పెద్దతిప్పసముద్రం, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ప్రకటించి, పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలిసి మండలానికి చెందిన ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం సోమవారం వెలుగులోకొచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని కాట్నగల్లుకు చెందిన వెంకట్రమణ (35) ఐరన్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతంలో కొద్ది రోజులు హైదరాబాదులో ఉంటూ ఇదే వృత్తి చేసేవాడు. రెండేళ్ల క్రితం బెంగళూరులోని బైర్‌సంద్రానికి కాపురం మార్చాడు. అక్కడ కష్టానికి తగిన ఫలితం లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాలని అనుకున్నాడు.
రాష్ట్ర విభజన సందర్భంగా జరుగుతున్న పరిణామాలను చూసి చలించిపోయాడు. హైదరాబాదుకు వెళితే బతకనీయరేమోనని మనస్తాపానికి గురయ్యాడు. బెంగళూరులో ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. బైర్‌సంద్రం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. సోమవారం సాయంత్రం మండలంలోని కాట్నగల్లులో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రెడ్డెమ్మ, పిల్లలు శరత్, గణేష్ ఉన్నారు. ఇదే మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన అల్లాపల్లి రవికుమార్, తలారి కిట్టన్న సమైక్యాంధ్ర కోసం మృతి చెందిన విషయం తెలిసిందే.