పోచమ్మమైదాన్‌లో ట్రీమ్‌విజన్ సంస్థ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు (ఫైల్)
సాక్షి, వరంగల్ క్రైం: మహబూబ్‌నగర్‌కు చెందిన షేక్ ఖాదిర్ విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఆశపడ్డాడు. కష్టపడి సంపాదించిన డబ్బుకు తోడు మరికొంత అప్పు చేసి రూ.6.5 లక్షలను హన్మకొండకు చెందిన ఓ వ్యక్తికి చెల్లించాడు. ఏడాదిన్నరగా ఇదుగో వీసా.. అదిగో వీసా అంటూ తిప్పించిన నిర్వాహకులు చివరకు చేతులెత్తేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక.. వరంగల్‌లో తెలిసిన వారెవరూ లేక పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు.
ఖాదిర్ మాత్రమే కాక మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 19 మంది రూ.65 లక్షల వరకు వీసాల కోసం చెల్లించారు. హన్మకొండకు చెందిన షేక్ ఇమ్రాన్ పరిస్థితి కూడా ఇదే. విదేశాలకు వెళ్లి కుటుంబానికి బాసటగా నిలవాలనే ఆశతో వీసా కోసం అప్పు చేసి మరీ రూ. 2.50 లక్షలు చెల్లించాను. ఇప్పుడు వీసా వచ్చే పరిస్థితి లేదు. అప్పు చేసిన విషయంలో ఇంట్లో తెలియదని.. ఏం చేయాలో పాలుపోవడం లేదని రోదిస్తున్నాడు. ఇలా నిరుద్యోగుల ఆశయాలతో ఆటలు అడుకుం టున్న కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశం అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిరుద్యోగులు తల తాకట్టు పెట్టి మరీ అడిగినంత డబ్బు సమర్పించుకుంటున్నారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఒక వారంలోనే రెండు వీసాల మోసాలు వెలుగు చేశాయి. బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నా వారి ఆవేదనకు ఫలితం లేకుండా పోతోంది. వందల మందిని మోసం చేస్తున్న మాయగాళ్లు ఇతర రాష్ట్రాలు, దేశాలకు పరిపోతున్నారు. మోసపూరితమైన సంస్థలను ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించేలా ప్రకటనలు ఇస్తున్నారు. ఆపై బాధితులు ఒకరి నుంచి ఒకరు సంస్థల్లో చేరి మోసపోతున్నారు.
ఇదిలా ఉంటే కాలనీలలో నమ్మకమైన వ్యక్తులుగా చెలామణి అవుతూ అందరితో కలివిడిగా ఉంటూ చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటోంది. కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లలో ఇలాంటి కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.
ట్రీమ్ విజన్ సంస్థ పేరుతో....
వరంగల్ పోచమ్మమైదాన్‌లో ట్రీమ్ విజన్ సంస్థ బాధ్యులు వందల మంది నిరుద్యోగులను మోసం చేసిన సంఘటన ఇటీవల వెలుగు చూసింది. సంస్థ నిర్వాహకురాలు స్నేహకృష్ణ బాధితుల నుంచి సుమారు రూ.60 లక్షలకు పైగా విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితులు వందల మంది కుటుంబ సభ్యులతో సహా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేసి ఆందోళన విరమింపచేశారు.
కానీ బాధితుల ఆందోళన ,ఆవేదన మాత్రం తగ్గడం లేదు. విదేశాల్లో ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలను వదిలి మరీ డబ్బు చెల్లించారు. మరికొందరు ఆస్తులు, నగలు అమ్మి.. ఇంకొంత అప్పు చేసి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మోసం జరగడంతో వందల మంది బాధితులపై అధారపడిన వేల మంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
కుటుంబ సభ్యులే వివిధ దేశాల ప్రతినిధులు
ఇక హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యాలయం ఉందని చెప్పుకునే వ్యక్తి మోసం పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌తో పాటు ట్రై సిటీలోని కొన్ని పోలీసు స్టేషన్లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వేములవాడ పోలీసు స్టేషన్లలో కూడా వీసాల మోసంపై కేసులు నమోదయ్యాయి. నిందితుడు పడిగల సుమంత్ ట్రైసిటీ పరిధిలో 30 మంది, మహబూబ్‌నగర్‌లో 20 మంది, వేములవాడ, సిద్దిపేట, చెన్నారావుపేట ఇలా సుమారు 70 మంది దగ్గర రూ.2 కోట్లకు పైగా వీసాల కోసం డబ్బు వసూల్ చేశారు.
డబ్బు వసూలు చేసేందుకు ఒక ఏజెంట్‌ను నియమించుకుని ఉన్నదానికి పదింతలు ఎక్కు వ చేసి చెప్పించినట్లు సమచారం. నిందితుడు ఏకంగా కుటుంబ సభ్యులను వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులుగా బాధితులకు పరిచయం చేశారు. వారంతా వివిధ దేశాలలో మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నారని... వారే ఉద్యోగం కల్పిస్తారని నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు విదేశాల్లో ఉండేలా విధంగా మార్చి పరిచయం చేయడంతో బాధితులు త్వరగా నమ్మారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment