హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు గుంటూరు వ్యవసాయ యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై తాము చర్చలకు సిద్ధమని ఆయన సోమవారమిక్కడ సవాలు విసిరారు.
చంద్రబాబు నాయుడు అన్ని అవాస్తవాలే మాట్లాడుతున్నారని.. రూ. 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఎవరికీ చెల్లించారో జాబితా ప్రకటించాలన్నారు. ఏపీలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని... కరవు వల్ల లక్షల మంది రైతులు వలసలు పోతున్నారని తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామన్నా విషయం ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు, కరవు కవల పిల్లలని రైతాంగం అంటుందని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నామని చంద్రబాబు గుంటూరు యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తుందని, రైతు రుణామాఫీ ద్వారా రూ. 24 వేల కోట్లు ఇచ్చామని బాబు చెప్పుకొచ్చారు.