dinakaran
-
టీటీవి దివాలా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో టీటీవీ దినకరన్‌కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్ విచారణను న్యాయమూర్తుల బెంచ్ ముగించింది. -
మదురైలో మంతనాలు .. వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్‌టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది. భేటీపై ఆసక్తి తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. చెన్నైకు పళని స్వామి.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్‌తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం. చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు -
Tamil Nadu: దినకరన్‌కు చిన్నమ్మ చెక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారు. బంధువుల నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉండిన జయలలిత మృతి తరువాత శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారి తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణం సమయంలో సీఎంగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేందుకు గవర్నర్ ఆమోదం పొందేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తనకు బదులు ఎడపాడి పళనిస్వామిని సీఎంగా చేసి పార్టీ బాధ్యతలు టీటీవీ దినకరన్‌కు అప్పగించారు. అయితే పార్టీని వీడిన పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకమై దినకరన్, శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతో అగ్గిరాసుకుంది. 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్ తనవైపునకు తిప్పుకున్నారు. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్ ఏఎంఎంకేను స్థాపించగా వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయవద్దు, ఉప ఎన్నికల్లో మాత్రమే పోటీచేయండని జైలు నుంచి శశికళ ఆదేశించారు. అయితే ఆమె ఆదేశాలను ధిక్కరించి తమిళనాడు, పాండిచ్చేరీల్లో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి మొత్తం 40 స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఘోరపరాజయం పొందారు. తన మాట పెడచెవిన పెట్టిన ఫలితంగా అవమానాలపాలు కావాల్సి వచ్చిందని దినకరన్‌పై శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అవే దుష్పలితాలు పునరావృతం కావడంతో ఏఎంఎంకే శ్రేణులు పార్టీని వీడి అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చేరడం ప్రారంభించారు. ముఖ్యనేతలంతా తమదారి చూసుకోవడంతో ఏఎంఎంకే గుడారం ఖాళీ అయ్యేదశకు చేరుకుంది. దినకరన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీ పతనం దిశగా పయనిస్తోందని కొందరు నేతలు శశికళకు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింతగా మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికికే ముప్పువాటిల్లగలదని ఆందోళన చెందిన శశికళ ఇటీవల దినకరన్‌తో ఫోన్ ద్వారా సంభాషించినట్లు సమాచారం. “పార్టీని నేను చూసుకుంటాను, కొంతకాలం బాధ్యతల నుంచి తప్పుకో’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక పార్టీ కార్యకలాపాలకు అన్న కుమారుడు, భర్త సోదరుడిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో దినకరన్ రాజకీయ ప్రకటనలు చేయడం, చెన్నై రాయపేటలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయానికి రావడం మానివేశారు. పార్టీ శ్రేణులను కలుసుకోవడం కూడా మానేశారు. -
చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళను జైలు నుంచి బయటకు తీసుకొస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికలో చిన్నమ్మ పేరు లేదని, దీన్ని బట్టి చూస్తే ఆమెకు క్లీన్చిట్ ఇచ్చినట్టు స్పష్టం అవుతోందన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరి నాటికి జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆనందంతో ఉన్న సమయంలో సత్ ప్రవర్తన జాబితాలో చిన్నమ్మ పేరు లేదన్నట్టుగా రెండు రోజుల క్రితం సమాచారాలు వెలువడ్డాయి. దీంతో వారి ఆశలు అడియాశలయ్యారు. శశికళ విడుదల ఇక, ఇప్పట్లో లేనట్టేనని, శిక్షా కాలం పూర్తిగా ఆమె జైలుకు పరిమితం కావాల్సిందేనా అన్న చర్చ జోరందుకుంది. అయితే, ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని న్యాయవాది రాజచెందూర్ పాండియన్ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. దీపావళి రోజున ఆమె బయటకు వస్తారని ఎవ్వరూ చెప్పలేదే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమెపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేదని స్పష్టం చేశారు. జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలు చిన్నమ్మ కూడా పాటిస్తున్నారని, వస్త్రధారణలోనూ సమానమేనని పేర్కొన్నారు. ఆమె జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయని, అయితే, విచారణ కమిషన్ నివేదికలో ఆమె పేరు అన్నది అసలు లేదని వ్యాఖ్యానించారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ ఏ తప్పూ చేయలేదని క్లీన్చిట్ ఇచ్చనట్టేగా అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చిన్నమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నామని, ఆమె తప్పకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బయటకు రాకుండా రాజకీయాలు చేసే వాళ్లుచేస్తుంటారని, వాటన్నింటినీ అధిగమించి బయటకు చిన్నమ్మ వచ్చి తీరుతారని పేర్కొన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు రాజకీయ పార్టీ గుర్తింపు వ్యవహారం మీద విచారణ ముగిసి ఉన్నదని, త్వరలో ఈసీ అధికారిక ప్రకటన చేయ వచ్చని చెప్పారు. ఉప ఎన్నికల్లో ధనబలం, డీఎంకే చేత గాని తనం వెరసి అన్నాడీఎంకేను గెలిపించాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచినంత మాత్రాన అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేదని , పేర్కొన్నారు. ఇది ఎన్నికలకు రెఫరెండం మాత్రం కాదన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తమకు అంతలోపు ఎన్నికల కమిషన్ గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నామన్నారు. -
బీజేపీలోకి శశికళ నమ్మిన బంటు?!
సాక్షి, చెన్నై: బీజేపీలోకి చేరడానికి చిన్నమ్మ శశికళ నమ్మినబంటు పుహళేంది సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే, చిన్నమ్మతో సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పుహళేంది మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆయనతో టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. మంచి వ్యాఖ్యాతగా ఉన్న ఆయన్ను తమ వైపునకు తిప్పుకుంటే ఉపయోగపడుతాడనే భావనతో కమలనాథులు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే.. చిన్నమ్మ శశికళతో సాగే భేటీ మేరకు తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సంకల్పించి ఉన్నా, కమలనాథుల ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపే విధంగా పుహళేంది స్పందించడం గమనార్హం. ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన పుహళేంది...చిన్నమ్మ శశికళ త్వరలో బయటకు రానున్నారని, ఆమె రాకతో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. ఒక్క జయకుమార్ తప్ప..సీఎంతో పాటు మిగిలిన మంత్రులు ఎవరూ కూడా శశికళకు వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆమె బయటకు వస్తే, పరిస్థితులు అన్నీ మారుతాయని, ఆమె త్వరలో వస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం పలికినట్టుగా మీడియాల్లో వార్తలు చూశానని, అలా జరిగి ఉంటే.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మ రాకతో అందరూ ఆమె చుట్టు చేరుతారని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ శశికళ విడుదలకు తగ్గ చర్యలు, ప్రయత్నాలు వేగవంతం చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దృష్ట్యా, శశికళ ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నమ్మతో ములాఖత్
సాక్షి, చెన్నై : బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ శశికళతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ములాఖత్ అయ్యారు. జరిమానా చెల్లింపు వ్యవహారంగా చర్చ సాగినట్టు సమాచారం.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా చిన్నమ్మను ముందస్తుగానే విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రయత్నాల్లో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే, జైలు శిక్ష సమయంలో వి«ధించిన జరిమానాను ఇంకా చెల్లించనట్టు, ఇది కాస్త విడుదలకు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు గత వారం వెలువడ్డాయి. దీంతో జరిమానా చెల్లింపు వ్యవహారంతో పాటుగా, రాజకీయ పరంగా చిన్నమ్మను సంప్రదించి, సలహాలు, సూచనలకు దినకరన్ బెంగళూరు వెళ్లారు. సోమవారం శశికళతో ములాఖత్ అయ్యారు. ఆమె ఇచ్చిన సలహాల్ని అమలు చేయడానికి తగ్గట్టుగా సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం బలహీన పడలేదన్నారు. తాము బలంగానే ఉన్నామని, తమ వాళ్లు తమ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో సంబంధాల్ని ఏర్పరచుకోవద్దని కేడర్‌కు హెచ్చరికలు పంపారు. -
మోదీపై దినకరన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
చెన్నై : తమిళనాడులో పాలక ఏఐఏడీఎంకేను ప్రధాని నరేంద్ర మోదీయే కాదు ఆయన తండ్రి కూడా కాపాడలేరని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీయే తండ్రి తరహాలో ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కాగా దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మందిపై తమిళనాడు స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించడంతో ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 18న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ 17 నియోజకవర్గాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు దారుణ పరాజయం ఎదురైతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని ఏఎంఎంకే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే దిగ్గజ నేత ఎం కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువూర్ అసెంబ్లీ స్ధానంలోనూ 18న పోలింగ్ నిర్వహిస్తారు. -
దూకుడు పెంచిన దినకరన్
సాక్షి, చెన్నై: ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ దూకుడు పెంచారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించారు. గెలుపు తమదేనన్న ధీమాను సైతం వ్యక్తం చేశారు. దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ ప్రతినిధిగా అన్నాడీఎంకేను చీల్చడంలో టీటీవీ దినకరన్ సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకేను, ఆ పార్టీ చిహ్నం రెండాకులను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసి విఫలమైన దినకరన్ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంతో రాజకీయ పయనాన్ని సాగిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయంటూ తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. అలాగే, తనకు మద్దతుగా నిలిచి అనర్హత వేటు వేయబడ్డ ఎమ్మెల్యేల్ని ఉప ఎన్నికల ద్వారా మళ్లీ గెలిపించుకునేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ, తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్న దినకరన్ ఈ ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. కలిసి వచ్చే వాళ్లు లేని దృష్ట్యా, తన బలం ఏమిటో తనకే తెలుసునన్నట్టుగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే కన్నా ముందుగా, తన అభ్యర్థులను ప్రకటించారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించారు. వీరందరి పేర్లను ప్రకటించడమే కాదు, అన్నాడీఎంకే బలహీన పడిందని, గెలుపు తమదే అన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేయడం గమనార్హం. అభ్యర్థులు: తిరువళ్లూరు–పొన్రాజ్, దక్షిణ చెన్నై–మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య, శ్రీపెరంబదూరు–తాంబరం నారాయణన్, కాంచీపురం–ఏ.మునుస్వామి, విల్లుపురం–ఎన్.గణపతి, సేలం–ఎస్కే సెల్వం, నామక్కల్–పీపీ.స్వామినాథన్, ఈరోడ్ – కేసీ సెంథిల్‌కుమార్, తిరుప్పూర్ –ఎస్ఆర్ సెల్వం, నీలగిరి–రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామస్వామి, కోయంబత్తూరు ఎన్ఆర్ అప్పాదురై, పొల్లాచ్చి–ఎస్పీ ముత్తుకుమార్, కరూర్– ఎన్.తంగవేల్, తిరుచ్చి– మాజీ మేయర్ చారుబాల తొండైమాన్, పెరంబలూరు– రాజశేఖరన్, చిదంబరం– ఇలవరసన్, మైలాడుతురై – ఎస్.సెంతమిళన్, నాగపట్నం–టి.సెంగుడి, తంజావూరు–మురుగేషన్, శివగంగై–వి.పాండి, మదురై–డేవిడ్ అన్నాదురై, రామనాథపురం–ఆనందన్, తెన్కాశి– ఎస్.పొన్నుతాయి, తిరునల్వేలి–జ్ఞాన అరుల్‌మణిలు పోటీ చేస్తారని దినకరన్ ప్రకటించారు. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు సీట్లను కేటాయించారు. ఇక, అనర్హత వేటుకు గురైన వారికి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మళ్లీ సీటు అప్పగించారు. పూందమల్లి–ఏలుమలై, పెరంబూరు–వెట్రివేల్, తిరుప్పోరూర్–ఎం.కోదండపాణి, గుడియాత్తం–జయంతి పద్మనాభన్, ఆంబూర్–ఆర్.బాలసుబ్రమణి, హరూర్–మురుగన్, మానామదురై–ఎస్ మారియప్పన్ కెన్నడి, సాత్తూరు–ఎస్జి సుబ్రమణియన్, పరమ కుడి–డాక్టర్ ఎస్.ముత్తయ్య పోటీ చేయనున్నారు. -
మళ్లీ కోర్టుకు రెండాకులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది. ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. పిటిషన్: రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు. -
సీఆర్పీఎఫ్లో అందరూ భారతీయులే
న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు పోలీస్ దళం(సీఆర్పీఎఫ్)లో అందరినీ భారతీయులుగానే గుర్తిస్తామనీ, ఇక్కడ కులం, మతం వంటి విభజనలు ఉండవని సీఆర్పీఎఫ్ డీఐజీ ఎం.దినకరణ్ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లలో వెనుకబడ్డ, దళిత, ఆదివాసీలే అధికంగా ఉన్నారని కారవాన్ అనే మ్యాగజీన్లో కథనం రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘సీఆర్పీఎఫ్లో మేం అందరినీ భారతీయులుగానే పరిగణిస్తాం. ఇక్కడ ఎక్కువ, తక్కువలు ఉండవు. కులం, మతం, రంగు, వంటి చెత్త విభజన మా రక్తంలోనే లేదు’ అని దినకరణ్ స్పష్టం చేశారు. ‘అమరులైన జవాన్లను అవమానించడం మానుకోవాలి. వారు అర్థంపర్థంలేని మీ రాతలు, కథనాలకు గణాంకాలు కాదు’ అని సదరు పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో దాడిని చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో 19 మంది ఓబీసీలు లేదా బీసీలు, ఏడుగురు ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, అగ్రకులాలకు చెందిన నలుగురు, ముగ్గురు జాట్ సిక్కులు, ఓ ముస్లిం, బెంగాలీ అగ్రకులానికి చెందిన మరొకరు ఉన్నట్లు కారవాన్ కథనాన్ని ప్రచురించింది. -
దినకరన్ ఇంటిపై దాడి
సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్‌నగర్‌లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దినకరన్‌కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్‌కు ఊరట లభించింది. -
సొంత గూటికి వచ్చేయండి: సీఎం
సాక్షి, చెన్నై : అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత వేటు పడినవారంతా మళ్లీ చేరాలని వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దినకరన్ గూటికి చేరిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఒకవేళ వారు తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామ’ని పేర్కొన్నారు. ఆ 18 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారటగా అని విలేకరులు ప్రశ్నించగా ‘అది నేను ఎలా ఇవ్వగలను’ అని సమాధానమిచ్చారు. అనర్హత పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందా అని అడగ్గా.. ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి మాట్లాడబోమని అన్నారు. కాగా, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా, స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
చిన్నమ్మ ఫైర్
సాక్షి, చెన్నై: సోదరుడు దివాకరన్ చర్యలపై చిన్నమ్మ శశికళ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆమెతో ములాఖత్ అయిన న్యాయవాదులు, ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందరూ దినకరన్‌కు అండగా ఉండాలని ఆమె సూచించినట్టు, త్వరలో కేడర్‌కు ఓ లేఖాస్త్రం సంధించపోతున్నట్టుగా సమాచారం. చిన్నమ్మ శశికళ కుటుంబ విభేదాలు రచ్చకెక్కి ఉన్నవిషయం తెలిసిందే. ఆమె సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ల మధ్య సాగుతున్న ఈ సమరంలో కుటుంబ పరువు గంగలో కలిసే రీతిలో ఉన్నట్టుగా చిన్నమ్మ పరిగణించారు. అలాగే, రాజకీయంగా మున్ముందు పెనుముప్పు తప్పదన్న విషయాన్ని గ్రహించి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో దివాకరన్ను పక్కన పెట్టి, దినకరన్‌కు అండగా నిలబడేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గతంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, దినకరన్‌కు మద్దతుగానే శశికళ వ్యవహరించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో అనేక సమస్యలు ఉన్నా, తాను జైలుకు వెళ్తూ దినకరన్ భుజం మీద బాధ్యతల్ని ఉంచి వెళ్లారని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా, కుటుంబం పరువు మరింత రచ్చకెక్కకుండా ఉండే రీతిలో, దివాకరన్‌కు చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా చిన్నమ్మ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆమెతో ములాఖత్ అయిన ముఖ్యులు, న్యాయవాదుల వద్ద దివాకరన్ చర్యల్ని తీవ్రంగా ఖండించినట్టు చర్చ ఊపందుకుంది. అమ్మ శిబిరం పేరిట దివాకరన్ ముందుకు సాగుతుండడంతో, ఆయన వెంట కేడర్ గానీ, మద్దతు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలుగానీ వెళ్లకుండా జాగ్రత్లకు సిద్ధం అవుతున్నారు. అందరూ దినకరన్‌కు అండగానే ఉండాలని సూచించడంతోపాటు, త్వరలో కేడర్‌ను ఉద్దేశించి జైలు నుంచి శశికళ ఓ లేఖ విడుదలచేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దివాకరన్ రూపంలో ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉండే విధంగా, దినకరన్‌కు మద్దతుగా ఆమె స్పందించేందుకు సిద్ధం అవుతున్న సమాచారంతో మద్దతుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెప్పవచ్చు. అందుకే కాబోలు దివాకరన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అమ్మ శిబిరం ఆవిర్భావ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనించి దగ్గ విషయం. తంగతమిళ్ సెల్వన్ దివాకరన్‌కు అత్యంత సన్నిహితుడైనా, చిన్నమ్మ గతంలో అప్పగించిన బాధ్యత మేరకు తాను మాత్రం దినకరన్ వెన్నంటే ఉంటానని ప్రకటిం చడం విశేషం.తనతో పాటు అనర్హత వేటు పడ్డ వాళ్లు, ముఖ్యులు, కేడర్ దినకరన్‌కు అండగా ఉంటారని వ్యాఖ్యానించే పనిలో తంగతమిళ్ సెల్వన్ ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దర్శకత్వంలోనే దివాకరన్ అడుగుల వేగా న్ని పెంచనున్నట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆ వేగానికి కళ్లె్లం వేయడం లక్ష్యంగా చిన్న మ్మ స్పందన కోసం కేడర్ ఎ దురుచూపుల్లో ఉంది. దివాకరన్ తీరుపై దినకరన్ తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డా రు.ఆయన మానసిక రోగి అని నిన్నటి రో జున వ్యాఖ్యానించారు.తాజాగా దివాకర న్కు పిచ్చి పట్టినట్టుందని మండిపడ్డారు. -
రూ. 20 పట్టు...పది వేలు కొట్టు
సాక్షి, చెన్నై : దినకరన్‌కు బ్రహ్మరథం పట్టిన ఆర్కేనగర్ ఓటరు ప్రస్తుతం తిరగబడే పనిలో పడ్డారు. రూ.20 నోట్లను చేత పట్టి.. రూ. పది వేలు కొట్టు అన్న నినాదంతో ఆదివారం దినకరన్‌ను మహిళలు చుట్టుముట్టారు. తన నియోజకవర్గ ప్రజలు ఘోరావ్ చేయడంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే డిపాజిట్లు గల్లంతు కాగా, అన్నాడీఎంకేను ఢీ కొడుతూ భారీ ఆధిక్యంతోనే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఓటుకు నోటు తాండవం గుట్టు రట్టుతో గతంలో ఉప ఎన్నిక రద్దును పరిగణించిన దినకరన్ ఈసారి కొత్త బాణి అనుసరించారని ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నోట్లు చల్లినా, మరికొన్ని చోట్ల గెలుపు తదుపరి నోటు అంటూ కొత్త మార్గాన్ని అనుసరించారని ప్రచారం. ఓటుకు నోటుకు చిహ్నంగా రూ. 20 నోటును ఎన్నికల సమయంలో అందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తామిచ్చిన రూ. 20 నోటు ఎవరి వద్ద ఉందో వారందరికి గెలుపు తదుపరి రూ.10 వేలు ఇస్తామని నమ్మ బలికినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, గెలుపు తదుపరి ఆయన ఆ రూ.20 నోటు గురించి పట్టించుకోలేదని ఆగ్రహిస్తూ అనేకచోట్ల ఆందోళనలు సైతం సాగాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్కేనగర్ పర్యటనకు వచ్చిన దినకరన్ మీద బ్రహ్మరథం పట్టిన వాళ్లే తిరగబడడం గమనార్హం. రూ.20 పట్టు.. రూ. పది వేలు కొట్టు ఆర్కేనగర్ ఎమ్మెల్యే, అమ్మ మక్కల్ కళగం నే త టీటీవీ దినకరన్ ఆదివారం ఉదయం ఆర్కేనగర్ పరిధిలోని నేతాజీ నగర్‌లోని మురుగన్ ఆలయానికి వచ్చారు. అక్కడ జరిగిన చిత్రా పౌర్ణమి ఉత్సవాలకు ఆయన వస్తున్న సమాచారంతో ఓటర్లు తిరగబడేందుకు సిద్ధం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఓ వర్గానికి చెందిన వారు చుట్టుముట్టారు. ఘోరావ్ చేస్తూ, ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. పెద్ద సంఖ్యలో మహిళలు రూ. 20 నోట్లు ఇదిగో.. హామీ ఇచ్చినట్టుగా రూ.పదివేలు ఇవ్వు.. అంటూ ఆయన్ను నిలదీస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అదే సమయంలో దినకరన్ మద్దతుదారులు ఆందోళనకారుల మీద తిరగబడడంతో ఉద్రిక్తత తప్పలేదు. పోలీసులు ఇరువర్గాల్ని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకున్న దినకరన్ ఆలయం వద్దకు వెళ్లి ఆగమేఘాలపై పూజలు చేసి మరో మార్గంలో దూసుకెళ్లారు. మరోచోట దినకరన్ చలివేంద్రం ఏర్పాటుకు వచ్చి తీరాల్సి ఉండడంతో, అక్కడే ఆందోళనకారులు బైఠాయించారు. చివరకు అటు వైపు రాకుండానే దినకరన్ జారుకున్నారు. కాగా, దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారంతా అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారేనని, పని గట్టుకుని మరీ రాద్దాంతం చేసినట్టుగా దినకరన్ మద్దతుదారుడు వెట్రివేల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలే మేనమామ రూపంలో ఫ్యామిలీ వార్ ను ఎదుర్కొంటున్న దినకరన్‌కు తాజాగా రూ.20 నోటు రూపంలో ఓటరు తిరగబడే పనిలో పడడం మరింత శిరోభారంగా మారింది. -
రచ్చ కెక్కిన ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: మేనమామ దివాకరన్ను ఢీకొట్టే రీతిలో పరోక్షంగా మంగళవారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యలు సంధించారు. కేడర్‌కు లేఖాస్త్రం సందిస్తూ, దివాకరన్ కుట్రల్ని భగ్నం చేద్దామన్నట్టుగా పిలుపు నివ్వడం గమనార్హం. దినకరన్ పరోక్షంగా స్పందిస్తే, దివాకరన్ బహిరంగంగానే ఎదురుదాడికి దిగడంతో చిన్నమ్మ కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ వార్ మరింతగా ముదురుతోంది. ఆమె సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌ల మ«ధ్య ఈ సమరం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారుడు వెట్రివేల్ ద్వారా దివాకరన్‌కు చెంపపెట్టు తగిలే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దినకరన్, తాజాగా తానే రంగంలోకి దిగి కేడర్‌కు లేఖాస్త్రం సంధించడమే కాదు, పరోక్షంగా మేనమామకు చురకలు అంటించే పనిలో పడడం గమనార్హం. ఐక్యతతో తిప్పి కొడదాం :అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీని రక్షించుకునేందుకు చిన్నమ్మ శశికళ రంగంలోకి దిగాల్సి రావడానికి గల పరిస్థితులను ఆ లేఖాస్త్రంలో గుర్తు చేశారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో అధికారంలో ఉన్న ద్రోహులు పార్టీని ౖకైవసం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని వివరించారు. ద్రోహుల వైపుగా వెళ్లకుండా అమ్మ ఆశయ సాధన నినాదంతో చిన్నమ్మకు మద్దతుగా లక్షలాదిగా కేడర్ తన వెంట కదిలిందని గుర్తు చేశారు. ప్రజా మద్దతు ఈ కళగంకు హోరెత్తుతుండడంతో నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు బయలు దేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మధ్యమాల ద్వారా కళగంలో గందరగోళ పరిస్థితులు సృష్టించే కుట్రలు సాగుతున్నాయని పరోక్షంగా మేనమామ దివాకరన్ను ఉద్దేశించి వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. ద్రోహులతో కలిసి ఈ గందరగోళ ప్రయత్నాలకు దిగారని, ఈ కుట్రల్ని భగ్నం చేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో కొత్త కుట్రలకు సాగుతున్న ప్రయత్నాల్ని ఐక్యతతో తిప్పి కొడదామని కేడర్‌కు పిలుపునిచ్చారు. చిన్నమ్మే మార్గదర్శి అని పరోక్షంగా దివాకరన్ను ఎలాంటి సంబంధాలు లేదన్న వ్యాఖ్యల్ని ఆ లేఖలో దినకరన్ స్పందించడం గమనార్హం. తగ్గని మేనమామ.. దినకరన్ వ్యాఖ్యల తూటాలకు మేనమామ దివాకరన్ ఏమాత్రం తగ్గలేదు. ఢీకి సై అన్నట్టు ఎదురుదాడికి దిగారు. మన్నార్‌కుడిలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ దినకరన్‌పై విరుచుకుపడడంతో చిన్నమ్మ ఫ్యామిలీ వార్ రచ్చకెక్కింది. అన్నా, ద్రవిడం అన్న పదాలు లేని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. దినకరన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇక దినకరన్‌తో కలిసి పయనం సాగించే ప్రసక్తే లేదని తేల్చారు. దినకరన్ వెన్నంటి ఉన్న కొం దరు ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చిన వారేనని వారికి అంతా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జయలలితతో కలిసి అన్నాడీఎంకేకు దశాబ్దాల తరబడి తాను సేవల్ని అందించానని, ఆ సేవలు ఇక, మరింత విస్తృతం అవుతా యని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఎప్పుడో సీఎం అయ్యే వాడిని!
సాక్షి,చెన్నై : తలచుకుని ఉంటే, తానెప్పుడో సీఎం అయ్యే వాడినని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. ద్రోహుల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పళని సర్కారు కుప్ప కూలడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఈరోడ్‌లో కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ నినాదంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం సాగింది. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడారు. కావేరి వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని పళని ప్రభుత్వం పథకం ప్రకారం కపట నాటకాలను ప్రదర్శిస్తున్నాయని మండి పడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను పళని, పన్నీరు తాకట్టుపెట్టేశారని, వాటిని మళ్లీ దక్కించుకోవాలంటే, ఈ ప్రభుత్వం కుప్పకూలాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు తగ్గ సమయం ఆసన్నమైందన్నారు. అనర్హత వేటు వ్యవహారంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పళని సర్కారు కుప్పకూలినట్టేనని, తీర్పు త్వరితగతిన వెలువరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని తాము అభ్యర్థిస్తున్నామన్నారు. ద్రోహుల్ని తరిమి కొడతాం రాజకీయాలంటే ఏమిటో తెలియని పన్నీరు సెల్వంను తీసుకొచ్చి సీఎం పదవిలో చిన్నమ్మ శశికళ కూర్చొబెట్టారన్నారు. అమ్మ మరణం తదుపరి రెండో సారిగా కూడా చాన్స్ ఇస్తే, ఏకంగా అన్నాడీఎంకేని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. పళని స్వామిని సీఎంగా చేస్తే, ఆయన ఏకంగా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి, వారి అడుగులకు మడుగులు వత్తే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తాను తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వాడినని ధీమా వ్యక్తంచేశారు. అయితే, తనకు గాని, తన కుటుంబంలోని వారికి గాని పదవీ ఆశ లేనందున, అన్నాడీఎంకే కోసం అమ్మ వెన్నంటి ఉండి శ్రమించామన్నారు. అయితే, ప్రస్తుతం ఆ పార్టీని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్టు వివరించారు. ఆ ఇద్దరు ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వారిని తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల్ని తమ మీదకు ఉసిగొల్పుతున్నారని, మున్ముందు అదే పోలీసులు ఆ ఇద్దరినీ టార్గెట్ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. -
దినకరన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన ఇటీవల స్థాపించిన కొత్త పార్టీ గుర్తు, పార్టీ పేరు ఉపయోగించొద్దని దినకరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దినకరన్ పార్టీ గుర్తు, పేరుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు తాను స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనని స్వయంగా దినకరన్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. పైన నలుపు, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఎరుపు, మధ్యలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దినకరన్ ప్రకటించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బహిష్కృతులైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా ఉండటం గమనార్హం. -
‘అమ్మ’ పేరుతో దినకరన్ పార్టీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో గురువారం నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐఏడీఎంకే పార్టీని ద్రోహుల నుంచి తిరిగి దక్కించుకునేందుకు పోరాడుతామని సీఎం, డెప్యూటీ సీఎంలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇది రాజకీయ పార్టీ కాదు, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కేటాయించిన కుక్కర్ గుర్తునే పార్టీ చిహ్నంగా ఖరారు చేసుకున్నామన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐఏడీఎంకే నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకావటం గమనార్హం. -
సర్కారును కూల్చడమే లక్ష్యం..!
అన్నాడీఎంకే సర్కారును కూల్చడమే లక్ష్యంగా అమ్మ శిబిరం నేత దినకరన్ దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఆ కోవలో ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలమనే సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రులతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి సర్కారును కూల్చడయే లక్ష్యంగా ఆది నుంచి అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. కాగా, ఇంకొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని సీఎం పళని స్వామిని గద్దె దించాలనే లక్ష్యంగా దినకరన్ సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటుకున్న దినకరన్ వెన్నంటి నడిచేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ ఆయన వర్గం చెబుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్‌తో కలిసి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నా, అనర్హత వేటుకు జడిసి, వెనక్కు తగ్గారు. ఇలాంటి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ నిర్ణయిం చుకున్నారు. సీఎం పళని స్వామిపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు తిప్పుకుని బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ద్వారా సీఎం పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రంగంలోకి కమిటీ సీఎంకు వ్యతిరేకంగా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను , తటస్థంగా ఉన్న మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ ఓ కమిటీని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ నేతృత్వంలో ఆ కమిటీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభును తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యే దినకరన్‌తో భేటీ కావడం గమనార్హం. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. ఇంకొందరు లక్ష్యంగా సాగుతున్నారు. వారంతట వారే వస్తున్నారు.. విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, ఎమ్మెల్యేలు తమంతకు తాము తమ వెంట వస్తున్నారన్నారు. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ పేరు చెప్పుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజల్ని అష్టకష్టాలు గురిచేస్తున్నారని మండి పడ్డారు. తాను ఎక్కడకు వెళ్లినా, త్వరితగతిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేడర్ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. వారి ఆశ కొన్ని రోజుల్లో సాకారం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. మంత్రి తంగమణి మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టున్నాడని మండిపడ్డారు. వారికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోరనే ధీమాను వ్యక్తం చేశారు. -
కుటుంబీకులపై శశికళ అసహనం
సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్‌కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్‌కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది. -
నా కొద్దు పెంపు జీతం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ నినాదం కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కేనగర్లో ఎన్నికల ఖర్చులు, లెక్కలు తేలని దృష్ట్యా, దినకరన్‌పై అనర్హత వేటు పడేనా అన్న చర్చ ఏర్పడింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం తమకు దూరం కావడంతో ఒక వేదిక కోసం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధపడ్డా, చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. ఇందుకు కారణం తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ విచారణలో ఉండడమే. ఈ సమయంలో పార్టీ ప్రకటించిన పక్షంలో వారి పదవులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పవన్న విషయాన్ని పరిగణించారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని కొనసాగించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వేదిక ఏర్పాటులో జాప్యంతో తన పక్షాన ఉన్న వాళ్లు మళ్లీ సొంతగూటి వైపుగా తొంగి చూస్తుండడంతో దినకరన్ అప్రమత్తం అయ్యారు. అమ్మ నినాదాన్ని సొంతం చేసుకునేందుకు తగ్గ అనుమతుల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగాన్ని ఆశ్రయిస్తూ, మరో వైపు కోర్టు ద్వారా అనుమతి పొందేందుకు సిద్ధం అయ్యారు. హైకోర్టులో పిటిషన్: దినకరన్ తరఫున అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని సొంతం చేసుకునే విధంగా ఢిల్లీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం వ్యవహారంలో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, తాము అన్నాడీఎంకే అమ్మ శిబిరంగా ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు వివరించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తమ శిబిరం అన్నాడీఎంకే అమ్మ పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉన్నామని, తమకు ఎన్నికల యంత్రాంగం ఒకే చిహ్నం కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అన్నాడీఎంకే అమ్మ పేరును రిజిస్టర్ చేయాలని కోరుతూ ఎన్నికల యంత్రాంగానికి లేఖను దినకరన్ తరఫున ప్రతినిధులు సమర్పించారు. వేటు పడేనా.. : దినకరన్ ఎమ్మెల్యే పదవికి వేటు పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాల మీద లెక్కల్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం రంగంలోకి దిగింది. అయితే, ఆయన సమర్పించిన లెక్కల వివరాలు తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారుల పరిశీలనలో సాగిన లెక్కలు, దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. డీఎంకే, బీజేపీ అభ్యర్థుల లెక్కలు తేలగా, అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదనన్ ఖర్చుల లెక్కలు కూడా తేలకపోవడంతో సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఆ బృందం సమాయత్తం అవుతోంది. నా కొద్దు పెంపు జీతం: తన ఎమ్మెల్యే పదవికి ప్రభుత్వం అందించనున్న జీతం పెంపును దినకరన్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం లేఖ రాశారు. ఎమ్మెల్యేలకు జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని, ఈ దృష్ట్యా, తనకు పెంపు వద్దే వద్దు అని అందులో వివరించారు. తనకు పాత జీతాన్ని ఇస్తే చాలని పేర్కొన్నారు. -
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
కమల్‌పై పిటిషన్
సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. దినకరన్ అభిమానులు ఆగ్రహంతో కమల్ దిష్టిబొమ్మను దహనం చేయగా, మరో అభిమాని కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మరింత ముదిరింది. గత నెల 21వ తేదీన హోరాహోరీగా సాగిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి మినహా అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కమల్ మీడియా వద్ద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని దుయ్యబట్టారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. పెద్ద సంఖ్యలో దినకరన్ అనుచరులు చెన్నై పూందమల్లి గుమన్చావడి జంక్షన్లో శుక్రవారం ఉదయం కమల్ దిష్టిబొమ్మను, ఫొటోలను సైతం తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు దినకరన్ అనుచరులు చెన్నై ఎల్డామ్స్రోడ్డులోని ఇంటిని ముట్టడించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కమల్ ఇంటి ముందు పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కమల్‌పై కోర్టులో పిటిషన్ చెన్నై ఆర్కేనగర్ ప్రజలను, ఓటర్లను అవమానించే విధంగా నటుడు కమల్‌హాసన్ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశాడని ఆరోపిస్తూ కోయంబత్తూరు గణపతి మణియక్కరాణ్ పాళంకు చెందిన దినకరన్ అనుచరుడు ఇళంగోవన్ కోయంబత్తూరు మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ 80వేలకు పైగా ఓట్లు పొంది 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ గెలుపుతో దినకరన్‌కు ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరిగాయి. అయితే ఆర్కేనగర్ ప్రజలు ఓటుకు రూ.20వేలు పొందడం ద్వారా దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని నటుడు కమల్‌హాసన్ విమర్శించారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కళంకితులను చేసేలా ఉన్నాయి. కమల్ వ్యాఖ్యలతో సమాజంలో నేను హేళనకు గురై తీవ్ర మనోవేదన చెందుతున్నాను. ఈ కారణంగా కమల్‌హాసన్‌పై కఠిన చర్య తీసుకోవాలని పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్‌ను ఈనెల 12వ తేదీన విచారణకు స్వీకరిస్తామని మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్కేనగర్ ప్రజలను బిక్షగాళ్లని కమల్ నీచమైన వ్యాఖ్యలు చేశాడని అన్నారు. కమల్ నిద్రిస్తున్న సమయంలో రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడంతో ఉలికిపాటుకు గురికావడం వల్లనే కమల్ నోటి నుంచి ఇలాంటి విమర్శలు వెలువడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. కమల్ రాజకీయాల్లోకి దిగితే కనీసం ఐదుశాతం ఓట్లను కూడా పొందలేరని అన్నారు. దినకరన్ అనుమతితో కమల్‌పై పోరాటం చేస్తామని తెలిపారు. -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.