో బలంగా స్థిరపడిపోయింది. పూర్వం రాజాధి రాజులు, చక్రవర్తులు బలంగా ఉన్నప్పుడే అశ్వమేధ యాగాలు చేసేవారట! శత్రు నిశ్శేషం చేసుకోవడం వాటి లక్ష్యం. ఇప్పుడు దేశంలో బీజేపీ బలంగానే ఉన్నది. అయినా రామాలయ ప్రతిష్ఠాపనను తన ప్రభుత్వ భుజాల మీదకే ఎత్తుకున్నది. అశ్వమేధయాగం స్థాయిలో ఈ మహా క్రతువుకు నడుం కట్టింది. ప్రతిష్ఠాపన యజ్ఞంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అందుకు అవసరమైన పదకొండు రోజుల అనుష్ఠానాన్ని కూడా ఆరంభించారు. దీని మీద రక రకాల అభ్యంతరాలు, అభిశంసనలు వస్తున్నాయి. శ్రీరామ చంద్రుడు భార్యావియోగ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు వశిష్టాది రుషులంతా పూనిక వహించి ఆయన చేత అశ్వమేధం చేయిస్తారు. రాముడికో అనుమానం వస్తుంది. భార్యా విహీనుడైన తానెట్లా యాగం చేయగలనని ప్రశ్నిస్తాడు. భార్యా సమేతంగానే యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనాలనేది నియమం. శ్రీరామునికి బావ గారైన రుష్యశృంగ మహాముని ఆయన సందేహాన్ని నివృత్తి చేస్తాడు. బంగారంతో భార్య విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకొని యజ్ఞం పూర్తి చేయొచ్చని తరుణోపాయం చెబుతాడు. త్రేతాయుగంలోనే అవసరాన్ని బట్టి విరుగుడు మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కలియుగం చివరి పాదంలో ఇప్పుడుండవా? కనుక ఆ విషయంలో మోదీపై అభ్యంతరాలు చెల్లవని శ్రీరామ వర్సెస్ అదర్స్ కేసులో రుష్యశృంగ న్యాయమూర్తి తీర్పు స్పష్టం చేస్తున్నది. శ్రీరామచంద్రమూర్తి ఒక మతానికి ప్రతీకా? ఇదొక చర్చనీయాంశం. ఈ దేశంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని మెప్పించి లబ్ధి పొందడమే బీజేపీ ప్రభుత్వ రాజకీయ ఉద్దేశం కావచ్చు. కాదనడానికి ప్రాతిపదిక లేదు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దండయాత్రగానే రామ మంత్రాన్ని బీజేపీ జపించింది. హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగానే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆలయ నిర్మాణాన్ని ఆ పార్టీ చేర్చింది. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల వాకిట్లో సాక్షాత్తూ ప్రధానమంత్రి హస్తాల మీదుగా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయి. కానీ, అది ఎన్నికల హామీయే కనుక నిలబెట్టుకుంటున్నామని బీజేపీ వాదిస్తున్నది. శ్రీరాముడు హిందూ మతానికి ప్రతీకగా భావిస్తే లౌకిక రాజ్యంలో ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుంది. అసలు హిందూమతం అంటూ ఒకటున్నదా అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తున్నది. ఒక నిర్ధారిత పవిత్రగ్రంథం, ఒక ప్రవక్త లేని జీవన విధానాన్ని మతం అనవచ్చునా? బీజేపీ వాళ్లూ, సంఘ్ పరివార్ వాళ్లూ హిందూమతం అనే మాట కంటే హిందూ ధర్మం అనే మాటనే ఎక్కువగా వాడుతుంటారు. అందుకు కారణం విశ్వాసమైనా కావచ్చు, ఎత్తుగడైనా కావచ్చు. హిందూ ధర్మం అంటే ఏమిటి? అనేది ఇంకో ప్రశ్న. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై దేశంలో పెద్ద చర్చే జరిగింది. సనాతనమంటే శాశ్వతమనే అర్థమున్నది. ధర్మం శాశ్వ తంగా స్థిరంగా ఉంటుందా? కాలానుగుణంగా మారదా? యుగ ధర్మం అంటారు కదా! అంటే ఏమిటి? ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్నాడు కృష్ణ భగ వానుడు. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని కాపాడేందుకు తాను అవతరిస్తానని భావం. అంటే యుగధర్మాన్ని కాపాడేందుకు అవతరించడమా లేక శాశ్వత ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో అవతరించడమా? ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని శ్రీరామచంద్రుడిని ప్రశంసిస్తారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందనీ, రాముడు ధర్మ స్వరూపుడనే అర్థంలో! పైగా ఈ మాట అన్నది ఎవరో కాదు. శ్రీరాముని శత్రు శిబిరంలోని వాడైన మారీచుడు. శ్రీరాముడు వరాలిచ్చిన దేవుడు కాదు. ఆపద మొక్కులవాడూ కాదు. ఒక మనిషి. స్వయంగా కోరి కష్టాలను అనుభవించినవాడు. రుజు ప్రవర్తన కలిగినవాడు. తండ్రి మాటను తలదాల్చినవాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వాడు. ఒక్కరితోనే జీవన సాహచర్యమని నమ్మినవాడు, ఒక రాజుగా ప్రజాభిప్రాయాన్ని మన్నించినవాడు. శిష్టరక్షణకు దుష్టశిక్షణకు వెనుకాడనివాడు. ఈ రకంగా తన జీవితాన్ని ఒక పాఠంగా ఈ సమాజానికి అందించినవాడు కనుకనే ఆయనను ధర్మస్వరూపుడని కీర్తించారు. భారతీయులపై రామాయణ ప్రభావం మత విషయాల కంటే సాంస్కృతిక రంగంలోనే ఎక్కువ. సామాజిక కట్టుబాట్లపైన, నైతిక నియమాలపైన, మన సాహిత్యం, సంగీతం, కళలు, నాట్యంపైనా రామాయణం ముద్ర ఉన్నది. ధర్మం, కర్మ, జీవిత పరమార్థం వంటి అంశాలు మన తాత్వికతను పరిపుష్టం చేశాయి. మన పాత్రను సక్రమంగా ఎలా అర్థం చేసుకోవాలో రామాయణం చెబుతుంది. నమ్మిన మార్గంలో సవాళ్లు ఎదురైనా ఎలా ముందుకు వెళ్లాలో రామా యణం బోధిస్తుంది. లోతుగా పరిశీలిస్తే శ్రీరాముని పాత్ర భారతీయ సమాజంపై వేసిన ముద్ర మతపరమైనదిగా కనిపించదు. ధార్మికమైనది, సాంస్కృతిక పరమైనదిగానే కనిపిస్తుంది. కాకపోతే శ్రీరాముడికి బీజేపీ–సంఘ్‌పరివార్ కొంత రాజకీయం పులమడంతో ఈ కార్యక్రమం మీద మతం రంగు పడింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటని మతపెద్దలే కొందరు పెదవి విరుస్తున్నారు. కొద్దిరోజుల్లో దివ్యమైన సందర్భం శ్రీరామనవమి ఉండగా ఎందుకీ తొందరపాటని విసుక్కుంటున్న వారు కూడా ఉన్నారు. శంకరాచార్యుల వంటి శైవ కూటమి పెద్దలు కార్యక్రమాన్ని అభిశంసిస్తున్నారు. లౌకిక వాదుల విమర్శలు సరేసరి! బీజేపీ, సంఘ్ పరివార్‌ల మూడు దశాబ్దాల కృషి అయోధ్య రామమందిరం. ఇన్నాళ్ల శ్రమను ఎన్నికల్లో గిట్టుబాటు చేసుకోకుండా ఎలా ఉంటాయి? శ్రీరాముడి ఆదర్శాలన్నీ త్రేతాయుగానికి సంబంధించినంత వరకు ధర్మబద్ధమే కావచ్చు. యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతాయి. వేదవేదాంగాల వంటి శ్రుతులు చెప్పిన విషయాలు నిత్య సత్యాలనీ, మనుస్మృతి వంటి స్మృతులు పెట్టిన నియమాలు కాలాన్నిబట్టి మారుతాయనీ పండితులు చెబుతారు. శ్రీరాముడు చేసిన కొన్ని పనులు ఆ తర్వాతి యుగాలకు సమ్మతమయ్యేవి కావు. బహుశా ఆ కాలంలో కూడా అసమ్మతి గళాలున్నా రామాయణంలో వినిపించలేదేమో. వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి తపస్సు చేస్తున్న శూద్ర శంబూ కుని తలను శ్రీరాముడు తెగనరికాడు. ఒకే ఒక్కడి మాటకు ప్రజాభిప్రాయమనే ముద్రవేసి సీతమ్మను అడవులకు పంపించాడు. రావణుడి చెర నుంచి విడిపించినప్పుడు ఆమె శీల పరీక్షకు ఆదేశించాడు. ఇవన్నీ ఏ యుగంలోనూ ఆదర్శాలు కాబోవు. ప్రజా క్షేమం కోరే పరిపాలన, మాట తప్పని వ్యక్తిత్వం, సవాళ్లకు తలవంచకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం, ఏక పత్నీవ్రతం వంటి రామయ్య సుగుణాలు సర్వకాల సర్వా వస్థల్లోనూ ఆదర్శంగా నిలబడతాయి. అటువంటి ఆదర్శాలకు గుర్తుగా భవ్యమైన రామమందిరం రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైతే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అయో ధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సరిగ్గా మూడు రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప విగ్రహావిష్కరణ కార్య క్రమం జరగబోతున్నది. శ్రీరాముడు త్రేతాయుగ ధర్మానికి, కొన్ని శాశ్వత మానవీయ విలువలకు సంకేతమైతే, ఈ ప్రజా స్వామ్య యుగ ధర్మాన్ని క్రోడీకరించి, రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథ రచనకు నేతృత్వం వహించినవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగబోతున్నది. రామాలయం లేని ఊరు ఉండదనేది యాభయ్యేళ్ల కిందట తెలుగునాట తరుచుగా వినిపించిన నానుడి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వామి విజృంభించడంతో ఇప్పుడు ఆ నానుడి వినిపించడం లేదు. దళితులు, బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులవుతున్నకొద్దీ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలు కూడా ఊరూరా విస్తరించాయి. ఇప్పుడు ఆయన విగ్రహం లేని ఊరు తెలుగు నాటనే కాదు, దేశంలోనే ఎక్కడా లేదు. ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రతిష్ఠాత్మక ప్రదేశాల్లో కూడా అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున పద్దెనిమిది ఎకరాల స్వరాజ్య మైదాన్‌లో ఆవిష్కృతం కాబో తున్న ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఒక ఎత్తు. ప్రపంచంలో ఉన్న అన్ని అంబేడ్కర్ విగ్రహాల కంటే ఇది ఎత్తయినది. 80 అడుగుల పాదపీఠికపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నది. మొత్తం కలిపి 210 అడుగులు. ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ వర్గాలపై, ఆ వర్గాలు ఆధి పత్యం వహిస్తున్న వ్యవస్థలపై పేదల పక్షాన వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయపోరాటం చేస్తున్నది. ఆ పోరా టానికి నిరంతర స్ఫూర్తి జ్వలితరూపంగా ఈ విగ్రహం నిలబడబోతున్నది. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛా ప్రజాస్వామిక యుగధర్మాలు. ఈ ధర్మాలకు రాజ్యాంగ రచనలో పెద్దపీట వేయడమే కాదు, ప్రజాశ్రేణుల్లో వాటిపై అవగాహన కల్పించడంలోనూ ఆయన కృషి చేశారు. కులవ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా నిజమైన సమానత్వం సిద్ధించదని బోధించాడు. దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేకూర్చడం, భావ ప్రకటనా, ఆరాధనా స్వేచ్ఛలను ప్రసాదించడం, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించడమే ధ్యేయంగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రూపొందించింది. ఆ రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి పూనుకోవడమే నేరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వర్గం జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. యెల్లో మీడియా చానళ్లు రోజుకు 20 గంటల సమయాన్ని, పత్రికలు ముప్పావు భాగం స్థలాన్ని జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయ డానికి వినియోగిస్తున్నాయి. అవకాశవాద పొత్తులతో ప్రజా ప్రభుత్వాన్ని ఓడించడానికి కుట్రలు చేస్తున్నాయి. డబ్బులు వెద జల్లుతున్నాయ్. మీడియా–సోషల్ మీడియాల విషప్రచారాలు చాలవని వేలాదిమందిని దినవేతనంపై సమీకరించి వారి ద్వారా కూడళ్లలో విషప్రచారానికి పాల్పడుతున్నాయి. కానీ సమానత్వం ఈ యుగధర్మం. ధర్మంపై అధర్మం గెలవదు. యుగయుగాల సందేశం ఇదే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దక్షిణాఫ్రికా సాహసం!
