బాల మురుగన్
రాష్ట్ర పోలీసు శాఖలో పనిభారం పెరిగిందనే విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాకు తగ్గట్టుఆ శాఖలో భర్తీలు సాగలేదు. పని భారంతో మానసిక ఒత్తిళ్లకు లోనైన సిబ్బందిఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతున్నారు. గత నెల రోజుల్లో పదిమంది వరకు విగత జీవులయ్యారు. దివంగత సీఎం అమ్మ జయలలిత సమాధి సాక్షిగా చెన్నై సాయుధ బలగానికి చెందిన కానిస్టేబుల్ అరుణ్ రాజ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ ఘటన మరువక ముందే ఐనావరం స్టేషన్లోనే సబ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌కుమార్ తుపాకీతో కాల్చుకున్నాడు. అలాగే, ఇద్దరు ముగ్గురు విధుల్లోనూ గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు, ముగ్గురు బలవన్మరణానికి పాల్పడగా, మరెందరో రాజీనామాలు, సెలవులపై వెళ్తున్నారు. దీంతో పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించే రీతిలో ప్రత్యేకంగా యోగా క్లాసులు సాగుతున్నా, పనిభారంతో ఒత్తిడి మాత్రం మరింతగా పెరుగుతోంది.ఇందుకు అద్దం పట్టే రీతిలో పనిభారం, మానసిక ఒత్తిడితో 28 ఏళ్ల బాలమురుగన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాక్షి, చెన్నై : పని భారానికి మరో కానిస్టేబుల్ బలయ్యాడు. సాయుధ బలగానికి చెందిన బాలమురుగన్ (28) ఉరిపోసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనయుడి మరణంతో తల్లిదండ్రులు తీవ్ర మనో వేదనలో మునిగారు.ఈంజంబాక్కం పొదుగై వీధికి చెందిన జయరాఘవన్, కాళికాంబాల్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు బాల మురుగన్ 2013లో పోలీసు శాఖలో చేరి సాయుధబలగాల విభాగంలో కానిస్టేబుల్ అయ్యాడు. నాలుగేళ్లు సజావుగా ఉద్యోగం సాగినా, నాలుగు నెలల నుంచి ఉన్నతాధికారుల వేధింపులకు బాల మురుగన్ లోనైనట్టు సమాచారం. ప్రస్తుతం కేకేనగర్‌లోని పోలీసు శిక్షణ కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధుల్ని నిర్వర్తిస్తున్నాడు.
నాలుగు నెలలుగా సెలవులు కరువు, పనిభారం పెరగడంతో బాలమురుగన్ మానసికంగా కుంగిపోయాడు. తన తండ్రి వద్ద పదేపదే తనకు ఈ ఉద్యోగం వద్దే వద్దు అని మారంచేసి ఉన్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ముందస్తుగా ఎలాంటి సమాచారంఇవ్వకుండా బాలమురుగన్ సెలవు పెట్టాడు. దీంతో శనివారం రాత్రి ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పలేదు. దీంతో ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకే లేచి విధులకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాల మురుగన్, అధికారులు వేధిస్తున్నారని, పని భారం మరింతగా పెరుగుతోందని తండ్రి వద్ద కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో కుమారుడికి జయరాఘవన్ నచ్చజెప్పాడు. సోమవారం ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచిన బాలమురుగన్ బాత్రూంకు వెళ్లాడు. ఎంతకూ బయటకురాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టారు. లోపల ఉరిపోసుకుని వేలాడుతున్న బాల మురుగన్ చూసి ఆందోళనకు లోనయ్యాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని, కిందకు దించగా, అప్పటికే బాలమురుగన్ మరణించాడు. సమాచారం అందుకున్న నీలాంకరై పోలీసులు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయామని జయరాఘవన్, కాళికాంబాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసు శాఖలో పనిభారం, అధికారుల ఒత్తిళ్లు తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment