Budjet
-
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్‌కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్
ప్రభాస్- కృతి సనన్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్‌తో పాటు ఆ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఒక రకంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు ఇంతలా వ్యతిరేఖత రాలేదనే చెప్పాలి. తాజాగ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. చంద్రమండలంపై భారత్ అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ 'ఆదిపురుష్' కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ లెక్కన 'ఆదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివిధ సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్‌ను నెటిజన్లు పోలుస్తూ... ఇస్రోను ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కూడా 'ఓపెన్‌హైమర్' సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కిందటే ఇంటర్స్టెల్లార్ అంతరిక్షం కాన్సెప్ట్‌తో వచ్చిన సనిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు. -
ప్రభాస్ మొదటి సినిమాకు ఎంత లాభం వచ్చిందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్‌గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన) -
ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి
భారతదేశంలో 2023 ఏప్రిల్ 1నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి, అదే సమయంలో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దేశీయ పరిశ్రమలకు మద్దతుగా దిగుమతి సుంకాలను పెంచాలను కేంద్రం యోచిస్తోంది. ఈ కారణంగా ధరలలో కొత్త పరిణామాలు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, జ్యువలరీకి సంబంధించిన వస్తువులు, హై-గ్లోస్ పేపర్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు ధరలు తారా స్థాయికి చేరుకోనున్నాయి. కెమెరా లెన్స్, స్మార్ట్‌ఫోన్, సైకిళ్ళు, బొమ్మలు ధరలు తగ్గనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ కార్ల ఉత్పత్తికి హోండా మంగళం: ఏప్రిల్ నుంచే షురూ!) బడ్జెట్ ప్రజెంటేషన్‌లో బట్టలు, ఫ్రోజెన్ మస్సెల్స్, ఫ్రోజెన్ స్క్విడ్, ఇంగువ, కోకో గింజలపై కస్టమ్స్ పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఎసిటిక్ యాసిడ్, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కెమెరా లెన్స్‌లపై దిగుమతి పన్నులు తగ్గాయి. ఖరీదైనవిగా మారే వస్తువులు: ఎలక్ట్రానిక్ చిమ్నీలు జ్యువెలరీ వస్తువులు బంగారం ప్లాటినం వెండి పాత్రలు దిగుమతి చేసుకున్న వస్తువులు ధరలు తగ్గే వస్తువులు: బొమ్మలు సైకిళ్ళు టీవీ మొబైల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎల్ఈడీ టీవీలు కెమెరా లెన్సులు -
బ్రిటన్ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు
లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్ ట్రస్ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. -
కేంద్రమంత్రి చేతిలో జమ్ము కశ్మీర్ బడ్జెట్..!
-
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
ఆ చిన్న చిత్రానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా!
గతంలో సినిమాకి 50 కోట్లు అంటే భారీ బడ్జెట్ అనుకుని ఖర్చుకు కాస్త ఆలోచించే నిర్మాతలు, బాహుబలి చిత్రం బాక్స్‌ఫీస్ ఫలితాలు వాళ్ల లెక్కలన్నీ మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా కథ డిమాండ్ చేస్తే భారీగానే ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనకాడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్, రమేష్ వర్మ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్‌గా రాక్షసుడు 2 రాబోతున్నట్లు ప్రకటించిన ఆ చిత్ర నిర్మాత అందుకు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించాడు. ‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. అలానే ఇందులో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా జత చేస్తున్నామని, హాలీవుడ్ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకోసం సుమారు 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, సినిమా పూర్తిగా లండన్‌లో షూటింగ్ జరపనున్నట్లు చెప్పారు. ఇటీవల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ రూపొందనుంది. గిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘ఖిలాడీ’ చేస్తున్నాడు. -
నిబంధనల మేరకే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్‌లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు. -
కశ్మీర్లో శ్రీవారి ఆలయానికి టీటీడీ ఆమోదం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2020-2021 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను రూపొందించింది. రూ.3,309 కోట్లతో వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించింది. బుందీపోటులో తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి నివారణకు రూ. 3.30 లక్షలను కేటాయించింది. అలాగే జూపార్క్ సమీపంలో ప్రతిభావంతుల భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశాల, అలిపిరి రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో మెరగైన వైద్య చికిత్స, యంత్రాల కొనుగోలు కోసం రూ. 8.5 కోట్లను కేటాయించింది. బడ్జెట్లో భాగంగా టీటీడీ విజిలెన్స్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి కూడా పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం, పుష్కరిణి, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం లభించింది. అలాగే టీటీడీ ఆలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ సైబర్‌వింగ్‌ను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. -
31 నుంచి బడ్జెట్ పార్లమెంటు !
న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. -
ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్ బడ్జెట్
అనేక జీవనదులకు పుట్టినిళ్లు భారతదేశం. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో నీటి కొరత ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పట్టణాలను మనం చూస్తున్నం. ముంబైలోని లాథూర్కి నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి చెన్నై మహానగరంలో కూడా సంభవించింది. ఇంతటి నీటి సమస్య గత వందేళ్లలో కూడా రాలేదని చెన్నై వాసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకముందే కేరళ కళ్లుతెరిచింది. దేశంలో తొలిసారి వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. తిరువనంతపురం: భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలోభాగంగానే ప్రతి ఏటా వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంతనీటి లభ్యత ఉంది. ఎంత అవసరం కానుంది, వంటి అంశాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. పక్క రాష్ట్రాల కష్టాలను చూసి భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని కేరళ జాగ్రత్త పడుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.కేరళలో ఎంత నీరు అందుబాటులో ఉంటుంది, ఎంత నీరు వాడుకలో ఉంటుంది, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం, అదనపు నీటి కోసం ఉన్న వనరులేంటి? వంటి అంశాల్ని బడ్జెట్లో వివరించబోతోంది. తొలి రాష్ట్రం కేరళనే.. అవసరాల దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నీటి వాడకం మరింత పెరుగుతుందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానమైన అంశం ఏంటంటే... దేశంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం కేరళనే. నీటిని ఎలా పొదుపుచెయ్యాలి, అందుకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాల్ని ఈ బడ్జెట్లో చెప్పబోతున్నారు.అలాగే దీనిపై ప్రజలకు, అధికారులకు అవగహన కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఈ ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఎంత నీరు తెలుసుకునే వీలు ఉంటుందని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి కొరత ఉంటే.. అక్కడికి నీటిని ఎలా తరలించాలి, అందుకోసం ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, అంచనా ఖర్చులు ఎంత అన్నది బడ్జెట్లో పొందుపరచే అవకాశం ఉంది. ప్రళయం నుంచి పాఠాలు.. నదులు, చెరువు, బావులు, కుంటలు, రిజర్వాయర్లు ఇలా అన్నింటిలో ఉన్న మొత్తం నీటిని అంచనా వేసి బడ్జె్ట్లో చెప్పబోతున్నారు. డిమాండ్‌కి తగినట్లు సప్లై చేసేందుకు ఉన్న మార్గాల్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా పాతవైపోయిన రిజర్వాయర్లు, డ్యాములు, ఇతరత్రా కట్టడాల్ని తిరిగి నిర్మించేందుకు, రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. నీటి ఇంజినీరింగ్ అధికారులు, నీటి పారుదల విభాగం, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. అన్నీ అనుకూలిస్తే..ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కాగా పూర్తిగా కొండ ప్రాంతమైన రాష్ట్రం కావున.. వరదలను నివారించేందుకు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సృష్టించిన ప్రళయం కారణంగా కేరళ అతలాకుతలమయిన విషయం తెలిసిందే. దాని నుంచే దైవభూమి పాఠాలు నేర్చుకున్నట్లుంది. -
ట్రోల్ అవుతోన్న ‘బహీఖాతా’
సాక్షి, న్యూఢిల్లీ : నేను బడ్జెట్ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్‌బ్యాగ్‌ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటిష్ వలసవాదాన్ని వదిలించుకోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా ఉంటుంది. -నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, దేశ చరిత్రలో ఆర్థిక శాఖ పూర్తిస్థాయి కేబినేట్ మహిళా మంత్రిగా తొలిసారిగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన దేశంలో బడ్జెట్ సమర్పణ ప్రక్రియ మొత్తం బ్రిటిష్ సంప్రదాయాలకు అనుగుణంగానే సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వాలు సైతం బడ్జెట్ సంప్రదాయాలు కొన్నింటిని మార్చుకుంటున్నప్పటికీ భారత్‌లో మాత్రం 1860లనాటి బ్రిటిష్ సంప్రదాయం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఉదాహరణకు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ ప్రసంగ పత్రాన్ని తీసుకురావడం అనేది బ్రిటిష్ సంప్రదాయ చరిత్రకు కొనసాగింపుగానే ఉంటోంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి చేతిలో బ్రీఫ్‌కేస్‌తో ఫోటో దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మన ఆర్థికమంత్రి బ్రీఫ్‌కేస్‌తో గాక జాతీయ చిహ్నంగల ఎరుపురంగు చేతిసంచితో ప్రత్యక్షమైంది. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇదివరకటి భారతీయ ప్రభుత్వాలు మోసుకొస్తున్నబానిసత్వ వలసపాలన వారసత్వానికి నిర్మలాసీతారామన్ నేటితో చరమగీతం పాడారని కొందరు అంటుంటే, మరి అన్ని విషయాలలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దమ్ముందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికమంత్రి ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది మన భారతీయ సంప్రదాయం, పశ్చిమదేశాల బానిసత్వ గుర్తులను వదిలివేస్తున్నామని అన్నారు. అయితే దీనిపై ఓ వ్యంగ్య ట్విటర్ స్పందించాడు. మరి ఆ భారతీయ సంప్రదాయ సంచిలో ఉన్న బడ్జెట్ ప్రతులు తాటాకుల మీద ముద్రించారా?.. నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ఎడ్లబండి మీద వచ్చిందా? అంటూ ట్వీట్లు గుప్పించాడు. ఏమైతేనేం ఇప్పటికే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మన ఆర్థిక మంత్రి ఇంగ్లిష్ స్టైల్ బ్రీఫ్‌కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయం తొణికిసలాడేలా ఆమె మాటల్లో ‘బహిఖాతా’(పద్దుల పుస్తకం)ను ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. -
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్‌బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్ లైన్ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు. ఖాతాదారుల అనుమతితోనే.... ‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్బీల్లో గవర్నెన్స్ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు. బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్‌ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్‌టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్‌టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్‌ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
‘సీత’మ్మ నష్టాలు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్బీఎఫ్సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. సెన్సెక్స్ ప్రారంభం: 39,990 సెన్సెక్స్ గరిష్టం : 40,032 సెన్సెక్స్ కనిష్టం : 39,441 సెన్సెక్స్ ముగింపు : 39,513 ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్ ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్క బ్యాంక్ షేర్లు మినహా, మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇది చెత్త బడ్జెట్ కానప్పటికీ, సంపన్నులపై అధిక పన్ను విధింపు, 20 శాతం షేర్ల బైబ్యాక్ ట్యాక్స్, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులంటున్నారు. మరిన్ని వివరాలు... బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారీ సంస్కరణలను ఆశిస్తూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 11,950 పాయింట్లను అధిగమించాయి. బడ్జెట్‌కు ముందే సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 40,032 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభమైనప్పటి నుంచి నష్టాలు ఆరంభమయ్యాయి. ప్రసంగం పూర్తయ్యేంత వరకూ పరిమిత శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తర్వాత భారీ నష్టాల దిశగా సాగాయి. మధ్యలో ఒకింత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్395 పాయింట్లు పతనమై 39,513 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11,811 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సానుకూలతలున్నా క్షీణతే.. బడ్జెట్ప్రతిపాదనలకు ముందు 40 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్, బడ్జెట్ తర్వాత ఆ జోరును కొనసాగించలేక చతికిలపడింది. ఆప్షన్ల ట్రేడింగ్‌కు సంబంధించి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) విషయంలో ఒకింత ఊరట లభించడం, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధులందడం, మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయించడం వంటి సానుకూల చర్యలున్నప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం నష్టాల నుంచి రికవరీ అయినా కూడా మన మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 3,044 పాయింట్లు, నిఫ్టీ 918 పాయింట్లు చొప్పున లాభపడటం విశేషం. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు చొప్పున పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు షేర్లు– ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్ షేర్ 8.3 శాతం నష్టంతో రూ.88 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరె¯Œ ్స, బజాజ్ ఫైనాన్ ్స, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి పంచ కారణాలు.. పబ్లిక్ హోల్డింగ్ 35 శాతానికి పెంపు... స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన స్టాక్ మార్కెట్‌ను పడగొట్టింది. ఇప్పటికే ఓవర్‌బాట్ పొజిషన్లో ఉన్న మార్కెట్లో ఈ ప్రతిపాదన కారణంగా విక్రయ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే భయాలతో సెన్సెక్స్,నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. 25% పబ్లిక్ హోల్డింగ్ నిబంధననే ఇప్పటిదాకా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అమలు చేయలేకపోయాయి. మరోవైపు ఈ నిబంధన కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి మొగ్గుచూపుతాయని నిపుణులంటున్నారు. మార్కెట్లో ఈ నిబంధన పెను కలకలమే సృష్టించింది. 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ట్యాక్స్(డీడీటీ)ను పలు కంపెనీలు ఎగవేసి షేర్ల బైబ్యాక్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో షేర్ల బైబ్యాక్‌ను నిరుత్సాహపరచడానికి 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్‌ను విధించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వాటాదారులు కొనుగోలు చేసిన ధరను కాకుండా కంపెనీ ప్రకటించే బైబ్యాక్ ధర నుంచి ఇష్యూ ధరను తీసివేసి వచ్చిన దానిపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. దీంతో కంపెనీలపై భారీగా పన్ను భారం పడుతుందని, ఫలితంగా కంపెనీలు షేర్ల బైబ్యాక్‌లు ప్రకటించవని నిపుణులంటున్నారు. . సంపన్నులపై అధిక పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్‌చార్జీని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీంతో ఈ రెండు కేటగిరీల సంపన్నుల పన్ను 3–7 శాతం రేంజ్లో పెరగనున్నది. సంపన్నులపై అధిక పన్ను విధించడం తప్పు కాకపోయినా, మొత్తం వారు చెల్లించాల్సిన పన్ను 42 శాతానికి పెరగడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.90,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదన కారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్, లోహాలపై ఎక్సైజ్ సుంకం మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భారీ నిధుల కోసం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్‌లపై రూ. 1 అదనపు సుంకం విధించారు. పుత్తడి వంటి విలువైన లోహాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం ప్రతికూల ప్రభావం చూపించాయి. రూ.2.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,580 కోట్లు తగ్గి రూ.151,35,496 కోట్లకు పడిపోయింది. అధికాదాయం ఆర్జించే వర్గాలపై పన్ను విధించడం, భారీగా నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం కారణంగా సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గనుండటం, ఇక కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, తదితర ప్రతిపాదనల వల్ల స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది... – అమర్ అంబానీ, యస్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ -
ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?
రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం. ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే. ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి. 2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్. పైగా ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. పన్నుల మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు. పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్‌లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది. -
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్‌ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
బడ్జెట్లో వ్యవసాయం వాటా ఎంత?
దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం – సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. వ్యవసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. పంటలకు కనీస మద్దతు, రైతుకు కనీస ఆదాయ కల్పనలో మౌలిక సంస్కరణ తీసుకురావడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెనుసవాల్ కానుంది. దేశ భూభాగంలో దాదాపు 50 శాతం వరకు ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో చిక్కుకుపోవడం చూస్తున్నాం. గత వందేళ్లలో అయిదో అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా ఈ జూన్ మాసం రికార్డుకెక్కింది. దానికితోడుగా గత ఏడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ వాస్తవ రాబడుల్లో వృద్ధి దాదాపుగా జీరోకి సమీపంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జూలై 5న తన తొలి బడ్జెట్ సమర్పించనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కఠినతరమైన లక్ష్యాన్ని ఎదుర్కోబోతున్నారు. మరోవైపున వ్యవసాయదారుల ఆశలు, అంచనాలు తారస్థాయిలో ఉంటున్నాయి. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు తప్పనిసరి అనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవమే కానీ కేంద్రంలోని నూతన ప్రభుత్వానికి అంతకుమించిన పెద్ద సవాలు ఏదంటే వ్యవసాయరంగంలో వాస్తవ రాబడులను పెంచడం ఎలా అన్నదే. ఎకనమిక్ సర్వే 2016 అంచనా ప్రకారం దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయరంగ ఆదాయం సగటున సంవత్సరానికి రూ. 20,000 మాత్రమే. ఓఈసీడీ– ఐసీఆర్ఐఈఆర్ నిర్వహించిన కీలకమైన అధ్యయనం ప్రకారం 2007–2017 మధ్యకాలంలో రైతులకు న్యాయమైన ధరలను తృణీకరించిన కారణంగా వారు నష్టపోయిన మొత్తం రూ. 45 లక్షల కోట్లుగా తేలింది. ఇది చాలదన్నట్లుగా, గత పదిహేను సంవత్సరాల్లో వ్యవసాయరంగ రాబడులు అత్యంత కనిష్టస్థాయికి పడిపోయినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిఫలితంగా గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన భారీ స్థాయిలో క్షీణించిపోయింది. ఇక వ్యవసాయేతర శ్రామికుల విషయం చెప్పనక్కరలేదు. భారీ దిగుబడులను పండించడానికి దేశీయ రైతాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ప్రతి సంవత్సరం, వ్యవసాయదారుల పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కనిష్టంగా ఉంచడం, పరిశ్రమకు ముడిసరుకును తక్కువ ధరలకు అందించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నెరవేర్చాల్సి రావడం వంటి లక్ష్యాల సాధనకోసం తీసుకొచ్చిన సూక్ష్మ ఆర్థిక విధానాలకు మన వ్యవసాయరంగం నిజంగానే బలవుతోంది. వాణిజ్యరంగ నిబంధనలు తొలి నుంచీ వ్యవసాయరంగానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దీనికితోడుగా 2011–12, 2016–17 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.4 శాతానికి పడిపోయాయి. వ్యవసాయరంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పడానికి ఇది చాలు. దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. ఉదాహరణకు పంజాబ్‌ను తీసుకుందాం. 2018 సంవత్సరం జనవరిలో ప్రతిరైతుకూ 2 లక్షల రూపాయల రుణ మాఫీని ప్రకటించిన తర్వాత కూడా ఆ సంవత్సరం మొత్తంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అంచనా వేసింది. 2000–2017 మధ్యకాలంలో మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఇల్లిల్లూ తిరిగి చేసిన సర్వే ప్రకారం 16,600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడినట్లు తేలింది. దేశంలోని అత్యంత కీలకమైన వ్యవసాయ రాష్ట్రంలోనే రైతుల దుస్థితి ఈ స్థాయిలో ఉండగా మిగతా దేశంలో వ్యవసాయ రంగం ఎంతగా కునారిల్లిపోతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అత్యంత లోపభూయిష్టమైన ఆర్థిక విధానాల రూపకల్పన కారణంగానే రైతులు బాధితులుగా మిగిలిపోతున్నారు. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించిన కారణంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని గ్లోబల్ అనలిటికల్ కంపెనీ క్రిసిల్ (íసీఆర్ఐఎస్ఐఎల్) తేల్చి చెప్పింది. వ్యవసాయ పంటలకు కనిష్ట మద్దతు ధర 2009–2013 మధ్య 19.3 శాతం మేరకు ఉండగా, తదుపరి నాలుగేళ్ల కాలంలో ఇది 3.6 శాతానికి క్షీణించిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇస్తున్న డీఏ (డియర్నెస్ అలవెన్స్) స్థాయిలో కూడా రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. 1970లో స్కూల్ టీచర్లకు నెలకు రూ. 90ల వేతనం ఉండగా 2015 నాటికి వారి వేతనం 170 రెట్లకు పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల వేతనం 150 రెట్లు పెరిగింది. దీనికి భిన్నంగా దేశీయ రైతులు పండించిన గోధుమ పంట ధర 19 రెట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్– కిసాన్) ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా దేశంలో భూమి ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ. 6,000ల ప్రత్యక్ష నగదు మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే నెలకు రూ.500లు అన్నమాట. వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి కేంద్రప్రభుత్వం నడుంకట్టినట్లు ఇది సూచిస్తోంది. పైగా దేశ చరిత్రలో రైతుకు తొలిసారిగా ప్రత్యక్ష నగదు సహాయం అందించడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత చూపుతుండటానికి ఇది స్పష్టమైన సంకేతం కూడా. ఈ విశిష్ట పథకాన్ని ఇప్పుడు 14.5 కోట్లమంది భూమి ఉన్న రైతులకు విస్తరించారు. దీన్ని దేశంలోని 14.4 కోట్లమంది భూమిలేని రైతులకు కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో రూ. 87,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు కూడా. దీనికి 14.4 కోట్ల భూమిలేని రైతులను కూడా జతచేస్తే బడ్జెట్లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయ పథకం కోసం దాదాపు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం కేటాయింపునకు అవసరమైన డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అనేది ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం. 2008–09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటినుంచి పారిశ్రామిక రంగానికి మద్దతుగా అమలులోకి తీసుకువచ్చిన రూ. 1.86 కోట్ల వార్షిక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తక్షణం రద్దు చేయడమే ఆర్థికమంత్రికి అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఈ ప్యాకేజీకి ఎలాంటి ఆర్థిక సమర్థన ఇప్పుడు లేదు. గత పది సంవత్సరాలుగా ఈ ఉద్దీపన ప్యాకేజీని మన పారిశ్రామిక రంగానికి అందజేస్తూనే ఉన్నారు. 