drinking water problems
-
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్‌లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్‌లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నీటి ఎద్దడి నివారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘కరీంనగర్ చొప్పదండి మునిసిపాలిటీలో గత కొద్ది రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. పట్టణంలోని కొన్ని వార్డులకు తాగునీటిని అందించలేక మునిసిపల్ అధికారులు సతమతమవుతున్నారు. ఐదు కిలోమీటర్ల దూరంలో గాయత్రి పంప్ హౌజ్ , పక్కనుంచే ఎస్ఆర్ఎస్పీ కాలువలు పోతున్నా ఈ మునిసిపాలిటీకి సరైన నీటి సదుపాయం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నీరు కూడా రావడం లేదు. ‘జగిత్యాల జిల్లా రాయికల్ మునిసిపాలిటీలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య ఎక్కువైంది. ఎస్ఆర్ఎస్పీ నీరు ఉన్నప్పటికీ మూడు వార్డులకు సరిపడా నీళ్లను మునిసిపాలిటీ వాళ్లు అందించలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వార్డులోనే ఓ బావి తవ్వించి ఆ నీటిని మిషన్‌భగీరథ కోసం కట్టిన ట్యాంకుల్లోకి పంపించి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు’ ‘కరీంనగర్ కార్పొరేషన్లో గతంలో ప్రతిరోజూ ఇంటింటికీ తాగునీటిని అందించగా, తగ్గుతున్న దిగువ మానేరు నీటిమట్టంతో ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరపడమే కష్టంగా మారిందని మునిసిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగజ్‌నగర్ మునిసిపాలిటీలో కరెంటు సమస్య కారణంగా అధికారులు ఇంటింటికీ తాగునీరు అందించలేకపోతున్నారు’ మంగళవారం సీడీఎంఏ కార్యాలయంలో మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై జరిగిన అధికారుల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాల్లో కొన్ని ఇవి. జలాశయాల్లో సరిపడినంతగా నీటి నిల్వలు లేకపోవడం, పెరిగిన సూర్యతాపానికి జలాశయాల్లోని నీరు కూడా క్రమంగా తగ్గుతుందనే భయంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రాష్ట్రంలో నీటి సమస్య ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ నేపథ్యంలో సీడీఎంఏ దివ్య 140 పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారుల నియామకం రాష్ట్రంలో మునిసిపాలిటీలతో పాటు గ్రామాల్లో నీటి నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నీటి అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలను విభజించి, పది మంది ఐఏఎస్ అధికారులను ఇన్చార్జులుగా నియమించారు. రానున్న రెండు నెలల పాటు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే... ఆదిలాబాద్, నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్ , కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల – కృష్ణ ఆదిత్య , కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు – ఆర్ వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట – అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి – శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజ్గిరి – విజయేంద్ర , మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్ – శృతి ఓజా, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ – గోపి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట – భారతి కొలిగేరి , ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం– సురేంద్రమోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది లేదనే అంచనా హైదరాబాద్, శివారు ప్రాంతాలకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలిస్తున్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు జలాశయాలతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి కూడా హైదరాబాద్ వాటర్‌బోర్డు తీసుకుంటోంది. జలాశయాల నుంచి ప్రతిరోజూ 2,559 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటిని హైదరాబాద్ నగర వాసుల కోసం వినియోగిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ కోర్‌సిటీకి (హైదరాబాద్ జిల్లా) 1082.62 ఎంఎల్డీ, శివారు సర్కిల్స్ (50 డివిజన్లు)కు 1,049. 58 ఎంఎల్డీ, ఓఆర్ఆర్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు 277.21 ఎంఎల్డీ, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. సింగూరు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో అవసరమైన మేర నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది 2,270 ఎంఎల్డీ నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయగా, ప్రస్తుతం 2,409.53 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే 139.53 ఎల్ఎండీ అదనంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ట్యాంకర్ల డిమాండ్ అక్కడే హైదరాబాద్ నగరానికి పశ్చిమాన ఉన్న మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్పల్లి, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 644 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, మంగళవారం 6,593 ట్రిప్పుల్లో నీటి సరఫరా చేశాయి. భూగర్బ జలాలు తగ్గడం వల్లనే ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందని వాటర్‌బోర్డు చెబుతోంది. -
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
రేగళ్ల గుంపునకు తాగునీటి ట్యాంకర్
అశ్వారావుపేట: రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్యపై సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘గొంతెండుతోంది..’ శీర్షికన ప్రచురితౖ మెన కథనానికి అధికారులు స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ పరిధి రేగళ్ల గుంపులో తాగునీటి సమస్య ‘ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం’ శీర్షికన ఫొటో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్ నివేదిక సమర్పించాలని దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన అశ్వారావుపేట ఎంపీడీఓ శ్రీనివాస్‌తో మాట్లాడి బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని సూచించగా, మంగళవారం రేగళ్ల గుంపునకు ట్యాంకర్ పంపించారు. -
గొంతెండుతోంది!
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది. గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది. మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్వర్క్ మా‘నీరు’ తగ్గుతోంది కరీంనగర్‌తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్‌లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాహం కోసం.. దారి పట్టారు గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్‌ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి. ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను కౌన్సిలర్లు నిలదీయడంతో కౌన్సిల్ దద్దరిల్లింది. సోమవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. చాలా వార్డుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీరు సరిపోవడం లేదని, వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతున్నాయని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వర్షాకాలం ఆరంభమైనందున పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎజెండాలోని వివిధ అంశాలపై వాడివేడీగా చర్చ సాగింది. ముందుగా 32వ వార్డు కౌన్సిలర్ సాదతుల్లా మాట్లాడుతూ చాలా గల్లీలలో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో హైమాస్ట్ లైట్లు సరిగా పనిచేయడం లేదన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందని రసాయన మందులు పిచికారీ చేయించాలన్నారు. ఇవే విషయాలను 19వ వార్డు కౌన్సిలర్ షబ్బీర్ అహ్మద్ ప్రస్తావించారు. అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని ఎక్స్పో–ప్లాజా తొలగించినందున అక్కడి సామగ్రిని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలన్నారు. 24వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం రామయ్యబౌలిలో వర్షపు నీరు నిల్వకుండా చూడాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అంజయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు పనులు అన్ని మహిళా సంఘాల గ్రూపులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తికాకుండానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు. అప్పన్నపల్లిలో రెండో ఆర్ఓబీ ప్రారంభమైనందున కింది భాగంలో అటు, ఇటువైపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అంతర్గత రోడ్లు దెబ్బ తిన్నాయని 21, 37వ వార్డు కౌన్సిలర్లు అనంతరెడ్డి, స్వప్న సమావేశం దృష్టికి తెచ్చారు. కొందరు ఇంటి యజమానులు రోడ్డును ఆనుకొని ర్యాంపులు నిర్మించడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని తొలగించాలని 13, 21వ వార్డు కౌన్సిలర్లు లక్ష్మీదేవి, అనంతరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దనాలాలలో మురుగును ఎప్పటికప్పుడు తొలగించాలని 33, 34వ వార్డు కౌన్సిలర్లు మునీరుద్దీన్, నర్సింహులు కోరారు. కొందరు వ్యక్తులు వాహనాల్లో కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో అర్ధరాత్రి చికెన్ వ్యర్థ పదార్థాలను పడేసిపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు కౌన్సిలర్లు సంధ్య, శ్రీనివాసులు, ముస్కాన్ సుల్తానా, రామాంజనేయులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.. – చైర్మన్, కమిషనర్ సభ్యులు ప్రస్తావించిన ఈ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ బదులిచ్చారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు అందరూ సహకరించాలన్నారు. ఇదిలా ఉండగా ఎజెండాలోని కొన్ని పద్దుల్లో తప్పులు దొర్లడంతో అధికారులపై చైర్మన్ మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ తాటి గణేష్‌కుమార్, టీపీఓ లక్ష్మీపతి, డిప్యూటీ ఈఈ బెంజిమన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్‌రెడ్డి, గురులింగం, ఏఓ ఉమాకాంత్, ఆర్ఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగమే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇతరుల చేతుల్లోకి వెళ్తే ఆగం అవుతుందని, ఉద్యమనేత కేసీఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సాగునీరు, తాగునీరు వంటి సమస్యలకు కేసీఆర్ హయాంలోనే పరిష్కారం లభించిందని, దీన్ని అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా రూ.2,653 కోట్లతో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. తెలంగాణ రాకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగేదా? తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. సింగూరు ప్రాజెక్టు కోసం మెదక్ రైతులు భూములు కోల్పోతే నీళ్లు హైదరాబాద్‌కు వెళ్లాయన్నారు. సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకే దక్కాలని సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీర్చారని వివరించారు. రైతులతో ముచ్చట...: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో ముచ్చటించారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి సిద్దిపేటలో రంగనాయసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నది లేకుండా ఒక ప్రాజెక్ట్ ఉందంటే అది మానవ నిర్మితమైన మల్లన్నసాగర్ ఒక్కటే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఢిల్లీలో పర్యావరణ అనుమతుల కోసం ఆఫీసుల చుట్టూ ఓపికగా తిరిగిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. -
దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్
దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్డబ్ల్యూఎస్ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా: మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్‌లో 1600 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. కేటాయింపు ప్రణాళికలు ఇలా.. ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ కాలువ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్, ఫుట్ బ్రిడ్జి, ఇంటేక్ వెల్ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్లకు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్పీ డీసీఎల్, ప్రైజ్ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్ స్టోరేజ్ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. వీధి పంపులకు చెక్: ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్ లైనులు బాగున్న చోట అవే లైన్లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్ లైన్లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. పరోక్షంగా పట్టణ అభివృద్ధి: తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. శిథిలావస్థలో నెదర్లాండ్ చెరువు 35 సంవత్సరాల క్రితం సాగర్ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు. -
కాలమేదైనా కాలినడకే..
ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోని ‘గోవెన’గూడేలు తాగునీటికి నీటి చెలిమలే ఆధారం.. కరెంటు లేదు.. రోడ్డు లేదు.. బడి లేక పిల్లలు చదువులకు దూరం తిర్యాణి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యా ణి మండలం గోవెన గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ పంచాయతీ పరిధిలో ఐదు గూడేలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి గోవెనగా పిలుస్తారు. 361 మంది జనాభా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ గూడేలు ఉనికిలో ఉన్నా.. ఇప్పటివరకు ఎలాంటి మౌలిక సదుపాయాలులేవు. కరెంటు సౌకర్యం లేదు. నాయకపుగూడ, కుర్సిగూడ గ్రామాలైతే అత్యంత వెనుకబడి ఉన్నాయి. పదేళ్ల క్రితం ఐటీడీఏ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా.. నిర్వహణ లేక ఐదేళ్ల క్రితం చెడిపోయాయి. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేసిన నాలుగు సోలార్ లైట్లు మాత్రమే ప్రస్తుతం వీరికి వెలుగునిస్తున్నాయి. ఈ గూడేలకు తాగునీటి సౌకర్యం లేదు. కనీసం ఒక్క చేతిపంపు కూడా వేయలేదు. మిషన్ భగీరథ ట్యాంకులు అలంకారప్రాయంగా మిగిలాయి. నాయకపుగూడ వాసులు సమీపంలోని వాగులో చెలిమ తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వానాకాలంలో వాగు లో ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు చెలిమ నీరు కూడా దొరకదు. మిగతా నాలుగు గూ డేల వారు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కాలినడకనే ప్రయాణం ఐదు గూడేల ప్రజలు ఏ అవసరమున్నా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. ప్రతినెలా రేషన్, పింఛన్, ఆస్పత్రి, సామగ్రి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు వాగులను దాటుకుంటూ.. ఐదు కిలోమీటర్లు నడిచి ఆసిఫాబాద్ మండలం బలాన్పూర్కు చేరుకుంటారు. లేదా ఆరు కిలోమీటర్లు నడిచి లింగాపూర్ మండలం రాఘవపూర్‌కు వెళ్లి.. అక్కడి నుంచి వాహనాల ద్వారా తిర్యాణికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో పోలీసులు బలాన్పూర్ మీదుగా గోవెనకు మట్టిరోడ్డు నిర్మించినా.. వరదలతో నామరూపాల్లేకుండా పోయింది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లడానికి 108 వాహనం రాలేని పరిస్థితి. పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. నాయకపుగూడలో తలపెట్టిన పాఠశాల భవనం నేటికి అసంపూర్తిగానే ఉంది. ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మాగోస ఎవరికీ రావొద్దు: ముత్తినేని రాజమ్మ, నాయకపుగూడ మాకు సర్కారు నుంచి రేషన్ బియ్యం తప్ప ఎలాంటి లబ్ధి జరగడం లేదు. తాగడానికి నీళ్లు, కరెంటు, రోడ్డు లేవు. ఎవరూ పట్టించుకోవడం లేదు. చెలిమ నీళ్లే తాగుతున్నం. ఆపద వస్తే కిలోమీటర్ల దూరం నడిచి ఆస్పత్రులకు పోతున్నాం. కరెంటు కోసం అధికారులను అడిగితే ఫారెస్టు అనుమతులు రావట్లేదని చెప్తున్నారు. మా గోస ఎవరికీ రావొద్దు. చేతి పంపులైనా వేయాలె.. మా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేదు. పిల్లలకు పౌష్టికాహరం కోసం ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. కనీసం తాగునీటి కోసం గ్రామంలో చేతి పంపు అయినా వేయాలి. రోడ్డు సౌకర్యం కల్పించాలి. – కొడప లచ్చుబాయి, గోండుగూడ ఈ ఫొటోలో కంకర రాళ్ల కుప్పలా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? ఓ గ్రామానికి వెళ్లే రోడ్డు! ఇది నిజమే.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన పంచాయతీకి వెళ్లేందుకు దారి ఇదే. రాత్రిపగలు.. ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా.. ఈ దారి మీదుగా కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. -
గిరిజన ఆవాసాల్లో తాగునీటి సమస్యలుండొద్దు
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆవాసాల్లో అసలు తాగునీటి సమస్య తలెత్తొద్దని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో 99 శాతం గ్రామాలు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. మిగతా ఒక్క శాతాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. మిగిలిపోయిన 105 గ్రామాలన్నీ గిరిజన ఆవాసాలే అని తెలిపారు. ఆయా గ్రామాలు సుదూరంగా ఉండడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం ఇతర మౌలిక వసతుల సమస్యతో మిషన్ భగీరథ పనులు పూర్తికాలేదన్నారు. అత్యవసర అవసరాల కోసం ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కలి్పంచాలని మంత్రి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లేడుబండ రిజర్వాయర్‌కు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 2.41 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.609.14 కోట్ల అంచనా వ్యయంతో ఎల్ఎస్(లంప్సమ్–ఓపెన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. షెడ్యూళ్లు దాఖలుకు అక్టోబర్ 7ను తుది గడువుగా నిర్ణయించింది. అదే రోజున నిర్వహించే ప్రీ–బిడ్ సమావేశంలో షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూపంలో రూ.6.09 కోట్ల చొప్పున తీసిన డీడీలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎస్ఈ–2కు అందించాలి. అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థ కోట్‌చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదేరోజు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో అతి తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపుతారు. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా.. హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా జిల్లేడుబండ రిజర్వాయర్‌ను ప్రభుత్వం చేపట్టింది. హంద్రీ– నీవా ప్రధాన కాలువ 377.1 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి.. అక్కడి నుంచి తవ్వే కాలువ ద్వారా కొత్తగా నిర్మించే జిల్లేడుబండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద తవ్వే పిల్ల కాలువల ద్వారా బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. -
3 ఏళ్లు.. రూ.15,989 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ప్రాధాన్యత క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించింది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తొలి విడతలో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు ఇతర తాగునీటి వసతి సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో రూ.15,989 కోట్ల ఖర్చు చేసేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.3,720 కోట్లు, 2022–23లో రూ.8,089 కోట్లు, 2023–24లో రూ.4,180 కోట్లు వెచ్చించనున్నారు. పనిచేయని మంచినీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావడానికి, జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి మొదటి విడతలో రూ.3,090 కోట్లు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇటీవల పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వసతుల కల్పన ప్రాధాన్యత అంశంగా నిర్ధారించారు. ఇప్పటికే పనులు మొదలైన 3 జిల్లాలకు తోడు.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా డోన్, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంతాల్లో రూ.684 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు ప్రాంతాలతో కూడిన పశ్చిమ ప్రాంతంతో పాటు చిత్తూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రొయ్యల చెరువులు, సముద్రజలాల ఉప్పునీటితో ఇబ్బందులు పడుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలో రూ.7,840 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీలోని 13 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మంచినీటి వసతుల కల్పనకు రూ.3,250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
పట్టణాల్లో నీటి ఎద్దడికి రూ.8,217 కోట్లతో చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం అమృత్, ఏఐఐబీ నిధులు, ప్లాన్ గ్రాంట్ నిధులు.. మొత్తం మీద రూ.8,216.95 కోట్లను వెచ్చిస్తోంది రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు కలిపి 125 ఉండగా.. 59 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 34 పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా చేయగలుగుతున్నారు. 13 పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టింది. నగరాలు, పట్టణాల్లో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల (ఎంఎల్) తాగునీరు అవసరం కాగా ప్రస్తుత తాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం రోజుకు 1,678 మిలియన్ లీటర్లు. 72 మిలియన్ లీటర్ల నీటిని ఇతర మార్గాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 2035 నాటికి రోజుకు 2,700 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని పురపాలకశాఖ అంచనా వేసింది. అంటే ప్రస్తుత వ్యవస్థీకృత సామర్థ్యం కంటే 1,022 మిలియన్ లీటర్లు ఎక్కువ అవసరం. ఆ మేరకు వ్యవస్థీకృత సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 32 మునిసిపాలిటీల్లో ‘అమృత్’ధారలు లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో అమృత్ పథకం కింద తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1,056.62 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.436.97 కోట్లు, మునిసిపాలిటీల వాటా రూ.2,088.55 కోట్లు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.180.77 కోట్లు సమకూరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,762.91 కోట్లలో తాగునీటి సరఫరాకు రూ.2,526.33 కోట్లు వెచ్చించనున్నారు. ఆ 32 మునిసిపాలిటీల్లో అదనంగా రోజుకు 307 మిలియన్ లీటర్ల తాగునీరు అందించనున్నారు. దీనికోసం కొత్తగా 4,36,707 ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇస్తారు. ఏఐఐబీ నిధులతో 50 మునిసిపాలిటీలకు.. ఆసియన్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో మరో 50 మునిసిపాలిటీల్లో ప్రాజెక్టులు చేపట్టారు. మొత్తం 33 లక్షల జనాభాకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని మొత్తం వ్యయం రూ.5,350.62 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.3,487.67 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,494.72 కోట్లు కాగా మునిసిపాలిటీల వాటా రూ.368.23 కోట్లు. మొదటిదశ కింద ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, రెండో దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడతారు. ప్లాన్ గ్రాంట్ నిధులతో రాయచోటిలో రోజుకు 35 మిలియన్ లీటర్ల తాగునీరు అందించడంతోపాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.340 కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. -
భద్రాద్రిలో మొదలైన త్రాగునీటి సమస్యలు
-
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సాక్షి, కామారెడ్డి : జిల్లాలోని భిక్కనూరు మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని నినాదాలతో హోరెత్తించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన మహిళలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా -
ముందస్తు ప్రణాళికతో మంచినీటి ఎద్దడికి చెక్
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఇబ్బందుల మధ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 2,837 గ్రామాలకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జనవరిలోనే రూ. 204.75 కోట్లతో గ్రామీణ మంచినీటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► ఈ వేసవిలో 2,055 గ్రామాల్లో పశువుల అవసరాలకు కూడా నీటి సరఫరా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ► 347 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని, ఆ నీటిని సమీప గ్రామాల్లోని మంచినీటి పథకాలకు అనుసంధానం చేశారు. ► సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో, గ్రామాల్లోని బావుల్లో పూడిక తీత వంటి అవసరాలకు రూ. 5.80 కోట్లు కేటాయింపు. ► మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ సభ్యులుగా కమిటీలను ప్రభుత్వం నియమించింది. ► భూగర్భ జలాలు కలుషితమైన చోట వైఎస్సార్ సుజల పథకంలో మంచినీటి ప్లాంట్ల ద్వారా క్యాన్ వాటర్ సరఫరాకు రూ. 46.56 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా రూ. 55.86 కోట్లతో సోలార్ స్కీంల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. -
‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించే మూడు ఎత్తిపోతల పథకాలకు రూ.4.27 కోట్లతో తొలి దశ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. గత సెప్టెంబర్ 2వ తేదీన పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పీఏడీఏ) పరిధిలో చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మూడు ఎత్తిపోతల పథకాలకు పరిపాలనా అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్ సిద్ధమయ్యాక పనులు చేపట్టేందుకు రెండో దశ పరిపాలన అనుమతి మంజూరవుతుంది. వీటి ఆధారంగా టెండర్లు పిలుస్తారు. 1,050 క్యూసెక్కుల ఎత్తిపోత ఇలా.. గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 1,050 క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి 350 క్యూసెక్కులను ఎత్తిపోసి చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులను నింపుతారు. కాలేటివాగు రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి హంద్రీ–నీవా ప్రధాన కాలువలో 473 కి.మీ వద్దకు తరలిస్తారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను నింపుతారు. ఈ పనుల డీపీఆర్ తయారీకి రూ.3.58 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. వేముల, వేంపల్లిలో 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 240 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి అలవపాడు చెరువు నింపుతారు. అక్కడి నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 52 కి.మీ. వద్ద ఎత్తిపోసి వేముల, వేంపల్లి మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీని డీపీఆర్ తయారీకి రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.57 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి యర్రబల్లి చెరువును నింపడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని లింగాల, పులివెందుల మండలాల్లో చెరువులు కూడా నింపుతారు. ఈ పనుల డీపీఆర్‌కు రూ.51 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నీటి కష్టాల నుంచి విముక్తి.. వైఎస్సార్ జిల్లాలో పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచినా వర్షాభావంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పులివెందుల, లింగాల మండలాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు గాలేరు–నగరి జలాలను వినియోగించుకునే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర వేయడంతో నీటి కష్టాలు తీరనున్నాయి. -
వాటర్‌గ్రిడ్‌తో నీటి సమస్యలకు చెక్
పులివెందుల: రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీరతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో నియోజకవర్గ అభివృద్ధి పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పులివెందులను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రతి మండలంలో గోడౌన్లు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎం సహాయ నిధి కింద 9 మందికి మంజూరైన రూ.20 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్–2019లో కడపకు చెందిన ఆర్.కె.సిద్ధార్థ రెడ్డి, పి.వి.సాయిశ్రీనివాస్‌లు బంగారు పతకాలు సాధించిన సందర్భంగా వారిని అభినందించారు. -
కర్నూలుకు కన్నీరు!
కర్నూలు (టౌన్)/ఓల్డ్‌సిటీ: కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వారం రోజుల్లో ప్రత్యామ్నాయం చూపకపోతే తీవ్ర కష్టాలు తప్పవు. ఇప్పుడే నగరంలోని శివారు కాలనీలకు వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా ట్యాంకర్ల ద్వారానే. చాలాప్రాంతాల్లో కుళాయిలు బంద్ అయ్యాయి. నీటి కష్టాల వల్ల వ్యాపార సముదాయాలు, హోటళ్లను సైతం మూసేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ హోటల్ మూత పడింది. డబ్బు పెట్టినా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో హోటల్‌ను తాత్కాలికంగా మూసేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ ధరకు రెక్కలొచ్చాయి. క్యాన్ వాటర్ రూ.30–40 మధ్య విక్రయిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరో వారం రోజుల్లో పూర్తిగా ఖాళీ కానుంది.ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. సుంకేసుల, జీడీపీ వెలవెల నగర తాగునీటి అవసరాలకు ప్రధానమైన సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) ఇప్పటికే డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటి నుంచి నెల క్రితమే నీటి సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీటిని మాత్రమే నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇది కూడా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫిల్టర్ బెడ్‌కు కూడా సరిగా నీరందని పరిస్థితి. ఇందులో ప్రస్తుతమున్న నీటి మట్టం చూస్తే వారంలోపే పరిస్థితులు మరింత దిగజారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 2005వ సంవత్సరంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 14 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీటినిల్వ తగ్గిపోయింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొనకపోతే కర్నూలు వాసులకు 2001 సంవత్సరం నాటి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ఇబ్బందులు వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండేళ్లుగా కర్నూలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వేసవిలో సుంకేసుల డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని తరలించారు. అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సరఫరా చేసి నగర వాసులను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఈ ఏడాది కూడా వర్షాలు లేక నగరవాసులకు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిమాండ్‌కు తగినట్లు తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ నగర ప్రజలకు 83 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతం నగరపాలక సంస్థ 69 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. కాలనీల్లో కటకట కర్నూలు నగరంలోని పలు కాలనీల్లో ఇప్పటికే నీటి సమస్య ఉధృతరూపం దాల్చింది. శివారు కాలనీలైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్‌పురం, బాలాజీ నగర్, మమతానగర్, సమతానగర్, సోనియాగాంధీ నగర్ వంటి అనేక కాలనీలలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాతబస్తీ నుంచి కొత్త కాలనీలు, కల్లూరు కాలనీలలో నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. పాతబస్తీలోని చిత్తారిగేరికి మూడు రోజులు, పెద్దపడఖానాకు ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదు. రొటేషన్ ప్రకారం పాతబస్తీలోని పలు కాలనీలకు మంగళవారం నీళ్లు రావాలి. కానీ ట్యాంకులోకే నీళ్లు ఎక్కలేదంటూ లైన్మెన్లు చేతులెత్తేశారు. అధికారులు నీటి ట్యాంకర్లు పంపినా అందరికీ అందడంలేదు. కర్నూలు, కల్లూరు ఏరియాలో ఉన్న మొత్తం 23 ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనూ పూర్తి స్థాయిలో నీటిని నింపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నగర పాలక సంస్థకు చెందిన 8 ట్యాంకర్లతో పాటు 23 ప్రైవేటు ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ఫిర్యాదులు వస్తున్న కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తే తప్ప వేసవి కష్టాలు తీరవు. ఎస్ఎస్ ట్యాంకులో నీరు 7 రోజులకు సరిపోతుంది సుంకేసుల, జీడీపీ నుంచి నెల క్రితమే నీళ్లు బంద్ అయ్యాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి అందిస్తున్నాం. ప్రస్తుతం ఈ ట్యాంకులో 301.72 లక్షల లీటర్ల నీరు ఉంది. ఇది వారం రోజులకు మాత్రమే సరిపడుతుంది. ఆ తరువాత ఇబ్బందిగా ఉంటుంది. ఎల్లెల్సీ నుంచి నీటిని వదిలినట్లు సమాచారం ఉంది. – వేణుగోపాల్, నగరపాలక ఎస్ఈ 5 రోజులుగా రావడం లేదు పెద్దపడఖానాలోని పాఠశాల ప్రాంతానికి నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. శుక్రవారం నీళ్లు పట్టుకున్నాం. ఆదివారం కొందరికే వచ్చాయి. తిరిగి మంగళవారం సరఫరా చేయాలి. కానీ బిందె నీళ్లు కూడా రాలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? – అయ్యమ్మ -
లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల నీటిగోస తీర్చడానికి గోదావరి జలాలను తరలించే పనులు వెంటనే చేపట్టకపోతే వచ్చే నెల 10న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ, అనంతరం ధర్నా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరుకు ప్రధాన వనరులైన సింగూరు, మంజీరా డ్యాంలు ఎండిపోవడంతో నీటి కటకట ఏర్పడిందన్నారు. దీంతో ప్రజలు కనీసం తాగునీటికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి, సదా శివపేట మున్సిపాలిటీలతో పాటుగా నియోజకవర్గంలోని మండలాల్లో ఏర్పడిన నీటి కొరతను తీర్చాలని గత రెండు, మూడు నెలలుగా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు సాగునీరు లేక, ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అందువల్ల తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పటాన్చెరు వరకు సరఫరా అవుతున్న గోదావరి జలాలను సంగారెడ్డి వరకు తరలిస్తామని ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం, అధికారులు స్పష్ట ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా ప్రకటన వెలువడిన వెంటనే పనులు కూడా ప్రారంభం కావాలన్నారు. లేకపోతే ఆగస్టు 10వ తేదీన స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో లక్షమంది ప్రజలతో మొదటగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగుతున్నానని వెల్లడించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తనకు రాజకీయాల కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని తెలిపారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇతర నియోజకవర్గాలకు తరలించి సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలకు టీఆర్ఎస్ నేతలే బాధ్యులన్నారు. సంగారెడ్డి సమీపంలోని మహబూబ్‌సాగర్ చెరువును కాళేళ్వరం నీటితో నింపుతానని గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్న హరీష్‌రావు స్వయంగా ప్రకటించారనే విషయాన్ని గుర్తుచేశారు. 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి తరలిస్తామన్న టీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలు తేవడం సాధ్యమవుతుందనే భావిస్తున్నానని చెప్పారు. కర్ణాటకలో వరదలు వస్తేనే సింగూరు, మంజీరా నిండే దౌర్భాగ్య పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా... ఈ నెల 30లోగా నీటి తరలింపుపై ప్రకటన చేసి పనులు ప్రారంభించండి...లేదా వచ్చే నెల 10న లక్ష మందితో ధర్నా చేస్తానని తెలిపారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
‘పానీ’ పాట్లు
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో సమస్య మరింతగా జఠిలమైంది. దీంతో స్థానికులు వీధుల్లోకి వస్తున్న ట్యాంకర్లను నిలిపివేస్తూ.. తరచూ మన్సిపల్ కార్యాలయానికి తరలివస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. రామాయంపేట గత ఏడాది మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణ జనాభా 17,850 వరకు ఉంటుంది. మున్సిపల్ పరిధిలో రామాయంపేటతోపాటు గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలను చేర్చారు. దీని పరిధిలో 60 బోర్లు, మోటార్లద్వారా నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణం పూర్తవడంతో అన్ని ఇళ్లకు తాగునీరు సరఫరా జరిగేది. దీంతో వేసవిలో పెద్దగా నీటి ఎద్దడి తలెత్తలేదు. నాలుగురోజులుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా పట్టణంలో సమస్య నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అవి అవసరాలకు సరిపోవడంలేదు. ఇంటికి రెండుమూడు బిందెలకన్నా ఎక్కువ రావడం లేదనే కోపంతో వార్డుల్లో ట్యాంకర్లను అడ్డుకుంటున్నారు. మంగళవారం ఏకంగా పట్టణంలోని నాలుగుచోట్ల స్థానికులు ఆందోళనలకు దిగారు. దుర్గమ్మ గల్లీ, సుభాష్‌నగర్‌లో రోడ్డుకడ్డంగా ఖాళీ డ్రమ్ములను ఉంచి ఆందోళనకు దిగగా, ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.బీసీ కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయాలనికి తరలివచ్చి ధర్నాకు దిగారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా అస్తవ్యస్తం.. పట్టణంలో ప్రతిరోజు పది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. చోటామోటా నాయకులు, గుర్తింపు ఉన్నవారికి ముందుగా డ్రమ్ముల్లో నీరు నింపుతున్నారని, చివరన ఉన్నవారికి నీరు దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ గల్లీలకు ఉదయం, సాయంత్రం సరఫరా జరిగితే పరిస్థితి కొంతమేర సద్దుమణిగేదని, అలా జరగడంలేదన్న ఆరోపణలున్నాయి. 60 మోటార్లకు ఆరుకూడా నీళ్లు పోయడం లేదు.. పట్టణంలో 60 బోర్లకు సంబంధించి మోటార్ల ద్వారా నీటి సరఫరా జరుగగా, ఇటీవల కాలంలో చాలావరకు బోర్లు ఎండిపోయాయి. ప్రస్తుతం ఆరు బోర్లు కూడా పనిచేయడం లేదు. సింగిల్‌ఫేజు మోటార్ల ద్వారా నాలుగైదు చోట్ల నీటి సరఫరా జరుగుతుండగా, అవి ఎంతమాత్రం సరిపోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 చేతి పంపుల్లో నీరులేక వట్టిపోయాయి. బీసీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న బోరులో కొద్దిగా నీరు వస్తుండగా, చాలామంది దూర ప్రాంతం నుంచి వచ్చి బారులు తీరి తీసుకెళ్తున్నారు. సమస్యను పరిష్కరించాలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగా చేయడం లేదు. వారికి తెలిసినోళ్లకు ఎక్కువ నీళ్లు పోస్తున్నారు. మాకు సరిగా పోస్తలేరు. ట్యాంకర్ల వెంట సార్లు ఉంటేనే కరెక్టుగా సరఫరా జరుగుతోంది. వెంటనే సమస్యను పరిష్కరించాలి.– దేవుని మల్లవ్వ, దుర్గమ్మ బస్తీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం ఈసారి వర్షాలు ఆలస్యం కావడం, బోర్లలో నీరు అడుగంటడంతో సమస్య తలెత్తింది. భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం మరింత సమస్యగా తయారైంది. పట్టణంలో నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన తీర్చడానికి కృషి చేస్తున్నాం. అవసరమైతే ట్యాంకర్ల సంఖ్యను పెంచడంతోపాటు ఇతర మార్గాలను అన్వేషిస్తాం. – రమేశ్, మున్సిపల్ కమిషనర్ ఖాళీ డ్రమ్ములతో నిరసన రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడిపై మంగళవారం స్థానికులు ఖాళీ డ్రమ్ములను రోడ్డుపై ఉంచి ఆందోళన నిర్వహించారు. అధికారులు సరిగా పట్టించుకోవడంలేదంటూ శ్రీరామా మెడికల్ దుకాణం వద్ద, సుభాష్‌నగర్‌లో కాలనీవాసులు నిరసన తెలిపారు. ముదిరాజ్‌గల్లీలో నీటి ట్యాంకర్‌ను అడ్డగించారు. బీసీ కాలనీవాసులు మున్సిపల్ మేనేజర్ శ్రీహరిరాజుకు తమ సమస్య మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.