గుంటూరు, యడ్లపాడు: వెండి పట్టీల కారణంగా దంపతుల మధ్య జరిగిన గొడవతో భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిమ్మాపురంలో సోమవారం చోటుచేసుకుంది. యడ్లపాడు ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపురం ఎస్సీకాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వడ్డిముక్కల జవహర్‌బాబుకు బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన మల్లాబత్తుని నాగమణి (24)తో ఐదేళ్ల కిందట వివాహమైందన్నారు.
నాగమణి భర్తకు చెప్పకుండా కొత్త పట్టీలను కొనుగోలు చేసింది. ఆదివారం రాత్రి పట్టీలను జవహర్‌బాబు చూడడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త నాగమణిని కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన నాగమణి సోమవారం ఉదయం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. నాగమణి తల్లి అచ్చిమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment