ద్రోహాలపై చర్చిద్దామా?
కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు సవాల్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమేనా అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీశ్‌రావు సవాల్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తామడిగే పది ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత నిందలకు కాంగ్రెస్ నాయకులు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల పదవీ వ్యామోహం వల్ల, చేతకానితనం వల్ల జరిగిన అన్యాయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని హరీశ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌వారు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు నోరు మెదపకుండా సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన అప్పటి మంత్రి, ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు సహించరని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అప్పటి సీఎం కిరణ్ అంటే చప్పట్లు చరిచిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదన్నారు. ఇలాంటి ద్రోహాలు చేసినందుకే కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకున్నామని చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు ఆయన సంధించిన ప్రశ్నలు... ఉద్యోగులకు ఆప్షన్లుండాలని కాంగ్రెస్ నేతలంటున్నరు. అంటే తెలంగాణ రాష్ట్రంలోనూ సీమాంధ్ర ఉద్యోగులను కొనసాగించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడ్త్తరా? డిజైను మార్చకుండా పోలవరం నిర్మించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తారా? తెలంగాణ సచివాలయంలో 90 శాతం సీమాంధ్ర ఉద్యోగులు తిష్టవేసి ఉండాల్సిందేనా? భద్రాచలంలోని ఏడు మండలాలు తెలంగాణకే రావాలని అంటున్నం. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు? పెన్షన్ల చెల్లింపులు, ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరపాలి. మీరు వద్దంటారా? తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకరాష్ట్ర హోదాకోసం కేంద్ర ప్రభుత్వపు మెడలు వంచుతాం. కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి అడ్మిషన్లు వద్దని మేం అంటున్నాం.
కాంగ్రెస్ నేతలు వద్దంటారా? 41 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలనవల్లనే తెలంగాణ వెనుకబడింది. అదే పాలన గొప్పతనం చూసి మళ్లా ఓట్లేయమంటారా? మీ పాలనపై ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించే ధైర్యం ఉందా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికే ఓటేయాలనే నినాదంతో జనంలోకి వెళ్లగలరా? కేసీఆర్ 13 ఏళ్ల ఉద్యమాన్ని చూసి ఓటేయాలని అడుగుతాం. ఈ పదేళ్ల పాలనను చూపి ఓటు అడిగే ధైర్యం ఉందా?