BCG
-
ఇన్సూర్టెక్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు
న్యూఢిల్లీ: భారత ఇన్సూర్టెక్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయని ఒక నివేదిక తెలిపింది. గడిచిన కొన్నేళ్లలో ఈ రంగం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించగా.. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తాయని అంచనా వేసింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్ (ఐఐఏ) ఈ నివేదికను రూపొందించాయి.‘‘ప్రస్తుతం భారత్‌లో 150 ఇన్సూర్టెక్ కంపెనీలు (బీమా రంగ టెక్నాలజీ సంస్థలు) ఉన్నాయి. ఇందులో 10 యూనికార్న్‌లు, సూనికార్న్లు, 45కు పైగా మినీకార్న్లు ఉండగా, గడిచిన ఐదేళ్లలో ఆదాయం 12 రెట్లు పెరిగి 750 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం మీద ఈ రంగంలోకి వచ్చిన నిధులు 2.5 బిలియన్ డాలర్లు. దీంతో మొత్తం ఎకోసిస్టమ్ విలువ 13.6 బిలియన్ డాలర్లను అధిగమించింది’’అని ఈ నివేదిక వివరించింది. డిమాండ్, పంపిణీపై ఇన్సూర్టెక్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయని, అండర్ రైటింగ్ (రిస్క్‌ల మదింపు), క్లెయిమ్‌లు, సేవల్లో ఆవిష్కరణలకు గణనీయమైన అవకాశాలున్నట్టు ఈ నివేదిక అభిప్రాయపడింది. అపార అవకాశాలు.. గడిచిన ఐదేళ్లలో భారత ఇన్సూర్టెక్ రంగం ఆదాయం 12 రెట్లు పెరిగినప్పటికీ.. భవిష్యత్తులో మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు బీసీజీ, ఐఐఏ నివేదిక వెల్లడించింది. ‘‘అండర్ రైటింగ్, క్లెయిమ్‌లలో డేటా, టెక్నాలజీ సామర్థ్యాల ను వినియోగించుకునేందుకు ఇన్సూర్టెక్ కంపెనీలకు అపార అవకాశాలున్నాయి’’ అని బీసీజీలో ఇండియా ఇన్సూరెన్స్ ప్రాక్టీస్ లీడ్, ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన పల్లవి మలాని తెలిపారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఇన్సూరెన్స్ పరంగా చెప్పుకోతగ్గ పురోగతి సాధించినప్పటికీ.. హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ ఇప్పటికీ ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందన్నారు. 45 శాతం వైద్య చికిత్సల వ్యయాలను జేబుల నుంచే వ్యయం చేయాల్సి వస్తున్నట్టు వివరించారు. దీంతో 2047 నాటికి నూరు శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సాధించడంతోపాటు, జేబు నుంచి చేసే వ్యయాలను 10 శాతం లోపునకు పరిమితం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఈ నివేదిక సూచించింది. ఇక అంతర్జాతీయంగా ఇన్సూర్టెక్ రంగంలోకి నిధుల రాక తగ్గినట్టు, ఆసియా పసిఫిక్ ప్రాంతం ఈ విషయంలో బలంగా నిలబడినట్టు ఈ నివేదిక తెలిపింది. -
ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్.. ప్రపంచం కంటే ముందుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తాజా పరిశోధన ప్రకారం.. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగిస్తూ విలువను పెంచుతున్నాయి.బీసీజీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తున్నాయి. ఫిన్‌టెక్, సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కొన్నేళ్ల పెట్టుబడి, నియామకం, పైలట్ ప్రాజెక్ట్‌ల తర్వాత ఇప్పుడు సీఈవోలు ఈ సాంకేతికత నుండి స్పష్టమైన రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దాని పూర్తి విలువను పొందడం కష్టంగా ఉందని వివరించింది.పరిశ్రమల అంతటా ఏఐ ప్రోగ్రామ్‌లు విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ, బీసీజీ తాజా పరిశోధన ప్రకారం, కేవలం 26 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా కాన్సెప్ట్‌ను దాటి ముందుకు వెళ్లడానికి, స్పష్టమైన విలువను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి.ఆసియా, యూరప్ ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన పది ప్రధాన పరిశ్రమలలో 1,000 మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సర్వే ఆధారంగా బీసీజీ ఈ నివేదికను రూపొందించింది. -
బ్యాంకు సర్వీసులను అప్డేట్ చేయట్లేదు.. బీసీజీ నివేదిక
గ్లోబల్ బ్యాంకులతో పోలిస్తే భారతీయ బ్యాంకులు ఐటీ సర్వీసులకు తక్కువ ఖర్చు చేస్తున్నాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకులు సాధారణంగా తమ ఆదాయంలో 7-9% వరకు ఐటీ ఖర్చులు చేస్తుండగా, భారతీయ బ్యాంకులు 5 శాతమే కేటాయిస్తున్నాయని నివేదిక పేర్కొంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విడుదల చేసిన ‘ది పోస్టర్ చైల్డ్’ నివేదికలో వివరాల ప్రకారం..2026 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు, రుణాలు మొత్తం 75 శాతం డిజిటల్ రూపంలో జరుగుతాయి. థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 25% కొత్త డిజిటల్ ఖాతాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం బ్యాంకులకు సమకూరే మొత్తం ఆదాయంలో ‘చేంజ్ ది బ్యాంక్ (సీటీబీ)’తో పోలిస్తే దాదాపు 80% ఐటీ బడ్జెట్ ‘రన్ ది బ్యాంక్ (ఆర్టీబీ)’ కోసం ఖర్చు చేస్తున్నారు. భారతీయ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరిచేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దాంతో ఐటీ కేటాయింపులు తగ్గుతున్నాయి. గ్లోబల్ బ్యాంకులు మాత్రం బ్యాంకింగ్ ఐటీ సేవల అప్డేట్లకు ప్రాధాన్యమిస్తున్నాయి.సుమారు 10 బిలియన్ డాలర్ల(రూ.83 వేలకోట్లు) కంటే ఎక్కువ నికర ఆదాయాన్ని ఆర్జించే గ్లోబల్ బ్యాంక్‌లు 9.1% ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు చేస్తున్నాయి. అదే భారతీయ బ్యాంకులు వాటి ఆదాయంలో కేవలం 3.2% మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ.8 వేలకోట్లు) నుంచి రూ.83 వేలకోట్లు మధ్య నికర ఆదాయాన్ని సంపాదించే బ్యాంకులు సరాసరి 7.2 శాతం ఐటీ బడ్జెట్‌కు ఖర్చు చేస్తున్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో ఈ వాటా 3 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టాటా స్టీల్..2,800 ఉద్యోగాల కోత2022, 2023లో ఆర్బీఐ అంబుడ్స్‌మన్ పరిధిలో 40,000 కంటే ఎక్కువ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించాలంటే మరింత సమర్థమైన ఐటీ సేవలందించాలి. దాంతో ఫిర్యాదులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏటా యూపీఐ, నగదు రహిత చెల్లింపులు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. మార్కెట్లో కొత్త ఫిన్‌టెక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ పోటీని తట్టుకోవాలంటే బ్యాంకులు అవి అందించే ఐటీ సర్వీసులను అప్డేట్ చేసుకోవాలని నివేదిక సూచిస్తుంది. -
మూడేళ్లలో 17 బిలియన్ డాలర్లకు!
నాస్కామ్–బీసీజీ నివేదిక ముంబై: దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ ఏటా 25–35% వృద్ధి చెందుతోంది. కంపెనీలు టెక్నాలజీపై మరింతగా ఖర్చు చేస్తుండటం, ఏఐ నిపుణులు.. ఏఐపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఇది 17 బిలియన్ డాలర్లకు చేరనుంది. టెక్నాలజీ, లీడర్ షిప్ ఫోరం 2024 సందర్భంగా సంయుక్త నివేదికలో టెక్ సంస్థల సమాఖ్య నాస్కామ్, బీసీజీ ఈ మేరకు అంచనా వేశాయి. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24% వృద్ధి చెందాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్, జెన్ఏఐ, ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వినూత్న సొల్యూషన్స్ .. టెక్నాలజీ సర్విస్ ప్రొవైడర్లు సాంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధిని దాటి ఏఐ ఆధారిత వినూత్న సేవలు, సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ టూల్స్, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్‌తో పాటు హెల్త్‌కేర్, బ్యాంకింగ్ .. ఫైనాన్స్, రిటైల్ వంటి నిర్దిష్ట రంగాల అవసరాలకు అనుగుణమైన ప్రొప్రైటరీ ఏఐ.. జనరేటివ్‌ఏఐ ప్లాట్‌ఫామ్స్ కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. ► ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గత ఏడేళ్లుగా చూస్తే ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ► ఏఐలో పెట్టుబడులు పెరిగే కొద్దీ భారత్‌లో కృత్రిమ మేధ నిపుణుల సంఖ్య 2027 నాటికి వార్షికంగా 15 శాతం మేర వృద్ధి చెందనుంది. -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
బై బై టీబీ.. కోవిడ్ తరహాలో క్షయ వ్యాధి నియంత్రణ
సాక్షి, అమరావతి: ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి క్షయ(టీబీ)ను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన ట్రేసింగ్–టెస్టింగ్–ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలోనూ పాటించనుంది. కరోనా పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇకపై మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలోనే ఇప్పటివరకు రెండు వారాలైనా తగ్గని దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడుతున్న వారికి ట్రూ నాట్ ల్యాబ్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నూతన విధానంలో గ్రామ స్థాయిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో టీబీ లక్షణాలున్న వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. టీబీ రోగుల కుటుంబ సభ్యులు, సుగర్ బాధితులు, ధూమపానం చేసే వారు, ఎయిడ్స్ రోగులు ఇతర హైరిస్క్ వర్గాల వారికి విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్క్రీనింగ్ చేస్తారు. వీరిలో ఎవరికైనా టీబీ లక్షణాలుంటే అక్కడే కఫం నమూనా సేకరిస్తారు. వాటిని ఓ ఏజెన్సీ ద్వారా ట్రూ నాట్ ల్యాబ్‌కు పంపుతారు. దీనివ్లల వీలైనంత ఎక్కువ మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి బయటపడుతుంది. ప్రజలు కూడా వ్యయప్రయాసలకోర్చి లేబొరేటరీ వరకు వెళ్లే అవసరం ఉండదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి తగ్గుతుంది. త్వరలో పైలెట్‌గా ప్రకాశం జిల్లాలో నూతన విధానాన్ని త్వరలో ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. విలేజ్ క్లినిక్‌ల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించడానికి ఊబర్, ఓలా, ర్యాపిడో తరహా ఏజెన్సీ ఎంపికకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లను పిలవనుంది. ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులో గమనించిన లోటుపాట్లను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. 93 శాతం సక్సెస్ రేటు దేశంలోనే సమర్థవంతంగా క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటోంది. 2020 నుంచి రాష్ట్రంలో సక్సెస్ రేటు 90 శాతం నమోదవుతోంది. 2021లో ఉత్తమ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు అందించింది. గత ఏడాది క్షయ రోగులకు చేసిన వైద్య చికిత్సలో 93 శాతం సక్సెస్ రేటు నమోదైంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా 8,52,414 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా 92,129 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 90,862 మందికి వైద్య సేవలు అందించారు. 84,501 మంది చికిత్స పూర్తి చేసుకుని వ్యాధి నుంచి బయటపడ్డారు. త్వరలో బీసీజీ వ్యాక్సినేషన్ కూడా పెద్దల్లో క్షయ వ్యాధిని నిరోధించడానికి ఉపయోగపడే బాసిల్లస్ కాల్మెట్ గురిన్ (బీసీజీ) టీకాను రాష్ట్రంలో పంపిణీకి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సమ్మతిని ఇచ్చాం. త్వరలో 50 శాతం జిల్లాల్లో టీకా పంపిణీ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే టీబీతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు, ఇతర హైరిస్క్ వర్గాల వారికి టీకా ఇస్తారు. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
దేశీ ఓటీటీ మార్కెట్ రూ.1,12,500 కోట్లు..
న్యూఢిల్లీ: దేశీ ఓటీటీ స్ట్రీమింగ్ పరిశ్రమ వచ్చే దశాబ్ద కాలంలో 22–25 శాతం మేర వార్షిక వృద్ధి సాధించనుంది. 13–15 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. మీడియా, వినోద రంగాలపై పరిశ్రమల సమాఖ్య సీఐఐ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అన్ని రకాల కంటెంట్ అందిస్తున్న దాదాపు 40 పైగా సంస్థలతో, తీవ్రమైన పోటీ ఉన్న వర్ధమాన దేశాల మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఆరేళ్లుగా చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, గత ఆరేళ్లలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం మొదలైనవి డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు గణనీయంగా తోడ్పడుతున్నాయని తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ వంటి అంతర్జాతీయ సంస్థలు అమెరికాతో పోలిస్తే భారత మార్కెట్లో మాత్రమే ప్రత్యేకంగా 70–90 శాతం తక్కువ రేట్లకు ఓటీటీలు అందిస్తుండటం మరో సానుకూలాంశమని వివరించింది. దేశీ ఒరిజినల్ కంటెంట్ రూపకల్పనలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌తో విదేశాల్లోని ప్రవాస భారతీయులకు కూడా భారతీయ ఓటీటీ సంస్థలు మరింత చేరువ కావడానికి ఆస్కారం ఉందని నివేదిక వివరించింది. సబ్స్క్రిప్షన్స్ ఆదాయం గత కొన్నాళ్లుగా ఏవీవోడీ (అడ్వర్టైజింగ్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)తో పోలిస్తే ఎస్‌వీవోడీ (సబ్స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్)కి డిమాండ్ బాగా పెరిగిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇది ఏవీవోడీని కూడా అధిగమించగలదని తెలిపింది. దేశీయంగా ఆహా, ఆల్ట్ బాలాజీ, జీ5, ఎరోస్ నౌ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్, సోనీలివ్ తదితర సంస్థలు ఓటీటీ విభాగంలో ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ మీడియా, వినోద పరిశ్రమ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి పుంజుకుంది. 2030 నాటికి 55–70 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఓటీటీ, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. చదవండి:ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే.. -
సమన్వయంతో సమర్థ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు జీవితకాలం తోడు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు సింగిల్‌విండో విధానంలో చేయూత అందించే విధంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఏపీ వన్’తో పాటు వివిధ విభాగాల వనరులను సమర్థంగా వినియోగించుకునే విధంగా నివేదిక రూపొందించే బాధ్యతను పరిశ్రమలశాఖ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ)నకు అప్పగించింది. విస్తృత అధ్యయనం అనంతరం పరిశ్రమలశాఖ పరిధిలోకి వచ్చే ఏపీఐఐసీ, ఏపీ ఈడీబీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, ఏపీఎస్ఎఫ్సీ, ఏపీటీపీసీలతోపాటు స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలను సమన్వయం చేసుకుంటూ మానవ వనరులను ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై ప్రతి విభాగానికి స్పష్టమైన విధివిధానాలను సూచిస్తూ బీసీజీ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాల అమలుపై పరిశ్రమలశాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం, నిర్వహణ వంటి వాటిల్లో ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని సందర్భాల్లో ఒకేపనిని రెండు సంస్థలు చేపట్టడంతో మానవ వనరులు, సమయం వృధా అవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ బీసీజీ పలు సూచనలు చేసింది. పరిశ్రమలశాఖ ఏయే రంగాల్లో పటిష్టంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ఈ నివేదికలో వివరించింది. అన్నీ వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కిందకు అన్ని శాఖలను సమన్వయపర్చేలా వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీసీజీ సిఫారసు చేసింది. వైఎస్సార్ ఏపీ వన్‌కి ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, 20 నుంచి 25 మంది ఉద్యోగులను నియమించాలంది. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను పునరుజ్జీవింప చేసేవిధంగా ఒక ప్రత్యేక సెల్‌తో పాటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, వైఎస్సార్ బడుగు వికాసం, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నివేదికను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ.. రాష్ట్రంలోని పరిశ్రమలకు జీవితకాలం హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడంతోపాటు కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సహాయకారిగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. -
కరోనా: 74.30 శాతానికి పెరిగిన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకుని శుక్రవారం 62,282 మంది రోగులు డిశ్చార్జి కావడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య కూడా 1.89 శాతానికి దిగివచ్చింది. కోవిడ్-19 నుంచి కోలుకుని ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకువచ్చే వారి సంఖ్య పెరగడంతో మొత్తం రికవరీల సంఖ్య 21,58,946కు ఎగబాకింది. యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 68,898 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,823కు చేరింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 983 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక టీబీ నిరోధానికి వాడే బీసీజీ టీకా పెద్దల్లో కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ ముంబైలో అధ్యయనం చేపట్టింది. ఐసీఎంఆర్ కోసం సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్, కేఈఎం ఆస్పత్రి, బీఎంసీ ప్రజారోగ్య విభాగం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తాయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. చదవండి : డిసెంబరు 3 నాటికి భారత్‌లో కరోనా అంతం! -
బీసీజీ, పోలియో టీకాలతో కరోనాకు చెక్!
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో క్షయ, పోలియో వ్యాక్సిన్లను ఉపయోగించే అవకాశాన్ని అమెరికా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో ట్యుబర్కులోసిస్ టీకా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకునేందుకు అమెరికాలో పరీక్షలు జరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. ‘కోవిడ్–19పై పోరాడేందుకు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఏకైక టీకా బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్టే గ్యురిన్)నే’అని టెక్సాస్ ఏ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో అన్నారు. (గూగుల్ @కరోనా సెంటర్) అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ఈ టీకాను సురక్షితంగా ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోవిడ్–19 నిలువరించేందుకు పోలియో వ్యాక్సిన్‌ను కూడా వాడొచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. పాక్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెసర్ అజ్రా రజా మాట్లాడుతూ.. బీసీజీ టీకా అనేక రకాల వైరస్‌లతోపాటు బ్లాడర్ క్యాన్సర్‌ను కూడా అడ్డుకున్నట్లు రుజువైందన్నారు. ‘బీసీజీ, పోలియోలపై పోరాడేందుకు గతంలో కోట్ల మందికి ఈ టీకాలను ఇచ్చాం. వీటితో బాధితులకు రిస్క్ చాలా తక్కువ. ఇవి శరీరంలో సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా సహా పలు వైరస్‌లను నియంత్రించే శక్తి వీటికి ఉంది’అని వీరు తెలిపారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. (కోవిడ్ పేదలు వంద కోట్లు) -
‘9/11 ఓ అధ్యాయమైతే.. కోవిడ్-19 ఓ పుస్తకం’
న్యూఢిల్లీ: కోవిడ్-19 ప్రపంచ రూపురేఖలను మార్చేసిందంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తి రెండు రకాలుగా ఉంది. మొదటిది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపితే.. రెండవది ప్రపంచ స్థితిగతులను మార్చేది. వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశాలన్ని గ్లోబలైజేషన్‌కు ప్రధాన కేంద్రాలుగా భాసిల్లే ప్రాంతాలు. కరోనా తర్వాత ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తాం. 9/11 దాడులను ప్రపంచం ఓ అధ్యాయంగా భావిస్తే.. ఇప్పుడు కోవిడ్-19ను ఓ పుస్తకంగా చూస్తుంది’ అన్నారు రాహుల్. అంతేకాక పెద్ద పట్టణ కేంద్రాలన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. మతాల వారిగా, ప్రాంతాల వారిగా, జాతుల వారిగా ఈ వ్యాధితో పోరాడలేమని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఈ బాధను భరించేందుకు మనం తయారవ్వాలని రాహుల్ సూచించారు. (‘ఇది అసంబద్ధం.. వారంతా భారతీయులు’) కోవిడ్-19 సంక్షోభం గురించి రాహుల్ గాంధీ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ కేర్ నిపుణుడు డాక్టర్ ఆశిష్ ఝాతో పాటు ఎపిడమాలజిస్ట్, స్వీడన్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జోహన్ గీసెక్‌తో సంభాషించారు. ఈ క్రమంలో భారతదేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత కరోనాను నివారించగలదా అని ఆశిష్‌ను ప్రశ్నించారు రాహుల్. దానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఆశిష్. ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయడం వల్ల మాత్రమే వైరస్ వ్యాప్తిని తగ్గించగలమని పేర్కొన్నారు. అంతేకాక భారతీయులు తీసుకునే బీసీజీ వ్యాక్సిన్ వల్ల మన దగ్గర తక్కువ కేసులు నమోదవుతున్నాయనే విషయాన్ని కూడా తాను సమర్ధించడం లేదన్నారు ఆశిష్. ఇందుకు తగిన ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు.(‘ఆర్థిక ప్యాకేజీని పునఃపరిశీలించండి’) -
మాస్కుతోనే వైరస్‌ను పట్టేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కొమ్ములు వంచేందుకు కృత్రిమ జీవశాస్త్రం, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటున్నామని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జిమ్ కోలిన్స్ వెల్లడించారు. వాటి సాయంతో కరోనా నివారణకు టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టెడ్ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టెక్నాలజీ ఎడ్యుకేషన్, డిజైన్ గురించి వివరించారు. కొన్ని నెలల కింద తాము యాంటీ బయోటిక్ మందులకూ లొంగని బ్యాక్టీరియా సమస్యను ఎదుర్కొనేందుకు మొదలుపెట్టిన ప్రాజెక్టును కరోనా నేపథ్యంలో మార్చేశామని, మెషీన్ లెర్నింగ్‌ను కరోనా టీకా, చికిత్సకు అవసరమైన మందులను అభివృద్ధి చేసేందుకు వాడొచ్చని కోలిన్స్ అంటున్నారు. ప్రస్తుతం తాము మూలకాల ట్రైనింగ్ లైబ్రరీ సిద్ధం చేస్తున్నామని, వీటిని కరోనా వైరస్‌పై ప్రయోగించి ఏవి సమర్థంగా పనిచేస్తున్నాయో గుర్తిస్తున్నామని చెప్పారు. ఈ సమాచారం మొత్తాన్ని మెషీన్ లెర్నింగ్ కంప్యూటర్లకు అందిస్తే.. అవి వంద కోట్ల మూలకాలను కంప్యూటర్లపై సిద్ధం చేసుకుని వాటిల్లో కరోనా వైరస్ చికిత్సకు ఉపయోగపడే వాటిని గుర్తిస్తుందని వివరించారు. ఇలా గుర్తించిన మూలకాలను వైరస్‌పై ప్రయోగించడం ద్వారా టీకా, మందుల తయారీని వేగవంతం చేయొచ్చని తెలిపారు. శ్వాసతోనే వైరస్ గుర్తింపు.. కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా గుర్తిస్తే చికిత్స అంత సులువు కావడమే కాకుండా.. వ్యాప్తిని కూడా సమర్థంగా అడ్డుకోవచ్చు. అయితే ప్రస్తుత పరీక్షలు వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ సమస్యను అధిగమించేందుకు జిమ్ కోలిన్స్ వినూత్నమైన ఐడియా ప్రతిపాదిస్తున్నారు. మన కణాల్లోని వ్యవస్థలను వేరు చేసి.. వాటిని కాగితంపై అతికించొచ్చని, దీనికి ఆర్ఎన్ఏను జోడించడం ద్వారా ఎబోలా, జికా వైరస్‌లను చౌకగా గుర్తించే కిట్లు గతంలో తయారయ్యాయని కోలిన్స్ గుర్తుచేశారు. ఇదే టెక్నాలజీని కాగితంపై కాకుం డా.. వస్త్రాలపై వాడటం ద్వారా వైరస్ ఉనికిని గుర్తించే మాస్కులను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఊపిరితో పాటు వచ్చే చెమ్మలో వైరస్ ఉంటే.. మాస్కు తయారైన వస్త్రంలో ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఏ సెన్సర్లు వెంటనే స్పందిస్తాయని, ఆ వెంటనే మాస్కు రంగు మారిపోతుందని తెలిపారు. ఈ పద్ధతిలో వైరస్ సోకిన ఒకట్రెండు గంటల్లోనే రోగిని గుర్తించడం వీలు కానుంది. బీసీజీ టీకాకే మార్పులు జిమ్ కోలిన్స్ క్షయ వ్యాధి నివారణ కోసం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న బీసీజీ టీకానే కొన్ని మార్పులు చేయడం ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చని కోలిన్స్ అంటున్నారు. బలహీనమైన వైరస్ సాయంతో తయారైన బీసీజీ టీకాను అవసరానికి తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందని కోలిన్స్ తెలిపారు. ఇదే వైరస్‌లో కొన్ని మార్పులు చేసి కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేయగల యాంటీజెన్లు ఉత్పత్తి చేసేలా చేస్తే కరోనాకు టీకా సిద్ధమవుతుందని కోలిన్స్ అంచనా. ప్రస్తుతానికి తమ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నాయని.. త్వరలోనే పూర్తిస్థాయిలో వీటిని సాకారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కోలిన్స్ వివరించారు. -
ఆ దేశాలకు కరోనా ముప్పు తక్కువేనా!?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 80 వేల మందికి పైగా పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనాపై పోరాటంలో తాజాగా బయటికొచ్చిన ఓ అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్షయ వ్యాధి నివారణలో కీలకంగా పనిచేసే బాసిల్ కాల్మెట్-గురిన్ (బీసీజీ) వ్యాక్సిన్ కోవిడ్-19 బాధితులు కోలుకునేందుకు చక్కగా పనిచేస్తున్నట్టు ‘కరోనా ఇన్ఫెక్షన్- బీసీజీ వ్యాక్సినేషన్ దేశాల్లో పరిస్థితి’ అంశంపై స్టడీ చేస్తున్న వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో బీసీజీ వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో మృతుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. కోవిడ్-19 సోకిన బాధితుల్లో శ్వాస సంబంధ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీసీజీ టీకా రోగ నిరోధక శక్తి పెంచుతోందా అనే దిశగా వారి పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాగా, క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను 1920లో ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక మంది క్షయ బారినపడ్డ దేశంగా పేరు తెచ్చుకున్న భారత్‌లో అది 1948లో అందుబాటులోకి వచ్చింది. బీసీజీ కారణంగా క్షయ వ్యాధి బారినపపడ్డ ఎంతో మంది ప్రాణాలు నిలిచాయని.. అధ్యయన బృందంలో సభ్యుడు, హూస్టన్‌లోని యూరలోజిక్ అంకోలజీ అండ్ క్యాన్సర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ ఆశిష్ కామత్ చెప్పారు. ఇక బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిన దేశాల్లో కరోనా మృతుల రేటు ఒక మిలియన్‌కు 4.28 ఉండగా.. వ్యాక్సినేషన్ జరగని దేశాల్లో మరణాల రేటు ఒక మిలియన్‌కు 40గా ఉందని స్టడీ వెల్లడించింది. సార్వత్రిక, దీర్ఘకాలిక బీసీజీ విధానాలతో ఉన్న దేశాలతో పోల్చితే .. బీసీజీ టీకా విధానాలు లేని అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది. ఇక కరోనాపై యుద్ధంలో బీసీజీ వ్యాక్సినేషన్ అనేది భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ.. అంతటితో సంతృప్తి చెందకూడదని కామత్ స్పష్టం చేశారు. అయితే, పెద్ద ఎత్తున ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు జరగనిదే.. బీసీజీ టీకాపై నిశ్చిత అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందని భారత్‌లోని వైద్యులు చెప్తున్నారు. -
బీసీజీ వ్యాక్సిన్‌తో కరోనా నుంచి రక్షణ?
న్యూఢిల్లీ: పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇచ్చే బాసిల్లస్ కాల్మెట్టే గుయారిన్ (బీసీజీ) టీకా కరోనాపై పోరులో కీలకం కానుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. క్షయ వ్యాధి నివారణకు ఇచ్చే బీసీజీ టీకాతోపాటు సార్వత్రిక టీకా కార్యక్రమాలు లేని దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త గొజాలో ఓటాజూ తెలిపారు. అమెరికాలో సుమారు 1.90 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా ఇటలీలో ఈ సంఖ్య 1.05 లక్షలుగా ఉంది. అమెరికాలో నాలుగు వేల మంది, ఇటలీలో 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. (‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు ) -
మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదికలన్నీ పరిపాలన వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాయి. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం రూపొందించిన అమరావతి మెగా సిటీ నిర్మాణం సాధ్యం కాదని, మెగా సిటీల నిర్మాణం కాన్సెప్ట్ ప్రపంచంలో విఫలమైందని ఉదాహరణలతో వివరించాయి. అమరావతి మెగా సిటీ నిర్మాణ ప్రణాళిక కూడా విఫల ప్రయోగమేనని స్పష్టం చేశాయి. అత్యధిక శాతం ప్రజలు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న తరుణంలో మూడు కమిటీల సిఫార్సులు క్లుప్తంగా.. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులు - రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని నగరం ఏర్పాటు చేయడం మంచి ఆలోచన కాదని స్పష్టం చేసింది. గ్రీన్ సిటీ నిర్మాణం సాధ్యాసాధ్యాల మీదా విస్తృతంగా పరిశీలించింది. గ్రీన్ సిటీ నిర్మాణం రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని అభిప్రాయపడింది. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. ఈ కమిటీ ఇంకా ఏమి సిఫారసు చేసిందంటే.. - విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. జీఎన్ రావు కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు.. - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉండే పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సమస్యా ఉండదు. - అమరావతి ప్రాంతంలో కొంత వరద ముంపునకు గురవుతుంది. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్టుమెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటిని మార్చి, ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యాకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరులను పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించరాదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు సిఫార్సులు.. - పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. సచివాలయానికి ఏడాదిలో మొత్తం లక్ష మంది వస్తే అందులో 75 శాతం మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. మిగతా వారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లులకోసం వచ్చే వారే. - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15–16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌లలో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 సంవత్సరం వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ విఫలమయ్యాయి. కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50% సాధించాయి. మిగతావన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతిలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకు పోలవరం – బొల్లాపల్లి– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.150 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెడుతుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా ప్రవేశ పెడతారు. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమకు అందిన రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ దశల వారీగా సమగ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. -
రాజధానికి దూరమైనా.. అభివృద్ధికి దగ్గరే
రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలంటూ విష ప్రచారం చేస్తున్న కొందరికి.. అసలు దేశ రాజధాని ఎక్కడుందో? ఏయే రాష్ట్రాలకు ఎంత దూరంలో ఉందో తెలుసా? పక్కనున్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల రాజధానులు ఆయా జిల్లా కేంద్రాలకు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా? అంతెందుకు మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్‌కు, శ్రీకాకుళానికి మధ్య దూరం ఎంతో గుర్తుందా? సెకన్ల వ్యవధిలో ఖండాంతరాలు దాటేలా సమాచార విప్లవం ఇవాళ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇ–ఫైళ్లు, ఇంటర్నెట్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్.. ఇలా పేరేదైనా కావచ్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్, ప్రైవేట్ కార్యాలయాలు క్షణాల్లో సమాచారాన్ని అటూ ఇటూ.. ఇటూ అటూ బట్వాడా చేసేస్తున్నాయి. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య దూరం అనేది అభివృద్ధిపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. మౌలిక వసతుల కల్పన, ప్రకృతి వనరుల సద్వినియోగంపై మాత్రమే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుందని ఎన్నో నగరాల చరిత్ర చెబుతోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని అత్యధిక జిల్లాలు రాజధాని నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తుండటం గమనార్హం. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో సత్వర ప్రాంతీయ సమగ్రాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశాయి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి. శాసన, న్యాయ, పరిపాలన రాజధానులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పరచవచ్చని నివేదించాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు నానా యాగీ చేస్తున్నాయి. ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రకు తెరతీశాయి. మరోవైపు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని వితండవాదనను లేవనెత్తుతున్నాయి. అసలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? దేశ రాజధానికి దగ్గరగా ఉండటానికి – అభివృద్ధికి సంబంధం ఉందా? అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేశ రాజధానికి ఎంత దూరంలో ఉన్నాయి? అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జిల్లాలకు ఆ రాష్ట్ర రాజధాని ఎంత దూరంలో ఉంది? మొదలైన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని సమీపంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. దేశ రాజధానికి దూరంగా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాలు వెనుకబడే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రాల రాజధానులకు దూరంగానే ఉండటం గమనార్హం. – సాక్షి, అమరావతి నంబర్ వన్ కేరళ.. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సూచీ నివేదిక–2019 ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఢిల్లీకి 2,814 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం రాజధానిగా ఉన్న కేరళ సమగ్రాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఢిల్లీకి కేవలం 497 కిలోమీటర్ల దూరంలో లక్నో రాజధానిగా ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఢిల్లీకి దూరంగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. వాటికంటే దేశ రాజధానికి ఎంతో సమీపంలో ఉన్న బిహార్ చిట్టచివరి స్థానానికి పడిపోయింది. సమగ్రాభివృద్ధి సూచీ టాప్–10 జాబితాలో ఢిల్లీకి సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చోటే లేకుండాపోయింది. దేశ రాజధానికి అత్యంత దూరంలో ఉండే సిక్కిం.. పెద్ద రాష్ట్రాలను తోసిరాజని ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్ ఢిల్లీకి 1,598 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి రాజధానికి దగ్గరగా ఉన్నామా.. దూరంగా ఉన్నామా.. అన్నదానికీ, అభివృద్ధికి సంబంధం లేదని నీతి ఆయోగ్ నివేదికే స్పష్టం చేస్తోంది. పరిపాలనా దక్షత, నిబద్ధత ఉంటే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ నివేదిక సమగ్రాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి(ఐరాస) నిర్ణయించిన 17 ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ప్రధానంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల ప్రాతిపదికన గరిష్టంగా 100 పాయింట్లతో సమగ్రాభివృద్ధి సూచీని నిర్ణయించారు. అందులో 65 నుంచి 99 మధ్య పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ప్రగతిపథంలో ముందుండగా, 50 నుంచి 64 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనపరిచినవిగా.. .0 నుంచి 49 పాయింట్లు సాధించిన రాష్ట్రాలు ఆశావహ (అంటే ఇంకా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన) రాష్ట్రాలుగా నిర్ణయించింది. కేరళ 70 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. 69 పాయింట్లతో హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానంలో, 67 పాయింట్లతో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం దక్కించుకున్నాయి. కర్ణాటక 66 పాయింట్లతో నాలుగో స్థానం, గోవా, సిక్కిం 65 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా మహారాష్ట్ర, గుజరాత్ 64 పాయింట్లతో ఆరో స్థానం సాధించాయి. సమగ్రాభివృద్ధి సూచీలో అగ్ర స్థానంలో ఉన్న పది రాష్ట్రాల్లో తొమ్మిది అంటే కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్ దేశ రాజధాని ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్క హిమాచల్‌ప్రదేశ్ మాత్రమే సమీపంలో ఉంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్ 23వ స్థానంలో, బిహార్ చివరి స్థానంలో ఉండటం గమనార్హం. నీతి ఆయోగ్ నివేదిక మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. పేదరిక నిర్మూలనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొంది. ఇక జీరో హంగర్ (ఆకలి సమస్యను పరిష్కరించడం)లో గోవా, మిజోరం, కేరళ, నాగాలాండ్, మణిపూర్ మొదటి స్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీకి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి దేశంలో అభివృద్ధి పథంలో ముందున్న అత్యధిక రాష్ట్రాల్లో రాజధానులు ఆ రాష్ట్రాల్లోని మెజార్టీ జిల్లాలకు దూరంగానే ఉన్నాయన్నది అక్షర సత్యం. యావత్ రాష్ట్రం అభివృద్ధికి చోదకశక్తిగా పని చేసేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న నగరాలనే రాజధానులుగా ఎంపిక చేశారు. అంతేగానీ రాష్ట్రానికి మధ్యలో ఉందా.. అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందా.. అని స్కేల్ పట్టుకుని కొలిచి రాజధానులను నిర్ణయించలేదని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికే తగిన మౌలిక వసతులతో ఉన్న నగరాలను రాజధానులుగా చేసుకుని రాష్ట్రం మొత్తం అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా కృషి చేశారు. అంతేగానీ ఎక్కడో ఖాళీ భూముల్లో రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పేరిట భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ లేదు. తమిళనాడుకు ఉత్తరాన చిట్టచివరన ఆ రాష్ట్ర రాజధాని చెన్నై ఉండగా అత్యధిక జిల్లాలు ఆ నగరానికి సుదూరంగా ఉన్నాయి. కర్ణాటకలో తూర్పు దిశలో ఏపీ సరిహద్దుకు సమీపంలో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు ఉండగా మెజార్టీ జిల్లాలు పశ్చిమ వైపున దూరంగా అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో మెజార్టీ జిల్లాలు ఆ రాష్ట్రానికి మధ్య, దక్షిణ, తూర్పు దిక్కున ఉండగా రాజధాని ముంబై మాత్రం పశ్చిమాన చిట్టచివరగా అరేబియా సముద్ర తీరంలో ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురం ఆ రాష్ట్రానికి దక్షిణాన చిట్టచివరలో అరేబియా సముద్ర తీరంలో ఉండగా.. మెజార్టీ జిల్లాలు ఉత్తర, పశ్చిమాలుగా విస్తరించి ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. సమగ్రాభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కాబట్టి రాజధాని అన్నది అన్ని జిల్లాలకు సమాన దూరంలో రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలనడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉన్న మధ్యప్రదేశ్, లక్నో అభివృద్ధి సాధించలేకపోయాయని కూడా గుర్తు చేస్తున్నారు. వికేంద్రీకరణతో సొంతూళ్లలోనే సమస్యల పరిష్కారం సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల ద్వారా సొంతూళ్లోనే సమస్యలు పరిష్కారమవుతున్నప్పుడు ఎవరికైనా అదే పనిగా రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? అలాగే ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయం, హెచ్‌వోడీ(విభాగాధిపతుల కార్యాలయాలు)ల వద్ద సాధారణ ప్రజలకు పని ఉండే అవకాశాలు చాలా తక్కువ..! ఈ నేపథ్యంలో సదుపాయాలను బట్టి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సామాజికవేత్తలు, మేధావులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడీషియల్ కేపిటల్), అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్లను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి సమ న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. అమరావతిలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడటం ద్వారా.. తక్కువ ధరలకే కాజేసిన వేలాది ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికే పచ్చదండు రాజధాని గ్రామాల రైతుల పేరుతో ఉద్యమాలను చేస్తోందని విమర్శిస్తున్నారు. రాజధాని, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై పశ్చిమతీరాన అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ రాష్ట్రంలో గోండియా జిల్లా కేంద్రానికి ముంబైకి మధ్య దూరం 1,060 కి.మీలు. గడ్చిరోలి జిల్లా కేంద్రానికీ ముంబైకి మధ్య దూరం 942 కి.మీలు. తమిళనాడు రాజధాని చెన్నైకి ఆ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కన్యాకుమారి మధ్య ఉన్న దూరం 718 కి.మీలు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో రాజధాని నగరాలకు కొన్ని జిల్లాలకు మధ్య దూరం ఎక్కువ. కానీ ఆ రాష్ట్రాల్లో రాజధాని అంశంపై సామాన్య ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతగానీ, ఇబ్బందులుగానీ ఉత్పన్నం అయిన దాఖలాలు లేవని మేధావులు గుర్తు చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ.. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరించిన విషయం తెలిసిందే. దాదాపు 534 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించడానికి శ్రీకారం చుట్టారు. అంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకే వెళ్లాల్సిన అగత్యం ఇక ఉండదు. పట్టణ ప్రజలూ అంతే. అలాంటప్పుడు సమస్యల పరిష్కారం కోసం రాజధానికి వెళ్లాల్సిన అవసరం వారికి ఏముంటుందని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. -
జనవరి 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
-
ఈనెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ నెల 20వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధాని సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదిక, గతంలో కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 18న కేబినెట్ భేటీ కానుంది. చదవండి: అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ముగిసిన హై పవర్ కమిటీ భేటీ వికేంద్రీకరణకే పెద్దపీట -
మీ మాట తీరు ఇక మారదా బాబూ!
బోస్టన్ కమిటీ నివేదిక సారాంశాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున వివరించిన దళిత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం బాబులో పేరుకుపోయిన ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు. మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా, దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరాని వారిగా చేసిందని రాహుల్ సాంకృత్యాయన్ అందుకే శఠించాడు. ఇలాంటి ధోరణులు చావనందునే, కుల వ్యవస్థకు ప్రతీకగా బాబు, ‘దళితుడుగా పుట్టాలని ఎవడైనా కోరు కుంటాడా’ అని ఎత్తిపొడిచి మనస్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గర పుంగనూరు సంస్థానమని వెనకటికొక సంస్థానం ఉండేది. ఆ సంస్థానానికి ‘వెర్రిబాగులది’ అనే పేరుండేదట. అదొకప్పటి జమీందారీ పట్టణం. జమీందారీ దర్జాకు తగ్గట్టు దానికి మంచి పేరుండాలి కదా, మరీ ‘వెర్రిబాగులది’ అన్నపేరు ఎందుకొచ్చి ఉంటుంది? ఎందుకంటే, పుంగనూరు రాజూ (జమీందారు), అతడి మంత్రీ, వారి అనుయాయులూ– అందరూ ‘వెర్రివెంగళప్ప’ చేష్టలకు అలవాటు పడ్డారట. అలాగే నెల్లూరు తాలూకాలో ఒక పుంజులూరు పాటి కుటుంబాన్ని కూడా ఎగతాళి పట్టిస్తూ ‘పోరా పుంజులూరు’ అని తిట్టు అర్థంలో వాడేవారట! చంద్రబాబు పేరిట ఇలాంటి సామెతలు ఉనికిలో లేకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఆయన చేస్తున్న కుప్పిగంతులవల్ల విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ అంతకంతా అనుభవిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కొంపాగోడూ కోల్పోయిన స్థితిలో కొత్త రాజధాని నిర్మాణానికి తగిన స్థల నిర్దేశానికి శాశ్వత కట్టడాలకు వీలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే శాసనసభ సమావేశాలు నిర్వహించుకునే హక్కును కల్పించింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఆ పదేళ్ల వ్యవధిలో నూతన రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రదేశంలో రాజధాని నిర్మాణాన్ని సానుకూలం చేసుకోవలసింది. కానీ ఈలోగా ఓటుకు కోట్లు కేసులో దొరికి పోయిన బాబు ఆ కేసునుంచి బయటపడే మార్గంలేక అర్థరాత్రి అధికార సరంజామాను ఉమ్మడి సచివాలయం నుంచి ఆగమేఘాల మీద పెట్టే–బేడాతో విజయవాడ వైపునకు తరలించుకుపోవలసి వచ్చింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం తరఫున నూతన రాజధాని నిర్మాణానికి అనువైన భూసార, పర్యావరణ, వాస్తుశిల్ప ప్రమాణా లకు అనుగుణమైన ప్రాంతాలను సందర్శించి రాజధానికి, సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి వివిధ శాఖలకు చెందిన సకల సాంకేతిక, నిర్మాణ, పర్యావరణ నిపుణులతో కూడిన శివరామకృష్ణ్ణన్ కమిటీ నివేదిక సమర్పించగా, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా బాబు తొక్కిపెట్టడం ఓ పెద్ద ప్రహసనం. ఆ నివేదిక స్థానే నాటి మంత్రి నారాయణతో ఒక నివేదికను తయారుచేయించి, నిపుణుల నివేదికను బేఖాతరు చేయించారు. రాజధానిగా అమరావతిని నిర్ణ యించినట్లు చెప్పకుండా కొంతసేపు నూజివీడనీ, గన్నవరం అనీ, విజయవాడ–గుంటూరు మధ్యన అనీ.. ఊహాగానాలు వ్యాప్తి చేశారు. అమరావతిలోని మూడు–నాలుగు పంటలు పండే భూము లపై కన్నుపడి, ఆ భూముల స్వాధీనానికి భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) పేరుతో, మధ్యతరగతి ప్రజలనుంచి తక్కువ రేటుకు భూములు గుంజేశారు, కానీ మోతుబరులు ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చని ఆశించి రాజధానికోసం భూములిచ్చారు. తీరా చూస్తే జరిగింది రాజధాని నిర్మాణం కాదు, సినిమా సెట్టిం గులు చూపి అమరావతి ప్రజల్ని మోసగించటం. మంచి పంట భూముల్ని వదులుకోడానికి ఇష్టపడని పేద రైతుల్ని బెదిరించారు, అర్ధరాత్రి పంట భూముల్ని తగలబెట్టించి, పంట భూముల వినా శనం కనబడకుండా తిరిగి అర్ధరాత్రిపూట దున్నించి చదును చేయించ డమూ స్థానిక ప్రజలు కళ్లారా గమనించారు. అన్నింటికన్నా అసలు విషయం–అమరావతిపై కేంద్రీకరణ రాజధాని నిర్మాణం కోసం కాదు, అక్కడి చుట్టుపట్ల భూముల పైన, వాటి విలువపైన, స్పెక్యు లేషన్ విలువను పెంచుకోవడం కోసం... పైగా ఒక్క మొన్నటి శివ రామకృష్ణన్ కమిటీయే కాదు, నిన్నటి జీఎన్ రావు ఉన్నతాధికార కమిటీ, నేటి బోస్టన్ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల కమిటీ ఇచ్చిన నివే దికలు కూడా–ఒకే ప్రాంతంలో పరిపాలన, అధికారాల కేంద్రీకర ణకుగాక అభివృద్ధి వికేంద్రీకరణకు ఏక ముఖంగా సానుకూలత వెలిబుచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వాతావరణ, భూసార పరిస్థితులు, తుఫానులు, సముద్ర మట్టానికి అతి తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతా లకు, పంటలకు, వరదలవల్ల ప్రజలకు, నిర్మాణాలకు కలిగే బీభత్సం, హాని వగైరా అంశాలను దృష్టిలో పెట్టుకున్నందునే నివే దికలు వేరుగా వెలువడినా నిర్ణయాలు దాదాపు ఒక తీరుగానే ఉండటం అనుభవ నైపుణ్యంగా పరిగణించాలి. చివరికి శివరామకృష్ణ కమిటీకన్నా ఆరేడేళ్ల ముందే అమరావతి ప్రాంతానికి 15 అడుగుల్లోనే నీరు పైకి ఉబికి వచ్చి ముంచే ప్రమాదం ఉందనీ.. గుంటూరు, విజయవాడ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హైద రాబాద్ పర్యావరణ రక్షణ సంస్థ సర్వే వరద హెచ్చరిక చేసింది. వీటన్నింటి సారాంశాన్ని క్రోడీకరించుకుని ప్రజలకు ఓపికతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరఫున వివరించిన ఐఏఎస్ అధికారి, దళిత అధికారి అయిన విజయ్‌కుమార్‌ను అక్కసుకొద్దీ చంద్రబాబు ఆ ‘విజయ్‌కుమార్‌గాడు’ మాకు పాఠాలు చెబుతాడా అని నోరు పారేసుకోవడం వర్గ, వర్ణ వ్యవస్థా చట్రంలో ‘కుల’ అహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం. ‘పుట్టుకతో పుట్టిన బుద్ధి పుడకలతో పోదన్న’ తెలుగు సామెతను బాబు అక్షరాలా నిరూపించాడు. మన సభ్యతా, సంస్కృతీ ఎంతో గొప్పవని గొప్పలు చెప్పుకున్నా దేశ ప్రజల్లోని మూడోవంతు ప్రజల్ని అంటరానివారిగా చేసిందని రాహుల్ సాంకృ త్యాయన్ అందుకే శఠించాడు. అంతేగాదు, ఈ కుల భేదాల్ని బ్రహ్మ ముఖం నుంచి వెలువడ్డ వ్యవస్థగా ప్రకటించి దేశంలో జాతీయ ఐక్యతకు అవకాశమే లేకుండా చేసిందనీ, ‘ఈ ధోరణి సృష్టిలో సర్వ శ్రేష్టుడైన మానవుణ్ణి ఆవుముందూ, కోతిముందూ సాగిలపడేట్టూ చేసిందనీ, పాప పరిహారం పేరిట మానవుల చేత ఆవుపేడనూ తిని పించిందనీ, ఈ ధోరణే సగం జనాభా అయిన స్త్రీలకు నాగరిక అధి కారాలు లేకుండా చేసిందనీ, వందల సంవత్సరాల వరకూ సహగ మనం పేర కోట్లాది తరుణుల జీవితాన్ని బుగ్గిపాలు చేసిందనీ’ మహా పండిత రాహుల్జీ ఆక్రోశించవలసి వచ్చింది. ఇలాంటి ధోర ణులు చావనందుననే, కుల వ్యవస్థకు ప్రతీకగా చంద్రబాబు, ‘దళి తుడుగా పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా’ అని ఎత్తిపొడిచి మన స్సులను ఇంతకుముందూ గాయపరిచిన విషయం మరవరానిది. తప్పును తప్పుగా అంగీకరించే గుణం ఆయనకి ఏనాడూ లేదు. పైగా, చంద్రబాబు ఎంతటి అబద్ధమైనా, అంత సులువుగా ఆడ గలడంటే– తన ‘దార్శనిక దృష్టి’ ఎంతవరకూ కొడిగట్టుకు పోయిం దంటే, తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివరంగా తయారు చేసిన ‘విజన్–2029’ నివేదికను బోస్టన్ కన్సల్టెన్సీ (బీసీజీ) నిపు ణులు తమ రిపోర్ట్‌లో ‘కట్ అండ్ పేస్ట్’ చేసుకొని కాపీకొట్టి సిద్ధం చేశారని ‘కోత’లు కోయగలిగినంతగా ఆయన ‘విజన్’ మసకబారి పోయింది. ఆయన ‘దార్శనిక దృష్టి’ ఎంతగా కొడిగట్టుకుపోయిం దంటే– అమరావతి రైతులతో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి వర్గం స్వయంగా వచ్చి వారికి, వారి భూములకు ల్యాండ్‌ఫూలింగ్ బాధలవల్ల కలిగిన కష్టనష్టాలను చెవులారా విన్న తరువాత చంద్రబాబు కలలు సాకారం కావడానికి నిధులు ఇవ్వడాన్ని నిలిపివేస్తూ బ్యాంక్ ప్రకటన చేసింది. ఇదే ప్రపంచబ్యాంకు చంద్రబాబు ‘విజన్–2020’కి కూడా నిధులు హామీ పడి షరతులతో బిగించినప్పుడు, ఇదే బాబు పళ్లబిగువు కోసం ‘అబ్బే, ఎలాంటి షరతులు లేవని’ నాడు కోతలు కోస్తే, వెంటనే బ్యాంకు ‘అన్ని షరతులను బాబు అంగీకరించాడ’ని లిఖితపూర్వక పత్రంలో పేర్కొన్నది. ‘అబద్ధాల కోరు నోటికి అరవీశెడు సున్నం’ పెట్టుకున్న సామెత ఎందుకు వచ్చిందో అప్పుడుగానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు. చివరికి వరల్డ్ బ్యాంక్ అధినేతలతో (ఉల్ఫోవిజ్ వగైరాతో) ఢిల్లీలో ముఖ్యమంత్రి హోదాలో రుణాల కోసం జరిపిన చర్చలలో తాను తప్ప రాష్ట్ర అధికారులు ఎవరినీ ఆయన పాల్గొన నివ్వలేదు. పైగా, బ్యాంకు అనుబంధ సంస్థ అయిన డీఎఫ్ఐడీ రుణ సంస్థ అంతవరకూ అందించిన రుణాలు ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రజల ప్రయోజనాలకు దోహదపడ్డాయో విచారించి బ్యాంకుకు నివే దిక అందించిన సంస్థ నిపుణ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జేమ్స్మానర్స్ ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా మంత్రుల నుంచి కింది స్థాయి వరకు అవినీతి ఏరులై పారుతోందని పేర్కొన్నాడు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని, ఆయన ఎరుక లేకుండా ఏ పనీ జరగడంలేదనీ ప్రొఫెసర్ మానర్స్ ఉదహరించాడు. అందుకే మహో న్నత మానవుడు, మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ ‘కమాల్ పుటి కబీర్ వంశాన్ని నట్టేట ముంచాడ’ని చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు ప్రవేశం ఒక్క ఎన్టీఆర్కే కాదు, యావ దాంధ్ర ప్రజల శ్రేయస్సుకు, రాష్ట్ర ప్రగతికీ వినాశకర పరిణామం. ఎలాగూ ‘దేవతాపురం’గా అమరావతి పేరుండిపోయింది గనుక, దాన్ని అలా తలచుకుంటూ కొలుచుకుంటేనే మంచిదేమో! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు
దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను దూషిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళిత, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు తన కుల అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డాయి. విజయకుమార్‌కు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు పెట్టాలంటూ పోలీస్స్టేషన్లలో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి, అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని అంశాలను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదుగురు మంత్రులు తీవ్రంగా ఖండించారు. విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని మంత్రులు నారాయణస్వామి, విశ్వరూప్, సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాకే చంద్రబాబు బయటకు రావాలన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి హోదాలో విజయకుమార్ బీసీజీ నివేదికపై మీడియాకు వివరించారని వారు గుర్తుచేశారు. దీనిపై చంద్రబాబు చేసిన విమర్శలు చౌకబారుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విజయకుమార్‌ను ‘గాడు’ అనడం ద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని సీఎంగా ఉన్నప్పుడు వ్యాఖ్యానించిన చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీ మహిళల మీద చేయిచేసుకోవడం లాంటి సంఘటనలతో పలుమార్లు కులపరంగా తనకున్న దురహంకార నిజస్వరూపం బయటపడిందని మంత్రులు గుర్తుచేశారు. విజయకుమార్ బాధ్యతలేంటో.. ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా ఉద్దేశపూర్వకంగానే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ప్రకటనలో మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు ఇకపై నోటిని అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజయకుమార్‌కు క్షమాపణ చెప్పాలి విజయకుమార్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా చంద్రబాబును మంత్రులు డిమాండ్ చేశారు. అలాగే, స్వయంగా విజయకుమార్ వద్దకు వెళ్లి, ఆయనక్కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇది జరిగే వరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ బాబును ఛీకొట్టాలన్నారు. జ్యుడీషియల్ విచారణ చేయించాలి చంద్రబాబు నాయుడు చేసిన సామాజిక నేరాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి.. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. విజయకుమార్‌ను ‘వాడు’ అని సంబోధించడంలోనే చంద్రబాబులో ఉన్న అహంకారం ఏంటో తెలుస్తోంది. ఆయన గతంలోనూ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఎన్నో కేసుల నుంచి, కోర్టుల నుంచి మాజీ సీఎం తప్పించుకు తిరుగుతున్నారు. చంద్రబాబు దోపిడీదారు, అవినీతిపరుడు. దళితులను అవమానించటమేగాక దాడులు చేయించిన ఘనుడు. గతంలో నాయీబ్రాహ్మణులనూ తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. తాను ఉన్న సభలో జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు మాట్లాడలేదు. – కత్తి పద్మారావు, దళిత ఉద్యమ నేత చంద్రబాబూ.. నోరు అదుపులో పెట్టుకో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధించడం ఆయన కుల అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి పోయేసరికి చంద్రబాబుకు చిన్న మెదడు దెబ్బతింది. ఆయన ఒక మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడు. – కిషోర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హేయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మాల ఉద్యోగులతో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. – నక్కా రాజశేఖర్, ఏపీ మాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దళితులు తలుచుకుంటే రోడ్డెక్కలేరు ప్రణాళికా సంఘం కార్యదర్శిగా విజయకుమార్ తన బాధ్యతల నిర్వహణలో భాగంగా బీసీజీ నివేదికను రాష్ట్ర ప్రజలకు చదివి వినిపించారు. అతన్ని పట్టుకుని ‘విజయకుమార్ గాడు’ అని చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని దళితులు తలచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరు. విజయ్‌కుమార్‌ను అవమానించినందుకు బాబు అంబేద్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పకపోతే దళిత జాతి ఆయనను క్షమించదు. – ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర ఆయనదే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికను మీడియాకు వివరించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ‘గాడు’ అని సంబోధిస్తూ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు తీరు ఆయనలోని నిరాశ, నిస్పృహలతో పాటు కుల అహంకారాన్ని బయటపెట్టింది. విజయకుమార్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. అధికారులను, ఉద్యోగులను బెదిరించడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదే. – ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి క్షమాపణ చెప్పకుంటే ఆందోళన దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి విజయకుమార్ని తీవ్రస్థాయిలో కించపరుస్తూ ‘వాడు’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మా ఉద్యోగ సంఘం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. – రెడ్డిచర్ల ధనుంజయ్, సెర్ప్ ఎల్4, ఎల్5 స్థాయి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు అహంకారానికి నిదర్శనం విజయకుమార్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రభుత్వ పథకాల అమలు, పేదలకు సేవలందించడంలో విజయకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా, తూర్పు గోదావరి జిల్లా జేసీగా, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్‌గా విశేష సేవలందించారు. – తాళ్ళూరి బాబూరాజేంద్ర ప్రసాద్ ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిందే.. విజయకుమార్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక దళిత ఐఏఎస్ అధికారి విషయంలో ఆయన అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – ఎస్.కృష్ణమోహన్‌రావు, ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలి దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేయాలి. అధికారం కోల్పోయిన చంద్రబాబు మతిభ్రమించి కుల అహంకారంతో దళిత అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. – మేడిద బాబూరావు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఆందోళనలు చేస్తాం రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడిన దళిత ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ఎస్సీ కమిషన్లు ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తాం. – గోళ్ల అరుణ్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఖండించాలి విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబుపై సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి బయ్యారపు ప్రసాదరావును డీజీపీగా రాకుండా ఆయన అడ్డుకున్నారు. ఇప్పుడు విజయకుమార్‌ను అవమానించిన చంద్రబాబు తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలి. – పెరికే వరప్రసాదరావు, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు ఐఏఎస్ అధికారిపై వ్యాఖ్యలు సరికాదు ఒక బాధ్యతగల ఐఏఎస్ అధికారిని అవమానించేలా ప్రతిపక్షనాయకుడు దుర్భాషలాడటం సరికాదు. ప్రభుత్వానికి అందిన నివేదికలోని అంశాలను విజయకుమార్ సవివరంగా చెప్పడాన్ని సహించుకోలేక చంద్రబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం మంచిది కాదు. – ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజు -
మూడింటిలోనూ ఉద్ధండులే!
సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్ కమిటీ.. కేంద్ర స్థాయిలో సీనియర్ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జీఎన్ రావు కమిటీ.. పలు రంగాలు, విభాగాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ).. ప్రపంచంలోనే టాప్–3 కన్సల్టెన్సీల్లో ఒకటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నియమించిన రెండు కమిటీలు... ఓ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీ.. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ఒకే మాటను నొక్కిచెప్పాయి. అదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ.. వికేంద్రీకరణే రాష్ట్రం ముందడుగు వేసేందుకు చోదకశక్తి అని విష్పష్టంగా ప్రకటించాయి. అప్పుడే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టాయి. రాష్ట్ర ప్రజల శాశ్వత ప్రయోజనాలకు ఏది సరైందని నిపుణులు భావించారో అదే తమ నివేదికల్లో స్పష్టం చేశారు. అందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేసి మరీ నివేదించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణలను పరిశీలించారు. ఆర్థిక పరిస్థితిని మదించారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని...సహజవనరులను పరిగణనలోకి తీసుకుని... అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషిస్తూ తమ నివేదికలను సమర్పించారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ దురుద్దేశాలతో జీఎన్ రావు, శివరామకృష్ణన్ కమిటీల్ని, బీసీజీని విమర్శిస్తుండటం విస్మయపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఆనాటి సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ చైర్మన్, సభ్యులపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీసీజీపై అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీఎన్‌రావు, శివరామకృష్ణన్ కమిటీల్లో చైర్మన్లు, సభ్యుల సుదీర్ఘ పాలనానుభవం, వివిధ రంగాల్లో వారు చేసిన అవిరళ కృషి ఏమిటన్నది.. అదేవిధంగా బీసీజీ అంతర్జాతీయస్థాయిలో సాధించిన అత్యున్నత ప్రమాణాలు ఏమిటన్నది ఓసారి తెలుసుకుందాం... శివరామకృష్ణన్ కమిటీ.. 1) కేసీ శివరామకృష్ణన్: సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, హోం శాఖల కార్యదర్శిగా చేశారు. దేశంలో స్థానిక సుపరిపాలనకు నాంది పలికిన 73, 74 రాజ్యాంగ సవరణల బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్ అథారిటీ సీఈవోగా వ్యవహరించారు. దుర్గాపూర్, అసన్సోల్ టౌన్షిప్ సృష్టికర్తగా ఖ్యాతి గడించారు. 2) రతిన్ రాయ్: కేంబ్రిడ్జ్ నుంచి పీహెచ్డీ చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్‌గా, బ్యాంకాక్‌లోని ఆసియన్ పసిఫిక్ రీజనల్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేంద్రం నియమించిన 13వ ఆర్థిక సంఘానికి సలహాదారు. 3) అరోమర్ రెవి: ప్రజా వ్యవహారాలు, సమగ్రాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు. యునిసెఫ్, యూఎన్డీపీ, యూఎన్ఈపీ తదితర విభాగాల్లో సేవలు అందించారు. ‘నెట్వర్క్ సొల్యూషన్స్’కు కో చైర్మన్‌గా వ్యవహరించారు. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్’కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆ సంస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. 4) జగన్ షా: ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రణాళిక, పట్టణాభివృద్ధి రంగాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియాభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భువనేశ్వర్ డెవలప్మెంట్ అథారిటీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేశారు. 5) కేటీ రవీంద్రన్: ఈయన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జీఎన్ రావు కమిటీ.. 1) జీఎన్ రావు: కమిటీ చైర్మన్‌గా ఉన్న జీఎన్‌రావు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాల్లో డీఆర్డీఏ పీడీ, జాయింట్ కలెక్టర్‌గా చేసిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. సైనిక సంక్షేమ డైరెక్టర్‌గా, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా, ఎన్నికల సంఘం కార్యదర్శి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెవెన్యూ రికార్డ్స్ డైరెక్టర్‌గా చేసిన ఆయనకు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవహారాలపై పూర్తి పట్టుంది. గోదావరి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్(జీఎఫ్సీఎల్) ప్రత్యేక అధికారిగా 30 జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డు పొందారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కింది. 2) కేటీ రవీంద్రన్: పట్టణాభివృద్ధి రంగంలో నిపుణుడు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాల మేలుకలయిగా నగరాల అభివృద్ధి కోణంలో ఆయన సుప్రసిద్ధుడు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో అర్బన్ డిజైన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఐదేళ్లు పని చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మాస్టర్‌ప్లాన్స్ సలహామండలిలో సభ్యుడిగా చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులకు సలçహాదారుగా కూడా ఉన్నారు. 3) ప్రొఫెసర్ మహావీర్: ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. రిమోట్ సెన్సింగ్ ఫిజికల్ ప్లానింగ్‌లో నిపుణుడు. పట్టణాభివృద్ధి రంగంలో 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్లో ప్రొఫెసర్. అమృత్ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలక స్థానంలో ఉన్నారు. 4) ఆర్. అంజలీమోహన్: అర్బన్, రీజనల్ ప్లానర్.. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ఇ–గవర్నెన్స్ సబ్జెక్టులో పీహెచ్డీ చేశారు. అర్బన్ ప్లానింగ్, మేనేజ్మెంట్లో 20 ఏళ్ల అనుభవం. 5) కేబీ అరుణాచలం: పట్టణాభివృద్ధి రంగంలో 33 ఏళ్ల విశేష అనుభవం ఉంది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దేశంలో వివిధ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. వుడాలో చీఫ్ అర్బన్ ప్లానర్‌గా వ్యవహరించారు. 6) ఏవీ సుబ్బారావు: జెన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్లో ప్రొఫెసర్. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణలోనూ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఏపీలో చిత్తడి నేలల అట్లాస్ రూపొందించిన ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించారు. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ)కు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. 7) సీహెచ్.విజయ్‌మోహన్: ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా, సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్‌గా వ్యవహరించారు. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. అత్యుత్తమ కన్సల్టెన్సీ బీసీజీ... 1963లో స్థాపించిన ఈ సంస్థకు 50 దేశాల్లో 90కి పైగా కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సమతుల– సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రత, వైద్య– ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాల్లో బీసీజీ ప్రధాన భూమిక పోషిస్తోంది. సమతుల, సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టే ప్రాజెక్టుల్లో బీసీజీది కీలక పాత్ర. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జీ–20 దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉండే బి–20 సంస్థ, అమెరికాలో ప్రజా విధానాల రూపకల్పనలో సలహాదారుగా ఉన్న ‘బిజినెస్ రౌండ్ టేబుల్’ సంస్థ, బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలసి పనిచేస్తోంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, సేవ్ ద చిల్ట్రన్, టీచ్ టు ఆల్ వంటి అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. బీసీజీ నిర్ధారించే గ్రోత్ రేటింగ్స్‌ను అంతర్జాతీయస్థాయిలో కార్పొరేట్, మేనేజ్మెంట్ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి. -
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
-
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విస్పష్టంగా పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు ఆప్షన్లను సూచించింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయపడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సూచనలు రాష్ట్ర సుస్థిర, సమతులాభివృద్ధికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు సవివర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసిందని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కమిషనర్ కార్యాలయంలో బీసీజీ నివేదికలోని అంశాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నివేదికను హైపవర్ కమిటీకి రిఫర్ చేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం, మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచీలలో ప్రగతి సాధించేందుకు బీసీజీ సూచనలు.. - రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు. - కృష్ణా, గోదావరి బేసిన్ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు. - రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు. - ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది. - ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు. - చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రం గుండా వెళ్తున్న అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి. - రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి. కృష్ణా– గోదావరి బేసిన్లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి. కానీ రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి. గోదావరి–పెన్నా నదుల అనుసంధానించాలి. సచివాలయానికి వస్తోంది ఇందుకే.. - ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వచ్చారు. - ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. - మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లుల కోసం వచ్చే వారే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) - ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి. - వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి. - జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. - భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి. - అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి. గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) - పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్ పరిశ్రమలను నెలకొల్పాలి. - ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి. - ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. - పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. - రోడ్ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్ ఐలాండ్లను అభివృద్ధి చేయాలి. కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు) - ఫుడ్ ప్రాసెసింగ్, సిరామిక్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - హైటెక్ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి. - బందరు పోర్టును నిర్మించాలి. - బహుళ వినియోగ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. - వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి. - ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు) - ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. - చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి. - మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి. - మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి. - గోదావరి – పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు) - స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. - టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు వంటి హైటెక్ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. - గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకో–అడ్వంచర్ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం) - టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి. - విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ – రాయదుర్గం టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. చదవండి: బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికల అధ్యయనానికి హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను కేబినెట్ ముందుంచారు. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని మీడియాతో తెలిపారు. ఆ వివరాలు ఇలా.. చంద్రబాబు హయాంలో జరిగిందిదీ.. ‘2015లో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైన కలల రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకుని దేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను విస్మరించి అప్పటి మంత్రి నారాయణ బృందం ఇచ్చిన రిపోర్టును ఆమోదించింది. 2015–16లో రైతుల నుంచి 33 వేల ఎకరాలు, అసైన్డ్ లేదా ప్రభుత్వ, బంజరు భూమి 21 వేల ఎకరాలు కలిపి మొత్తం 54 వేల ఎకరాలు సేకరించింది. ఆ భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. 2 కోట్ల వంతున సుమారు రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసింది. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే అప్పటి పాలకులు అయిదేళ్ల పాలనలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో అప్పట్లో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1,500 కోట్లు కాగా, రూ.4 వేల కోట్లకుపైగా నెలకు వందకు రూ.1.10 నుంచి రూ.1.15 వడ్డీతో అప్పు తెచ్చారు. ఈ అప్పునకు ఏటా వడ్డీ రూపంలో ప్రభుత్వం రూ.570 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని గొప్పగా చెప్పిన అనుభవమున్న అప్పటి ముఖ్యమంత్రి.. మౌలిక సదుపాయాల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక తయారు చేసి అయిదేళ్లలో రూ.5,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అలాంటప్పుడు అనుభవం లేని, వాస్తవ దృక్పథం గల మనమేమి చేయాలని ఎవరైనా ఆలోచించాలి కదా? ఈ పరిస్థితిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ. 1.10 లక్షల కోట్లు వెచ్చించాలంటే.. కలల రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందనే అంశంపై మంత్రివర్గం వాస్తవ దృక్పథంతో చర్చించింది. రాష్ట్ర అవసరాల మాటేమిటి? అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 6 నెలల క్రితం పాత్రికేయులతో మాట్లాడుతూ.. తేగలిగినంత అప్పు మేమే తెచ్చాం. ఇక వీరికి ఎవరు అప్పు ఇస్తారు? అని అన్నారు. రూ.25 వేల కోట్లో రూ.50 వేల కోట్లో అప్పు తెచ్చుకుందామనుకున్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో శంకుస్థాపనలు చేసిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రూ.25 వేల కోట్లకు పైగా అవసరం ఉంది. స్కూళ్ల మరమ్మతులకు రూ.12 వేల కోట్లు, అధ్వానంగా ఉన్న ఆస్పత్రుల బాగుకు రూ.14 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్య అవసరాలు తీర్చడం కోసం రూ.3,150 కోట్లు కావాలి. పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమకు నీరివ్వడం కోసం సాగునీటి ప్రాజెక్టులకు వెరసి మరో లక్ష కోట్ల రూపాయలు అవసరం. అమ్మ ఒడికి ఏటా రూ.6 వేల కోట్లు, రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం ఏటా రూ.9 కోట్ల చొప్పున 5 ఏళ్లకు రూ.45 వేల కోట్లు కావాలి. రక్షిత నీరు లేని దుస్థితి.. గుక్కెడు రక్షిత మంచి నీటి కోసం ప్రజలు తపిస్తున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో సురక్షితంకాని నీరు తాగి ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్ కోసం రూ.40 వేల కోటు, గిరిజన, బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.35 వేల కోట్లు కావాలి. పేదలకు సబ్సిడీ బియ్యం సరఫరాకు ఏటా రూ.10 వేల కోట్లు, పేదల విద్యాభివృద్ధికి ఏటా రూ.6 వేల కోట్లు అవసరం. చదువు ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని మా ప్రభుత్వం నమ్మింది. అందుకే సంపూర్ణమైన ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. ఇవే కాకుండా రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం వాటా పోను రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. రోడ్ల నిర్మాణం చేపట్టాలి. గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో పేదలకు మౌలిక వసతులు కల్పించాలి. మా ప్రభుత్వం వ్యవసాయానికి పగలే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏటా మరో రూ.3 వేల కోట్లు కావాలి. ఈ విషయాలన్నింటినీ మంత్రి మండలి సమగ్రంగా చర్చించింది. మరి రాజధాని నిర్మాణం ఎలా? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం, అవసరాలు, అభివృద్ధి, భవిష్యత్తు చూడాలి. ఇవన్నీ వదిలి ఈ కలల రాజధానిని ఇక్కడ ఎప్పటికి నిర్మించగలం? ప్రజా సంక్షేమాన్ని, బాగోగులను, మౌలిక సదుపాయాల కల్పనను, పేదల చదువు, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితే వస్తే హైదరాబాద్తోనో, బెంగళూరుతోనో, చెన్నైతోనో ఎప్పటికి పోటీ పడగలం? అనేది సమగ్రంగా మంత్రిమండలి చర్చించింది. విస్తృత చర్చ, మంత్రుల తర్జనభర్జనల అనంతరం జీఎన్‌రావు కమిటీ నివేదిక, రాబోయే బీసీజీ నివేదిక రెండింటి అధ్యయనం కోసం హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. అందులో నిపుణులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన మార్గదర్శకాల గురించి చర్చించాం. రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళన పడాల్సిన పనిలేదు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రాజధాని మారుస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చి స్తాం. మా ప్రభుత్వం ఏ పని చేసినా ధైర్యంగా చేస్తుంది. జర్నలిస్టులపై దాడి జరిగిందని చెబుతున్నారు.. దాడి గురించి ఎవరైనా రాసిస్తే హోం మంత్రి, డీజీపీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం. దాడి జరిగినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. రాజధాని ప్రాంతంలోని రైతులే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు చేయాలన్నదే మా అధినేత ఆశయం. ఊహాజనితమైన కలల వల్ల కొందరు వ్యథ చెందుతున్నారనేది వాస్తవం. వారి ఆందోళన, దిగులు, బాధ పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తాం. మాది అమానవీయ ప్రభుత్వం కాదు. ఆదుకునే సర్కారు’ అని మంత్రి పేర్ని నాని వివరించారు.