నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు(ఇన్‌సెట్) మృతురాలి భర్త, న్యాయవాది జితేంద్ర
మదనపల్లె క్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్య కేసు మిస్టరీని టూటౌన్ పోలీసులు ఎట్టికేలకు ఛేదించారు. పేరుపొందిన న్యాయవాది అయిన భర్తే యుముడై ఆమె ప్రాణాలు హరించాడని పోలీసులు తేల్చా రు. తనకు తలవంపులు తెస్తోందన్న కారణమే ఈ హత్యకు దారి తీసిందని విచారణలో గుర్తించారు. సంఘంలో తనను తలెత్తుకు తిరగనీయకుండా భార్య చేస్తుండడంతో ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించు కోవాలని కిరాయి హంతకులతో అతి దారుణంగా భర్త చంపించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సూత్రధారి అయిన న్యాయవాది జితేంద్రను ఇది వరకే పోలీసులు అదుపులోకి తీసుకోగా.., హత్యలో పాల్గొన్న మరో ఆరుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి వివరాలను డీఎస్పీ ఎం. చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్ మంగళవారం విలేకర్లకు తెలియజేశారు.
వివరాలు ఇలా..
మదనపల్లె పట్టణం ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది కె. జితేంద్ర(48)తో అమ్మినేనివీధికి చెందిన నాగజ్యోతికి 23 ఏళ్లక్రితం వివాహం అయిందన్నారు. కొంత కాలనికి వీరి మధ్య కలహాలు ఏర్పడ్డాయని. అవి తారస్థాయికిచేరి విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారన్నారు. ఈ క్రమంలో తారసపడినప్పుడల్లా నాగజ్యోతి భర్త జితేంద్రతో దూషణకు పాల్పడేదన్నారు. బంధువులు, స్నేహితుల మధ్య కూడా కించపరచడంతో పాటు తనకు తలవంపులు తెచ్చిందని భర్త తీవ్ర మనస్థాపం చెందాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టి భర్తను అవమాన పరిచిందన్నారు. అంతే కాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదేకోర్టులో ఎదురుపడుతూ ఉండడం వల్ల ఆగ్రహంతో ఆయన భార్యను అంత మొందించాలని ప్రణాళిక రూపొందించారన్నారు. గతంలో ఒక కేసులో జితేంద్రను ఆశ్రయించిన ముద్దాయిల్లో కొందర్ని ప్రలోభపరిచి నాగజ్యోతి హత్యకు పథకం రచించాడని తెలిపారు.
హత్యకు పథకం ఇలా..
బి.కొత్తకోట మండలానికి చెందిన మహేష్ అలియాస్ వెంకటేష్‌తో పాటు మరికొంత మంది సాయంతో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. ఆమె ఇంటి నుంచి కోర్టుకు వచ్చే సమయంలో కోర్టులో గంగమ్మగుడి సందులో హత్య చేయలని నిర్ధారించుకున్నారన్నారు. అయితే ఆమె కోర్టుకు ఆ దారిలో రాకపోడంతో మరో నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించి కాపుకాసి గత నెల 30న హత్య చేశారన్నారు. కాగా సోమవారం స్థానిక అమ్మ చెరువు మిట్ట చేనేతనగర్ వద్ద హత్యలో పాల్గొన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారమన్నారు. వీరిలో బి. కొత్తకోట బందార్ల పల్లె వెంకటేష్ అలియాస్ మహేష్(28) ఉన్నాడు. ఇతడు 2017లో కురబలకోట మండలం మిట్టపల్లె వద్ద జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు. అలాగే పీలేరు మండలం జాండ్లకు చెందిన నెల్లూరి హేమంత్(22), మూడే శేఖర్ నాయక్(23), పులిచర్ల మండలం కల్లూరుకు చెందిన మూర్తూరు షేక్ హుసేన్ అలియాస్ సద్దాం (22), షేక్ అస్లాం బాషా(25), దూదేకుల తన్వీర్(20) ఉన్నారు. కాగా మహిళా న్యాయవాది హత్యకేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ కృష్ణయ్య, నాగేశ్వరరావుతో పాటు ప్రత్యేక బృందాలను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment