DPR
-
విశాఖ–ఖరగ్‌పూర్ మధ్య హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రధాన అంశాలివీ⇒ తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేయడం ద్వారా లాజిస్టిక్ రంగ అభివృద్ధి కోసం ఈ హైవేను నిర్మించనున్నారు. ⇒ విశాఖపట్నం– ఖరగ్‌పూర్ మధ్య 783 కి.మీ. మేర ఆరు లేన్లుగా దీనిని నిర్మిస్తారు.⇒ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం.⇒ విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.⇒ విశాఖపట్నం నుంచి ఖుర్దా రోడ్ ( ఒడిశా) వరకు ఒక ప్యాకేజీ, ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ ప్రాజెక్ట్ చేపడతారు.⇒ డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి వారానికి ఎన్హెచ్ఏఐ కన్సల్టెన్సీని ఖరారు చేయనుంది. ⇒ 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారు.⇒ ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరబాద్ : మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మార్పులు చేశారు. ఆరాంఘర్ – బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపారు. ఎయిర్పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో వెళ్లనుంది.రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేర మెట్రో ప్రయాణించనుంది. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కి.మీ. మెట్రో పరుగులు తీయనుంది. -
సిద్దిపేట మీదుగా ఫోర్వే
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూ.1,100 కోట్ల వరకు వ్యయం రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. వచ్చేనెలలో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్మెంట్ కూడా ఖరారైంది. ఎన్‌హెచ్ 365 బీకి కొత్త రూపు.. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న 365బీ రోడ్డును కేంద్రం విస్తరిస్తోంది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించినా, చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తోంది.సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా, జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి.ఇక రాజీవ్ రహదారి నుంచి ఈ రోడ్డుకు కొత్తరూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ భాగం 365బీలో అంతర్భాగమే అయినా, ఇందులో సింహభాగం గ్రీన్‌ఫీల్డ్ హైవేగా పూర్తి కొత్త రోడ్డుగా ఏర్పడబోతోంది. రాజీవ్ రహదారి మీదుగా కాకుండా.. ప్రస్తుతం 365బీ జాతీయ రహదారి చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిలో కలుస్తుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా విడదీసి కొత్తరోడ్డుగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వెనక ఉన్న సామాజిక అటవీ భాగం వెనుక నుంచి కోమటి చెరువు పక్క నుంచి సిద్దిపేటకు చేరుతుంది. పట్టణ వెనుక భాగం నుంచి కోటిలింగేశ్వర దేవాలయ సమీపం మీదుగా ముందుకు సాగి రామంచ గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న 365బీ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి వరకు కొత్త అలైన్‌మెంటుతో రహదారిగా నిర్మిస్తారు. ఆ తర్వాత జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డుగా రూపొందనుంది. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నదిని దాటుతుంది. అక్కడ దీనికోసం వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం నేరుగా సిరిసిల్లలోకి చేరే పాత హైవేను కాదని, సిరిసిల్ల బైపాస్ రోడ్డుతో పట్టణం దాటిన తర్వాత బైపాస్ కూడలి వద్ద ఇతర రోడ్లతో అనుసంధానమవుతుంది. 100 మీటర్లు – 150 మీటర్ల వెడల్పు.. ఇలా రెండు ప్రణాళికలను డీపీఆర్‌లో చేర్చనున్నారు. వీటిల్లో కేంద్రం దేనికి మొగ్గుచూపితే అంత వెడల్పుతో రోడ్డుకు భూమిని సేకరిస్తారు. డీపీఆర్ ఆమోదం తర్వాతే వివరాలు వెల్లడవుతాయి. రాజీవ్ రహదారిని క్రాస్ చేసే చోట, సిరిసిల్ల వద్ద మానేరు మీద ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మిస్తారు. డీపీఆర్‌కు ఆమోదం తర్వాతనే వీటిల్లో వేటికి కేంద్రం ఆమోదం తెలిపిందో స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
మెట్రోకు మళ్లీ మోకాలడ్డు!
విశాఖపట్నం వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోపై మళ్లీ చంద్రబాబు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అభివృద్ధి అంతా ఒక్కచోటకే పరిమితం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విశాఖ నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ముందు అమరావతికి మెట్రో రైలు వచ్చేవరకు రాష్ట్రంలో ఇంకెక్కడా మెట్రో ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే వైజాగ్ మెట్రో ప్రాజెక్టు పనులకు అంతా సిద్ధమవుతున్న సమయంలో.. వాటిని మరింత ఆలస్యం చేసేందుకు మళ్లీ మొదటికి తీసుకొస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీన్ని రద్దు చేసి కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, విశాఖపట్నంచంద్రబాబుకి నచ్చలేదట.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపటా్నన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం ముందడగు వేసింది. లైట్ మెట్రో ప్రాజెక్టును పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపింది. అయితే.. కూటమి ప్రభుత్వం రావడంతో ఆలస్యం, అలసత్వం చోటు చేసుకుంటున్నాయి. విశాఖ అభివృద్ధి తమకు ఇష్టం లేదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖలో పర్యటించిన ఆయన మెట్రో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తిస్థాయిలో మెట్రో డీపీఆర్ తయారు చేసినట్లు వివరించినా.. తనకు ఆ డీపీఆర్ నచ్చలేదని చంద్రబాబు చెప్పేశారు. మళ్లీ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఇలాగైతే మోక్షమెప్పుడో.. జాతీయ రహదారుల నిర్మాణాల్లో తలమునకలైన ఎన్హెచ్ఏఐతో కలిసి మెట్రో డీపీఆర్ రూపొందించడం అనేది అంతులేని కథగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ఆలస్యం, అలసత్వంతో వైజాగ్‌కు మెట్రో రాకుండా చేసేందుకే చంద్రబాబు ఈ తరహా ఆదేశాలు జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందు గన్నవరం నుంచి అమరావతి వరకు మెట్రో రైలు నిర్మించడమే చంద్రబాబు లక్ష్యమని తెలుస్తోంది. అది పూర్తయ్యే వరకూ రాష్ట్రంలో ఎక్కడా మెట్రో మాటే లేకుండా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. కొత్త డీపీఆర్ తయారీకి.. ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దానిలో మార్పులు చేర్పులు అంటూ మెలికపెడితే.. మరో ఆరు నెలలు గడిచిపోతుంది. దాన్ని కేబినెట్ ఆమోదించి.. కేంద్రానికి పంపించేందుకు మరో 6 నెలలు.. కేంద్రం ఆమోదించేందుకు మరో ఏడాది.. ఇలా.. ఈ ఐదేళ్లు విశాఖ మెట్రో ప్రాజెక్టు కాగితాల్లోనే కునారిల్లేలా చేయడమే చంద్రబాబు ఉద్దేశమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏదో వంక.. అటకెక్కించడం పక్కా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైజాగ్ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వడివడిగా అడుగులు వేసింది. విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. మొత్తం 76.90 కి.మీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీన్ని కేబినెట్ కూడా ఆమోదించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) విధానంలో మెట్రో నిర్మించడానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని.. ఇందులో ప్రభుత్వాలు రూ.5,723.6 కోట్లు భరించాల్సి ఉండగా ప్రైవేట్ డెవలపర్.. వీజీఎఫ్ కింద రూ.8,585.4 కోట్లు భరిస్తూ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు టెండర్లు ఖరారైనప్పటి నుంచి మూడేళ్లకే తొలి మార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో అడుగులు వేసింది. భవిష్యత్తులో విశాఖలో నిర్మించే ఫ్లైఓవర్లను కూడా దృష్టిలో పెట్టుకొని డీపీఆర్ డిజైన్లు సిద్ధం చేశారు. అయితే చంద్రబాబు.. మెట్రో ఫ్లైఓవర్ల ఎత్తు, వెడల్పులు సరిగా లేవని.. అందులో మార్పులు చేయాలని సూచించడం గమనార్హం. మెట్రో పిల్లర్ల ఎత్తు ఎలా పెంచాలి? ఏ ప్రాంతంలో ఫ్లైఓవర్ పొడవుగా ఉండాలి.. ఎక్కడ వెడల్పు తక్కువగా ఉండాలో నిపుణులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా.. ఏదో ఒక వంకతో.. వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని నెమ్మదిగా అటకెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతోంది. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖని వెనక్కి నెట్టేందుకు కుట్రలు పన్నడంపై నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: ఎందుకీ ‘తొందరపాటు’?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది. ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు. పైగా, గత ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు. ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్‌లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్కో ఈ టెండరును ఆమోదించింది. ♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్‌ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్కో నిర్ణయించింది. ♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్‌లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం. ♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు. ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
గోదావరి– కావేరి అనుసంధానంపై వచ్చేనెలలో సీఎంల భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై వచ్చేనెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ మేరకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డట్లూ్యడీఏ) రాష్ట్రాలకు ప్రాథమికంగా సమాచారం పంపించింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సంబంధించి సవివర ప్రణాళిక నివేదిక(డీపీఆర్) త్వరలోనే రాష్ట్రాలకు పంపించి అ«ద్యయనం చేయడానికి గడువు ఇచ్చిన తర్వాత ఈనెలాఖరులో ఆయా ప్రభావిత రాష్ట్రాల నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్‌ను ఎన్‌డబ్లు్యడీఏ హైదరాబాద్ విభాగం కేంద్రానికి పంపించింది. దీనికి ఎన్‌డబ్లు్యడీఏ ఆమోదముద్ర వేసిన వెంటనే సంబంధిత రాష్ట్రాలకు ఆ నివేదిక పంపిస్తారు. రెండు నదుల అనుసంధానికి రూ.74,329 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా అందులో పేర్కొన్నారు. ఈ పాజెక్టు పూర్తయితే ప్రతీ సంవత్సరం రూ.9824.49 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని లెక్కకట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.3381 కోట్లు అవుతుందని అంచనా. ఇక ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని149 టీఎంసీల నీటిని గోదావరి–కావేరి అనుసంధానం కింద తరలించాలని కేంద్రం భావిస్తున్న సంగతి విదితమే. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ఈ 140 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పక్షంలో.. మహానది–గోదావరి మధ్య 230 టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. వాటిని కావేరికి తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటికే పలు సమావేశాల్లో గోదావరి–కావేరి నదుల అనుసంధానికి సంబంధించి సమ్మతి లభించింది. త్వరలోనే గోదావరి బోర్డు సమావేశం కూడా... గోదావరినది యాజమాన్య బోర్డు సమావేశం త్వరలోనే జరగనున్నట్టు సమాచారం. తదుపరి బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల సమాచారం అందులో చేర్చాలని ఏపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి లేఖ కూడా రాశారు. ఎల్లంపల్లి బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాలతోపాటు కుప్తి, ఎస్సారెస్పీ రెండో దశ వినియోగం, ఇందిరమ్మ వరద నీటి కాలువ, కాళేశ్వరం అదనపు టీఎంసీల వినియోగంపై చర్చించాలని కోరింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకు 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. శ్రీశైలం కోటాను సాగర్‌కు మళ్లించింది. ఉమ్మడి జలాశయాల నుంచి ఇరు రాష్ట్రాలకు 80 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. శ్రీశైలంలో కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయామని, అందువల్ల నాగార్జునసాగర్ కుడికాలువ నుంచి ఐదు టీఎంసీల నీటి విడుదల చేయాలని ఏపీ కోరిక మేరకు బోర్డు అనుమతినిచి్చంది. బోర్డు ఆర్థిక పరిస్థితిపై ఈనెల 12వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
విశాఖలో మోడరన్ ట్రామ్ ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో ప్రతిపాదించిన మెట్రో లైట్ (మోడరన్ ట్రామ్) ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంత్రి బుధవారం మెట్రో ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు డీపీఆర్‌ను మరింత మెరుగ్గా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ అధునాతన ట్రామ్ ప్రాజెక్టును మెట్రో రైలు సిస్టంకు అనుసంధానంగా నగరం నలు దిక్కులా నాలుగు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 60.05 కిలోమీటర్ల పరిధిలో 58 స్టేషన్లతో రూ.5,332 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి వివరించారు. ప్రజా అవసరాలు, డిమాండ్ తదితర ప్రాధాన్యతలకు అనుగుణంగా ఒక్కొక్క కారిడార్‌కు తగిన ఆర్థిక నమూనా (ఫైనాన్షియల్ మోడల్)లో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పురపాలక, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్‌లు వై.శ్రీలక్ష్మి , ఎస్ఎస్ రావత్, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.21 వేల కోట్లతో సీతారామ–సీతమ్మసాగర్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల– సీతమ్మసాగర్ ఉమ్మడి ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొత్తగా ఇల్లందు కాల్వను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను అనుమతుల కోసం తాజాగా ఢిల్లీలో కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది. రూ.13,700 కోట్ల అంచనాలతో సీతారామ ఎత్తిపోతల పథకం, రూ.5,200 కోట్ల అంచనాలతో సీతమ్మసాగర్ బ్యారేజీ, రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు కాల్వ కలిపి మొత్తం రూ.21,100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు డీపీఆర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 1.13 లక్షల కొత్త ఆయకట్టు సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందని ఎగువ ప్రాంతాల్లోని 1.13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడానికి ఇల్లందు కాల్వను నిర్మించనున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి అధిక ప్రయోజనం కలగనుండగా, మధిర, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతలను నిర్మిస్తుండగా, కొత్తగా ప్రతిపాదించిన ఇల్లందు కాల్వతో సీతారామ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టు 7.84 లక్షల ఎకరాలకు పెరగనుంది. సీడబ్ల్యూసీకి రెండో సవరణ డీపీఆర్ విద్యుదుత్పత్తి అవసరాలకు 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన సీతమ్మ బ్యారేజీ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 70.4 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పనులు సైతం 55 శాతం వరకు పూర్తయ్యాయి. దీనికి దాదాపుగా అన్ని రకాల అనుమతులను ఇప్పటికే సీడబ్ల్యూసీ ఇచ్చేయగా, అపెక్స్ కౌన్సిల్ తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచే సీతారామ ఎత్తిపోతలకు నీళ్లను తరలిస్తున్న నేపథ్యంలో బ్యారేజీని సైతం సీతారామ ఎత్తిపోతల పథకంలో కలిపేసి ఒకే ప్రాజెక్టుగా అనుమతులు పొందాలని గతంలో సీడబ్ల్యూసీ సూచించింది. పర్యావరణ అనుమతుల కోసం రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా కేంద్ర పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. సీడబ్ల్యూసీకి వేర్వేరు ప్రాజెక్టులుగా ప్రతిపాదించడం పట్ల అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాజెక్టులను కలిపేసి ఒకే ప్రాజెక్టుగా ప్రతిపాదిస్తూ మళ్లీ సీడబ్ల్యూసీకి నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీపీఆర్‌ను సమర్పించింది. తాజాగా ఇల్లందు కాల్వ నిర్మాణం పనులను సైతం డీపీఆర్‌లో చేర్చి సవరించిన డీపీఆర్‌ను మరోసారి సీడబ్ల్యూసీకి ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ చివరి దశలో ఉందని, మరో నెల రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ముందుకు డీపీఆర్ వెళ్లే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. గోదావరిలో సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యతతోపాటు పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఇటీవల గోదావరి బోర్డు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించిన నేపథ్యంలో గోదావరి బోర్డు లేఖతో ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
కావేరికి ‘గోదారే’!
సాక్షి, అమరావతి : గోదావరి–కావేరి అనుసంధానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించకున్నా.. ఆ రాష్ట్ర వాటాలో వాడుకోని 141.3 టీఎంసీలను తరలించాలని ప్రతిపాదించడాన్ని వారు తప్పుపడుతున్నారు. మా నీళ్లను కావేరికి ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం తెలపడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ 141.3 టీఎంసీలపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ హక్కులను వదులుకోవడానికి అంగీకరించినా ఆ జలాలను కావేరికి తరలించడానికి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వదులుకున్న 141.3 టీఎంసీలను పునఃపంపిణీ చేయాలని గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మాజీ చైర్మన్ ఏబీ మొహిలే చెబుతున్నారు. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తేనే గోదావరి–కావేరి అనుసంధానం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల మిగులు జలాలను జతచేసి.. 247 టీఎంసీలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) మీదుగా గ్రాండ్ ఆనకట్ట (కావేరి)కి తరలించేలా 2018లో ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులకు తలా 80 టీఎంసీలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం.. గోదావరి–కావేరి అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనపై ఆదిలోనే సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 106 టీఎంసీలను ఎలా తరలిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో గోదావరి–కావేరి అనుసంధానంలో ఎన్‌డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా డీపీఆర్‌ను రూపొందించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు అందిస్తామని పేర్కొంది. దీనిపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో గత మార్చి 6న టాస్క్‌ఫోర్స్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం చెబుతున్నా.. టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్వహించిన ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించలేదు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌ను ఆహ్వానించకుండా, ఆ రాష్ట్ర కోటా నీటి తరలింపుపై ఎలా చర్చిస్తామని టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రశ్నించాయి. ఛత్తీస్‌గఢ్ సర్కార్‌తో ఉన్నతస్థాయిలో చర్చించి.. ఆ రాష్ట్ర కోటా నీటిని తరలించడానికి అంగీకరింపజేస్తామని కమిటీ చెప్పుకొచ్చింది. కానీ, ఇది ఆచరణ సాధ్యంకాదని సీడబ్ల్యూసీ చైర్మన్ ఏబీ మొహిలే స్పష్టంచేశారు. గోదావరి ట్రిబ్యునల్ కేటాయించని జలాలపై పూర్తి హక్కు తమకుందని.. తమ నీటిని ఎలా తరలిస్తారని ఛత్తీస్‌గఢ్ సర్కార్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో.. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ ఎలా ముందడుగు వేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
నదుల అనుసంధానానికి ప్రాధికార సంస్థ
సాక్షి, అమరావతి : నదుల అనుసంధానం పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ తరహాలో నేషనల్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ (నిరా) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానానికి సంబంధించి సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) తయారీ నుంచి.. ప్రధాన పనులకు సంబంధించిన టెండర్లు, వాటి పర్యవేక్షణ వరకూ అన్ని బాధ్యతలను ఆ సంస్థే నిర్వహించనుంది. ఆయకట్టుకు నీళ్లందించే బ్రాంచ్ కెనాల్స్ (ఉప కాలువలు), డి్రస్టిబ్యూటరీల (పిల్ల కాలువల) పనులను మాత్రమే రాష్ట్రాలకు అప్పగించాలని ప్రతిపాదించింది. అప్పుడే నదుల అనుసంధానం వేగవంతమయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. వాటిపై కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిరాగా రూపాంతరం చెందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ ప్రాజెక్టుల కంటే అధికంగా.. జాతీయ ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో 90% నిధులను కేంద్రం సమకూర్చేది. కానీ.. ఇటీవల ఆ వాటాను 60 శాతానికి తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ.. నదుల అనుసంధానం ప్రాజెక్టులకు మాత్రం 90 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తుందని, మిగతా 10 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరించాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) నుంచే ఈ మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది. కేంద్రంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేబీఎల్పీ మధ్యప్రదేశ్‌లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. కేబీఎల్పీ అంచనా వ్యయం 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతా 10 శాతం ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ భరిస్తాయి. మిగతా నదుల అనుసంధాన ప్రాజెక్టులకూ ఇదే విధానం వర్తిస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. నదుల అనుసంధానం వేగవంతం హిమాలయ, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడం ద్వారా కడలి పాలవుతున్న జలాలను మళ్లించి దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎన్‌డబ్ల్యూడీఏ 30 అనుసంధాన ప్రాజెక్టులను సిద్ధం చేసింది. కానీ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నిధుల కొరత, జల వివాదాలు, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం తదితర సమస్యల వల్ల నదుల అనుసంధానం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కెన్–బెట్వా నదుల అనుసంధానానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడంతో ఆ ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. నదుల అనుసంధానం కోసం ప్రత్యేకంగా ‘నిరా’ను ఏర్పాటు చేస్తే.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం నుంచి పనులు చేపట్టడం వరకూ వేగవంతమయ్యే అవకాశం ఉందని నీటి పారుదలరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
గోదావరి–కావేరి అనుసంధానానికి రూ. 39,275 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి (జీ–సీ) నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.39,274.92 కోట్ల వ్యయం కానుందని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అంచనా వేసింది. ఈ మేరకు ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరితో కృష్ణాను, కృష్ణాతో పెన్నాను, పెన్నాతో కావేరి నదులను అనుసంధానిస్తామ ని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ప్రాజెక్టు మొత్తం పొడవు 1,211 కి.మీగా ఉండనుందని పేర్కొంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ మార్చి 6న హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమై గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించనుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా నోట్లో ఈ విషయాలను ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడించింది. భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాల మేరకు డీపీఆర్‌లకు తుదిరూపు ఇచ్చామని, ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొంది. ఏ బేసిన్‌కు ఎంత వాటా?: గోదావరి బేసిన్లో మిగులు జలాల లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే తేల్చిచెప్పింది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వాటాగా ఉన్న 283 టీఎంసీల నుంచి ప్రస్తుతం ఆ రాష్ట్రం వాడుకోని 141 టీఎంసీలనే తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంటోంది. 141 టీఎంసీల్లో 45.1 టీఎంసీలను కృష్ణా బేసిన్లో, 35.3 టీఎంసీలను పెన్నా బేసిన్లో, 38.7 టీఎంసీలను కావేరి బేసిన్లో, 9.8 టీఎంసీలను మలప్రభ సబ్‌బేసిన్‌లో వాడుకోనుండగా 10.1 టీఎంసీలను చెన్నై నగరానికి, 2.2 టీఎంసీలను పుదుచ్చేరికి తరలిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణకు 42.6 టీఎంసీలు, ఏపీకి 41.8 టీఎంసీలు, తమిళనాడుకి 38.6 టీఎంసీలు, కర్ణాటకకు 9.8 టీఎంసీ లు, పుదుచ్చేరికి 2.2 టీఎంసీలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో 2.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు గోదావరి–కావేరి అనుసంధానంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మొత్తం 3,98,490 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు 1,75,407 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మొత్తం 5,73,897 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణలో 9.46 టీఎంసీలతో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు 24.96 టీఎంసీలతో 1,58,236 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరపనున్నట్టు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి మొత్తం 34.43 టీఎంసీలతో 2,38,236 హెక్టార్లకు ప్రయోజనం కలగనుంది. మరో 3 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, 5.19 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్రానికి కేటాయించనున్నారు. ఏపీలో 2.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏపీలో 31.39 టీఎంసీలతో 2,19,271 హెక్టార్ల కొత్త ఆయకట్టుతోపాటు 0.6 టీఎంసీలతో 2727 హెక్టార్ల స్థిరీకరణను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. మొత్తం 31.99 టీఎంసీలతో 2,21,998 హెక్టార్లకు ఏపీలో లబ్ధి కలగనుంది. తాగునీటి అవసరాలకు 4.2, పారిశ్రామిక అవసరాలకు 5.65 టీఎంసీలను ఆ రాష్ట్రానికి కేటాయించింది. తమిళనాడులో 13.13 టీఎంసీలతో 99,219 హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3.67 టీఎంసీలతో 14,444 హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించింది. 9.35 టీఎంసీలను ఆ రాష్ట్ర తాగునీటి, 12.46 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. రూ.2817.62 కోట్లతో బెడ్తి–వార్ధా అనుసంధానం కర్ణాటకలోని బెడ్తి–వార్ధా అనుసంధానం ప్రాజెక్టుకు రూ.2,817.62 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. గోదావరి–కావేరి, బెడ్తి–వార్ధా అనుసంధానికి మొత్తం రూ.42,092.54 కోట్లు కానుందని ఎజెండా నోట్లో పేర్కొంది. 52 కి.మీల బెడ్తి–వార్ధా అనుసంధానంతో 18.5 టీఎంసీలను తరలించి 1.05 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు పేర్కొంది. -
జల రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటీ ప్రాజెక్టు.. గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు. బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్‌హామ్ కెనాల్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. గోదావరిని ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది. సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్‌ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్‌తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జల రవాణాతో ఎంతో ఆదా.. ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట. ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ.. గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
కాళేశ్వరానికి ‘అదనపు’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అదనపు టీఎంసీ ఎత్తిపోసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాళేశ్వరం అదనపు టీఎంసీ డీపీఆర్‌కు అనుమతుల జారీ ప్రక్రియ విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ఇటీవల లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లో స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర న్యాయ శాఖ సూచించినట్లు గోదావరి బోర్డుకు జలశక్తి శాఖ తెలియజేసింది. దీంతో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను ప్రస్తుతానికి గోదావరి బోర్డు పక్కనబెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు టీఎంసీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అనుమతుల ప్రక్రియకు సైతం బ్రేక్ పడినట్టు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 85 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. అదనపు టీఎంసీ సహా ఇతర పనుల పూర్తికి మరో రూ. 30 వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డు నో గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అన్ని రకాల అనుమతులతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత అదనపు టీఎంసీ తరలింపు పనులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే మొదలుపెట్టింది. అయితే ఈ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ... 6 నెలల్లోగా అనుమతి పొందాలని 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఆదేశించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... అదనపు టీఎంసీ తరలింపు కోసం చేపడుతున్న పనులు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమేనని... అందువల్ల అనుమతిలేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీన్ని తొలగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సవరించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. కేంద్ర జలసంఘానికి ఇప్పటికే సవరించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించగా హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు లభించాయి. అనంతరం సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు సాంకేతిక అనుమతుల కోసం పంపింది. బోర్డు ఈ డీపీఆర్‌ను పరిశీలించి సంతృప్తి చెందితే కేంద్ర జలశక్తి శాఖలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) ఆమోదం కోసం సిఫారసు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియను తాజాగా గోదావరి బోర్డు పక్కన బెట్టింది. మరికొంత కాలం తప్పని జాప్యం... పరిహారం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొందరు ప్రాజెక్టు భూనిర్వాసితులు... రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే అదనపు టీఎంసీ పనులు చేపడుతోందని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అంశాలపై స్టేటస్ కో కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడి చర్యలు ఉండాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
కాళేశ్వరం సవరణ డీపీఆర్ వెనక్కి.. పరిశీలించలేమన్న గోదావరి బోర్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌పై పరిశీలన జరిపి, అనుమతుల కోసం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి సిఫారసు చేసేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులుండటం వల్ల తాము డీపీఆర్‌ను పరిశీలించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖకు తేల్చిచెప్పింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2 టీఎంసీల పనులకు సంబంధించిన డీపీఆర్‌కు ఇప్పటికే కేంద్రం నుంచి అన్ని అనుమతులు లభించాయి. తర్వాత కా లంలో రోజుకు అదనపు టీఎంసీ తరలించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అదనపు టీఎంసీ పనుల ప్రాజెక్టుకూ అనుమతులు తీసుకోవాలని గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కేంద్రం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేనందున అదనపు టీఎంసీ పనులపై హైకోర్టు సైతం స్టే విధించింది. 2 టీఎంసీల పనులతో పాటు అదనపు టీఎంసీ పనులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్రం సూచనతో 2టీఎంసీల పనుల డీపీఆర్‌లో అదనపు టీఎంసీ పనులను సైతం చేర్చి సవరించిన డీపీఆర్‌కు అనుమతుల కోసం ఇటీవల గోదావరి బోర్డు కు సమర్పించింది. కోర్టు కేసులను కార ణంగా చూపి డీపీఆర్‌ను పరిశీలించడా నికి బోర్డు నిరాకరించగా, పనుల నిలుపుదలకే హైకోర్టు ఆదేశించిందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు తెలియజేసింది. డీపీఆర్‌ను పరిశీలించి నిబంధనల ప్రకారం సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పంపించాలని కోరింది. -
Andhra Pradesh: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది. చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది) -
గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ డీపీఆర్‌ను గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)కు సమర్పించింది. తొలుత రోజుకు 2 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తిపోసే లక్ష్యంతో కాళేశ్వరాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన అనుమతులన్నీ కేంద్రం నుంచి పొందింది. తర్వాత మరో టీఎంసీ అదనంగా తరలించే పనులను చేపట్టింది. అయితే కేంద్రం ఈ మూడో టీఎంసీ పనులను అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చుతూ.. ఆరునెలల్లో అనుమతి తీసుకోవాలని 2021 జూలై 15న ఆదేశించింది. అయితే రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రాజెక్టు, అదనపు టీఎంసీ తరలించే పనులు వేర్వేరు కాదని, రెండూ కాళేశ్వరంలో అంతర్భాగమేనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనితో సవరించిన కాళేశ్వరం డీపీఆర్‌ను సమర్పించి అనుమతులు పొందాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సవరణ డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు సమర్పించి హైడ్రాలజీ, కాస్ట్ అప్రైజల్ అనుమతులు పొందింది. తాజాగా రూ.1.15 లక్షల కోట్ల అంచనాతో సవరించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డుకు అందించింది. గోదావరి బోర్డు డీపీఆర్‌పై సాంకేతిక పరిశీలన జరిపాక.. సీడబ్ల్యూసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఓకే చేస్తుంది. చివరిగా అపెక్స్ కౌన్సిల్లో డీపీఆర్‌పై చర్చించి ఆమోదముద్ర వేస్తారు. మరో రూ.30వేల కోట్లు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.85 వేలకోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. కొత్త డీపీఆర్ ప్రకారం మిగతా పనుల పూర్తికి ఇంకో రూ.30వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ఆర్ఈసీ, పీఎఫ్‌సీతోపాటు పలు బ్యాంకుల నుంచి కాళేశ్వరం కార్పొరేషన్‌కు రావాల్సిన రుణాలు ఏప్రిల్ నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులకు రాష్ట్ర బడ్జెట్ నిధులే దిక్కు అని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కాళేశ్వరం వృథా కాదు.. ఆదా! -
మహిళల ఆర్థిక పరిపుష్టికి జగన్ సర్కారు చర్యలు.. రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం
కోవిడ్ మహమ్మారి ఎంతోమంది మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ రకాల ప«థకాల ద్వారా ఆయా వర్గాలను ఆదుకుంటోంది. అందులో ఒకటి పీఎంఎఫ్ఎంఈ పథకం. ఇది ఆహార శుద్ధి రంగానికి సంబంధించినది. ఈ పథకం ద్వారా ఆహార పరిశ్రమలో రాణించాలనుకునే మహిళలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో సహాయం చేయనుంది. అనంతపురం అర్బన్: అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ద్వారా శ్రీకారం చుట్టింది. ఆగస్టు నెలాఖరులోగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 34 యూనిట్ల కోసం డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను బ్యాంకులకు పంపింది. ప్రస్తుతం ఉన్న ఆహార శుద్ధి యూనిట్లకు, కొత్త యూనిట్లకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టింది. పరిశ్రమలు నెలకొల్పే సభ్యులకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సాంకేతిక సహకారం అందించనుంది. ఆర్థిక సాయం ఇలా... సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. పెట్టుబడి కింద యూనిట్ విలువలో 10 శాతం మొత్తాన్ని లబ్ధిదారు చెల్లించాలి. బ్యాంక్ లింకేజీ ద్వారా 90 శాతం రుణం ఇస్తారు. ఇందులో 35 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పటికే ఉన్న యూనిట్లకు సంబంధించి యంత్రాల ఏర్పాటుకు రుణం ఇస్తారు. కొత్తగా యూనిట్ ఏర్పాటుకు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రుణ సౌకర్యం కల్పిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వర్కింగ్ క్యాపిటల్, 75 శాతం మిషనరీకి పెట్టాల్సి ఉంటుంది. పథకం ముఖ్య ఉద్దేశం ► ఆహార శుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం ► పరిశ్రమల సామర్థ్యాల అభివృద్ధి, పనికి కావాల్సిన సాంకేతిక సహాయం అందించడం ► ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ తోడ్పాటు ► సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక ► సదుపాయాలు కల్పించడం ఆహారశుద్ధి పరిశ్రమలు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద వేరుశనగ నూనె మిల్లు, దాల్ మిల్లు, పిండిమిషన్, బొరుగుల బట్టీ, బేకరీ, రోటీ మేకర్, పచ్చళ్ల తయారీ, శనగల ప్రాసెసింగ్, పొటాటో చిప్స్ తయారీ, మురుకులు, మిక్చర్, చెక్కిలాలు, నిప్పట్ల తయారీ తదితర ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధన దిశగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పీఎంఎఫ్ఎంఈ పథకం కింద ఆగస్టు నెలాఖరుకు మండలానికి మూడు ఆహార శుద్ధి పరిశ్రమలు, అవసరమున్న చోట ఐదు చొప్పున జిల్లా వ్యాప్తంగా 110 యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తొలి విడతగా 34 యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను బ్యాంకులకు పంపించాం. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్‌లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మోహన్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
3 డివిజన్లు.. 54,500 మంది ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రైల్వే అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన డీపీఆర్ ఆధారిత తుది ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్లో 54,500 మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని డీపీఆర్‌లో పొందుపరిచిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపైనా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జోన్ ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉన్న వనరుల ఆధారంగా వార్షికాదాయం సుమారు రూ.15 వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. సిబ్బంది సర్దుబాటు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా జోన్ ఏర్పాటు అయినప్పుడు 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులతో విధులు మొదలు పెట్టేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుతుంటారు. కానీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు మాత్రం 65,800 అవసరం అని డీపీఆర్‌లో పొందుపరిచారు. అయితే కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో మాత్రం 54,500 మంది అవసరమని నిర్ధారించారు. వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,985 మంది, వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 930 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లలో కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆదాయం పెరిగే అవకాశం కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ని రైల్వే బోర్డు అధికారులు స్టడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు జోన్లో ఉండనున్నాయి. జోన్ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఉద్యోగుల సర్దుబాటు ఎలా నిర్వహించాలి? డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి? జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు మొదలైన అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్లు, తదితర అంశాల్ని క్రోడీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మూడు డివిజన్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని ఈ జోన్ నుంచి వార్షికాదాయం 2018–19 గణాంకాల ప్రకారం రూ.12,200 కోట్లు(డీపీఆర్ తయారు చేసినప్పుడు)గా గణించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. జోన్ స్వరూపమిదీ.. జోన్ : సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జోన్ పరిధిలో డివిజన్లు : విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రూట్ లెంగ్త్ : 3,496 కి.మీ రన్నింగ్ ట్రాక్ లెంగ్త్ : 5,437 కి.మీ సరకు రవాణా : 86.7 మిలియన్ టన్నులు రాకపోకలు సాగించే ప్రయాణికులు : 192.5 మిలియన్లు జోన్ పరిధిలో ఉన్న పోర్టులు : విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ మేజర్ స్టేషన్లు : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి జంక్షన్లు : 26 ఏ–1,ఏ,బీ కేటగిరీ స్టేషన్లు : 46 సీ,డీ,ఈ,ఎఫ్ కేటగిరీ స్టేషన్లు : 141 పాసింజర్ హాల్ట్ స్టేషన్లు : సుమారు 170 వైఫై సౌకర్యం ఉన్న స్టేషన్లు : 61 స్టేషన్లు జోన్ నుంచి నడిచే రైళ్లు : సుమారు 500 జోన్ పరిధిలో ఉన్న మెకానికల్ వర్క్‌షాపులు : తిరుపతి, రాయనపాడు, వడ్లపూడి (త్వరలో ఏర్పాటు కానుంది) కోచ్ మెయింటెనెన్స్ డిపోలు : విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్లు డీజిల్ లోకో షెడ్లు : విశాఖపట్నం, గూటీ, గుంతకల్లు, విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్లు : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే హాస్పిటల్స్ : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడు, గుంటూరు -
డీపీఆర్‌లపై ఢీ!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల విషయంలో తెలంగాణ, గోదావరి బోర్డుల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. డీపీఆర్‌లను అధ్యయనం చేసి వాటిని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపించే క్రమంలో అనేక అంశాలపై బోర్డు వివరణలు కోరుతుండటం తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. డీపీఆర్‌లో పేర్కొన్న నీటి లభ్యత అంశాలు, వ్యయ వివరాలు, ఆయకట్టుకు నీటి మళ్లింపు, విద్యుత్ అవసరాలపై సరైన వివరణలు లేవంటూ బోర్డు అంటుంటే..లేని అధికారాలను వాడుతూ డీపీఆర్‌లను కేంద్రానికి పంపకుండా బోర్డు అనవసర జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుస లేఖలు..భిన్న అంశాలపై ప్రశ్నలు కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆరు నెలల్లో గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు అందించడంతో పాటు వీటికి సంబంధించి బోర్డు, సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డుకు అందజేసింది. అయితే డీపీఆర్‌లను సునిశితంగా పరిశీలిస్తున్న బోర్డు అనేక అంశాలపై రాష్ట్రం నుంచి వివరణ కోరుతూ లేఖలు రాస్తోంది. చౌట్పల్లి ప్రాజెక్టు విషయంలో..హైడ్రాలజీ వివరాలతో పాటు కాల్వల ఆధునికీకరణ, ప్రవాహ సామర్థ్యాలను పెంచడం ద్వారా పొదుపు అవుతున్న నీటి వివరాలు, కాల్వల డిజైన్, వాటి సామర్థ్యాలు, ఇరిగేషన్ ప్లానింగ్, బెనిఫిట్ కాస్ట్ రేషియో, టోపోషీట్ మ్యాపులు, ఈ ప్రాజెక్టు ద్వారా నిండుతున్న చెరువులు, వాటికింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. మోదికుంటవాగు విషయంలో జియాలజీ పరిశీలన, డ్యామ్ నిర్మిత ప్రాంత అధ్యయనాలు, కేంద్ర జల సంఘం చెప్పిన హైడ్రాలజీ లెక్కలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన డ్రాయింగ్ల వివరాలు తమకు సమర్పించాలని అడిగింది. చనాకా–కొరటకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం ఒక రకంగా, 2021–22 ధరల ప్రకారం మరోలా ఉన్నాయని ఎత్తిచూపుతూ వివరణ కోరింది. ఇక సీతారామ విషయంలో అయితే వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద ఉన్నప్పుడు హెడ్ రెగ్యులేటర్‌కు ఉండే ముంపు, ప్రాజెక్టు కింద ప్రతిపాదిస్తున్న కొత్త ఆయకట్టుకు నిర్ణయించిన నీటి కేటాయింపు, విద్యుత్ వినియోగ లెక్కల్లో తేడాలు, విద్యుత్ ఛార్జీల అంశాల్లో తేడాలపై వివరణలు ఇవ్వాలని కోరింది. దీంతో పాటే ప్రాజెక్టు కింద చేసిన వ్యయం, ఆ పనుల వివరాలు తమకు అందించాలంటూ లేఖలు రాసింది. ఆ అధికారం మీకెక్కడిదంటున్న తెలంగాణ ఇలా డీపీఆర్‌ల పరిశీలన పేరుతో బోర్డు సంధిస్తున్న ప్రశ్నలు, కోరుతున్న వివరణలపై తెలంగాణ కస్సుమంటోంది. లేని అధికారాలను తమపై ప్రయోగిస్తోందని మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డీ) ప్రకారం.. కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులు అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశాలను మాత్రమే బోర్డులు పరిశీలించాల్సి ఉంటుందని, అంతకుమించి అధికారాలేవీ బోర్డులకు లేవంటూ తెలంగాణ ఇటీవల రాసిన లేఖలో తెలిపింది. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయాలకు సంబంధించి పరిశీలన చేసి వివరణలు కోరే అధికారం బోర్డులకు ఉండదని, దీనిపై సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు పరిశీలన చేస్తాయని స్పష్టం చేసింది. లేని అధికారాలతో హద్దుమీరి అతిగా వ్యవహరించొద్దంటూ కాస్త ఘాటుగా స్పందించింది. అనవసర జాప్యం చేయకుండా ప్రాజెక్టుల డీపీఆర్‌లను తక్షణమే సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని కోరింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని బోర్డు మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం హైడ్రాలజీ, వ్యయాలపై ఇటీవల మళ్లీ లేఖలు రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నట్లు కనబడుతోంది. ఒకవేళ బోర్డు ఇదే వైఖరి కొనసాగిస్తే తెలంగాణ దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని ఇరిగేషన్ వర్గాలు అంటున్నాయి. -
డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డీపీఆర్‌ల పరిశీలనల పేరిట అనవసర కాలయాపన చేస్తోందని గోదావరి బోర్డు తీరును తప్పుపట్టింది. పరిధికి మించి వ్యవహరిం చడం మాని డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి పంపాలని కోరింది. ఈ మేరకు గురువారం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, గోదావరి బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని క్లాజ్ 85(8)(డి) ప్రకారం కృష్ణా, గోదావరిలో చేపట్టే కొత్త ప్రాజెక్టులతో అవతలి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాలను మాత్రమే పరిశీలన చేయాల్సి ఉంటుందని, ట్రిబ్యునల్లు తమ అవార్డులో పేర్కొన్న నీటి లభ్యతకు నష్టం కలిగించే అంశాలపైనే తమ పరిశీలనలు తెలపాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాకాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రిమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నారని ఆక్షేపించారు. హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయ అంచనాలకు సంబంధించి పరిశీలనకు కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దృష్ట్యా క్లాజ్ 85(8)(డి)లో పేర్కొన్న అంశాలకే బోర్డు పరిమితం కావాలని సూచించారు. -
భారీగా పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అంచనా వ్యయం భారీగా పెరగనుంది. రీడిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకునే ప్రతిపాదనకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టిన నేపథ్యంలో దీని వ్యయం లక్ష కోట్లను దాటనుంది. బుధవారం జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో, గురువారం ఢిల్లీలో కేంద్ర జల సంఘానికి సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో అదనపు టీఎంసీ వ్యయాన్ని రూ.30,435.97 కోట్లుగా ప్రభుత్వం చూపింది. గతంలో రెండు టీఎంసీలు తీసుకునేలా సమర్పించిన మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాజెక్టు వ్యయాన్ని కలిపితే మొత్తం వ్యయం దాదాపు రూ.1.11 లక్షల కోట్లకు చేరుతోంది. మార్పుల కొద్దీ పెరిగిన వ్యయం ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి ముందు 2006–07లో ప్రాజెక్టు వాస్తవ అంచనా వ్యయం రూ.17,875 కోట్లుగా ఉంది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టును పూర్తిగా రీ డిజైన్ చేసి 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, మరో 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా 18 రిజర్వాయర్ల సామరŠాధ్యన్ని 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు చేరినట్లు కేంద్రానికి సమర్పించిన తొలి డీపీఆర్‌లో సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 2015–16 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లతో తయారు చేసిన ఆ అంచనాలను ఇటీవల సవరించారు. పెరిగిన స్టీలు, సిమెంట్, ఇంధన ధరలతో పాటు జీఎస్టీలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ వ్యయాన్ని రూ.88,557.44 కోట్లకు పెంచారు. అయితే ఇప్పటివరకు మొదటి డీపీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే సామరŠాధ్యన్ని 3 టీఎంసీలకు పెంచేలా పనులు చేపట్టారు. ఈ అదనపు టీఎంసీకి రూ.30,435.97 కోట్ల వ్యయం అవుతోంది. ఒక్కో లింకులో ఇలా... లింక్–1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనులకు రూ.4,227 కోట్లు, లింక్–2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.11,806 కోట్లు, లింక్–4లో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి వరకు రూ.4,412కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న వ్యయం, ప్రస్తుతం సమర్పించిన డీపీఆర్ వ్యయాలు కలిపితే మొత్తం వ్యయం రూ.1,10,625.97 కోట్లకు చేరుతోంది. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల ఖర్చు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఇప్పటివరకు సుమారు రూ.65 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల ద్వారానే రూ.45 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండటం, దీనికి అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచేందుకే అదనపు టీఎంసీ పనులు చేపట్టామని డీపీఆర్‌లో పేర్కొన్నారు. మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న మేరకు మేడిగడ్డ నుంచి మళ్లించుకునే 195 టీఎంసీలు, ఎల్లంపల్లి వద్ద లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భ జలాల ద్వారా లభ్యతగా ఉండే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తం 240 టీఎంసీల్లోనే అదనపు టీఎంసీ నీటి వినియోగం ఉంటుందని, అదనపు నీటి వినియోగం చేయబోమని వెల్లడించారు. -
డీపీఆర్‌లపై కదలిక
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని, వాటికి కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని అటు కేంద్రం, ఇటు బోర్డులు చెబుతున్న నేపథ్యంలో డీపీఆర్‌లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించింది. మూడు రోజుల కింద ఇంజనీర్లతో ç సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. డీపీఆర్‌ల తయారీపై దృష్టిపెట్టి అనుమతులు తెచ్చుకునే పనిని ఆరంభించాలని సూచించారు. దీంతో 10 ప్రధాన ప్రాజెక్టుల డీపీఆర్‌లపై ఇరిగేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాన ప్రాజెక్టులు టార్గెట్... కృష్ణా, గోదావరి నదీ బేసిన్లో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు మొదలైన నాటి నుంచే కేంద్ర జలశక్తి శాఖ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, అనుమతుల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పలుమార్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రాగా డీపీఆర్‌లు ఇచ్చేందుకు తెలంగాణ సుముఖత తెలిపింది. ఇంతవరకు సమర్పించలేదు. కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లోనూ కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ ఎత్తిపోతలు, జీఎల్ఐఎస్ ఫేజ్–3, తుపాకులగూడెం ప్రాజెక్టు, రామప్ప సరç స్సు నుంచి పాకాల లేక్‌కు నీటి మళ్లింపు, పాల మూరు–రంగారెడ్డి, డిండి, మోడికుంటవాగు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం అనుమతులు లేవని పేర్కొంటూ.. ప్రాజెక్టులకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలమూరు–రంగారెడ్డికి సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను మొదలు పెట్టించారు. మిగతా ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను సైతం మొదలుపెట్టేలా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని, వాటిని కేంద్రానికి పంపి అనుమతులు పొందాలని సూచించారు. దీంతో ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ శుక్రవారం జలసౌధలో ప్రాజెక్టుల ఈఎన్సీలు, సీఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీపీఆర్‌ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచాల్సిన అంశాలు, సేకరించాల్సిన వివరాలు తదితరాలపై మార్గదర్శనం చేశారు. శనివారం నుంచే డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.