experts opinions
-
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్‌కి టెర్రర్‌గా మారుతున్నాయి. బిజీ లైఫ్‌లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్‌నెర్‌లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్‌తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్‌ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్‌తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్‌పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
బంగారం డిమాండ్ తగ్గుతుందా.. పెరుగుతుందా?
ముంబై: పసిడి ధరల తీవ్రత నేపథ్యంలో.. వినియోగదారుల కొనుగోళ్లు ఎలా ఉంటాయన్న అంశంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆ అభిప్రాయాలు క్లుప్తంగా...డిమాండ్ పడిపోవచ్చు కస్టమ్స్ సుంకాలు తగ్గినప్పటికీ అటు అంతర్జాతీయ ఇటు దేశీయ పరిణామాలతో పసిడి ధరలు రికార్టులను సృష్టిస్తున్నాయి. దీపావళికి ముందు చోటుచేసుకుంటున్న ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ధన్‌తేరస్‌లో డిమాండ్, కొనుగోళ్ల పరిమాణాలు తగ్గుతాయని భావిస్తున్నాం. గత ధన్‌తేరాస్‌తో పోల్చితే కొనుగోళ్ల పరిమాణం కనీసం 10 నుంచి 12 శాతం తగ్గుతుందని అంచనా. అయితే పెరిగిన ధరల వల్ల విలువలో కొనుగోళ్లు 12 నుంచి 15 శాతం పెరగవచ్చు. – సువంకర్ సేన్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈఎఓగత ఏడాదికి సమానంగా బిజినెస్ధరలు పెరుగుతున్నప్పటికీ మేము మంచి వ్యాపారాన్ని ఆశిస్తున్నాము. ధన్తేరస్ తర్వాత 40 లక్షలకు పైగా వివాహాలు జరుగుతున్నందున అమ్మకాలు గత సంవత్సరం మాదిరిగానే ఉండవచ్చని మేము ఆశిస్తున్నాము. ధన్తేరస్ నాడు అమ్మకాల పరిమాణం 20 నుంచి 22 టన్నులు ఉండవచ్చు. ఇది గత ఏడాదికి దాదాపు సమానం. – సయం మెహ్రా, ఆల్ ఇండియా జీజేసీ చైర్మన్ఆశాజనంగానే ఉన్నాం... రెండో త్రైమాసికంలో బులియన్ మార్కెట్ పటిష్టంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పండుగల సమయంలో అమ్మకాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము. పండుగలకు ప్రీ–బుక్ ఆర్డర్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. అకస్మాత్తుగా ధర పెరిగితే వినియోగదారులు కొంత విరామం తీసుకునే మాట వాస్తవమే. అయితే ఈ రోజుల్లో వినియోగదారులు తమ బడ్జెట్ మేరకు కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దశలో ‘కొనుగోళ్ల పరిమాణం’ గురించి ఇప్పుడు మాట్లాడము. – టీఎస్ కళ్యాణరామన్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండీపెళ్లిళ్ల సీజన్‌తో డిమాండ్ పదిలం బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకినప్పటికీ కొనుగోళ్ల విషయంలో పరిశ్రమ నుండి వచ్చిన సమాచారం సానుకూలంగానే ఉంది. కొనసాగుతున్న పండుగల కారణంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పటిష్టంగా ఉండే వీలుంది. పెట్టుబడి సెంటిమెంట్, వివాహ సంబంధిత కొనుగోళ్లు పరిశ్రమకు అండగా ఉండే అవకాశాలే ఎక్కువ. వ్యవసాయ పరిస్థితుల మెరుగుదల, ఆదాయాలు పెరగడం, ఎకానమీ, వినియోగం పటిష్టత వంటి అంశాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ ఉటుంది. – సచిన్ జైన్, డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ -
లాభాలు కొనసాగే వీలు
దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనా వార్తలు ఈక్విటీ మార్కెట్లను ముందుకు నడిపించవచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు.‘‘అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ సమావేశం సెప్టెంబర్ 17-18 జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్లను ప్రభావితం చేసే యూఎస్ తయారీ రంగ, నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 25,500 స్థాయిని పరీక్షించవచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 25,000 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,900 వద్ద మరో మద్దతు ఉంది’’ అని మెహ్తా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు.యూఎస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ క్లెయిమ్స్ తగ్గడంతో పాలసీ సర్దుబాట్లకు సమయం ఆసన్నమైందంటూ ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో గతవారం సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సైతం సెంటిమెంట్‌ను బలపరిచాయి. ముఖ్యంగా విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 1,280 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.దేశీయ ఆటో కంపెనీల ఆగస్టు వాహన విక్రయ గణాంకాల వెల్లడి కారణంగా ఆటో రంగ షేర్లలో కదలికలు గమనించవచ్చు. ఇవాళ(సోమవారం) భారత్ పాటు చైనా, యూరోజోన్లు ఆగస్టు తయారీ రంగ పీఎంఐ డేటాను విడుదల చేయనున్నాయి. అమెరికా ఆగస్టు తయారీ రంగ, వాహన విక్రయ డేటాను మంగళవారం ప్రకటించనుంది.దేశీయ సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం(సెప్టెంబర్ 4న) విడుదల అవుతాయి. ఆగస్టు 31తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(సెప్టెంబర్ 6న) విడుదల చేస్తుంది. ఇదే వారాంతాపు రోజున యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ అంచనా డేటా, అమెరికా నిరుద్యోగ రేటు, వ్యవసాయేతర పేరోల్ గణాంకాలను వెల్లడి కానున్నాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. ఆగస్టులో రూ.7,320 కోట్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టులో రూ.7,320 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అధిక వాల్యుయేషన్ ఆందోళనలతో పాటు జపాన్ వడ్డీరేట్ల పెంపుతో యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆగస్టులో అమెరికా ఆర్థిక మాంద్య భయాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కూడా విదేశీ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. అయితే జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం విశేషం. ఇదే నెలలో డెట్ మార్కెట్లో రూ.17,960 కోట్ల పెట్టుడులు పెట్టారు.‘‘ఎఫ్ఐలు సెప్టెంబర్‌లో కొనుగోళ్లు చేపట్టే వీలుంది. దేశీయ రాజకీయ స్థిరత్వం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు, మార్కెట్ వాల్యుయేషన్లు, రంగాల ప్రాధాన్యత, డెట్ మార్కెట్ ఆకర్షణ అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
T20 World Cup 2024: సెమీస్‌కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్‌ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్‌కప్ మోడ్‌లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్‌కప్ సెమీస్‌కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్‌కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్‌కప్ 2024 సెమీఫైనలిస్ట్‌ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్‌వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. -
డీ విటమిన్ డోస్ ఎక్కువైతే.. యమడేంజర్!
మన శరీరానికి విటమిన్-డి ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో అదే డీ విటమిన్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఒక్కోసారి ప్రాణంకూడా పోవచ్చు. యూకేకు చెందిన 89 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం రిటైర్డ్ వ్యాపారవేత్త డేవిడ్ మిచెనర్ హైపర్ కాల్సీమియాతో బాధపడుతున్నారు. దీంతో అతను గత ఏడాది మేలో ఆసుపత్రిలో చేరాడు. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువైనాయని వైద్యులు గుర్తించారు. పది రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తరువాత, స్థానిక వైద్య సంఘం సభ్యులు అప్రమత్తమై ఒక నివేదికను రూపొందించారు. అలాగే విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మిచెనర్ పోస్ట్‌మార్టం నివేదిక అతని విటమిన్ డీ స్థాయిలు 380 వద్ద ఉన్నట్టు తేలింది. దీంతో పెద్దల్లో విటమిన్ డీ-30 వద్ద ఉంటే చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పెద్దలకు 600 అంతర్జాతీయ యూనిట్లు (IUలు) డోసేజ్ చాలని చెప్పారు. మితిమీరిన వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విటమిన్ డీ సప్లిమెంట్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరి చేయాలని నియంత్రణ సంస్థలను కోరుతూ సర్రే అసిస్టెంట్ కరోనర్ నివేదికను విడుదల చేశారు. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట నష్టాలు లేదా దుష్ప్రభావాల గురించి వివరించే ప్యాకేజింగ్‌లో లేదా ప్యాకేజింగ్‌లో ఎటువంటి హెచ్చరిక లేదని కరోనర్ జోనాథన్ స్టీవెన్స్ తన అధికారిక నివేదికలో రాశారు. ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్‌ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్‌ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్‌టేబుల్‌లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్‌గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్‌ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్‌ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్‌కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్‌గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్‌గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్‌గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రాపర్టీ విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – అనిల్ మిశ్రా ప్రాపర్టీని రెండేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించడం) చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. రూ.50 లక్షలపై 20 శాతం పన్ను అంటే రూ.10 లక్షల మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే స్థిరాదాయ సాధనాలనే క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. క్యాపిటల్ గెయిన్ బాండ్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఏటా రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి నికరంగా లభించే రేటు 3.68 శాతం. ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరుతుంది. ఈ గణాంకాలను పరిశీలించి చూసినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమే మేలని అనిపిస్తుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సంక్లిష్టం కావచ్చు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇదేమీ గ్యారంటీడ్ కాదు. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. రిస్క్ లేని రాబడి కోరుకునేట్టు అయితే, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం కావాల్సిన వారు క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఎనిమిదేళ్ల తర్వాత కూడా పొడిగించుకోవచ్చా..? – గురునాథ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) నిబంధనల్లో సవరణ చోటు చేసుకుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత కోరుకుంటే మరో మూడేళ్ల కాలానికి దీన్ని పొడిగించుకోవచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఉండేది. ఆ తర్వాత కూడా అందులోనే ఇన్వెస్ట్మెంట్ కొనసాగించాలంటే, ఉపసంహరించుకుని మళ్లీ తాజాగా ఖాతా తెరవాల్సి వచ్చేది. ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఐదేళ్ల ప్రాథమిక కాల వ్యవధి ముగిసిన తర్వాత నుంచి.. మూడేళ్లకు ఒకసారి చొప్పున ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అంతేకానీ, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. గడువు పొడిగించే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఐదేళ్లు పూర్తయి ఉంటే, కొనసాగించుకోవడం వల్ల తదుపరి మూడేళ్ల కాలానికే 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనికి బదులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఐదేళ్ల కాలానికి 8.2 శాతం గరిష్ట రేటును పొందొచ్చు. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా?
Gold Prices in 2024: హద్దుల్లేకుండా పెరిగిపోతున్న బంగారం ధరలు కొత్త ఏడాదిలోనైనా దిగొస్తాయని ఆశలు పెట్టుకున్న పసిడి ప్రియులను నిపుణుల అంచనాలు కలవరపెడుతున్నాయి. 2024లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.70,000 చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఆదివారం (2023 డిసెంబర్ 31) నాడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,550,24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,870 వద్ద ఉంది. 2023 డిసెంబర్ నెల ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. గత మే 4న, గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 61,845, ఔన్స్‌కి 2,083 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ 16న ధర మళ్లీ రికార్డు స్థాయిలో రూ.61,914కి చేరుకుందని కా కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ (Commtrendz research) డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు. రూ.70 వేలకు చేరే అవకాశం కొత్త సంవత్సరంలో బంగారం ఔన్స్ ధరలు 2,400 డాలర్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు త్యాగరాజన్ చెప్పారు. రూపాయి స్థిరంగా ఉంటే దేశంలో తులం బంగారం ధర రూ.70,000 స్థాయిలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను తేలికపరుస్తారన్న అంచనాల నేపథ్యంలో రూపాయి బలహీనపడవచ్చు. ఇది బంగారం దేశీయ ధరలను పెంచే అవకాశం ఉంది. అమ్మకాలపై తీవ్ర ప్రభావం యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి బంగారం ధరలలో పెరుగుదలకు దారితీస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా పేర్కొన్నారు. 2024లో బంగారం ధర ఔన్స్‌కు 2,250 నుంచి 2,300 డాలర్లు, 10 గ్రాముల ధర 68,000 నుంచి 70,000కి చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పెరిగిన ధరలు 2024లో బంగారం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, వచ్చే ఏడాదిలో నగల వ్యాపారం 2023లో ఉన్న స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.భరణాల డిమాండ్ పెరిగింది. -
జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు - నిపుణుల చర్చలు
హైదరాబాద్: 2023 ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్స్ ఫోరం (AISEF) వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ (WSO), 2వ ఎడిషన్ నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ 2023 మొదటి రోజును విజయవంతంగా ముగించింది. ఈ సదస్సులో నిపుణులు, పరిశ్రమ నాయకులు సుగంధ ద్రవ్యాల భద్రత, స్థిరత్వానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనేవారికి ఆత్మీయ స్వాగతం పలికిన వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ 'రామ్‌కుమార్ మీనన్' మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్య పరిశ్రమ భద్రత దాని స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సామూహిక ప్రయత్నాల ప్రాముఖ్యతను గురించి వ్యాఖ్యానించారు. సుగంధ ద్రవ్యాల భద్రత కేవలం బాధ్యత మాత్రమే కాదు, స్థిరమైన భవిష్యత్తును నిర్మించటానికి చూపాల్సిన నిబద్ధత అని వెల్లడించారు. ఈ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ మంచి స్థిరమైన ఆదాయానికి అవకాశాలు వున్నాయని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ అఫ్ అరేకనట్ అండ్ స్పైస్ డెవలప్మెంట్ (DASD) డైరెక్టర్ డాక్టర్ హోమి చెరియన్, మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సుగంధ ద్రవ్యాలు ఉత్తమమైన మార్గం, స్థిరమైన వృద్ధి, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. డాక్టర్ ఎబి రీమాశ్రీ, డైరెక్టర్ - రీసెర్చ్, స్పైసెస్ బోర్డ్ మాట్లాడుతూ.. మసాలా సాగును ప్రోత్సహించడానికి అవసరమైన పరిజ్ఞానం గురించి వివరిస్తూ.. ఆహార భద్రత పరంగా సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో రాజీ పడటం జరగదు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, అధిక నాణ్యత గల సుగంధ ద్రవ్యాలను అందించడానికి మనం వ్యూహాలు ఖచ్చితంగా ప్రతిబింబించాలని వెల్లడించారు. NSC 2023 వ్యాపార కమిటీ చైర్మన్ చెరియన్ జేవియర్ మాట్లాడుతూ.. 'ఫుడ్ సేఫ్ స్పైసస్ - ది వే ఫార్వార్డ్ టూ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్' సదస్సు కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, మన భవిష్యత్తును బాధ్యతాయుతంగా, స్థిరంగా పరిశ్రమ తీర్చిదిద్దటానికి ఇది పిలుపు అని అన్నారు. సెషన్ రెండవ రోజు మెరుగైన ఇన్పుట్ నిర్వహణ, ఉత్పాదకత, వినూత్న ప్రక్రియలు, మార్కెట్ పోకడలు, సుగంధ ద్రవ్యాల వినూత్న ప్యాకేజింగ్ సవాళ్లు, అవకాశాలు వంటి అంశాలపై మరింత పరిజ్ఞానం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఆహార సురక్షిత పద్ధతులు, సుగంధ ద్రవ్యాలు రైతులకు స్థిరమైన, నిలకడతో కూడిన ఆదాయానికి దారితీసే భవిష్యత్తు కోసం ఆకర్షణీయమైన చర్చలు, నిపుణుల సూచనలు, క్రియాత్మక వ్యూహాలను ఆశించవచ్చు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2023 పరిశ్రమ నాయకులు, నిపుణులు, వాటాదారులకు చర్చలలో పాల్గొనడానికి, మొత్తం సుగంధ ద్రవ్యాల రంగాన్ని పెంచే లక్ష్యంతో వ్యూహాలను అమలు చేయడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ కార్యక్రమానికి వివిధ ఎఫ్పిఓలు, ఎన్జిఓలు హాజరయ్యారు. -
స్టాక్స్.. రాకెట్స్!
ద్రవ్యోల్బణ, వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంవత్ 2079 దేశీ మార్కెట్లకు మొత్తం మీద సానుకూలంగానే ముగిసింది. గతేడాది దీపావళి నుంచి చూస్తే నిఫ్టీ 50 దాదాపు 9.5 శాతం పెరిగింది. పటిష్టమైన దేశ ఆర్థిక వృద్ధి ఊతంతో మార్కెట్లు కొత్త సంవత్ 2080లోనూ రాణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రిసు్కలూ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. భౌగోళిక–రాజకీయ అనిశి్చతి, క్రూడాయిల్ రేట్లతో పాటు దేశీయంగా సార్వత్రిక ఎన్నికలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తీరుతెన్నులూ మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రాజకీయ అస్థిరతకు దారితీసేలా ఎన్నికల ఫలితాలు ఉన్నా, అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరిగి బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయి దాటినా దేశీ మార్కెట్లకు కొంత రిసు్కలు తప్పవని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి. చొక్కలింగం అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడొచ్చని తెలిపారు. ఇలాంటివేమీ జరగని పక్షంలో దేశీ మార్కెట్లు 15 శాతం ఎగిసి సెన్సెక్స్ వచ్చే దీపావళి నాటికి 75,000 పాయింట్లకు చేరొచ్చని చెప్పారు. పసిడి 10 శాతం దాకా అప్ .. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలతో పసిడి ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగానే పెరిగాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకు బంగారం రేటు దాదాపు 20 శాతం ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ. 11,000 పైగా పెరిగి రూ. 61,000కు చేరింది. ఈ నేపథ్యంలో బంగారానికి ఫండమెంటల్స్ సానుకూలంగానే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్‌లో సుమారు 8–10 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పసిడి రేటు కాస్త కరెక్షన్‌కి లోను కావచ్చని, అయితే క్షీణత పరిమిత స్థాయిలోనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. రూ. 61,000 దిగువకు తగ్గడమనేది కొనుగోళ్లకు అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరి ఇంక వడ్డీ రేట్లను పెంచకపోవడం వంటి పరిణామాలతో బంగారం రేట్లు వచ్చే దీపావళి నాటికి రూ. 65,000–67,000 స్థాయికి చేరొచ్చని.. రూ. 67,000 స్థాయిని కూడా తాకొచ్చని చెప్పారు. మరోవైపు, వెండి రేట్లు కూడా గతేడాది దీపావళి నుంచి చూస్తే దాదాపు 25 శాతం పెరిగాయి. కొత్త సంవత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. వెండి 12–13 శాతం మేర పెరగొచ్చని సజేజా తెలిపారు. వచ్చే దీపావళి నాటికి ఎంసీఎక్స్‌లో వెండి రేటు కేజీకి రూ. 80,000గా ఉండొచ్చని, రూ. 82,000 స్థాయిని కూడా తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలార్ ప్యానెళ్లు, కొత్త గ్రీన్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగం కారణంగా పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. ఆసక్తికరంగా గ్లోబల్ ఎకానమీ .. సుదీర్ఘకాలం కొనసాగే అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లలో తీవ్ర ఒడిదుడుకులు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మొదలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో కొత్త సంవత్‌లోకి అడుగుపెడుతున్నాం. సంవత్ 2080లో గ్లోబల్ ఎకానమీ ఆసక్తికరంగా ఉండనుంది. దేశీ ఎకానమీకి అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చతిలో వృద్ధిపరంగా భారత్ సానుకూల స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ ఈక్విటీలకు ఇదే చోదకంగా ఉండగలదు. కార్పొరేట్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. రెండంకెల స్థాయి ఆదాయాల వృద్ధి ఊతంతో భారతీయ ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లలో డబుల్ డిజిట్ రాబడులు అందించేందుకు ఇవన్నీ తోడ్పడగలవు. – ప్రణవ్ హరిదాసన్, ఎండీ, యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టీవీఎస్ మోటర్ ప్రస్తుత ధర: 1,633 టార్గెట్ ధర: రూ. 2,100 దేశీయంగా మూడో అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. వార్షికంగా 30 లక్షల పైచిలుకు టూవీలర్ల విక్రయాలు ఉంటున్నాయి. 60 పైగా దేశాలకు ఎగుమతి చేస్తూ రెండో అతి పెద్ద ఎగుమతిదారుగా కూడా ఉంది. కంపెనీకి దేశీయంగా నాలుగు, ఇండొనేషియాలో ఒక ప్లాంటు ఉంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియో, ఎగుమతులు, మార్కెట్ వాటాను పెంచుకునే సామరŠాధ్యలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935.. టార్గెట్ ధర: రూ. 1,155 దేశీయంగా రెండో అతి పెద్ద టెలికం ఆప రేటరు. భారత్‌తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాలోని 18 దేశాలకు కార్యకలాపాలను విస్త రించింది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ ఫోన్స్ వంటి మెరుగైన డిజిటల్ సరీ్వసుల పోర్ట్‌ఫోలియో ద్వారా దేశీయంగా పటిష్టమైన స్థితిలో ఉంది. పరిశ్రమలోనే అత్యంత మెరుగైన ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయం) కలిగి ఉండటం, హోమ్ సెగ్మెంట్లో మెరుగుపడుతుండటం సానుకూలాంశాలు. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ప్రస్తుత ధర: 1,654 టార్గెట్ ధర: రూ. 1,950 స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ విభాగంలో దిగ్గజంగా ఉంది. 4 ఉత్పత్తుల కేటగిరీలో 14 బ్రాండ్స్ ఉన్నాయి. 3.6 ఎంటీపీఏ ఉత్పత్తి సామర్ధ్యంతో దేశీయంగా స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ రంగంలో 60 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశవ్యాప్తంగా 800 పైచిలుకు డి్రస్టిబ్యూటర్లతో పటిష్టమైన పంపిణీ నెట్వర్క్ ఉంది. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు మొదలైన విభాగాల్లో డిమాండ్ నెలకొనడంతో కంపెనీ మరిన్ని ఆర్డర్లు దక్కించుకోగలుగుతోంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 ఎంటీపీఏకి పెంచుకోవాలన్న లక్ష్యం, దీర్ఘకాలికంగా వృద్ధికి తోడ్పడగలదు. జ్యోతి ల్యాబ్స్ ప్రస్తుత ధర: 414.. టార్గెట్ ధర: రూ. 440 1983లో ఉజాలా ఫ్యాబ్రిక్ వైట్నర్ అనే సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా ఏర్పాటైంది. ఆ తర్వాత మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది. 2011–12లో హెంకో, మిస్టర్ వైట్, ప్రిల్, మార్గో వంటి బ్రాండ్స్ ఉన్న హెంకెల్ ఇండియాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫ్యాబ్రిక్ కేర్, డిష్వాíÙంగ్, వ్యక్తిగత సంరక్షణ, లాండ్రీ సర్వీసులు మొదలైన వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ప్రీమియం ఉత్పత్తులు, విస్తృతమైన టాయ్‌లెట్ సోప్స్ పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, వ్యయ నియంత్రణ చర్యల అమలు మొదలైనవి సంస్థకు సానుకూలాంశాలు. స్మాల్, మిడ్‌క్యాప్ కన్జూమర్ ప్రోడక్టుల విభాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: 1,369 టార్గెట్ ధర: రూ. 1,500 ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సేవలు అందిస్తోంది. దాదాపు అన్ని దిగ్గజ తయారీ సంస్థలకు డిజైన్, డెవలప్మెంట్ సరీ్వసులు ఇస్తోంది. అలాగే ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల విభాగాల్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకుంటోంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా డిజిటల్ ఇంజినీరింగ్‌పై చేసే వ్యయాలు పెరుగుతుండటం కేపీఐటీ టెక్నాలజీస్‌కి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయంగా దిగ్గజ బ్రాండ్ల నుంచి పలు దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేతిలో ఉండటం సంస్థకు సానుకూలంగా ఉండగలదు. ఎస్బీఐ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 938 టార్గెట్ ధర రూ. 1,081 దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. 6,248 పైచిలుకు శాఖలు, దాదాపు 16,927 ఏటీఎంలు, సీఆర్ఎం నెట్‌వర్క్‌లు ఉన్నాయి. లోన్ బుక్‌లో సుమారు 55 శాతం రిటైల్ రుణాలు ఉన్నాయి. అనుబంధ సంస్థల ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స, స్టాక్ బ్రోకింగ్, ఏఎంసీ వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. మారుతీ సుజుకీ ప్రస్తుత ధర రూ. 10,391 టార్గెట్ ధర రూ. 12,000 దేశీయంగా కార్ల తయారీకి సంబంధించి అతి పెద్ద కంపెనీ. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తోంది. కార్ల మార్కెట్లో సింహభాగం వాటా కలిగి ఉంది. 90 పైగా దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ధర: 8,720 టార్గెట్ ధర: రూ. 9,800 ఇది దేశీయంగా 25 శాతం మార్కెట్ వాటాతో అతి పెద్ద సిమెంటు తయారీ సంస్థ. దేశవ్యాప్తంగా 132.5 మిలియన్ టన్నుల వార్షికోత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. భవన నిర్మాణ మెటీరియల్స్ కూడా విక్రయిస్తోంది. సొంత అవసరాల కోసం సున్నపురాయి, బొగ్గు గనులు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయాలు తక్కువ స్థాయిలో ఉండటానికి ఇది దోహదపడుతోంది. పాలీక్యాబ్ ఇండియా ప్రస్తుత ధర: 5,137 టార్గెట్ ధర:5,877 భారత్‌లో అతి పెద్ద కేబుల్, వైర్ల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎల్ఈడీ లైటింగ్, స్విచ్చులు, స్విచ్‌గేర్, సోలార్ ఉత్పత్తులు, యాక్సెసరీలు వంటి ఎఫ్ఎంఈజీ (ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్) ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. కళ్యాణ్ జ్యుయలర్స్ ప్రస్తుత ధర: 338 టార్గెట్ ధర:రూ. 364 భారత్‌లో అతి పెద్ద జ్యుయలరీ కంపెనీల్లో ఒకటి. పసిడి, ఇతరత్రా జ్యుయలరీ ఉత్పత్తులను వివిధ ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు మొదలుకుని రోజువారీ ధరించే ఆభరణాలు మొదలైన వాటిని విక్రయాల్లో గణనీయ వృద్ధి కనపరుస్తోంది. స్టాక్స్‌బాక్స్ అశోకా బిల్డ్‌కాన్ ప్రస్తుత ధర: రూ. 139 టార్గెట్ ధర: రూ. 163 దేశీయంగా 20 రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలు ఉన్నాయి. రహదారులు, పవర్, రైల్వేస్ వంటి వివిధ రంగాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. సెపె్టంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ. 17,566 కోట్ల స్థాయిలో ఉంది. సీజీడీ వ్యాపారం, రోడ్డు ప్రాజెక్ట్ ఎస్వీవీల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,616 కోట్ల మేర తగ్గనుంది. భారీ ఆర్డర్లు, అధునాతన టెక్నాలజీ, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలిగే సామర్థ్యాల కారణంగా కంపెనీ మెరుగ్గా రాణించగలదనే అంచనాలు ఉన్నాయి. కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 323 టార్గెట్ ధర: రూ. 370 భారత్ ఇంధన భద్రతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో బొగ్గుకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. దానికి తగ్గట్లుగా 2025–26 లో 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకోవడం సానుకూలాంశం. కోల్గేట్–పామోలివ్ (ఇండియా) ప్రస్తుత ధర: 2,106.. టార్గెట్ ధర: రూ. 2,500 ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల వాటా దంత సంరక్షణలో 14 శాతం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో 25 శాతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యాపార వృద్ధికి, మార్జిన్లు మెరుగుపడటానికి వీటిపై మరింతగా దృష్టి పెట్టాలని కొత్త మేనేజ్మెంట్ భావిస్తోంది. గత త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ కూడా కోలుకోవడం సంస్థకు సానుకూలాంశాం. పురవంకర ప్రస్తుత ధర: రూ. 147 టార్గెట్ ధర: రూ. 176 ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు ఏకంగా 109 శాతం ఎగిసి రూ. 2,725 కోట్లకు చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో ప్రాజెక్టుల డెలివరీలు పెరిగే కొద్దీ స్థూల లాభాల మార్జిన్లు మరింత మెరుగుపడగలవని సంస్థ అంచనా వేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి విస్తరిస్తుందని, జీడీపీలో రియల్టీ వాటా 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అవకాశాలూ మెరుగ్గా ఉండనున్నాయి. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: 935 టార్గెట్ ధర: రూ. 1,106 పరిశ్రమలోనే అత్యధికంగా ఏఆర్పీయూ (సగటున ప్రతి యూజరుపై ఆదాయం) నమోదు చేస్తోంది. టారిఫ్‌ల పెంపు, యూజర్లు పెరుగుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. 2జీ నుంచి 4జీకి మళ్లే వారు పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ మరింతగా పెరిగే అవకాశాలు ఉండటం తదితర అంశాలు సంస్థ వృద్ధికి తోడ్పడనున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 2,314 టార్గెట్ ధర రూ. 2,725 కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. నెట్వర్క్ విస్తరణ దాదాపు పూర్తి కావొస్తుండటంతో అందరి దృష్టి ఇప్పుడు 5జీ వైపు మళ్లనుంది. సబ్‌్రస్కయిబర్స్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో టారిఫ్‌లను కూడా పెంచే అవకాశం ఉంది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే నికర రుణం దాదాపు రూ. 9,000 కోట్ల మేర తగ్గింది. కెనరా బ్యాంకు ప్రస్తుత ధర రూ. 387 టార్గెట్ ధర రూ. 425 కెనరా బ్యాంకు అసెట్ క్వాలిటీ మెరుగుపడటం కొనసాగుతోంది. రుణ వృద్ధి ఆరోగ్యకరమైన 12 శాతం స్థాయిలో నమోదైంది. క్రెడిట్ వ్యయాలు తగ్గుతుండటంతో గత కొద్ది త్రైమాసికాలుగా బ్యాంకు ఆర్‌వోఈ కూడా మెరుగుపడింది. అదనంగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే డిస్కౌంటు ధరకి ట్రేడవుతోంది. సిప్లా ప్రస్తుత ధర రూ. 1,240 టార్గెట్ ధర రూ. 1,320 సిప్లా వరుసగా మూడో త్రైమాసికంలోనూ పటిష్టమైన పనితీరు కనపర్చింది. నియంత్రణ సంస్థలపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2023–26 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఈపీఎస్ సాధించే అవకాశం ఉంది. దేశీయ, అమెరికా జనరిక్స్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెడుతుండటం సానుకూలాంశాలు. ప్రమోటర్లు వాటాను విక్రయించే అవకాశం పరిశీలించతగిన అంశం. సైయంట్ ప్రస్తుత ధర రూ. 1,659 టార్గెట్ ధర రూ. 2,000 ఏరోస్పేస్, ఆటోమోటివ్, సస్టెయినబిలిటీ విభాగాల్లో భారీగా డిమాండ్ ఉంటుందని సైయంట్ అంచనా వేస్తోంది. వార్షికంగా సెపె్టంబర్ క్వార్టర్లో ఆర్డర్లు 40 శాతం పెరిగాయి. నికర లాభాల్లో 50 శాతాన్ని డివిడెండుగా ఇచ్చే ధోరణిని సైయంట్ కొనసాగించవచ్చు. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రస్తుత ధర రూ. 210 టార్గెట్ ధర రూ. 276 సెపె్టంబర్ క్వార్టర్లో పీసీబీఎల్ (ఫిలిప్స్ కార్బన్ బ్లాక్) అత్యధిక అమ్మకాలు సాధించింది. స్పెషాలిటీ బ్లాక్ కోసం డిమాండ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లు జతవుతున్నారు. కొత్త ప్రోడక్ట్ గ్రేడ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత నాణ్యమైన స్పెషాలిటీ బ్లాక్ అమ్మకాలతో మార్జిన్లకు మద్దతు లభించనుంది. చెన్నైలోని 1.47 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్లాంటు తుది దశ పనులు పూర్తి చేసింది. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ఫెడ్ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్‌వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడుల ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్‌పట్ల గ్లోబల్ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్ ఫెడ్‌పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ నిపుణులు అజిత్ మిశ్రా, శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ సేథ్ అభిప్రాయపడ్డారు. గత వారం వెనకడుగు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 952 పాయింట్లు పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల దన్ను తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్‌లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్‌చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్‌పీఐలు 2021 అక్టోబర్– 2022 జూన్ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్‌పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
పావురాల విసర్జితాలతో రోగాల ముప్పేనా..?
