chief minister arvind kejriwal
-
ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశమంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా బెంబేలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 100 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 8,041 మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. న్యూఢిల్లీ: భారత్‌లో సెప్టెంబర్‌లో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరింది. అప్పటి నుంచి తీవ్రత తగ్గుతోంది. ఢిల్లీలో జూన్, సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 8,593 కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్ 18న ఒక్కరోజులోనే 131 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 19న 7,546 కొత్త కేసులు బయటపడ్డాయి, 98 మంది మరణించారు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మొత్తం మరణాల్లో 21 శాతం మరణాలు ఢిల్లీలోనే చోటుచేసుకోవడం గమనార్హం. రాజధానిలో థర్డ్ వేవ్ ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించని వారికి జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000కు పెంచేశారు. వివాహానికి 200 మంది అతిథులు హాజరుకావొచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్ ఆఖరి వరకు ప్రతిరోజూ 60,000 ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది. పేదలే సమిధలు రాజధానిలో ప్రధానంగా కనిపించేది అధిక జనాభా. కరోనా విస్తరణకు ఇదొక ముఖ్య కారణమన్నది నిపుణుల మాట. కరోనా వి జృంభిస్తున్నా పేదలు ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి లేదు. జీవనం కోసం బయటకు అడుగు పెట్టాల్సి వస్తోంది. ఢిల్లీలో ఇటీవల పేదలే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పేదలకు కరోనా సోకుతోందని ప్రఖ్యాత ఎపిడెమాలజిస్టు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ చెప్పారు. పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో జన సాంద్రత అధికంగా ఉండడం కరోనా వ్యాప్తికి అనుకూల పరిణామమే. ఢిల్లీలోనే ఎందుకు? దేశంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగలు అధికంగా జరుగుతాయి. పండుగ సీజన్లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందునుంచే హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా పండుగల సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఢిల్లీలోనే మహమ్మారి ఎందుకు పడగ విప్పుతోందన్న ప్రశ్నలకు నిపుణులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. నగరం ఒక గ్యాస్ చాంబర్ ఢిల్లీలో చలికాలం ప్రారంభం కాగానే కాలుష్యం స్థాయి పెరిగిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తోంది. గాలి వేగం తగ్గిపోయింది. ఢిల్లీ నగరం ఒక గ్యాస్ చాంబర్‌లా మారిందని చెప్పొచ్చు. నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణం. దీనికి తోడు కరోనా నియంత్రణకు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ఇప్పుడున్న అతిపెద్ద ఔషధం అప్రమత్తతే. వాతావరణం.. కాలుష్యం ఢిల్లీలో చలికాలం అక్టోబర్ చివరి వారంలోనే ప్రవేశించింది. ఈ వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇళ్లల్లో ఉండే కరోనా బాధితుల నుంచి వైరస్ ఇతరులకు సులభంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాగే కాలుష్యం కారణంగా గొంతు, ముక్కు, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ఫలితంగా కరోనాతోపాటు ఇతర వైరస్లు సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరుపున న్యాయవాది హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 2013లో ఓ పత్రికా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిబల్ కుమారుడు అమిత్ సిబల్ నేర పూరిత పరువు నష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉందని కింది స్థాయి కోర్టు ఆదేశించగా తాను ముఖ్యమంత్రిగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని, తన తరుపున వేరేవారి హాజరుకు అనుమతిస్తూ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను ఆమోదించింది. అయితే, కేజ్రీవాల్ హాజరుకాకుంటే కేసు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే మాత్రం హాజరుకావాలంటూ ఆదేశించే హక్కు మాత్రం కింది కోర్టుకు ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. -
అందరూ యుద్ధం ప్రకటించండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో నానాటికి పెరుగుతున్న చికెన్ గున్యా, డెంగ్యూ కేసుల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దోమలపై పార్టీలకు అతీతంగా యుద్దం చేయాలని అన్నారు. ఒక యుద్ధానికి వెళ్లే సమయంలో ఎలాంటి సన్నాహాలు చేస్తామో అలాగే ప్రతి ఒక్కరు ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగ్యూ దోమలను అరికట్టేందుకు నడుంకట్టాలని చెప్పారు. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమమంలో భారతీయులంతా ఏకమయ్యే తీరుగా ఢిల్లీలో ప్రమాదకరపరిస్థితులపట్ల ఏకమవ్వాలని తెలిపారు. గొంతు ఆపరేషన్ తర్వాత ఢిల్లీలో దోమల బెడద గురించి మాట్లాడిన ఆయన ప్రతి ఒక్క కుటుంబం కూడా చికెన్ గున్యా బారినపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలకు కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్లు అనేది ఉండదని, అందరినీ అవి వెంబడిస్తాయని, కావున వాటిపై కలిసికట్టుగా యుద్ధం మాదిరి చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే తాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు దోమల నివారణకు కావాల్సిన ఫాగింగ్ మెషిన్లను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు అవి రెండు మూడు రోజుల్లో సమకూరుతాయని అన్నారు. 'ప్రభుత్వ సంస్థలు పనిచేయడం లేదని ఆరోపణలు చేస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవడం సరికాదు. ప్రతి ఒక్క ఢిల్లీ పౌరుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. అందరం కలిసిపనిచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది' అని కేజ్రీవాల్ అన్నారు. -
ఆ ఎమ్మెల్యేలు బడికే వెళ్లలేదట!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల మాటల వెనుక అసలు నిజాలు వేరే ఉంటాయంటారు. అసలు కార్యం పూర్తయితే తప్ప ఆ విషయం బయటకు రాదు.. రానివ్వరు అని చెబుతుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఇది కాస్త రుజువైంది. తమ పార్టీ నేతలంతా బాగా చదువర్లు, ఉన్నత చదువులు చదివిన వాళ్లు.. ఎంబీఏ, ఇంజినీరింగ్ అని పేర్కొంటూ వివిధ రంగాల్లో కూడా ఆరితేరిన వారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలన్ని కల్లలే అని తెలిసిపోయింది. ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యేల్లో మొత్తం 23 మంది కేవలం స్కూల్ స్థాయి చదువులే చదివారంట. అది కాకుండా ఏనాడు వీరు కనీసం ఆ క్లాసులకు కూడా పూర్తిగా వెళ్లలేదని తెలిసింది. ఎన్నికల కమిషన్‌కు నామినేషన్ సమయాల్లో సమర్పించిన అఫిడ్ విట్ లో ఈ విషయాలు పేర్కొన్నారు. దీని ప్రకారం 20మంది ఎమ్మెల్యేలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను మాత్రమే పూర్తి చేశారు. ఇక ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో ఇద్దరు డిప్లోమా వరకు చదివారంట. 26మంది ఆప్ ఎమ్మెల్యేలో నరేశ్ బాల్యన్, హజారీ లాల్ చౌహాన్, రాజు దింగాన్, అవతార్ సింగ్ అనే నలుగురు నేతలు కేవలం 8వ తరగతి పూర్తి చేయగా మరికొందరు ఐదు, ఇంకొందరు పదో తరగతి పూర్తి చేశారని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీళ్లలో ఏ ఒక్కరు కూడా రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లేవారు కాదంట. ఈ వివరాలు బయటకు రావడంతో విలువలు, నీతి అంటూ పార్టీ పెట్టి అందరు అవాక్కయ్యేలా ప్రసంగాలు ఇచ్చిన కేజ్రీవాల్ కూడా అబద్ధాలు చెబుతారా అని సామాన్యులు ఇప్పుడు విస్తుపోతున్నారు. -
'హనుమంతప్పకోసం ఎంతో ప్రార్థిస్తున్నాను'
న్యూఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో చిక్కుకొని ఆరు రోజులపాటు మంచుదిబ్బలకింద ఉండిపోయి చివరకు మృత్యుంజయుడిగా బయటపడి ప్రస్తుతం ప్రాణంకోసం పోరాడుతున్న లాన్స్ నాయక్ హనుమంతప్ప వీలయినంత త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ వీర సైనికుడు త్వరత్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాని ఆయన చెప్పారు. 'హనుమంతప్ప కొప్పాడ్ సురక్షితంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను ఆయనను చూసేందుకు వెళ్లాలని అనుకున్నాను. కానీ, ఇప్పుడు అతడు ఉన్న పరిస్థితుల్లో కలవడం అంతమంచిదికాదని అధికారులు సూచించారు' అని కేజ్రీవాల్ చెప్పారు. -
'కేజ్రీవాల్ ఎవరికీ లంచం ఇవ్వలేదు కదా'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగింది. ఆయనపై గతంలో దాఖలైన ఓ క్రిమినల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన తప్పు చేసినట్లుగా పిటిషన్ దారులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందున ఆ పటిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బబ్రు భాన్ తీర్పు వెలువరించారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరించారని, మిగితా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకోవచ్చని, కానీ ఓట్లు మాత్రం తమకే వేయాలని వారిని మభ్య పెట్టారని, అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపిస్తూ ఇక్రాంత్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే, వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఎవరికీ లంఛం ఇవ్వలేదని, ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చని మాత్రమే చెప్పారని ఈ సందర్భంగా పిటిషన్ దారుకు కోర్టు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 2015లో ఈ పిటిషన్ దాఖలైంది. -
‘సరి-బేసి’ సాధించింది ఏమిటి?
తగ్గిన వాహనాల రద్దీ కాలుష్యంలో తగ్గింపుపై అస్పష్టత న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కళ్లెం వేయడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకొచ్చిన ‘సరి-బేసి’ విధానాన్ని ఈ నెల 1 నుంచి 15వరకు ప్రయోగపూర్వకంగా అమలు చేశారు. సరి, బేసి సంఖ్యలున్న నాలుగు చక్రాల వాహనాలను రోజు మార్చి రోజు రోడ్లపైకి అనుమతించారు. ఈ పక్షం రోజుల్లో ‘సరి-బేసి’తో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు కాలుష్యం దాదాపు 40 శాతం తగ్గిందా? ట్రాఫిక్ రద్దీ మాయమైందా? అని ప్రశ్నిస్తే సానుకూల ఫలితాలే వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ విధానం వల్ల మాత్రమే కాలుష్యం తగ్గదని, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని నిపుణులు చెబుతున్నారు. డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించి, కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని, సైకిల్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అంటున్నారు. తగ్గిన ట్రాఫిక్ రద్దీ .. సరి-బేసి రోజుల్లో చాలా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గింది. ట్రాఫిక్ జామ్‌లూ చాలా వరకు తగ్గాయి. అయితే ప్రధాన కూడళ్లలో రద్దీ తగ్గలేదు. నగరం చుట్టుపక్కలున్న గుర్గావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ వంటి చోట్లనుంచి వాహనాలు ఎప్పట్లాగే పెద్దసంఖ్యలో వచ్చాయి. ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి 10కి.మీ దూరం వెళ్లడానికి ఇదివరకు 35 నిమిషాలు పట్టేదని, ‘సరి-బేసి’తో 18 నిమిషాల్లో వెళ్లగలుతున్నానని ఓ అంబులెన్స్ డ్రైవర్ చెప్పారు. వాహనాల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోడానికి నలుగురు, ఐదుగురు కలసి కారులో(కార్ పూలింగ్) వెళ్లారు, బస్సులు, రైళ్లను కూడా ఆశ్రయించారు. ప్రభుత్వ విధానాల్లో ప్రజల భాగస్వామ్యానికి సరి-బేసి ఒక ఉదాహరణ అని, దీన్ని మిగిలిన రంగాల్లోనూ అమలు చేయాలని పాలనా నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం తగ్గిందా?.. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలు మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పక్షం రోజుల్లో కాలుష్య స్థాయిలు తగ్గాయని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, చాలాచోట్ల ఇంతకుముందున్న స్థాయిలే కొనసాగాయని అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే కాలుష్యం తగ్గిందని మరికొందరు అంటున్నారు. కస్తూర్బా నగర్‌లోని ద్యాల్సింగ్ కాలేజీ ప్రాంతంలో పీఎం10(10 మైక్రోమీటర్ల వరకు ఉన్న పదార్థం) క్యూబిక్ మీటరుకు 149 మైక్రోగ్రాములుగా నమోదైంది. తూర్పు ఢిల్లీలోని పత్పర్గంజ్లో 500 మైక్రోగ్రాములకు చేరింది. జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) ప్రకారం పీఎం10 స్థాయి 100 మైక్రోగ్రాములు ఉంటేనే సురక్షితం. అతిసూక్ష్మ కణాలైన పీఎం2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే చిన్నది) పరిమిత స్థాయి క్యూబిక్ మీటరుకు 66 మైక్రోగ్రాములు కాగా కమలానెహ్రూ కాలేజీ వద్ద 226 మైక్రోగ్రాములు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కైలాస్) వద్ద 217 గ్రాములుగా నమోదైంది. ప్రభుత్వం మాత్రం పీఎం10 స్థాయి 450 నుంచి 250 వరకు తగ్గిందని చెబుతోంది. కాలుష్య స్థాయిలు వాహనాల వల్లే కాకుండా గాలి, వాతావరణం, ఇతర స్థానిక ఉద్గారాలపై ఆధారపడి ఉంటుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) చెప్పారు. తగ్గింపుపై ఇంకా స్పష్టత రావాలని, పక్షం రోజుల్లో ఫలితాలపై తుది అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. కార్ల కాలుష్యం 40% తగ్గింది: సీఎస్ఈ ‘సరి-బేసి’తో ఢిల్లీలో కార్ల నుంచి వచ్చే ఉద్గారాలు 30- 40 శాతం వరకు తగ్గాయని సీఎస్ఈ తెలిపింది. వీధుల్లో కార్ల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి వివేక్ ఛటోపాధ్యాయ చెప్పారు. త్వరలో మెరుగైన విధానం: కేజ్రీ సరి- బేసి వాహన వినియోగం విధానం విజయవంతమైందని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. విధానంలో లోటుపాట్లను అధ్యయనం చేసి.. మెరుగుపర్చిన విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ‘సరి-బేసి’కి సహకరించిన పౌరులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘సరి-బేసి’కి మద్దతుగా మరి కొందరితో కలిసి తన వాహనాన్ని పంచుకున్న సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను ప్రశంసిస్తూ.. ఆయన చర్య లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. -
పార్టీకి తలవంపులు తెస్తున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతీ వ్యవహారంపై ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. సోమ్‌నాథ్ వ్యవహారం ఆయన కుటుంబా నికీ, ఆమ్ఆద్మీపార్టీకి తలవంపులు తెచ్చిపెడుతోందని కేజ్రీవాల్ బుధవారం ట్విటర్ లో వ్యాఖ్యానించారు. భారతీ పోలీసులను ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో, జైలుకు పోవటానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. కాగా, తనను అరెస్టు చేయకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలంటూ సోమ్‌నాథ్ భారతీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. -
'వాళ్ల అరెస్టు దిగ్భ్రాంతికి గురిచేసింది'
న్యూఢిల్లీ : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థులను అరెస్టు చేయడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు కొంత స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారు జామున ఎఫ్టీఐఐకి చెందిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. దీనిపై స్పందించిన కేజ్రీవాల్, క్లాసులు నిర్వహించేందుకు కొంత స్థలాన్ని ఢిల్లీలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గొప్పదనం ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల మసక బారుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఇప్పుడు కేటాయించిన స్థలంలోనే పూర్తి స్థాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గా మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేత, టీవీ నటుడు గజేంద్ర చౌహాన్ ను ఎఫ్టీఐఐ సంస్థకు చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. -
జంగ్‌తో కేజ్రీవాల్ భేటీ
అధికారాల విషయంలో పరస్పర సహకారంపై చర్చ * కొత్త న్యాయశాఖ మంత్రిగా కపిల్ మిశ్రా * పోలీస్ కస్టడీలో తోమర్ విచారణ ప్రారంభం న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ అధికార వ్యవస్థలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో బుధవారం భేటీ అయ్యారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ఆరోపణలతో అరెస్టయిన జితేందర్‌సింగ్ తోమర్ మంత్రిపదవికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో ఢిల్లీ జలబోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కపిల్ మిశ్రాను న్యాయ మంత్రిని చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇద్దరూ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఉన్న మార్గాలపై ఎల్జీ, కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం. కేజ్రీవాల్‌తో తాను సమావేశమయ్యానని తనకు న్యాయశాఖ అప్పగించనున్నట్లు తెలిపారని కపిల్ మిశ్రా తెలిపారు. మిశ్రా నియామకానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కేజ్రీవాల్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు. ఢిల్లీ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఫైజాబాద్‌కు తోమర్..: సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్న మాజీ మంత్రి తోమర్‌ను నకిలీ సర్టిఫికెట్ విచారణలో భాగంగా పోలీసులు ఫైజాబాద్ తీసుకెళ్లారు. ఇది కేవలం తోమర్ సర్టిఫికెట్ వ్యవహారమే కాదని, దీని వెనుక అతి పెద్ద నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఫైజాబాద్‌లోని అవధ్ వర్సిటీకి తోమర్‌ను అధికారులు తీసుకెళ్లారని, ఆయన సాయంతో అక్కడ కేసు ఆధారాలను సేకరిస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తోమర్ తమ నుంచి ఎలాంటి డిగ్రీ పొందలేదని అవధ్ వర్సటీ ఓ ఆర్టీఐ దరఖాస్తుకిచ్చిన జవాబులో తెలిపింది. ఒక రాష్ట్రం.. ఇద్దరు హోం సెక్రటరీలు ఒకే కార్యాలయం.. ఒకే పదవి.. అధికారులు మాత్రం ఇద్దరు.. ఇద్దరూ విధులు నిర్వర్తించారు. మరి సిబ్బంది ఎవరి మాట వినాలి? ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమోదమున్న అధికారి. మరొకరేమో సాక్షాత్తూ సీఎం నియమించిన అధికారి.. ఢిల్లీలో ఈ సంకటం నెలకొంది. ఢిల్లీ హోం శాఖలో కార్యదర్శి పదవిలో ఇద్దరు అధికారులు ఒకేసారి విధులు నిర్వర్తించారు. అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారి నియామకం నేపథ్యంలో ఎల్జీ ఆదేశాలను పాటించిన ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను ఆప్ సర్కారు బదిలీ చేసి మరో అధికారి రాజేంద్ర కుమార్‌ను ఆ పదవిలో నియమించింది. అయితే పాల్ బదిలీ చెల్లదని.. ఎల్జీ చెప్పటంతో.. బుధవారం ఇద్దరు అధికారులూ తానే హోం కార్యదర్శినంటూ విధులు నిర్వర్తించారు -
కేజ్రీవాల్ ప్రకటనలను తొలగించనున్న ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలున్న ప్రభుత్వ ప్రకటనలను తొలగించనున్నట్లు గురువారం ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు మాత్రమే ప్రచురించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యను తీసుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం తెలిపింది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఆ మేరకు సీఎం, ఇతర మంత్రుల ఫొటోలు ఉన్న ప్రకటనలను తొలగిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ బొమ్మలు లేకుండా ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమని, అయినా ప్రత్యామ్నాయ పద్ధతిపై దృష్టి సారిస్తామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. -
నీ తెగువ అమోఘం
కానిస్టేబుల్ దాడిలో గాయపడిన మహిళను అభినందించిన కేజ్రీవాల్ రాష్ట్రం నీ లాంటి పౌరులను కోరుకుంటుంది అవినీతిపై పోరాడే వారికి వెన్నంటే ఉంటాం న్యూఢిల్లీ: లంచం ఇవ్వకుండా కౌర్ చూపిన తెగువను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన రమన్జీత్ కౌర్‌ను ఆయన మంగళవారం కలిశారు. సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ లంచం ఇవ్వనందుకు మహిళపై ఇటుకతో దాడి చేసిన సంగతి విదితమే. రాష్ట్రంలోని ప్రజలందరూ కౌర్లాగా ఉండాలన్నారు. అప్పుడే అవినీతిని అంతమొందించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ దాడిలో గాయపడిన తనకు సరైన చికిత్స అందించడం లేదని సీఎంకు ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆమెకు మెరుగైన చికిత్సనందించాలని అధికారులను ఆదేశించారు. ‘నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం. మేము నీ వెన్నంటే ఉండి చేయగలిగినంత సాయం చేస్తాం. ఢిల్లీ నీ లాంటి పౌరులను కోరుకుంటుంది. అవినీతిని అంతమొందించేందుకు మనమంతా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. తమకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదని, దీంతో సరైన వైద్యం అందించడం లేదని కౌర్ భర్త సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ విషయం తాను చూసుకుంటునాని, మెరుగైన చికిత్సనందించేలా ఆదేశాలిస్తానని సీఎం హామీనిచ్చారు. కౌర్‌కు మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కౌర్, ఆమె భర్తను జైన్ కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ మహిళపై దాడి కేసులో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్‌కు ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మే 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. -
సీఎం, గవర్నర్ మధ్య ముదిరిన వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అన్ని ప్రభుత్వ ఫైళ్లు తన వద్దకు తప్పక రావల్సిందేనని నజీబ్ జంగ్.. సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అన్ని ఫైళ్లను ఎల్జీ కార్యాలయానికి పంపనవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం కిందనున్న అన్ని ప్రభుత్వ విభాగాలకు కేజ్రీవాల్ కార్యాలయం ఏప్రిల్ 29న లేఖ రాసింది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని సీఎంను కోరారు. ఎల్జీ కార్యాలయానికి ఫైళ్లు పంపరాదని అధికారులను కోరడం రాజ్యాంగపరంగా సరైనది కాదని పేర్కొంటూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య మొదటి నుంచీ సామరస్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొఖం, పెడమొఖంగానే ఉంటున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పరిధి కిందకు రాని పోలీసు, శాంతిభద్రతలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించిన ఫైళ్లను తన ద్వారా పంపాలని కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. అందుకు ఎల్జీ నిరాకరించారు. దీంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్ని పైళ్లను ఎల్జీకి పంపాల్సిన అవసరం లేదని సీఎం కార్యదర్శి రాజేందర్‌కుమార్ ఏప్రిల్ 29న నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కినుక చెందిన జంగ్ ఈ ఉత్వర్వును ఉపసంహరించుకోవలసిందిగా ఆదివారం సీఎం కార్యాలయాన్ని దేశించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం కోసం, ఫైళ్ల కదలికలో వేగం పెంచడం కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద ఉండే ఢిల్లీ పోలీసు, శాంతిభద్రతల అంశాలను తన పరిధిలోకి తెచ్చుకోవాలని ఆమ్ ఆద్మీ సర్కారు ఆశిస్తోంది. ఈ రెండింటిపై అధికారం లేనట్లయితే ఢిల్లీ సర్కారు బలహీనంగా ఉంటుందని ఆప్ సర్కారు భావిస్తోంది. -
త్వరలో కాలుష్య రహిత బస్సులు
న్యూఢిల్లీ: ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేటు వాహనాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన కాలుష్య రహిత బస్సులను ప్రవేశపెట్టనుంది. నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ అత్యాధునిక బస్సులను త్వరలో రవాణా విభాగంలోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎర్త్ డే సందర్భంగా బుధవారం ఢిల్లీ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేం దుకు విస్తృత ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు కూడా ఇందు లో భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. దీపావళి మందు సామాగ్రికి దూరంగా ఉండాలని కోరారు. అంతే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా కాలుష్య రహిత బస్సులను ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రైవేట్ వాహనాలను వినియోగించే వారి సంఖ్యను తగ్గిం చేందుకు యత్నిస్తామని చెప్పారు. నగరా న్ని ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కిం చేందుకు విద్యార్థులు కూడా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని తమ తల్లిదండ్రులకు సూచించాలని విద్యార్థుల కు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆప్ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. దీని కోసం వాతావరణ మార్పులు, ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు, నీటి కాలుష్యం, శానిటేషన్, పచ్చదనం, ఇంధన వనరులపై చర్చా గోష్టి నిర్వహించడం ద్వారా పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు. ఎర్త్ డే సందర్భంగా ఎకో క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో విజేతలకు రాష్ట్ర పర్యావరణ మంత్రి అసీం అహ్మద్ ఖాన్ బహుమతులు అందజేశారు. -
అబద్ధపు హామీలతో పక్కదారి పట్టించారు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చింది. అంతే కాకుండా ఐదేళ్ల కాలంలో 40 నుంచి 50 శాతం వరకు ఎన్నికల హామీలను నెరవేర్చగలమని అధికారులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. ఇది పూర్తిగా ఎలక్షన్ వాచ్డాగ్స్ మేనిఫెస్టో మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఈసీని కలసి బుధవారం ఫిర్యాదు చేశారు. ‘పౌర సేవల దినోత్సవం’ సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఈసీకి తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇష్టం వచ్చినట్లు హామీల వర్షం కురిపించారని ఆరోపించారు. తద్వారా ప్రజలను పక్కదారి పట్టించారని విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పక్కదారి పట్టించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మేనిఫెస్టో మార్గదర్శకాల ప్రకారం అవాస్తవ ఎన్నికల వాగ్దానాలతో ప్రజలపై ప్రభావం చూపేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. కాగా, పౌర సేవల దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై అనేక అంచనాలను పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుంటే ప్రస్తుతం మనల్ని ఎవరైతే పొగుడుతున్నారో వారే ఐదేళ్లలో విసిరివేసే అవకాశం ఉందన్నారు. కానీ ఐదేళ్లలో 100 శాతం హామీలను నెరవేర్చలేకున్నా కనీసం 40 నుంచి 50 శాతం మాత్రం నెరవేర్చగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి ఆధారంగా అజయ్ మాకెన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. -
డిస్కంల డిమాండ్‌కు తలొగ్గద్దు
ప్రభుత్వానికి డీపీసీసీ అధ్యక్షుడు మాకెన్ లేఖ న్యూఢిల్లీ: విద్యుత్ సుంకం 20 శాతం పెంచాలని డిస్కంలు కోరడం సమంజసం కాదని, వారి డిమాండ్‌కు లొంగవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. డిస్కంల కోరిక అసమంజసం మాత్రమే కాదని, వారి ఇష్టానుసారం ప్రభుత్వం నడుచుకుంటే అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులపై పెను భారం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసినట్లు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేలా ఢిల్లీ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ)కు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 శాతం మంది ఢిల్లీ ప్రజలు విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని చెప్పడం ద్వారా ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. ప్రొఫైలింగ్ వినియోగదారులెవరూ లేకుండా ఆ విధంగా ఎలా చెప్పగలుతారని ప్రశ్నించింది. ప్రజా సొమ్మును విద్యుత్ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా కుటుంబానికి ఓ విద్యుత్ మీటర్‌ను అందించాలని ఏప్రిల్ 17న డీఈఆర్సీ కార్యదర్శి ముందు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా చేయడం వల్ల 50 శాతం సబ్సిడీపై నెలకు 400 యూనిట్ల వరకు వినియోగించుకునే విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని ఆ పిటిషన్లో పేర్కొంది. -
తూర్పు ఎమ్సీడీని ప్రభుత్వానికి అప్పగించండి
సాక్షి, న్యూఢిల్లీ: సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితికి చేరిన తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎమ్సీడీ)ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాయబోతున్నారని సమాచారం. నిర్వహణలో వైఫల్యం కారణంగా ఉత్తర, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక లోటులో కూరుకుపోయాయని ఆరోపిస్తూ ఆయన లేఖ రాయనున్నట్లు ఓ అధికారి తెలియజేశారు. సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో కార్పొరేషన్లు ఉన్నాయని, దీంతో వారు వేతనాల కోసం సమ్మెకు దిగారని అనే విషయాన్ని ఎల్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సర్కారు ఎమ్సీడీలకు బకాయిలను చెల్లించడం లేదన్న వార్తల్లో సత్యం లేదని సిసోడియా అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. అందువల్లే ఆ కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభంలో పడి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని స్థితికి చేరిందన్నారు. ‘తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి నెలా వేతనాల కింద 55 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. అయితే సిబ్బందేమో మూడు నెలలుగా వేతనాలు రావట్లేదని అంటున్నారు. మూడు నెలలుగా సిబ్బందికి వేతనాల కింద చెల్లించవలసిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయి. బీజేపీకి ఎమ్సీడీని నిర్వహించడం చేతకాకుంటే దానిని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలి. తాము కార్పొరేషన్‌ను లాభాల బాట నడిపించి చూపిస్తాం’ అని మనీశ్ సిసోడియా అన్నారు. తూర్పు ఎమ్సీడీని ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ రాసే విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు. -
అంతా బాగానే ఉంది: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకో వివాదం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వార్తల్లో నిలుస్తుండగా, ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పార్టీలో అంతా బాగానే ఉందని అంటున్నారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రపతి భవన్‌కు హాజరైన కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. పార్టీలో అంతా సవ్యంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తాము పరిష్కరించుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. అపరిషృతంగా ఉన్న అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కేజ్రీవాల్‌తో మాట్లాడారు. దీని గురించి విలేకరులు ఆరా తీయగా తన ఆరోగ్యం గురించి ప్రధాని వాకబు చేశారని కేజ్రీవాల్ చెప్పారు. -
రేషన్ దుకాణదారులు తమ పద్ధతిని మార్చుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఈ రేషన్ కార్డు విధానాన్ని ప్రారంభించారు. రేషన్ కార్డుల జారీలో అవినీతిని అంతమొందించడం కోసం ఈ రేషన్ కార్డులను ప్రవేశపెడ్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇన్నాళ్లుగా పేదలను మోసగిస్తూ అవినీతికి పాల్పడిన రేషన్ దుకాణ దారులు తమ పద్ధతిని మార్చుకోవాలని, లేకపోతే దుకాణాలను వదిలివేయాలని ఆయన హెచ్చరించారు. ‘చౌకధరల దుకాణదారులు రేషన్ కార్డులను వినియోగదారులకు ఇవ్వకుండా తమ వద్దనే ఉంచుకోవడం నాకు తెలుసు. చాలామంది వినియోగదారులకు తమకు రేషన్ కార్డు జారీ అయిన విషయం తెలిసేది కాదు. స్వచ్ఛంద సంస్థ నడుపుతున్పప్పటి నుంచి నేను ఈ అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడాను. అవినీతికి పాల్పడే డీలర్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు కూడా వేశాం. రేషన్ కార్డుల కోసం పోరాడినందుకు నాకు బెదిరింపులు కూడా వచ్చాయి’ అని ఆయన చెప్పారు. రేషన్ కార్డుల జారీలో సమస్యల పరిష్కారానికి ఎన్నో ఆలోచనలు చేశామని, ఈ సమస్యను పరిష్కరించే అవ కాశం తనకే వస్తుందని ఎన్నడూ అనుకోలేదని ఆయన వివరించారు. అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ రేషన్ కార్డు రేషన్ కార్డుల జారీలో వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఈ రేషన్ కార్డును ప్రవేశపెడ్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ వస్తుందని, ఆ తరువాత వినియోగదారులు ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డులు ఉన్నవారు ఈ రేషన్ కార్డు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు లేని వారు ఇతర గుర్తింపు కార్డుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. స్థానిక ఎమ్మెల్యేలు ఈ రేషన్ కార్డుల జారీలో నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ‘గతంలో రేషన్ కార్డు జారీ చేయడానికి నెలరోజుల సమయం పట్టేది. దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి ధ్రువీకరించుకున్న తరువాత కార్డు జారీ చేసేవారం. ఈ సమస్యలన్నీ తొలగించడానికే ఈ పద్ధతిని ప్రారంభించాం’ అని అధికారులు తెలిపారు. -
అసెంబ్లీలో అమరవీరుల విగ్రహాలు
త్వరలోనే ఏర్పాటు చేస్తాం- సీఎం కేజ్రీవాల్ సాక్షి, న్యూఢిల్లీ:షహీద్ దివస్‌ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, స్పీకర్ రామ్నివాస్ గోయల్‌తో కలిసి ఆయన ఢిల్లీ అసెంబ్లీలో అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, అసెంబ్లీలో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని స్పీకర్ ప్రతిపాదించారని, దానిని తామంతా బలపరిచామని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల గురించి విద్యార్థులకు తెలియజేయడం ద్వారా దేశభక్తిని పెంపొందించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ముగ్గురు అమరవీరుల్లో ముఖ్యంగా భగత్‌సింగ్ త్యాగాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చవలసిందిగా విద్యా శాఖ మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును బ్రిటిష్ పాలకులు 1931, మార్చి 23న ఉరితీశారు. వారిని ఉరితీసిన రోజును అంటే మార్చి 23ను ప్రభుత్వం షహీద్ దివస్‌గా ప్రకటించి అమరులకు నివాళులను అర్పిస్తోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగానికి గుర్తుగా వారు అమరులైన రోజును దేశ్ దివస్‌గా జరుపుకోవాలని కేజ్రీవాల్ కోరారు. అమరవీరులకు పుష్పాంజలి సమర్పిస్తే సరిపోదని దేశాభ్యున్నతి కోసం ఏదైనా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు నివాళులు అర్పిస్తూ ట్వీటర్లో ట్వీట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు విగ్రహాలను త్వరలోనే అసెంబ్లీలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ముగ్గురు అమరులు దేశం కోసం చేసిన త్యాగాన్ని రాష్ట్ర పాఠ్యాంశాల్లో చేరుస్తామని తెలిపారు. అమరుల విగ్రహాలను సాధారణ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఏర్పాటుచేయాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. వీటిని ఏర్పాటు చేయడానికి తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరినట్లు వెల్లడించారు. తద్వారా ఎమ్మెల్యేల్లో కూడా దేశ భక్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి తెలియజేయాల్సిందిగా అసెంబ్లీ అధికారులను కోరినట్లు సిసోడియా చెప్పారు. అధికారులు రూపొందించే అంచనా వ్యయం ఆధారంగా ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సొమ్ము విరాళంగా ఇవ్వాలనేది నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఢిల్లీ ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దేశభక్తి గీతాలు ఆలపించారు. -
సీఎం కేజ్రీవాల్‌ను కలిసిన జర్మనీ ప్రతినిధి బృందం
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. భారత్‌లోని జర్మనీ రాయబారి మైఖేల్ స్టెయినర్ నేతృత్వంలోని 20 మంది ప్రతినిధులు కేజ్రీవాల్‌ను కలిసి ఇటీవల ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయానికి శుభాకాంక్షలు చెప్పారు. ఏ విధంగా వారితో సహకారాన్ని పంచుకోవాలనే అంశాలపై దృష్టి సారించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీని కోసం దేశ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక శక్తి వనరులు తదితరాల అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతిని అంతమొందించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా జర్మనీ ప్రతినిధులతో కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ ప్రభుత్వం దీని కోసం వీలైనంత త్వరగా అవినీతి వ్యతిరేక చట్టాన్ని తీసుకురాబోతున్నామని వారికి వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో రెండు రకాలైన అవనీతి ఉందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఒకటి ఘరానా దోపిడీ రకానికి చెందినదైతే, రెండోది పరస్పర ఇష్టంతో జరుగుతున్నదని వారికి కేజ్రీవాల్ వివరించారని అధికారి తెలిపారు. ఈ రెండు రకాల అవినీతిని నిర్మూలిస్తామని కేజ్రీవాల్ చెప్పారన్నారు. దీని కోసం యాంటీ కరప్షన్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడానిక ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
జనతా దర్బార్‌కు సమస్యల వెల్లువ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు ఉద్యోగులు, జర్మన్ లాంగ్వేజ్ టీచర్లు పలు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇలా అందరి విన్నపాలను ఓపిగ్గా విన్న కేజ్రీవాల్ వాటి పరిష్కరానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కాగా, కేజ్రీవాల్ బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత దీనిని నిర్వహించడం ఇది రెండోసారి. ప్రభుత్వం తరఫున ఎయిడ్స్ అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించే 30 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సీఎంను కలిసి తమ జీతాల కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీ రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లినప్పటి నుంచి ఎయిడ్స్ ప్రచార కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో తమకు జీతాలు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. మరోవైపు సుమారు 25 మంది జర్మన్ టీచర్లు సీఎంను కలిసి జర్మన్ భాషను రాష్ట్ర పరిధిలోని పాఠశాలల పాఠ్యప్రణాళిక చేర్చాలని కోరారు. తద్వారా తాము జీవించడానికి చేయూతనివ్వాలని అభ్యర్థించారు. జర్మన్ భాషను కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో మూడో భాషగా చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పారు. దీంతో జర్మన్ భాష స్థానంలో మరో దానికి వీలు కల్పించిందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల సుమారు 1,000 మంది టీచర్లు, ఏడు వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించి, తమకు ఉపాధినివ్వాలని కోరారు. అనంతరం సమస్యలు విన్నవించడానికి వచ్చిన అనేక మంది దగ్గర్నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. -
సీఎం నివాసంలో ఏసీల తొలగింపు
న్యూఢిల్లీ: నూతన గృహంలోని అన్ని ఎయిర్ కండిషనర్లను తొలగించాలంటూ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) అధికారులను ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇల్లు అధికార కార్యకలాపాలకు సరిపోనందున నత్వరలో ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్లో ఉన్న గృహంలోకి మారబోతున్నారు. ఈ నాలుగు పడకల ఇంటిలో నుంచి ఏసీలను తొలగించి కిటికీలను పెట్టాలని చెప్పినట్లు పీడబ్ల్యూడీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఇంటిలో బెడ్రూంలతో పాటు రెండు లాన్లు, డ్రాయింగ్, డైనింగ్ రూంలు, సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ ఇంటిలో అసెంబ్లీ స్పీకర్ నివసించారు. ‘ నూతన ఇంటిలోని అన్ని ఏసీలను తొలగించాలని సీఎం ఆదేశించారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. వీటిని తొలగిస్తే దాదాపు ఇంటిని మళ్లీ పునర్నిర్మించినట్లే. ఎందుకంటే ఏసీలు తొలగిస్తే గోడలు బోసిపోతాయి. చాలా ఖాళీ వస్తుంది. ఆ ప్రాంతంలో కిటికీల వంటి కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరోసారి ముఖ్యమంత్రికి చెప్పి చూస్తాం. ఆయన వెనక్కి తగ్గకపోతే మేము తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ మార్పుల కోసం అధికంగా సమయం, డబ్బు వినియోగించవద్దని సీఎం సూచించినట్లు తెలిపారు. అలాగే ఎక్కువ మార్పులు కూడా చేయొద్దని చెప్పినట్లు తెలియజేశారు. కాగా, ఈ పునరుద్ధరణ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఇదిలాఉండగా సచివాలయంలో కూడా ఏసీలు వినియోగించడానికి కేజ్రీవాల్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. -
మహిళలకు భద్రతా నిలయంగా చేయండి
ఢిల్లీ యువకులకు విజ్ఞప్తి చేసిన సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: నగరంలో మహిళలు స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తూ, భద్రతా నిలయంగా చేయాలని ఢిల్లీ యువకులకు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హై బ్లడ్ షుగర్, దగ్గుతో బాధపడుతున్న కేజ్రీవాల్.. ప్రకృతి వైద్యం కోసం ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. అక్కడి నుంచే దాదాపు ఒక నిమిషం నిడివి గల ఆడియో సందేశాన్ని రేడియో ద్వారా శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ హోదాలో ఉండటానికి తన తల్లి, భార్య కారణమని ఆయన తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తనకు ఇంట్లో భార్య, తల్లి ఎంతో ప్రోత్సాహం అందించారన్నారు. మహిళల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ సందేశం నగరంలోని మగవాళ్లందరికీ వర్తిస్తుందన్నారు. ‘ప్రతి మహిళ తన బాధ్యతలను ఎంతో నిజాయితీగా, ఎలాంటి గొడవలు లేకండా నిర్వర్తిస్తోంది. ఇది చాలా అద్భుతమైన విషయం. తల్లిగా, కూతురుగా, భార్యగా, సోదరిగా ఇలా అన్ని హోదాల్లో తమ కుటుంబాలకు సేవలు అందిస్తున్నారు. వారి ఓర్పుకు నేను శాల్యూట్ చేస్తున్నా. మహిళ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అయితే కొందరు వారి దుస్తులపై కామెంట్లు చేస్తూ మహిళలను అవమానపరుస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. బయట మహిళలకు గౌరవం ఇవ్వని వారికి ఇంటిలో కూడా గౌరవం లభించదు’ అని చెప్పారు. -
కేంద్ర హోం మంత్రిని కలిసిన కేజ్రీవాల్
రాజధానిలో శాంతి భద్రతలు, సీఎస్ నియామకంపై చర్చ న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కలిశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. రాజధానిలో శాంతి భద్రత పరిరక్షణ కోసం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని హోం మంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా శనివారం ఉద్యోగ విరమణ చేయనుండటంతో నూతన సీఎస్ నియామకంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నూతన సీఎస్ నియామక రేసులో 1984 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కి చెందిన ఆర్.ఎస్.త్యాగి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.