Politics
-
పాత రోజులు మర్చిపో.. కడియంకు రాజయ్య వార్నింగ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘టీడీపీ, షర్మిల’.. కార్యకర్తలే వైఎస్సార్సీపీ బలం: రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైఎస్సార్సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంతకాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఆదినారాయణ రెడ్డి లాంటి వారు వైఎస్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చింది. ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుంది. విజయసాయి రెడ్డి వెళ్లడంతోనే వైఎస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించలేదా?. సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైఎస్సార్సీపీ పని అయిపోయిందని కూటమి నాయకులు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. వారందరికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ద్వారా అత్యున్నత పదవులు అనుభవించి.. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉండగా కొంతమంది వదిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్తున్నారు. వైఎస్ జగన్ కి ద్రోహం చేస్తున్నారని ప్రజలే అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టిపోవాల్సి వచ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది పార్టీకి, వైఎస్ జగన్‌కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.టీడీపీ, షర్మిలకు కౌంటర్..టీడీపీ నాయకులు, షర్మిలకు, ఆదినారాయణరెడ్డికి అందరికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైఎస్సార్సీపీ పని అయిపోతుందా?. వైఎస్ జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకే కాదు.. మళ్లీ ఇంకో జన్మ ఎత్తయినా సరే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకునే కార్యకర్తలు నాతోపాటు ఊరూరా లక్షల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బలం. వైఎస్ జగన్‌ని విమర్శించే వారంతా ఆయన పేరు వింటేనే పక్క తడుపుకునే వాళ్లు. వాళ్లకు జగన్ మీద మనసు నిండా కుట్ర, ఒళ్లంతా అసూయ ఉంది. జగన్ చనిపోలేదు.. కేవలం ఓడిపోయాడని ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భయం ఉంది కాబట్టే ఇంతగా కూటమి నాయకులు శత్రువు గురించి భయపడుతున్నారు.ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే..వైఎస్ జగన్‌కి మేమెప్పుడూ బలం కాదు.. ఆయనే మా అందరికీ బలం. పోరాటం, ధైర్యం, విశ్వసనీయత ఆయన బలం. ఆయన వ్యక్తిత్వం, ప్రజల్లో ఆయనకున్న మంచి పేరే ఆయనకు శ్రీరామరక్ష. కార్యకర్తలే జగన్ బలం. కార్యకర్తలు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వరలోనే ఆయన మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, వంటి వారు పార్టీ మారలేదా?. విశ్వసనీయత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని అలాంటి చంద్రబాబే 2024 మళ్లీ సీఎం కాలేదా? అలాంటిది జగన్ సీఎం కాలేరా?. ఆయన మళ్లీ సీఎం కావడం తథ్యమని తెలుసు కాబట్టే శత్రువులంతా భయంతో వణికిపోతున్నారు.ఇద్దరు ముగ్గురు వదిలేసి వెళ్లినంత మాత్రాన జగన్ భయపడేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసినప్పుడే మా పార్టీ కనుమరుగయ్యేది. ఆరోజే ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. వైఎస్ జగన్‌ను కాదని వెళ్లిపోయిన ఈ ఆదినారాయణ రెడ్డి మళ్లీ గెలవలేదు. ఇప్పటికే 2019-24 మధ్య ఒకసారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయణరెడ్డి.. మరోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు త్వరలోనే మళ్లీ మంచి రోజులు వస్తాయి. వైఎస్సార్సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
‘బండి సంజయ్.. బీజేపీ భావజాలం ఉంటేనే అవార్డ్ ఇస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో బండి సంజయ్‌కు ఎంపీ చామల కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎంపీ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్‌పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్బంగా గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో గద్దర్ అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: గద్దర్‌కు పద్మ అవార్డుపై బండి సంజయ్ వ్యాఖ్యలు -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,తెలంగాణ భవన్ : అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఢీల్లి నుండి టూరిస్టులను తీసుకువచ్చి హామీలు ఇచ్చారు. బాండ్ పేపర్లతో అఫిడవిట్లు ఇచ్చి హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి గ్యారెంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జనవరి 30 వ తేదీతో 420 రోజులు అవుతుందిజనవరి 30వ తేదీన బిఆర్ఎస్ ఆధ్వర్యంలోగాంధీని స్మరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు కోరుతూ గాంధీకి వినతి పత్రాలు సమర్పిస్తాం. రేవంత్ రెడ్డి మంది పెళ్లిళ్లకు వెళ్లి ఫోజులు కొడుతున్నారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర మంత్రసాని పాత్ర.రూ.40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఒక్కటి రాలేదు. అందుకే ప్రజలు లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు అంటే నమ్మడం లేదు. పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తే రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తాము.రేవంత్ రెడ్డికి చేతనైతే రైతు భరోసా వేసి చూపించు.రేవంత్ రెడ్డిని చూస్తే అపరిచితుడు గుర్తు వస్తున్నాడు. దమ్ముంటే హామీలు అమలు చేసి చూపించు అని రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిమాండ్.. అయ్యన్న వ్యాఖ్యల అర్థమేంటి?
విశాఖ : ఏపీలో తారా స్థాయికి వెళ్లిన అధికార టీడీపీ నేతల నారా లోకేష్ భజనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంలో టీడీపీ నేతల డిమాండ్‌పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చెయ్యడానికి మేం ఎవరు..? డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు. మరి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు- 2025 జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు పాల్గొన్నారు. అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు సైతం టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తామేం తక్కువ కాదన్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు. ఈ క్రమంలో గద్దర్(Gaddar)కు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్‌గా స్పందించారు. ‘‘పద్మ అవార్డులు(Padma Awards Row) స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి?. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్ ఇవ్వం’’.. అని అన్నారాయన. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డు లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్ పేర్కొన్నారు. మాకు భేషజాలు లేవుతెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) అభివృద్ధికి సహకరిస్తుంది. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇడ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి ?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి ?. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోంది. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాకు బేషజాలు లేవు.. కి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా ?. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్ధిదారులకు ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ అన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్బండి సంజయ్ వాఖ్యలు ఈ మధ్య విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇంధిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. బండి వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానించేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. నక్సలైట్లకు ఎంపీ ,ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వొచ్చు కాని అవార్డులకు పనికి రారా?. లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈటల ఆ పదవికి అనర్హుడా?. దీనికి బండి సంజయ్ చెప్పాలి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డు ల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. -
పొలిటికల్ ‘గ్యాంగ్‌వార్’: ఎమ్మెల్యేపై కాల్పులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
రూర్కీ: ఉత్తరరాఖండ్లో పొలిటికల్ గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. రూర్కీలోని ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ క్యాంప్ ఆఫీస్‌పై కాల్పులు జరిపిన కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్‌ను హరిద్వార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఈ నేతలిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం, ఖాన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఛాంపియన్ తన అనుచరులతో కలిసి కుమార్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరి నేతల అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. అలాగే కర్రలతో దాడి చేసుకున్నారు.ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖాన్పూర్ నియోజకవర్గంలో ఛాంపియన్ భార్య కున్వరాణి దేవయానిని ఓడించినప్పటి నుండి ఇద్దరి మధ్య వైరం నెలకొంది. ఆదివారం బీజేపీ నేత ఛాంపియన్ గాల్లోకి బుల్లెట్లను పేల్చాడని, దీంతో ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ దోవల్ మాట్లాడుతూ భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఛాంపియన్‌ను అరెస్టు చేశామని తెలిపారు. అలాగే ఛాంపియన్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్‌పై కూడా కేసు నమోదు చేశామని, ఆయనతో పాటు ఆయన మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నేతలకు చెందిన ఆయుధ లైసెన్స్‌లను నిలిపివేయాలని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేసినట్లు దోవల్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.కాగా చట్టంతో ఆటలాడుకోవడం ప్రజా ప్రతినిధులకు తగదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్ అన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరినట్లు భట్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ లేదా దేశ రాజ్యాంగం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించవని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం -
‘ముడా’ స్కాంలో ‘ఈడీ’ దూకుడు.. సీఎం భార్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునేలా కనిపిస్తోంది.ఈ కేసులో తాజాగా సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేష్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ గతేడాది అక్టోబర్‌లో దర్యాప్తు ప్రారంభించింది.ముడా భూముల కేటాయింపు అక్రమాల్లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆమె సోదారుడు బీఎం మల్లికార్జునస్వామి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ ఇదివరకే సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది.ఈకేసులో ఈడీ గతంలో లోకాయుక్తకు లేఖ రాయడం వివాదాస్పదమైంది. ముడాకు చెందిన రూ.700 కోట్ల భూమిని అక్రమంగా డీ నోటిఫై చేశారని ఆరోపించింది. ఇందులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈడీ రాజకీయ దురుద్దేశాలతో తన పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ముడాస్కాం వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. ఒకే కేసులో లోకాయుక్త, సీబీఐ ఎలా విచారిస్తాయని ప్రశ్నించారు. దీని వెనుక కేంద్రం రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఏ కేసులోనూ రెండు దర్యాప్తు సంస్థలు అవినీతి అంశంపై విచారించకూడదని ఆయన తెలిపారు. -
సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు. ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. -
Vijaysai Reddy: అందుకే గుడ్‌బై చెప్పారా?
వైఎస్సార్సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ రాజీనామా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం సంచలనమైనదే. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన నేత, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈయన. రాజీనామా చేసినప్పటికీ వైఎస్ కుటుంబంతో అనుబంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పడం ఆసక్తికరమైందే. రాజీనామా సందర్భంగా ఆయన జగన్‌పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, అభిమానంగా మాట్లాడటం ఆ తర్వాత వైసీపీ స్పందన రాజకీయాలలో కొత్త ఒరవడిగా ఉన్నాయి. వైఎస్సార్సీపీపై కానీ, జగన్‌పై కానీ ఆయన వీసమెత్తు విమర్శ చేయకుండా గౌరవంగా బయటకు వెళ్లడం మంచి పరిణామం. మరోవైపు..ఆమోదయోగ్యం కానప్పటికీ తాము విజయసాయి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వైఎస్సార్‌షీపీ ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఇక విజయసాయి రాజీనామా సరైన నిర్ణయమేనా?. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా?. ఏదో బలమైన కారణం లేకుండానే ఇలా చేసి ఉంటారా?. అనే ప్రశ్నలు తలెత్తడమూ సహజమే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చాలా సంయమనంగానే వ్యవహరించారు. తెలుగుదేశం జాకీ మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆవేశపడలేదు. తాను అబద్దాలు చెప్పడం లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు. అంతేకాక తనపై అసత్య కథనాలు రాసిన టీడీపీ మీడియాపై పరువు నష్టం దావా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్టు వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, దానిపై కూడా పరువు నష్టం కేసు ఉంటుందని తెలిపారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెబుతున్నారు. దానికోసం పార్లమెంటు సభ్యత్వాన్ని వదలుకోనవసరం లేదు.ఈ మధ్యకాలంలోనే ఆయన ఒకటి, రెండు పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉండదలిచే ఆ పదవులను తీసుకున్నట్లే కదా! మరి ఇంతలోనే ఏమైంది?. ఇంతకుముందు ముగ్గురు ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు రాజీనామా చేశారు. వారిలో బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరి తిరిగి అదే సీటు పొందగలిగారు. బీదా, మోపిదేవిలు టీడీపీ ప్రలోభాలకు ఆకర్షతులయ్యో, రెడ్‌బుక్‌కు భయపడో ఆ పార్టీ చెప్పినట్లు విన్నారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం ఈయన రాజీనామా చేసినట్లు కనబడుతుంది. ఒరిజినల్‌గా మొదటి నుంచి వైఎస్సార్సీపీలోఉన్నది మోపిదేవే. ఆయనకు రాష్ట్రంలో ఏదో పదవి ఇస్తామని టీడీపీ ఆశ చూపిందని అంటారు. మరో సీటు లోకేష్‌కు సన్నిహితుడని చెబుతున్న వివాదాస్పద వ్యక్తి సానా సతీష్ కు దక్కింది. ఈ రాజీనామాల ద్వారా రాజ్యసభలో టీడీపీ తిరిగి ఎంటర్ కాగలిగింది. బహుశా టీడీపీ రాజకీయ వ్యూహాన్ని గమనించిన బీజేపీ తను అడ్వాంటేజ్ పొందాలని అనుకుని ఉండాలి. మొత్తం 11 సీట్లు వైఎస్సార్సీపీ(YSRCP) ఖాతాలో ఉండగా, ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో నాలుగు సీట్లను వైసీపీ కోల్పోయినట్లయింది. మరో ఎంపీ అయోద్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయవచ్చని వదంతులు వచ్చినా, ఆయన ఖండించారు. వర్తమాన రాజకీయాలలో అధికారం లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో, అధికారం ఉంటే ఎలా పెత్తనం చేయవచ్చన్న దానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. విజయసాయి మీడియా సమావేశంలో చేసిన రెండు వ్యాఖ్యలు గమనించదగినవి. గవర్నర్ పదవికి ఆశపడి తాను రాజీనామా చేయలేదని తొలుత చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేస్తే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇచ్చినట్లు అనిపించలేదు. భవిష్యత్తులో ఏ పదవి చేపట్టబోనని ప్రకటించినట్లుగా లేదు. అలాగే తనకంటే శక్తి కలిగిన వ్యక్తికి ఈ పదవి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే దాని అర్ధం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎవరైనా ప్రముఖుడు ఈ సీటు పొందబోతున్నారా అనే సందేహం వస్తుంది. ఇది ఒక ఆపరేషన్ అయి ఉంటుందని, బీజేపీ పాత్ర ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రత్యేకించి.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపిన వైనం ఇందుకు ఆధారంగా నిలుస్తుంది. అలాగే చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత వైరం లేదని, పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ దాడులు, కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవ్వాలని భావించారా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. గతంలో జగన్‌తో పాటు ఇంతకన్నా పెద్ద కేసులనే ఆయన ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు జైలులో ఉండడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ప్రముఖ నేతగా ఉండి రెండుసార్లు ఎంపీ అయ్యారు. టీడీపీ నేతలు కాని, టీడీపీ మీడియా కాని ఆయనపై ఇప్పటికీ విమర్శలు కొనసాగించాయంటే ఆ పార్టీలోని వారితో కాంటాక్ట్ ఏర్పడ లేదనుకోవచ్చు!. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ స్నేహ హస్తం అందించినట్లు అనిపిస్తుంది. బీజేపీ, జనసేన పార్టీలు ఈయనపై విమర్శలు చేయడం లేదు. టీడీపీకి తెలియకుండానే ఈ కధ నడించిందని అంటున్నారు. బీజేపీలో చేరడానికి తెలుగుదేశం అనుమతి తీసుకోవాలన్నట్లు ఆ పార్టీ జాకీ మీడియా అధినేత ఒకరు చెబుతున్నా, బీజేపీ అంత బలహీనంగా లేదేమో అనిపిస్తోంది. ఆ మాటకు వస్తే చంద్రబాబే పదే, పదే మోదీ, అమిత్ షాలను ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తే ఆయనకు ఏదో భయం పట్టుకుందన్న అనుమానం కలుగుతోంది. మరో వైపు ఎల్లో మీడియాలోని ఒక భాగం విజయసాయికి అనుకూలంగా కథనాలు ఇస్తోంది. ఆయనపై సానుభూతి కురిపిస్తోంది. విజయసాయి వైసీపీలో పదవులు కూడా నిర్వహించారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండవచ్చని కొందరు చెబుతున్నా, వాటి గురించే రాజకీయాలనుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చే భీరువు ఆయన కాదు. ఏ రాజకీయ పార్టీలోనైనా చిన్నవో, పెద్దవో సమస్యలు ఉంటాయి.అయినా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాటికి ప్రాధాన్యత ఉండదు. కాకపోతే ఎవరైనా పార్టీని వీడడానికి అలాంటివాటిని సాకులుగా చూపుతారు. ఆ మాట కూడా విజయసాయి చెప్పలేదు. టీడీపీ జాకీ మీడియా అధినేత చేసిన కొన్ని ఆరోపణలకు ఈయన సమాధానం చెప్పి ఉండాల్సింది. ఆ మీడియా అధినేతను విజయసాయి కలిసింది వాస్తవమా? కాదా? బీజేపీలో చేరాలని యత్నించారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వగలగాలి. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఇప్పుడు కూడా విజయసాయిపై ఆరోపణలు చేయడం ద్వారా ఒక సంకేతం ఇచ్చింది. విజయసాయి పై టీడీపీ అదే కక్షతో ఉందని, ఆయన ఇలా రాజీనామా చేస్తారని టీడీపీ కూడా ఊహించలేకపోయిందన్నది ఒక విశ్లేషణగా ఉంది. ఒకవేళ బీజేపీ పెద్దలు ఈ సీటు తమదే అన్నప్పుడు చంద్రబాబు కాదనగలుగుతారా? అనేది ప్రశ్న. అలాకాక టీడీపీనే ఈ సీటు తీసుకుంటే పరిస్థితి మరో రకంగా ఉండవచ్చు. గతంలో 2019లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబే వారిని పంపించి తన దూతలుగా పెట్టుకున్నారని అంటారు. కాని జగన్ అలాంటి దొంగ రాజకీయాలు చేయరని మరోసారి తేటతెల్లమైంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ఎంపీలను ఎవరిని ఆయన బీజేపీలోకి పంపలేదు. పార్టీ వీడిన వారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. దీనిని బట్టి అర్థం అయ్యేదేమిటంటే, అలాంటి కుట్ర రాజకీయాలు, లొంగుబాటు రాజకీయాలు జగన్ చేయరని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో బీజేపీ పెద్దల హస్తం ఉండవచ్చని, ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ మాజీ ఎంపీ పాత్ర ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్న నేపద్యంలో వాటినుంచి కాస్త ఉపశమనం పొందడానికి విజయసాయి ఇలా చేసి ఉండవచ్చా? అనేది పలువురి డౌటుగా ఉంది. కాని అలాంటివాటికి తాను భయపడనని ఆయన చెబుతున్నారు. విజయసాయి ఏ కారణంతో రాజకీయాలకు దూరం అయినట్లు చెబుతున్నా, భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తారో చెప్పలేం. ఈ రాజీనామా ప్రభావం వైఎస్సార్సీపీ(YSRCP)పై ఏ మేరకు ఉండవచ్చన్నది చర్చ. తొలుత కొంత దిగ్భాంతికి గురవుతారు. ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. విజయసాయి మీడియా సమావేశంలో జగన్ బలం గురించి చెప్పిన తీరు విన్నాక పార్టీ క్యాడర్ లో యథా ప్రకారం ఆత్మస్థైర్యం వచ్చింది. తనలాంటి వారిని వెయ్యిమందిని జగన్ తయారు చేయగలరని ఆయన అనడమే ఇందుకు ఉదాహరణ. అంతేకాక విజయసాయి ప్రత్యక్షంగా ప్రజలతో నిత్యం సంబంధాలు నెరపే వ్యక్తికాదు. 2024లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తప్పనిసరి స్థితిలోనే పోటీ చేశారు. ఓటమి తర్వాత మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఆ రకంగా చూస్తే ప్రజల కోణంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. కార్యకర్తలు అప్పుడే విజయసాయి వెళ్లిపోయినా పార్టీకి ఏమీ కాదని ధైర్యంగా చెప్పడం ఆరంభించారు. కొద్దిరోజుల పాటు చర్చించుకుని ఈ విషయాన్ని వదలివేయడం సహజంగానే జరుగుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వంటివారు సైతం ఇలాంటి సమస్యలు ఎదుర్కున్నారు. ఇందిరాగాంధీ కేబినెట్ లో పనిచేసిన జగ్ జీవన్ రామ్,కాసుబ్రహ్మానందరెడ్డి,సి.ఎమ్.లుగా చేసిన దేవరాజ్ అర్స్, మర్రి చెన్నారెడ్డి వంటి వారు కొంతకాలం ఆమెకు రాజకీయంగా దూరం అయ్యారు. తిరిగి ఆమెకు ఉన్న ప్రజాదరణను గమనించి ఆమె పార్టీలోనే చేరారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.పక్కనే కూర్చుని ఉన్న ఉప నేత రఘుమారెడ్డి 1994 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తండ్రి మరణం తర్వాత వైఎస్ జగన్(YS Jagan) ఒంటరిగానే రాజకీయ జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద పార్టీని తయారు చేసుకుని గెలుపు,ఓటములను చవిచూశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, ఇప్పటికీ జగన్ అంటే భయపడే పరిస్థితిలోనే ఆ పార్టీలు ఉన్నాయి. చదవండి: దటీజ్ జగన్.. పగవాడైనా ఒప్పుకోవాల్సిందే!మళ్లీ వచ్చే ఎన్నికలలో జగనే గెలుస్తారేమోనని ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఎలాగొలా వైఎస్సార్సీపీని, జగన్ ను బలహీనపర్చాలని టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. వాటిలో ఎక్కువ భాగం కుటిల రాజకీయాలే అనే సంగతి తెలిసిందే. ఈలోగా బీజేపీ తన గేమ్ తాను ఆడుతోంది. అయినా జగన్ తొణకలేదు.బెణకలేదు. ఎందరు ఎదురు నిలబడ్డా తనదారిలోనే వెళ్లే నేత ఆయన. సోనియాగాంధీ అత్యంత శక్తిమంతంగా ఉన్న రోజులలోనే తనకు రిస్క్ ఉందని తెలిసినా, ఆమె కక్ష సాధింపుతో జైలు ప్రమాదం ఉంటుందని పలువురు హెచ్చరించినా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కున్నారే తప్ప తలవంచలేదు. ఈ పదిహేనేళ్ల రాజకీయంలో ఎన్నో కష్టాలు, కడగండ్లు ఎదుర్కున్న జగన్.. వచ్చే నాలుగున్నరేళ్లు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడడానికి సన్నద్దమవుతున్నారు. అదే ఆయన బలం అని చెప్పాలి. ఆ గుండె ధైర్యాన్ని చూసే కార్యకర్తలు స్పూర్తి పొందుతుంటారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆయన వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ(జనవరి 27, సోమవారం) విచారణ జరిపింది. అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం.. ‘‘కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా?’’ అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. వాదనలు ఇలా.. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని.. తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం.. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మస్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై దండయాత్ర చేయాలని చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. విశ్వవిద్యాలయాలపై రాష్ట్రాలకున్న అధికారాలను లాక్కొని ఆధిపత్యం చెలాయించాలని కుట్రలు చేస్తోందని... వర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా చేపట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం యూజీసీ మార్గదర్శకాలను మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆవరణలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎస్ శాంతికుమారి, వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొందరి విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదిత నిర్ణయాన్ని రాజ్యాంగంపై, రాష్ట్రాలపై సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు. విశ్వవిద్యాలయ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, మంత్రి పొన్నం తదితరులు రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా? ‘వర్సిటీలపై రాష్ట్రాల హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది? ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను గుంజుకుంటే ఎలా? కేంద్రం తీరు ఇలాగే ఉంటే రాష్ట్రాలన్నీ నామమాత్రం అవుతాయి. ఇలాంటి చర్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయి. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు కూడా వెనుకాడం. దీనిపై ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టరకరం’అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థను గాడిన పెడతాం.. నాటి ప్రధాని పీవీ నరసింహారావు సామాజిక బాధ్యతగా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఉన్నది కేవలం సర్టీఫికెట్ల జారీ కోసమే కాదని.. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలుకావాలని పేర్కొన్నారు. విద్యాహక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వందేళ్లలో తొలిసారి ఓయూకు దళిత వీసీని నియమించాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వీసీలను నియమించాలని సీఎం రేవంత్ చెప్పారు. వందేళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామన్నారు. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రొఫెసర్లపై ఉందన్నారు.పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే అమలుచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మంచిది కాదని, రాష్ట్రంలో యూనివర్సిటీల పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రొఫెసర్ల వయో పరిమితికి 65కు పెంచే ఆలోచన ఉందని సీఎం చెప్పారు. అంబేడ్కర్ వర్సిటీలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామన్నారు. 2034 వరకు ప్రభుత్వం మాదే.. మరో పదేళ్ల వరకు తమ ప్రభుత్వమే కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని.. ఆయా పార్టీ లకు పదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని.. తమకు కూడా 2034 వరకు ప్రజలు అందిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. పద్మ అవార్డుల్లో అన్యాయంపై ప్రధానికి లేఖ రాస్తా.. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయ«దీర్ తిరుమలరావు లాంటి ప్రముఖులను గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం సిఫారసు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని, తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులు ఇచ్చినా బాగుండేదన్నారు. ఈ అన్యాయంపై త్వరలోనే ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. -
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
ధర్మవరంలో ఉద్రిక్తత.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్‌పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.బాధితుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివాసులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతానని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్రహంతో ఊగిపోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణారహితంగా కొట్టాడు.సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్‌పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్.. వివిధ మండలాల ఎస్ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు -
బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం(జనవరి26) జరిగిన సెమినార్లో కవిత మాట్లాడారు.‘నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా.ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి.కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్‌లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు... ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు’అని కవిత ఫైరయ్యారు.కాగా, శనివారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మ పెడితే కేంద్రం నుంచి ఇళ్లు ఇవ్వమని, ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదీ చదవండి: బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
కొత్త పథకాలు పెద్ద బోగస్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ కొత్త నాలుగు పథకాల కార్యక్రమం అంతా బోగస్సేనని, ముందురోజు వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(జనవరి26) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘గ్రామ సభలన్నీ ఒక ప్రహాసనంగా మార్చారు. రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు అంటున్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయి. ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి టోకరా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణ ద్రోహులే. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు చేతకావడంలేదు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌కు సమయం సరిపోవడంలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.కాగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ అనే నాలుగు కొత్త స్కీమ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివారం(జనవరి26) ప్రారంభించింది. ఈ స్కీములను కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: అర్ధరాత్రి నుంచే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లోకి -
ప్రతి ఇంటికి నెలకు రూ.25వేలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi AssemblyElections)ను దేశం మొత్తంలో జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందన్నారు. పేదలకు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో వందలమంది కార్పరేట్ వ్యక్తుల రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బీజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ‘‘ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే మీరు ఈ ఖర్చులను భరించగలరా?’ అని ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ పార్టీ పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి రూ.25వేల విలువైన లబ్ధి అందుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. ఇదీ చదవండి: తేనెకళ్ల మోనాలిసా ఇళ్లు ఇదే.. -
బీజేపీపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమే లేదన్నారు. పొరపాటున బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జగ్గారెడ్డి ఆదివారం(జనవరి26) మీడియాతో మాట్లాడారు. ‘ఈ దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇంధిరమ్మ ఇల్లు కనిపిస్తుంది. ఏ ముసలి అవ్వ, ముసలి తాతను అడిగినా ఇంధిరమ్మ ఇళ్లలోనే ఉంటుంన్నాం అని చెప్తారు. ఇంధిరమ్మను చూసేందుకు మారుమూల గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారు. ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇంధిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని సంజయ్ బెదిరిస్తున్నారు. బండి సంజయ్ నీ ఊరికే వస్తా.. ఇంధిరమ్మ గురించి ఓ ముసలమ్మను అడుగుదాం.. ఏం చెప్తదో చూద్దాం. స్వాతంత్ర్య ఉధ్యమంలో నిండు గర్బినిగా ఉండగా ఇందిరమ్మ జైలుకు వెళ్లారు. విలువలతో కూడిన రాజకీయం బీజేపీ చేయడం లేదు. అటల్ బీహారీ వాజ్‌పేయి,ఎల్కే అద్వానీ గురించి మేము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. ఇంధిరా గాంధీ చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగాన్ని నిర్మించే భాధ్యత అంబేద్కర్‌కు అప్పగించింది నెహ్రూయే. ఇంధిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదు. బండి సంజయ్ క్షమాపణ చెప్పి..ఈ వివాదానికి స్వస్తి పలకాలి’అని జగ్గారెడ్డి కోరారు. -
ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్(Bandi Sanjay) ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో తామూ చూస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మపై అవహేళనగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.10 నెలల కాలంలో జీఎస్టీ రూపంలో రూ.37 వేల కోట్ల రూపాయలు కేంద్రం వసూలు చేసింది. మరి కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత? అంటూ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు?. వీల్లేమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా?. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయన్న కేంద్రం నుంచి అదనంగా తెచ్చారా?’’ అంటూ పోన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ప్రధాని ఫొటో పెడితేనే నిధులు..కాగా, కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే పథకాలకు ప్రధాని ఫొటోను వాడకుంటే తామే లబ్దిదారులకు నేరుగా నిధులు ఇచ్చేలా ఆలోచన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాలకు మళ్లిస్తున్నాయి. గతంలో నేను నిలదీయడం వల్ల వరంగల్, కరీంనగర్ స్మార్ట్‌సిటీ నిధులను గత ప్రభుత్వం విడుదల చేసింది. ఇకపై కేంద్ర నిధులతో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే రేషన్‌కార్డులపై సీఎంతోపాటు ప్రధాని ఫొటో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆయా పథకాలకు నిధులు నిలిపివేస్తాం’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
ఇవాళ అర్ధరాత్రి నుంచే ‘రైతుభరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
సాక్షి,మహబూబ్‌నగర్:గతంలో కొడంగల్ నియోజకవర్గం వివక్షకు గురైంది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కొడంగల్‌వైపు చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో నాలుగు కొత్త పథకాలను ఆదివారం(జనవరి26) రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నాం. భూమికి, విత్తనానికి ఎంత సంబంధం ఉందో రైతుకు, కాంగ్రెస్‌కి అంతే అనుబంధం ఉంది. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం.వ్యవసాయం అంటే దండగ కాదు పండగ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో 10 లక్షల లబ్ధి. 70 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. మొదటి ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలిచ్చాం. 13 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.సర్పంచ్ ఊళ్లో లేకపోతే పదవి నుంచి దిగిపో అంటాం. మరి ప్రతిపక్షనేత సభకు రాకపోతే ఏమనాలి. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు రేషన్ కార్డులివ్వాలనిపించలేదు.పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతిరెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు..ఏ పదవి లేకున్నా నా సోదరుడు తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తుంటే విమర్శిస్తున్నారు. వాళ్లలా కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి మేము దోచుకోవడం లేదు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తిరుపతిరెడ్డి అందుబాటులో ఉంటారు. పదవి ఆశించకుండా ప్రజాసేవ చేస్తుంటే వాళ్లకు కడుపు మంట వస్తోంది. అందుకే వారి కడుపు మంట తగ్గడానికి ఈనో ప్యాకెట్లు పంపుతున్నాం’అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. -
అనర్హులకు పథకాలు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి,సూర్యాపేట జిల్లా: ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం(జనవరి26) సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో ప్రజాపాలన- పథకాల ప్రారంభోత్సవంలో తుమ్మల మాట్లాడారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. అర్హులైన చివరి లబ్ధిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తాం. రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తాం. అనర్హులు ఎవరైనా లబ్ధిపొందితే స్వచ్ఛందంగా వాటిని తిరిగి ఇచ్చేయాలి. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలి’అని తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా జనవరి 26 నుంచి రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను ప్రారంభించింది. జిల్లాల్లో మంత్రులు ఈ పథకాలను ప్రారంభించగా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాలను ప్రారంభించారు. -
పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టమేమీ లేదు: వంగా గీత
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పుకొచ్చారు పార్టీ నాయకురాలు వంగా గీతా. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరమని అన్నారు. పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోయినా వారి లోటు తీర్చలేము అంటూ వ్యాఖ్యలు చేశారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వంగా గీతా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజీనామా బాధాకరం. పార్టీలో ముఖ్యమైన, కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి. పార్టీ నుండి ఎవరూ వెళ్ళినా.. వారి లోటు తీర్చలేము. పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళినా వైఎస్సార్సీపీ కొనసాగుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా దృఢమైన నాయకుడు. ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అధికార మార్పిడి జరిగినప్పుడు ఆయా పార్టీల నుండి వ్యక్తులు బయటకు వెళ్ళడం.. మరి కొందరు చేరడం నిరంతర ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. పార్టీ అధినేత నడిచే విధానంపై పార్టీ ఉనికి ఉంటుంది. వైఎస్ జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే విషయమై అంతకుముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్ తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము.. అలాంటి వారిని ఆపలేం కదా?. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్‌కు తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు
అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు పేట్రేగి పోతున్నారు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా చేస్తామని ఎమ్మెల్యే శ్రావణి అనుచరుడు, టీడీపీ నేత నరసింహ యాదవ్ వీఆర్వోకు ఫోన్లో బెదిరించారు. ప్రస్తుతం నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మేం.. ఎమ్మెల్యే మనుషులం..ఇసుక అక్రమ రవాణా చేస్తాం. ఇసుక అక్రమ రవాణాకు పోలీసుల సహకారం ఉంది. మీరు అడ్డుకుంటే అంతు చూస్తామంటూ రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు.ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి నరసింహ యాదవ్.. వీఆర్వోను బెదిరించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
బీజేపీవి రాజ్యాంగ విరుద్ద కార్యక్రమాలు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు.