exam fee
-
టెన్త్ ఫీజు రాయితీకి ని‘బంధనాలు’!
సాక్షి, సిటీబ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ అందడం లేదు. ఇందుకు ఏళ్ల కిందట రూపొందించిన నిబంధనలే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంపై తగిన మార్పుల కోసం రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించడం లేదని వారంటున్నారు. రాయితీ నిబంధనలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, నగర విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. రాయితీ పొందాలంటే.. ప్రస్తుతం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ నెల 28వ తేదీతో గడువు ముగియనుంది. విద్యార్థులంతా ఫీజులు చెల్లించే పనుల్లో నిమగ్నమయ్యారు. నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి పరీక్ష రుసుం కింద రూ.125 చెల్లించాలి. వంద శాతం రాయితీ పొందాలంటే విద్యార్థులు వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని సమరి్పంచాలి. హైదరాబాద్ నగరంతో సహా శివారు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 1.18 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటారని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. వీరి కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేల లోపు ఉంటేనే వంద శాతం ఫీజు రాయితీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ నిబంధన చాలా ఏళ్ల కిందట రూపొందించారు. ఇప్పుడు సగటున వార్షిక ఆదాయం రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విద్యారి్థకీ రాయితీ లభించడం లేదు. ఆదాయ పరిమితిని సవరిస్తేనే ఫలితం ఉంటుందని టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ ఇలా అపరాధ రుసుం లేకుండా గడువు: ఈ నెల 28 వరకు రూ.50 అపరాధ రుసుం: డిసెంబరు 2 రూ.200 అపరాధ రుసుం: డిసెంబరు 12 రూ.500 అపరాధ రుసుంతో: డిసెంబరు 21 వరకు.. -
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024–25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.500 లేట్ ఫీజుతో వచ్చేనెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.ఫీజును www.bse.ap.gov.in లో స్కూల్ లాగిన్‌లో చెల్లించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో నామినల్ రోల్స్ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్ జారీకి ముందు ఎడిట్ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్ దేవానందరెడ్డి వివరించారు. ఫీజు వివరాలు ఇలా..⇒ అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి రూ.125 ⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ.60⇒ నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300⇒ మైగ్రేషన్ సర్టిఫికెట్‌కు రూ.80 -
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్
సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి–2025లో పరీక్షలు రాయనున్న మొదటి రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఈ గడువు తర్వాత అవకాశం ఉండదని అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్‌కు సూచించామని తెలిపారు. 15 వరకు ప్రైవేటు విద్యార్థుల ఎన్రోల్ ఇంటర్ పరీక్షలు ప్రైవేటుగా రాయదలచిన విద్యార్థులకు అటెండెన్స్ మినహాయింపునిచ్చారు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ వరకు రూ.1500, రూ.500 పెనాల్టీతో నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పదో తరగతి పాసై ఏడాది పూర్తయిన వారు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండేళ్లు దాటిన వారు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చు. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు ఫిబ్రవరి 5
సాక్షి, హైదరాబాద్: మార్చిలో నిర్వహించే పదోతర గతి (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువు విధించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, ఆ తరువాత గడువు పొడిగించేది లేదని పేర్కొ న్నారు. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజర య్యేవారే ఆ తరువాత జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. కావున ఒకసారి ఫెయిలైన విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6లోగా ట్రెజరీలో జమచేయాలని, అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. -
పరీక్ష ఫీజు వసూలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి వెలువరించిన నోటిఫికేషన్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు పరీక్ష ఫీజు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. 2023, నవంబర్ 25న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజుగా రూ.450ని నిర్థారించింది. అయితే ఈ నోటిఫికేషన్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ జె.విప్లవ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. 1985, జూలై 1 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష/ఎంపిక కోసం పరీక్ష రుసుము చెల్లించకుండా మినహాయించారని పిటిషనర్ వాదించారు. ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుకు తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను జారీ చేసేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి గడువు పొడిగించింది. వాస్తవానికి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో 15 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ఇంటర్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ కోర్సులకు రూ.1240, సైన్స్ కోర్సులకు రూ.1440 ఆయా కళాశాలల్లో చెల్లించాలి. -
టెన్త్ విద్యార్థులకు యూడైస్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. యూడైస్‌లో పేరు లేకుంటే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతుండగా.. ఇప్పటికిప్పుడు ఈ నిబంధన తేవడం సరికాదని ఉపాధ్యాయులూ అంటున్నారు. యూడైస్ అప్డేట్లో క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించాలని సూచిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ మాత్రం ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటికి యూడైస్‌లో విద్యార్థులందరి పేర్లు చేర్చాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గడువు ముగిసే నాటికి దాదాపు 45 శాతం మంది విద్యార్థుల పేర్లు ఎక్కించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు 5 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత రికార్డు లేకుంటే అంతే... ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది, వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి ప్రయోజనానికి (సంక్షేమ పథకం) యూడైస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ విద్యార్థికి అంతకుముందు ఎక్కడ చదివిందీ తెలిపే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పనిలేదు. ఈ మేరకే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను టీసీలు లేకున్నా 8వ తరగతిలో చేర్చుకున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేటు స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఆపాయి. ఈ కారణంగా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు టీసీల్లేకుండానే ఇతర స్కూళ్ళల్లో చేరారు. ఇంతే కాకుండా చాలా స్కూళ్ళు కింది తరగతుల్లో అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ కారణంగానూ విద్యార్థుల వివరాలు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యూడైస్ కోసం పాత రికార్డు ఎలా తేవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. టెన్త్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు యూడైస్ సాధ్యాసాధ్యాలను ఉన్నతా ధికారులు గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎదుర య్యే సమస్యలను అర్థం చేసుకోవాలి. యూ డైస్లో పేరులేదని పరీక్ష ఫీజు కట్టించుకోని పరిస్థితి వస్తే, అనేకమంది టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడతారు. పరీక్షలు దగ్గరప డుతున్న సమయంలో వారిని మానసికంగా దెబ్బతీయడం సరైన చర్య కాదు. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) వెసులుబాటు ఇవ్వకపోతే ఇబ్బందులే విద్యార్థి 8 నుంచి ఒకే స్కూల్లో ఉన్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుని యూడైస్‌లో చేర్చే ఆప్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇందులోని ఇబ్బందులను విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. అప్పటివరకూ తాము యూడైస్‌లో చేర్చే ప్రక్రియ పూర్తి చేయలేమంటున్నాయి. ఆన్లైన్ ఈ మేరకు సాంకేతిక వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాయి. -
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైంది. శనివారం నుంచి నవంబర్ 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11వ తేదీ నుంచి 16 వరకు రూ.50, 17వ తేదీ నుంచి 22 వరకు రూ.200, 23వ తేదీ నుంచి 30 వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల హెచ్ఎంలు నిర్ణి త సమయంలో ఫీజులు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. -
దాతలు దయచూపరూ..! నేను చదువుకుంటాను..!! విద్యార్థి సన్నీ..
మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు. దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. 5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు. అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు. -
16 నుంచి డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజులలో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రూ 200 అపరాధ రుసుంతో జూన్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షా ఫీజులను ఈ నెల 16 నుంచి వచ్చే నెల 8 వరకు చెల్లించాలని సూచించారు. రూ 300 అపరాధ రుసుంతో జూన్ 15 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ కోర్సులకు 2.20 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా వివిధ పీజీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షలకు 10 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పూర్తి వివరాలు ఓయూ వెబ్సైట్లో ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. -
సీబీఎస్ఈ ఫీజు 24 రెట్లు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ గత వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది. తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది. -
‘ఇంటర్’ పరీక్ష ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. వచ్చే నెల 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది. -
డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
జడ్చర్ల : వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కోడ్గల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమ్మ, శేఖర్ దంపతుల కూతురు అలివేలు(19) జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డిగ్రీ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలివేలు ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. -
ఓపెన్ డిగ్రీ పరీక్షలకు ఫీజు గడువు తేదీ ఇదే
అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్ 1లోగా చెల్లించాలని మహిళా అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్ కే రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 2 నుంచి, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మే 9 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
జేఎన్టీయూలో విద్యార్థుల భారీ ధర్నా
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ కూకట్పల్లి జేఎన్టీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం తరగతులు బహిష్కరించారు. యూజీసీ నిధుల దుర్వినియోగమయ్యాయని, ఇందులో అధికారుల వాటా ఎంత అని ప్రశ్నించారు. విద్యార్థుల నినాదాలతో యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. -
పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
కర్నూలు సిటీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా హైస్కూల్ హెచ్ఎంలకు 30, హెచ్ఎంలు వచ్చే నెల 1వ తేదీ నాటికి సబ్ ట్రెజరీల్లో చెల్లించాలన్నారు. వచ్చే నెల 3 నుంచి 5వ తేదీలోపు నామినల్ రోల్స్ పంపించాలని, అపరాధ రుసుముతో వచ్చే నెల 9వ తేదీన, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 19 వరకు, రూ.500 అపరాధ రుసుముతో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నాటికి ఫీజులు చెల్లించవచ్చన్నారు. -
ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ తమను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆ కళాశాల విద్యార్థినులు సుమారు 70మంది సోమవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీకి ఒక్క రోజు ముందు అటెండెన్స్ సరిపోలేదని చెప్పి తమను ఫీజు చెల్లించేందుకు అనర్హులన్నారని తెలిపారు. ప్రిన్సిపాల్ సుమారు నెల రోజుల పాటు కాలేజీకి రాలేదని, బయోమెట్రిక్ యంత్రం పాడైపోగా హాజరు నమోదు చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లోనూ తమకు హాజరు లేదనడం సరికాదన్నారు. దీన్ని అర్థం చేసుకొని ఫీజు చెల్లించి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని తెలిపారు. కాగా ఈ విషయంలో హన్మకొండ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు విద్యార్థినులు తెలిపారు. -
'ఎంసెట్-2 కు మళ్లీ ఫీజు సరికాదు'
హైదరాబాద్: తెలంగాణలో జూలై9 న నిర్వహించే ఎంసెట్-2 ప్రవేశ పరీక్షకు రెండవసారి పరీక్ష రుసుమును వసూలు చేయడం సరికాదని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరలా పరీక్ష రుసుమును చెల్లించాలనే నిబంధన పెట్టడం అన్యాయమన్నారు. ఈ నెల 15 న జరిగిన ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్ధులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల నుండి పరీక్ష రుసుము వసూలు చేసుకుంటే సమంజసమని.. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సామల విజ్ఞప్తి చేశారు. -
పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తత్కాల్ స్కీము కింద రూ.1000 ఆలస్య రుసుముతో పదో తరగతి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైనవారు, ప్రైవేటు అభ్యర్ధులు ఈ తత్కాల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
'ఆన్లైన్ అప్‌లోడ్‌కు సిద్ధం కండి'
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజుకు సంబంధించి నామినల్ రోల్స్, ఐసీఆర్ కమ్ ఓఎంఆర్ ఫారాల డేటాను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు హెడ్మాస్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లోడ్ చేయాలన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని, ఈలోగా ఫీజులు చెల్లించిన విద్యార్థుల సమగ్ర వివరాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, పదో తరగతి ఓంఎంఆర్, ఐసీఆర్ ఫారాలు డిసెంబరు 2 వరకు అందజేసేందుకు అవకాశం ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎస్టీయూ-టీఎస్ నేతలు రాజిరెడ్డి, భుజంగరావు ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు 3 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబరు 3వ తేదీకి ఇంటర్ బోర్డు పొడిగించింది. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించగా, ఇపుడు మూడోసారి కూడా పెంచింది. రూ. 100 ఆలస్య రుసుముతో వచ్చే నెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. 2015 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులందరికీ (జనరల్, వొకేషనల్, ప్రైవేటు) ఈ మార్పు వర్తిస్తుందని బోర్డు వెల్లడించింది. -
పరీక్ష ఫీజు కోసం స్కూల్ యాజమాన్యం ఒత్తిడి
బోయిన్పల్లి, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టాలని.. లేకపోతే మీ అబ్బాయికి హాల్‌టికెట్ ఇచ్చేది లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను హెచ్చరించింది. ఫీజు కట్టే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...పాతబోయిన్‌పల్లి డివిజన్ బృందావన్‌కాలనీలో నివాసముండే లక్ష్మి (32), వెంకన్న భార్యాభర్తలు. భర్త డ్రైవర్ కాగా..భార్య కూలీ పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె రాజేశ్వరి డిగ్రీ, చిన్నకుమార్తె రజని ఇంటర్ చదువుతుండగా... కుమారుడు ప్రదీప్ మల్లికార్జున కాలనీలోని ఎంకేఆర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ప్రదీప్ త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.కాగా, ప్రదీప్‌కు సంబంధించిన 10వ తరగతి పరీక్ష ఫీజును వెంటనే చెల్లించాలని తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. లేకపోతే హాల్ టికెట్ ఇచ్చేదిలేదని, పరీక్ష కూడా రాయనివ్వబోమని హెచ్చరించింది. గురువారం రాత్రి ప్రదీప్ పరీక్ష ఫీజు కట్టాలని లక్ష్మి భర్తను అడిగింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం.. డబ్బు ఎక్కడి నుంచి తేవాలని భర్త అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన లక్ష్మి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆ ర్పి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తత్కాల్లో ఇంటర్ పరీక్ష ఫీజు కట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామశంకర్‌నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. హాజరు మినహాయింపు కోరుకునే ఆర్ట్స్ విద్యార్థులు దానికి సంబంధించిన ఫీజు కూడా కట్టొచ్చని సూచించారు. తత్కాల్ ఫీజు రూ.500, హాజరు మినహాయింపు ఫీజు రూ.500, పరీక్ష ఫీజు రూ.290, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫీజు రూ.580గా నిర్ణయించారు.