Extra
-
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
నేటి ఆధునిక గృహాలలో నాటి ప్యాలెస్ కళ
మహారాజా ప్యాలెస్‌ల నుండి ఇకత్ డిజైన్ల వరకు ఆధునిక ఇళ్లలో భారతీయ కళల ప్రభావం అంతర్లీనంగా ఉంటోంది. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, మనదైన వారసత్వం ఇంటీరియర్ డిజైన్‌లో కొంగొత్త నిర్వచనాన్ని చూపుతుంది.భారతీయ కళలు మ్యూజియంలు, గ్యాలరీలకు మించి విస్తరిస్తున్నాయి. ఇవి మనం నివాసం ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేస్తున్నాయి. క్లిష్టమైన ఎంబ్రాయిడరీ నమూనాల నుండి గ్రాండ్ ఆర్కిటెక్చరల్ మోటిఫ్‌ల వరకు, భారతీయ వారసత్వంలోని ఈ అంశాలు ఆధునిక ఇంటీరియర్ డిజైన్‌ను సరికొత్తగా చూపుతున్నాయి. భారతీయ కళ, సంప్రదాయాన్ని గౌరవించే సేకరణలు సమకాలీన గృహాలలోకి ప్రవేశించి, కలకాలం నిలిచేలా రిఫ్రెష్‌గా భావించే ఇంటీరియర్లను సృష్టిస్తున్నాయి. వారసత్వ ప్రేరేపిత డిజైన్లు సంప్రదాయంతో ఎంతో గొప్పగా ఉంటాయని రుజువు చేస్తున్నాయి. మహారాజ ప్యాలెస్–ప్రేరేపిత ఇంటీరియర్స్భారతీయ చరిత్ర మొత్తం వైభవంతో కూడిన కథలతో నిండి ఉంటుంది. హస్తకళతో పాటు ఎన్నో అంశాలకు ఉదాహరణలుగా నిలిచే రాజభవనాలు ఉన్నాయి. ఈ రీగల్–ప్రేరేపిత డిజైన్లు గ్రాండ్ మహారాజా ప్యాలెస్‌ల ఆర్చ్‌లు, మోటిఫ్‌లు, విలాసవంతమైన అలంకారాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఇవి నేటి కాలపు అందానికి ప్రతీకగానూ ఉంటాయి. చికన్కరి సొగసుఇంటీరియర్ నిపుణుడు, మెరినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ మనోజ్ లోహియా మరింత వివరిస్తూ, ‘రీగల్ శ్రేణిలో గజముద్ర, వసంత, సంస్కృతి వంటి డిజైన్ లు ఉన్నాయి. ప్రతి ఒక్క అంశమూ రాజ వైభవంతో అలరారుతుంటుంది. ఆ తర్వాత భారతదేశ విభిన్న కళారూ΄ాలలో చికన్కరీ ఎంబ్రాయిడరీ ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ డిజైన్లు అల్లికలతో ఉంటాయి. చేతితో తయారైన ఈ అల్లికలు సాగసుగానూ, అందుబాటులో ఉంటాయి. అలంకృత్ ఒక అలంకారమైన ఆభరణాన్ని పోలి ఉంటుంది. కర్ణిక భారతీయ చెవి΄ోగుల నుండి స్ఫూర్తిని పొందింది. సాంప్రదాయ హవేలీలలో కనిపించే ఈ తోరణాల కళ నేటి ఆధునిక ఇళ్లలోనూ కనిపిస్తుంది. వాస్తుశిల్పం కూడా ఆధునిక అమరికలో చక్కగా ఇమిడిపోయి గొప్ప వారసత్వ కళతో ఆకట్టుకుంటున్నాయి’ అని ఆయన వివరించారు.ఇకత్ వీవింగ్ డిజైన్స్ఇకత్ అనేది దాని అద్భుతమైన నమూనాలు, సజీవ రంగులకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన కళారూపం. కొత్త మెటీరియల్‌లలో ఈ నమూనాలను పునఃరూపకల్పన చేయడం ద్వారా, ఆధునిక డిజైన్ సేకరణలు అదే శక్తి, చైతన్యంతో నింపుతున్నాయి. ఇంటీరియర్ డిజైనర్ శ్రీ మనోజ్ మాట్లాడుతూ– ‘ఇకత్ హస్తకళకు కేంద్రంగా ఉండే ఒక థ్రెడ్‌వర్క్. సముద్రపు అలల నమూనాలను తలపిస్తోంది. ప్రశాంతతను కలిగిస్తుంది. తరంగ్ పుష్పం సున్నితమైన అందాన్ని మిళితం చేస్తుంది. ఈ డిజైన్లు ఒక గదికి శిల్పకళాపరమైన అందాన్ని తీసుకువస్తాయి. సాంస్కృతిక వారసత్వం, ఆధునిక సౌందర్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపారు. (చదవండి: తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం) -
తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది? తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం. సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది. – స్వామి జగదాత్మానంద (చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు) -
దస్తాన్ హేమలత.. ఆవిష్కరణ
సాక్షి,ఢిల్లీ: ముప్పై ఎనిమిది భాషల్లో తన గాన మాధుర్యంతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని హేమలత జీవిత చరిత్రను ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ ‘దస్తాన్ హేమలత’ పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆదివారం ఢిల్లీల్లో జరిగిన ‘సాహితీ ఆజ్‌తక్’ వేదికపై పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.13 ఏళ్లకే తన గాత్రంతో అందరినీ మెప్పించిన హేమలత భాష,యాసతో సంబంధం లేకుండా భారతదేశంలోని అన్ని భాషల్లో పాటలు పాడి అందరిని మెప్పించారని డాక్టర్ అరవింద్‌యాదవ్ పుస్తకావిష్కరణ సభలో పేర్కొన్నారు. 1970–80 దశకంలో లతా మంగేష్కర్ లేదా హేమలత పాట లేనిదే సినిమాలు లేవని చెప్పారు. హేమలత సన్నిహితులకు కూడా తెలియని అనేక విషయంలో ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చని అన్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో జన్మించిన హేమలత, తన బాల్యాన్ని కోల్‌కతాలో గడిపారు. ఆమె పాటలకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. -
వీడియో గేమ్స్ చరిత్ర తెలుసా?
పిల్లలూ! వీడియో గేమ్స్ ఆడటమంటే మీకు చాలా ఇష్టమా? సెలవుల్లో ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఆడుతుంటారా? మరి వాటి చరిత్రేమిటో తెలుసుకుందామా?వీడియో గేమ్స్ పుట్టి దాదాపు 66 ఏళ్లు దాటుతోంది. 1958లో విలియం ఆల్ఫ్రెడ్ హిగిన్ బోతమ్ అనే అమెరిన్ భౌతిక శాస్త్రవేత ‘టెన్నిస్ ఫర్ టూ’ అనే వీడియోగేమ్ తయారు చేశారు. 1960 తర్వాత కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న సమయంలో కంప్యూటర్ శాస్త్రవేత్తలు గ్రాఫిక్స్ ఆధారంగా గేమ్స్ తయారు చేశారు. అనంతరం 1962లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ‘స్టార్‌వార్’ అనే వీడియో గేమ్ తయారు చేశారు. ఆ తర్వాత 1970లో ఇళ్లల్లో వీడియో గేమ్స్ ఆడుకునేందుకు గేమ్ కన్సోల్‌ని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ వీడియో గేమ్స్ అమెరికా అంతటా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలు సైతం కొత్తగా వీడియోగేమ్స్ తయారు చేశాయి.వీడియో గేమ్స్ ప్రధానంగా పిల్లల కోసమే తయారు చేసినా పెద్దలు కూడా వీటిని ఇష్టపడుతున్నారని కంపెనీలు గుర్తించాయి. మరిన్ని కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. ఒకానొక దశలో చాలా గేమ్స్‌కి కాపీలు, పైరసీ వెర్షన్లు వచ్చేశాయి. దీంతో జనానికి నాణ్యమైన గేమ్స్ అందుబాటులో లేకుండా ΄ోయాయి. 1983 నుంచి 1985 మధ్యలో అమెరికాలోని వీడియో గేమ్స్ తయారీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఆ తర్వాత వీడియో గేమ్స్ మార్కెట్లోకి జ΄ాన్ దూసుకొచ్చింది. కొత్త కొత్త గేమ్స్‌ని అందుబాటులోకి తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడేలా చేసింది. దీంతో సంస్థలు కొత్త టెక్నాలజీ ఉపయోగించి మరిన్ని నాణ్యమైన, క్రియేటివ్ గేమ్స్ తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇంటర్నెట్ వాడకం మొదలయ్యాక వీడియోగేమ్స్ మరింతగా అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్ వచ్చాక అందరూ సులభంగా వీడియో గేమ్స్ ఆడేస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన యాప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్ మార్కెట్ రూ.1.5 లక్షల కోట్లతో నడుస్తోంది. వేల మంది ఈ రంగంలో పని చేస్తున్నారు. వీడియో గేమ్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా గేమ్ డిజైనర్లు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల వీడియో గేమింగ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో వీడియో గేమింగ్ తయారీ గురించి నేర్పిస్తారు. వీడియో గేమ్స్‌లో ఎక్కువమంది యాక్షన్, స్పోర్ట్స్, సాహసయాత్రలు వంటివి ఇష్టపడుతుంటారుఅయితే చదువు పక్కన పెట్టి వీడియో గేమ్స్ ఆడటం ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి ఆడటం కూడా చాలా ప్రమాదకరం. అదొక వ్యసనం అవుతుంది. రాత్రి పగలూ ఆడాలనిపిస్తుంది. భవిష్యత్తుకే ప్రమాదం. కాబట్టి సెలవు రోజుల్లో కొద్దిసేపు మాత్రమే వీడియో గేమ్స్ ఆడండి. సరేనా? -
భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం..ప్రకృతి అందాలకు నెలవు..!
భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్‌ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్. ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..క్రోస్ లేక్, ఉత్తర సిక్కింక్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చోళము సరస్సు, ఉత్తర సిక్కించోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కింపశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని) -
ధర్మసూక్ష్మం ఇలా ఉంటుందా..? ఆత్వస్తుతి అంత పాపమా..?
కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.(చదవండి: -
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024 -
ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా!
థాయ్‌తో పాటు అమెరికాకు చెందిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళతో ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల తలను దూరుస్తూ కనిపించారు. “ఖచ్చితంగా ఆ జంతువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మలేకపోతూ. అయితే ఆ విన్యాసంలో వారిని అవి నమిలేయకుండా ఉండేంతగా కుస్తీ వస్తాదులు మొసళ్ళని భయపెడతారని రోమ్ అనుకున్నారు. మనం అంగీకరించాల్సింది ఏమిటంటే?.. మొసళ్లకి శిక్షణ ఇవ్వలేము కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇండోనేషియా పడమర పపువాలో రోమ్ ఒక న్యూ గిని మంచినీటీ మొసలి ఒక చెక్క ఇంట్లో ఉండటం చూసాడు. ఆ మొసలి పొదిగిన పిల్లగా ఉన్నప్పటి నుంచి పిల్లల, మనుషులతో ఓ పెంపుడుకుక్కలా పెరిగి ఇప్పుడు ఐదడుగుల పొడుగయ్యింది. చల్లటి వర్షాకాలం రాత్రులలో అక్కడి సభ్యులతో కలిసి అది చలికాచుకుంటూ ఉంటుంది కూడా.మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ డైరెక్టర్‌గా 2008వ సంవత్సరం మధ్యలో కొద్దికాలం పాటు పనిచేసిన రాల్ఫ్ సామెర్లడ్.. జర్మనీలో ఓ తోటమాలి దక్షిణ అమెరికా రకమైన కెమన్ అనే మొసలిని పెంచుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తోటమాలి మోకాళ్లపై కూర్చున్నప్పుడు, కుక్క పిల్లలా ఆ మొసలి అతని తలకూ, భుజాలకూ రాసుకునేదట. రాల్ఫ్ మద్రాస్ మొసళ్లకి శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమానికి నాంది పలికాడు. అప్పట్లో అసిస్టెంట్ క్యూరేటర్ అయిన సోహం ముఖర్జీ.. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా, ఆ ఆలోచనను రాను రాను ఎంతో సరదాగా, ఆకర్షణీయమైన కార్యక్రమంగా అభివృద్ధి చేశారు.ఎలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది, కానీ, అది పెద్దయినప్పటి నుంచి ఆ అభ్యాసం ఇవ్వడం తగ్గించేశారు. ఎలికి తన పేరు ఇంకా గుర్తుంది. శిక్షణ పునః ప్రారంభించాడానికి ఇది ఒక మంచి విషయం. తను ఒక ఆదేశం పాటించిన ప్రతీసారి ఒక మాంసం ముక్క బహుకరించేవారు. అచ్చం ఒక కుక్కకి శిక్షణ ఇచ్చినట్లుగా. ఏటొచ్చి ఇది ఒక పెద్ద పోలుసులు కలది. అంతే. ఒక వారం తరువాత, ఎలికి శిక్షణ ఇస్తున్నప్పుడు, వెనుకన ఉన్న ఒక మగ్గర్ మొసలి ఆదేశాలకి చక్కగా స్పందించడం సోహం గమనించారు. ఆ మొసలి ఏ బహుమతి సహాయం లేకుండా, చూసి నేర్చుకుంటోంది. సోహం దానికి పింటూ అని పేరు పెట్టాడు. ఆ మొసలి వెంటనే ఆ కార్యక్రమంలో భాగమైంది. కాలక్రమేణా మరి నాలుగు మొసళ్లు చేరాయి. ప్రతీ మధ్యాహ్నం మూడింటికి శిక్షణ మొదలయ్యేది. దానికి పది నిముషాల ముందే ఆ ఆరుగురు శిష్యులు కొలను అంచున, సోహం గొంతు నుంచి విలువడే అతి చిన్న శబ్దం కోసం ఆత్రంగా ఎంతో అప్రమత్తతతో వేచి చూసేవి. అతను వచ్చాక వాటి ఆనందం మాములుగా లేదు. ఆ మొసలి శిష్యులకి వాటిని ఏ వరుసలో పిలుస్తారో తెలుసు. ఇక వారి వంతు కోసం ఎంతో సహనంతో వేచి ఉండేవి. ఆచ్చం నా కుక్కలలాగే వాటికి ఆదేశల వరుస ఎంత బాగా తెలుసంటే, అవి ముందస్తుగానే ఆ విన్యాసాలు చేసేసేవి. కనుక సోహం ఆదేశాలను తారుమారు చేయాల్సొచ్చేది. ఆ మొసలి శిష్యులు వారంలో ఏ రోజు శిక్షణ నుంచి సెలవు వస్తుందో కూడా తెలుసుకున్నాయి. పింటూ లాగే, వేరే మోసళ్లు కూడా శిక్షకుడి ఆదేశాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి, చూసి నేర్చుకున్నాయి. త్వరలోనే కొమోడో, థాయ్ సాయమీస్, ఉప్పు నీటి మొసలి మిక్, మారియు నైల్ మొసలి అబూ, అన్ని జాతుల రంగురంగుల మొసళ్ళ కలగంపగా ఆ శిక్షణ పాఠశాలకు హాజరు అయ్యాయి. ఆఖరికి వయసులో పెద్దదైన మగ్గర్ రాంబో కూడా ఆ కార్యక్రమంలో చేరి, కొత్త విన్యాసాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించింది. కానీ గారాల కూచి ఎలి మాత్రం రా, ఉండు, పైకి, కూర్చో, తిరుగు, నోరు తెరు వంటి పన్నెండు ఆదేశాలు తెలిసిన అత్యుత్తమ విద్యార్థి. ఒకసారి ఎలి శిక్షణ రాంప్ పై సగం దూరం వెళ్ళాక, సోహం తనని ‘గెంతు’ అని ఆదేశించారు. ఒక జారెడు బల్ల వంటి రాంప్ పైనుంచి గెంతటం ఎంత కష్టమో మీరు ఊహించగలరు, కానీ ఎలి బహుమతి పొందే అవకాశం వదులదలచలేదు. రాంప్ వదలకుండా ఎలి తన కాలివేళ్లపై నుంచుని పొట్ట కిందకి ఆంచి, మెల్లగా గెంతడానికి సిద్ధమవుతున్నట్టు అనుకరించింది. ఎంతో ఆశ్చర్యకరం. ఆ పాఠశాల, ఎనిమిది నెలల నుంచి నలభై ఏళ్లు ఉన్న వేర్వేరు జాతులకు చెందిన ముప్పై మొసళ్ళ ఉండేంతగా పెరిగి పెద్దదయ్యింది.కెమన్ బల్లులు, అల్డబ్రా తాబేళ్లను కూడా శిష్యులుగా చేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పాఠశాల పేరును రెప్టైల్ పాఠశాలగా మార్చారు. పాములు, మానిటర్ బల్లులు, తాబేళ్ళు పాఠశాలలో చేరడానికి వేచి ఉన్న జాబితాలో ఉన్నాయి. మరి స్పష్టంగా, గవర్నమెంట్ నిబంధనలకు కట్టుబడి, విద్యార్థులు చేరడానికి నిర్ణీత రుసుము కూడా లేదు! ::జానకి లెనిన్ రాసిన దానికి రోహిణి చింత అనువాదం(చదవండి: యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు) -
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
శతకాలు : చూడచూడ రుచుల జాడ వేరు
పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య వేరయావిశ్వదాభిరామ వినుర వేమ – (వేమన )తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్వడి గల యెద్దుల కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ– (బద్దెన)తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు ఏదో ఒక పని దొరికితే చాలు.. ఇది సగటు మానవుని ఆరాటం. అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరువాత ఉండటానికి చిన్న ఇల్లు కొనుక్కోవాలి ఇది కొంతమంది ఆశ.పే..ద్ద హోదా ఉన్న ఉద్యోగం కావాలి. నెలకు ఇదెంకల జీతం, బంగ్లా..కారు.. ఎక్స్ట్రా.. ఇది మరికొంతమంది డ్రీమ్ జాబ్. మరి ఇస్త్రీ మడత నలగకుండా, ఒళ్లుఅలవకుండా, చెమట పట్టకుండా ఉండే జాబ్ కావాలి? ఇలా ఆలోచించే జీవులు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రీమ్ జాబ్స్.. అంటూ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ ఖాతా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అదేంటో మీరు కూడా చూడండి. అన్నట్టు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా డ్రీమ్ జాబ్సేనా? కొన్నాళ్లకు బోర్ కొట్టదూ? ఏమంటారు? Dream jobs! 😂😂 pic.twitter.com/jfsNGwI0H7— CCTV IDIOTS (@cctvidiots) November 11, 2024 -
20 కిలోల బరువు: దీని దుంపతెగ! మూములు పీత కాదిది, రాకాసి పీత!
సముద్రంలో కనిపించే ఎండ్రపీతల్లో ఇది చాలా అరుదైన పీత. సాలీడు ఆకారంలో ఉండే ఈ రాకాసిపీత పూర్తిగా ఎదిగాక మనిషికి రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. దీని కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. దీని శరీరం అడుగున్నర ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాళ్ల పంజా నుంచి పంజా వరకు పొడవు చూస్తే ఏకంగా పన్నెండు అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు గరిష్ఠంగా ఇరవై కిలోల వరకు ఉంటుంది. అతిపెద్ద పీత జాతుల్లో ‘అమెరికన్ లోబ్స్టర్’ తర్వాతి స్థానంలో ఈ రాకాసిపీత ఉంటుంది. ఇది ఎక్కువగా జపాన్ తీర పరిసరాల్లోని సముద్రంలో చాలా లోతు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటుంది. అందుకే దీనికి ‘జపానీస్ స్పైడర్ క్రాబ్’ అనే పేరు వచ్చింది. సముద్రంలో ఈరకం పీతలు దాదాపు రెండువందల అడుగుల నుంచి రెండువేల అడుగుల లోతులో తిరుగుతుంటాయి. ఇవి వేటగాళ్ల వలలకు చిక్కడం చాలా అరుదు. ఇవీ చదవండి: బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగుఅరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా? -
బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగు
కూల్‌డ్రింక్స్ వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబ యట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్ లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్మేక ర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసిన ట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేష న్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదీ చదవండి: వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం -
వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే! -
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మనం కూడా పాములమే..హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.నాగుల విశిష్టత..కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడుపాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
మంచు కురిసే వేళలో మనాలి విహారం
మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్‌ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్. స్నో ఫాల్‌ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్‌కార్‌లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు. తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే! -
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతీ శివాలయం లో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.(చదవండి: కార్తీకం.. పరమ పవిత్రం) -
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు
ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ డాన్సెస్ ఆఫ్ ఇండియా సెయింట్ లూయిస్. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి పాత్రను ’డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే... ‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.నాడు–నేడు‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్ చేశారు. (చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!) -
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా?