మిథాలీ ‘రాజ్యం’
మిథాలీ ‘రాజ్యం’
Published Mon, Dec 5 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
సాక్షి క్రీడా విభాగం : ఎప్పుడో 1999లో కెరీర్‌లో తొలి వన్డేలోనే సెంచరీతో మెరుపులా దూసుకొచ్చింది మిథాలీ రాజ్... ఇప్పుడు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో తనదైన శైలిలో మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ 17 ఏళ్ల కాలంలో మహిళా క్రికెట్‌లో ఒక తరం మారింది. తరాల మధ్య అంతరం కూడా చాలా ఉంది. ఫార్మాట్‌లు మారాయి, ప్లేయర్లు మారారు... కానీ మారనిది మిథాలీరాజ్ ఆట ఒక్కటే. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌విమన్‌గా ఖ్యాతిని సొంతం చేసుకుంది.
కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆటపై ప్రేమతో అమెచ్యూర్ క్రికెటర్‌గానే తన ప్రతిభను ప్రదర్శించిన మిథాలీ... ఇప్పుడు టీవీ ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా తన ఆటను మరో స్థారుుకి తీసుకుపోయింది. ఈ రెండు తరాలకు వారధిగా నిలిచిన ఆమె అనేక ఘనతలను తన పేరిట లిఖించింది. అంకెలు, గణాంకాలపరంగా చూస్తూ ఆమెను కొందరు ‘మహిళా సచిన్’ అంటూ అభిమానంగా పిలుచుకున్నా... మిథాలీ రాజ్ మూలస్థంభంలా నిలబడి జట్టుకు అందించిన కొన్ని విజయాలు చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది.
డబుల్ ధమాకా...
హైదరాబాద్ నగరంలోనే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ రాజ్ ఆ తర్వాత వేర్వేరు వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించింది. నాడు బీసీసీఐ గుర్తింపునకు నోచుకోకుండా, భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఎవరికీ పట్టని మహిళా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే. కానీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను తనకు ప్రియమైన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు సాగేలా చేశారుు. అదే పట్టుదల ఆమెకు 15 ఏళ్ల వయసులో 1997 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు అందించింది. కానీ ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించిన టీమ్ మేనేజ్‌మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో కాస్త మనసు విరిగినా... పట్టుదలతో ఆడి చివరకు శతకంతో తన రాకను ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214) మిథాలీ స్థాయిని అమాంతం పెంచేసింది. అప్పట్లో మహిళల టెస్టుల్లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
కెప్టెన్‌గా సూపర్...
2003 వచ్చేసరికి మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు ఉండని పరిస్థితి వచ్చేసింది. చివరకు సీనియర్ల నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకున్న అనుభవంతో 2005లో ఆమె తొలిసారిగా కెప్టెన్సీని అంగీకరించింది. అదే ఏడాది ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మిథాలీ... సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 91 నాటౌట్ స్కోరు మహిళల క్రికెట్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్‌సలలో ఒకటి. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో టీమిండియా ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీ టైటిల్సే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై వారి గడ్డపైనే గెలిచిన వన్డే సిరీస్ ఆమె కెరీర్‌లో మైలురాళ్లు. బీసీసీఐ మార్పు చేర్పుల్లో భాగంగా మధ్యలో కొంత కాలం మినహా గత దశాబ్ద కాలంలో మిథాలీనే భారత కెప్టెన్. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌పై వామ్‌స్లేలో కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ అందించిన చారిత్రక టెస్టు విజయం మిథాలీ కీర్తిని మెరో మెట్టు ఎక్కించింది.
తిరుగులేని రికార్డు...
వేర్వేరు కారణాలతో ఇన్నేళ్ల కెరీర్‌లో భారత్ చాలా తక్కువ టెస్టులు ఆడింది. దాంతో మిథాలీ కూడా 10 టెస్టులే ఆడినా, అందులోనూ ఆమె సగటు 51 కావడం విశేషం. టి20ల్లో కూడా మన బెస్ట్ బ్యాట్స్‌విమన్‌గా తనదైన ముద్ర చూపించిన మిథాలీ... వన్డేల్లో మాత్రం క్వీన్. 167 మ్యాచ్‌లలో 5,407 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో మిథాలీ ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అత్యధిక సగటు (49.60) ఆమెదే కావడం విశేషం. 5 సెంచరీలు, 40 అర్ధసెంచరీలతో ఆమె రికార్డు అద్భుతం. శనివారమే 34వ పుట్టిన రోజు జరుపుకున్న మిథాలీ పరుగుల తృష్ణ ఇంకా తగ్గలేదు. ఇదే ఫామ్‌తో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
Advertisement
Advertisement