నిలదీయటానికీ, నేరాన్ని వేలెత్తి చూపటానికీ సంపన్న రాజ్యమే కానవసరం లేదని, గుప్పెడు ధైర్యం, నిటారైన వెన్నెముక వుంటే చాలని దక్షిణాఫ్రికా నిరూపించింది. గాజా అనే ఒక చిన్న ప్రాంతాన్ని గుప్పిట బంధించి గత మూడు నెలలుగా సామూహిక జనహననం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)కు ఈడ్చి సవాలు విసిరింది. అమెరికాతో సహా అగ్రరాజ్యాల అండదండలున్న ఇజ్రాయెల్ ఈ పరిణామానికి జడిసి తన దారుణ మారణకాండను వెంటనే ఆపుతుందనుకోవటానికి లేదు. వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ భద్రతా నిర్మాణాలను తొలగించా లని ఐసీజే 2004లో ఇచ్చిన తీర్పునే అది బేఖాతరు చేస్తోంది. కానీ వినతులతో, వేడుకోళ్లతో సరి పెడుతూ అంతకుమించి మరేమీ చేయని, మాట్లాడని ప్రపంచ దేశాలకు దక్షిణాఫ్రికా తీసుకున్న వైఖరి చెంపపెట్టు. ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందో లేదో నిర్ణయించటానికి దక్షిణాఫ్రికా వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్ సంజాయిషీని తెలుసుకుంది. అయితే విచారణ పూర్తయి తీర్పు రావటానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఈలోగా జాతిహననం, విధ్వంసం నిలిపివేయాలంటూ అత్య వసర ఉత్తర్వులివ్వాలని దక్షిణాఫ్రికా కోరుతోంది. గత మూడు నెలలుగా గాజాపై సాగిస్తున్న ఏకపక్ష దాడుల్లో 23,000 మంది పౌరులు మరణించగా లక్షలాదిమంది గాయపడ్డారు. మృతుల్లో పదివేల మంది వరకూ మహిళలు, పసివాళ్లున్నారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రాణాలతో మిగిలిన 20 లక్షలమంది పౌరులు నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. 70 శాతం ఇళ్లు, 50 శాతం భవంతులు బాంబు దాడుల్లో పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటికేఅంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఇజ్రాయెల్, హమాస్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. జరిగిన జనహననం వెనకున్న ఉన్నత స్థాయివ్యక్తులెవరో, వారి యుద్ధ నేరాలేమిటో అది ఆరా తీస్తుంది. దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుత పరిష్కారం అన్వేషించటం ఐసీజే పని. ఇజ్రాయెల్ చేష్టలను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోబోదని చెప్పటమే దక్షిణాఫ్రికా చర్య వెనకున్న ఉద్దేశం. ఇజ్రాయెల్ చరిత్ర గమనించినవారికి ఆ దేశంపై జినోసైడ్ (జాతిని తుడిచిపెట్టడం) నిందా రోపణ రావటం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే అనేక దేశాల్లో నిరాదరణకూ, ఊచకోతకూ గురై చెట్టుకొకరూ, పుట్టకొకరూ అయిన యూదులకు రెండో ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యాల చొరవతో ఇజ్రాయెల్ పేరిట ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇప్పుడు అదే దేశంపై జనహనన ఆరోపణలు రావటం ఒక వైచిత్రి. జనవిధ్వంసానికి వ్యతిరేకంగా 1948లో కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికపై ఇజ్రాయెల్ కూడా సంతకం చేసింది. కానీ దాన్ని గౌరవించిన సందర్భం లేదు. నిజానికి తానే బాధిత దేశాన్నని ఇజ్రాయెల్ అంటున్నది. ఆక్టోబర్ 7న తన భూభాగంలోకి చొరబడిన హమాస్ ఉగ్ర వాదులు 1,200 మందిని కాల్చిచంపి, 240 మందిని బందీలుగా పట్టుకున్నారని, అందుకే తాము దాడులు చేయాల్సివస్తోందని ఇజ్రాయెల్ వాదన. నిజమే... అమాయక పౌరులను భయపెట్టడం, హతమార్చటం నాగరిక ప్రపంచంలో ఏ ఒక్కరూ సమర్థించరు. తమకు అన్యాయం జరిగిందనుకుంటే శాంతియుతంగా పోరాడి సాధించుకోవాలి తప్ప హింసతో, బలప్రయోగంతో ఎదుర్కొనటం పూర్తిగా తప్పు. అలాంటి చర్యల వల్ల లక్ష్యం సిద్ధించదు సరిగదా... రాజ్యహింసకు లక్షలాదిమంది అమాయకులు బలవుతారు. అయితే హమాస్ చేతుల్లో మరణించిన పౌరులకు ప్రతిగా అవతలిపక్షం నుంచి ఎంతమందిని బలితీసుకుంటే తన దాహం చల్లారుతుందో ఇజ్రాయెల్ చెప్పగలదా? దాడు లకు కారకులైనవారిని పట్టుకోవటం, చట్టప్రకారం శిక్షించటం అనే ప్రక్రియను కాలదన్ని విచక్షణా రహితంగా యుద్ధవిమానాలతో బాంబుల మోతమోగించటం... హమాస్‌తో సంబంధం లేని సాధా రణ పౌరుల ప్రాణాలకూ, ఆస్తులకూ ముప్పు కలిగించటం ఎంతవరకూ న్యాయం? నిజానికి పాల స్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం వెదికేందుకు జరిగిన ప్రతి యత్నాన్నీ అడ్డుకున్నది ఇజ్రా యెలే. ఒక దేశమంటూ లేకుండా, అత్యంత దుర్భరమైన బతుకులీడుస్తున్న పౌరులను దశాబ్దాలుగా అణచివేయటంవల్ల సమస్య ఉగ్రరూపం దాలుస్తుందని ఆ దేశం గ్రహించలేకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇజ్రాయెల్‌కు అండదండలందిస్తున్న అమెరికాకు దక్షిణాఫ్రికా చర్య మింగుడుపడటం లేదు. ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పి దాడులు ఆపించివుంటే అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట పెరిగేది. ఆ విషయంలో పూర్తిగా విఫలమై దక్షిణాఫ్రికాను నిందించటం అర్థరహితం.జాత్యహంకార పాలకులపై పోరాడి విముక్తి సాధించిన దక్షిణాఫ్రికాకు ఆదినుంచీ ప్రపంచ వ్యాప్తంగా బలహీనులపై బలవంతులు సాగించే దుండగాలను వ్యతిరేకించటం సంప్రదాయం. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్‌పై పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం సాగిస్తున్న రష్యా తనకు మిత్రదేశమే అయినా దాని చర్యను దక్షిణాఫ్రికా తూర్పారబట్టింది. ప్రస్తుతం ఐసీజేలో వున్న 15 మంది న్యాయమూర్తుల ఫుల్‌బెంచ్ దక్షిణాఫ్రికా పిటిషన్‌ను విచారిస్తుంది. నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ కొత్తగా చెరొక న్యాయమూర్తినీ నామినేట్ చేయొచ్చు. గాజాలో జరిగింది జాతి విధ్వంసమేనని నిరూపించటం ఐసీజే నిబంధనల ప్రకారంకొంత కష్టమేనని నిపుణులంటున్నారు. అయితే పిటిషన్ విచారణ క్రమంలో జాతి విధ్వంస పోకడలపై జరిగే చర్చవల్ల ప్రపంచ ప్రజానీకానికి వర్తమాన స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుంది. దోషులెవరో, శిక్ష ఎవరికి పడాలో తేటతెల్లమవుతుంది. -
‘మహా’ జనానిదే తుది తీర్పు
సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు. అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్ నార్వేకర్‌కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది. 2022 జూన్ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్ చౌధరిని నియమించటంతోపాటు, విప్‌గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్ 29న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్‌కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్ వర్గం మౌనంగా ఏమీవుండదు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్ పవార్ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్‌లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం. మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, స్పీకర్‌పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది. ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు. అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్ తాజా నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
ప్రజాస్వామ్యం లేని గెలుపు?
ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్‌లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ (ఏఎల్) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే! ‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్ అయింది. షేక్ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే! ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు. అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. హసీనా మరోసారి ఎన్నికవడం భారత్‌కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్ బంధాలు బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే! బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్‌లో స్నేహశీల సర్కార్ ఉండడం భారత్‌కు ఒకింత సాంత్వన. నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్ – మే నెలల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం. ఇప్పటికే నిరుడు సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్ మొయిజు గద్దెనెక్కారు. భారత్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్‌లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్ ఏర్పాటవడం భారత్‌కు ప్రయోజనకరమే! ఇటు భారత్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్లైన్లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్‌కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్‌కు భారత్ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్‌కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. -
అనుచిత వ్యాఖ్యల చిచ్చు
బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేస్తే, ఫలితం భారంగానే ఉంటుంది. మాల్దీవులకు చెందిన ఒక ఎంపీ, ముగ్గురు మంత్రులకు బహుశా అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు మరియమ్ షివునా, మల్షా షరీఫ్, మహజూమ్ మజీద్... భారత్‌కూ, భారత ప్రధానికీ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి, పదవి నుంచి సస్పెండయ్యారు. రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బోలెడంత రచ్చ జరుగుతోంది. మాలే మంత్రుల వ్యాఖ్యలపై భారత ప్రముఖులు గట్టిగానే స్పందించారు. మాల్దీవ్స్ బహిష్కరణ నుంచి మన సొంత ద్వీపాల పర్యాటకాభివృద్ధి దాకా నినాదాలు జోరందుకున్నాయి. వ్యవహారం లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా మారింది. జరిగిన కథ గమనిస్తే – ‘మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్’ అంటూ, అక్కడి సముద్రతీరంలోని తన ఫోటో జోడించి జనవరి 5న భారత ప్రధాని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద మాల్దీవుల మంత్రులు, ఎంపీల అనుచిత వ్యాఖ్యలు ఇంత దూరం తెచ్చాయి. మంత్రి అబ్దుల్లా మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి, లక్షద్వీప్‌ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికేనని విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది. ఆయనలా అంటే, మరో మంత్రి మరియమ్ షియునా ‘ఎక్స్’లో ఇజ్రాయెల్‌తో భారత సంబంధాలను ప్రస్తావించారు. ఆమెతో మరో మహిళా సహచర మంత్రి మాల్షా స్వరం కలిపారు. భారత పర్యాటక ప్రాంతాలు, గదులు దుర్వాసన వేస్తుంటాయన్న నోటి తీట మాటలూ వచ్చాయి. ఇవన్నీ చిచ్చు రేపేసరికి, చైనా పర్యటనలోని మాల్దీవుల అధ్యక్షుడు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. మంత్రుల సస్పెన్షన్, వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వ వివరణ చకచకా జరిగాయి. భారత్‌లోని పర్యాటక ప్రాంతాల గురించి, ప్రధాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మన వారికి కోపం తెప్పించింది. సెలవులకు మాల్దీవులకు వెళదామనుకున్న వేలాది భారతీయులు టికెట్లను రద్దు చేసుకుంటూ, సదరు స్క్రీన్షాట్లను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటున్నారు. అలాగే, దేశంలోనే ఉన్న అందమైన సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన దీవుల గురించి అన్వేషణ ఆరంభమైంది. ఈ వివాదం పుణ్యమా అని ఇంటర్నెట్లో లక్షద్వీప్ గురించి అన్వేషణ గత 20 ఏళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, గత ఏడాది లక్షద్వీప్‌కు 10 వేల మంది లోపే వెళితే, మాల్దీవులకు వెళ్ళిన పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉందని గమనించాలి. ఈ పరిస్థితుల్లో సెంటిమెంట్లు రేపి, ప్రస్తుత వివాదాన్ని ఆత్మాభిమాన, ఆత్మనిర్భర అంశంగా, లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌గా చేస్తే అది వట్టి హ్రస్వదృష్టి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు నిత్యం సాగుతున్న వేళ, మాల్దీవ్స్‌తో మన దీర్ఘకాలిక బంధం దెబ్బతినకుండా చూడడం ముఖ్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు కీలక పొరుగుదేశం మాల్దీవులు. ‘ప్రాంతీయ భద్రత, పురోగతి’ (సాగర్) లాంటి ప్రయత్నాల్లో ఆ దేశానిది ప్రధాన పాత్ర. అలాగే, ‘పొరుగుకు పెద్ద పీట’ లాంటి భారత ప్రభుత్వ ప్రాధాన్యాలకు మాల్దీవులు ఓ ప్రధాన కేంద్రం. అలాంటి మాల్దీవు లతో ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయి. భారత వ్యతిరేక అజెండాతో గెలిచి, గత 2023 నవంబర్‌లో మహమ్మద్ మొయిజు మాల్దీవ్స్‌కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే మాల్దీవుల ద్వీపబృందం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించాల్సిందిగా కోరారు. భారత్ మాత్రం హిందూ మహాసముద్రంలోని సుదూర ద్వీపాలకు వైద్యసాయానికై తమ సైనికులు అక్కడున్నారంది. తాజా వివాదాల వేళ మరో పొరుగు దేశం చైనా వైఖరి పక్క ఇల్లు తగలబడుతుంటే, చలి కాచుకుంటున్నట్టుంది. భారత్, మాల్దీవుల మధ్య రచ్చను అది ఆస్వాదిస్తోంది. మాల్దీవుల విదేశాంగ విధానం బాగుందనీ, ఆ దేశాధ్యక్షుడు భారత్‌తో సరైన రీతిలో వ్యవహరిస్తున్నారనీ చైనా మీడియా ప్రశంసిస్తోంది. అసలీ అంశంలో ఢిల్లీయే విశాల దృక్పథంతో ఉండాలంటూ బీజింగ్ సుద్దులు చెబుతోంది. ఇప్పటికే భారత్‌కు దక్షిణాన, పశ్చిమాన వివిధ దేశాల్లో చైనా పాగా వేసింది. హిందూ మహాసముద్రంలో కీలకమైన మాల్దీవుల్ని కూడా తన బుట్టలో వేసుకొనే పనిలో ఉంది. ఢిల్లీతో దీర్ఘకాలిక దౌత్యబంధమున్న మాలే సైతం క్రమంగా చైనా వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది. మరోపక్క మాలేలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఆందోళన రేపే అంశం. అత్యధికులు ముస్లిమ్లైన మాల్దీవుల నుంచి 600 – 700 మంది ఇస్లామిక్ తీవ్రవాద ‘ఐసిస్’లో చేరారని లెక్క. ఈ పరిస్థితుల్లో మాల్దీవులు కేంద్రంగా వ్యూహాత్మక ప్రయోజనాలెన్నో ఉన్న భారత్ ఆచితూచి వ్యవహరించాలి. నెటిజన్ల ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ లాంటి వ్యాఖ్యలు వినడానికి బాగున్నా, భౌగోళిక అనివార్యతల రీత్యా కుదిరేపని కాదు. సంచలన ప్రకటనల కన్నా సవ్యమైన కార్యాచరణే మన పర్యాటకాభివృద్ధికి కీలకం. ఇందులో మన పాలకులు చేసింది తక్కువ, చేయాల్సిందే ఎక్కువ. లక్షద్వీప్‌కు ప్రాముఖ్యం కల్పించాలని మోదీ సర్కార్ భావిస్తే తప్పు లేదు కానీ, ఆ చిరు కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నిర్మాణాలతో జీవ్యావరణాన్ని దెబ్బ తీసే యత్నాలు మానాలి. మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం బాట పట్టి అంతా కలిపి దశాబ్దిన్నరే అయింది. కొద్ది నెలల క్రితమే వచ్చిన కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోనే లేదు. ఈ పరిస్థితుల్లో చేతి నిండా పని ఉన్న మాల్దీవ్స్ మంత్రులు భారత్ గురించి, భారత్‌లో భాగమైన లక్షద్వీప్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. అది వారి పరిధి కూడా కాదు. తాగునీటి కొరత నుంచి ఇటీవలి కోవిడ్ నియంత్రణ దాకా పలు సందర్భాల్లో మానవతతో అండగా నిలిచిన భారతే తాము నమ్మదగిన, చిరకాల మిత్రుడని గ్రహించాలి. -
ఒక ప్రవాహం
మనుషుల మీద లేబుల్స్ వేయడంలో మనకు ఒక సౌలభ్యం ఉంటుంది. దానివల్ల వారిని అంచనా కట్టడానికి ఒక పరిధి ఏర్పడుతుంది. కానీ భూమ్మీద ప్రవాహంలా బతికేవాళ్లు కొందరుంటారు. ఆ ప్రవాహంలో అన్నింటినీ తమలో ఇముడ్చుకుని పోతారు. సాగిపోవడమే వారి లక్షణం. ఆగిపోవడం వారికి తెలియని గుణం. వారు ఏమిటి? అని ప్రశ్న వేసుకున్నప్పుడు, వారు ఏమిటి కాదు? అనే మరో ప్రశ్న ఎదురొస్తుంది. ఆ రెండు ప్రశ్నల మధ్యే వారి జీవితం గురించిన ఒక జవాబు దొరుకుతుంది. 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ లోని నార్మండీలో జన్మించిన (1873 జనవరి 28) ‘కొలెట్’ ఒక సజీవ ప్రవాహం. చాలా కారణాల వల్ల ఫ్రెంచ్ సమాజపు సాహిత్య సాంస్కృతిక జీవితాన్నీ, తద్వారా ప్రపంచాన్నీ ఆమె ప్రభావితం చేశారు. ‘చెరి’, ‘జిజి’, ‘ద వేగబాండ్’, ‘ద ప్యూర్ అండ్ ది ఇంప్యూర్’ లాంటి రచనలు చేసిన కొలెట్ జీవితం ఆమె రచనలంతే ఆకర్షణీయం. తన పేరును కేవలం ఏకపదంగా రాసుకున్న ‘కొలెట్’ పూర్తి పేరు సిడోనీ–గాబ్రియెల్ కొలెట్. ఆమె జీవితంలోని వివాహపు అధ్యాయం పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ఉనికి పరిమితులను చెబుతుంది. కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి పద్నాలుగేళ్ల పెద్దయినవాడితో వివాహానికి ఒప్పుకొంది. భర్త హెన్రీ గౌథియర్ విల్లర్స్ కలంపేరు ‘విల్లీ’. సమాజంలో ప్రతిష్ఠ ఉన్నవాడు. అతడి ప్రఖ్యాతి ఎంతటిదంటే ‘ఘోస్టు రైటర్స్’తో పుస్తకాలను రాయిస్తుండేవాడు. ‘‘నీ ప్రాథమిక పాఠశాల జ్ఞాపకాలను కాగితం మీద పెట్టు,’’ అని నూతన వధువుకు కూడా చెప్పాడు. మనోరంజకమైనవి ఉంటే వదిలిపెట్టొద్దనీ, వాటిని తాను ఏదోలా వాడుకుంటాననీ కూడా అన్నాడు. కొలెట్ సహజంగానే రైటర్ మెటీరియల్. ఆమె రాతలను విల్లీ ముందు కొంచెం అనుమానించినా, వాటిని 1900లో ‘క్లాడైన్ ఎట్ స్కూల్’ నవలికగా తెచ్చాడు. ఒక పాఠశాల బాలిక కౌమార దశను వాస్తవికంగా చిత్రించిన ఈ రచనకు వెంటనే పేరొచ్చింది. సాహిత్యంలో కౌమార బాలిక గొంతుక వినిపించింది. ఆత్మ కథాత్మక సాహిత్యానికి పథనిర్ణేత అయ్యింది. వీటి మూల రచయిత్రి కొలెటే అని సాహిత్య లోకం అనంతర కాలపు ఆమె రచనల శైలిని బట్టి నిర్ధారించుకుంది కానీ అప్పటికి అధికారిక రచయిత విల్లీనే. అమ్మకాలు పెరగడంతో భార్య మీద ఒత్తిడి పెట్టాడు. ఒక దశలో గదిలో బంధించి, తర్వాతి ఇన్ స్టాల్మెంట్ ఇచ్చేంతవరకూ విడిచిపెట్టలేదు. ఈ వేధింపులు సహిస్తూనే, కొనసాగింపు నవలికలు ‘క్లాడైన్ ఇన్ పారిస్’, ‘క్లాడైన్ మేరీడ్’ రాసింది కొలెట్. క్లాడైన్ పాత్ర ఎంత హిట్టయ్యిందంటే, ఆ థీమ్‌తో సిగరెట్లు, లింజెరీ, పెర్ఫ్యూమ్ కూడా విల్లీ ప్రారంభించాడు. విల్లీ ఆమెను సాహిత్యంలోకి ప్రవేశపెట్టినా, మేలుకొన్నాక, ఆయన్ని జీవితంలోంచి బయటికి నెట్టేసింది కొలెట్. కానీ రాయల్టీల డబ్బులు లేకపోవడంతో స్టేజీ నటిగా పనిచేసింది. 1907లో తనే రాసిన ‘ద ఫ్లెష్’ సంగీత రూపకంలో స్టేజీ మీద ఎడమ చన్నును ప్రదర్శించడం పెద్ద కల్లోలం సృష్టించింది. ఇక, ‘మౌలిన్ రూజ్’లో తన స్నేహితురాలు ‘మిస్సీ’ని బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం దుమారం లేపింది. ఈ మొదటి ప్రదర్శన తర్వాత పోలీసులు దాన్ని సాగనివ్వలేదు. బహిరంగంగా వాళ్లు తమ లెస్బియన్ బంధం గురించి ప్రకటించడం కూడా అప్పటి సమాజానికి విఘాతంలా తగిలింది. దీనివల్ల ఎవరికీ కంటబడని స్థలాల్లో కొంతకాలం బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, స్వలింగ శృంగార సాహచర్య ప్రదర్శనల తాలూకు ధిక్కార బీజాలు ఇలా మొదలయ్యాయని అనుకోవచ్చు. కొలెట్ అంటే ఒక స్కాండల్. పరస్పర వైరుద్ధ్యంగా కనబడే ఎన్నో అంశాలు ఆమె జీవితంలో కనబడతాయి. ప్రపంచమంతా యూదుల పట్ల పట్టింపుతో ఉన్నప్పుడు, నాజీలతో జట్టుకట్టి, యూదు వ్యతిరేక భావనలు ఉన్న రచనలు చేశారు. తాను ఎంత స్వేచ్ఛగా బతికినప్పటికీ, ఓటు హక్కు కోరే స్త్రీలను కొరడాతో బాదాలన్నారు. జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధరంగం నుంచి వార్తలు పంపారు. ఒక సాహిత్య పత్రికకు సంపాదకురాలిగా పనిచేసినప్పుడు, ఎంతోమంది యువ రచయితలను ప్రోత్సహించారు. సుమారు యాభై పుస్తకాలను వెలువరించిన కొలెట్, పది గంటల పాటు ఏకధాటిగా కూడా రాసేది. ‘‘కొలెట్ స్త్రీవాది అవునో కాదో నిర్ణయించాల్సింది ఆమె కాదు’’ అని ఆమెను స్త్రీవాదిగానే సాహిత్య లోకం తర్వాత గుర్తించింది. సాధారణ మనుషులు కోరుకునే నైతిక చట్రంలోకి ఇమడని కొలెట్ ఒక బైసెక్సువల్. కుమారుడి లాంటి బాలుడితో ప్రణయం కొనసాగించారు. ‘మాంసం’ అనేది ఆమెకు చాలా ఇష్టమైన మాట. వాంఛకు అది సంకేతం. ‘‘ప్రేమ, నా కలానికి బ్రెడ్ అండ్ బటర్’’ అన్నారు. అందం పట్ల ఆమెకు మితిమీరిన పట్టింపు. వృద్ధాప్య ఛాయలు పొడసూపగానే ‘ఫేస్–లిఫ్ట్’ చేయించుకున్నారు. తన శరీరంలో ఏర్పడిన ముడతలను ద్వేషించారు. పాశ్చాత్య దేశాల్లోనూ విడాకులు తీసుకున్నవాళ్లకు మన్నన లేని కాలంలో, రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె మరణించినప్పుడు ధార్మిక క్రతువులు నిరాకరించబడ్డాయి. ‘‘చనిపోయిన తర్వాత కూడా కొలెట్ ఎంత సుదీర్ఘకాలం బతికింది!’’ అన్నారు 1967లో జర్నలిస్ట్ జానెట్ ఫ్లానర్. ఆ మాట అన్న యాభై ఏళ్ల తర్వాత కూడా కొలెట్ బతికేవుంది. ఆమె జీవితం ఇప్పటికీ ఆసక్తిగొలుపుతూనే ఉంది. ఆమె మీద పుస్తకాలు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచో చెడో కొలెట్ రూపంలో ఒక ఉత్సాహం ఈ భూమ్మీద కొన్నాళ్లు తిరగాడిందని మనం అనుకోవచ్చు. అయినా చెడు అని ఎందుకనాలి! -
భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్‌టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఉరఫ్ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్‌ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్ మోడల్ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది. మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్‌లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా? వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు. తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమ్‌ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్ స్కీమ్‌ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్ కల్యాణ్‌తో తాను పెట్టించిన పార్టీని ఎన్డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్’పైనే ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్ ఎకాంప్లిష్డ్’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!! చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి. విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్‌కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే! తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్‌రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్‌పోర్టులో బ్రదర్ అనిల్‌తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు? అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్‌రెడ్డి మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్ మోహన్‌రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు. ‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది. ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్‌లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్ శర్మ టీమ్‌తో పాటు ఒక రిటైర్డ్ డీఐజీ ఈ వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
హసీనాకు అగ్నిపరీక్ష!
మెరిసేదంతా మేలిమి అని ప్రజానీకాన్ని నమ్మిస్తే ఓట్ల వర్షం కురవొచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ చిట్కా పనిచేసి అధికారం వచ్చినా రావొచ్చు. కానీ ఎల్లకాలం అదే మంత్రం ఫలించదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాలుగో దఫా నెగ్గేందుకు పడుతున్న అవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఆ ఎన్నికలు సవ్యంగా సాగుతాయనీ, ప్రజలంతా తన పక్షమేననీ హసీనా ఇప్పటికీ నమ్మ బలుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికేవుందని చాటాలంటూ పౌరులకు ఆమె విన్నపాలు చేస్తున్నారు. అటు విపక్షం హసీనా నయవంచనను బట్టబయలు చేయాలని ప్రజలను కోరింది. ఈ ఎన్నికలను బహిష్కరించి, శని ఆదివారాల్లో దేశవ్యాప్త హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చింది. బంగ్లాలో అటు ఎన్నికల తంతు, ఇటు బహిష్కరణ పిలుపు రెండూ సాధారణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలను విపక్ష బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) బహిష్కరించింది. తదనంతర ఎన్నికల్లో పోటీలో దిగి, చివరి నిమిషంలో ఆ పార్టీ ముఖం చాటేసింది. 2014లో 39 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 2019 నాటికి అది ఒక్కసారిగా 80 శాతానికి ఎగబాకింది. గత ఎన్నికల్లో అవామీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 300 స్థానాల్లో ఏకంగా 96 శాతం స్థానాలు... అంటే 288 రాగా, బీఎన్పీ కూటమికి ఏడంటే ఏడే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పక్షంపైరిగ్గింగ్ ఆరోపణలు రివాజు. అయితే గత ఎన్నికలకూ, ఇప్పటికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పట్లో హసీనా గెలుపుపై ఎవరికీ సంశయాలు లేవు. మెజారిటీ విషయంలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈసారి అలాకాదు. ఏం చేసైనా నెగ్గి తీరాలన్న సంకల్పంతో అన్ని రకాల మాయోపాయాలకూ సిద్ధపడుతున్నారని విపక్షంతోపాటు పౌరసమాజ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యాభై రెండేళ్ల క్రితం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో పాకిస్తాన్ పాలకులపై పోరాడి బంగ్లా విముక్తి సాధించింది. ఆ వెంటనే ముజిబుర్ రెహమాన్‌ను కూలదోసి సైన్యం అధికా రాన్ని ఆక్రమించింది. ఆయన్ను దారుణంగా కాల్చిచంపింది. వెంటవెంటనే జరిగిన మార్పుల్లో జన రల్ జియావుర్ రెహమాన్ అధికారం చేజిక్కించుకుని అనంతర కాలంలో దేశాధ్యక్షుడయ్యారు. బీఎన్పీ ఆయన నేతృత్వంలోని పార్టీయే. మరో సైనిక పాలకుడు హెచ్ఎం ఎర్షాద్ సైతం జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. మొత్తానికి మూడు సైనిక తిరుగుబాట్లు, దాదాపు 20 వరకూ విఫల తిరుగు బాట్లతో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సైనిక పాలకులు ఎన్నికలు లేకుండా చేసి, పౌరుల ఓటుహక్కుకు ఎగనామం పెడితే... ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు దొంగ ఓట్లతో, హింసతో దాన్ని మరింత నీరుగార్చాయి. తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నదని చెప్పే హసీనా తొలి, మలి దఫాలకు మించి మూడోసారి పూర్తి స్థాయి నియంతగా మారారని, అసమ్మతి స్వరాలను అణిచేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో ఇరుక్కుని 22,000 మంది విపక్ష నేతలు, కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఉద్యమించినవారిని హసీనా సర్కారు శత్రువులుగా చూస్తోంది. హసీనా తొలిసారి అధికారంలోకొచ్చిన రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు కోతలు లేవు. దేశం పచ్చగా కనబడుతోంది. అడిగిందే తడవుగా విదేశీ మదుపుదారులు ఉదారంగా అప్పులిచ్చారు. ఆర్థిక రంగం పుంజుకోవటంతో నగరాలు మెరిసిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు, ఎక్స్‌ప్రెస్ వేలు, వంతెనలు, భారీ దుకాణ సముదాయాలు, దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులు విస్మయ పరుస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇదంతా తిరబడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందాల పరదాల మాటున పాతరేసినవన్నీ పైపైకి తోసుకొచ్చి నిలదీస్తున్నాయి. బ్యాంకులు వేల కోట్లలో ఇచ్చిన అప్పులన్నీ పారు బాకీలుగా మారి బావురుమన్నాయి. ఖజానాలో కరెన్సీ మాయమై, ద్రవ్యో ల్బణం ఆకాశాన్నంటి దేశ ఆర్థిక వ్యవస్థ బిత్తరచూపులు చూసింది. విదేశీ పెట్టుబడులతో మొదలు పెట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం సరైన పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగింది. వ్యయం అనేక రెట్లు పెరిగింది. పల్లెటూళ్లు తెల్లముఖం వేశాయి. ఉపాధి కరువై గ్రామీణులు నగరా లకు, పట్టణాలకు వలసలు కట్టారు. కరెంట్ అకౌంట్ సంక్షోభం పీల్చి పిప్పి చేస్తుండగా ఒకనాడు పైపై మెరుగులు చూసి ఎగబడి పొగిడిన అంతర్జాతీయ మీడియా వరస కుంభకోణాల వైనాన్ని వెల్లడిస్తున్నకొద్దీ దేశంలో అశాంతి ప్రబలింది. ఉద్యమాలు వెల్లువెత్తాయి. వాటి అణచివేత తప్ప హసీనా దగ్గర మరే ప్రత్యామ్నాయం లేకపోవటం విషాదాల్లోకెల్లా విషాదం. దేశాన్ని దక్షిణాసియాలోనే ‘ఎకనామిక్ టైగర్’గా రూపొందించానని ఒకనాడు సగర్వంగా చాటు కున్న హసీనా సంక్షోభంపై సరైన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన లపై ఇంటా బయటా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనల బాధ్యులకు తమ దేశంలో ప్రవేశం ఉండబోదని అమెరికా ప్రకటించింది. వైఫల్యాలకు పాలక విపక్షాలు రెండూ బాధ్యత వహించాలని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతర నేతలతో పోలిస్తే హసీనాయే ఉన్నంతలో మెరుగని మెజారిటీ పౌరులు విశ్వసిస్తుండటం విశేషం. ఏకపక్షంగా సాగే తాజా ఎన్నికల తంతులో విజయం మాటెలావున్నా హసీనాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవు. ఆమె విఫల నేతగా మిగులుతారా, తప్పులు దిద్దుకుని దేశాన్ని గట్టెక్కిస్తారా అన్నది చూడాల్సివుంది. -
కూటమిలో అనైక్యతా రాగం
ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేశాం. కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రామమందిరం సహా రకరకాల వ్యూహాలతో జనంలోకి దూసుకుపోతోంది. మరి, బలమైన అధికార పక్షాన్ని ఢీ కొట్టాల్సిన ప్రతిపక్షాల మాటేంటి? అవి ఇప్పటికీ అయోమయంలో ఉన్నట్టున్నాయి. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకు ఒకే సమూహంగా ఉన్నా, అనేక అంశాల్లో అవి ఒక్క తాటి మీదకు రాలేకపోతున్న దుఃస్థితి కళ్ళకు కడుతోంది. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటేంటి తదితర అంశాలు దేవుడెరుగు, కనీసం ఈ కూటమికి ఎవరు కన్వీనర్‌గా ఉండాలనే అంశంలోనూ ఏకాభిప్రాయం కొరవడింది. ఈ వార్తలు కూటమి బలహీనతలను బట్టబయలు చేస్తున్నాయి. బిహార్‌లో జేడీయూ నేత నితీశ్ కుమార్‌ను దింపి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను సీఎంను చేసేందుకు ఇటీవల జరిగిన విఫల యత్నం ‘ఇండియా’ కూటమి పక్షాలు సొంత కాళ్ళు నరుక్కొనే మూర్ఖత్వమే! ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను విపక్ష ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌ను చేసి, బుజ్జగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, అందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సహా కొన్నిపక్షాలు ప్రతికూలం. ఈ అంశంపై కూటమి పక్షాల మధ్య గురువారం జరగా ల్సిన వర్చ్యువల్ సమావేశం సైతం ఆఖరి నిమిషంలో రద్దయింది అందుకే. ఇక, కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల సర్దు బాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గంతో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కూడా సరిగ్గా ఇదే పంచాయతీ కాంగ్రెస్‌కు నడుస్తోంది. అలాగే, బీజేపీతో రాజకీయ రంగు పులుముకుంటున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాలా, వద్దా అనే అంశంపైనా నిశ్చితాభిప్రాయం మృగ్యం. వెరసి, కూటమి పార్టీల మ«ధ్య పరస్పర విరుద్ధ ప్రయో జనాలు, సమన్వయ లోపాలు ఎన్నికలు సమీపిస్తున్నా జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి. 2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో ఈ పార్టీలన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్ చొరవతో విస్తృత చర్చల తర్వాత గత జూలై 18న 26 పార్టీల కూటమిగా ‘ఇండియా’ ఆవిర్భవించింది. 80 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ప్రాథమికంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంటే, ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన ఆప్, టీఎంసీ, వామపక్షాలు సైతం కూటమిలో ఉన్నాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ముందు గత ఫిబ్రవరి, మే నెలల్లో 3 రాష్ట్రాల్లో (త్రిపుర, మేఘాలయ, కర్ణాటక) ఎన్నికలు జరిగాయి. కూటమి ఏర్పడ్డాక నవంబర్‌లో 5 రాష్ట్రాలు (తెలంగాణ, మిజోరమ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) ప్రజాతీర్పు కోరాయి. రెండుసార్లూ ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీతో పాటు, తమలో తాము ఢీకొన్న పరిస్థితి. కూటమి ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో కాంగ్రెస్, తన కూటమి పక్షాలైన ఎస్పీ, జేడీయూలతోనూ పోటీ పడింది. ఫలితంగా మిశ్రమ ఫలితాలే దక్కాయి. దేశంలో తూర్పు నుంచి పడమటి వరకు రాహుల్ గాంధీ చేయనున్న సరికొత్త ‘భారత్ న్యాయ యాత్ర’ ఈ జనవరి ప్రథమార్ధం లోనే ఆరంభం కానుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాల బలప్రదర్శనకు ఈ యాత్రను అనువుగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావన. కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపిణీ ఫార్ములాకు తుది రూపం ఇవ్వాలని ఆ పార్టీ అస్తుబిస్తు అవుతోంది. లోక్‌సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాల్లో 290 సీట్లలో స్వయంగా పోటీ చేయాలని కాంగ్రెస్ యోచన. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలనీ, వీలైనచోటల్లా బీజేపీ సారథ్య ఎన్డీఏ అభ్యర్థికీ – తమ అభ్యర్థికీ మధ్య ముఖాముఖి పోరు జరిగేలా చూడాలని ‘ఇండియా’ ప్రయత్నం. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాహుల్‌తో ఎంత స్నేహంగా ఉన్నా సీట్ల సర్దుబాటులో నిక్కచ్చిగానే నిలబడతారు. పశ్చిమ బెంగాల్లో హస్తం పార్టీ క్రితంసారి గెలిచిన 2 స్థానాలు తప్ప, ఇంకేమీ ఇవ్వబోమన్నది టీఎంసీ ప్రతిపాదన. ఆ ‘భిక్ష’ అవసరం లేదనీ, మోదీకి అనుకూలంగా మమత పని చేస్తున్నారనీ అయిదు సార్లు ఎంపీగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధినేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్య. స్థానిక అనివార్యతల రీత్యా రానున్న రోజుల్లో ‘ఇండియా’ కూటమిలో ఇలాంటి అపరిణత వ్యాఖ్యలు, పరస్పర దూషణలు మరిన్ని వినిపిస్తాయి. ఐక్యత లేకపోవడం, ఈ అంతర్గత కుమ్ములాటలు కూటమిని బలహీనం చేస్తున్నాయి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీఎంసీల మధ్య పోరు బీజేపీకే లాభించింది. రేపు లోక్‌సభ ఎన్ని కల్లోనైనా కూటమి పక్షాల మధ్య సర్దుబాటు, సమన్వయం సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానమే. నిజానికి, విజయవంతమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ మొదలు మోదీపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్లో మూకుమ్మడి సస్పెన్షన్ల దాకా ప్రతిపక్షాలు గత ఏడాది వార్తల్లో నిలిచాయి. కానీ, కేవలం వార్తల్లో ఉంటే సరిపోదు. బీజేపీపై పోరాటం, మోదీని గద్దె దించడమే ఏకైక అజెండా అయితే అదీ జనానికి రుచించదు. కూటమికి లాభించదు. అందుకని, ఇప్పటికైనా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు మార్గాలేమిటో ‘ఇండియా’ కూటమి పర్యాలోచించాలి. గమ్యానికి తగ్గట్టు గమనం ఉండాలన్నది విస్మరించి, భాగస్వామ్య పక్షాలు అభిప్రాయ భేదాలను కొనసాగిస్తే కష్టం. పిట్ట పోరు పిట్ట పోరు... పిల్లి తీర్చినట్టు అధికార బీజేపీకే కలిసొస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ తనవైన లెక్కలు వేసుకొనే ఎన్నికల ముంగిట దాన్ని నివారించడం ‘ఇండియా’ కూటమికి పెను సవాలు. కలవని రైలు పట్టాల లాగే స్నేహంతో ప్రతిపక్షాలకు ఒరిగేదేమిటి? -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం.