CCLA
-
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
ధరణి రోడ్‌మ్యాప్ కోసం కలెక్టర్లతో భేటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కావాలని ధరణి కమిటీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోగానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోగానీ ఐదు జిల్లాల కలెక్టర్లతో ఈ భేటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఐదుగురు జిల్లా కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేఖ రాసింది. సోమవారం ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, మధుసూదన్‌లతోపాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి తదితరులు సీసీఎల్ఏ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ధరణి వర్క్‌ఫ్లో గురించి చర్చించారు. పోర్టల్‌కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యల గురించి సీసీఎల్ఏ యంత్రాంగం కమిటీ సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ల అనుభవాలను, దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరు, నిజామాబాద్ భూభారతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లతో సమావేశం కావాలని, ఆ తర్వాత రోడ్‌మ్యాప్‌కు ఓ రూపం ఇవ్వాలని తీర్మానించింది. త్వరలో మధ్యంతర నివేదికలు ధరణిపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సమయం పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో.. ప్రజలకు అవసరమైన అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఆయా అంశాలపై త్వరలోనే మధ్యంతర నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక భూములకు సంబంధించిన డేటా కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ శాఖల వద్ద ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించి.. ఈ మూడింటి డేటాను క్రోడీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా సీపీఐతోపాటు పలు పౌరసంఘాల ప్రతినిధులతో కూడా చర్చించారు. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశీ కంపెనీని మారుస్తాం: కోదండరెడ్డి సీసీఎల్ఏ కార్యాలయంలో కమిటీ భేటీ అనంతరం కోదండరెడ్డి, సునీల్‌కుమార్, రేమండ్ పీటర్ మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే తమకు వేలాది ఫిర్యాదులు అందాయని కోదండరెడ్డి చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణను ఓ విదేశీ కంపెనీకి ఇవ్వడం పొరపాటని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించారని.. అయితే ఈ పోర్టల్ నిర్వహణను వేరే కంపెనీకి అప్పగించాలా? కేంద్ర పరిధిలోని సంస్థకు అప్పగించాలా అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ కమిటీ ప్రతి అంశాన్ని పరిశీలిస్తుందని, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ భూములన్నింటిపై అధ్యయనం చేస్తుందని వివరించారు. కాగా.. వ్యవసాయ, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా మెరుగైన భూపరిపాలన అందించేందుకు అవసరమైన మార్పులను మాత్రమే తమ కమిటీ సూచిస్తుందన్నారు. సమస్యల పరిష్కారానికి మార్పులు సూచిస్తాం: సునీల్ ధరణి కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదని, సమస్యల పరిష్కారానికి అవసరమైన మార్పులు, చేర్పులు, సలహాలు అందిస్తుందని కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ చెప్పారు. ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మూలాలను పరిశీలిస్తున్నామని, ఆర్వోఆర్ చట్టం–2020లో మార్పులు అవసరమా కాదా అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. -
సీసీఎల్ఏ భూమి సైట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ముగిసి పదిరోజులు దాటినా రాష్ట్రంలో భూపరిపాలన గాడిలో పడడం లేదు. కోడ్ కారణంగా గతంలో నిలిపివేసిన నాలుగైదు వెబ్సైట్లను పునఃప్రారంభించకపోవడమే ఇందుకు కారణమని రెవెన్యూ వర్గాలంటున్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పరిధిలోకి వచ్చే ల్యాండ్ రెగ్యులరైజేషన్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఎస్), యూఎల్సీ రెగ్యులరైజేషన్, ఈల్యాండ్స్ టీఎస్, జీవో 58, 59ల ద్వారా ప్రభుత్వ భూముల్లోని కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన వెబ్సైట్లతో సహా ఇతర భూపరిపాలన వెబ్సైట్లు పనిచేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. వాస్తవానికి, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత భూముల క్రమబద్ధీ కరణ నిలిచిపోయింది. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉండి నిర్మాణాలు చేసుకున్న వారికి ఆ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు లక్షలాది మంది జీవో 58, 59 ద్వారా భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోగా, అందులో 30–40 శాతం మాత్రమే దరఖాస్తులను పరిష్కరించారు. ఈ దరఖాస్తులను పరిష్కరించే అధికారం కలెక్టర్ల లాగిన్లకు మాత్రమే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే చాలా చోట్ల ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఎన్ని కలు ముగిసిన తర్వాత క్రమబద్దీకరణ జరుగుతుందని భావించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుండడంతో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుందని రెవెన్యూ యంత్రాంగం భావించింది. కానీ, ఎన్నికలకు ముందు మూసేసిన వెబ్సైట్లను ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రాష్ట్రంలో భూముల క్రమబద్దీకరణ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా పగ్గాలు మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందోనన్న ఆలోచనతోనే తాత్కాలికంగా నిలిపివేశామని చెపుతున్నారు. -
సేత్వార్ సమస్యలకు ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సేత్వార్ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు. వాస్తవానికి, ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సేత్వార్ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్‌లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది. ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్ విలువ సర్టిఫికెట్‌ను ధరణి పోర్టల్ ద్వారా ఇచ్చే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్గేజ్ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు. టీఎం 33 మాడ్యూల్లో.. ధరణి పోర్టల్‌లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్‌ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్‌తోపాటు సీసీఎల్ఏ లాగిన్‌లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. -
ఇంకా ఆలస్యమే..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం. ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్ఏ వర్గాలు చెపుతున్నాయి. వేలసంఖ్యలో పెండింగ్‌లో టీఎం 33 దరఖాస్తులు ధరణి పోర్టల్‌లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్‌తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
చెప్పేదొకటి... చేసేదొకటి
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితాలో మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ కొత్త మలుపు తిరిగింది. ఈ ప్రక్రియలో మౌఖికంగా చెప్పి మార్పులు చేయిస్తున్నారని, తద్వారా భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తహసీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లిఖితపూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఇచ్చిన ఈ ఆదేశాల సర్క్యులర్‌ను ఈనెల 3నే జారీ చేసినట్లు ఉన్నా, శనివారం ఉదయమే తహసీల్దార్లకు అందజేయడం గమనార్హం. కోర్టు కేసులు, భూసేకరణలో భాగంగా తీసుకున్న భూములు, అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం భూముల విషయంలో ఏ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేయాలో ఈ సర్క్యులర్‌లో వివరించారు. ఆచరణలో ఏదీ.. ఈ సర్క్యులర్‌లో రెవెన్యూ చట్టాలు చెబుతున్న నిబంధనలను ఉటంకించారే తప్ప ఆచరణలో వీటిని ఏమాత్రం పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా వారంపాటు జరిగిన కసరత్తుకు, ఈ సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలకు తేడా ఉందని సాక్షాత్తు ఈ ప్రక్రియలో పాల్గొన్న తహసీల్దార్లే చెబుతున్నారు. ఇనాం భూముల విషయంలో స్వాధీన హక్కుల ధ్రువపత్ర (ఓఆర్సీ) రిజిస్టర్‌ను పరిశీలించాలని నిబంధనలు చెబుతుంటే, ఓఆర్సీతో పనిలేదని, ఓఆర్సీ రిజిస్టర్లో సర్వే నంబర్ లేకపోయినా పాసు పుస్తకం ఉంది కాబట్టి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీసీఎల్ఏ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసైన్మెంట్ రిజిస్టర్లో నమోదై ఉన్న భూముల సర్వే నంబర్లు పహాణీలో పట్టా అని ఉంటే అసైన్డ్ కాకుండా పట్టా కింద పరిగణించాలని, పొరపాటున పహాణీలో పట్టా అని నమోదై ఉన్నా పట్టాగానే పరిగణించాలని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న కారిజ్ ఖాతా భూముల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో శిస్తు చెల్లించలేని భూములు పట్టా అయినప్పటికీ కారిజ్ ఖాతాలో చేర్చారని, ఆ ఖాతాలోని భూములనే పేదలకు అసైన్ చేశారని తెలుస్తోంది. పేదలకు అసైన్ చేసిన భూముల విషయంలో అసైన్మెంట్ చట్టం ప్రకారమే లావాదేవీలు నిర్వహించే వీలుండగా, కారిజ్ ఖాతాలో ఉన్న భూమి వివరాలు పహాణీలో పట్టా అని ఉన్నందున వాటిని కూడా అసైన్డ్ భూమి నుంచి తొలగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. -
‘అసైన్డ్’ బదలాయింపులో ప్రజలకు మేలు జరగాలి
సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరిగి, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా అసైన్డ్ భూముల బదలాయింపునకు మెరుగైన సిఫారసులు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేలను కోరారు. అసైన్డ్ భూములపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజ హితం కోసం చట్టాలను ప్రభుత్వం కాలానుగుణంగా సమీక్షించుకుని, అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరువిడతల భూ పంపిణీకి తాను నేతృత్వం వహించానని గుర్తుచేశారు. తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు భూమి మరింత అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం అన్నివిధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. భూమి వ్యవసాయం, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. వ్యవసాయ భూమి తమ చేతుల్లో ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి సైతం కలిగించేలా కమిటీ కృషిచేయాలని కోరారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందారులు పేదవర్గాల నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. అసైన్మెంట్దారులైన పేదవారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చేలా కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. పక్క రాష్ట్రాలతో పోల్చి అసైన్డ్ భూములకు సంబంధించి రైతులు పొందిన ప్రయోజనాలు పరిశీలించాలన్నారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని సూచించారు. కమిటీ సభ్యురాలైన హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని నియమించడం గొప్ప పరిణామమన్నారు. ఈ సమావేశంలో తొలుత అసైన్డ్ భూములపై చట్టాలు, సవరణలు, కలెక్టర్ల నివేదికలు, గత కమిటీ సిఫార్సులు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కమిటీకి వివరించారు. అదనపు సీసీఎల్ఏ ఇంతియాజ్, సీసీఎల్ఏ ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి.గణేష్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
సీసీఎల్ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ సైనీని భూపరి పాలన విభాగం ముఖ్య కమిషనర్ కార్యాలయం డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘భూముల’ సమస్య పరిష్కారానికి చర్యలు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములపై అనేక వినతులు వస్తున్నాయి. వీటిపైనే ఎక్కువగా వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు సైతం ఉండటంతో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అనేక ఫైళ్లు భూ పరిపాలన శాఖ (సీసీఎల్ఏ)కు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో సెక్షన్–22ఏ కింద నమోదైన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. 22–ఏ(1)ఏ నుంచి 22ఏ (1)ఈ వరకు ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో పలు కారణాలతో ఇలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలని వినతులు వస్తున్నాయి. వివాదాల భయం, స్పష్టత లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల వాటిని క్లియర్ చేసేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నం జరగలేదు. దీంతో ఇలా వచ్చే ఫైళ్లు పేరుకుపోయాయి. కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో 18 లక్షలకు పైగా ఫైళ్లు ఇలా పెండింగ్‌లో ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. అవి ఏ దశలో ఉన్నాయి, పరిష్కరించేందుకు గల అవకాశాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ ఉద్యోగులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆ ఫైళ్ల పూర్తి వివరాలను సేకరిస్తోంది. వాటన్నింటినీ క్రోడీకరించి సీసీఎల్ఏకు నివేదిక ఇవ్వనుంది. దాన్ని పరిశీలించి ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి సీసీఎల్ఏ ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. -
‘కోర్టు ధిక్కరణ’ నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ఖర్చుల కోసం కేటాయించిన నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.58 కోట్లు మంజూరుపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు మంజూరు చేయడమేమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని హైకోర్టు రెవెన్యూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశించింది. ఈ సందర్భంగా సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. -
ధరణి... వెతల కహానీ
సాక్షి, హైదరాబాద్: సుకేతన్, మాన్సింగ్, సుదర్శన్‌రెడ్డిలే కాదు.. రాష్ట్రంలోని అనేక మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ధరణి సమస్యల నిలయంగా మారింది. తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేయిం చుకునే క్రమంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పోర్టల్ ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సాంకేతిక సమ స్యలు పరిష్కారం కాకపోవడం, ఒక సమస్య పరిష్కారానికి వెళితే ఇంకో సమస్య తలెత్తుతుం డటంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో కూడా సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం, ఒకవేళ స్లాట్ బుక్ చేసుకొని సమయానికి వెళ్లలేక రద్దు చేసుకోవాలన్నా... వీలు లేకపోవడం ధరణి పోర్టల్ నిర్వహణలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల క్రమంలో జరగాల్సిన మ్యుటేషన్లు కూడా పూర్తి కావడం లేదు. జీపీఏలు, కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట పాస్‌పుస్తకాలు, ఎన్నారై భూముల పాస్ పుస్తకాలు, ఈసీలు, పౌతీ లాంటి సమస్యలూ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లితే వాటిని సవరిం చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. సవరణ కోసం మీసేవ కేంద్రాలకు వెళితే ఆప్షన్ రాలేదని చెప్పడం, తహసీల్దార్లను ఆశ్రయిస్తే తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేయడం, కలెక్టర్లను కలిస్తే ఏమీ మాట్లాడకపోవడంతో.. అసలు ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’అనే రీతిలో ఆప్షన్లు ఇచ్చినట్టే ఇచ్చి పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడంతో రెవెన్యూ వర్గాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. చెప్పుకుంటే చాంతాడంత... ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని 1,700 ఎకరాల వ్యవసాయ భూములు ధరణి పోర్టల్‌లో అటవీ భూములుగా నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములున్నాయి. గతంలో వక్ఫ్ బోర్డు భూములుగా నమోదయిన ఈ భూముల సమస్య పరిష్కారమవుతుందని భావిస్తే మళ్లీ అటవీ భూములుగా నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను ధరణి సెంట్రల్ సర్వర్ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా సీసీఎల్ఏకు నివేదించారు. కానీ, సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి రెవెన్యూ శివారు పోరెడ్డిగూడెం గ్రామ పరిధిలో మూసీ కాల్వల నిర్మాణానికి 40 ఏళ్ల కిందట భూసేకరణ చేశారు. వాస్తవానికి అవార్డు కాపీ ప్రకారం ఒక సర్వే నెంబరులో ఎంత భూమి ఉన్నా... భూసేకరణ జరిపినంత మేరకే నిషేధిత భూముల జాబితాలో చేర్చాలి. కానీ, ఇక్కడ సంబంధిత సర్వే నెంబర్లను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చారు. అంతేకాదు పక్క సర్వే నెంబర్లు కూడా పొరపాటున 22(ఏ)లో చేరాయి. దీంతో అక్కడి రైతులకు క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా పోయింది. మీసేవకు వెళితే ఎడిట్ ఆప్షన్ లేదంటున్నారు. ఎమ్మార్వోను కలిస్తే తన చేతిలో ఏమీ లేదంటున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడక్కడి రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ గ్రామంలోని దాదాపు 80 సర్వే నెంబర్లలో ఉన్న 500 ఎకరాల పరిస్థితి ఇదే. ఇక ఏజెన్సీ పరిధిలోని భూములకు సంబంధించి వారసత్వ రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్ కావడం లేదు. డిజిటల్ సంతకాలు పూర్తయినా డిజిటల్ పాస్ పుస్తకం రాని భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు కన్వర్షన్‌కు వెళితే ధరణిలో ఆప్షన్ లేకుండా పోయింది. ఏయే సమస్యలు వస్తున్నాయంటే... పాత మ్యుటేషన్లు: ధరణి అమల్లోకి రాకముందు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవసాయ భూముల మ్యుటేషన్లు అవుతున్నాయి. కానీ, పోర్టల్‌లో కనిపించిన సర్వే నెంబర్ల భూములకు మాత్రమే అవుతున్నాయి. ఒక సర్వే నెంబర్లో కొంత పార్ట్–బీ భూమి ఉన్నా, బై సర్వే నెంబర్లలో తేడాలున్నా సదరు సర్వే నెంబర్ మొత్తమే ధరణిలో కనిపించడం లేదు. జీపీఏలు: పట్టాదారు వచ్చే అవసరం లేకుండానే తన భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మరో వ్యక్తికి ఇచ్చే ప్రక్రియను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అంటారు. కానీ, ధరణిలో విచిత్రం ఏమిటంటే జీపీఏ తీసుకుని వెళితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయలేరు. పట్టాదారు వస్తేనే లావాదేవీ జరిగే విధంగా ఆప్షన్ ఇచ్చారు. ఈసీలు: భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ఈసీలు ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులకు ఇబ్బందిగా మారాయి. ఈసీలు సిటిజన్ లాగిన్‌లో వస్తున్నాయి కానీ అధికారుల లాగిన్‌లో రావడం లేదు. ఈసీలే కాదు పహాణీలు, పాసు పుస్తకాలు ఏవీ తహశీల్దార్ లాగిన్‌లో కనిపించవు. దీంతో సిటిజన్ లాగిన్లోకి వెళ్లి తహశీల్దార్లు ఆ వివరాలు పరిశీలిస్తున్నారు. కంపెనీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్: కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోంది... పాస్ పుస్తకాలు వస్తున్నాయి. కానీ ఆ తర్వాతి లావాదేవీలకు మాత్రం ధరణిలో అవకాశం లేదు. నాలా కన్వర్షన్ చేసుకోవాలన్నా, విక్రయించాలన్నా ఇన్వాలీడ్ పాస్‌బుక్ అని చూపిస్తోంది. పౌతి: భూ యజమాని చనిపోయిన పక్షంలో వారి వారసుల పేరిట భూమిని బదలాయించే పౌతీ ప్రక్రియలోనూ సమస్యలు వస్తున్నాయి. ధరణి అమల్లోకి రాకముందు చనిపోయిన యజమానుల వారసులకు పౌతీ జరగడం లేదు. ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్ పుస్తకం వచ్చిన వాటికి మాత్రమే జరుగుతోంది. మరో విశేషమేమిటంటే... అసైన్డ్ భూముల పౌతీ అసలే జరగడం లేదు. పేరు, తప్పుల సవరణ: పాస్‌బుక్‌లో పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు వస్తే సరిచేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కానీ, సదరు వివరాలు నమోదు చేస్తే ఆ వివరాలు ఎక్కడకు పోతున్నాయో, ఏమవుతున్నాయో తహశీల్దార్లకు కూడా అర్థం కావడం లేదు. ఇక, విస్తీర్ణం, సర్వే నెంబర్లలో పొరపాట్ల సవరణకు ఇంతవరకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆధార్ అనుసంధానం ఆప్షన్ ఇచ్చారు కానీ, ధరణిలో కనిపించిన సర్వే నెంబర్లకు మాత్రమే జరుగుతోంది. స్లాట్ రద్దు: ధరణిలో ఒకసారి స్లాట్ బుక్ అయితే రద్దు కావడం లేదు. రద్దు చేస్తామని, ఫీజు కూడా తిరిగి చెల్లిస్తామని జీవో ఇచ్చారు కానీ, ఇంతవరకు అలాంటిది జరగలేదు. ఇక, ఎన్నారై పాస్‌పుస్తకాల జారీకి, కోర్టు ఉత్తర్వుల అమలుకు ఆప్షన్ ఇవ్వలేదు. సాదాబైనామాల విషయంలో 13బీ, 13సీ ఇచ్చిన భూములకు కూడా ఆప్షన్ రాలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తే సదరు భూముల మార్టిగేజ్ రద్దు జరుగుతోంది. కానీ, రీకన్వెయెన్స్ అయిన తర్వాత మరో లావాదేవీకి అవకాశం లేకుండా పోతోంది. ఈ సమస్యలన్నింటిపై సీసీఎల్ఏ వర్గాలు దృష్టి పెట్టి సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అటు రైతు సంఘాలు, ఇటు రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
భూమి పాస్‌బుక్‌లో తప్పులా? ఇలా సవరించుకోండి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా, అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లిచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ల పరిశీలన అనంతరం.. మీ-సేవ కేంద్రాల్లో ఈ మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు నేరుగా కలెక్టర్లకు వెళ్తాయని, వారు పరిశీలించిన అనంతరం దరఖాస్తును ఆమోదిం చడం లేదా తిరస్కరించడం జరుగుతుందని సీసీఎల్ఏ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియ జేసి తదుపరి చర్యలు వివరిస్తారని తెలిపారు. కాగా, వీటితో పాటు ధరణిలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తేవాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, 10 రోజుల్లో ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో గాడిలో పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
‘అసైన్డ్’ లెక్కేంటి?
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం వెలికితీస్తోంది. నిరుపేదలకు వివిధ దశల్లో కేటాయించిన భూముల వివరాలను రాబడుతోంది. 1954 నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల జాబితాను సేకరి స్తోంది. సామాజికవర్గాలవారీగా జరిగిన కేటాయింపుల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. పేదలు జీవనోపాధి పొందేం దుకు ఐదెకరాల్లోపు భూములను ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా చోట్ల ఈ భూములు చేతులు మారాయి. భూముల విలువలు గణనీయంగా పెరగడంతో పరాధీనమయ్యాయి. వాస్తవానికి అసైన్మెంట్ చట్టం ప్రకారం ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. కానీ ఈ నిబంధనలను తోసిరాజని అనేకచోట్ల ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు కారుచౌకగా లభించే ఈ భూములను కొల్లగొట్టారు. ఒకవేళ అసైనీ (లబ్ధిదారు) చేతి నుంచి భూమి మారితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పని ఒత్తిడో లేక చేతివాటమో తెలియదు కానీ ఇలా పక్కదారి పట్టిన భూములను వెనక్కి తీసుకోవ డం నామమాత్రమే. 2005లో కాస్తోకూస్తో ఇలా చేతులు మారిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వారికి కూడా వెసులుబాటు కల్పించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. భూమిలేని పేదలు ఈ భూములను కొంటే వారి పేరిట అసైన్ చేసేందుకు సర్కారు అంగీకరించింది. 1954 నుంచి గత నెల 31 వరకు జరిగిన భూ పంపిణీ సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో భూ కేటాయింపులు జరగ్గా ఎంత మంది లబ్ధిదారులకు ఎంత విస్తీర్ణంలో భూములు అసైన్ చేశారో నిర్దేశిత ఫార్మాట్లో మూడు రోజుల్లో పంపాలని స్పష్టం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతరులకు పంపిణీ చేసిన భూమి ఎంత? అయా భూముల్లో పోజిషన్లో ఉన్న లబ్ధిదారులు ఎందరు? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించిన విస్తీర్ణం ఎంత? ప్రజావసరాల కోసం సేకరించినది.. ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించినది, చట్టాన్ని ఉల్లంఘించడంతో వెనక్కి తీసుకున్న భూ విస్తీర్ణమెంతో లెక్క తేల్చాలని ఆదేశించింది. అలాగే అసైనీల అధీనంలో ఉన్న భూమి వివరాలను పంపాలని సూచించింది. ఈ లెక్కల అనంతరం అసైన్డ్ భూములపై స్పష్టత వస్తుందని తద్వారా ప్రభుత్వ భూముల వివరాలు కూడా తేలుతాయని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఐదెకరాల్లోపు క్రమబద్ధీకరణ? అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదెకరాల్లోపు భూములను క్రమబద్ధీకరించే వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం..లబ్ధిదారులకు యాజమాన్య హక్కును కల్పించ వచ్చని భావిస్తున్నట్లు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేయడం ద్వారా ఆ భూమిపై అప్పులు పొందడం సులభతరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు చేతులు మారిన భూములను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. ఆయా భూముల్లో పాగా వేసిన వారి పేరిట క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ కేటగిరీ భూములను మార్కెట్ రేటుకు అటుఇటుగా అమ్మే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూముల లెక్క తేలాక గ్రేటర్, పట్టణ సంస్థల్లో ఇలాంటి భూముల్లో వెలిసిన కట్టడాలను కూడా క్రమబద్ధీకరించడం ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ ఈ ముసుగులో భూదందాలు జరిగితే నిలువరించడం కష్టమనే భావనతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతోంది. -
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు
తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలతో పోలిస్తే వైశాల్యం, జనాభా, గ్రామాలు వంటి అంశాల్లో మన రాష్ట్రంలోని జిల్లాలు చాలా పెద్దవి. ఇందువల్ల అధికార యంత్రాంగంపై పనిభారం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కూడా కష్టతరమే. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా తీసుకు వెళ్లాలంటే కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమనే భావన చాలా రోజులుగా ఉంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించింది. లోక్‌సభ పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజక వర్గాలు,వాటి రిజర్వేషన్లు, మండలాలు, గ్రామాలు, విస్తీర్ణం, జనాభా, ఒకే మండలంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వంటి వివరాలు పంపాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఆదేశించారు. ప్రభుత్వం కోరిన వివరాలన్నీ కలెక్టరేట్ అధికారులు పంపారు. కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో కడప, రాజంపేట లోక్‌సభ స్థానాలు ఉన్నందున రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కడప పార్లమెంటు జిల్లా వరకు ఎలాంటి సమస్యలు లేవు. రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై మాత్రం చర్చ నడుస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటితోపాటు చిత్తూరు జిల్లాలోని పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే కోడూరు మినహా ఇంకా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను శేషాచల కొండలు రాజంపేట నుంచి వేరు చేస్తున్నాయి. ఒకవేళ రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటైతే పుంగనూరు ప్రజలు 160 నుంచి 170 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుంది. మదనపల్లె ప్రజలు 130 కిలోమీటర్లు, తంబళ్లపల్లెలోని బి. కొత్తకోట వాసులు 135 కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది. పీలేరు నియోజకవర్గంలోని వాయల్పాడు నుంచి సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అసౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా వంద కిలోమీటర్లు మించి లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే.... ఆనాటి నైజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగిస్తూ 1800 అక్టోబరు 12వ తేదీన ఒప్పందం చేసుకుంది. నవంబరు 1న ప్రిన్సిపల్ కలెక్టర్‌గా కల్నల్ థామస్ మన్రో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి రాయలసీమ, బళ్లారి జిల్లాలను దత్త మండలంగా పిలిచేవారు. 1807లో దత్త మండలాన్ని కడప, బళ్లారి, కొడికొండ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 1808లో కొడికొండను రద్దు చేసి కడప, బళ్లారి జిల్లాల్లో కలిపేశారు. అప్పటి కడప జిల్లాలో కోవెలకుంట్ల, నొస్సం, దూపాడు, కంభం, గిద్దలూరు, గుర్రంకొండ, పుంగనూరు, బద్వేలు, జమ్మలమడుగు, దువ్వూరు, చిట్వేలి, సిద్దవటం, చెన్నూరు, చింతకుంట, కమలాపురం, పులివెందుల, రాయచోటి తాలూకాలు ఉండేవి. 1856లో కడపజిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుంగనూరు సంస్థానాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లాలో కలిపారు. 1858లో కర్నూలు జిల్లా ఏర్పాటు కావడంతో కడప జిల్లాలోని కోవెలకుంట్ల, దూపాడు తాలూకాలను ఆ జిల్లాలో కలిపారు. 1910 అక్టోబరు 1న కదిరి తాలూకాను అనంతపురం జిల్లాలో కలిపారు. 1911 ఏప్రిల్ 1న వాయల్పాడు, మదనపల్లె తాలూకాలను కడపజిల్లా నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లాలో కలిపారు. చరిత్రలో ఇలా కడపజిల్లా భౌగోళిక స్వరూపంలో చాలా మార్పులు సంభవించాయి. ఇప్పుడు కొత్తగా రాజంపేట జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభం కావడంతో జిల్లా స్వరూపంలో మరోమారు మార్పులు జరగనున్నాయి. జిల్లా చిత్రపటంలో పలు మార్పులు ఒకప్పటి జిల్లా చిత్రపటం నేడు మనం చూస్తున్న విధంగా లేదు. అప్పట్లో వైశాల్యం రీత్యా జిల్లా చాలా పెద్దదిగా ఉండేది. పరిపాలన సౌలభ్యం కోసం కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఆ తర్వాత ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని కొన్ని తాలూకాలను కొత్త జిల్లాల్లో కలుపడం వల్ల జిల్లా ముఖ చిత్రంలో చాలా మార్పులు జరిగాయి. ప్రభుత్వానికి నివేదిక కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో పలు వివరాలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కలెక్టరేట్ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి పంపారు. కడప పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు... నియోజకవర్గం మండలాలు గ్రామాలు విస్తీర్ణం జనాభా బద్వేలు 07 149 2650 2,74,179 కడప 01 11 96 3,18,916 కమలాపురం 06 118 1993 2,49,734 పులివెందుల 07 102 1745 2,87,374 జమ్మలమడుగు 06 148 2062 3,06,323 ప్రొద్దుటూరు 02 30 379 2,91,708 మైదుకూరు 05 92 1798 2,61,868 మొత్తం 34 650 10723 19,90,102 రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం రాజంపేట 06 103 1784 3,06,995 రైల్వేకోడూరు 05 101 1360 2,67,987 రాయచోటి 06 74 1493 3,17,385 మొత్తం 17 278 4637 8,92,367 గ్రాండ్ టోటల్ 51 928 15360 28,82,469 -
చినబాబు ఫ్రెండ్‌కి 50 ఎకరాలు
ఇదీ స్కామ్ : ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనా సంస్థ ఎకరాకు రూ.7.26 కోట్లుగా ధర నిర్ణయించింది. దానిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు ఇచ్చేశారు. కేబినెట్‌ను ఒత్తిడి చేసి ఒప్పించారు రాష్ట్ర భూ పరిపాలనా సంస్థ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనా సంస్థ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ. ఆ సంస్థ సిఫార్సులను పట్టించుకోకుండా తమకు నచ్చిన ధరకు తాము మెచ్చిన వారికి భూములు కట్టబెట్టేశారు. చినబాబు మిత్రుడి సంస్థ ఇసెంట్రిక్ సొల్యూషన్స్‌కు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేబినెట్‌పైనా ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
నల్లగొండకు అత్యధికం... వరంగల్ అర్బన్‌కు అత్యల్పం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ సిబ్బంది కేటాయింపుపై స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) అవసరమైన రెవెన్యూ సిబ్బందిని నిర్ధారిస్తూ సర్క్యులర్ విడుదలైంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్స్ కమిషనర్ కార్యాలయాలకు ఈ సర్క్యులర్ ఇప్పటికే చేరింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల కార్యాలయాల్లో కలిపి మొత్తం 9,891 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వో), డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో), అడ్మినిస్ట్రేటివ్ అధికారులు/తహశీల్దార్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, జమేదార్లు, ఆఫీస్ సబార్డినేట్లు, చౌకీదార్లు, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులు, మండల సర్వేయర్లు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, చైన్మెన్లు.. ఇలా మొత్తం 18 కేటగిరీల్లో సిబ్బందిని పంపిణీ చేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 482 మందిని కేటాయించగా, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాకు 200 మందిని కేటాయించారు. ఇక హైదరాబాద్‌కు 289 మందిని కేటాయించారు. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు 2016లో ఇచ్చిన జీవో నంబర్ 157 ద్వారా మంజూరు చేసిన 284 పోస్టులను కూడా ఇందులో కలిపినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది పంపిణీపై కలెక్టర్లు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జిల్లాకో డీఆర్వో: రాష్ట్రంలోని 31 జిల్లాలకు 31 మంది డీఆర్వోలను కేటాయించారు. రంగారెడ్డి (5), కామారెడ్డి (4), నల్లగొండ, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ముగ్గురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ (అర్బన్), రాజన్నసిరిసిల్ల జిల్లాలకు ఒక్కరు చొప్పున ఆర్డీవోలను కేటాయించారు. మిగిలిన జిల్లాలకు ఇద్దరు ఆర్డీవోలను మంజూరు చేశారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఒక జమేదార్ పోస్టును ఇచ్చారు. తహశీల్దార్ స్థాయి అధికారులను అత్యధికంగా నల్లగొండ (40), రంగారెడ్డి (38) జిల్లాలకు కేటాయించారు. అత్యల్పంగా వరంగల్ అర్బన్ (18), గద్వాల (19)కు మంజూరు చేశారు. ఒక్కో మండలానికి ఒకరు చొప్పున సర్వేయర్లు, మండల గణాంక అధికారులను కేటాయించారు. ఒకరి నుంచి నలుగురు వరకు అదనంగా చైన్మెన్లను ఒక్కో మండలానికి మంజూరు చేశారు. దాదాపు ప్రతి జిల్లాకు నాలుగు రికార్డు అసిస్టెంట్ పోస్టులను కేటాయించగా, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు చొప్పున, వనపర్తి, గద్వాల, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ముగ్గురు చొప్పున కేటాయించారు. రంగారెడ్డిలో మాత్రం అత్యధికంగా ఏడుగురు రికార్డు అసిస్టెంట్లు ఉండనున్నారు. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్లు, ఉపగణాంక అధికారులను కేటాయించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలకు మూడు, రంగారెడ్డికి 5 చొప్పున పోస్టులు మంజూరు చేశారు. -
కొత్త పాస్ బుక్కులొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పాస్ పుస్తకాల పంపిణీలో మరో దశ మొదలైంది. తొలిదశలో పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులను సవరించారు. అనంతరం ముద్రించిన 70 వేల పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తప్పులను సరిచేసిన ఈ పుస్తకాల ముద్రణ బుధవారం రాత్రి పూర్తి కాగా, గురువారం ఉదయం నుంచే ఉన్నతాధికారులు జిల్లాలకు పంపారు. వెంటనే వీటి పంపిణీ చేపట్టాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ (సీసీఎల్ఏ) డైరెక్టర్ వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపారు. ఆపసోపాల నడుమ.. రాష్ట్రంలో మొత్తం 50 లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాల ముద్రణ అవసరమని రెవెన్యూ యంత్రాం గం నిర్ధారించింది. అందులో అన్ని వివరాలు అందిన 48 లక్షలకు పైగా పుస్తకాలను ముద్రించింది. వీటిలో దాదాపు 7 లక్షల పుస్తకాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. ముందే గుర్తించిన 4 లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయకుండానే నిలిపేయగా, మరో 3 లక్షల పుస్తకాల్లో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు. తమ వివరాల్లో తప్పులు వచ్చాయన్న రైతుల ఫిర్యాదుతో ధరణి వెబ్సైట్ ద్వారా రెవెన్యూ యంత్రాంగం సరిచేసే పనిలో పడింది. అయితే ధరణి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో తప్పులు సరిచేసేందుకు 2 నెలలుగా రెవెన్యూ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. లక్ష వరకు పాస్‌పుస్తకాల్లోని తప్పులను నిర్ధారించిన ఫార్మాట్లో సరిచేశారు. గత నెల 20న ఈ పుస్తకాలను తిరిగి ముద్రించే పని ప్రారంభమైంది. బుధవారం నాటికి 70 వేల పుస్తకాలు సీసీఎల్ఏకు అందాయి. తప్పులు చూశాకే పంపిణీ.. మొదటి విడతలో భాగంగా వచ్చిన పుస్తకాలు వచ్చి నట్లు అందజేశారు. అయితే వాటిలో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు. దీంతో ఈ పొరపాటు మళ్లీ జరగకుండా పాస్‌పుస్తకాల పంపిణీకి మార్గదర్శకాలు తయారు చేశారు. ఈ పుస్తకాలను మళ్లీ కలెక్టర్లు సరిచూడాలని, ఎలాంటి తప్పుల్లేవని నిర్ధారించుకున్నాకే రైతులకు ఇవ్వాలని డైరెక్టర్ కరుణ ఆదేశించారు. ఒకవేళ మళ్లీ తప్పులుంటే ‘ఎర్రర్.. రీప్రింట్’అనే ప్రొఫార్మాలో తిరిగి పంపాలని వెల్లడించారు. అలాగే రైతు పాత పుస్తకం తిరిగి ఇచ్చిన తర్వాతే కొత్త పుస్తకం ఇవ్వాలని పేర్కొన్నారు. -
పదోన్నతి పొందిన వారికి తహశీల్దార్లుగా పోస్టింగ్
అనంతపురం అర్బన్: డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదంతో తహసీల్దార్లగా పదోన్నతి పొందిన వారికి జిల్లాలకు పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులను ఆదివారం జారీ చేశారు. శీలా జయరామప్ప, అనిల్‌కుమార్, రామశేఖర్‌కు అనంతపురం జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. రామాంజినేయరెడ్డి, నారాయణకు చిత్తూరు జిల్లాలో విధులు కేటాయించారు. అలాగే కర్నూలులో ఉన్న భాగ్యలక్ష్మికి అనంతపురం జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ పొందిన వారంతా ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద రిపోర్ట్ చేసుకుంటే...వారు మండలాలకు పోస్టింగ్ ఇస్తారు. పదోన్నతి పొందిన వారిలో ఓబన్న, భాస్కర్ నారాయణకు ప్రస్తుతానికి పోస్టింగ్ ఇవ్వలేదు. -
రూపాయికే ఎకరం
తొలుత రూ.8 లక్షలకు కేటాయిస్తూ జీవో ఎకరం రూ.లక్ష చొప్పున ఇవ్వాలని కోరిన బీఐఏసీఎల్ తీవ్రంగా స్పందించి రూపాయికే కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు తీరుపై రెవెన్యూ అధికారుల విస్మయం సాక్షి, అమరావతి: భలే చౌక భేరం. రూపాయికే ఎకరా భూమి. రూ.638కే 638 ఎకరాల భూమి కేటాయింపు. భూమి కోరిన సంస్థ ఎకరా రూ.లక్షకు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తం ఎందుకు? రూపాయికే ఇస్తామంది. చెప్పడమే కాదు రూ.638.83కు 638.83 ఎకరాలు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఏకంగా జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కర్నూలు జిల్లాల్లో 638.83 ఎకరాలు కేటాయించాలని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఐఏసీఎల్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో ఎకరా రూ.8 లక్షల మార్కెట్ ధరతో 638.83 ఎకరాలు కేటాయించవచ్చంటూ గత ఏడాది నవంబరు 12వ తేదీన ప్రతిపాదన పంపించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ) గత ఏడాది నవంబరు 17వ తేదీన సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టరు ప్రతిపాదనను యథాతథంగా ఆమోదించింది. ఎకరా రూ. 8 లక్షల మార్కెట్ ధరతో బీఐఏసీఎల్‌కు 638.83 ఎకరాలు కేటాయించాలని ఏపీఎల్‌ఎంఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ మేరకు ఎకరా రూ.8 లక్షల ధరతో 638.83 ఎకరాలను బీఐఏసీఎల్‌కు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గత నెల మూడో తేదీన జీవో నంబరు 46 జారీ చేసింది. ఈ మేరకు ఈ సంస్థకు మార్కెట్ విలువకు భూమిని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆగమేఘాలపై ధర తగ్గింపు ఉత్తర్వులు ప్రజాప్రయోజనాల కోసమే విమానాశ్రయం నిర్మాణానికి ముందుకు వచ్చామని, ఇంత ధరతో భూమి కేటాయిస్తే గిట్టుబాటు కాదని బీఐఏసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ లేఖ రాయడంతో ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. అంత ధరతో భూమి కేటాయిస్తే భారమవుతుందని, ఎకరా రూ. లక్ష నామమాత్రపు ధరతో కేటాయించాలని ఆయన గత నెల 6న ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు. ఈ లేఖ అందడమే తరువాయి ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఎకరా రూపాయికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఎకరా రూపాయికే కేటాయిస్తున్నట్లు తాజాగా సోమవారం జీవో 107 జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారం పట్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. ఇదెక్కడి ద్వంద్వ విధానం? భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో సంస్థ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడలో ఇండియన్ నేవీకి వంద ఎకరాలు ఎకరా రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ 2003 డిసెంబరు 3వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 1241 జారీ చేసింది. ఈ మేరకు రూ.5 కోట్లు ఇండియన్ నేవీ ప్రభుత్వానికి చెల్లించింది. ఈ భూమిని తమకు అప్పగించాలని నేవీ అధికారులు కోరగా, అంత భూమి ఇవ్వలేమని, తగ్గించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్కారు ఒత్తిడి తేవడంతో చర్చల్లో 80 ఎకరాలతో సరిపెట్టుకుంటామని ఇండియన్ నేవీ అధికారులు చెప్పారు. చివరకు అంత కూడా కేటాయించకుండా 65 ఎకరాలతోనే సరిపెట్టుకోవాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. వంద ఎకరాలకు సొమ్ము చెల్లించినందున తమకు ఇస్తున్న 65 ఎకరాలకు పోనూ మిగిలిన 35 ఎకరాలకు సంబంధించిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఇండియన్ నేవీ కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. వంద ఎకరాలకు తీసుకున్న మొత్తాన్ని 65 ఎకరాలకే సరిపెట్టుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెల 21వ తేదీన జీవో 80 జారీ చేసింది. ఇది సర్కారు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అధికారులు అంటున్నారు. -
‘క్రమబద్ధీకరణ’ దరఖాస్తులకు లైన్‌క్లియర్!
- గడువు పొడిగింపుపై కలెక్టర్ల మొర ఆలకించిన సీసీఎల్ఏ సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో ఆరు నెలలు గడువు కావాలని వివిధ జిల్లాల కలెక్టర్లు చేసిన విజ్ఞప్తికి భూపరిపాలన ప్రధాన కమిషనర్(ఇన్చార్జ్) ఎస్పీ సింగ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. జిల్లా కలెక్టర్లు కోరిన విధంగా క్రమబద్ధీకరణ పక్రియ గడువు పెంపు విషయమై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున, ఉత్తర్వులు వచ్చేలోగా దరఖాస్తుదారుల నుంచి పూర్తి సొమ్ము స్వీకరణ, కన్వేయన్స్డీడ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలు కొలిక్కి రాకపోవడడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దరఖాస్తుదారులు సొమ్ము చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తడం.. తదితర సమస్యలతో క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. నేటికీ పలు మండలాల్లో బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయడం లేదని తహశీల్దార్లు నెత్తీనోరూ బాదుకుంటున్నా సీసీఎల్ఏ సిబ్బంది పట్టించుకోవడం లేదు. పాత దరఖాస్తులు క్లియర్ చేయడానికే అధికారులు నానా అవస్థలు పడుతుంటే, గత నవంబర్‌లో మరో దఫా కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం వేరొక ఉత్తర్వు జారీ చేసింది. అదే సందర్భంలో పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు ప్రభుత్వమిచ్చిన గడువు జనవరి 10లోగా పూర్తి సొమ్ము చెల్లించలేకపోయారు. అధికారుల్లో తొలగని అయోమయం రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా పాత, కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, గడువు ముగిసినందున సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు కూడా ఆయా స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ యంత్రాంగానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. క్షేత్రస్థాయి నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖలు రాసినప్పటికీ, ఆరు నెలలుగా రెగ్యులర్ సీసీఎల్ఏ లేనందున జిల్లా కలెక్టర్ల విజ్ఞప్తులు పెండింగ్‌లో పెట్టేశారు. ‘రెవెన్యూలో గాడి తప్పిన పాలన’శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో ఇన్చార్జ్ సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్పీసింగ్ తాజాగా క్రమబద్ధీకరణ ప్రక్రియపై దృష్టి సారించారు. ప్రక్రియను కొనసాగించాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చినప్పటికీ, గడువు పొడిగింపుపై స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ యంత్రాంగంలో అయోమయం తొలగలేదని తహశీల్దార్లు వాపోతున్నారు. గడువు పొడిగింపునకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నందున రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని కొన్ని జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయిలో తమ సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. -
ప్రజాసాధికార సర్వేను నేటితో ముగించండి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను ఎట్టి పరిస్థితుల్లోను నేటితో(30వ తేదీ) ముగించాలని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునీత తెలిపారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వేలోకి రాని వారు ఏఏ కారణాలతో దూరంగా ఉన్నారో రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఎన్యూమరేటర్ల నుంచి తహశీల్దార్లు, తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్లు సర్వే పరిధిలోకి రాని వారి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడంతో సర్వే ముగిసినట్లు అవుతుందన్నారు. సర్వే విభాగానికి సంబంధించి ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో తగిన నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్ మాట్లాడుతూ... భూసేకరణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఎల్ఏ స్పందిస్తూ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సర్వే ఏడీ చిన్నయ్య, సెక్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, భాగ్యలక్ష్మి, రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలపై ఏకపక్ష నిర్ణయమేల?
* జిల్లాల ఏర్పాటుకు రాజ్యాంగ ప్రాతిపదికేది: టీజేఏసీ ఆక్షేపణ * ప్రభుత్వానిది తొందరపాటు నిర్ణయం * ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం సమగ్రమైంది కాదు * సీసీఎల్ఏకు లేఖ రాయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సమగ్ర నివేదిక, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన చేపట్టిందని తెలంగాణ జేఏసీ ఆక్షేపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 244, షెడ్యూల్ 5లోని అంశాలను పట్టించుకోకుండా కొత్త జిల్లాల పని ప్రారంభిస్తామనడం తొందరపాటు చర్యగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీసీఎల్ఏకు ఒకట్రెండు రోజుల్లో జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం లేఖ రాయనున్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల విభజన అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటుచేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల భాష, సంస్కృతులు, చరిత్ర, జీవనవిధానం, అభివృద్ధి, వెనుకబాటుతనం, వనరులు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ కమిషన్ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారమే 1956లో దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ అదే స్ఫూర్తితో జిల్లాల విభజన జరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుతో వ్యవహరిస్తోంది’’ అని జేఏసీ లేఖ రాయనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు అవసరమేనని, అయితే అందుకు హేతుబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఎక్కడుందని జేఏసీ ప్రశ్నిస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర నివేదిక తయారుచేస్తే జిల్లాల పునర్విభజనలో గందరగోళం, ప్రజల మధ్య వైషమ్యాలు తలెత్తేవి కావని భావిస్తోంది. ‘‘అధికారంలోకి వచ్చిన పార్టీలు తమ ఇష్టానుసారం కాకుండా శాసనబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పునర్విభజన చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల(ఏర్పాటు)చట్టం సమగ్రమైంది కాదు. జిల్లాల సరిహద్దుల మార్పునకు తప్ప ఇప్పుడున్న జిల్లాల్లాగా సమగ్ర స్వరూపాన్ని మార్చాలంటే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అనువైన కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసర ం ఉంది. కానీ చట్టం లేకుండా, శాసనసభలో చర్చించకుండా ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ జిల్లాల చట్టం-1974ను దత్తత తీసుకుంటూ ఉత్తర్వుల ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది’’ అని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణకు ప్రత్యేక చట్టం రూపొందించే దాకా జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిలిపివేయడం మంచిదంటూ ప్రభుత్వానికి లేఖ రాసేందుకు జేఏసీ సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటును నిలిపివేయకుండా ముందుకే వెళ్లాలనుకుంటే కొన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వానికి జేఏసీ సూచించింది. ఆ సూచనలివీ.. ⇒ విస్తీర్ణం, జనాభా, ఆదాయం, ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోవాలి ⇒ చారిత్రక, భౌగోళిక నేపథ్యాలు, భౌతిక లక్షణాలు, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, సమస్యలు, విద్యా, సాంస్కృతిక అంశాలు, అభివృద్ధి వనరులు, సౌకర్యాలను అధ్యయనం చేయాలి ⇒ ఆ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూడాలి ⇒ పరిపాలనా సౌలభ్యం, మంచి పరిపాలన ఇవ్వడం లక్ష్యంగా ఉండాలి ⇒ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రాతిపదికను ప్రకటించాలి ⇒ జిల్లాల ఏర్పాటు తుది నిర్ణయం ప్రజాభీష్టం ప్రాతిపదికగా జరగాలి ⇒ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా సమగ్రతను పెంపొందించే లక్ష్యంగా ఆ ప్రాంతాలను ఎక్కడికక్కడ ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి -
వేగంగా సాదాబైనామాలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాదాబైనామాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్‌పీటర్ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. నోటీసులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో వీర్వోలకు ఇచ్చే ట్యాబ్‌లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎల్ఈసీ కార్డుల జారీ, ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ఈ వీసీకి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం. రాంకిషన్, డీఆర్ఓ భాస్కర్, డి–సెక్షన్ తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు హాజరయ్యారు. -
సాదాబైనామాల వేగం పెంచాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: సాదాబైనామా నోటీసులు జారీచేయడంలో వేగం పెంచాలని సీసీఎల్ఏ రేమండ్ పీటర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సాదాబైనామా నోటీసులు వెంటనే జారీచేసి ఆగస్టులో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో పుష్కరాలు లేని మిగతా మండలాల్లో సాధాబైనామా ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. అసైన్డ్‌ల్యాండ్ వివరాలను వెంటనే పంపించాలని సూచించారు. జీఓ 58, ముటేషన్లు, ఎఫ్‌లైన్ పిటిషన్ల పురోగతిపై చర్చించారు. సమావేశంలో జేసీ రాంకిషన్, డీఆర్వో భాస్కర్, ఎస్ఎల్ఆర్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు. రైతులకు పారదర్శకసేవలు రైతులకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వ్యవసాయశాఖ డైరెక్టర్ జీడీ ప్రియదర్శినితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. వ్యవసాయశాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. మాభూమి పోర్టల్, అగ్రీస్ నెట్ సర్వర్ల ద్వారా రైతుల వివరాలు తెలుసుకుని వారికి రుణాల మంజూరు, బీమా, పావలావడ్డీ, సబ్సిడీ రుణాలు, ఎరువులు, విత్తనాల సబ్సిడీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని వివరాలను రైతు ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేడీఏ బాలునాయక్, సీపీఓ లలిత్‌కుమార్, డీడీఏలు సింగారెడ్డి, నాగేంద్రయ్య, ఏడీలు యశ్వంత్‌రావు, హైమావతి పాల్గొన్నారు. -
చెక్ మెమోలివ్వకుండా దరఖాస్తుల తనిఖీ ఎలా?
* యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణలో గందరగోళం * ప్రిప్రింటెడ్ చెక్ మెమోలు జారీ చేయని సీసీఎల్ఏ * 10లోగా పరిశీలన చేయాలంటున్న జాయింట్ కలెక్టర్లు సాక్షి, హైదరాబాద్: పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) పరిధిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్) నుంచి వచ్చిన సుమారు ఆరువేల దరఖాస్తులను పరిశీలించేందుకు రెవెన్యూ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉన్నతాధికారులు.. సదరు పరిశీలనకు అవసరమైన చెక్ మెమోను మాత్రం 45 రోజులు గడిచినా నేటికీ జారీ చేయలేదు. ఒకవైపు సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రావాల్సిన ప్రిప్రింటెడ్ చెక్ మెమో రాకుండానే.. మరోవైపు జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ఈ నెల 10లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినపుడు దరఖాస్తులోని పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్ నంబరు, స్థలం పొడవు, వెడల్పు.. తదితర వివరాలను తనిఖీ అనంతరం ప్రిప్రింటెడ్ చెక్ మెమోలోని వివరాలతో సరి చూడాలి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్ మెమో అందకపోవడంతో ఒకే పనిని రెండు సార్లు చేయాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. సదరు స్థలానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలనూ చెక్ మెమోలో పేర్కొనాలని ఉన్నతాధికారులు ఆదేశించడం మరింత ఇబ్బందికరంగా తయారైంది. మండలాల్లో ద రఖాస్తుల పరిశీలనకు సర్వేయర్ల కొరత ఉండటం, ప్రిప్రింటెడ్ చెక్ మెమో అందకపోవడంతో పరిశీలన చేయడం ఎలాగంటూ తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు. క్రమబద్ధీకరణకు ఆరువేల దరఖాస్తులు: యూఎల్సీ భూములున్న ప్రాంతాల నుంచి సుమారు ఆరువేల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 5,600 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ జిల్లాలో 300, వరంగల్ జిల్లా నుంచి సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తు గడువు గత నెల 25తో ముగిసింది. చివర్లో ఆధార్ నుంచి మినహాయింపు ఇచ్చినా ఆ సమాచారం ఎక్కువమందికి చేరలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ లబ్ధిదారులు జిల్లా కలెక్టర్లకు మొర పెట్టుకుంటున్నారు. కాగా యూఎల్సీ మిగులు భూముల ను డిక్లరెంట్ ద్వారా కొనుగోలు చేసిన పలువురు గ త ఎనిమిదేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.