రక్తదానం చేస్తున్న శ్రీనివాస్
నిర్మల్‌అర్బన్: ఆపదలో ఉన్నారు.. రక్తం అవసరం ఉంది.. అని తెలిస్తే చాలు ఆదుకుంటూ ఆపద్బాంధవుడవుతున్నాడు. ఎలాంటి సమయాల్లో పిలుపు వచ్చినా వెనుకడుగు వేయకుండా వెంటనే స్పందించి రక్తదానం చేస్తుంటాడు. 18 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఆదుముల్ల శ్రీనివాస్. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన పోసవ్వ థైరాయిడ్‌తో బాధపడుతోంది.
విషమ పరిస్థితిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కోసం ఓ పాజిటివ్ రక్తం సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో కుటుంభీకులు రక్తం కోసం నిర్మల్‌లోని బ్లడ్‌బ్యాంక్‌ను సంప్రదించారు. అక్కడ రక్తం లభించలేదు. రాత్రి సమయంలో ఏం చేయాలో పాలుపోలేదు.
పోసవ్వ పరిస్థితిని గురించి తెలుసుకున్న వైద్యుడు శశికాంత్ తనకు పరిచయస్తుడు, రక్తదాతలను సమీకరిస్తూ అవసరమైన వారికి రక్తం అందేలా ఏర్పాటు చేస్తున్న నిగులపు సంజీవ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే సంజీవ్ తన మిత్రుడైన ఆదుముల్ల శ్రీనివాస్‌కు పరిస్థితిని వివరించాడు. రాత్రి అని చూడకుండా శ్రీనివాస్ వెంటనే తన స్నేహితుడు మొగిలి రాజేశ్ సహాయంతో ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో పోసవ్వకు ప్రాణపాయం తప్పింది. రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment