ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అతని రెండో భార్య రెహమ్ విషమిచ్చి చంపాలనుకుందా.. తద్వారా అతని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్లాన్ వేసిందా? అందుకోసమే ఇద్దరి మధ్య ఘర్షణ.. తత్ఫలితంగానే తలాఖ్ వరకు వ్యవహారం వెళ్లిందని తాజాగా తెలుస్తోంది. చివరకు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్‌ను ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయమై హెచ్చరించాయట. పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహమ్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో ఇపుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి.
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు అరిఫ్ నిజామి స్థానిక మీడియాతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ వ్యవహారాలను తనకు చెప్పాల్సిందిగా రెహమ్ ఇబ్బంది పెట్టిందని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమెను లండన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు పంపించి, ఆమెకు డైవోర్స్ నోటీసును ఈ -మెయిల్ ద్వారా పంపించారన్నారు. ఇమ్రాన్ జీవితాన్ని రెహమ్ నరకంగా మార్చివేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్ సన్నిహితుల ద్వారా అతణ్ని హెచ్చరించాయని తెలిపారు. ఆమె అతణ్ని మట్టుబెట్టే అవకాశాలున్నాయనే అనుమానాల్ని వ్యక్తం చేశాయన్నారు.
అసలు రెహమ్ - ఇమ్రాన్ పెళ్లి జరగకుండా ఉండేందుకు తాను గట్టిగా ప్రయత్నించానన్నాడు. ఒకదశలో ఇమ్రాన్‌కు దూరంగా ఉండాలని రెహమ్‌ను తాను హెచ్చరించినట్టు కూడా తెలిపారు. అయినా తమ సలహాను ఇమ్రాన్ లక్ష్యపెట్టలేదన్నారు. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన మరో జర్నలిస్టు షాహిద్ మసూద్ కూడా నిజామి వ్యాఖ్యలను సమర్ధించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అస్వస్థతకు గురైనపుడు వైద్య పరీక్షలు చేయించగా. అతడి శరీరంలో ఎలకల మందుకు సంబంధించిన అవశేషాలు లభించాయన్నారు.
కాగా 63 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, టీవీ జర్నలిస్ట్ రెహమ్ ఇద్దరూ 2014 డిసెంబర్ నెలలో పెళ్లి చేసున్నారు. ఏడాది తిరగక ముందే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించడం సంచలనం రేపింది.