నాటింగ్‌హామ్: టీమిండియాతో మూడో టెస్టులో ఓటమి అనంతరం ఇంగ్లండ్ పూర్తి నిరాశలో కూరుకపోయింది. ఓటమికి గల కారణాలను టీమ్ మేనేజ్‌మెంట్ అన్వేషిస్తుంది. ఈ సందర్బంగా ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్ ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నాటింగ్‌హామ్ టెస్టులో 203 పరుగుల తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని ఆటగాళ్లతో పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా 161 పరుగులకే ఆలౌటవ్వడం, రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌లకే బ్యాట్స్‌మెన్ వెనుదిరగటం ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడ్డాడు.
స్టోక్స్, బట్లర్‌లను చూసి నేర్చుకోండి
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైనా బట్లర్- స్టోక్స్‌లు పోరాడినతీరు అమోఘమని జోయ్ రూట్ ప్రశంసించాడు. వారి నుంచి మిగతా ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలన్నాడు. ఐదో వికెట్‌కు 169 పరుగుల జోడించి ఘోర ఓటమి నుంచి తప్పించారని పేర్కొన్నాడు. టెస్టు గెలవాలంటే రెండు, మూడు బలమైన భాగస్వామ్యాలు నమోదు కావాలి కానీ గత టెస్టులో తాము సాధించలేకపోయామని వివరించాడు. ఇక మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు అలిస్టర్ కుక్‌పై ఇంకా నమ్మక్రం ఉన్నట్టు తెలిపాడు. వరల్డ్ క్లాస్ ఆటగాడైనా కుక్ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థికి చుక్కలే అంటూ సీనియర్ ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు.
బెయిర్ స్టో అనుమానమే?
మూడో టెస్టులో గాయపడిన ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టో ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు నాలుగో టెస్టు ఆడటం అనుమానంగా మారింది. టీమ్ మేనేజ్‌మెంట్ బెయిర్ స్టో పూర్తి ఫిట్‌గా ఉంటేనే ఆడించాలనుకుంటోంది. నాలుగో టెస్టుకు ప్రత్యమ్నాయం గురించి కూడా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తుంది. బట్లర్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి మరో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలా లేక రెగ్యులర్ కీపర్‌ను తీసుకోవాలా అని మళ్లగుల్లాలు పడుతోంది
Comments
Please login to add a commentAdd a comment