సాక్షి, హైదరాబాద్: తెలుగు స్టార్ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్–3 సెన్సార్ లేకుండా ప్రసారం అవుతుందని.. పిల్లలు, యువత, మహిళల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్–3 షో నిర్వాహకులపై రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రసారం కాబోయే బిగ్‌బాస్–3ని నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. వంద రోజులు ఒకే ఇంట్లో అందరూ ఉంటారని, కెమెరాల చిత్రీకరణలో రికార్డు అయ్యే విషయాలను ప్రసారం చేస్తారని, పలువురిని ఆకట్టుకునేందుకు దురుసుగా, అసభ్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
పోలీస్ కేసుల్ని కొట్టేయండి: నిర్వాహకులు
బిగ్‌బాస్–3 షో కోఆర్డినేషన్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించింది. రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లల్లో నమోదైన కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేశారని, వాటిని కొట్టేయాలని బిగ్‌బాస్ కార్యక్రమ నిర్వాహకుడు అభిషేక్ ముఖర్జీ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment