Extra
-
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
బ్రహ్మం అంటే..?
పూర్వం ఆరుణి అనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన కుమారుడు శ్వేతకేతువు. అతనికి పన్నెండు సంవత్సరాలు నిండగానే తండ్రి అతన్ని పిలిచి: ‘‘శ్వేతకేతూ! నువ్వు ఏదైనా గురుకుల ఆశ్రమానికి వెళ్ళి అధ్యయనం చేయవలసిన సమయం వచ్చింది. వెళ్ళి విద్యావంతుడివి కా’’ అన్నాడు. అప్పుడు శ్వేతకేతువు ఒక గురువును ఆశ్రయించి వేదాలన్నింటినీ కంఠస్థం చేశాడు. ఈ చదువుకే తనకు సర్వం తెలుసును అన్న అహంకారంతో, దర్పంతో ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి అతని అవివేకాన్నీ, ఆత్మవంచననూ గుర్తించి–‘‘శ్వేతకేతూ! ఆత్మ తత్త్వాన్ని గురించి మీ గురువు గారు ఏమి బోధించారు?’ అని అడిగాడు.‘‘నాన్నగారూ! నా గురువర్యులకు మీరు చెబుతున్న జ్ఞానాన్ని గురించి తెలియదనుకుంటాను. ఒకవేళ వారికి తెలిస్తే నాకు చెప్పి ఉండేవారే. కాబట్టి మీరే నాకు ఆ జ్ఞానబోధ చేయండి’’ అని అడిగాడు. తండ్రి సరేనని ఇలా ప్రారంభించాడు:‘‘చెబుతున్నాను విను శ్వేతకేతూ! అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు – ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూ΄ాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట’’ అని చెప్పాడు.అప్పుడు శ్వేతకేతువు ‘‘నాన్నగారూ! నిద్రపోతున్నప్పుడు మనిషి ఎక్కడికి పోతాడు ?’’ అని అడిగాడు. అందుకు ఉద్దాలకుడు, ‘‘నిద్రపోతున్నప్పుడు మనిషి తాత్కాలికంగా ఆత్మతో తాదాత్మ్యం పొందుతాడు.ఆ స్థితిలో గతాన్ని గురించి గానీ, వర్తమానాన్ని గురించి గానీ తెలియదు. అంతా అజ్ఞానం ఆవరించి ఉంటుంది. అజ్ఞానం వల్ల యథార్థాన్ని గుర్తించడం జరగదు!! మరణ కాలంలో అతని వాక్కులు మనస్సునందు లీనమవుతాయి. అతని మనస్సు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో కలిసి΄ోతుంది. చిట్టచివరకు అది పరమశక్తిలో లీనమవుతుంది. ఆ శక్తి అతిసూక్ష్మమైనది. అది విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నది. అదే సత్యం. అదే ఆత్మ. అదే నీవు!! అది సింహం రూపంలో ఉండనీ! పెద్దపులిగా ఉండనీ! ఏ జంతువైనా కానీ! మనిషి ఐనా కానీ అది అనంత చైతన్యమనే సముద్రంలో కలిసి΄ోయిన తరువాత తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. వాటి రూ΄ాలూ, వాటి నామాలూ ఎగరగొట్టుకు పోతాయి’’ అని వివరించాడు ఉద్దాలకుడు. బ్రహ్మం అంటే ఏమిటి నాన్నగారూ అని అడిగాడు శ్వేతకేతువు. అందుకు సమాధానంగా ‘‘సర్వవ్యాపకంగా ఉండే ఏ తత్త్వంలో సర్వమూ కలిసిపోతాయో అది బ్రహ్మం. అది అద్వితీయం. అది సూక్ష్మం. అది సర్వవ్యాపకం. అదే ఆత్మ. అదే నీవు తత్త్వమసిహేశ్వేతకేతో!’’ అని వివరించాడు.కొడుకు ద్విగుణీకృత ఉత్సాహంతో, ‘‘ఆ ఆత్మతత్త్వాన్ని గురించి ఇంకా వివరించండి నాన్నగారూ!’’ అని అడిగాడు.!!‘‘నదులు అన్నీ సముద్రంలోకే ప్రవేశిస్తాయి. ఒక సముద్రం నుండి మరో సముద్రానికి ఆ నీరు ప్రయాణిస్తూ ΄ోతుంది. సూర్యరశ్మి ఆ నీటిని ఆవిరిగా మార్చి మేఘంగా తయారు చేస్తుంది. ఆ మేఘం వర్షించి మరల లోకానికి బలాన్ని ప్రసాదిస్తుంది. నదులు సముద్రంలోకి ప్రవేశించగానే ఈ నీళ్ళు ఫలానా నదిలోనివి అని విడదీయడం అసాధ్యం. అలాగే భిన్నభిన్నంగా కనిపించే ఈ జీవరాశులు బ్రహ్మంలో అంతర్లీనమైతే వాటిని విడదీసి అర్థం చేసుకోవడం కష్టం. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలో అంతర్భాగాలే. అదే సత్యం. అదే నీవు.’’!! అన్న తండ్రి వివరణతో శ్వేతకేతువులో జ్ఞాననేత్రం తెరచుకుంది. పితృభక్తికి గురుభక్తి తోడై వినమ్రతతో నమస్కరించాడు. – డి.వి.ఆర్. భాస్కర్(చాందోగ్యోపనిషత్తులోని ఉద్ధాలక – శ్వేతకేతు సంవాదం ఆధారంగా) -
ఏటా పుష్కరమే..! బ్రహ్మ దేవుడి క్షేత్రం
బ్రహ్మదేవుడంటే... ఈ సమస్త భూమండలంలో ఆలయం లేని దేవుడనే అసంతృప్తిని రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. పుష్కర్ సరస్సు చుట్టూ విస్తరించిన పట్టణం కావడంతో ఈ పట్టణానికి కూడా అదే పేరు స్థిరపడింది. రాజస్థాన్ అంటేనే ఎడారులు, ఒంటెలు. ఇక్కడ ఏటా జరిగే క్యామెల్ ఫెయిర్ ప్రపంచ ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వేడుకకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ప్రదేశం పేరు పుష్కరే కానీ వేడుకలు పుష్కరానికొకసారి కాదు ఏటా జరుగుతాయి.పుష్కర్ మేళాప్రపంచ ప్రసిద్ధి చెందిన వేడుక కావడంతో ఇది క్యామెల్ ఫెయిర్‌గా వాడుకలోకి వచ్చింది. పుష్కర్మేళా సమయంలో ఈ సరస్సులో స్నానం చేయడానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ వారోత్సవాల్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలను, నాట్య ప్రదర్శనలతో΄ాటు సాముగారడీలు, పాములనాడించేవాళ్లు కూడా వస్తారు. స్థానిక హస్తకళలు, దుస్తుల దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఈ సీజన్లో పుష్కర్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. పగలు ఏదో ఒక సమయంలో 22 డిగ్రీలకు చేరుతుంది, కానీ సూర్యకిరణాలు మబ్బును చీల్చుకుని మనిషిని తాకి వెచ్చదనాన్నివ్వడం కష్టమే. రాత్రి టెంపరేచర్ ఎనిమిది డిగ్రీలకు పడి΄ోతుంది. పాశ్చాత్యదేశీయులకు అనువుగా ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు నవంబర్ 9 నుంచి మొదలై 15 వరకు కొనసాగుతాయి. -
ప్రయాణం, ప్రయత్నం..ముగ్గురు మహిళా కళాకారుల విజయం..!
నీనా జాకబ్, దిపాలి గుప్తా, మానికా శ్రీవాస్తవ్.... ఈ ముగ్గురు కళాకారులు వారి కళాత్మక ప్రయాణాలు,సృజనాత్మక ప్రక్రియల గురించి తెలుసుకోవాలంటే బెంగుళూరు ఇంటర్నేషనల్ సెంటర్ ను సందర్శించాలి. సమాజంలో కళాభిమానాన్ని మెరుగుపరచడానికి ఔత్సాహిక కళాకారులకు సలహాలనూ అందిస్తున్నారు. వీరి కళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న సంస్కృతులు ప్రతిబింబిస్తాయి.కళాత్మక ప్రయాణం... మానికా శ్రీవాస్తవ్ ఢిల్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నప్పుడు స్నేహితులు, బంధువుల కోసం ఆర్ట్‌వర్క్‌లను ప్రారంభించింది మానికా శ్రీ వాస్తవ్. ‘పెళ్లయ్యాక కూడా ఈ కళా ప్రయాణం ఏమీ ఆగిపోలేదు. క్లబ్బులు, కాఫీ షాపుల వంటి చోట్ల నా పనితనాన్ని చూపడం మొదలుపెట్టాను. 1990 ప్రారంభంలో ఢిల్లీలో నా మొదటి పెయింటింగ్ ప్రదర్శన జరిగింది. ఎక్కడ ఉన్నా, ప్రయాణాల్లోనూ, నా గది మూలల్లోనూ నా కళకు ఊపిరి΄ోస్తూనే ఉంటాను. ఆ ప్రయత్నం విదేశాల్లోనూ సోలో, గ్రూప్ షోలకు దారితీసింది. హ్యూస్టన్, దుబాయ్, బెంగళూరులోనూ ప్రదర్శనలు ఇచ్చాను. ఇన్నేళ్లలో ఏ రోజూ నా నుంచి సృజనాత్మక పని ఆగలేదు. 30ఏళ్లుగా ఈ పనిని కొనసాగిస్తూనే ఉన్నాను‘ అని గర్వంగా చెబుతుంది శ్రీవాస్తవ్.ప్రత్యేకమైన శైలి.. దిపాలి గుప్తాసింగపూర్లోని ప్రఖ్యాత ఇరానియన్ మాస్టర్ అలీ ఎస్మాయిల్ వద్ద శిక్షణ పొందింది దిపాలి గుప్తా 16 ఏళ్లుగా అక్కడే ఉంది. ‘చాలా ప్రయోగాల తర్వాత, నాదైన ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశాను. ఇది బోల్డ్, అసాధారణమైనది. చాలా వరకు సంప్రదాయ పెయింటింగ్ నియమాలను ఉల్లంఘిస్తారు. నేను కొల్లాజ్ టెక్నిక్‌ని ఇష్టపడతాను. అశాంతిగా ఉండే, చెదిరిన ప్రపంచాన్ని వివరించే వార్తాపత్రికలలోని సారాంశానికి ఒక రూ΄ాన్ని తీసుకువస్తాను. నా పనిలో ఎప్పుడూ ఒక అంతర్లీన సూక్ష్మ సందేశం ఉంటుంది’ అని వివరిస్తారు గుప్తా. కేరళకు చెందిన నీనా జాకబ్ తనను తాను సెమీ–అబ్స్ట్రాక్ట్ ఫిగ్రేటివ్ ఆర్టిస్ట్‌గా అభివర్ణించుకుంటుంది. ‘నా చిత్రణలో చాలా వరకు కాంతి, నీడల దోబూచులాట ఉంటుంది. సామాజిక మార్పుకు నడిపించే కళ అత్యంత శక్తిమంతమైనదని నమ్ముతాను. డ్రాయింగ్, స్కెచింగ్, ఫోటోలు తీయడం, గమనించడం నా పరిశోధనలో ఉంటాయి. ఒక్కోసారి నా కళలో ఎంబ్రాయిడరీని వాడాలనుకుంటాను. అలాంటప్పుడు దారాన్ని ఉపయోగిస్తాను. ప్రేక్షకులు కేవలం అందమైన చిత్రాన్ని ఆరాధించడం మాత్రమే కాదు. కళాకారుడి కథలో నిమగ్నమవ్వాలి. నా కుంచె రంగులను అద్దడానికే కాదు రాయడానికి కూడా ఉపయోగిస్తాను. ధ్యాన పదాలు, కవిత్వం కూడా నా కుంచె రాస్తుంటుంది. ఈ పని ద్వారా ఆధ్యాత్మికతకు చేరువవుతాను. నా సొంత శైలిని అభివృద్ధి చేయడానికి దారితీసే దశలు ఇవి’అని శ్రీవాస్తవ్ జతచేస్తుంది. దేశ, విదేశాల్లో జరిగే ప్రదర్శనలలో వీరి ఆర్ట్ ఫ్రేమ్స్‌కు ధర రూ. 10,000 నుండి లక్షల రూపాయల వరకు పలుకుతాయి. ఆ మొత్తాలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకూ అందజేస్తుంటారు. కళ ద్వారా తమ మహోన్నతమైన మనసునూ చాటుకుంటున్నారు. (చదవండి: అత్యంత అందమైన రహదారి 'రోడ్ టు హెవెన్'..!) -
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్‌సూట్‌లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్‌మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
సప్త మోక్షపురి..మాంగళ్య గౌరికాలయం..
మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది. శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం. ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు. ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు. మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఎలా వెళ్లాలి?గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది. -
వీలునామాను మార్చవచ్చా? ఎన్నిసార్లు మార్చవచ్చు!
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడమీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్‌ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్‌తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
విహంగ విహారం : నైనితాల్ కేబుల్ కారు, బోట్ షికారు!
నైనితాల్... ఎనభైల నాటి సినిమాల్లో చూసిన ప్రదేశం. కథానుగుణంగా కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించేవారు. పాత్రలన్నీ మంకీ క్యాప్, ఉలెన్ స్వెటర్, ఫుల్ షూస్, షాల్‌తో ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పకనే చెప్పే దృశ్యాలుండేవి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది. ఆధ్యాత్మికతకు, అడ్వెంచర్‌కి, ప్రశాంతంగా గడపడానికి, నేచర్‌ను ప్రేమించేవారికి అందరికీ, అన్ని వయసుల వారికీ అనువైన టూరిస్ట్ ప్రదేశం ఇది. అయితే పెద్దవాళ్లు మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లడం బాగుంటుంది. హనీమూన్ కపుల్‌కి ఈ నెల మంచి సమయం. రెండు వేల మీటర్ల ఎత్తులో కుమావ్ పర్వత శ్రేణుల్లో ఉంది నైనితాల్. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన పచ్చని వృక్షాల మధ్య ఓ సరస్సు. పచ్చదనం మధ్యలో ఉండడం వల్లనేమో నీరు కూడా పచ్చలరాశిని తలపిస్తుంది. పౌరాణిక కథల ప్రకారం సతీదేవి కన్ను పడిన ప్రదేశం ఇదని చెబుతారు. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే భీమ్తాల్, సాత్తాల్, నౌకుచియాల్తాల్లకు కూడా పౌరాణిక కథనాలున్నాయి. మనదేశంలో హిల్ స్టేషన్లను ఎక్స్ప్లోర్ చేసింది బ్రిటిషర్లే. చల్లని ప్రదేశాలను వేసవి విడుదులుగా డెవలప్ చేశారు వాళ్లు. దాంతో ఇక్కడ బ్రిటిష్ బంగ్లాల మధ్య విహరిస్తుంటే యూరప్‌ను తలపిస్తుంది. నైనితాల్‌లో బోట్ షికార్‌తో΄పాటు యాచింగ్, పెడలింగ్ చేయవచ్చు. ఇంకా గుడారాల్లో క్యాంపింగ్, పర్వతాల మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్ చేయవచ్చు. ఏ అడ్వెంచర్ చేసినా చేయకపోయినా కేబుల్ కార్ మాత్రం ఎక్కాల్సిందే. కేబుల్ కార్లో వెళ్తూ తెల్లటి మంచు శిఖరాలను పై నుంచి చూడవచ్చు. -
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ ప్రత్యేక డాక్యుమెంటరీ, అక్టోబర్ 20న
అదర్ కోహినూర్స్, రాక్స్ ఆఫ్ హైదరాబాద్ బృందం హైదరాబాద్ హెరిటేజ్ గురించి సరికొత్త డాక్యుమెంటరీని ఆవిష్కరించనుంది. అక్టోబర్ 20న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా దీన్ని లాంచ్ చేయనుంది. హైదరాబాద్ పట్టణ విస్తరణతో కనుమరుగవుతున్న రాళ్లకు (అదర్ కోహినూర్స్) నివాళిగా దీన్ని రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.ఉమా మగల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ 48 నిమిషాల డాక్యుమెంటరీ, హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన ప్రకృతిలో అద్భుతమైన రాళ్లను, వాటి వైభవాన్ని పరిచయం చేయనుంది. నగర గొప్ప సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది. అక్టోబరు 20న సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ "సాంగ్ ఆఫ్ ది కోహినూర్స్"ని ర్యాప్ సాంగ్ ఈ కార్యక్రమం మొదలు కానుంది. డీజే ముర్థోవిక్ స్వరపరిచిన అనుజ్ గుర్వారా అందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనేంది. ఈ పాటను హైదరాబాద్ ప్రేమ గీతం అని పిలుస్తారు. ఈ చిత్రం కేవలం హైదరాబాద్ రాళ్ల డాక్యుమెంటేషన్ కాదు; ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం. నగర ప్రత్యేకమైన సహజ వారసత్వాన్ని జరుపుకోవడానికి ,రక్షించడానికి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలను ఒకచోట చేర్చడం. నగర ప్రకృతి దృశ్యాన్ని గౌరవించే స్థిరమైన పట్టణ అభివృద్ధిపై చర్చ జరగాలని టీం భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అదర్స్కొహినూర్.కామ్ -
హంపి : నాటి వైభవానికి నిలువుటద్దం, ఇవి అస్సలు మిస్ కావద్దు!
రాజులు రాజ్యస్థాపనలో రాజధాని నిర్మాణం ప్రధానమైంది. అయితే రాజులందరూ రాజధాని కోసం కొండలు, గుట్టల బాట పడుతారెందుకో. హంపిని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బీడు భూమి సారవంతమైన పంట నేలగా మారాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే పంట పొలాలను రాజధానిగా మార్చే ప్రయత్నం చేసేవారు కాదు. గట్టి నేల మీద నిర్మాణాలు చేపట్టి శత్రుదుర్భేద్యంగా మలుచుకుంటారు. హంపి కూడా అలాంటిదే.హంపిలోని నిర్మాణాలు 14వ శతాబ్దం నాటివి. ప్రతి కట్టడమూ విధ్వంసానికి గురై ఉండడంతో హంపిని లాస్ట్ సిటీ అంటారు కానీ పర్యాటకుల సంఖ్యను చూస్తే దాని కల్చరల్ గ్లోరీని ఏ మాత్రం లాస్ కాలేదనిపిస్తుంది. పర్వత శ్రేణుల్లో 500కు పైగా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏడాదికి ఏడు లక్షల మంది వస్తారు. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరిపోయింది.కన్నడ గ్రామంలో బస హంపి టూర్లో మిస్ కాకూడనివి... తుంగభద్రానదిలో పడవ ప్రయాణం, పంట పొలాల్లో రాత్రి బస, మోటార్‌బైక్ మీద అచ్చమైన కన్నడ గ్రామాల్లో విహారం, క్లిఫ్ జంపింగ్, విరూపాక్ష ఆలయం, లోటస్ మహల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం. రామాయణకాలంలో కిష్కింద అంటే ఈ ప్రదేశమేనని అశోకుని శిలాశాసనంలో ఉంది. పంపాదేవి తీర్థక్షేత్రంగా దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు వాళ్లకు ఎంత దూరం (348 కి.మీ.లు)లో ఉందో హైదరాబాద్ వాళ్లకీ దాదాపు అంతే దూరం(385 కిమీలు)లో ఉంది. హంపి పర్యాటకులకు హోటళ్లు హోస్పేటలో ఉంటాయి. కన్నడ సంప్రదాయ భోజనం, నివాసాలను ఆస్వాదించాలంటే హంపికి ఉత్తరాన కదిరామ్పురా గ్రామంలో హోమ్స్టేలుంటాయి. హంపిని ఇప్పటికే చూసి ఉంటే... విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకుని పండగ శోభను కొనసాగిస్తూ ఉండే హంపిని మరోసారి చూసిరావచ్చు. ఎంజాయ్మెంట్కి మినిమమ్ గ్యారంటీ. -
సంస్కర్త స్మారకం: అక్షర్ధామ్
అక్షర్ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్‌థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం. ఇది ఎక్కడుంది! గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉంది అక్షర్ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్‌ధామ్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్ధామ్కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్‌బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్‌లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు. ఫొటో పాయింట్ అక్షర్ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు. సావనీర్ షాప్‌లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది. అభిషేకం చేయవచ్చు! అక్షర్‌ధామ్‌లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్‌కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్‌లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్‌ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, పెన్‌డ్రైవ్‌లు, మ్యూజిక్ డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్‌కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం..!
శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.ఆ పేరు ఎలా వచ్చిందంటే..దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు. ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం..."ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
శరన్నవరాత్రులు..తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అలంకారం..!
అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులుమరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.నైవేద్యంగా..వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!
దసరా అనగానే నవరాత్రులు పండుగ హడావిడితో ప్రతి ఇల్లు ఆద్యాత్మకతకు నిలయంగా మారిపోతాయి. రోజుకో అమ్మవారి అలంకారంతో దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడగా..ఇళ్లన్ని అమ్మవారి ఆరాధనతో హోరెత్తిపోతుంటాయి. అయితే చాలామందికి ఈ సమయంలో అలా కాసేపు కొత్త ప్రదేశాలకి వెళ్లి.. అక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రకృతి అద్భుతాలని తిలకించేలా చేసే ఈ కుట్రాలం టూర్‌కి వెళ్లాల్సిందే!.ఇది పర్యాటకులకు జాలువారే జలపాతాల అందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే ఈ గొప్ప పర్యాటక ప్రదేశం విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కుట్రాలం లేదా కుట్రాళం అద్భుతమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా "స్పా ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుస్తారు. ఈ ప్రాంతం జలపాతాల హోరు తోపాటు అక్కడ కొలువై ఉన్న కుట్రాల నాదర్ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నటరాజు అవతారమైన పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.ఈ కుర్తాలంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణ కథనం. ఇక ఈ ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం శిల్ప సంపద చూపురులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ కుట్రాల లేదా కుర్తాల నాదర్‌గా పిలవబడుతున్న పరమేశ్వరుడి తోపాటు అమ్మవారు వేణువాగ్వాదినీ దేవిగా పూజలందుకుంటోంది. ఆ అమ్మవారి తోపాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరాశక్తి అమ్మవారి పీఠం 51 శక్తి పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలిసినప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే నిర్వహించడం విశేషం.కుట్రాలంలో కొలువైన జలపాతాలు..పేరరువి జలపాతం (పేరరువి)ఎత్తు: సుమారు 60 మీటర్లు.కుత్రాలంలో అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద జలపాతం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.చిత్తరువి జలపాతం ఎత్తు: పేరరువితో పోలిస్తే చిన్నది.పేరరువి జలపాతానికి దగ్గరగా ఉంది, త్వరగా స్నానం చేయడానికి అనువైనది.ఐదు జలపాతాలు (ఐంతరువి)విశేషం: నీరు ఐదు పాయలుగా విడిపోయి జాలువారుతుంది. టైగర్ ఫాల్స్ (పులియరువి)అత్యంత చిన్న జలపాతం కావడం వల్ల పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనది. పాత కుర్తాళం జలపాతం (పజయ కుర్తాళం)ప్రధాన జలపాతం నుంచి సుమారు 8 కి.మీ.చుట్టూ పచ్చని చెట్లతో, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తోంది.షెన్బాగా జలపాతం (శెనబగాదేవి జలపాతం)చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ అవసరం. సమీపంలోని దేవాలయం ప్రత్యేక ఆకర్షణ.హనీ ఫాల్స్ (తేనరువి)మూడు వైపుల నుంచి నీటి ప్రవాహంతో చూడచక్కగా ఉంటుంది.కొత్త జలపాతం (పుత్తు అరువి)తక్కువ రద్దీ, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తోంది.ఫ్రూట్ గార్డెన్ ఫాల్స్ (పజతోట్ట అరువి)పండ్ల తోటలో ఉంది, జలపాతం123 కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను అందిస్తుంది.ఇక ఈ జలపాతాలన్నీ చిత్తార్, మణిముత్తారు, పచైయార్ మరియు తామిరబరణి వంటి నదుల ద్వారా ప్రవహిస్తాయి. ఇవి ఏడాది పొడవునా స్థిరమైన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఎలా చేరుకోవాలంటే..తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!
దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..కాళీ ఘాట్ పేరు... కోల్కతామామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.ముంబయి – ముంబాదేవిముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.శ్యామలా దేవి పేరే సిమ్లాకుసిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.చండీ మందిర్...చండీగఢ్చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.మంగళూరు... మంగళాదేవికర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.పటన్ దేవి పేరుతో పట్నాపట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.నైనాదేవి పేరుతో నైనితాల్ నగరందక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.మరికొన్ని ప్రదేశాలుత్రిపుర – త్రిపుర సుందరి మైసూరు – మహిషాసుర మర్దిని కన్యాకుమారి – కన్యాకుమారి దేవి తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)– డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..
ఇవాళ సద్దుల బతుకమ్మ. తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్ఠతను వివరిస్తున్నారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు శ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే. అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్రీయే. భాషని సాహిత్యీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు. ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లల్లో కలగలసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే. పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితి. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్టమెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం. కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి. బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్ర్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకు΄ోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి. ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు. తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని ‘బంగారం’ అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారుచేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు. తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణ లో దసరా అతి పెద్ద పండగ. ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ. (చదవండి: పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ) -
పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి..తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మని కొలుస్తారు. ఈ రోజు అత్యంత పెద్దదిగా బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో సందడి చేస్తారు. ఈ చివరి రోజు వేడుకను ఊరు, వాడ దద్దరిల్లేలా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే, అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.ఈరోజు బతుకమ్మను నిమజ్జంన చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
శరన్నవరాత్రులు..ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారం
దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలినైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!
‘‘ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు దుర్గాదేవి పట్ల భక్తితో వివిధ మార్గాల్లో కలిసి మెలిసి పూజలు జరుపుకుంటున్నారు. ఈ సంతోషంతో ఆమె దయకు పరవశుడనై రాసిన ‘ఆవతికలాయ్’ అనే గర్బా గేయాన్ని ఇక్కడ ఉంచాను. ఆమె ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాయని పూర్వామంత్రి పాడిన ఈ గేయం గర్బా నృత్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేలా చేయడంతోపాటు ప్రతి మదిని ఆధ్యాత్మిక సౌరభమై తాకుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. గర్బా నృత్యం అనగానే సంప్రదాయదుస్తులు ధరించిన సమూహాలు, ఆనందంగా నృత్యం చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందు మెదలుతాయి. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చిల్లులు గల మట్టి కుండలో దీపం వెలిగించి, తలపైన పెట్టుకుని అమ్మవారి విగ్రహం చుట్టూ వలయాకారంగా తిరుగుతూ భక్తి పారవశ్యంలో నృత్యం చేస్తారు. మట్టికుండ తల్లి గర్భాన్ని, జ్యోతి నుండి వెలువడే కాంతి లోపల పెరుగుతున్న కొత్త జీవిని సూచిస్తుంది. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను ఈ నృత్యం ద్వారా తెలియజేస్తారు. మనలో ఉన్న అన్ని చెడులను నాశనం చేయడానికి, లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే విధానంగా కూడా గర్బా నృత్యాన్ని చెబుతారు. గర్బా నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ. ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్బాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు.కాలచక్రం .. పునరావృతందేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకునే ఈ నృత్యాన్ని స్త్రీ–పురుషులు ఇద్దరూ తొమ్మిది రాత్రులు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజులూ కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు పాటిస్తారు. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్ని అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. జీవన చక్రం దాని చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక.మహిషుని అంతం చేసిన మహిళా శక్తిఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించకుండా ఉండాలన్న వరబలంతో మహిషాసురుడు తన శక్తులను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతడి దాడికి దేవతలు నిస్సహాయలైపోయారు. దుర్గాదేవి వద్దకు వెళ్లి, వేడుకున్నారు. దుర్గాదేవి ఒక్క కంటిచూపుతో ఆ రాక్షసుని అంతం చేయగలదు. కానీ, అసుర సంహారానికి ముందు తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగిన సర్వోన్నతమైన యుద్ధం ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అసాంఘిక, అధార్మిక శక్తులు ఎంత బలంగా కనిపించినా, యుద్ధం ఎంతకాలం సాగినా, చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాన్ని గర్బా నృత్యం ద్వారా ప్రదర్శించడం అంతర్లీనంగా కనిపిస్తుంది.బేతే గర్బాగుజరాత్లోని నాగర్ కమ్యూనిటీ ‘బేతే గర్బా’ అంటే కూర్చున్న గర్బా అని జరుపుకుంటారు. ఇక్కడ, భక్తులు ఒకరి ఇంటి వద్ద గుమిగూడి, గర్బా పాటలు పాడతారు. హిందువులు తమ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిజాం నిషేధించినప్పుడు, ఇస్లామిక్ పాలనలో జునాగఢ్ లో బేతే గర్బా ప్రారంభమైంది. చాలామంది కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా మారి΄ోతారు. ఉత్తర భారతదేశంలో గర్బాలో భక్తులు తబలా, మంజీరను ఉపయోగిస్తారు.సంప్రదాయ దుస్తులతో...ఈ నృత్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. దాండియాలో కోలాటం కర్రలను ఉపయోగిస్తారు. గర్బా పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఉంటాయి.పాదరక్షలు లేకుండా..గర్బా దైవారాధనా రీతుల్లో చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.గర్బా.. యునెస్కోనవరాత్రి ఉత్సవాలను గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. మన దేశానికే ప్రత్యేకమైన ఈ ప్రముఖ నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్) జాబితాలో కిందటేడాది చేర్చింది. అమ్మవారి ఎదుట భక్తిని నృత్య రూపంలో చాటే ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే అనడానికి ప్రతీకగా నిలుస్తోంది గర్బా.(చదవండి: ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..! ) -
పూల పండుగ..ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై..అప్పుడే ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఇక ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.ప్రత్యేకత..ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు అంటే..బియ్యపిండి, వెన్నతో చేసిన ముద్దలను డీప్ ఫ్రేచేసి చివరగా పానకంలో వేసి..నైవేద్యంగా సమర్పిస్తారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..!
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారునైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలిమరోవైపు నవ దుర్గాలను పూజించే సంప్రదాయం ప్రకారం. ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు."ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"ఎవరైనా శని దోషం వల్ల రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.కాలరాత్రి మంత్రంఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.నైవేద్యం: గారెలు, కిచిడి(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
దుర్గాపూజ: ఈ క్రెడిట్ ‘నేతాజీ’కే దక్కుతుంది..!
కోల్‌కతాలో దుర్గాపూజ వేడుకలు ఎంత ఆర్భాటంగా ఘనంగా జరుగుతాయో తెలిసిందే. అంతేగాదు అక్కడ చేసే దుర్గా వేడుకలు యునెస్కో గుర్తింపును కూడా అందుకున్నాయి. అంతలా చరిత్రలో పేరుగాంచడానికి కారణం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. ఆయన విశాల దృక్పథం సరొకొత్త పూజా ఆవిష్కరణకు నాంది పలికింది. దేశభక్తిని పెంపొందించే వేదికలా.. బహింరంగంగా అంతా కలిసి చేసుకునే వేడుకగా మలిచారు. అలా కోల్‌కతాలో ఈ వేడుకలు బహిరంగంగా పెద్ద కోలాహలంగా జరగడం ప్రారంభమయ్యింది. సామాన్యుడు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవాలనే సంకల్పం నెరవేరేలా మార్పులు తీసుకొచ్చారు. నవరాత్రుల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో జరిగే దుర్గాపూజ వేడుకను ఎలా మార్చారు..? అంతలా గుర్తింపు వచ్చేందుకు కారణమైనవి ఏంటి?..తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలు మొదట్లో జమిందార్లు నిర్వహించేవారు. ఆ తర్వాత 1610లో బరిషాకు చెందిన సవర్ణ చౌదరి కుటుంబం చేసే వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలన్నీ ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే నేతాజీ స్వాతంత్ర్యం కోసం రకరకాల ప్రణాళికతో ముందుకు పోతున్న ఆయనకు ఈ వేడుక ఎంతాగానో ఆకర్షించింది. ఈ వేడుకును అందర్ని కలుపుకునే నిర్వహించి దీంతో స్వాతంత్ర సమరయోధులను సంఘాన్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఆ క్రమంలో నేతాజి 'సర్బోజోనిస్' అనే పేరుతో 10 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆయనే ఆ కమిటీ ఆధ్యక్షుడిగా ఉండి ఈ పండుగ జయప్రదమయ్యేలా ముందుండి నడిపించారు. ఇక్కడ సర్బోజోనిన్ అంటే సమాజంలోని అందరి పండుగ అని అర్థం. బెంగాల్ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఇప్పటికి కొనసాగడం విశేషం. ఖైదీలు పూజించే హక్కు..1920లో బోస్ మాండలే జైలులో ఉన్నప్పుడు తన రాజకీయ గురువు బసంతీ దేవికి దుర్గాపూజ గురించి వివరిస్తూ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఒకసారి వచ్చే ఈ నవరాత్రుల పండుగలో జైలులో ఉన్న తన బిడ్డల సందర్శించి వారి బాధలను తొలగిస్తుంది. అందువల్ల తాము కూడా పూజించుకునే హక్కు ఉందంటూ ఓ నినాదం లేవనెత్తారు నేతాజీ. ఆ కాలంలో క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం తరుపున రూ. 1200 గ్రాంట్ వచ్చేది. అలానే మాకు కూడా కావలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ వంతుగా రూ. 140లు, ప్రభుత్వం తరుఫు నుంచి రూ. 660లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఖైదీల జీతం నుంచే మినహించమని బ్రిటిష్ అధికారులు ఆదేశించడం నచ్చక నేతాజీ బర్మాలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం పంపారు. అయితే అది కూడా తిరస్కరింపబడింది. దీంతో ఆయన ఖైదీలకూ కూడా తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు ఉందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే సరస్వతి పూజకు అదనంగా రూ. 60 ఇవ్వాలిన డిమాండ్ చేశారు. ఈ ఘటన దావనంలా వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఖైదీలు ఒక్కొక్కరికి పూజ నిమిత్తం రూ. 30 మంజూరు చేసింది. ఇది తక్కువ మొత్తమే అయినా ఖైదీల హక్కులను హైలెట్ చేసింది. పూజా సంప్రదాయంలో మార్పులు..ఎచ్చల విగ్రహ సంప్రదాయంలో దుర్గా దేవత ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఒకే పైకప్పుకింద పూజించటం అని చెప్పొచ్చు. దుర్గమ్మ ఆమె పిల్లలు అంతా ఒకే వేదికపై పూజలు చేసుకునేలా చేయడం. అలాగే విగ్రహా తయారీ సంప్రదాయ పద్ధతిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. దుర్గమ్మ ఆమె పిల్లిలిద్దర్ని వేర్వేరు ఫ్రేమ్‌లలో తయారు చేయమని కళాకారులను కోరారు. దీని వల్ల సమయం ఆదా కావడమే గాక, ఏకకాలంలో వివిధ విగ్రహాలు రూపుదిద్దుకునే వెసులబాటు ఏర్పడింది. ఈ పండుగతో చిన్నా చితక పనులు చేసుకునే వారందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేలా ఈ పూజలో అందరూ భాగమయ్యేలా చేశారు. అట్టడుగు, ధనిక వర్గం అనేది దేవుడి సమక్షంలో ఉండదనే గొప్ప విషయాన్ని నేతాజీ ఆనాడే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసి, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగేలా చేశారు. యావత్తు ప్రపంచం కోల్‌కతా దుర్గా పూజ సంపద్రాయానికి ఫిదా అయ్యి నమస్కరించేలా చేశారు. (చదవండి: కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..)