సృష్టిద్దాం సురక్షిత భారతం..
ఆమె ప్రయాణం నిరంతరయానం..
సమున్నత భారతం కోసం..
సురక్షిత భారతం కోసం..
మహిళను శక్తిగా కొలిచే దేశంలో ఆమెకు దక్కాల్సిన గౌరవం కోసం..
ఒక్క అడుగు వేసి మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఆ అడుగుల ప్రయాణం వేల మైళ్ల వైపు సాగుతోంది. ఆమే క్రాస్‌బో మైల్స్ మూవ్‌మెంట్ ప్రతినిధి సృష్టి భక్షి. ఆమె పాదం మోపిన ప్రతిచోటా చైతన్యం గుండె చప్పుడై వినిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని మహిళలతో మమేకమై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. అందుకే ఆ మిలియన్ అడుగుల యాత్రలో యావత్ భారతం భాగమైంది. ఐరాస ఉమెన్ ఎంపవర్ చాంపియన్ (2016–17)గా ఆమెను ఎంపిక చేసింది. తన పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన సృష్టి... ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో
‘మన దేశం గొప్పగా ఉంటుంది. విదేశాల్లో ఉంటే మరీ గొప్పగా ఉంటుంది. అక్కడ ఎవరైనా మన దేశాన్ని విమర్శిస్తే.. ఏ విషయంలోనైనా తీసిపారేస్తే చాలా కోపం వస్తుంది. అయినా మన దేశానికి మద్ధతుగా వాదించలేని పరిస్థితి వస్తే.. తలదించక తప్పని పరిస్థితి వస్తే.. అలాంటి నిస్సహాయ స్థితి నుంచే ‘క్రాస్‌బో మైల్స్’ మూవ్‌మెంట్ పుట్టింది. మహిళలకు భద్రత, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, డిజిటల్ లిటరసీని అందించాలనే నినాదంతో కాలినడకన దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. మా నాన్న ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. డెహ్రాడూన్‌లో పెరిగి ముంబైలో మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. తర్వాత హైదరాబాద్ ఐఎస్‌బీలో చదివాను. ఇండియా టుడే, ఐటీసీ లిమిటెడ్ వంటి కంపెనీల్లో పనిచేశాను. పెళ్లయ్యాక భర్తతో కలిసి హాంకాంగ్‌కు వెళ్లిపోయా. బహుశా ఇక అక్కడే ఉండిపోయేదాన్నేమో.. కానీ మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న దారుణాలే నన్ను తిరిగి ఇక్కడికి రప్పించాయి.
వాదించలేక.. తలదించలేక..
నిర్భయ ఘటన తర్వాత మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం కొందరు విదేశీయులు వినిపించేవారు. దీనికి తగ్గట్టుగా రోజుకో వార్త ఇక్కడి నుంచి రిపోర్ట్ అవుతుండేది. వారితో విపరీతంగా వాదించేదాన్ని. అయితే ఇలాంటి సంఘటనల్ని తరచూ ఎత్తి చూపుతూ వారు నన్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టేసేవారు. అదే సమయంలో ఢిల్లీ–కాన్పూర్ హైవే మీద తల్లీ కూతుర్ల గ్యాంగ్ రేప్ వార్త వచ్చింది. అప్పటికే ఈ విషయంలో వాదించలేక.. తలదించలేక అన్నట్టున్న నాకు ఇది మరింత బాధించింది. అప్పుడే ఈ అంశం మీద నా వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆరేళ్ల పిల్లయినా, అరవై ఏళ్ల బామ్మయినా లైంగిక దాడులు చాలా సాధారణమై పోయాయి. ప్రతి ఒక్కరూ నేనేం చేయగలను..? ప్రభుత్వం చేయాలి అని అనుకుంటున్నారు. జనంలో మార్పు తేవాలి అందుకే ఈ మూవ్‌మెంట్ ప్రారంభించాను.
అవిశ్రాంతంగా 8 నెలలు..
కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా 260 రోజుల పాటు దాదాపు 3,800 కి.మీ. కాలి నడకన యాత్రకు శ్రీకారం చుట్టాను. వాహనాల్లో వెళితే సాధారణ ప్రజలకు చేరువ కావడం కష్టం. అందుకే నడకను ఎంచుకున్నాను. ఈ యాత్రలో నాకు విభిన్న సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. నాతో పాటు 12 మందితో కూడిన బృందం ఉంది. రోజుకి 30 కి.మీ. చొప్పున ఇప్పటికి సుమారు 1200 కి.మీ. నడిచాం. పట్టణాలు, నగరాల్లో వర్క్‌షాప్స్, అర్థవంతమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఒక మహిళ చదువుకుంటే సరిపోతుందని ఒకప్పుడు అనుకున్నాం. కానీ అది సరిపోదు.. చదువు కూడా పెళ్లికి కావాల్సిన ఒక అర్హతగా మాత్రమే పరిగణిస్తున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. మహిళల సంపాదనపై కూడా పురుషుల ఆధిపత్యమే కొనసాగుతోంది. చెప్పుకోదగినంత సంపాదిస్తున్నా బ్యాంకింగ్ గురించి ఏ మాత్రం పరిచయం లేని మహిళలున్నారు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు నేనే నడుం బిగించాను. వారి భద్రత, హక్కులు, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, నాయకత్వంపై అవగాహన కల్పిస్తున్నాను. నేను పర్యటించిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొత్తం 34 వర్క్‌షాప్స్ నిర్వహించాం. వాక్ పూర్తయ్యాక ప్రభుత్వానికి దీనిపై సమగ్ర నివేదిక అందిస్తాను.
అర్ధరాత్రి స్వతంత్రం కోసం..
అవును.. పగలే రోడ్డు మీద మహిళకు భద్రత లేదు. అలాంటి సమయంలో అర్ధరాత్రిళ్లు తిరగడం అంటే.. నిజంగా అదో పెద్ద సాహసమే. ఈ పరిస్థితిని మార్చడానికే ‘నైట్‌వాక్స్’ను ఈ మూవ్‌మెంట్‌లో భాగంగా మార్చాను. పలు నగరాల్లో వీటిని నిర్వహిస్తున్నాం. క్రాస్‌బో మైల్స్ పేరుతో వెబ్‌సైట్, యాప్ అందుబాటులో ఉన్నాయి.
నేడు వాక్
నెక్లెస్‌రోడ్‌లో శనివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వాక్ నిర్వహించనున్నట్లు సృష్టి భక్షి తెలిపారు. మహిళలకు తమ హక్కులపై అవగాహన అవసరమని సృష్టి భక్షి అన్నారు. హామ్స్‌టెక్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ హక్కులు, చట్టాలను సులభంగా అర్థం చేసుకునేందుకు www.absamjhautanahin.com పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. శనివారం నిర్వహించనున్న నైట్‌వాక్‌లో ఇనిస్టిట్యూట్ విద్యార్థులు పాల్గొంటారని హామ్స్‌టెక్ నిర్వాహకులు అజితారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సింగర్ ఎల్.రేవంత్ పాల్గొని సందడి చేశారు. – జూబ్లీహిల్స్
Comments
Please login to add a commentAdd a comment