dissatisfaction
-
తూచ్ పదహారే..!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది. రగడ రాజుకుందిలా..! పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.వెనక్కి తగ్గిన అధిష్టానం కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్‌లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే. -
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
ఏపీ బీజేపీలో ముసలం.. సీనియర్ల ‘రహస్య’ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇస్తుండగా, ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై సీనియర్లు చర్చిస్తున్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై కూడా చర్చిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలని సీనియర్లు అంటున్నారు. ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు ! -
అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే.. పోటీ చేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారన్నారు. ‘‘అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు’ అని పేర్కొన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై, అధికార బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పారు. పరిస్థితి బీజేపీకి సానుకూలంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యావత్ పార్టీ యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో ముఖ్యనేతలు ఆధిపత్య పోరుకు, గ్రూపులకు ఆస్కారం ఇవ్వకుండా ఐక్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో ‘రైతు గోస– బీజేపీ భరోసా’బహిరంగ సభ అనంతరం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీతో సమావేశమైన అమిత్‌షా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. 5సీ ప్రాతిపదికగా పనిచేయాలి బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో పనిగట్టుకుని సాగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని షా ఆదేశించారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఉన్న సమాచారం, వివిధ రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన వివరాలు వెల్లడించారు. పార్టీ గెలుపు విషయంలో నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని, పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపాలని సూచించారు. క్లారిటీ, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కోఆర్డినేషన్, క్రెడిబిలిటీ (5 సీ) ప్రాతిపదికగా పనిచేయాలని, ప్రజలకు అన్ని విషయాల్లో స్పష్టత ఇస్తూ నేతలు చిత్తశుద్ధి, సమన్వయంతో పార్టీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా కృషి చేయాలని చెప్పారు. అవినీతిని వెలికితీసి ప్రచారం చేయండి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమిత్‌షా చర్చించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ రెండు పార్టీలతో పాటు మజ్లిస్ రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో సాగాలని సూచించారు. గత తొమ్మిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు సహా వివిధ కార్యక్రమాలు, పథకాల అమల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని వెలికితీసి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కనివారితో పాటు రెండు పార్టీల అసంతృప్త ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల మేనేజ్మెంట్, వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై లోతుగా సమీక్ష రాబోయే 3, 4 నెలల్లో జరగనున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై అమిత్‌షా సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. పార్టీపరంగా పట్టున్న, కచి్చతంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలెన్ని? వీటితో పాటు బీజేపీ బలా లు కేంద్రీకరించి విజయం కోసం కృషిచేస్తున్న నియోజకవర్గాలు, పార్టీ రెండోస్థానంలో నిలిచే అవకాశాలున్న సీట్లు ఏవేవి అన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. 29, 30 తేదీల్లో సమీక్ష సమావేశాలు బీజేపీ ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. ఎమ్మెల్యేల ప్రవాస యోజన, అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెపె్టంబర్ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెపె్టంబర్ 17 తదితర అంశాలపై చర్చించనుంది. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్ (మెదక్, ఖమ్మం), అరవింద్ మీనన్ (అదిలాబాద్, నిజమాబాద్), తరుణ్ ఛుగ్ (కరీంనగర్, నల్లగొండ), ప్రకాష్ జవదేకర్ (మహబూబ్‌నగర్, వరంగల్), బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్) హాజరుకానున్నారు. -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు. అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేదెలా? గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం అంతర్మథనంలో పార్టీ శ్రేణులు.. క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు కోరుతున్నారు. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.. మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు. నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో? రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఎంపీ గల్లా కనపడటం లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే. మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. అమలుకానీ హామీలు.. వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. -
న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది. ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. -
జీవిత భాగస్వామి విషయంలో అసంతృప్తి ఉండకూడదు..!
మనిషి జీవితంలో తనకున్న వాటిలో ముఖ్యంగా మూడు విషయాల్లో ఎప్పుడూ అసంతృప్తి పొందకూడదని పెద్దలు చెబుతారు. సంతోషస్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే... వాటిలో మొదటిది కళత్రం. అంటే తనకు జీవిత భాగస్వామిగా లభించినవారు. అంటే వివాహం తరువాత తాను తాళికట్టి తెచ్చుకున్న భార్య. ఏడడుగులు వేసి సహధర్మచారిణిగా ఉంటానని భర్తగా అంగీకరించి అతని వెంట నడిచి వచ్చిన స్త్రీ. ధర్మం, అర్థం, కామం... ఈ మూడూ వారికే పరిమితం. పరస్పరం దాటి వెళ్ళడానికి వీలు లేదు. సముద్రుడు చాలా శక్తిమంతుడు. తలచుకుంటే భూమినంతటినీ ముంచెత్తగలడు. అయినా తనకు తాను ఒక నియమం పెట్టుకున్నాడు. నేను చెలియలికట్ట దాటను... అన్నాడు. అందువల్ల కెరటాలు ఒడ్డువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి. అలా కాకుండా ఏ రోజయినా సునామీలాంటివి వచ్చి చెలియలికట్ట దాటితే అది చరిత్రలో భయంకరమైన రోజవుతుంది. అంటే తమలో వచ్చిన భావావేశాన్ని భార్యాభర్తలలో ఏ ఒక్కరయినా నియంత్రించుకోలేకపోతే ... అది చెలియలికట్ట దాటిన పరిస్థితి. అందుకే ఎప్పుడూ వారిరువురూ పరస్పరం పూర్తి సంతృప్తి పొంది ఉండాలి. ఏకారణం చేతనయినా వారిలో ఏ ఒక్కరికయినా అసంతృప్తి పొడసూపిందనుకోండి. అప్పుడెలా ఉండాలి... అంగవైకల్యంతో తమ కడుపున పుట్టిన బిడ్డను తల్లిగా కానీ, తండ్రిగా కానీ ఎంత ఎక్కువ శ్రద్ధతో, అధిక ప్రేమానురాగాలతో, అన్నిటికీ మించి అత్యధిక ఓర్పుతో చూసుకుంటారో భార్యాభర్తలు కూడా తమలో పుట్టిన అసంతృప్తిని దిగమింగి తమ భాగస్వామిని అంత శ్రద్ధగా చూసుకోగలగాలి. బంగారు పాత్రలో పోసుకు తాగినా పాయసమే, కడుక్కుని కుండలో పోసుకు తాగినా పాయసమే. పాత్రలు వేరయినా పాయసం మాత్రం ఒక్కటే. అందుకే జీవిత భాగస్వామిని దాటి ధర్మార్థకామములను పొందే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే అధార్మికమైన కార్యాలపట్ల మనసు లగ్నం అవుతుంది. దానివలన ధర్మం పట్టుకోల్పోతుంది. అశాంతి కలుగుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. కారణం... ఉన్నదానిలో తృప్తి లేదు. కోరుకున్నది అన్నివేళలా అందుబాటులో ఉండదు. పైగా చేయకూడనిది చేస్తున్నానేమో అన్న అపరాధ భావన వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, జీవితాలను పతనం చేస్తుంది. ‘పరస్త్రీసంగ దోషేన బహవో మరణంగతా..’ పరస్త్రీ (పరపురుషుడి) వ్యామోహం ... ఆ భావన, ఆ ఉద్వేగం, ఆ భయం... లోపల ఆ రహస్యాన్ని దాచుకోవడంలో ఉన్న ఉద్విగ్నత... అనారోగ్యానికి, అకాలమరణానికి కూడా దారితీస్తాయి. అందుకే జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తి అన్నమాట దరిచేరనీయవద్దు. భార్యలో భర్తకు కానీ, భర్తలో భార్యకు కానీ బలముంటే సంతోషించాలి, బలహీనతుంటే... భగవంతుడిచ్చిన పిల్లల విషయంలో చూపిన ఓర్పు, సానుభూతి, ప్రేమానురాగాలనే చూపాలి. అంతేతప్ప జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి స్థానం ఇవ్వకూడదు. -
విధేయుని అసమ్మతి
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన కొంతకాలంగా పార్టీపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా దశాబ్దాల పాటు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించారు. ఏ సంక్షోభాన్నయినా సులువుగా పరిష్కరిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా పార్టీలో చీలికలొచ్చినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నా అధిష్టానానికి మొదట గుర్తుకొచ్చే పేరు ఆజాదే. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జ్గా అంతర్గత సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించారు. నాయకత్వంపై బహిరంగ విమర్శలు 1970లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ అర్ధ శతాబ్దం పాటు గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా ఆజాద్‌కు పేరుంది. అలాంటి నేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో పార్టీకి కాయకల్ప చికిత్స జరగాలనే డిమాండ్‌తో 2020లో ఏర్పాటైన జీ23 సభ్యుల గ్రూప్‌లో ఆజాద్ కీలకంగా వ్యవహరించడం ఆందరినీ విస్మయానికి లోను చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ మునిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం రేపాయి. నాటినుంచీ పలు సందర్భాల్లో పార్టీ నాయకులపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా ఓటముల నేపథ్యంలో పార్టీలోని ఫైవ్ స్టార్ కల్చర్‌ను ఏకిపారేశారు. ‘టికెట్ రాగానే మా నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఏసీ కారులేకుండా బయటకు అడుగు కూడా వేయరు. ఈ సంస్కృతి మారనిదే ఎవరూ గెలవలేరు‘‘ అన్నారు. మోదీపై ‘వీడ్కోలు’ పొగడ్తలు ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారన్న విశ్లేషణలు వినిపించాయి. దాన్ని ఆయన స్వీకరించరని పార్టీ ఆశించింది. కానీ ఆజాద్ మౌనమే వహించారు. ఎనిమిదిసార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన, తాజాగా ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగం కూడా కలకలం రేపింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధాని మోదీని కూడా ఆకాశానికెత్తారు. ‘‘మోదీపై నేనెన్నోసార్లు మాటల దాడి చేశా. అయినా ఆయనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అందుకు ధన్యవాదాలు. ఆయనకు కృతజ్ఞుడినై ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు. సొంత కుంపటే! బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే ఆజాద్ తెరదించారు. ‘‘కశ్మీర్లో ఎన్నికలున్నందున సొంత పార్టీ పెట్టి బరిలో దిగుతా. అక్కడ గెలిచాక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తా’’ అని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ పార్టీ వెనక బీజేపీ హస్తమే ఉందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్‌లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని సీబీఐకి సూచించింది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని, స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. -
కారులో కాస్త.. సౌండ్ పెరిగింది.. నెక్స్ట్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ తోట’లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ అధిష్టానం తమను పట్టిం చుకోవడం లేదని నేతలు భావిస్తున్నారా? టికెట్ రాకపోయినా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నారా? నాయకత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా?.. ఈ అంశాలపై అధికార టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీ అవిర్భావం నుంచి మొదలుకుని నిన్నా మొన్నటి దాకా వివిధ పార్టీల నుంచి చేరికలతో ఓవర్ లోడ్ అయిన ‘కారు’లో అసంతృప్తి స్వరం విన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తే తమకు టికెట్ దక్కే అవకాశాలను ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్న నేతలు టికెట్ సాధన దిశగా ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాల్లో ఇది ముదిరిపాకాన పడుతోంది. అటు మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం తో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఉంది. అయితే సగం నియోజకవర్గాల్లో బలమైన బహుముఖ నాయకత్వం ఉండటం సమస్యగా మారి నేతల్లో అసంతృప్తికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడంతో పాటు సొంత పార్టీ్టలో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కొందరు నేతలు పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో.. తమదైన శైలిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని విపక్ష పార్టీలు ఆశిస్తుండగా, అసంతృప్తి అంశాన్ని టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. చర్చనీయాంశమైన ముగ్గురి భేటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లాలో పర్యటించగా, జూపల్లి అదే రోజు తుమ్మల, పొంగులేటితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. తాను ఆయిల్‌పామ్ సాగు తీరును పరిశీలించేందుకే ఖమ్మం వెళ్లినట్లు జూపల్లి చెప్పినా, ఆ తర్వాత కొల్లాపూర్‌లో తన అనుచరులతో జూపల్లి భేటీ అయ్యారు. కొల్లాపూర్ శివారులోని ఓ తోటలో జరిగిన సమావేశంలో బీజేపీలోకి వెళ్లడం కంటే కాంగ్రెస్‌లోకి వెళ్లడమే బెటర్ అని అనుచరులు సూచించినట్టు సమాచారం. జూపల్లి మాత్రం తాను ఇప్పట్లో పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్తూనే భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చినట్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పారు. అయితే పార్టీ అధిష్టానం తనను గుర్తించినా, లేకున్నా పోటీలో ఉండటం మాత్రం ఖాయమని ప్రకటించారు. వాస్తవానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం పొంగులేటి అసంతృప్తికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈసారి పరిస్థితిని అంచనా వేస్తున్న ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సీనియర్ నాయకుడినైన తనను అధిష్టానం పట్టించుకోవడం లేదని తుమ్మల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం మాదిరిగానే ఇతర చోట్లా.. వరుసగా రెండు పర్యాయాలు 2014, 2018 అసెం బ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కోస్థానంలో మాత్రమే గెలుపొందారు. 2014లో జలగం వెంకట్రావు, 2018లో పువ్వాడ అజయ్ మాత్రమే విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ప్రతి చోటా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్ దక్కే పక్షంలో తమ దారి తాము చూసు కోవాలనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా మెదక్‌లో పద్మా దేవేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, తాండూరులో రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్.. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత మాలోత్, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి నడుమ పొలిటికల్ వార్ కొన సాగుతోంది. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారంతో స్థానిక కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెద్దపీటపై కినుక ఆర్నెల్ల వ్యవధిలో 21 మంది ఎమ్మెల్సీలు ఎన్నికైనా తమకు అవకాశం దక్కకపోవడం కొందరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో ఖాళీలున్నా అడపాదడపా మాత్ర మే నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలు కొనసాగుతున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడం ఆశావహుల్లో నిస్పృహకు తావిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా అది కార్యరూపం దాల్చడం లేదు. పార్టీ పరంగా జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయని భావించినా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే పెద్దపీట వేయడాన్ని ఆశావహులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోనూ, పాల న పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధి నేత కేసీఆర్‌కు పార్టీ పరిణామాలపై పూర్తి అవగాహన ఉందని, అవసరమైన సందర్భాల్లో పార్టీని ఏకతాటిపైకి తేవడం కష్టసాధ్యమేమీ కాదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ప్రభుత్వానికి ట్రిబ్యునళ్లతో పని లేదా?
న్యూఢిల్లీ: వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయి నియామకాల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ట్రబ్యునళ్ల అవసరం లేదనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలంది. ట్రబ్యునళ్లలో ఖాళీలపై అత్యున్నత న్యాయస్థానం దృష్టి పెట్టాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని జస్టిస్ ఎస్కే కాల్, ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించే పరిస్థితులు రావడం అంత మంచిది కాదని కేంద్రానికి హితవు పలికింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధ్యక్షుడు, ఇతర సభ్యుల నియామకం జరగకపోవడం, ట్రిబ్యునల్స్‌లో కనీస మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించి విచారించింది. వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి శాశ్వత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడింది. ‘కమ్యూనిటీ కిచెన్ల’పై విచారణకు సుప్రీం ఓకే దేశంలో ఆకలి కేకల నిర్మూలన కోసం కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆరోగ్య, ఆర్థిక రంగాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడం చాలా అవసరమని లాయర్ అషిమా మండ్లా చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనిపై 27న విచారణ చేపడతామని తెలిపింది. -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి
జైపూర్: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తన దృష్టి రాజస్తాన్‌పైకి మళ్లించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణమే కొనసాగుతోంది. కేబినెట్లో బెర్త్‌ల కోసం సచిన్ పైలెట్ వర్గీయులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీనిపై కాలయాపన జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు రోజుల క్రితమే సచిన్ పైలెట్ అధిష్టానం తమ డిమాండ్లను నెరవేరుస్తుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే సభ్యులపై కసరత్తు చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్తాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అజయ్ మాకెన్ జైపూర్‌కు చేరుకొని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో మంతనాలు జరిపారు. ఈ నెల 28న కేబినెట్ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా ఆదివారం ఉదయం 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్ పైలెట్ కేబినెట్లో తన వర్గీయులకి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది ఖాళీలు వేణుగోపాల్, అజయ్ మాకెన్ గత రెండు రోజులుగా వరుసగా పార్టీ నాయకుల్ని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ‘‘కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపాం. జిల్లా, బ్లాక్ స్థాయిలో పార్టీ చీఫ్‌ల నియామకం, వివిధ పాలకమండళ్లు, కార్పొరేషన్లలో నియామకాలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలందరూ చెబుతున్నారు ’’ అని మాకెన్ తెలిపారు. రాజస్తాన్ కేబినెట్లో అత్యధికంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌తో సహా కేబినెట్లో 21 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గహ్లాత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య కుదిరి ఆయన వెనక్కుతగ్గారు. -
కేబినెట్ విస్తరణతో యూపీలో అసంతృప్తి షురూ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలదళం వదులుకోవట్లేదు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టేందుకు పెద్ద ఎత్తున చేసిన కసరత్తు కారణంగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నిశాద్ పార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాల్సిందే నిషాద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్ తన కుమారుడు ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ప్రభావం చూపే అప్నా దళ్ అనుప్రియ పటేల్‌కు కేబినెట్లో చోటు దక్కించుకోగలిగితే, 160 సీట్లలో ప్రభావం చూపే ప్రవీణ్ నిషాద్‌ను మంత్రిమండలిలో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికే బీజేపీని వీడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే బీజేపీ అధిష్టానం ఈ విధంగా నిషాద్లను విస్మరిస్తూ ఉంటే, రాబోయే సమయంలో తన వ్యూహాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. 18 శాతం నిషాద్‌లు మోసపోయారు ప్రవీణ్ నిషాద్‌ను మంత్రివర్గంలో చేర్చకపోవడం నిషాద్ సమాజానికి జరిగిన ద్రోహం అని సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న నిషాద్ సమాజం మరోసారి మోసానికి గురైందని, కేవలం 4 నుంచి 5 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుప్రియా పటేల్‌ను ఉద్దేశించి విమర్శించారు. 2017లో జరిగిన గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ ఎస్పీ అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి వెలుగులోకి వచ్చారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ నిషాద్ కాషాయ కండువా కప్పుకొని సంత్ కబీర్ నగర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రవీణ్ నిషాద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా ఉండగా, అతని తండ్రి నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్లో చోటుదక్కలేదన్న కారణంతో ఒకవేళ పార్టీని వీడితే ఆయన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంజయ్ నిషాద్, బీజేపీతో కేవలం బెదిరింపు రాజకీయాలు నడుపుతున్నార న్న చర్చ మొదలైంది. కేబినెట్లో సామాజిక సమీకరణాలు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భాను ప్రతాప్ సింగ్ వర్మను కేబినెట్లో చేర్చడం ద్వారా ఆయన షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా నూతన కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు.