సాక్షి, సిటీబ్యూరో: కాలానుగుణంగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏ విభాగమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. వర్షాకాలానికి ముందైతే నాలాల్లో పూడికతీత, రోడ్ల మరమ్మతులు తదితర పనులు చేయాలి. అదే వేసవికి ముందైతే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా వాటర్ ఏటీఎంలు, బోర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేయాలి. కానీ తీరా సమయం ముంచుకొచ్చే వరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ఆ తర్వాత హడావుడి చేయడం జీహెచ్‌ఎంసీకి అలవాటైంది. దీంతో ఆ పనులు పూర్తిచేసే లోపు సీజన్ ముగిసిపోతోంది. ఇంకొన్ని రోజుల్లో వేసవి ముగియనుండగా ఇప్పుడు బోర్ల మరమ్మతులు చేపట్టడమే ఇందుకు తాజా ఉదాహరణ. వాస్తవానికి ఎండాకాలానికి ముందే వేసవి కార్యాచరణలో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలి.
ఇటీవల వేసవి సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలు కమిషనర్ దానకిశోర్ దృష్టికి రావడంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని వాటర్ ఏటీఎంలు పనిచేసేలా చర్యలుతీసుకోవడంతో పాటు ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్ సిగ్నళ్లు, కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లూ కెఫెల్లోనూ ఉచితంగా తాగునీరు అందించాలన్నారు. వీటితో పాటు గ్రేటర్ పరిధిలోని 2,283 బోర్‌వెల్స్, 2,555 పవర్ బోర్‌వెల్స్ అన్నీ పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాస్తవానికి మార్చిలోగానే ఈ పనులు చేయాల్సింది. ఇప్పుడు పనులు చేపట్టడం వల్ల అవి ఎప్పటికి పూర్తవుతాయో? భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల మరమ్మతులు చేపట్టినా ఫలితం ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి. ఇక వీటి మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. గత మూడేళ్లుగా బోర్ల నిర్వహణ పేరుతో ఏటా దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పవర్ బోర్లకు విద్యుత్ చార్జీలు అదనం. అధికారుల సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 2,555 పవర్ బోర్లుండగా... వాటిలో 818 పని చేయడం లేదు. 2,283 హ్యాండ్ బోర్‌వెల్స్‌కు గాను 1,086 పని చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment