ఆలేరులో పోలీసులు పట్టుకున్న గుడుంబా ప్యాకెట్లు
సాక్షి, యాదాద్రి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అదనుగా తీసుకున్న అక్రమార్కులు మద్యంప్రియులను పలు మార్గాల్లో దోచుకుంటున్నారు. మద్యం అధిక ధరలకు విక్రయించడం వరకే పరిమితమైన అక్రమార్కుల చర్యలు తాజాగా గుడుంబా అమ్మకాలతో బయటపడ్డాయి. 2017 జూన్ 2న యాదాద్రి భువనగిరి జిల్లాను సంపూర్ణ సారా నిషేధిత జిల్లాగా అధికారులు ప్రకటించారు. కాని ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకుంటున్నాయి. తాజాగా ఆలేరులో నాటుసారా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం మద్యం షాపులను బంద్ చేయడంతో వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే దుకాణాలను తెరిచి మద్యాన్ని బెల్టు షాపుల ద్వారా అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో మందుబాబులు గొంతు తడుపుకోవడం కోసం అ«ధిక ధర చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలు పెట్టి మద్యం కొనుగోలు చేయలేని వారు గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా(నాటు సారా)కు అలవాటుపడ్డారు. ప్రస్తుతం గుడుంబాకు డిమాండ్ పెరగడంతో గుడుంబా తయారీదారులు బట్టీలను ప్రారంభించారు. మరికొందరు తమ సొంత అవసరాలకు నాటు సారా తయారీ ప్రారంభించారు.
రహస్యంగా తయారీ
జిల్లాలోని సంస్థాన్‌నారాయణపురం, బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం, తుర్కపల్లి, ఆలేరు, రాజాపేట ప్రాంతాల్లో సారా బట్టీలు ప్రారంభమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మద్యం దొరకకపోవడంతో పలువురు గుడుంబా కోసం పరుగులు తీస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నుంచి జాతీయ రహదారిపై ఆలేరుకు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద 30 లీటర్ల నాటు సారాను పోలీస్‌లు పట్టుకున్నారు. కాగా గుడుంబాను నల్లబెల్లం, పటికతో తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం నల్లబెల్లం అంతగా లభించకపోవడంతో తెల్లబెల్లం పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. తెల్ల బెల్లం కొనుగోలు పెరిగినప్పటికీ ఎక్సైజ్ అధికారులు పెద్దగా అడ్డు చెప్పడం లేదు. కాని తెల్లబెల్లంతో గుడుంబా తయారు చేస్తున్నారు. పటికను గుడుంబా తయారీదారులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుని తయారీ ప్రారంభించారని సమాచారం. జిల్లా కేంద్రంతోపాటు జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాకు సరిహద్దు కావడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని కిరాణం షాపుల నుంచి బెల్లం కొనుగోలు చేస్తున్నారు.
తయారీ ఇలా..
బెల్లం, పటికను కలిపి పానకం చేసి, ఐదు నుంచి 8 రోజుల వరకు నిల్వ చేస్తారు. పానకాన్ని బట్టి పెట్టి వేడి చేయడంతో గుడుంబా తయారవుతుంది. 4 కిలోల బెల్లం, 100గ్రాముల పటికతో నాలుగు సీసాల(సీసాలో 650 ఎంఎల్ సామర్థ్యం) గుడంబా తయారు అవుతుంది. దానికి అదనం ఒకటి నుంచి రెండు సీసాల నీళ్లు కలిపి అమ్ముతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో పోర్లగడ్డతండా, డాకుతండా, దుబ్బతండా తదితర తండాల్లో గుడుంబాను తయారు చేస్తున్నారు. తయారీ కేంద్రాలను ఎప్పటికప్పుడు మార్చి, గుట్టల ప్రాంతంలో పెట్టడంతో జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పరిచయం ఉన్న వాళ్లకు సీసాకు రూ.200 చొప్పున అమ్మకం చేస్తున్నట్లు సమాచారం.
మద్యం దుకాణాదారుల గోల్‌మాల్
మద్యానికి ఉన్న డిమాండ్‌ను వ్యాపారులు భారీగా సొ మ్ము చేసుకుంటున్నారు. సీల్ వేసిన మద్యం దుకా ణాలను రాత్రికి రాత్రే తెరిచి మద్యాన్ని పలు మార్గాల్లో తరలించి విక్రయిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఈ తరహాలో తరలిస్తుండగా ప్రజలు పట్టుకుని పోలీస్‌లకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. అయితే జిల్లాలో భువనగిరి, గుర్రాలదండి, చౌటుప్పల్, ఆలేరు, రాయిగిరి వంటి పలు మద్యం దుకాణాల్లో మద్యం అక్రమంగా ఇప్పటికే విక్రయించారు. ఎక్సైజ్ అ«ధికారుల కనుసన్నల్లో కొన్ని చోట్ల మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయన్నా ఆరోపణలు ఉన్నాయి. కాగా వంగపల్లి మద్యం దుకాణం యజమానిపై కేసు నమోదు చేయడమే కాకుండా, రూ1.50 లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా అధికారి కృష్ణ ప్రియ తెలిపారు.
రూ.50వేల విలువైన మద్యం పట్టివేత
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో ఉన్న అక్రమ మద్యం నిల్వలపై శుక్రవారం సాయంత్రం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ఊడుగు శ్రీనుకు చెందిన 50 వేల రూపాయల విలువైన వివిధ కంపెనీలకు చెందిన మద్యం సీసాలు, 40వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన మద్యాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌ఓటీ సీఐ వెంకటేశం, ఎస్సై లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, సుదర్శన్, మహేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment