Editorial
-
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్‌లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్‌లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్‌లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్‌లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్‌తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్‌ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
కాలగతిలో కొత్త వేకువ
మార్పు ప్రకృతి సహజ లక్షణం. చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు. కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది. రోజులుగా, నెలలుగా, ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండగుర్తు. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త కేలండర్లు వస్తాయి. కొత్త డైరీలు వస్తాయి. కొందరు అదృష్టవంతులకు ఒకరోజు సెలవు దొరుకుతుంది. కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందురోజు రాత్రి జనాలు సందడి సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకొంటారు. గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారు. అలాగని కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రపంచం అమాంతంగా మారిపోదు.లోకంలో మనుషులు ఎప్పటిలాగానే ఉంటారు. మనుషుల స్వభావాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. భూమి గోళాకారంలోనే ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన నింగి నుంచి చుక్కలు రాలిపడిపోవడం, దిక్కులు ఏకమైపోవడం వంటి ఆకస్మిక అనర్థాలేవీ సంభవించవు. ప్రపంచంలో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధాలు కొన సాగుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంక్షోభాలు రగులుతూనే ఉంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో వినిపించే కేరింతల హోరులో అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయంతే! ప్రపంచమంతా అలాగే ఉన్నప్పుడు మరి మారినదేమిటంటారా? మార్పు మన కళ్ల ముందే జరిగిపోతూ ఉంటుంది. ప్రచార పటాటోప కాంతులకు కళ్లుబైర్లు కమ్మిన దివాంధత్వంలో మనం వెనువెంటనే మార్పును గుర్తించలేం. కొంచెం తెప్పరిల్లిన తర్వాతనే మార్పు మనకు అర్థమవుతుంది. అనుభవంలోకి వస్తుంది. ‘మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు’ అని గ్రీకు తత్త్వవేత్త హెరా క్లిటస్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే చెప్పాడు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహంలో, వేడుకల సంరంభంలో మునిగిపోయిన జనానికి ఆ సమయంలో జరిగే మార్పులేవీ గోచరించవు. కేలండరు మారుతున్న వేళలోనే ఎక్కడో ఒకచోట ఒక మొక్క మొలకెత్తవచ్చు. ఒక మహావృక్షం నేలకూలిపోవచ్చు. కొత్తగా ఒక శిశువు ఈ భూమ్మీదకు రావచ్చు. పాతబడిన ఒక పండుటాకు రాలిపోవచ్చు. మరెక్కడో ఒకచోట నిశ్శబ్దంగా ఒక కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. ఒక విధ్వంసానికి కొత్తగా ధ్వంసరచన జరుగుతూ ఉండవచ్చు. వార్తలకెక్కితే తప్ప మార్పులను గుర్తించడం మానేశాం మనం. అయినా వార్తలతో నిమిత్తం లేకుండా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అసలు మనం జరుపుకొనే ఈ కొత్త సంవత్సరం వేడుకలు కూడా నానా మార్పుల ఫలితమే! ఇప్పటి మన నాగరికత, మన వేషభాషలు, మన సాంకేతిక పరిజ్ఞానం, మన కళానైపుణ్యాలు, మన ఆటపాటలు, మన తిండితిప్పలు వంటివన్నీ ఎన్నో మార్పుల ఫలితమే! ఎంతటి నియంతలకైనా మార్పును నివారించడం సాధ్యం కాదు. అనంత కాలవాహినిలో మార్పులు అలల్లా వచ్చిపోతుంటాయి. మంచి చెడులు మార్పులకూ వర్తిస్తాయి. మంచి మార్పులు వికాసానికి, చెడు మార్పులు వినాశానికి దారులు వేస్తాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిన్నటితో ముగిసిపోయిన సంవత్సరంలోనూ కొన్ని గణనీయమైన మార్పులే చోటు చేసుకున్నాయి. నిన్నటితో ముగిసిన ఏడాదిలో మానవాళికి మేలు చేసే పదమూడు మార్పులు జరిగినట్లు ‘టైమ్’ మ్యాగజైన్ కథనం చెబుతోంది. ఇదొక ఆశాజనకమైన విషయం. లోకంలో ఎక్కడో ఒకచోట అపశ్రుతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం వాటినే భూతద్దంలో చూపిస్తూ, ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వగచే వారికి ప్రపంచంలోని ఆశాజనకమైన మార్పులు అగుపడవు. అయితే, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని మహాకవి గురజాడ చెప్పిన మాటలు మరువరాదు. ప్రపంచమంతా శరవేగంగా మారిపోతున్నా, కొందరు యథాతథవాదులు మాత్రం మార్పును కోరుకోరు. తాము మారాలనుకోరు. లోకం తమ కళ్లముందే మారిపోతుండటాన్ని చూసి వారు ఏమాత్రం సహించలేరు. మార్పులను నివారించడానికి శాయశక్తులా విఫలయత్నాలు చేస్తుంటారు. కాలంచెల్లిన మనుషులు కాలం పరుగును వెనక్కు మళ్లించడానికి నానా విన్యాసాలు చేస్తుంటారు. విఫలయత్నాలు, విన్యాసాలు వికటించి మార్పులు అనివార్యమనే సంగతి అనుభవంలోకి వచ్చినా జీర్ణించుకోలేరు. కాలంతో కలసి ముందుకు సాగేవారిని, మార్పులను మనసారా స్వాగతించే వారిని, మార్పులకు దోహదపడేవారిని అక్కసుకొద్ది ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా లోకం తన మానాన తాను మారుతూనే ఉంటుంది. మార్పు తన శాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనాలు తమ జీవితాల్లో మేలి మార్పుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం కాలం మరింతగా అనుకూలించాలని, కష్టాలు కడతేరాలని, ప్రపంచంలో యుద్ధాలు సమసిపోవాలని, శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని, మానవాళికి మేలు కలగాలని, ప్రగతి దిశగా కాలం పరుగు వేగం పుంజుకోవాలని కోరుకుందాం. కొత్త సంవత్సరం కొత్త వేకువ ఉదయించాలని కోరుకుందాం. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కొత్త సంవత్సరం ఒక చక్కని సందర్భం. ఈ సందర్భాన్ని సార్థకం చేసుకుందాం. -
ఆ పేరే ప్రభంజనం!
ఆ పేరే ఇప్పుడొక సూపర్ బ్రాండ్. జగనన్న అనే నాలుగ క్షరాలు ప్రభంజనానికి పర్యాయపదంగా మారిన వైనాన్ని మనం ఆంధ్రప్రదేశ్‌లో చూడవచ్చు. గనిలో వనిలో కార్ఖానాలో... అన్నట్టుగా ప్రతి జీవనరంగంలోనూ ఈ ప్రభంజనపు వికాసాన్ని మనం కాంచవచ్చు. ఊరూవాడ, పొలమూ పుట్ర, బడీగుడి, ఆస్పత్రీ ఆఫీసూ... ఇలా ప్రతిచోటా మారాకు తొడుగుతున్న మార్పులను మనం గమనించవచ్చు. ఈ మార్పులు నిస్సహాయులను నిటారుగా నిలబెడు తున్నాయి. పేదవర్గాల భుజాలకు హక్కుల అమ్ములపొదులను తొడిగి సాయుధం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని కబ్జా చేసి తమను దగా చేసిన పెత్తందార్లపై యుద్ధానికి పేద వర్గాలను సమాయత్తపరిచేవిగా ఉన్నాయి. నాటి విప్లవకారులు పాడుకున్న పాటొకటి గుర్తుకొస్తున్నది. ‘‘విప్పపూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములు నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా... రాయలసీమ రాళ్లలోని రతనాలను మాలలల్లి నీకిస్త తమ్ముడా, నీకిస్తా తమ్ముడా.’’ ఈ స్ఫూర్తిని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లో రాజ్య ప్రాయోజిత సాధికార రథయాత్రల్లో వీక్షించవచ్చు. ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’’... అంటూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవ త్సరాల ఏడు మాసాలు గడిచాయి. ముఖ్యమంత్రి హోదాలో వందలాది సభల్లో ఆయన పాల్గొన్నారు. జనం సమక్షంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తున్నారు. వేలాదిమంది సహాయార్థులను విడివిడిగా కలిసి వారి బాధలు విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. ఇంతగా నిరంతరం జనంలో తిరుగాడినప్పటికీ ఆయన జనాకర్షణ చెక్కుచెదరలేదు. పైగా పెరిగింది. ఆయన జనంతో మమేకమయ్యే వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో విస్తారంగా దొరుకుతాయి. సెల్ఫీలకోసం ఎగబడేవారు, లాఠీల నెదిరించి బ్యారికేడ్లు దూకేవాళ్లు, ‘జగనన్నా’ అంటూ ఎలుగెత్తేవాళ్లు, కిలోమీటర్ల పొడవునా రోడ్ల పక్కన, మిద్దెల మీద నిలబడి కేరింతలు కొట్టేవాళ్లు ఇప్పుడింకా పెరిగారు. వేలాదిమంది పాల్గొన్న సభల్లో జనతరంగ విన్యా సాలు, మెక్సికన్ వేవ్స్ ఇంకా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రభుత్వాల మీద అంతో ఇంతో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నది. మరోసారి టిక్కెట్ దొరకదని ఖాయంగా తెలిసినవాళ్లలో, సొంత పనులు చక్క బెట్టుకోవడం కుదరని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తున్నది కానీ, జనబాహుళ్యంలో మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఈ పిడికెడుమంది అసంతృప్తిపై వైడ్ యాంగిల్ వేసి చూపెడుతున్న యెల్లో మీడియా లక్షలాదిమంది సంతృప్తిపై సిరా మరకలు రుద్ది దాచేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజాదరణ రేటింగ్ విషయంలో జాతీయ సంస్థల సర్వేల్లో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లో కూడా మన ‘ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్త్రీ’ లేరు. ‘ఇండియా టుడే’ వారు గత జనవరిలో చేసిన సర్వేలో జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ 56 శాతంగా ఉంటే, ఈ డిసెంబర్లో 58 శాతానికి పెరిగింది. తాజా సర్వేల్లో మన విజనరీ లీడర్‌కు 36 శాతం, క్వశ్చన్ మార్క్ లీడర్‌కు 7 శాతం జనాదరణ ఉన్నట్టు తేలింది. క్షేత్రస్థాయిలో పర్యటించి జనం గుండెచప్పుళ్లు వింటే ఈ తేడా ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. 371 కోట్ల రూపాయల ధనాన్ని సర్కారు ఖజానా నుంచి సొంతానికి దారి మళ్లించిన స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు యాభై రెండు రోజులు జైల్లో గడిపారు. ఈ జైలు జీవితం వల్ల రాష్ట్రంలో సానుభూతి గంగ ఉప్పొంగి ప్రవహిస్తుందని తెలుగుదేశం, యెల్లో మీడియాలు బోలెడు ఆశలు పెట్టు కున్నాయి. ‘టైమ్స్ నౌ’ వాళ్లు ఆయన జైల్లో ఉన్నæ సమయంలోనే సర్వే చేసి రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 గెలుచుకుంటుందని తేల్చేశారు. టీడీపీకి సున్నా నుంచి వస్తేగిస్తే ఒక సీటు రావచ్చని చెప్పారు. ఎన్నికల భాషలో దాన్నే ‘ఊడ్చేయడం’ అంటారు. ఇదీ వాస్తవ రాజకీయ పరిస్థితి. కేవలం తెలుగుదేశం – జనసేన కలిసి పోరాడినంత మాత్రాన వైసీపీని ఓడించడానికి బలం చాలదు. సమస్త రాజ కీయ శక్తుల ఓట్లు చీలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడేలా చూడాలి. 50 శాతానికి పైగా ఉన్న వైసీపీ ఓట్లలో సాధ్యమైనంత మేరకు కోత పెట్టాలి. ఇప్పుడు బాబు కూటమి ఆ ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నది. వీళ్లవెంతటి వికృతమైన, జుగుప్సా కరమైన ఆలోచనలో పరిశీలించండి. తెలుగుదేశం – జనసేన కూటమికి బీజేపీ తోడవ్వాలి. మరోపక్క కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసి వీరి సలహాల మేరకు అవగాహనతో పని చేయాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహకారం అందించిన సంగతి బహిరంగ రహస్యమే. అందువల్ల రాహుల్‌తో ఏర్పడిన సత్సంబంధాలను ప్రస్తుత అవసరాలకు బాబు వినియోగించు కుంటున్నారని సమాచారం. 22 మంది ఏపీ కాంగ్రెస్ నాయ కులను ఢిల్లీకి పిలిపించుకొని కాంగ్రెస్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో ఢిల్లీ పెద్దలు ఏపీ కాంగ్రెస్ మీద ఈ మాత్రం శ్రద్ధ పెట్టడం ఇదే ప్రథమం. ఏపీలో గెలవడం గురించి కంటే ఓట్ల శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారట! ఈ సందేశాన్ని చంద్రబాబు రాజకీయ భాషలోకి తర్జుమా చేస్తే వైసీపీ ఓట్లను చీల్చడం మీద దృష్టి పెట్టాలి. సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు రాజకీయ ఆలోచనలు ఈ విషయంతో పట్టాలు తప్పినట్టు మనకు బోధ పడుతున్నది. ఎందుకంటే రెండు మూడు బలమైన ప్రతిపక్షాలు న్నప్పుడు ప్రభుత్వ నెగెటివ్ ఓటు చీలుతుంది. ఆ చీలికను నివారించడం కోసం ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు. అలా చీలిన దాఖలాలూ లేవు. కాంగ్రెస్ ద్వారా పాజిటివ్ ఓటును చీల్చాలనే బాబు ఆలోచన ఆయన నిస్పృహకు నిదర్శనంగానే భావించాలి. ఢిల్లీ సమావేశంలో రాహుల్‌గాంధీ మరో సూచన కూడా చేశారు. పార్టీలోకి ఎవరు చేరుతానన్నా ఆహ్వానించాలనీ, అలా ఆహ్వానించకపోతే నష్టపోతామనీ హితవు చెప్పారట! ఏపీ ప్రజల దృష్టిలో రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకొని ఒక్క శాతం ఓటు కూడా లేని దుఃస్థితికి చేరుకున్న పార్టీలో చేరడానికి పరుగు పరుగున వస్తున్న వారెవరో? ఎక్కడా టిక్కెట్ దొరక్క ఏదో ఒక బీ–ఫామ్ కోసం ఎవరైనా వస్తే రావచ్చు. ఇంకేదైనా తెర వెనుక వ్యూహంలో భాగంగా మరెవరైనా రావచ్చు. వారు చూపగలిగే ప్రభావం శూన్యం. ఇక బీజేపీ కూడా తమ పొత్తులో భాగస్వామి కావాలన్న కోర్కె టీడీపీ – జనసేనలదే తప్ప బీజేపీది కాదు. పొత్తు కుదిరి పోయిందన్న ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తమున్నదని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్న మాట వాస్తవమే. వారు అధిష్ఠానానికి ఈ మేరకు పిటిషన్లు పెడుతున్న మాట కూడా నిజమే! అయితే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ జాతీయ నాయకుల నిశ్చితాభిప్రాయం. పొత్తును వారు ఇంత వరకూ ఆమోదించలేదు. కానీ చంద్రబాబు పార్టీ మాత్రం పొత్తు కుదిరిపోయిందన్న కథనాన్ని తయారుచేసింది. యెల్లో మీడియా విశ్వసనీయత అడుగంటిన నేపథ్యంలో ఈ కథనాన్ని నడప డానికి ఇంకో తటస్థ ఛానల్‌ను ఆ పార్టీ ఎంచుకున్నదని బీజేపీ వారి పరిశీలనలో తేలింది. స్కోరింగ్‌ల మీద, బ్రేకింగ్‌ల మీద న్యూస్ ఛానెళ్లకు సహజంగా ఉండే ఆసక్తిని అవకాశంగా తీసుకుని, ఇది పక్కా సమాచారమని నమ్మబలికి, ఓ ప్రముఖ ఛానల్లో టీడీపీ కథనం ప్రసారమయ్యేట్లు వ్యూహాన్ని రచించారు. దీని వెనకో పిట్ట కథ ఉన్నది. మొన్న బెంగళూరు ఎయిర్‌పోర్టులో కర్ణాటక కాంగ్రెస్ స్ట్రాంగ్ మ్యాన్ డీకే శివకుమార్, చంద్రబాబు తారస పడ్డారు. పక్కనున్న సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందికి దూరంగా వెళ్లి ఇద్దరే చాలాసేపు మాట్లాడుకున్నారు. బాబు గ్రహచారం బాగాలేక ఈ వార్త, ఫోటో మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది. దాంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయట! దీన్ని పూర్వపక్షం చేయడం కోసం బీజేపీతో పొత్తు కహానీని సిద్ధంచేసి ఒక తటస్థ ఛానెల్పైకి గురిపెట్టి విసిరారు. ఈ కథనం ప్రకారం ఏపీ బీజేపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణలో టీడీపీతో పొత్తు వుండాలనే అంశానికి మద్దతు లభించిందట! దీనిపై రాష్ట్ర నాయకత్వం ఒక రిపోర్టు తయారుచేసి జాతీయ నాయకత్వానికి పంపించిందట! ఇందులో బీజేపీకి పది నుంచి పన్నెండు, జనసేనకు 20 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారట! కన్నపు దొంగలు ఇక్కడే దొరికి పోయారు. నిజంగానే బీజేపీ వాళ్లు లేఖ రాస్తే జనసేనకు, తమకూ కలిపి ముచ్చెంగా 30 సీట్లే అడుగుతారా! కనీసం 70 సీట్లు అడిగేవారు. జనసేనకు 20 సీట్లే అని చెబుతున్న టీడీపీ వైఖరికి తగినట్టుగానే ‘బీజేపీ లేఖ’ ఉండటం ఆసక్తికరం. ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని ఆపసోపాలు పడటానికీ, అగచాట్ల పాలవడానికీ కారణం క్షేత్రస్థాయి వాస్తవికత. నాలుగేళ్లలోనే ప్రజాజీవనంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొని రాగలిగింది. ఒకప్పుడు వ్యవసాయంలో చిన్న కమతాలు లాభదాయకం కాదనే వాదన ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చిన్న కమతాల రైతులు లాభాలు పండిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని దేవీందర్‌శర్మ జాతీయ పత్రిక ‘ట్రిబ్యూన్’లో ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. రైతు భరోసా కేంద్రాలపై జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పరిపాలనలో సంపూర్ణ వికేంద్రీకరణ, పారదర్శకత సాధించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. బలహీనవర్గాలకూ, మహిళలకూ అధికార హోదాలను కట్టబెట్టడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ స్కూళ్లలో అందజేస్తున్న విద్యను ఏపీ ప్రభుత్వం ఉచితంగా పేద బిడ్డలకు అందజేయ గలుగుతున్నది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రతి ఇంటినీ పరామర్శి స్తున్నది. రైతులకు వారి భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ దేశంలోనే తొలి అడుగును ఆంధ్ర ప్రదేశ్ వేసింది. మద్య నియంత్రణను అమలులోకి తెచ్చి బెల్టు షాపుల తాట తీసింది. నడివయసు దాటిన మహిళలకు చేయూతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసింది. లక్ష ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగు నీరిచ్చి మరో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరపరిచింది. వైఎస్ జగన్ పరిపాలనలో బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వెనుకబాటుతనాన్ని ఛేదించుకొని ముందడుగు వేస్తున్నారు. ఇది గిట్టని పెత్తందారీ వర్గాలు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు చేస్తున్న రాజకీయ అవకాశవాద ప్రయోగాలను చూడాలి. ఇక పేదల ప్రభుత్వం మీద యెల్లో మీడియా విష వాయువులను ప్రయోగిస్తున్నది. కష్టజీవులందరూ పేదల ప్రభుత్వం వెనుక మరింత బలంగా సంఘటితం కావడమే ఈ విష ప్రచారాలకు విరుగుడు. ప్రతి ఉదయం ఒక కొత్త రోజును ఆవిష్కరిస్తుంది. రేపటి ఉదయం మరో కొత్త సంవత్సరాన్ని ఆవిష్కరించబోతున్నది. సామాజిక – ఆర్థిక న్యాయ సాధనలో నాలుగేళ్లుగా పడుతున్న అడుగులకు కొత్త సంవత్సరం మరింత ఉత్తేజాన్నివ్వాలని కోరు కుందాం. పెత్తందారీ శక్తుల అవకాశవాద రాజకీయాలను చిత్తుచేస్తూ పేదల ప్రభుత్వానికి మరో అఖండ విజయం ఈ కొత్త సంవత్సరం ప్రసాదించాలని కాలచక్రాన్ని ముందుకు నడిపే ఉదయార్కుడైన సూర్యభగవానుని ప్రార్థిద్దాం. సప్తాశ్వ రథమారూఢం... ప్రచండం కశ్యపాత్మజం... శ్వేతపద్మధరం దేవం... తం సూర్యం ప్రణమామ్యహమ్! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చెక్కుచెదరని మైత్రి
అంతర్జాతీయంగా ఒక అస్పష్ట వాతావరణం అలుముకున్న వేళ భారత్–రష్యాలు తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని ప్రతినబూనాయి. ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం ఆ దేశంలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా తమ నమ్మదగిన మిత్ర దేశమని మరోసారి చాటారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తలేదని అనలేం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై అమెరికా వైపు మొగ్గుచూపటం మొదలైనప్పటినుంచీ రష్యా కలవరపడుతోంది. అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఏర్పడిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో మన భాగస్వామ్యం రష్యాకు ససేమిరా నచ్చలేదు. దాన్ని ‘ఆసియా–పసిఫిక్ వ్యూహం’గా సవరించి తనతో సహా ఆసియా దేశాలన్నిటికీ అందులో భాగస్వామ్యం కల్పించాలన్నది రష్యా డిమాండ్. అదే సమయంలో చైనాకు రష్యా సన్నిహితం కావటం, పాకిస్తాన్‌తో సైతం మైత్రి నెరపటం మన దేశాన్ని ఇబ్బందిపెట్టే అంశాలు. ఇక ఇటీవలిఅంతర్జాతీయ పరిణామాల్లో ఇరు దేశాలూ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా వున్నాయి. దౌత్య సంబంధాలుఎంతో సున్నితమైనవి. ఒక దేశంతో మనకు ఏర్పడే చెలిమి అంతవరకూ మనతో మిత్రత్వం నెరపుతున్న మరో దేశానికి సమస్యగా అనిపించవచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. ఆ రెండు దేశాలమధ్యా వుండే పొరపొచ్చాలే అందుకు కారణం. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చినప్పటినుంచీ రష్యా–అమెరికా సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాతకాలంలో క్రిమియాను రష్యా దురాక్రమించాక అమెరికా మరింత ఆగ్రహించింది. ఆ దేశంతో ఎవరూ సన్నిహితంగా వుండరాదని కోరుకుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచీ రష్యాపై అనేక ఆంక్షలు విధించి, పాశ్చాత్య దేశాలను కూడగట్టింది. మన దేశంపై కూడా ఒత్తిళ్లు తెస్తూనేవుంది. అయినా ద్వైపాక్షిక వాణిజ్యం 1,200 కోట్ల డాలర్ల నుంచి నిరుడు 5,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా యూరొప్ దేశాలకు ముడి చమురు అమ్మకం ఆగిపోయిన పర్యవసానంగా మన దేశానికి రష్యా చవగ్గా చమురు విక్రయించటంతో ఈ వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. మున్ముందు ఇది మరింత పెరుగుతుందని జైశంకర్ చెబు తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని మన దేశం వ్యతిరేకించినా బాహాటంగా రష్యాను విమర్శించలేదు. మన జాతీయ భద్రతా వ్యూహంలో రష్యా పాత్ర అత్యంత కీలకం. మొదటినుంచీ మన రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా అధికం. ఇప్పటికీ ఆయుధాల మరమ్మత్తు బాధ్యత రష్యాదే. ఇటీవలి కాలంలో అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. తన సలహాను బేఖాతరు చేసి రష్యానుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయటం అమె రికాకు నచ్చలేదు. ఇలా ఎన్ని ఒత్తిళ్లున్నా రెండు దేశాల బంధం సడలలేదు. జైశంకర్ తాజా పర్యటనలో తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా మరింత సాంకేతిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలయ్యాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తుండగా మరో నాలుగు మొదలుకావాల్సివుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి వుంది. ఇదిగాక ఔషధాలు, వైద్య పరికరాలు వగైరాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. యూరేషియన్ ఎకనామిక్ జోన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించాలన్న రష్యా ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. సాధారణంగా వేరే దేశాల మంత్రులు పర్యటించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని కలిసే సంప్రదాయం లేదు. కానీ దాన్ని పక్కనబెట్టి ఆయన జైశంకర్‌తో సమావేశం కావటం, తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపటం భారత్‌తో బంధానికి పుతిన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియబరుస్తోంది. అయితే సమస్యలున్నాయి. ముడి చమురు కొనుగోళ్లకు మన దేశం రూపాయల్లో చెల్లింపులు మొదలు పెట్టినా, దాని అస్థిరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, అందుకోసం అదనంగా చెల్లించాలనీ రష్యా చమురు సంస్థలు కోరుతున్నాయి. అదింకా పరిష్కారం కావలిసేవుంది. దౌత్యం ఎంతో క్లిష్టమైనది. అవతలి పక్షంనుంచి కావలసినవి రాబట్టుకోవటం, అదే సమయంలో వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవటం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి. కల్లోల సమయాల్లో మరింత చాకచక్యం తప్పనిసరి. వాస్తవానికి భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఇరు దేశాల అధినేతలూ హాజరు కావలసివుంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా 2020లో అసలు సమావేశమే జరగలేదు. ఉక్రెయిన్ యుద్ధంతోరెండేళ్లుగా మోదీ శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లలేదు. అయినా సరే ఈసారి కూడా జైశంకరే వెళ్లక తప్పలేదు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రష్యాకు ఒకప్పుడు మనం జూనియర్ భాగస్వామిగా వుండేవాళ్లం. ఉదాహరణకు 1991 నాటికి రష్యా జీడీపీ 51.80 కోట్ల డాలర్లు కాగా, మన జీడీపీ 27 కోట్ల డాలర్లు. ఇప్పుడు రష్యా జీడీపీ 2 లక్షల 20 వేల కోట్ల డాలర్లయితే, మన జీడీపీ మొత్తం విలువ 3 లక్షల 60 వేల కోట్ల డాలర్లు. అయినా ఇరు దేశాల సంబంధాలూ యధాతథంగా వున్నాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడే చెలిమి ఎప్పటికీ చెక్కుచెదరదు. ఎన్నో అవాంతరాలనూ, కాలపరీక్షలనూ తట్టుకుని నిలబడిన భారత్–రష్యా సంబంధాలు మున్ముందు సైతం ఇదే రీతిలో కొనసాగుతాయని ఆశించాలి. -
ఇది ఎవరి తప్పు?
ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘డంకీ’ గత గురువారం విడుదలైనప్పుడు, సరిగ్గా అలాంటి కథే కళ్ళ ముందుకొస్తుందని ఆయనా ఊహించి ఉండరు. సరైన విద్యార్హతలు లేకున్నా, సంపాదనకై లండన్‌కు అక్రమంగా వలసపోవాలనుకొనే నలుగురు పంజాబీల చుట్టూ తిరిగే షారుఖ్ ఖాన్ సినిమా అది. ఈ రోజుల్లో అలాంటి కథ ఏ మేరకు ప్రాసంగికమంటూ కొందరు స్తనశల్య పరీక్ష చేస్తున్నవేళ, యాదృచ్ఛికంగా అచ్చంగా ఆ సినిమాలో లానే, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో భారతీయ అక్రమ వలసల ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నికరాగ్వా వెళ్ళాల్సిన ప్రత్యేక విమానం ఇంధనం నింపుకోవడానికి ఫ్రాన్స్‌లో ప్యారిస్‌కు 150 కి.మీ.ల దూరంలోని వాత్రీ విమానాశ్రయంలో ఆగినప్పుడు ఊహించని విషయం బయటపడింది. విమానంలో మనుషుల అక్రమ రవాణా సాగుతున్నట్టు ఉప్పందడంతో ఫ్రాన్స్ పోలీసులు బరిలోకి దిగేసరికి, అమెరికాకు అక్రమంగా పోవాలనుకున్నవారి ఆశ అడియాస అయింది. పక్కన తోడెవరూ లేని 11 మంది మైనర్లతో సహా మొత్తం 303 మంది విమాన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులే. భారత్ నుంచి నేటికీ భారీగా సాగుతున్న అక్రమ వలసలకు ఇది మచ్చుతునక. వివిధ దేశాలకు అక్రమ వలసలు కొత్త కాదు. కానీ ఈ పద్ధతిలో, ఇంత భారీ సంఖ్యలో జరగడం మాత్రం కొత్తే. నికరాగ్వా వీసా మాత్రమే ఉన్నప్పటికీ వారిని అక్రమంగా అమెరికా పంపాలనేది పథకమనీ, ఈ వ్యవహారం నడిపిన ఇద్దరు అనుమానితుల్ని ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకు న్నారనీ, ప్రయాణికుల్లో పాతిక మంది శరణార్థులుగా ఆశ్రయం కోరారనీ వార్త. ఇక, మిగిలిన 276 మంది మంగళవారం ముంబయ్‌కి విమానంలో సురక్షితంగా తిరిగొచ్చారు. వ్యవహారం ఇంతటితో ముగిసినట్టనిపిస్తున్నా, అసలు కథ ఇప్పుడే ఉంది. రొమేనియా దేశపు ప్రైవేట్ కంపెనీ నడుపుతున్న విమానంలో ఈ అక్రమ వలస యానం వెనుక అసలు ఉన్నదెవరు? అమెరికా ఆశ చూపి అమాయకు లకు టికెట్లు, వీసాలు ఏర్పాటు చేసిన ప్రయాణ ఏజెన్సీలేమిటి? ఈ ‘డాంకీ/ డంకీ రూట్’ (అక్రమ ప్రయాణమార్గం), ప్రత్యేక విమానాలను ఖరారు చేసిందెవరు? ఇలాంటి అనేక విషయాల దర్యాప్తు మిగిలే ఉంది. నికరాగ్వా చేరకముందే, ఫ్రాన్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొనేసరికి కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోరడం అచ్చంగా ‘డంకీ’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేస్తుంది. నిజానికి, అమెరికాలోని అక్రమ వలస జనాభా విషయంలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2021 నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ఈ వాస్తవం వెల్లడించింది. భారతీయ అమెరికన్లలో దాదాపు 7.25 లక్షల మంది అక్రమ వలసదారులే! మరో మాటలో – అమెరికాలోని ప్రతి ఆరుగురు భారతీయ అమెరికన్లలో ఒకరు సరైన పత్రాలు లేకుండా ఆ దేశంలో ఉంటున్నవారే! గమనిస్తే, ఒక్క 2022– 23లోనే 96,917 మంది భారతీయులు అక్రమ వలసదారులుగా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేశారు. అంతకు మునుపటి ఏడాదితో పోలిస్తే, అది 51.61 శాతం ఎక్కువ. వీరిలో దాదాపు 41 వేల మందికి పైగా మెక్సికన్ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి వెళ్ళాలని చూశారు. ఎలాగైనా సరే అగ్రరాజ్యపు సందిట్లోకి చేరాలనుకొనే వారికి ప్రయాణ పత్రాలు సులభంగా పుట్టే నికరాగ్వా వాటమైన మజిలీ. మధ్య అమెరికాలోని ఆ అతి పెద్ద దేశం మీదుగా వలస పోతున్నారు. మెక్సికో, కెనడాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఇటీవల అనేకం వచ్చాయి. అసలింతమంది భారతీయులు విదేశాలకు వలస పోవాలని ఎందుకనుకుంటున్నట్టు? భార తీయ అమెరికన్ కుటుంబ సగటు ఆదాయం లక్షా 30 వేల డాలర్లు. స్వదేశంలో సరైన ఉపాధి, ఉద్యోగాలు లేక అధిక శాతం మంది విదేశాల వైపు చూస్తున్నారు. అమెరికా, కెనడా లాంటి చోట్ల మెరుగైన ఆదాయం, ఆనందమయ జీవితాలను వెతుక్కుంటూ, ‘డాంకీ/ డంకీ రూట్’లోనైనా సరే అక్కడకు చేరిపోవాలని ఆరాటపడుతున్నారు. చిత్రమేమిటంటే, తాజాగా దొరికిన లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానంలో అధిక శాతం మంది పాశ్చాత్య సమాజంతో దీర్ఘకాలిక సంబంధమున్న సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ల వారే! ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డవారు సొంత భాష, ప్రాంతానికి చెందిన ఈ అక్రమ వలసదారులకు అండగా, సురక్షిత ఆశ్రయంగా మారడం సహజమే. సంపన్న దేశాల్లో శ్రామికశక్తి లోటును భర్తీ చేయడానికి మనుషులు కావాలి కానీ, సాంస్కృతిక అంతరాల రీత్యా అక్కడ వలసదారులకు లభించే గౌరవం ఎంత అన్నది చర్చనీయాంశమే. దేశాల సరిహద్దులు చెరిపేసిన ప్రపంచీకరణ వ్యాపారంలో జరిగిందే తప్ప, ఇప్పటికీ వ్యక్తులను అనుమతించడంలో, ఆదరించడంలో కాలేదన్నది నిష్ఠురసత్యం. ఏ దేశానికి ఆ దేశం తనవైన నియమ నిబంధనలు పెట్టుకోవడం సహజమే. అయితే, ఉన్న ఊరినీ, కన్నతల్లినీ వదిలేసి, మెరుగైన జీతం, జీవితం కోసం మనవాళ్ళు గల్ఫ్ నుంచి అమెరికా దాకా వివిధదేశాలకు వలసపోతున్న తీరుకు కారణాలపై సమాజం, సర్కారు పెద్దలు ఇప్పటికైనా దృష్టి సారించాలి. భవిష్యత్తు అనిశ్చితమని తెలిసినా సరే, ఎండమావుల వెంటపడి ప్రాణాల్ని పణంగా పెడుతున్న భారతీయ శ్రామికశక్తికి ఇక్కడే ఎందుకు సలక్షణ జీవనమార్గం చూపించలేకపోతున్నామో ఆలోచించాలి. దూరపుకొండల వైపు ఆశగా చూస్తున్న అమాయకులను బుట్టలో వేసుకొని, కళ్ళ ముందు గాలి మేడలు చూపెడుతున్న ఏజెంట్ల వ్యవస్థను పసిగట్టాలి. ప్రాణాంతక అక్రమ వలసలకు ప్రోత్సహిస్తున్న వారి పనిపట్టాలి. ప్రాచీన కాలపు బానిస వ్యాపార వ్యవస్థకు ఆధునిక రూపాంతరమైన మానవ అక్రమ రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి. తాజా విమానయాన ఉదంతం అందుకు ఓ మేలుకొలుపు. -
ఎరుపెక్కిన సముద్ర వర్తకం
సమీపకాలంలో భారత్‌కు అత్యంత ఆందోళనకర పరిణామం ఇది. బలవత్తరమైన శక్తిగా ఎదగడానికి సముద్ర వర్తకం ముఖ్యమైన వేళ... వాణిజ్య నౌకలపై వరుస దాడులు నిరంతర అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. వేర్వేరు వాణిజ్య నౌకలపై అరేబియా సముద్రంలో ఇటీవల జరిగిన దాడులతో, భారత నౌకాదళం మూడు క్షిపణి విధ్వంసక నౌకలను మోహరించాల్సి వచ్చింది. వాటిని వివిధ ప్రాంతాల్లో గస్తీకి నిలిపి, ముష్కరుల దొంగదాడులకు మన నేవీ చెక్ పెట్టే పనిలో పడింది. వారం రోజుల్లో... భారతీయ సిబ్బందితో కూడిన రెండు వాణిజ్య నౌకలు మన దేశానికి వస్తూ, దాడికి గురవడం మన సముద్ర వర్తకం భద్రతపై ప్రశ్నలు రేపింది. పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ళ దూరం నుంచి 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన ఎమ్వీ చెమ్ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్ దాడి జరిగింది. అప్రమత్తమైన భారత నౌకాదళం, భారత తటరక్షక దళం సదరు వర్తక నౌకకు రక్షణగా నిలిచాయి. తర్వాత కొద్ది గంటలకే... పాతిక మంది భారతీయ సిబ్బందితో కూడిన వాణిజ్య క్రూడాయిల్ ట్యాంకర్ ఎమ్వీ సాయిబాబాపై ఎర్రసముద్రం దక్షిణ ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో,నౌకాదళం గస్తీ పెంచింది. దాడులు జరిపిన ముష్కరులు సముద్ర గర్భంలో దాగివున్నా సరే, వెతికి పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. లెక్కలు తీస్తే... నవంబర్ 19 నుంచి ఇప్పటికి ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై 30 డ్రోన్ దాడులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. అంటే, దాదాపు రోజుకో దాడి. ఈ 30 దాడుల్లో సగం ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే సముద్ర వర్తక మార్గంలో ఎర్ర సముద్రంలో జరిగినవే. ఇది ఆందోళనకరం. తాజాగా ఎమ్వీ చెమ్ ప్లూటోపై జరిగిన దాడి తాలూకు శిథిలాలను సేకరించి, దాడి తీరుతెన్ను లను కనిపెట్టే ప్రయత్నం సాగుతోంది. దాడి మరో నౌకపై నుంచి చేశారా, లేక తీర ప్రాంతం నుంచి జరిగిందా లాంటి అంశాలను నిర్ధారణ చేసే పనిలో ఇండియన్ నేవీ నిమగ్నమైంది. ఒకపక్క గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంతో ఉద్రిక్తతలు పెరగగా, అదే సమయంలో వాణిజ్య నౌకలపై ఇలా డ్రోన్ దాడులు జరగడం యాదృచ్ఛికమేమీ కాదు. అక్కడి యుద్ధం తాలూకు ప్రభావం ఇక్కడకు విస్తరించింది. యెమెన్‌లో అధిక ప్రాంతాలను తమ నియంత్రణలో పెట్టుకున్న హౌథీ రెబల్స్ నవంబర్ మధ్య నుంచి ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తున్నారు. గాజా లోని హమాస్‌కు సంఘీభావంగా రెబల్స్ ఈ దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌తో స్పష్టమైన సంబంధం లేని నౌకలపైనా ఈ దాడులు సాగడం గమనార్హం. వీరికి ఇరాన్ అండదండలున్నట్టు కథనం. దాడులకు బాధ్యత తమదేనంటూ ఈ యెమనీ రెబల్స్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఎమ్వీ సాయిబాబాపై హౌథీలు దాడి జరిపారనీ, ఎమ్వీ చెమ్‌ప్లూటోపై ఇరాన్ నుంచి డ్రోన్‌ను ప్రయో గించారనీ అమెరికా కేంద్ర కమాండ్ సమాచారం. దాడులకు ఎర్ర సముద్రాన్ని ఎంచుకోవడంలో ముష్కరులకు పెద్ద వ్యూహం ఉంది. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం, వ్యాపారంలో 12 శాతం, సముద్రజలాలపై పెట్రోలియమ్ వాణిజ్యంలో 10 శాతం మధ్యధరా ప్రాంతాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే జరుగుతాయి. దాడుల వల్ల నౌకలు రూటు మార్చి, ఒకప్పటిలా గుడ్‌హోప్ అగ్రం చుట్టూ తిరిగిరావాలి. దూరం, దరిమిలా ప్రయాణకాలం పెరిగే ఈ సుదీర్ఘయానం వల్ల చమురు, దిగుమతుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు మరింత ప్రియమవుతుంది. చమురు సరఫరాలకు ప్రధానంగా ఆ ప్రాంతంపై ఆధారపడే భారత్‌కు ఇది దెబ్బ. ఇజ్రాయెల్ – హమాస్ పోరు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమే అందుకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్లను సైద్ధాంతికంగా వ్యతిరేకించే హౌథీల దాడుల దెబ్బకు ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రమైపోయింది. గాజాకు మానవతా సాయం అందేవరకు ప్రపంచ సరఫరా వ్యవస్థలకు అవరోధాలు కల్పించాలన్న వారి ఆలోచన ఫలిస్తోంది. దీన్ని ప్రతిఘటించి, ముష్కరుల దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా గత వారం ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ పేర బహుళ దేశీయ నౌకా దళాన్ని ప్రారంభించింది. అయితే, అగ్రరాజ్య సారథ్యంలోని ఈ బలగంలో పలు దేశాలు చేరలేదు. సూయజ్ కాలువ ద్వారా వర్తకం తగ్గినందు వల్ల భారీగా నష్టపోయే ఈజిప్ట్ ఇంతవరకు హౌథీల దుశ్చర్యలను ఖండించలేదు. చివరకు యెమెనీ గ్రూపుతో శాంతి ప్రక్రియ చర్చలు సాగిస్తున్న సౌదీ అరేబియా సైతం అమెరికా సారథ్య నౌకాబలగాన్ని సమర్థించలేదు. ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన శత్రుత్వం వహించే పాకిస్తాన్ ఉన్నందున, మిగిలిన దిక్కుల్లో వాణిజ్యానికి సంబంధించి ఆచరణలో భారత్ ద్వీపదేశమే. అందుకే, మనకు సముద్ర వర్తకం కీలకం. మన దేశ వాణిజ్య పరిమాణంలో 98 శాతం, విలువలో 68 శాతం సముద్ర మార్గాల్లోనే సాగుతాయి. దానికి తగ్గట్టే హిందూ మహాసముద్ర ప్రాంతానికి కావలి పాత్రను భారత్ పోషిస్తోంది. వాణిజ్యం పెరగాలంటే, మిత్రదేశాలతో కలసి ఈ సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచాలి. ఆ పనే భారత్ చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో సమదూరం పాటిస్తూ వచ్చిన మనకు తాజా పరిస్థితులు కొత్త బరువ నెత్తిన పెట్టాయి. సోమాలీ సముద్ర దొంగల్ని నిరోధించేందుకు ఈ సరికే గస్తీ సాగిస్తున్న భారత్, ఇకపై వాణిజ్య నౌకల్ని భద్రంగా ఎర్ర సముద్రం దాటించే పని తప్పదు. ఒకవేళ దాడులు సాగితే, అది మరో యుద్ధభేరి అవుతుంది. అందుకే, ఈ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం గాజాలో యుద్ధానికి తెర పడడం, శాంతి నెలకొనడమే! -
పాత మూస... కొత్త చట్టం
మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది. కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది. భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి. అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం. అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది. అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది. కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు. నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది. చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం. -
పరువు కోసం కుస్తీ!
ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్‌ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్ వేటువేయక తప్పలేదు. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్ సింగ్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్తో మన రెజ్లింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. ఒలింపిక్ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా,ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతక విజేత వినేశ్ ఫోగట్‌లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు. అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్‌భూషణ్‌కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్‌సింగ్ గత గురువారం డిసెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం. అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్–15, అండర్–20 వారికి జాతీయ ఛాంపియన్షిప్స్ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్‌ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్ సాక్షీ మాలిక్ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్‌ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. రెజ్లింగ్ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్ ఫోగట్ అన్నట్టు... రెజ్లింగ్ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!! -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్‌గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్‌లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్‌ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్‌లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్‌కు పంపితే క్లయిమాక్స్‌లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్‌ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్‌గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్‌తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్‌బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్‌హాఫ్‌లో కాకపోతే సెకండ్ హాఫ్‌లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
పీకే అండ్ పీకే ఫార్ములా!
ముసుగు జారిపోయింది. ఇప్పుడంతా తేటతెల్లం. చంద్ర బాబు కోసం పవన్ కల్యాణ్ చేత చంద్రబాబే ఏర్పాటు చేయించిన ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ (ఎస్పివి) జనసేన. అది ప్యాకేజీ ఫీజుతో కాంట్రాక్టుపై పనిచేస్తున్నదని వైఎస్సార్సీపీ నాయకులు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా జనసేన కోసం జీవితాలను ధారబోసి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న యువకులు ఇంకో అడుగు ముందుకు వేసి చెబుతున్న మాట – ‘చంద్రబాబు సినిమాలో... జనసేన ఓ ఐటమ్ సాంగ్ మాత్రమే!’ కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలు జనసేన కార్యకర్తల్లోని అనుమానాలను బలపరుస్తున్నాయి. ‘రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. నేనేం చేసినా ప్రశ్నించవద్దు. తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించేవాళ్లు పార్టీలో ఉండనవసరం లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పదేళ్లు కొనసాగవలసిన అవసరం ఉన్నది’. ఈ రకమైన సుభాషితాలు విశదం చేస్తున్న విషయమేమిటి? తెలుగుదేశంతో ఇంకో పదేళ్ల పాటు పొత్తుకు డీల్ కుదిరిందనే కదా! ఈ డీల్ వల్ల జనసేనకు ఒనగూరే ప్రయోజనమెంత? ఎన్ని అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి పదవి జనసేనకు ఎన్నేళ్లు... టీడీపీకి ఎన్నేళ్లు? ఇటువంటి ప్రశ్నలు అడగొద్దనే ఉద్దేశంతోనే సొంత పార్టీ అభిమానుల ముందరి కాళ్లకు పవన్ ముందుగానే బంధనాలు వేశారు. దాటవేత పద్ధతిలో సొంత పార్టీ వారిని ఏమార్చుతూ వచ్చారు. ‘ముందుగా సీట్లు గెలవాలి. ఎక్కువ సీట్లు గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి పదవిని అడగగలం... ముందు ఎక్కువ సీట్లలో జనసేనను గెలిపించండ’ని కార్యకర్తల పైనే పవన్ ఎదురుదాడి చేస్తూ వచ్చారు. సరే, పొత్తులో భాగంగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నామని కార్య కర్తల ప్రశ్న. ముఖ్యమంత్రి పదవి దక్కేంతగా మెజారిటీ సీట్లు తీసుకోబోతున్నామా? పోనీ హరిరామజోగయ్య వంటి శ్రేయోభి లాషులు చెబుతున్నట్టుగా కనీసం 60 సీట్లు? జనసేనకు అంత సీన్ లేదని తెలుగుదేశం పార్టీ కో– పైలట్‌గా భావించుకుంటున్న లోకేశ్‌బాబు కుండబద్దలు కొట్టారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఒక్క సీట్లోనే ఓడిపోతే పవన్ రెండుచోట్లా ఓడిపోయారు. అందువల్ల ఆ మాత్రం చులకన భావం లోకేశ్‌కు సహజం. కచ్చితంగా 150 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులే ఉంటారని తాజాగా ఒక వెబ్ చానల్ ఇంటర్వ్యూలో లోకేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనే సమస్యే రాదనీ, అటువంటి ప్రస్తావనే రాలేదనీ, చంద్రబాబే తమ ముఖ్యమంత్రి అభ్యర్థనీ లోకేశ్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అంగీకరించినట్టు లోకేశ్ వెల్లడించారు. లోకేశ్‌బాబు ఇంటర్వ్యూ సారాంశం ప్రకారం గరిష్ఠంగా 25 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నది. అందులో కూడా సగంమంది అభ్యర్థులకు కొత్తగా జనసేన తీర్థ మిచ్చి టీడీపీ సమకూర్చుతుందని విశ్వసనీయ సమాచారం. మిగిలిన పది, పన్నెండుమంది ఎంపికను కూడా టీడీపీ నాయ కత్వం ఆమోదించవలసి ఉంటుంది. ఇంత అవమానకరమైన ఒప్పందానికి ఏ రాజకీయ పక్షమైనా ఒప్పుకుంటుందా? ఇంకేదో మనకు తెలియని కోణం ఉన్నందువల్లనే ఇటువంటి పొత్తులు సాధ్యమవుతాయి. ఏమిటా కోణం? అదో సింగపూర్ రహస్య మంటారు జనసేన వ్యవహారాలు బాగా తెలిసినవాళ్లు. చిదంబర రహస్యం గురించి విన్నాం గానీ ఈ సింగపూర్ రహస్యం ఏమిటో అంతుపట్టడం లేదు. చంద్రబాబుకు సింగపూర్‌తో వ్యాపార సంబంధాలు చాలాకాలం నుంచి ఉన్నాయనేది బహి రంగమే. బహుశా రాజకీయ లావాదేవీలను కూడా అక్కడి నుంచి నరుక్కొస్తారేమో! ఈ కోణాల సంగతీ, కుంభకోణాల సంగతీ పక్కన పెడదాం. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పుకొని, రాష్ట్రంలో ఉన్న మరో బలమైన సామాజికవర్గపు ఆకాంక్షలతో ఊపిరిపోసుకున్న పార్టీ నిజస్వరూపం ఇలా వెల్లడైతే దాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? జనసేన నాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వస్తున్న క్షేత్రస్థాయి జనసేన కార్యకర్తల్లో చాలామందికి లోకేశ్‌బాబు తాజా ఇంటర్వ్యూ కళ్లు తెరిపించి ఉండాలి. వారి మనోభావాలనే హరిరామ జోగయ్య లేఖ రూపంలో పవన్ కల్యాణ్‌కు చేరవేశారు. ‘లోకేశ్ చెప్పిన మాటలకు మీ ఆమోదం ఉన్నదా’ అని లేఖలో జోగయ్య ప్రశ్నించారు. ‘మీరు ముఖ్యమంత్రి కావాలనీ, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి రావాలనీ కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నార’ని కూడా ఆయన ప్రశ్నించారు. చివరకు 60 సీట్లకు తగ్గకుండా పొత్తులో భాగంగా దక్కించుకోవాలని పవన్ కల్యాణ్‌కు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్‌తో వ్యవహరించే తీరుపై పెదబాబు, చిన బాబుల అభిప్రాయాల్లో కొద్దిగా తేడాలున్నాయట! కనీసం 30 సీట్లన్నా ఇవ్వకపోతే జనసైనికులకు సర్దిచెప్పడం కష్టమన్న పవన్ వైఖరి పట్ల చంద్రబాబు ఒకింత సానుభూతిగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీట్లు 20 దాటకూడదని లోకేశ్‌బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భంలో అరెస్టు భయంతో చినబాబు ఢిల్లీలో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రశాంత్ కిశోర్‌తో (పీకే) స్నేహం కుదిరింది. ఎన్నికల్లో ఈసారి తమకు వ్యూహకర్తగా పనిచేయా లని పీకేను లోకేశ్ అడిగారట! ఇప్పటికే పీకే టీమ్‌లో పనిచేసిన రాబిన్‌సింగ్ తెలుగుదేశం వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగానే పవన్ కల్యాణ్‌ను అతిగా ఊహించుకోవద్దనీ, అతనికి కాపు సామాజికవర్గంలో కూడా పెద్దగా బలం లేదనీ పీకే లోకేశ్‌కు చెప్పినట్టు తెలిసింది. జనసేనకు ఎన్ని ఎక్కువ సీట్లిస్తే అంత ఎక్కువ నష్టం జరుగు తుందని తన అభిప్రాయంగా చెప్పారట! అయితే వ్యూహకర్తగా పనిచేయడానికి తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ, తన సమా చారం ప్రకారం వైసీపీ మరోసారి గెలిచే అవకాశాలున్నట్టు చెప్పా రట! అప్పటినుంచీ పీకేను వ్యూహకర్తగా ఒప్పించడం కోసం లోకేశ్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. పీకే సలహా మేరకు 20 లోపు స్థానాలకే జనసేనను పరి మితం చేయాలని లోకేశ్ పట్టుదలగా ఉండడంతో విషయం తెలిసిన పవన్ కల్యాణ్ పాదయాత్ర ముగింపు సభకు తాను రానని బెట్టు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సభకు రావడానికి అంగీకరించిన పవన్ మొండికేయడంతో చంద్ర బాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి అనునయించారట! ఇతరత్రా ఒప్పందాల సంగతి తెలియదు గానీ, అసెంబ్లీ సీట్ల సంఖ్యను 25కు పెంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. జనసైనికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని భయపడినప్పటికీ ఆ సంఖ్యకు ఒప్పుకోక తప్పలేదు. ఆ బాడీ లాంగ్వేజ్‌లో కూడా అప్పటి వాతావరణ ప్రభావం కనిపించింది. చంద్రబాబును సాగనంపడానికి బయటకొచ్చిన పవన్ దూరంగా నిలబడి ఉండగా నాదెండ్ల మనోహర్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బాబుకు వీడ్కోలు చెప్పడం కనిపిం చింది. ఎట్టకేలకు లోకేశ్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆ సభకు పెట్టుకున్న పేరు విజ యోత్సవ సభ. లైవ్‌లో కార్యక్రమాన్ని చూసిన వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఏమిటంటే – అది విజయోత్సవ సభ కాదు, సంతాప సభలా ఉన్నదని! పోనీ పాదయాత్ర తొలి రోజున చనిపోయిన తారకరత్న సంతాప సభగా దాన్ని మార్చారా అంటే అదీ లేదు. అతని పేరు తల్చుకున్నవారే లేరు. కానీ వేదిక మీదున్న నాయకుల ముఖాలు మాత్రం దీనంగా వేలాడుతూ కనిపించాయి. అందుకు సభ ఫెయిల్యూర్ ఒక కారణం కావచ్చు. ఆరు లక్షలమందిని సమీకరించి ఒక బలమైన ముద్ర వేయాలని టీడీపీ గట్టిగా సంకల్పించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఏం జరిగిందో తెలియదు. సభకు నలభై నుంచి యాభైవేల మంది వరకు వచ్చి ఉంటారని తేలింది. చంద్రబాబు ప్రసంగించే సమయంలో పట్టుమని పదివేల మంది లేరు. ఇదీ రాష్ట్రంలో తెలుగుదేశం – జనసేనల ఉమ్మడి ప్రభావం. ఇక సంతాప వాతావరణానికి రెండో కారణం – పొత్తులో కత్తుల వ్యవహారం కావచ్చు. జనసేన శ్రేణుల్లో ఒకపక్క అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ ఊడిపడ్డారు. బీజేపీ తరఫున రాజ్యసభలో ఉన్న సీఎమ్ రమేశ్‌కు చెందిన ప్రైవేట్ విమానంలో లోకేశ్, కిలారు రాజేశ్‌లతో కలిసి ఆయన విజయవాడకు వచ్చారు. చంద్ర బాబును కలుసుకున్నారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ భేటీపై ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం రెండు రకాలుగా ఉన్నది. తెలుగుదేశం – జనసేన కూటమి మాత్రమే వైసీపీతో తలపడటానికి సరిపోదనీ, ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ – కమ్యూనిస్టులను కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పడానికే చంద్రబాబును పీకే కలిశారని ఒక సమా చారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతకంటే వింత ఇంకోటి ఉండదు. వచ్చింది బీజేపీ ఎంపీ విమానంలో! రాచకార్యం కాంగ్రెస్ కోసం!! ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రాబిన్‌సింగ్ టీమ్ పూర్వాశ్రమంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోనే పనిచేసినందున... వారితో మాట్లాడి సలహాలిచ్చేందుకు రావలసిందిగా లోకేశ్ చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చాడని మరో సమాచారం. చంద్ర బాబు ఇంట్లో జరిగిన సమావేశానికి రాబిన్ సింగ్ టీమ్ కూడా హాజరైంది. గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు తమవైపున పనిచేస్తున్నాడని మైండ్ గేమ్ ఆడేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్టు వినపడుతున్నది. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం మానేశానని ప్రశాంత్ కిశోర్ గతంలోనే చెప్పారు. కానీ పేరు వాడుకుని మైండ్ గేమ్ ఆడాలను కోవడం నదిలో కొట్టుకొనిపోయేవాడు గడ్డిపోచను చూసి ఆశపడిన చందం! వ్యూహకర్తలే ఎన్నికల్లో గెలిపించేట్లయితే పార్టీలను మూసేసుకుని నాయకులు వ్యూహకర్తలనే ఆశ్రయించేవారు. అంబటి రాంబాబు చెప్పినట్టు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రీ ఏం చేస్తాడు? ఈ పీకే భేటీ సంగతేమోగానీ, ఈ పరిణామం మన పీకే (పవన్ కల్యాణ్) పీకకు చుట్టుకుంటుందేమో చూడాలి. అసలే పార్టీ నుంచి వరసగా జారుకుంటున్నారు. కీలకమైన కాపు సామాజికవర్గం నేతలే తాము ఈ పార్టీలో ఇమడగలిగే పరిస్థితి లేదని బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. పాతిక సీట్లతోనే పార్టీ నేతలను ఒప్పించలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ కూడా తోడైతే వాళ్లకిచ్చే నాలుగు సీట్లు కూడా తన ఖాతా లోంచే కోత పడతాయి. పైగా బీజేపీ మీద అపారమైన అభి మానాన్ని కురిపిస్తూ ఎన్డీఏ కూటమి సభ్యుడిగా చేరిన పవన్ ‘ఇండియా’ కూటమిని అంగీకరిస్తారా? ఆ పరిస్థితి ఎదురైతే తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? తెగతెంపులు చేసుకునేంత సాధారణమైన సంబంధమే తెలుగుదేశంతో ఉన్నదా? ఇవన్నీ సందేహాలే. తెలుగుదేశం పార్టీ ‘ఇండియా’ కూటమిలో చేరే అవకాశం లేదనే అనుకుందాం. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే వస్తుందని బాబుతో పీకే చెప్పినట్టు సమాచారం. అసలే బీజేపీ అంటేనే బాబు ఝడుసుకుంటు న్నారు. మరో దారి లేకపోతే తప్ప ‘ఇండియా’ కూటమిలో చేరే నిర్ణయాన్ని బాబు తీసుకోలేరు. కేవలం సలహాలు ఇవ్వడానికే పీకే బాబును కలిశాడనుకుందాము. ఆయన సలహా మేరకు కుదించిన సీట్లతో జనసైనికులను మన పీకే సంతృప్తిపరచ గలరా? పదేళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న ఆశావహుల ఆగ్ర హాన్ని అదుపు చేయగలరా? తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదనీ, చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనీ బహిరంగంగా ప్రకటించి కాపు సామాజికవర్గం ఆకాంక్షలపై నీళ్లు చల్లి పార్టీని నిలబెట్టుకోగలరా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
అయోమయంలో ‘ఇండియా’
పాలకపక్షాన్ని అధికారం నుంచి దించటమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పటికీ అయోమయాన్ని వదుల్చుకోలేకపోతున్నదని మంగళవారం జరిగిన సమావేశం రుజువుచేసింది. తాము ఎవరికి ప్రత్యామ్నాయమో, దేనిలో ప్రత్యామ్నాయమో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఈనాటికీ అర్థం కాలేదని ఆ సమావేశం తీరుతెన్నులు తేటతెల్లం చేస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా ఆయన హిందీ అర్థంకాక ఇబ్బందిపడుతున్న డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు విషయంలో నితీశ్ స్పందించిన వైనం దిగ్భ్రాంతికరం. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్థమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని అడిగిన ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝాపై నితీశ్ నిప్పులు కక్కారు. పనిలో పనిగా ‘హిందీ మన జాతీయ భాష. అందరి భాష. అందుకే మన దేశాన్ని హిందూస్థాన్‌గా పిలుచుకుంటాం. అది అందరికీ తెలియాల్సిందే. మీరేమీ అనువాదం చేయకండి’ అన్నారట. నితీశ్ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో బిహార్‌లో అవినీతికీ, అధికధరలకూ వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో ఎదిగి రాజకీయరంగ ప్రవేశం చేసిన వ్యక్తి. పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నవారు. అలాంటి నాయకుడు హిందీ మన జాతీయ భాష అనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశానికి ఉమ్మడి భాష అవసరమనీ, దాన్ని అందరూ నేర్చుకోవాలనీ ఉత్తరాది నాయకులు పార్టీలకు అతీతంగా చెబుతూవుంటారు. మాతృభాష కాక మరికొన్ని భాషలు నేర్చుకోవాలని చెప్పటంలో తప్పేమీ లేదు. అలా నేర్చుకోవటం వల్ల దేశంలో ఏమూలకైనా వెళ్లి జీవనం సాగించటం సులభమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. సివిల్స్‌లో విజేతలై దక్షిణాది రాష్ట్రాల క్యాడర్‌కు వచ్చేవారు స్థానిక భాషలు స్వల్పకాలంలోనే నేర్చుకుని అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. హిందీ భాషా ప్రాంతాలనుంచీ, వేరే రాష్ట్రాలనుంచీ వస్తున్న హీరోయిన్లు చాలా తొందరలోనే తెలుగు భాష అర్థం చేసుకుని మాట్లాడుతున్న వైనం అందరికీ తెలుసు. కానీ హిందీ ‘ఉమ్మడి భాష’గా వుండాలనీ, అది మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనీ మన నేతలు సుద్దులు చెప్పటం వింత గొలుపుతుంది. భాషాద్వేషంలాగే భాషాదురభిమానం కూడా ప్రమాదకరమేనని ఈ నేతలు గుర్తించటం లేదు. మనకు జాతీయ భాషంటూ ఏమీ లేదు. రాజ్యాంగంలోని 343 అధికరణ ప్రకారం కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలు అధికార భాష లుగా వుంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో భారీయెత్తున ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాతే 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్‌లో జరపాలని నిర్దేశిస్తూ 1967లో ఆ చట్టానికి సవరణ కూడా చేశారు. ఇంకా వెనక్కు వెళ్తే స్వాతంత్య్రోద్యమ కాలంలో సైతం హిందీ భాష పెత్తనంపై తిరగబడిన దాఖలాలున్నాయి. హిందీని ఉమ్మడి భాషగా గుర్తించాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించాలని పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వంలో కొందరు ఉత్తరాది నాయకులు జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ప్రయత్నించినప్పుడు నాటి ఆంధ్రప్రాంత ప్రముఖ నేత స్వర్గీయ ఎన్జీ రంగా గట్టిగా వ్యతిరేకించి అడ్డు కున్నారు. కేంద్రంలో పాలకపక్షంగా యూపీఏ వున్నా, ఎన్డీఏ వున్నా హిందీ వినియోగాన్ని పెంచ టానికి శ్రమిస్తుండటం తరచు కనబడుతూనే వుంటుంది. 2008లో అప్పటి యూపీఏ సర్కారు కేంద్ర ప్రభుత్వ నియామకాల కోసం జరిపే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంతవాసులే లబ్ధిపొందుతారనీ, దక్షిణాది వారికి అన్యాయం జరుగుతుందనీ ఆయన ఎలుగెత్తారు. తాను కాంగ్రెస్ నాయకుడే అయినా, యూపీఏకు తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా హిందీ భాషను రుద్దాలన్న ప్రయత్నాన్ని ఆయన సాగనివ్వలేదు. ఈ చరిత్రంతా తెలుసుకోకుండా నితీశ్ ఆగ్రహించటం కూటమికి గానీ, వ్యక్తిగతంగా ఆయనకు గానీ ప్రతిష్ఠ తీసుకురాదు. అసలు తాము ఇండియా కూటమిగా ఎందుకు ఏర్పడ్డారో, దేశంలో ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారో భాగస్వామ్య పక్షాల నేతలకు అవగాహన వుందా? ఉంటే నితీశ్ వంటి నాయకుడి నుంచి ఇలాంటి స్పందన రాదు. ఏ భాష అయినా పౌరులు ఎంతో ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవాలి. సినిమాలు, టీవీ చానెళ్ల వల్ల ఈరోజుల్లో హిందీతో సహా ఏ భాష నేర్చుకోవటమైనా ఎంతో సులభమవుతోంది. కూటమి ఏర్పడి అయిదు నెలలవుతోంది. తాజా సమావేశం నాలుగవది. సెప్టెంబర్ 14న ఢిల్లీలో సమావేశమైనప్పుడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం ప్రక్రియపై ‘త్వరలో’ చర్చించాలని తీర్మానించారు. అది కాస్తయినా ముందుకు కదల్లేదు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఖరారు చేద్దామన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన సమావేశంలో వీగిపోయింది. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై మండిపడగా, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ కిక్కురుమనలేదు. దేశానికి భారత్‌గా నామకరణం చేయాలన్న ఎన్డీఏ ప్రతిపాదనకు నితీశ్ వంత పాడటం కూడా చాలామందికి నచ్చలేదంటున్నారు. ఇలా ఏ అంశంలోనూ ఏకాభిప్రాయానికి రాలేక, చరిత్రపై అసలే అవగాహన లేక ఇండియా కూటమి సాధించేదేమిటి? -
భద్రం... బీ కేర్‌ఫుల్!
పారాహుషార్ గంట మరోసారి మోగింది. దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 21 తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో 614 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసు తొలిసారిగా కేరళలో బయటపడిన కొద్దిరోజుల్లోనే ఆ రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. ఒక్క బుధవారమే దేశవ్యాప్తంగా 341 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కావడం, అందులో 292 కేసులు కేరళ నుంచి వచ్చినవే కావడంతో తక్షణమే అప్రమత్తత అవసరమైంది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. భయాందోళనలకు గురి కానక్కర్లేదు కానీ, జాగ్రత్తలు మాత్రం తప్పవనేది ఇప్పుడు మన ఆరోగ్య మంత్రం. సరిగ్గా మూడేళ్ళ క్రితం మొదలైన కరోనా ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మానవాళిని వేధిస్తూనే ఉంది. చిన్నాచితకా అలల్ని పక్కనపెడితే, రెండు ప్రధాన కరోనావేవ్లు మన దేశంలో జన జీవితాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయో అందరికీ అనుభవైకవేద్యం. అప్పుడు నేర్చిన పాఠాలే ఇప్పుడు మార్గదర్శకాలు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక కరోనా వైరస్ వేరియంట్లు వచ్చాయి. ఆ వరుసలోదే భారత్‌లో తాజాగా కనిపించిన జెఎన్.1 వేరియంట్. బీఏ.2.86 కుటుంబానికి చెందిన ఈ వైరస్ ఉత్పరివర్తనం ఏడాది పైచిలుకుగా రూపుదిద్దుకొంటూ వచ్చిందట. ఇది ఇప్పటికే సుపరిచితమైన ఒమిక్రాన్‌లో బలవత్తరమైన వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఇది తన విజృంభణ చూపుతోంది. డిసెంబర్ 3 ముందు వారంలో 32 వేల మందికి కరోనా సోకితే, ఆ తరువాతి వారంలో 56 వేల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలోని కేరళలో ర్యాండమ్ శాంపిళ్ళకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తుండగా ఈ జెఎన్.1 వేరియంట్‌ను గుర్తించారు. మన దగ్గర ఈ వేరియంట్ తొలిసారిగా బయటపడి, కేసులు పెరుగుతుండగానే రాష్ట్రాలన్నిటికీ కేంద్రం తాజాగా మార్గదర్శకావళిని జారీ చేయడం గమనార్హం. పలు రాష్ట్రాలు అప్రమత్తమై ఇప్పటికే సమీక్షా సమావేశాలు జరిపి, మార్గదర్శ కాలను ప్రకటించాయి. కేరళలో పరిస్థితులు, కొత్త జెఎన్.1 వేరియంట్ కేసుల భయంతో కర్ణాటక సర్కార్ 60 ఏళ్ళ పైబడిన వారికి, అనారోగ్య సమస్యలున్నవారికి మాస్కు ధరించడం తప్పని సరి చేసింది. కేరళ సరిహద్దు జిల్లాలలను అప్రమత్తం చేసింది. ప్రజల రాకపోకలు, సమావేశాలపై నియంత్రణలు విధించ లేదన్న మాటే కానీ, కోవిడ్ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయించడం పెంచింది. వివిధ దేశాల్లో ఈ వేరియంట్ కనిపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ తాజా పరిస్థితులపై దృష్టి సారించింది. దీన్ని ఆసక్తికరమైన వేరియంట్‌గా పేర్కొంది. ఒమిక్రాన్ తరగతికి చెందినప్పటికీ ఈ వేరియంట్ మరీ ప్రాణాంతకమైనదేమీ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ టీకా వేసుకోని వారికి సైతం ఈ వేరియంట్ వల్ల ప్రాణహాని ఉండదనీ భరోసా ఇస్తున్నారు. అది కొంత ఊరటనిచ్చే అంశం. అలాగని అశ్రద్ధచూపలేం, అజాగ్రత్త వహించలేం. ఎవరెన్ని చెప్పినా ఆరోగ్యం, ప్రాణరక్షణకు సంబంధించిన విషయం గనక సహజంగానే ఈ వేరియంట్ పట్ల మన దేశంలో ఆరోగ్య నిపుణుల్లో, ప్రజల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తొందరపడి, కఠిన నియంత్రణలు పెట్టనక్కరలేదు కానీ, మాస్కు ధారణ, చేతుల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడమే ప్రజారోగ్యానికి శ్రీరామరక్ష. అసలే వ్యాధినిరోధక శక్తి తగ్గే చలికాలం. దానికి తోడు శబరిమల యాత్ర, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులతో ప్రయాణాల సీజన్. పైగా వచ్చేది సార్వత్రిక ఎన్నికల సీజన్. ర్యాలీలు, బహి రంగ సభల హంగామా. కరోనా వ్యాప్తికి కలిసొచ్చే ఇన్ని అంశాల మధ్య జాగ్రత్తలను విస్మరించడం ఎలాచూసినా రిస్కే. కట్టుదిట్టమైన ఆరోగ్యవ్యవస్థ, పరీక్షల వల్ల కేరళలో ఎప్పటికప్పుడు భారీగా కరోనా కేసులు బయటపడుతున్నాయి కానీ, అంతటి పరీక్షలు, నిఘా లేని చోట పరిస్థితులు చాప కింద నీరులా ఉండివుండవచ్చు. దురదృష్టమేమంటే, మన దేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాల్లో సైతం ఆ మధ్య కోవిడ్ కేసులు తగ్గాక, అధికారికంగా మహమ్మారి ముగిసినట్టు ప్రకటించారే తప్ప తర్వాతి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జీనోమిక్ ప్రాసెసింగ్ టెస్ట్‌లు సహా వివిధ రూపాల్లో నిఘాను విస్మరించారు. భారత్‌లో లేబరేటరీ నెట్వర్క్ ‘ఇన్సాకాగ్’ (ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియమ్) తగిన స్థాయిలో పనిచేయకపోవడమే అందుకు ఉదాహరణ. గత మూడేళ్ళలో దేశంలో 4.5 కోట్ల మంది కరోనా బారినపడ్డారనీ, 5.33 లక్షల మంది మరణించారనీ సర్కారు వారి తాజా లెక్క. ఈ అధికారిక లెక్కలకు అందని, సామాన్య బాధితుల సంఖ్య ఇంతకు అనేక రెట్లు ఎక్కువే. ఈ పరిస్థితుల్లో టెస్ట్‌లు ఎంత ఎక్కువగా చేస్తే, కరోనా విజృంభణను అంత త్వరగా పసిగట్టి, చర్యలు చేపట్టవచ్చు. అలాగే, కొత్త వేరియంట్లకు ఇప్పుడున్న టీకాలు ఏ మేరకు పనిచేస్తాయో పరీక్షించాలి. వివిధ దేశాలు ఇప్పటికే కొత్తవాటికి తగ్గట్టు టీకాలను మెరుగు చేస్తు న్నాయి. మన దేశానికీ వాటి అవసరం ఉందేమో శాస్త్రీయ సలహా స్వీకరించాలి. ముంచుకొచ్చే దాకా ఆగకుండా మూడు నెలలకోసారి ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్లు చేయడం మంచిది. అలసత్వం దూర మవుతుంది. అలాగే, కరోనాపై నిరంతర నిఘా సరేసరి. ప్రజానీకానికి సమాచారం చేరవేస్తూ, పొంచివున్న ముప్పుపై అవగాహన పెంచడం ముఖ్యం. ప్రజారోగ్యంపై అన్ని రాష్ట్రాలూ, ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. రాజకీయాలకు అతీతంగా, సమన్వయంతో ఏకోన్ముఖ వైఖరిని అవలంబించాలి. ప్రయాణాలు, జనసమ్మర్దం పెరిగే రానున్న వారాలు కీలకం గనక సన్నద్ధతే సగం మందు! -
ఇదేమి ప్రజాస్వామ్యస్ఫూర్తి?!
ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో చరిత్రలో మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగుతోంది. ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలనీ, చర్చ జరగాలనీ ప్రతిపక్షాలు పట్టు బట్టడం రచ్చగా మారింది. సభా వ్యవహారాలకు అడ్డుతగులుతున్నా రనీ, అభ్యంతరకరంగా ప్రవర్తి స్తున్నారనీ అంటూ ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం నిర్ఘాంత పరుస్తోంది. అధికార పార్టీ ఎంపీ సిఫార్సు పాసులతో సందర్శకులుగా వచ్చిన ఆగంతకుల రంగు పొగల హంగామాపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం చూస్తుంటే, గత సంప్రదాయాలకు విరుద్ధంగా సభలో కాక బయట వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ప్రధాని, హోమ్ మంత్రి జరిగిన సంఘటనపై స్పందిస్తూ ప్రతిపక్షాల డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమైంది. గత వారం 14 మంది, ఈ సోమవారం 78 మంది, తాజాగా మంగళవారం మరో 49 మంది... మొత్తం ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్లమెంట్లో సభా వ్యవహారాలకు అడ్డుపడిన సభ్యుల సస్పెన్షన్ కొత్తేమీ కాదు. ఇలా ఇంత సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగడం మాత్రం ఇదే తొలిసారి. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్నడో 1989 మార్చిలో థక్కర్ ప్యానెల్ నివేదికపై రచ్చతో ఒకే రోజున లోక్‌సభలో 63 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్టు చరిత్ర. ఇప్పుడు ఆ పాత రికార్డును చెరిపేస్తూ, దురదృష్టకరమైన కొత్త చరిత్ర లిఖితమైంది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి సభ్యులను సస్పెండ్ చేసే అధికారమున్న మాట నిజమే. కానీ, ఆ స్థానంలో కూర్చొనే వ్యక్తి ప్రథమ కర్తవ్యం – అధికార, ప్రతిపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ సభను సజావుగా నడపడమే తప్ప, సభ్యులపై పెత్తనం చూపడం కానే కాదు. ఆ సంగతి మర్చి పోయి సభలో వారందరికీ పెద్దన్నయ్యలా ప్రవర్తిస్తామంటేనే కష్టం. ప్రస్తుతం జరుగుతున్నదదే! నిరుద్యోగం సహా వివిధ సమస్యలపై దృష్టి పడేటందుకే పార్లమెంట్లో గతవారం అలా అలజడి రేపామని పట్టుబడ్డ ఆగంతకుల కథనం. ఆ ఆందోళనకారుల ఆలోచనలు ఏమైనప్పటికీ, వారు పొగ గొట్టాలతో పార్లమెంటులోకొచ్చే వీలు కల్పించి, సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన భద్రతా లోపంపై తక్షణం చర్చ జరగాల్సి ఉంది. అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. విపక్షాల వాదనా అదే. ఆ వాదనలో న్యాయం ఉంది. ఘటనపై సభలో రక్షణ మంత్రి లాంటి వారు కాక శాంతి భద్ర తలు చూసే హోమ్ మంత్రి, సభానాయకుడు ప్రకటన చేయడం, సభ్యుల అనుమానాలను నివృత్తి చేయడం విధాయకం కూడా! కానీ అలా జరగట్లేదు. అక్కడే పీటముడి బిగిసింది. అనైతికత అంటూ ప్రతిపక్ష ఎంపీ మహువా మొయిత్రాపై చర్యలకు వేగిరపడ్డ పాలకులు, ఆగంతకులకు పాసులిచ్చిన స్వపక్షీయుడిపై చర్యకు ముందుకు రాకపోవడం ద్వంద్వ ప్రమాణాలంటూ విమర్శలకు తావిచ్చింది. అయితే, సభను సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్షాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అధికార పక్ష ఆరోపణ. అది పూర్తి సత్యదూరమనలేం. కానీ, దాన్ని సాకుగా చూపుతూ సభలో సాధారణ ప్రకటన చేయడానికి కూడా అమాత్యులకూ, ప్రభుత్వానికీ అభ్యంతరం ఉంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సభావ్యవహారాలను అడ్డుకోవడం సైతం సభ్యుల హక్కులలో భాగమేనని బీజేపీ ఎంపీ స్వర్గీయ అరుణ్ జైట్లీయే ఒకప్పుడు వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ, అధికార పీఠంపై కూర్చున్నాక బీజేపీ ఆ పాత వైఖరిని నమ్ముతున్నట్టు లేదు. చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతతో సాగాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాలకుల ఏకపాత్రాభినయంగా మార్చాలని చూస్తున్నట్టుంది. ఎన్నికల సంఖ్యాబలపు నియంతృత్వంతో అధికారాన్ని హక్కుభుక్తంగా భావిస్తే అది గర్హనీయం. ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే హక్కును కాదంటే, వాటి మాట వినాల్సిన పనే లేదనుకుంటే ఇక సభా సమావేశాలకు అర్థం ఏముంది! నేటి ప్రధాని గతంలో గుజరాత్‌ను ఏలినప్పుడూ, నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్దాక్షిణ్య సస్పె న్షన్ల పర్వం ఇలాగే సాగిందని పండితులు లెక్కలు తీస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించే ఈ ధోరణి ఇప్పుడు పార్లమెంటుకు పాకడం విచారకరం. 2009–14 మధ్య దాదాపు 36 సస్పెన్షన్లు జరిగితే, ఎన్డీఏ ఏలుబడి వచ్చాక 2014–19లో అది 81కి ఎగబాకింది. ఇక, కేంద్రంలో వర్తమాన ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్లు 149కి చేరాయి. ఇక, తాజా సస్పెన్షన్ల వల్ల ప్రస్తుత శీతకాల సమా వేశాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో మూడింట రెండొంతుల పైగా సభ్యులు సభ వెలుపలికే పరిమితమైన పరిస్థితి. కొన్నేళ్ళుగా అనేక కీలక బిల్లులు చర్చే లేకుండా, అవసరమైన సవరణల్ని పట్టించుకోకుండా సంఖ్యాబలంతో చట్టాలవుతున్న తీరు పార్లమెంటరీ విధానాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఇక, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ వెలుపల మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఓ ప్రతిపక్ష ఎంపీ ప్రవర్తించిన తీరు బాగా లేదు. రాజ్యసభ ఛైర్మన్‌ను అనుకరిస్తూ ఆ సభ్యుడు చేసిన ప్రహసనం సమర్థనీయం కాదు. ఇది ‘డెమోక్రసీ’ కాదు, ‘నమోక్రసీ’ అంటున్న ప్రతిపక్షాల పోరుకు శోభనిచ్చేదీ కాదు. వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, పక్షపాత ధోరణులు ఎన్ని ఉన్నా... రాజ్యాంగ రీత్యా రాజ్యసభ ఛైర్మనైన భారత ఉపరాష్ట్రపతి హోదాకంటూ ఓ గౌరవం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంది. అది మరిచి అగౌరవంగా ప్రవర్తిస్తే ప్రతిపక్షాలకే నష్టం. పోరాటాన్ని అది పలుచన చేస్తుంది. అసలు సంగతి పక్కదోవ పడుతుంది. ఏమైనా, చర్చలంటే టీవీలో ప్రసంగాల స్థాయికి దించేస్తూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేసే సభలతో ప్రయోజనం శూన్యం. ప్రతిపక్షాలే లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు? -
ఈ జనహననం ఇంకెన్నాళ్లు?
ఇంటి దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జనహననాన్ని సమర్థిస్తున్న అమెరికాకూ, దాని పాశ్చాత్య మిత్రులకూ ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్టుంది. కాల్పుల విరమణకు సిద్ధపడి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి తోడ్పడాలని, పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని ఆ దేశాలు తాజాగా ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడి హమాస్ విచక్షణారహితంగా 1,200 మందిని కాల్చిచంపి 240 మందిని అపహరించుకుపోయినప్పుడు ఆ దేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలను ముక్తకంఠంతో సమర్థించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హుటాహుటీన ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు అండదండలందిస్తామని హామీ ఇచ్చారు. హమాస్‌పై యుద్ధం పేరుతో గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పౌరుల ప్రాణాలు తీస్తున్నప్పుడూ... జనా వాసాలను బాంబులతో నేలమట్టం చేస్తున్నప్పుడూ అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలునోరు మెదపలేదు. ఉత్తర గాజాపై బాంబుల మోత మోగించబోతున్నామని, దాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకుం జారీచేసినప్పుడు 20 లక్షలమంది పౌరులు ప్రాణభయంతో అప్పటికే కిక్కిరిసి వున్న దక్షిణ ప్రాంతానికి వలసపోయారు. సహాయ శిబిరాలన్నీ కిక్కిరిసిపోగా ఎండకు ఎండి వానకు తడిసి అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. అంత దారుణ పరిస్థితుల్లోనూ పాశ్చాత్య ప్రపంచం మౌనాన్నే ఆశ్రయించింది. పైగా ఈ దశలో పోరు విరమిస్తే అది హమాస్‌ను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా వ్యాఖ్యానించింది. రెండు నెలలు గడిచి, 20,000 మందికి పైగా పౌరులు హతమయ్యాక ఇప్పుడు ఆ దేశం నోట ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదన వినిపిస్తోంది. కారణమేమిటో తెలుస్తూనే వుంది. హమాస్ స్థావరాలను గుర్తించి కేవలం వాటిపైన మాత్రమే దాడులు చేయాలన్న సలహానూ, సాధ్యమైనంత త్వరగా పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించాలన్న సూచననూ నెతన్యాహూ బుట్టదాఖలా చేశారు. దాంతోపాటు శనివారం హమాస్ చెరనుంచి తప్పించుకునో, వాళ్ల అనుమతితోనో బయటకు వచ్చిన ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులను సైన్యం వెనకా ముందూ చూడకుండా కాల్చిచంపిన ఉదంతం ఈ దాడుల ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం సైతం అది ఘోరతప్పిదమని అంగీకరించింది. ఆ తర్వాతే యుద్ధం ‘గతి తప్పిందని’ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నిర్ధారణకొచ్చారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఆయనతో స్వరం కలిపాయి. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధంవల్ల అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ ఏడాదిన్నరగా అంతర్జాతీయ వేదికలపైనా, బయటా ఆరోపిస్తు న్నాయి. కానీ గాజా విషయంలో మాత్రం వేరే ప్రమాణాలు పాటించాయి. కాల్పుల విరమణ ప్రక టించాలని ఇజ్రాయెల్‌ను కోరే తీర్మానాన్ని భద్రతామండలిలో అమెరికా మూడుసార్లు వీటోచేసింది. బైడెన్ తన ‘అత్యవసర అధికారాలను’ వినియోగించి ఆ దేశానికి ఆయుధాలు కూడా సర ఫరా చేశారు. చేసేవన్నీ చేశాక ఇప్పుడు సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలగకూడదని, కేవలం హమాస్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలని సుద్దులు చెప్పటంలోని ఆంతర్యమేమిటి? ఇజ్రాయెల్ చర్యల పర్యవసానంగా చోటుచేసుకుంటున్న ఉత్పాతాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రి కల్లో వస్తున్న కథనాలు దిగ్భ్రాంతికరంగా వుంటున్నాయి. నసర్ అల్ అస్తాద్ అనే వ్యక్తి మినహా ఆ కుటుంబం, వారి బంధువర్గం మొత్తం 100 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని, మొత్తం ఆ వంశమే తుడిచిపెట్టుకుపోయిందని ఆ కథనం సారాంశం. ఈ రెండున్నర నెలల్లో ఐక్యరాజ్యసమితి సహాయ బృందాలకు సంబంధించిన కార్యకర్తలు 135 మంది దాడుల్లో చనిపోయారు. సమితి 78 యేళ్ల చరిత్రలో ఏ ఘర్షణలోనూ ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లేవు. ఈనెల 10న జరిగిన వైమానిక దాడిలో తమ కార్యకర్త, అతని భార్య, నలుగురు పిల్లలు, అతని బంధువర్గంలోని అనేకులు మరణించారని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయిదేళ్ల క్రితం సూడాన్, అల్జీరియా, యూఏఈ తదితర దేశాల్లోని వివిధ నిర్మాణ సంస్థల్లో హమాస్ 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందనటానికి స్పష్టమైన ఆధారాలు లభించినా నెతన్యాహూ ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది. ఆయుధాల కొనుగోలుకూ, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ డబ్బంతా వినియోగిస్తుంటే కళ్లుమూసుకున్న ప్రభుత్వం హమాస్ అక్టోబర్ దాడి తర్వాత హమాస్‌తో ఏమాత్రం సంబంధంలేని ప్రజానీకంపై విరుచుకుపడుతున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. నెతన్యాహూ ధోరణికి ఆయన కేబినెట్లో వున్న తీవ్ర మితవాద పక్ష నేతలే కారణమని అమెరికా చేస్తున్న వాదన పాక్షిక సత్యమే. న్యాయస్థానాలు తన జోలికి రాకుండా అడ్డుకోవటానికి చట్టం తీసు కొచ్చి ఇజ్రాయెల్ పౌర సమాజం అసంతృప్తిని మూటగట్టుకున్న నెతన్యాహూ, హమాస్ దాడి తర్వాత మరింత అప్రదిష్టపాలయ్యారు. ఈ దాడులు ఆగాక నెతన్యాహూ నిర్వాకంపై ఎటూ ఆరా వుంటుంది, ఆయన రాజీనామా కోసం జనం ఉద్యమిస్తారు. కాస్త ముందో, వెనకో పార్లమెంటు ఎన్నికలు కూడా తప్పకపోవచ్చు. ఇది తెలిసే నెతన్యాహూ దాడుల విరమణకు ససేమిరా అంటు న్నారు. పాలస్తీనా ఏర్పాటుకు నిరాకరిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు హమాస్ చేసిన నష్టం కంటే తానే గాజాకు ఎక్కువ నష్టం చేశానని చెప్పటమే ఆయన ఉద్దేశం. ఈ జనహననాన్ని సాగనీయొద్దు. మొదట్లో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన పాశ్చాత్య ప్రపంచమే ఈ బాధ్యత తీసుకుని పాపప్రక్షాళన చేసుకోవాలి. లేనట్టయితే మానవాళి క్షమించదు. -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
రెడీ ఫర్ లాంగ్ ఇన్నింగ్స్!
ఆ రైతు పేరు అప్పలనాయుడు. విజయనగరం జిల్లా జామి మండల వాస్తవ్యులు. వ్యవసాయ రంగంపై వైఎస్ జగన్ వేసిన బలమైన ముద్ర గురించి చెబుతూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అది ‘రైతు భరోసా’ పేరుతో అందజేస్తున్న నగదు సాయం గురించి కాదు. అందుబాటులోకి వచ్చిన 9 గంటల నాణ్యమైన విద్యుత్తు గురించీ కాదు. ఈ–క్రాప్ ప్రయోజనాల గురించి కాదు. ఆర్బీకే సెంటర్లు అందజేస్తున్న నైపుణ్యాభివృద్ధి, యంత్ర సేవ గురించి కూడా కాదు. ధాన్యం పండించే తనలాంటి రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం వల్ల ఎకరాకు పదినుంచి పన్నెండు వేల రూపాయల పరోక్ష లబ్ధి చేకూరుతున్నదని అప్పలనాయుడు చెప్పుకొచ్చారు. ఇదేమీ రహస్యం కాదు. రైతులందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ మన అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులే దీన్ని గుర్తించినట్టు లేదు. గుర్తించినా ఎక్కడా మాట్లాడినట్టు లేదు. అప్పలనాయుడు చెప్పిన ఆ లెక్కను ఒకసారి చూద్దాం. విత్తనాల కోసం ఒకసారి, ఎరువుల కోసం మరొకసారి కనీసం రెండుసార్లు రైతులు మండల కేంద్రానికి వెళ్లవలసి వచ్చేది. రానూపోనూ ప్రయాణ ఖర్చులూ, భోజనం ఖర్చుతో పాటు ఒకరోజు వేతనాన్ని ఆ రైతు కోల్పోవలసి వచ్చేది. దానికితోడు ఎరువుల బస్తాలు తెచ్చుకునేందుకు ఆటో ఖర్చులు అదనం. ఎకరాకు సరిపోయే విత్తనాలకు ఆర్బీకేలో ఇప్పుడు 300 రూపాయలు ప్రభుత్వ రాయితీ లభిస్తున్నది. అప్పుడీ భారం రైతు మీదనే పడేది. ఎరువుల కొరతను అవకాశంగా తీసుకొని... అవసరం లేని పురుగు మందుల డబ్బా తీసుకుంటేనే ఎరువుల బస్తా ఇస్తామని వ్యాపారులు పేచీ పెట్టేవారు. ఇప్పుడా వృథా ఖర్చు పూర్తిగా పోయింది. ధాన్యం దిగుబడి సగటున ఎకరాకు 30 నుంచి 33 బస్తాలు (75 కిలోల బస్తా) వస్తుంది. ఆ రోజుల్లో దళారులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి క్వింటాల్‌కు అదనంగా కనీసం 5 కిలోలు తూకం వేసుకునేవారు. ఇప్పుడు క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ.2100. తప్పుడు తూకంతో ఎకరాకు ఒకటిన్నర క్వింటాళ్ల కిమ్మత్తు పైకాన్ని రైతు కోల్పోయేవాడు. ఆ రోజుల్లో మద్దతు ధర మీద క్వింటాల్‌కు 150 నుంచి 200 రూపాయల వరకు దళారులు మినహాయించుకొని రైతులకివ్వడం సర్వ సాధారణం. ఇవన్నీ లెక్కేసి చూస్తే అధమపక్షం రైతుకు జరుగు తున్న లబ్ధి ఎకరాకు పన్నెండు వేల పైమాటేనని అప్పల నాయుడు లెక్క. ఊరూరా వెలసిన ఆర్బీకే సెంటర్ల పుణ్యమా అని రైతుకు దొరికిన గొప్ప ఊరట ఇది. వ్యవసాయ రంగంలో ఇటువంటి మార్పులు ఇంకెన్నో ఉన్నాయి. ఇనుమడించిన రైతు ఆత్మవిశ్వాసానికి గుర్తుగా ఈ ఒక్క గొంతుక చాలు. ఈ ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడిపోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వపు విప్లవశంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్రలతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దాసుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య యాభై శాతం నుంచి వందశాతం వరకు పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్య సేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానం ఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలనందుకుంటు న్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది. నాడు శిథిలావస్థకు చేరిన సర్కారు బడులు మళ్లీ వసంతాన్ని చిగురిస్తున్నాయి. కొత్త తరానికి అత్యవసరమైన డిజిటల్ సాంకేతికతను పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పెత్తందారీ శక్తులు పేదల విద్యపై కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నా జగన్ ప్రభుత్వం విద్యా విప్లవంలో వెనక్కి తిరిగి చూడటం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఈ మూడు రంగాలకే పరిమితం కాలేదు. సమస్త జీవన రంగాల్లోనూ ఊర్ధ్వ ముఖ చలనం మనకు కనిపిస్తుంది. అందుకు కారణం ప్రభుత్వ కర్తవ్యాలపై అధినేతకు ఉన్న స్పష్టమైన అవగాహన. ఒక నిర్దిష్ట మైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన కచ్చిత మైన ప్రణాళికను రూపొందించుకోవడంలో జగన్ ప్రభుత్వం దేశంలో అందరికంటే ముందువరసలో నిలబడింది. రాజ్యాంగ మౌలిక సూత్రమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం కోసం ఇంత వేగంగా పనిచేసిన ప్రభుత్వం కూడా ఇంకొకటి లేదు. అందువల్ల సహజంగానే పెత్తందారీ శక్తుల కంటగింపునకు కూడా ఈ ప్రభుత్వం గురవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందారీ శక్తుల రాజకీయ నాయకత్వం మరింత ప్రమాదకరమైన మాఫియా ముఠా. క్షీరసాగర మథ నంలో అమృతంతోపాటు గరళం కూడా పుట్టిందట. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడు అభివృద్ధితోపాటు దాని కవలగా పుట్టిన అవినీతి పాలిటి వారసత్వం ఈ ముఠా. పేద ప్రజల సాధికారతకు పెద్ద శత్రువు ఈ యెల్లో ముఠా.అందువల్లనే అది జగన్ ప్రభుత్వంపై కత్తి కట్టింది. అధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. అందుకు ప్రతిగా ప్రభుత్వం వెనుక పేదవర్గాలు సమీకృతమవుతున్నాయి. కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రం పెత్తందార్లు – పేదవర్గాలు అనే రాజకీయ వైరి శిబిరాలుగా చీలిపోయింది. ఈ రెండు శిబిరాలూ ఇప్పుడు ఎదురెదురు మోహరించి నిలబడ్డాయి. సమాజంలో పేదలు – పెత్తందార్లు అనే చీలిక వచ్చి నప్పుడు మెజారిటీ ప్రజలైన పేదవర్గాలే ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తారని చెప్పడానికి ఏ సర్వేనూ ఆశ్రయించ వలసిన పని లేదు. కామన్సెన్స్ చాలు. గతంలో అంతో ఇంతో విశ్వసనీయతను నిరూపించుకున్న కొన్ని సర్వే సంస్థలు కూడా మరోసారి వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నదని ఇప్పటికే ప్రకటించాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరి లోకీ సీట్ల సంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్ఎస్కు 41, బీజేపీకి 7, ఎమ్ఐఎమ్కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది. టైమ్స్ నౌ – ఈటీజీ గ్రూప్ తాజా సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచుకోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది. ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలి చిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవకాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలి టికల్ క్రిటిక్ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటే వైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్ని కల ఫలితాలు పునరావృతమవుతాయని అర్థం. ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది. ఆంధ్రప్రదే శ్లో రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనా వేయ డానికి మూడు పద్ధతులున్నాయి. వివిధ వర్గాలకు చెందిన తటస్థ ఓటర్ల మనోభిప్రాయాలను తెలుసుకోవడం మొదటి పద్ధతి. గతంలో క్రెడిబిలిటీని నిలబెట్టుకున్న జాతీయ సంస్థల సర్వేలను గమనించడం రెండో పద్ధతి. ఇది కొంతమేరకు ట్రెండ్‌ను సూచిస్తుంది. ఇక ఏపీకి మాత్రమే పరిమితమైన మూడో పద్ధతి. యెల్లో మీడియాను గమనించడం. సునామీ, భూకంపాలు వచ్చే ముందు కొన్ని రకాల జంతువులు, పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. తమకు ఇష్టంలేని ప్రభుత్వం రాబో తున్నదని నిర్ధారణ కాగానే యెల్లో మీడియా ప్రవర్తన కూడా జుగుప్సాకరంగా మారిపోతుంది. ఇదొక లిట్మస్ టెస్ట్. ఇప్పుడు యెల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరును బట్టి కూడా వైసీపీ భారీ విజయాన్ని అంచనా వేసుకోవచ్చు. పేద పిల్లలకు మంచి చదువులు వద్దట. ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తే చెడి పోతారట, సంపన్నుల పిల్లలకిస్తే ఫరవాలేదు. వారు చెడిపోరు. వారు పుట్టుకతోనే సద్బుద్ధి కలిగి ఉంటారు. వారు సజ్జనులు. దుర్జనులైన అలగా జనానికి ట్యాబ్‌లు ఇస్తే తక్షణం చెడిపోతారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వాళ్లను చెడగొడుతున్నదట. పైగా ఈ ప్రభుత్వం పన్నులు వేస్తున్నదట. ఆ అధికారం ఒక్క చంద్ర బాబుకే ఉండాలట! ఈ రకమైన యెల్లో మీడియా విపరీత ప్రవర్తనను తెలుగు పాఠక జనం ఇంకో వంద రోజులు భరించ వలసి ఉంటుంది. మరోపక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి కూల్‌గా తన సామాజిక న్యాయ సిద్ధాంతానికి మరింత పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల మార్పు చేర్పులు చేసిన 11 సీట్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇందులోనే బీసీలకు మరో రెండు సీట్లు పెంచారు. గెలుపు మీద పూర్తిస్థాయి విశ్వాసం ఉన్నవారే ఇటువంటి ప్రయోగాలకు సిద్ధమవుతారు. రెండోసారి గెలుపు కోసం మాత్రమే కాదు, సుదీర్ఘ ఇన్నింగ్స్‌కే జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్న దనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం ఒక్క రైతాంగంలోనే కాదు. వెనుకబడి పోయిన అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. వెన్నెముకలు నిటారుగా నిలబడుతున్నవి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో జగన్ ప్రభుత్వపు విప్లవ శంఖారావం పేద వర్గాలను ఉత్తేజితం చేస్తున్నది. సాధికార రథయాత్ర లతో వారిప్పుడు జాగృతమవుతున్నారు. పైసా ఖర్చు లేకుండా పాతిక లక్షల విలువైన వైద్య సేవలను పెద్దా సుపత్రుల్లో పొందగలిగే అవకాశం ఇప్పుడు రాష్ట్రంలోని 90 శాతం ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్నది. ఇంత పెద్ద ఉచిత పథకం ఇంకెక్కడా లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు తయారయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ బృందాలు పల్లెపల్లెనా పర్యటిస్తున్నాయి. అన్ని స్థాయి ల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్ పేషంట్ల సంఖ్య యాభై నుంచి వందశాతం పెరిగింది. ఈ పెరుగుదల అక్కడ లభిస్తున్న వైద్యసేవల నాణ్యతా ప్రమాణాలకు సూచిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విద్యా విధానంఇప్పటికే జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో ప్రశంస లనందుకుంటున్నది. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు ఐక్యరాజ్య సమితి వేదికపై నిలబడి తమ గళాన్ని వినిపించడం సంచలనాన్ని సృష్టించింది. పెద్దపెద్ద నగరాల్లో సంపన్నుల సంతానానికి మాత్రమే లభించే నాణ్యమైన చదువును సర్కారు బడుల్లో పేద పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా సమకూర్చింది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా సంస్థలు చెప్పాయి. అందరిలోకీ సీట్లసంఖ్యను వాస్తవానికి అతి దగ్గరగా టైమ్స్‌నౌ – ఈటీజీ గ్రూప్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 65, బీఆర్ఎస్కు 41, బీజేపీకి 7, ఎమ్ఐఎమ్కు 6 సీట్లు వస్తాయని ఈ గ్రూప్ అంచనా వేసింది. 96 శాతం కచ్చితత్వాన్ని నిరూపించుకున్నది. టైమ్స్ నౌ – ఈటీజీ గ్రూప్ తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను వైసీపీ 24 నుంచి 25 సీట్లను గెలుచు కోబోతున్నది. టీడీపీకి సున్నా నుంచి ఒక్క సీటు వరకు లభించే అవకాశం ఉన్నది. అంటే టీడీపీ మహా అయితే ఒక్క సీటు గెలుచుకుంటుంది. ఈ సీట్లను అసెంబ్లీ స్థానాల లెక్కలోకి అనువదిస్తే ఫలితం సుస్పష్టం. గతంలో గెలిచిన 151 కంటే పైమాటే తప్ప తగ్గే అవ కాశం ఉండదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన సంస్థల్లో పొలిటికల్ క్రిటిక్ ఒకటి. ఆ సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సర్వే చేసి గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్ల శాతాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటుందని నిర్ధారించింది. టీడీపీ కంటేవైసీపీ 11 శాతం ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందని చెప్పింది. 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతా యని అర్థం. ఈ పరిస్థితి యెల్లో ముఠాకు అర్థమైనందు వల్లనే అది నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నది. - వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు. -
జాతికి జవాబు కావాలి!
దేశం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన అది. ప్రధాని సహా పార్లమెంటరీ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యే ప్రాంగణంలోని పెను భద్రతా వైఫల్యాలను బుధవారం టీవీల సాక్షిగా కళ్ళకు కట్టిన ఉదంతమది. 2001 నాటి చేదు జ్ఞాపకాలను ఈ దురంతం మళ్ళీ గుర్తుచేసింది. అప్పట్లో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మన పార్లమెంట్‌పై తుపాకులతో దాడికి తెగబడితే, ఈసారి సందర్శకులుగా వచ్చిన ఇద్దరు భారతీయ సాధారణ యువకులు పదుల అడుగుల ఎత్తులోని లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ పై నుంచి సభాంగణంలోకి దూకి, రహస్యంగా తెచ్చిన పొగగొట్టాలతో అలజడి రేపారు. సభ వెలుపల రంగుల పొగతో మరో ఇద్దరు నిరసన పూర్వక నినాదాలు చేశారు. నలుగురినీ అరెస్ట్ చేసి, కఠినమైన ‘ఉపా’ చట్టం కింద కేసు పెట్టి పోలీస్ కస్టడీకి పంపారు. సూత్రధారుల కోసం గాలింపు సాగుతోంది. ప్రస్తుతానికి 8 మంది భద్రతా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు కానీ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇదేదో అప్పటికప్పుడు ఈ యువతీ యువకులు సృష్టించిన హంగామా కాదు. ఇరవై రెండేళ్ళ క్రితం పార్లమెంట్‌పై పాక్ తీవ్రవాదులు దాడి జరిపిన డిసెంబర్ 13నే... తమ దుశ్చర్యకు వారు ఎంచుకున్నారంటే ఎంత ఆలోచన, ప్రణాళిక ఉండివుంటుంది! ఒక్కపక్క అమెరికా గడ్డ మీద నుంచి హూంకరిస్తున్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఈ నెలాఖరులోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామని చాలా రోజుల క్రితమే హెచ్చరించారు. మరోపక్క పార్లమెంట్‌పై మునుపటి దాడిలో పలువురు బలైన ఘటనకు 22వ వార్షిక సంస్మరణ దినం. ఈ నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ వద్ద ఎంత పారాహుషార్‌గా ఉండాలి! అంచెలంచెల తనిఖీని దాటుకొని, ఆ నలుగురూ కాలిజోళ్ళలో పొగగొట్టాలు పెట్టుకొని, లోపలికి వచ్చారంటే మన తనిఖీ, నిఘా వ్యవస్థలు నిద్రిస్తున్నట్టేగా! ప్రాథమిక సమాచారం మేరకు... పార్లమెంట్లో అలజడి రేపిన నలుగురిలో ఎవరూ తీవ్ర వాదులు కారు. మధ్య, దిగువ తరగతి నిరుద్యోగులు. భగత్ సింగ్ అభిమానులంటున్న వీరంతా దేశంలోని వేర్వేరు భౌగోళిక ప్రాంతాల నుంచి ఫేస్బుక్ పేజీ ద్వారా ఎలా ఒక్కటయ్యారు, ఎలా ఈ నిరసన దుశ్చర్యకు దిగారన్నది ఇంకా లోతుగా ఆరా తీయాలి. ఆరు డిగ్రీలు చేసి, లెక్చరర్ ఉద్యోగా నికి ‘నెట్’ సైతం పాసైన నిరుద్యోగ హర్యానా యువతి నీలమ్. కంప్యూటర్ ఇంజనీరైన నిరుద్యోగ మైసూరీ మధ్యవయస్కుడు మనోరంజన్. ఆర్మీలో చేరాలని ఆరాటపడి విఫలమైన కుర్రాడు అమోల్. లక్నోకు చెందిన ఇ–రిక్షా కార్మికుడు సాగర్ శర్మ. ఇలాంటి సామాన్యులు ఏ నిస్పృహలో, ఎవరి ప్రేరేపణతో చెడుదోవ పట్టి ఇంతటి దుస్సాహసానికి దిగినట్టు? వీరిని ఆడించిన అసలు నాయకుడు ఎవరు? ఇంటి దొంగలా, లేక దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తున్న విదేశీ శక్తులా? ఏడాదిగా ఈ పథకరచన సాగుతోందట. ఈ మార్చి, జూలైల్లోనూ పార్లమెంట్లో భద్రతపై రెక్కీ నిర్వహించారట. ఇది దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్య దేవాలయంలో జరిగిన దుస్సాహసంపై ప్రజా ప్రతినిధులంతా ఏకమై పిడికిలి బిగించాల్సిన వేళ దురదృష్టవశాత్తూ రాజకీయాలు రేగుతున్నాయి. అధికారపార్టీ ఎంపీ నుంచి ఈ నిరసనకారులకు పాసులు జారీ కావడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడు తున్నాయి. పార్లమెంట్ సహా ఢిల్లీ భద్రత మొత్తం చేతిలో ఉండే హోమ్ మంత్రి ఈ మొత్తం ఘటనపై సభలో ప్రకటన చేయాలని కోరుతున్నాయి. జవాబివ్వాల్సిన అధికార పక్షం మొండికేయడం, రచ్చ పెరగడంతో ప్రతిపక్షానికి చెందిన 14 మందిని లోక్‌సభ నుంచి, ఒకరిని రాజ్యసభ నుంచి శీతకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం దీనికి పరాకాష్ఠ. సభలోనే కాదు ఢిల్లీలోనే లేని ఓ ప్రతిపక్ష ఎంపీ పేరు సైతం సస్పెండైన వారి పేర్లలో పేర్కొనడం విడ్డూరం. ఆ వాస్తవం రచ్చకెక్కేసరికి ‘అది క్లరికల్ మిస్టేక్’ అని సింపుల్‌గా తేల్చేస్తూ, 13మందే సస్పెండయ్యారని గురువారం పొద్దుపోయాక వివరణ నిచ్చుకోవాల్సి వచ్చింది. భద్రత విషయంలోనే కాదు... చివరకు సభా నిర్వహణలోనూ సర్కారీ నిర్లక్ష్యాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. నిరసన తెలిపే ప్రతిపక్షాలను పరోక్షంగా వెక్కిరిస్తూ, వచ్చి అరెస్టయినవారు ‘ఆందోళన్ జీవు’లంటూ అధి కారపక్షం తేలిగ్గా ముద్ర వేస్తోంది. ఒకవేళ వచ్చింది ‘ఆతంకవాదులై’ ఉంటేనో? వారు పొగగొట్టాలు కాక గ్రెనేడ్లు, ఐఈడీలు తేగలిగితేనో? ఏమై ఉండేది? భీతిగొలిపే ఆలోచన అది. అందుకే సర్వోన్నత పార్లమెంట్‌లోనే సభ్యుల రక్షణను వెక్కిరిస్తున్న ఘటనను ఆరోపణలపర్వంగా మారిస్తే లాభం లేదు. తీవ్రమైన ఈ భద్రతా వైఫల్యంపై జాతీయ భద్రతా ఏజెన్సీ సహా అత్యున్నత వ్యవస్థలతో దర్యాప్తు జరిపించాలి. సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తోనూ పరిస్థితిని మదుపు చేయిస్తే, భద్రతా ఏర్పాట్లను పునస్సమీక్షిస్తే సభ్యులకు భరోసా కలుగుతుంది. దుర్భేద్యమని పదేపదే చెప్పిన కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇంతటి ఘటన జరిగినందున అందరూ ఒకే గేటు నుంచి రాకపోకలు సాగించడం లాంటి పద్ధతులు మార్చాలి. మెటల్ డిటెక్టర్లతో ప్లాస్టిక్‌ను గుర్తించలేనందున తనిఖీ విధానాల్ని ఆధునికీకరించి, పటిష్ఠపరచాలి. పార్లమెంటరీ సెక్యూరిటీలో నేటికీ వందకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయట. అదీ పట్టించుకోక కళ్ళు తెరిచి నిద్రపోతే నష్టం దేశానికి! అలాగే, ప్రభుత్వ గుర్తింపున్న పాత్రికేయుల్ని సైతం పార్లమెంట్‌లోకి రానివ్వని పాలకులు మహిళా రిజర్వేషన్ లాంటి కీలక బిల్లుల వేళ బస్సుల్లో జనాన్ని తరలించుకొచ్చి, గ్యాలరీ నుంచి నినాదాలిప్పిస్తున్న సంస్కృతిని విడ నాడాలి. పార్లమెంట్ ప్రాంగణం ప్రజాపాలనకై తప్ప, ప్రచార ఆర్భాటానికి కాదని గుర్తించాలి. మణి పూర్ మొదలు జాతీయ భద్రత దాకా ప్రతిదానిపైనా ప్రభుత్వ జవాబు కోసం, జవాబుదారీతనం కోసం ఇంతగా పట్టుబట్టాల్సి రావడం మాత్రం ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదని గ్రహించాలి. -
మార్పులే మంత్రం!
రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు కానీ, కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురిగొల్పుతాయి. ఇటీ వలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాలా అలాంటిదే. మూడు చోట్లా సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది. కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియ కున్నా... రకరకాల స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొన్నాకనే మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్ సహాయ్, రాజస్థాన్‌లో భజన్‌లాల్ శర్మలను అధిష్ఠానం ఎంపిక చేసినట్టుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం లోతుపాతుల పట్ల అంచనాలు, విశ్లేషణలను పెంచుతోంది. ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యా బలంతో అధికార పీఠంపై కూర్చొనే రాజకీయ పార్టీకీ, ఎన్నికైన ఆ పార్టీ చట్టసభ సభ్యులకూ తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అయితే, శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చిన, నిలబెట్టిన సీనియర్ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం, రాజస్థాన్ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం, మంత్రులుగా ఎన్నడూ పనిచేయనివారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే. కానీ నిత్యం ఎన్నికల పోరులో ఉన్నట్టే ఏడాది పొడుగూతా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి. విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహమూ ఈ ఎంపికలో కనిపి స్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ, సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకొంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది. కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వ వాదులే. ఆరెస్సెస్‌కు సన్నిహితులే. అధినేతలకు విధేయులే. మాజీ కేంద్ర మంత్రి, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడైన విష్ణుదేవ్‌ను అక్కడి సీఎం పీఠంపై కూర్చోబెట్టడం వెనుక దేశంలోని 9 శాతం ఆదివాసీలను అక్కున చేర్చుకొనే వ్యూహం ఉంది. ఇప్పటికే ద్రౌపదీ ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకోవాలనేది ఎత్తుగడ. ఇక, మధ్యప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విద్యామంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్ రాష్ట్రంలో బలమైన ఓబీసీ వర్గానికి చెందినవారు కావడం కలిసొచ్చిన అంశం. ఆయన డిప్యూటీలుగా బ్రాహ్మణ, ఎస్సీ వర్గీయుల్ని నియమించడంలో, ఇతర ప్రధాన ఓటుబ్యాంకుల్ని తృప్తిపరిచే యత్నం కనిపిస్తోంది. రాజస్థాన్‌లోనైతే అధికారిక ప్రకటన ముందు దాకా సమావేశ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే భజన్‌లాల్ పేరును ఆకస్మికంగా ప్రకటించారు. ఆయనే ఊహించని ఆ ఎంపిక మరోసారి పదవిపై ఆశపడ్డ వసుంధరకు అధిష్ఠానం వేసిన గుగ్లీ. రాజవంశీయురాలైన వసుంధరా రాజె రెండు దశాబ్దాలలో తొలిసారిగా రాజస్థాన్‌లో ఇటు సీఎం కాకుండా, కనీసం సీఎం అభ్యర్థిగానైనా కాకుండా మిగిలారు. ఇక, మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలిక సీఎంగా పేరు తెచ్చుకొని, తాజా ఎన్నికల్లో ఏటికి ఎదురీది పార్టీని విజయతీరానికి చేర్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మళ్ళీ పగ్గాలు దక్కలేదు. ఛత్తీస్‌గఢ్‌కు ఒకప్పుడు సీఎంగా వ్యవహరించిన రమణ్ సింగ్ పరిస్థితీ అదే. ఇప్పుడిక ఒక విషయం స్పష్టం. వసుంధరా రాజె, చౌహాన్లను పక్కనబెట్టడంతో కమలం పార్టీ ఇప్పుడిక ఒకప్పటి వాజ్‌పేయి, అద్వానీల శకం నుంచి పూర్తిగా బయటపడి, మోదీ, షాల కొత్త జమానాలోకి సంపూర్ణంగా చేరుకున్నట్టే. పాత కాపులుగా చక్రం తిప్పుతున్న అనేకులకు అనధికారికంగా... అధికార పీఠం నుంచి బలవంతపు పదవీ విరమణ ఇచ్చేసినట్టే. అయితే, సీఎం పదవి ఇవ్వనంత మాత్రాన బీజేపీలో ఈ సీనియర్ల కథ ముగిసిపోయిందని అనుకోలేం. రానున్న రోజుల్లో కాషాయపార్టీ వీరి సేవలను ఎలా వినియోగించుకుంటుందో వేచిచూడాలి. ఏమైనా, ఎన్నికల్లో గెలిచిన తొమ్మిది రోజుల తర్వాత బీజేపీ ఆచితూచి సీఎంల ఎంపిక తతంగాన్ని పూర్తిచేసింది. రాజకీయాల్లో తరాల మార్పే కాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది. దేశంలో 60 ఏళ్ళు ఆ పైబడ్డ ఓటర్లు 15 నుంచి 20 శాతమే అని లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథకరచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది. వ్యక్తుల కన్నా వ్యవస్థ (పార్టీ) పెద్దదనే నిష్ఠురసత్యాన్ని నసాళానికి అంటేలా సీనియర్లకు సంకేతించింది. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త సీఎంలు బుధవారం కొలువుతీరారు. కొన్ని ధార్మికస్థలాలే లక్ష్యమనిపించేలా బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లపై నిషేధమంటూ మధ్యప్రదేశ్‌లో మోహన్‌యాదవ్ పని మొదలెట్టేశారు. పాతవారిని మరిపించేలా పాలన అందించడమే కాక, తక్షణమే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని సీట్లు సాధించే సవాలు ఈ ముగ్గురు కొత్త సీఎంల ముందుంది. బీజేపీ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమదే విజయమన్న దిలాసా కనబరుస్తోంది. తరగని మోదీ మాయ, పార్టీ సైద్ధాంతిక పునాది, ప్రారంభం కానున్న అయోధ్య రామాలయం, ఆర్టికల్ 370 రద్దు సహా ఈ కులసమీకరణాలూ తమకు లాభిస్తాయనే భరోసాతో ఉంది. మార్పే మంత్రమని నమ్మిన బీజేపీ ఇప్పటికైతే అధికారంలో ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా ఓటర్లపై పట్టు నిలుపు కోవడానికీ, పెంచుకోవడానికీ పై స్థాయిలో మార్పులు కీలకమని ఆచరణలో పెట్టింది. కొత్త యంత్రాన్ని పాత సాఫ్ట్‌వేర్‌తో కాక, కొత్త సాఫ్ట్‌వేర్‌తో నడపాలని నమ్మిన బీజేపీ వ్యూహం ఏ మేరకు ఫలి స్తుందో చూడాలి. అది ఫలిస్తేప్రతిపక్షాలెంత ఆశపడ్డా ఢిల్లీ గద్దెపై మార్పును 2024లోనూ చూడలేవు. -
లెక్కకు రాని కట్టలు ఎన్నో!
రికార్డులు తిరగరాసిన ఉదంతమిది. అయితే అది వన్నె తెచ్చే రికార్డు కాకపోవడమే విషయం. యాభై మంది బ్యాంక్ అధికారులు, 40 కౌంటింగ్ మిషన్లు, ఆరు రోజుల పాటు అలుపెరగని సోదా, దొరికిన 350 కోట్లకు పైగా నగదు... దేశంలో ఇంతవరకూ ఏ దర్యాప్తు సంస్థ జరిపిన సోదాల్లోనూ కనివిని ఎరుగని కళ్ళు తిరిగే లెక్కలివి. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ కుటుంబ డిస్టిలరీ సంస్థపై రాంచీ సహా వివిధ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు వారం రోజులుగా వార్తల్లో ముఖ్యాంశమవడానికి ఇదే కారణం. లెక్కింపు మిషన్లు కూడా మొరాయించేలా, గుట్టలు గుట్టలుగా సంచులకొద్దీ డబ్బు ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సంస్థల్లో దొరకడం సామాన్య ప్రజానీకాన్ని ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత డబ్బు ఐటీ సోదాల్లో దొరకడం సహజంగానే అధికార పక్షానికి అందివచ్చిన అస్త్రమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టడంలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. సాక్షాత్తూ ప్రధాని, పార్లమెంట్ సాక్షిగా హోమ్ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోని ప్రసిద్ధ ‘మనీ హైస్ట్’ సిరీస్ తరహాలో కాంగ్రెస్ అవినీతి దోపిడీ సాగుతోందని ప్రధాని వీడియో మీమ్‌లు పెట్టడం కొసమెరుపు. వెరసి, కాంగ్రెస్‌ది కక్కలేని మింగలేని పరిస్థితి. అయిదుగురు సోదరుల సాహూ కుటుంబమంతా తర తరాలుగా పార్టీ విధేయులూ, వివిధ సమయాల్లో చట్టసభ సభ్యులూ కావడంతో ఆ పార్టీ తప్పించు కోలేని దుఃస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ నడిగడ్డ మీద మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై, అందులోనూ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి డీలా పడ్డ కాంగ్రెస్‌ను ఇది ఇరుకున పడేసింది. ఈ పరిస్థితుల్లో లెక్కలేని ఈ ధనరాశుల మచ్చ తనపై పడకుండేలా ఆ పార్టీ శతవిధాల యత్నిస్తోంది. బాహాటంగా సాహూను ఏమీ అనకున్నా, ఈ సోదా నగదుపై వివరణ కోరిందన్నది వార్త. సోదాల్లో దొరికిన నగదులో అధిక మొత్తం బౌద్ డిస్టిలరీస్ గ్రూపులో బయటపడ్డదే. అయితే, సాహూ కుటుంబం తరతరాలుగా సారాయి వ్యాపారంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో భారీగా సాగే ఇలాంటి వ్యాపారంలో నగదు చెల్లింపులే ఎక్కువన్నదీ బహిరంగ సత్యమే. పైగా, కుటుంబసంస్థలో కాంగ్రెస్ ఎంపీ సాహూ కనీసం డైరెక్టరైనా కాదు. సాహూ కుటుంబ సంస్థ అయినంత మాత్రాన ఆ డబ్బు సాహూది ఎలా అవుతుంది? అంతకు మించి ఆ డబ్బంతా కాంగ్రెస్దెలా అయిపోతుంది? ఇదీ హస్తం పార్టీ సమర్థకుల వాదన. సాంకేతికంగా అది నిజమే! అయితే, ఇందిరా గాంధీ కాలం నుంచి కాంగ్రెస్ వెంట నడిచి, ఒకటికి రెండు మూడు సార్లు ఎంపీలైన సాహూ సోదరుడు, సాహూ... తమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేందుకు తమ వ్యాపార రాబడిని ఆసరాగా చేసుకొని ఉంటారనేది ఊహకందని విషయమేమీ కాదు. అది సాక్ష్యాధారాలతో సంబంధం లేని సామాన్య ఇంగితం. ఆరోపణలు, వివరణల మాటెలా ఉన్నా తాజా సాహూ వ్యవహారం మరింత లోతైన వ్యవహారాన్ని సూచిస్తోంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న పెద్దమనుషుల వద్ద లెక్కాజమా లేకుండా పోగుపడుతున్న ధనరాశుల చిట్టాలో ఇది లవలేశమేనన్న స్పృహ కలిగిస్తోంది. దాదాపు నూటికి 42 మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బీద రాష్ట్రంలో, నూటికి 48 మంది ప్రజానీకం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రంలో ఒక మద్యం డిస్టిలరీ సంస్థ వద్ద ఇంత ధనం దొరకడం సమకాలీన సమాజంలోని విరోధాభాస. సామాన్యులు తమ ప్రతి పైసా ఆదాయానికీ, ఖర్చుకూ లెక్కలు పూచీపడుతుంటే, బడా బాబుల వద్ద లెక్కకందని డబ్బుల కట్టలు మూలుగుతుండడం బయటపడ్డ ప్రతిసారీ దిగ్భ్రాంతి కలిగిస్తూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు లాంటి ఆలోచనలు పదేపదే నిష్ఫలమైన తీరునూ కళ్ళ ముందుంచుతోంది. నిజానికి రాజకీయాలకూ, వ్యాపారానికీ మధ్య బంధం కొత్తేమీ కాదు. విజయ్ మాల్యా, అదానీ, అంబానీ అంటూ పేర్లు మారవచ్చేమో కానీ, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకూలురితో అధికార పీఠం బంధాలు పెనవేసుకోవడం దశాబ్దాలుగా దేశంలో చూస్తున్నదే. వందల రెట్లలో ఎదుగుతున్న వ్యాపార లెక్కల పైనే కాదు... పీఎం కేర్ ఫండ్స్ మొదలు పార్టీలకు అందుతున్న విరా ళాలు, ఎలక్టోరల్ బాండ్స్పైనా రచ్చ రేగుతున్నది అందుకే. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పన్ను లెక్కల్లో చూపని అక్రమ ధనం స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాతా దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉండడం విషాదం. ప్రతి 10–15 ఏళ్ళకోసారి స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రకటిస్తున్నా నల్ల డబ్బు చీడ తొలగలేదు. చివరకివి ఆర్థికవ్యవస్థనే తలకిందులుచేసే స్థాయికి పెరిగిపోవడం దిగ్భ్రాంతికరం. డిజిటల్ చెల్లింపులు ప్రాచుర్యంలో పెట్టామని జబ్బలు చరుచుకొంటే చాలదు. ఆ పరిధిలోకి రాని ఇలాంటి నగదు గుట్టలను అరికట్టే ప్రణాళికలు చేపట్టాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం కొన్ని దేశాల్లో చేసినట్టే... నిర్ణీత పరిమితి దాటి ఎవరైనా అనధికారికంగా నగదు కలిగివుంటే తక్షణ శిక్షార్హ నేరంగా పరిగణించేలా చట్టం తేవాలి. అధికార పార్టీ నేతలపైనా ఆరోపణలు వినిపిస్తున్న వేళ, తరతమ భేదాలు లేని చర్యలు అవసరం. పైగా, వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఉరకాలని భావిస్తున్న అధికార పార్టీ నుంచి మరింత జవాబుదారీతనం ఆశిస్తాం. ప్రతిపక్షానికి సైతం తామే కాదు... తమ ఎంపీలూ పులు కడిగిన ముత్యాలేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవేమీ లేకుండా, సామాన్యులకు చిరకాలం గుర్తుండే ఈ నగదు కట్టల దృశ్యాలు వట్టి వైరల్ వీడియోలుగా, శుష్క ఆరోపణలుగా మిగిలిపోతేనే కష్టం. -
సుదీర్ఘ వివాదానికి తెర
జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పుపై సహజంగానే అటు హర్షామోదాలతోపాటు ఇటు అసంతృప్తి, అసమ్మతి కూడా వ్యక్తమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించగా, కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీలు నిరాశ వ్యక్తంచేశాయి. దశాబ్దాలుగా ఈ అధికరణ చుట్టూ సాగుతున్న వివాదానికి తాజా తీర్పు ముగింపు పలికింది. 370వ అధికరణ రద్దు సహా అన్ని విషయాల్లోనూ ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పు వెలువరించగా దానితో ఏకీభవిస్తూనే జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమే. కశ్మీర్ వంటి భావోద్వేగాలతో ముడిపడివుండే అంశంలో వీటి తీవ్రత కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్లే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కశ్మీర్లో ఉగ్రవాదం వేళ్లూన డానికీ, భద్రతాబలగాలపై దాడులకూ మూలం 370వ అధికరణలో ఉందన్నది జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచీ బీజేపీ నిశ్చితాభిప్రాయం. దానికితోడు పాకిస్తాన్, చైనా సరిహద్దుల సమీపంలో ఉండటంవల్ల కశ్మీర్ ఘటనలు దేశ పౌరులందరినీ కలవరపరుస్తుంటాయి. అయితే అధికరణ రద్దుపై స్థాని కులు ఏమనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలియదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్లవుతోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రాంతంలోని మూడు స్థానాలనూ నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా, జమ్మూ ప్రాంతంలోని మూడు స్థానాలు బీజేపీకి లభించాయి. 2019 ఆగస్టు 5న రాష్ట్ర పతి నోటిఫికేషన్ జారీకి నాలుగు రోజుల ముందు నుంచీ కశ్మీర్‌కు భద్రతా బలగాల తరలింపు, విద్యా సంస్థలకు సెలవులు, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ, అమర్నాథ్ యాత్ర నిలుపుదల వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సైతం కశ్మీర్లో ప్రధాన పార్టీల నేతలంతా తమను గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. ఇదంతా గమనిస్తే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అత్యంత సున్నితమైన సమస్య అని అర్థమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని 1947లో భారత్‌లో విలీనం చేసినప్పుడి చ్చిన హామీకి అనుగుణంగా 1949లో రాజ్యాంగ నిర్ణాయక సభ 370వ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఆ అధికరణ ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ మినహా ఇతర అంశాలు జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్రంలో అమలు కావు. అయితే ఒకసారంటూ దేశంలో విలీనమయ్యాక ఇక ‘అంతర్గత సార్వభౌమత్వం’ అనేదే ఉండదని తాజా తీర్పుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 370వ అధికరణ తాత్కాలిక స్వభావంతో కూడుకున్నదని... తాత్కాలిక, మధ్యంతర అధికరణలున్న రాజ్యాంగంలోని 21వ భాగంలో చేర్చటమే ఇందుకు నిదర్శమని జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం భాష్యం చెప్పగా... నెమ్మదిగా జమ్మూ– కశ్మీర్‌ను కూడా ఇతర రాష్ట్రాలతో సమానం చేయటమే దాని ఉద్దేశమని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలతోనూ విడిగా తీర్పునిచ్చిన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏకీభవించారు. ఈ అధికరణ స్వభావం ఏమిటన్న అంశాన్ని 2016లో సుప్రీంకోర్టు పరిశీలించింది. అది తాత్కాలికమైనదన్న వాదనను అప్పట్లో తోసి పుచ్చింది. అందుకు అదే అధికరణలోని సబ్ క్లాజ్ 3ని ఉదాహరించింది. రాష్ట్ర రాజ్యాంగసభ సిఫా ర్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే 370 రద్దవుతుందని ఆ క్లాజ్ సారాంశం. 1957 తర్వాత రాజ్యాంగసభ ఉనికిలో లేదు గనుక ఇక దాని రద్దు అసాధ్యమని అప్పట్లో సుప్రీంకోర్టు భావించింది. అయితే రాజ్యాంగసభ రద్దుతో సబ్ క్లాజ్ 3 నిరర్థకమైపోయిందని, ఆ అధికారం రాష్ట్ర అసెంబ్లీకి దఖలు పడిందని తాజా తీర్పుల్లో న్యాయమూర్తులు భావించారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది గనుక గవర్నర్ సిఫార్సు సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో ఎన్నికలు జరిపించాలని పిటిషనర్లు ఎవరూ కోరకపోయినా ఆ విషయాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసు కున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలో కూలంకషంగా చర్చించిన తర్వాతే వివిధ అధికరణలు రాజ్యాంగంలో చేరాయి. ఆ అధికరణలు చేర్చటంలోని అంతర్గత ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ఆ చర్చలు దోహదపడతాయి. అయితే దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులు న్యాయమూర్తుల దృక్పథా లను నిర్దేశిస్తాయి. ఆ అధికరణలకు కొత్త చేర్పులు తీసుకొస్తాయి. వాటి పరిధి విశాలమవుతుంది. లేదా వాటి రద్దు సబబే అనిపించవచ్చు. ఏదేమైనా కేంద్రం ఈ నిర్ణయానికి ముందు అక్కడి ప్రజానీ కాన్ని, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులను కూడా సంప్రదిస్తే బాగుండేది. వీరంతా భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసిస్తున్న వారు. వర్తమాన పరిస్థితుల్లో సత్వర నిర్ణయం అవసరమని కేంద్రం భావించివుండొచ్చు. ఇప్పటికైనా ఆ ప్రాంతప్రజల అపోహలు తొలగించే కృషి మొదలుకావాలి. కశ్మీర్ అభివృద్ధి సాకారం కావాలి. -
రెండో గొంతు
మనదైనది ఏదో వ్యక్తం చేయడానికి మనదైన భాష ఒకటి ఉండాలనుకుంటాం. కానీ భాష చిత్రమైంది. ఒక్కోసారి అనుకున్న మాట వెంటనే తట్టదు. ఇంకో సందర్భంలో ఆ ఒక్కమాటకు పది మాటలు కనబడి గందరగోళ పరుస్తాయి. రెండు సందర్భాల్లోనూ మనిషి మూగ కావడం గమనార్హం. ఇదంతా భాష సమస్య కాదేమో; మన లోపలి భావానికి అనుగుణంగా భాష మనల్ని ఇలా ఒంటరిగా మాట తోడులేకుండా నిలబెట్టే స్థితిని కల్పిస్తుందేమో! భావం అనేది చాలా సంక్లిష్టమైంది కదా మరి! దాన్ని భాషలోకి తేవాలని అనుకున్నప్పుడు, ఎంతో తెలుసు అనుకున్నది కూడా, ఏ కొసను అందుకోవాలో తెలియక తికమక పరుస్తుంది. ఒక తేనెతుట్టె ఏదో లోపల కదిలినట్టయి గందరగోళం తలెత్తుతుంది. అనుకున్న వ్యక్తీకరణ గాడి తప్పుతుంది. భావాన్ని వ్యక్తపరచడానికి ఏ భాష అయితే కావాలో అదే అవరోధంగా మారడం తమాషా కదా! మరి దానికేమిటి దారి? సంజ్ఞలైతే పనికిరావు. కాబట్టి మళ్లీ భాషే దిక్కు. పోనీ, ఇంకేదో భాష అయితే? అందులో మనకు అంతగా ప్రవేశం లేనిదైతే? ఒక్కోమాటా వాక్యంగా పేర్చుకునేదైతే? నిజంగా అలా రాయడం సాధ్యమా? ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న కొందరు రచయితలు ‘తమది కాని’ భాషలో సాహిత్యం సృజించారు. 1978లో బేస్‌బాల్ గేమ్ చూస్తున్నప్పుడు, ఆటగాడు బంతిని బలంగా కొట్టిన బ్యాట్ శబ్దం టోక్యో శివార్లలోని ‘జింగు’ స్టేడియం మొత్తం ప్రతిధ్వనించిన ఒకానొక క్షణాన ఇరవైల్లో ఉన్న హరూకీ మురకామీకి ఉన్నట్టుండి తానూ రాయగలనని అనిపించింది. ఆ క్షణం ఆయనలో ఏదో ఎల్లలు లేని సృజనావేశం తన్నుకొచ్చింది. దాన్ని అలాగే పోనీయకుండా కొన్ని నెలలు శ్రమించి, రాత్రుళ్లు కుస్తీపట్టి జపనీస్ భాషలో మొదటి నవల రాయడానికి ప్రయత్నించాడు. అంతా అయ్యాక చదివితే ఆయనకే నచ్చలేదు. దీనికి కారణం – తన మాతృభాషలో ‘పశువుల కొట్టంలో పశువులు క్రిక్కిరిసినట్టుగా’ ఆలోచనలు రొద పెట్టడమే! దీనివల్ల ఉక్కిరిబిక్కిరికి లోనయ్యాడు. ‘ఒకరి భావాలను అలవోకగా ఒక క్రమంలో పెట్టడం గురించి మాట్లాడటం సులభమేగానీ, అలా చేయడం అంత సులభం కాదు. బొత్తిగా అప్పుడే రాయడం మొదలుపెట్టిన నా లాంటివాడికి అది మరింత కష్టం. కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి, నేను చేయాల్సివచ్చిన మొదటి పని నా రాతప్రతుల కుప్పనూ, ఫౌంటెన్ పెన్ నూ వదిలించుకోవడం! అవి నా ముందు ఉన్నంతసేపూ నేనేదో ‘సాహిత్యం’ లాంటిదాన్ని రాస్తున్నట్టనిపించింది. వాటి స్థానంలోకి నా పాత అలవెటీ టైప్‌రైటర్‌ను అల్మారా లోంచి తెచ్చాను. తర్వాత, ఒక ప్రయోగం లాగా, నా నవల ప్రారంభాన్ని ఇంగ్లీష్‌లో రాయాలని నిర్ణయించుకున్నాను. ఎటూ ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఇలా ఎందుకు చేయకూడదనిపించింది?’ అంటూ మురకామీ తాను తన జపనీస్‌ను కాదని ఆంగ్లంలో రాయడానికి పూనుకోవాల్సి వచ్చిన నేపథ్యం చెబుతాడు. అయితే, ఆంగ్లం ఆయనకేమీ మంచినీళ్ల ప్రాయం కాదు. ఈ భాష పరిమితి వల్ల సంక్లిష్ట వాక్యాలు రాయడం కుదరదు. ఆ ఉన్న కొద్దిపాటి పదసంపద, వ్యాకరణాలనే ప్రతిభావంతంగా ఉపయోగించుకోవాలి. ‘మై కిచెన్ టేబుల్ ఫిక్షన్ ’ ధోరణిగా వర్ణించే ఆయన రచనలు అలా మొదలయ్యాయి. ఈ ధోరణిలో వచ్చిన ‘హియర్ ద విండ్ సింగ్’ నవలిక మురకామీని అమాంతం పైకి ఎత్తేసింది. కృత్యాదిలోనే మురకామీ అవస్థ పడ్డాడు. కానీ ఝుంపా లాహిరిది ఇంకో కథ. లండన్ లో పుట్టి, అమెరికాలో పెరిగిన భారత(బాంగ్లా) సంతతి ఝుంపా ‘ఇంటర్ప్రిటర్ ఆఫ్ మాలడీస్’ నవలకు ‘పులిట్జర్’ గెలుచుకుంది. ‘నేమ్‌సేక్’తో మరింత పేరొచ్చింది. ఉన్నట్టుండి తన నలభై ఐదేళ్ల వయసులో ఇటాలియన్ లో రాయాలని నిర్ణయించుకుంది. కొత్త భాషలో రాయడంలో ఒక స్వేచ్ఛ ఉంది అంటారామె. ‘పర్ఫెక్టుగా ఉండనక్కరలేని స్వేచ్ఛ’. న్యూయార్క్‌లో కొన్ని ఇటాలియన్ పాఠాలు విన్న అనుభవం ఉంది. కానీ ఆ భాష కోసమే 2015లో ఆమె కుటుంబంతో సహా రోమ్కు వెళ్లి, కొన్నేళ్లు ఉండివచ్చింది. తర్వాత మూడు పుస్తకాలు ఇటాలియన్ లో వెలువరించింది. తర్వాత అవి ఆంగ్లంలోకి వచ్చాయి. సహజంగానే ఇటాలియన్ లో రాయడమేంటని చాలామందే ఆమెను ప్రశ్నించారు. ఒక్కొక్క పదం, వాక్యం ద్వారా వ్యక్తీకరణను కూడగట్టుకొని కొత్త లోకపు ద్వారంలోకి ప్రవేశించినట్టుగా అనుభూతి చెందానంటుంది. పాత, కొత్త ప్రపంచాల మధ్య అదొక సవాలు కూడా! ‘ఇటాలియన్ భాష నా జీవితాన్నేమీ మార్చలేదు; అది నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది; మరో అదనపు జీవితం’. తన అసంబద్ధ రచన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ద్వారా ఖ్యాతినొందిన శామ్యూల్ బెకెట్ పుట్టుకతో ఐరిష్‌వాడు అయినప్పటికీ ఫ్రెంచ్ను తన రచనాభాషగా ఎంచుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణాలు సాధారణంగా రచయితలు కోరుకునే లక్షణాలకు పూర్తి విరుద్ధమైనవి. తన మాతృభాషకు దూరం కావడం అనేది, ఒక ముసుగును చించుకోవడంతో సమానంగా చూశాడు. ఫ్రెంచ్‌లో (పరాయి భాష) మాత్రమే ఒక శైలి లేకుండా రాయడం సాధ్యమవుతుందన్నాడు. అలాగైతేనే తనకు తగిన వనరులు లేకుండా పోతాయన్నాడు. అందువల్లేనేమో, ఆయన ప్రసిద్ధ ‘మినిమలిస్ట్’ రచయిత కాగలిగాడు. వేర్వేరు కారణాల వల్ల తమ మాతృభాషలకు దూరమైన రచయితలు ఎందరో ఉన్నారు. పరిస్థితులు వారికి అలాంటి పరీక్ష పెట్టాయి. ఆ వేదన ఇక్కడ అప్రస్తుతం. కానీ భాష అనేదాన్ని ఒక అవరోధంగా పెట్టుకుని రాయాలనుకోవడం దానికదే ఒక సవాలు. ప్రాణవాయువును మరీ ఎక్కువగా పీల్చకుండా పొదుపుగా వాడుకుంటూ బతికే యోగసాధన లాంటిది అది. -
అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు. ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్ పీరియడ్‌గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది. గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే. ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్‌లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్‌లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది. వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి. సెక్రటేరియట్‌కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి. రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్ చర్యే! వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది. అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్‌లోకి వచ్చే ప్రొసీజర్స్‌ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది. కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్‌కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం. తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్‌లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్... కథ అడ్డం తిరిగింది! ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్ పార్టీ టెన్ బై టెన్ స్కోర్ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది. తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్ఎస్ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్ బూత్‌ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్పల్లి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్‌లో బీఆర్ఎస్కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్‌కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్‌బీ కాలనీ బూత్ నెంబర్ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్‌కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com