2018–19లో వ్యవసాయరంగానికి రూ.11.68 లక్షల కోట్ల రుణాన్ని విస్తరించారు. బడ్జెట్లో దీన్ని రూ.12 లక్షల కోట్లకు సవరించే అవకాశం కూడా ఉంది. అయితే అతిపెద్ద సవాలు ఏమిటంటే, వ్యవసాయ రుణం సన్నకారు, చిన్నకారు రైతుల వరకు చేరడం ఎలా అన్నదే. దేశంలో సంస్థాగత రుణాలకు 15 శాతం కంటే తక్కువ మంది చిన్నకారు రైతులే పొందగలుగుతున్నారని ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తాజాగా అంచనా వేసింది. రైతుల ఆత్మహత్యలను రైతు రుణమాఫీలు అరికట్టలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టే సంస్థాగత రుణాల పరిధిలోకి మరింతమంది రైతులను తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి. పైగా, దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం –సంక్షేమం కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. దీనికోసం ప్రతి జిల్లాలోనూ రైతుల సగటు ఆదాయాన్ని పెంపొందించేందుకు తగిన మార్గాన్ని ఏర్పర్చవలసి ఉంది. దీనికి అవసరమైన డేటా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎమ్‌సీ) క్రమబద్ధీకరణ మార్కెట్ల యంత్రాంగాన్ని విస్తరించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకు ప్రస్తుతం ఉన్న 7,000 మండీలను 42,000కు పెంచడానికి ప్ర«థమ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ధాన్యాగారాలను, గోడౌన్లను ఏర్పర్చడంపై బడ్జెట్ విధివిధానాలను రూపొందించాలి. వచ్చే అయిదేళ్ల కాలానికి గానూ దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్ల రూపాయలను అందిస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్న విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసం ప్రారంభ దిశగా ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మండీలు, గోడౌన్ల ఏర్పాటు కోసం కనీసం రూ. 5 లక్షల కోట్లను మదుపు చేయాల్సి ఉంది. అయితే దీనికంటే మిన్నగా, రైతులు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకోసం సులభతరమైన వాణిజ్యవిధానాన్ని ప్రోత్సహించినట్లుగానే, వ్యపసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. గతంలో వాణిజ్యమంత్రిగా సులభతరమైన వాణిజ్య విధానంకోసం దాదాపు 7,000 చర్యలను తీసుకున్న అనుభవం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేయడం ఆమెకు సులభమైన పనే. అయితే వ్యవసాయరంగంలో సులభతర విధానం అమలుకోసం కనీసం 5,000 చర్యలను అందించే యంత్రాంగం స్థాపనకోసం ఆమె ఇంకా ఎందుకు నడుం కట్టలేదన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్‌శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్‌బీఎఫ్‌సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
తాత్కాలికమే కానీ.. వరాల జల్లే!
తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూనే.. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలను వెలువరించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక బడ్జెట్‌కు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని గతేడాది నుంచి ప్రారంభించిన మోదీ సర్కారు.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తాత్కాలిక బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనికితోడు బుధవారం ఉదయం ఆర్థిక శాఖ ఒక వాట్సాప్ సందేశంలో.. 2019–20 బడ్జెట్‌ను తాత్కాలిక బడ్జెట్‌గా పేర్కొనవద్దని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో వెనక్కు తగ్గిన ఆర్థిక శాఖ.. తాత్కాలిక బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం సాయంత్రం స్పష్టం చేసింది. తాత్కాలిక బడ్జెట్ కారణంగా ఈసారి ఎకనమిక్ సర్వే ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్ సమయంలో మాత్రమే ఎకనమిక్ సర్వే ఉంటుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ రైతులపై వరాల జల్లు! తాత్కాలికమైతేనేం.. బడ్జెట్ తాత్కాలికమా? పూర్తిస్థాయిలోనా అన్న సంగతి పక్కన పెడితే.. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఇప్పటిదాకా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ అనారోగ్య కారణంగా.. ఆ బాధ్యతల్ని స్వీకరించిన రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావటంతో దీనిపై సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ, వేతన జీవులకు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలతోపాటు అత్యధిక సంఖ్యలో ఉన్న చిరువ్యాపారులకు రుణాల పరంగా వెసులుబాటు కల్పించొచ్చని భావిస్తున్నారు. మొదటి బడ్జెటే తాత్కాలికం! భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన మొదటిదే తాత్కాలిక బడ్జెట్. దీన్ని 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐదు బడ్జెట్లను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల ఆర్థికమంత్రులు ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విధాన నిర్ణయాలు ప్రకటించకూడదు. అయితే, 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టిన తొలి తాత్కాలిక బడ్జెట్ అని ఆ సమయంలో.. నాటి ఆర్థిక మంత్రి చెట్టి పేర్కొనలేదు. కానీ, 1948 ఫిబ్రవరి 28న రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ, మొదటిది తాత్కాలిక బడ్జెట్ అని చెప్పారు. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు (జనతాపార్టీ) ఆర్థిక మంత్రిగా హెచ్ఎం పటేల్ 1977లో ఓటాన్ అకౌంట్ సమర్పించారు. 1991లో చంద్రశేఖర్ కేబినెట్లోని ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మన్మోహన్సింగ్.. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు తొలిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు జనవరిలో ప్రణబ్ ముఖర్జీ మొదటిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2014 ఫిబ్రవరి 17న పి.చిదంబరం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు జైట్లీకి అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్‌కు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు! ఇక మధ్యతరగతి వర్గాలు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఈ బడ్జెట్లో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. సెక్షన్ 80–సీ కింద వివిధ మార్గాల్లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దీన్ని రూ.2–2.5 లక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్శెట్టి అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులకు ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇతర డిమాండ్లలో.. కేవలం ఈక్విటీ ఫండ్స్‌కే కాకుండా, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ కూడా సెక్షన్ 80–సీ కింద మినహాయింపు కల్పించడం.. దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్ష దాటితే పన్ను పరిమితిని పెంచడం వంటివి కూడా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులివీ! జీడీపీలో ద్రవ్యలోటును 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3%కు కట్టడి చేయాలన్నది కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ ఈ లక్ష్యం డిసెంబర్ నాటికే దాటిపోయింది. దీంతో మిగిలి ఉన్న కాలానికి వ్యయాల పరంగా పరిమితులున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలకు తాత్కాలిక బడ్జెట్లో చోటు కల్పిస్తే.. అవి 2019–20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలపై భారం చూపిస్తాయి. 2014లో ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు స్వీకరించే నాటికి ద్రవ్యలోటు 5% ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత.. నాటి యూపీఏ సర్కారు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. కానీ, వీటిని సకాలంలో ఉపసంహరించుకోలేదు. దీని వల్ల 2009–10 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5%కు పెరిగిపోయింది. దీన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు గట్టి ప్రయత్నాలనే చేసింది. చమురు ధరలు కనిష్ట స్థాయిలకు చేరడం ఇందుకు సాయపడింది. అయితే, జీఎస్టీని అమల్లోకి తేవడం, బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్ సాయం అంచనాలను మించడంతో ద్రవ్యలోటు ప్రణాళికలపై ఒత్తిడికి దారితీశాయి. దీంతో 2017–18లో 3.2% లక్ష్యాన్ని చేరడంలో వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5% వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018–19లో ద్రవ్యలోటు 3.3% లక్ష్యం కాగా, డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికే ఈ లక్ష్యానికి 115 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3% లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. -
బడ్జెట్.. పంచతంత్ర..
బదులుగా ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కూడా ఇదే.. అయితే.. ఏమిటీ మధ్యంతర బడ్జెట్.. పూర్తిస్థాయి బడ్జెట్‌కు దీనికి తేడా ఏమిటి? ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు.. అలా తీసుకోవచ్చా లేదా.. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు.. మరి.. వాటిని క్లియర్ చేసుకుందామా.. మధ్యంతర బడ్జెట్ అంటే.. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు(భారత్‌లో అది ఏప్రిల్ 1) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇదో ఆదాయ, వ్యయ పట్టిక. ఇందులో తనకు ఆదాయం వచ్చే మార్గాలను తెలపడంతోపాటు, ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతోందన్న విషయాన్నీ వివరిస్తుంది. మధ్యంతర బడ్జెట్ విషయానికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. ఇది మొత్తం సంవత్సరానికి సంబంధించిన పద్దు కాదు. పరిమిత కాలానికి సంబంధించినది. అంటే.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవరకూ ఇది అమల్లో ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్.. మధ్యంతర బడ్జెట్ ఒకటేనా.. సాధారణంగా ఒకదానికి బదులు ఒకదాన్ని వాడేస్తుంటాం కానీ.. రెండూ వేర్వేరు. ఓట్ ఆన్ అకౌంట్లో.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ.. అంటే అధికార మార్పిడి కాలం వరకూ అయ్యే రోజువారీ వ్యయాలకు సంబంధించిన అంచనాలు మాత్రమే ఉంటాయి. అదే మధ్యంతర బడ్జెట్లో ఆదాయం, వ్యయం రెండింటి అంచనాలు ఉంటాయి. పాలసీపరమైన చర్యలు తీసుకోవచ్చు. రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) నుంచి నిధులను తీసుకునేందుకు కేంద్రం పార్లమెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు.. మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక బిల్లు ఉండదు. దీని వల్ల ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయడానికి ఉండదు. శ్లాబ్‌లు పాతవే ఉంటాయి. ఎకనామిక్ సర్వే కూడా ఉండదని చెబుతున్నారు. సాధారణంగా అయితే రాబోయే ప్రభుత్వంపై భారం మోపేలా విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ప్రకటించరు. అస్సలు తీసుకోవడానికి లేదా.. రాజ్యాంగపరంగా చెప్పాలంటే.. తీసుకోవచ్చు. ఎందుకంటే.. మధ్యంతర బడ్జెట్లో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. సాధారణంగా తీసుకోరు అంతే.. ‘ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేటట్లయితే.. ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలనైనా తీసుకోవచ్చు’ అని ప్రముఖ న్యాయవాది అరవింద్ దతార్ ‘బ్లూమ్‌బర్గ్ క్వింట్’కు తెలిపారు. మరికొందరు కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా దీంతో విభేదిస్తున్నారు. ఎకనామిక్ సర్వే ఉండదు, ఆర్థిక బిల్లు ఉండదు.. అలాగే విధానపరమైన నిర్ణయాలు కూడా ఉండకూడదని పేర్కొంటున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్లో ఏముండొచ్చు.. పాత సంప్రదాయాలకు భిన్నంగా మధ్యంతర బడ్జెట్ ఉండొచ్చన్నట్లుగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు. దాన్ని బట్టి మోదీ సర్కారు కొన్ని విధానపరమైన కీలక నిర్ణయాలను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన తమ ప్రాధాన్యతలు ఇవీ అని తెలియజేయడానికి ఈ మధ్యంతర బడ్జెట్‌ను ఓ అవకాశంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతాంగానికి తెలంగాణలోని రైతు బంధు తరహా పథకాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు. జైట్లీ మాటలను బట్టి చూస్తే.. పాత సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ.. ఆదాయపు పన్ను వంటివాటిల్లో మినహాయింపులు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు. -
ఈసారి ‘రైతన్న’ బడ్జెటే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ బడ్జెట్లో రైతులకు భారీగా తాయిలాలు ప్రకటించాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెటే అయినా చిన్న, సన్నకారు రైతుల్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకునే చాన్సుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యోచిస్తున్న చర్యల్లో..పంట సాగుకు ముందే నగదు రూపంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయడం లాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. పంటల దిగుబడులు పెరిగినా ధరలు తగ్గకుండా ఉండేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభ నివారణకు ఇటీవల బీజేపీ జాతీయ మండలి తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన దాని పట్ల బీజేపీ వర్గాలే సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలంటే వ్యవసాయ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీపై ఒత్తిళ్లు అధికమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఏడాది ప్రకటించే బడ్జెట్ సంప్రదాయాల్ని తోసిరాజని, వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టామని జైట్లీ ఇటీవల∙అన్నారు. రైతులకు భారీ పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికల్లో కొన్ని 1. రైతులకు నేరుగా నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ 2. రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు 3. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు -
బడ్జెట్ కోటాలో రైతు వాటా ఎంత?
రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలో 90 శాతంపైగా వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులకు సరిపోతుండగా రైతుకు, వ్యవసాయానికి ప్రభుత్వం వెచ్చించే మొత్తం శూన్యమనే చెప్పాలి. ఖజానా వట్టిపోయాక సాంవత్సరిక బడ్జెట్ కేటాయింపులో రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను రైతాంగ ఉద్యమాలు అర్థం చేసుకోనంతవరకు రాజకీయ పార్టీలు దాదాపుగా అవీ ఇవీ అనే తేడా లేకుండా తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలను కురిపిస్తున్న తరుణంలో వ్యవసాయానికి అవసరమైన డబ్బు ఎక్కడికి వెళుతోందని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక రాడార్ తెరపై రైతులు కనిపించే ఏకైక సమయం ఎన్నికల సమయంలో మాత్రమే. ఇది సర్వసాధారణమైపోయింది. గత ముప్పై ఏళ్లుగా నేను ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాను. తమ తమ సిద్ధాం తాలు ఏవైనా, ఆలోచనా రీతులు ఏవైనా దేశ రాజ కీయ పార్టీలన్నీ దాదాపుగా ఇదే వైఖరిని అనుసరి స్తుండటం విచారకరం. దేశంలో మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ ధోరణినే కొనసాగిస్తున్నాయి. పైగా వ్యవసాయదారులను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు డిమాండ్లు ప్రధానంగా అజెండాగా మారనున్నాయి. దేశంలో జరుగుతున్న ప్రతి రైతాంగ నిరసనకు ఇవే కేంద్రబిందువులుగా మారిపోయాయి. అవేమిటంటే ఒకటి, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, రెండు, ప్రభుత్వం స్వయంగా వాగ్దానం చేసిన విధంగా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి)ను అమలు చేయడం, స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ దిగుబడులపై 50 శాతం లాభాన్ని రైతులకు ప్రభుత్వమే అందించడం. ఈ మేరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యవసాయ రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని వాగ్దానం చేస్తూ వస్తున్నాయి. కానీ వాస్తవానికి, వ్యవసాయ రుణాల్లో చిన్న భాగాన్ని మాత్రమే మాఫీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని మెజారిటీ రైతులు ప్రభుత్వ సహాయం అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారనే ఆశ మాత్రంగా కూడా నాకు కనిపించడం లేదు. ఇక రెండో డిమాండు విషయానికి వద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై స్వామినాధన్ కమిషన్ నిర్దేశించిన ఫార్ములాను సంపూర్ణంగా అమలు చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. ఆవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉన్నపళాన పెంచినప్పటికీ అది మన రైతాంగంలోని అతి చిన్న భాగానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. శాంతకుమార్ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత అధికారిక కమిటీ ప్రకారం, 6 శాతం రైతులు మాత్రమే ఆహార సేకరణ ధరల వల్ల లబ్ధిని పొందగలుగుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం డిమాండు చేస్తున్న కనీస మద్దతు ధర, దిగుబడిపై 50 శాతం లాభాన్ని అమలు చేసినప్పటికీ, ఇప్పటికే ధాన్య సేకరణ ధరలను పొందుతున్న కొద్దిమంది రైతులు మాత్రమే లబ్ధి పొందే పరిస్థితి ఉంది. మరి అటు మార్కెట్ చేయదగిన అదనపు ఉత్పత్తులు పెద్దగా లేని లేక మౌలిక వసతులు లేమి కారణంగా ధాన్య సేకరణ కార్యకలాపాలకు దూరమైపోయిన 94 శాతం మంది రైతుల విషయం ఏమిటి? ఉదాహరణకు, ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 94 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2017లో గోధుమపంట సీజన్లో 10.5 లక్షల రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ధాన్య సేకరణ ధరల వద్ద అమ్ముకోగలిగారు. ఇక మిగిలిన 83 లక్షల వ్యవసాయ కుటుంబాల మాట ఏమిటి? స్వామినాధన్ కమిషన్ నివేదించిన ధరల ఫార్ములాను యథాతథంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉండగా, రైతులు మండీలకు తరలిస్తున్న తమ ఉత్పత్తులన్నింటినీ అధికారికంగా ప్రభుత్వమే సేకరించే పరిస్థితి ఏర్పడనంతవరకు, పంటలకు అధిక ధరలను ప్రకటించినప్పటికీ పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు తగినన్ని ధాన్య సేకరణ వసతులను కల్పించడంలో విఫలమవడమే కాకుండా సమస్య పరిష్కారం విషయంలో చేతులెత్తేశాయి. ఇది రైతులను మరింతగా మండించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ఆశా పథకంలో కూడా, మార్కెట్‌కు వచ్చిన అదనపు వ్యవసాయ ఉత్పత్తులలో 25 శాతాన్ని మాత్రమే సేకరించగలనని ప్రభుత్వ స్థాయిలో తేల్చి చెప్పారు. మరి మిగిలిన 75 శాతం దిగుబడుల మాటేమిటి? మార్కెట్లో తన దిగుబడులను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చినప్పుడు రైతులు పొందే పెను నష్టాన్ని ఎవరు భరిస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై జరుగుతున్న చర్చ రైతాంగం చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లకు మించి ముందుకెళ్లాల్సి ఉంది. వ్యవసాయదారులు కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశమివ్వని దేశీయ ఆర్థిక రూపకల్పన గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఇంకాస్త స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన వెంటనే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ, రైతు రుణాలను మాఫీ చేయదలుస్తున్న రాష్ట్రాలు తమ సొంత ఆర్థిక వనరులను వెదుక్కోవలసి ఉంటుందని కరాఖండీగా చెప్పేశారు. వాస్తవానికి 2014 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం నాలుగేళ్లలో ఇదే ప్రభుత్వం రూ. 3.16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రంగానికి చెందిన మొండి బకాయిలను లెక్కలోకి రాకుండా కొట్టిపడేసింది. కార్పొరేట్ రంగం అవకతవకల భారాన్ని భరించాల్సిందిగా అరుణ్ జైట్లీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఎన్నడూ కోరిన పాపాన పోలేదు. అటు పరిశ్రమలూ, ఇటు రైతులూ అదే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుం టున్నప్పుడు, పరిశ్రమల మొండి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఎందుకు మారలేదు అనే ప్రశ్నను వ్యవసాయ రంగ నేతలు సంధించాల్సి ఉంది. పరిశ్రమల విషయంలో సూచించినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు రైతుల రుణాలను కూడా మొత్తంగా రద్దు చేయాల్సిందని జాతీయ బ్యాంకులను ఎందుకు ఆదేశించలేదు? ఆ భారాన్ని మాత్రమే రాష్ట్రాల ప్రభుత్వాలమీదికి నెట్టడం దేనికి? ఈ సమస్య మొత్తానికి కేంద్ర బిందువు ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003లో దాగి ఉంది. స్థూల ప్రభుత్వ దేశీయ ఉత్పత్తులపై (జిఎస్డీపీ) ఒక సంవత్సరంలో తీసుకునే రుణ పరిమితిని ఈ చట్టం 3 శాతానికి కుదిం చివేసింది. ఒకసారి బడ్జెట్ నిబంధనలకేసి దృష్టి సారిస్తే, వ్యవసాయానికి కేటాయిస్తున్న డబ్బు చాలా తక్కువ స్థాయిలో ఉందని బోధపడుతుంది. ఈ విషయంలో కాస్త వివరించనివ్వండి. ఛత్తీస్‌గఢ్‌లో సవరించిన బడ్జెటరీ అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత రాబడిలో 93 శాతం వరకు వేతనాలు, పెన్షన్ చెల్లిం పులు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఒక్క వేతనాలు, పెన్షన్లు మాత్రమే బడ్జెట్లో అధికభాగాన్ని హరించివేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది 87 శాతం కాగా, రాజస్తాన్‌లో ఇది 116 శాతానికి పెరి గిపోయింది. ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల భారం ఇంత భారీగా ప్రభుత్వాలపై పడుతున్నప్పుడు రైతులతో సహా తక్కిన జనాభాకు కేటాయించదగిన వనరులు శూన్యం మాత్రమే. పైగా ఈ వేతనాలు, పింఛన్లు కేంద్ర ప్రభుత్వానివి కావు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలూ మొత్త జనాభాలో అతి కొద్ది భాగంగా ఉన్న ఉద్యోగులను, పింఛనుదారులను సంతృప్తి పరిచేందుకు అహరహం శ్రమిస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2017–18లో అంచనా వేసిన మొత్తం జనాభా 8.1 కోట్లు కాగా ఆ రాష్ట్రంలో 7.5 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 లక్షలమంది శాశ్వత ఉద్యోగులు.ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టి చూస్తే అర్థమవుతున్నది ఒకటే. రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను వ్యవసాయదారుల ఉద్యమాలు అర్థం చేసుకోనంత వరకు రాజకీయ పార్టీలు వీరు వారూ అనే తేడా లేకుండా తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్ప్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీనుంచి రైతులు కోరవలసిన వివరాలు ఏమిటంటే, వ్యవసాయ రంగానికి ఆ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలుకు తగిన వనరులను ఎక్కడినుంచి తీసుకొస్తాయన్నదే. దీనికి రైతులు చేయవలసిన మొదటి పని ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003కి సవరణ తీసుకురావాలని డిమాండ్ చేయడం, దాంతోపాటుగా రాష్ట్ర రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పర్చాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం మాత్రమే. పైగా ప్రతి రైతు కుటుంబానికీ నెలకు రూ.18,000 కోట్ల ఆదాయాన్ని కల్పించాలన్నది తప్పనిసరి నిబంధనగా ఉండాలి. ఇది ప్రతి జిల్లాలోనూ సగటున రైతుల ఆదాయాన్ని వివరించేలా చేస్తుంది, తర్వాత కనీసంగా హామీ పడిన ఆదాయంలో వస్తున్న అంతరాన్ని నగదు బదలాయింపు ద్వారా పూరించేలా వీలు కలిగిస్తుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు