చార్లెస్ ప్రదీప్ ఇల్లు,గంజాయి మొక్కలు,అరెస్టయిన చార్లెస్ ప్రదీప్
టీ.నగర్ : చెన్నైలో ఇంటి మిద్దెపై గంజాయి పెంచుతున్న ఇంజినీరును మంగళవారం పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై కేకేనగర్ ఒకటవ సెక్టార్ ఏడవ వీధికి చెందిన చార్లెస్ ప్రదీప్ మెకానికల్ ఇంజినీరుగా ఉన్నారు. ఈయన తన ఇంటి మిద్దెపై తోటను ఏర్పాటుచేసి కొన్ని మూలిక మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలతోపాటు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు కేకేనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ తంగరాజ్, ఇతర పోలీసులు మంగళవారం అక్కడికి వెళ్లి తనిఖీలు జరిపారు.
ఆ సమయంలో మూలికా మొక్కలతోపాటు నాలుగన్నర అడుగుల ఎత్తుగల ఏడు గంజాయి చెట్లను పెంచుతున్నట్లు తెలిసింది. దీంతో చార్లెస్ ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను, అక్కడున్న కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిగురించి చార్లెస్ ప్రదీప్ పోలీసులతో మాట్లాడుతూ తాను గంజాయి ఉపయోగిస్తూ దానికి బానిసయ్యానని, దీంతో ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచి వాడేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పరిశోధనల కోసం మూలికా మొక్కలను పెంచుతున్నట్లు తెలిపానని, ఈ మొక్కల మధ్య గంజాయి మొక్కలను పెంచినట్లు పేర్కొన్నారు. గంజాయిని ఆమ్లెట్, భోజనంతో కలిసి ఆరగిస్తానన్నారు. చార్లెస్ ప్రదీప్‌కు గంజాయి మొక్కలు ఎలా లభించాయి? అతనికి గంజాయి ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment