-
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తగువులు వద్దన్నందుకు తమ్ముడినే చంపేశాడు..
రుద్రవరం: చిన్న చిన్న విషయాలకు ఇతరులతో గొడవపడొద్దని సూచించిన తమ్ముడిని.. అన్న కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెలో జరిగింది. శిరివెళ్ల సీఐ వంశీధర్, ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన వివరాలు.. బి.నాగిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తుండగా పెద్ద ఓబులేసు అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. దాడి విషయం తెలుసుకున్న ఓబులేసు కుటుంబ సభ్యులు.. నువ్వు మద్యం మత్తులో రోజూ ఏదో ఒక సమస్య తెస్తున్నావు.. పద్ధతి మార్చుకోవాలి.. అని చెప్పారు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఓబులేసు.. కత్తితో తమ్ముడు కర్రెన్న అలియాస్ ఇసాక్(40)ను పొడిచాడు. అడ్డు వచ్చిన తండ్రిపైనా దాడి చేశాడు. క్షతగాత్రులిద్దరినీ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. శుక్రవారం తెల్లవారు జామున ఇసాక్ మృతి చెందాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌చేశారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
AP: తెలంగాణ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్యాంకర్
సాక్షి,అనంతపురం:బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును గురువారం(అక్టోబర్11) అర్ధరాత్రి అనంతపురంజిల్లా గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలో ట్యాంకరు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ట్యాంకరు డ్రైవరుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హైవే పెట్రోలింగ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. జాతీయ రహదారి44పై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ టీతో నష్టాలే -
చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్‌లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేష్చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్‌లలో మేనేజర్‌గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణ హత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణ హత్య జరిగింది. విధుల్లో ఉన్న లోకో పైలట్‌ను ఓ ఆగంతకుడు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. షంటింగ్ లోకో పైలట్‌గా పని చేస్తున్న డి.ఎబినేజర్ (52) గురువారం తెల్లవారుజామున విధుల్లో భాగంగా నైజాంగేటు సమీపంలోని ఏటీఎల్‌సీ కార్యాలయం నుంచి ఎఫ్–క్యాబిన్ వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. రాడ్‌తో పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలైన ఎబినేజర్ అపస్మారక స్ధితిలో రైలు ట్రాక్‌పై పడిపోయాడు. దూరం నుంచి దీనిని గమనించిన మరో లోకో పైలట్ వృధ్వీరాజ్ పరుగున అక్కడికి వచ్చారు. సమీపంలో ఉన్న వారితో కలిసి ఎబినేజర్‌ను రైల్వే హాస్పటల్‌కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఒక ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదు బృందాలతో నిందితుని కోసం గాలింపు చర్యలు చేçపట్టారు. రైల్వే స్టేషన్ పరిసరాలలోని సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తే నైజాంగేటు సెంటర్లో ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తిపై కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను గంజాయి మత్తులో ఈ దాడులకు పాల్పడుతుండవచ్చని చెబుతున్నారు. -
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
మరణంలోనూ వీడని బంధం
మధురానగర్ (విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందటంతో తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా విజయవాడ అయోధ్యనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించటంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్‌కు చెందిన రాచపూడి నాగరాజు(27) ప్రసాదంపాడులోని ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు సోమవారం సాయంత్రం 6 గంటలకు పని కోసం ద్విచక్ర వాహనంపై ప్రసాదంపాడుకు వెళ్లారు. పని ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా బీఆరీ్టఎస్ రోడ్డు భానూనగర్ జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసి నాగరాజు భార్య ఉష(20) కుటుంబ సభ్యులతో ఘటనాస్థలికి చేరుకున్నారు. నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు విగతజీవిగా పడి ఉండటం చూసి ఉష చలించిపోయారు. స్థానికంగా విషాదఛాయలు అనంతరం గుణదల పోలీస్‌స్టేషన్‌లో ఉష ఫిర్యాదు చేసి, ఆమె తల్లి చల్లా ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాము ఉండే ఇంటికి వెళ్లిన ఉష తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆదిలక్ష్మి వెళ్లి చూడగా ఉష ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే భార్య కూడా మరణించడం దంపతుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుందని స్థానికులు తెలిపారు. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు గంటల వ్యవధిలోనే మృతి చెందటంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. దంపతుల మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గుణదల, అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
విజ్ఞాన యాత్రలో విషాదం
విజయవాడ స్పోర్ట్స్/సాక్షి, అమరావతి: బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు చేపట్టిన విజ్ఞాన యాత్రలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు కావడంతో ఈ నెల 2న 80 మంది న్యాయవాదులు విజయవాడ నుంచి 2 బస్సుల్లో యాత్రకు బయలుదేరారు. ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు న్యాయస్థానాలు, విజ్ఞాన ప్రాంతాలను చూసుకుంటూ ఈ నెల 6న రాజస్థాన్ చేరుకున్నారు. 7న రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జైపూర్ వస్తుండగా మార్గ మధ్యలోని జో«ధ్‌పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు బీబీఏ కార్యదర్శి అరిగల శివరామప్రసాద్ (రాజా), న్యాయవాదులు పద్మజ, అరుణదేవి, నాగరాజు, గంగాభవాని, జయలక్ష్మీ, సత్యవాణి, శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్‌తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు జ్యోత్స్న విద్యార్ధి ఉద్యమ కార్యకర్తగా పనిచేశారు. నేటి తరుణీతరంగాలు, సేఫ్ లను స్థాపించడంతో కీలకభూమిక పోషించారు. జ్యోత్స్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని విమానంలో బుధవారం విజయవాడ తీసుకువచ్చేందుకు న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు. క్షతగాత్రులైన వారు సైతం విమానంలో విజయవాడ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, విమానం టికెట్లు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీబీఏ కార్యదర్శి రాజా తెలిపారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు. రాజస్థాన్ సీఎం బజన్ లాల్ శర్మతో ఫోన్లో మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. -
చెవి కొరికిన కోడలు.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన అత్త
సాక్షి,గుంటూరు:అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో మంగళవారం(అక్టోబర్8)జరిగింది.కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త నాగమణి,కోడలు పావని మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలోనే అత్త చెవిని కోడలు పావని కొరికింది. బలంగా కొరకడంతో అత్త చెవిలోని ఒక ముక్క ఊడిపడింది.ఊడిపడిన చెవి ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వచ్చింది.చెవి ముక్క తెగిపోయి సమయం ఎక్కువవడంతో తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. ఇదీ చదవండి: ధర్మవరం సీఐ కిడ్నాప్ ఆపై హత్య -
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్‌ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్‌తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్‌లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్‌కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్‌కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్‌ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్‌పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్‌ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
పుంగనూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు చెప్పారు. ఆయన ఆదివారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో ఉన్న అజు్మతుల్ల కుమారై అశ్వియఅంజుమ్ గత నెల 29న రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ అదృశ్యమైందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి.. 12 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా, ఈ నెల 2న బాలిక పట్టణ సమీపంలోని ఎన్‌ఎస్‌పేట సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో శవమై దొరికిందని తెలిపారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించగా.. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు, ఆహారం ఉండటాన్ని గమనించి ఆ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. బాలిక తండ్రి అజు్మతుల్ల ఒక మహిళకు రూ.3.5 లక్షలు అప్పు ఇచ్చినట్లు, ఆ అప్పు కోసం ఆ మహిళను వేధించడం, కోర్టుకీడుస్తానంటూ బెదిరించడంతో ఆ మహిళ విసుగు చెంది ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు.ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బురఖా వేసుకుని ఆ మహిళ వచ్చి.. చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిందని ఎస్పీ తెలిపారు. తన కుమారైతో కలిసి చిన్నారికి ఇంట్లో అన్నం పెట్టిందని, అనంతరం ఆ చిన్నారిని నోరు, ముక్కు మూసిపెట్టి హత్య చేసినట్టు ఎస్పీ చెప్పారు. అదే సమయంలో తమకు సమీప బంధువైన ఓ బాలుడిని ఇంటి ముందు కాపాలాగా పెట్టినట్టు తెలిపారు. బాలుడి సూచన మేరకు.. తర్వాత బాలుడి సూచన మేరకు చిన్నారి శవాన్ని బైక్‌పై సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని బాలుడు స్వయంగా అంగీకరించగా.. ముగ్గురినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపిస్తున్నట్టు వెల్లడించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. సమావేశంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, ఎస్బీ సీఐ భాస్కర్, డాక్టర్ మధుసూదనచారి పాల్గొన్నారు. మీడియాపై కలెక్టర్ మండిపాటు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ మీడియా తమ ఇష్టానుసారం వార్తలు రాస్తోందని, సోషల్ మీడియాలోనూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలిక పేర్లను, వారి వివరాలను ఎలా మీడియాలో వేస్తారని విలేకరులను ప్రశి్నంచారు. -
వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య
రేపల్లె రూరల్/నగరం: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా అయిన రేపల్లె నియోజకవర్గం.. నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నున్నా భూషయ్య (47)పై అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన భూషయ్య మృతిచెందాడు. దాసరిపాలేనికి చెందిన భూషయ్యను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డ్రింక్ తాగుదామంటూ నిజాంపట్నం ఆముదాలపల్లి పంట పొలాల సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. వీరి కదలికలు గమనించిన దాసరిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మంత్రి అనగాని ప్రధాన అనుచరులు నున్నా బాలశంకర్, నున్నా మణికంఠలతో పాటు మరికొందరు సరివిబాదులతో భూషయ్యపై ఒక్కసారిగా దాడిచేశారు. తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భూషయ్యను రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భూషయ్యకు భార్య వెంకట లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాసరిపాలేనికి చెందిన నున్నా భూషయ్య గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటాడు. భూషయ్యను హతమార్చితే గ్రామంలో టీడీపీకి తిరుగులేదని భావించిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పథకం ప్రకారం హత్యకు పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.కాగా, భూషయ్య హత్యను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించి కేసు నీరుగార్చేందుకు పోలీసులు పడరానిపాట్లు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిడితో కేసు నీరుగార్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా ఆగడాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ధనవంతులను తన అందంతో ట్రాప్ చేస్తున్న మాయా లేడీ.. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం భారత్‌కి రప్పిస్తోంది. విచారణలో పోలీసులే షాకయ్యే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.మంచి అమ్మాయిగా నటించి...విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.ఇంటికి రప్పించి.. నగ్నంగా ఫోటోలు తీసి..ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్‌ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్‌ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్‌ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్‌ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది. రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస స్పందన లేని చంద్రబాబు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్‌ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేశారు. అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్‌ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
ప్రొద్దుటూరులో ప్రాణం తీసిన రూ.150 అప్పు
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రొద్దుటూరు గ్రామంలో దారుణం జరిగింది. రూ.150 రూపాయల అప్పు ప్రాణాలు తీసింది. వెంకటస్వామి వద్ద భుజంగరావు అనే వ్యక్తి 150 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా భుజంగరావు కుప్పకూలిపోయారు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్‌నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్‌మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
కాకినాడలో హృదయ విదారకం.. ఆడపిల్ల పుట్టిందని గోడకేసి..
సాక్షి, కాకినాడ: ఆడపిల్లగా జన్మించడమే ఆ శిశువుపాలిట మరణ శాసనమైంది. ఆడిపిల్ల భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కేతా శివమణి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం బాబు జన్మించాడు. అనంతరం, ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మేశాడు. ఇక, 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరింది అని బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో, కంగుతిన్న భవానీ.. శివమణి తీరును తప్పుబట్టింది. బిడ్డను అమ్మేందుకు భవానీ అంగీకరించను అంటూ తెగేసి చెప్పింది.ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి.. బిడ్డ గొంతు నులిమి గోడకు కొట్టాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్‌టౌన్ పోలీసులు సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివమణి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: జత్వానీ ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి -
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్‌గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్‌తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.