సాక్షి, హైదరాబాద్: శాంతికి చిహ్నం.. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు.. ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? జీవవైవిధ్య పరిరక్షణ.. ఆహ్లాదం కోసమో లేక అన్ని విధాలా కలిసి వస్తుందన్న నమ్మకంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ఇటీవల ఓ ప్రముఖ సినీనటి భర్త మరణానికి పావురాల విసర్జితాలే కారణమా..? ఈ ప్రశ్నలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో వైరల్‌గా మారడంతో పాటు పలు చర్చోపచర్చలకు కారణమైన విషయం విదితమే. అయితే తన భర్త మరణానికి పావురాలు కారణం కాదని ఆ నటి స్పష్టత ఇచ్చింది. కాగా ఇదే తరుణంలో నగరంలో పావురాల సంఖ్య పెరిగితే రాజధాని గ్రేటర్ హైదరాబాద్ సిటీ రోగాల అడ్డాగా మారడం తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని.. ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనం సైతం తేల్చి చెప్పింది. నగరంలో 6 లక్షలకు చేరుకున్న పావురాలు..? రాష్ట్ర రాజధానిలో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షల పావురాలు నగరంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తేటతెల్లం చేసేందుకు ప్రాఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వాసుదేవరావు బృందం గతంలో అధ్యయనం జరిపింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది. తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు బృందం సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. పావురాల విసర్జితాలతో హాని ఇలా.. పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే పక్షవాతానికి దారితీస్తుంది. అది చివరకు మృత్యువుకు కారణమవుతుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు తెలిపారు. అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదని, వాటిని పెంచుతూనే ఉన్నారని చెబుతున్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవీ వాస్తవాలు.. ► శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ► రాజధాని హైదరాబాద్ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. ► భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు. (క్లిక్: ఆకట్టుకుంటున్న వెరైటీ కప్పుల గణపయ్య) -
ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చాన్స్
ముంబై: హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి (మంగళవారం) మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున.. ఈ వారం స్టాక్ మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో సెన్సెక్స్ 1,075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ‘‘గడిచిన రెండు నెలల్లో సూచీలు 16% ర్యాలీ చేయడంతో మార్కెట్ ఓవర్‌బాట్ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణకు వీలుంది. సాంకేతికంగా నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో 17,850 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. ఎగువ స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,350–17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఎఫ్ఓఎంసీ మినిట్స్: ఫెడ్ జూలై పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 16న (బుధవారం) ప్రకటించనుంది. ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, మాంద్యంతో పాటు వడ్డీ రేట్లపై ఫెడ్ పాలసీ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలమని నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా మంగళవారం గతవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. అదేరోజన జూలై హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. జూన్‌తో పోలిస్తే (15.18 శాతం) ఈ జూలై డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం దిగిరావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జూలై మాసపు ప్యాసింజర్ వాహన అమ్మకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. అలాగే ఆర్బీఐ ఆగస్టు 13 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల ఐదో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఆగస్టు 1–15 తేదీల మధ్య రూ. 22,452 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది(2021) అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ జూన్ నాటికి రూ.2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కాగా.., ఈ జూలైలో రూ. 6295 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవడం, ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న తగు నిర్ణయాలతో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయి’’ కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రీటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (నేడు) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీతో పాటు కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి మంగళవారం యధావిధిగా ప్రారంభమవుతాయి. -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా
గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కేవలం స్థిరాస్తి మీద ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలే మన ప్రస్తుత అంశం. æ చట్టంలోని నిర్వచనాల జోలికి వెళితే తికమ కగా ఉంటుంది. సెక్షన్ల ప్రస్తావన అంతే. సారాంశమే తెలుసుకుందాం. æస్థిరాస్తి కొన్న తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అమ్మితే ఆ అమ్మకం, దీర్ఘకాలికమైనది అవుతుంది. రెండు సంవత్సరాల లోపల అమ్మితే అది స్వల్పకాలికం అని అర్థం. అలా వచ్చిన లాభాలను మీ మిగతా ఆదాయాలు.. అంటే జీతం, ఇంటి అద్దె, ఇతర ఆదాయాలు మొదలైన వాటితో కలిపి ఆ మొత్తాన్ని శ్లాబులవారీగా విభజించి, వర్తించే రేట్ల ప్రకారం ట్యాక్స్ లెక్కించాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 20 శాతం పన్ను విధిస్తారు. విద్యా సుంకం అదనంగా ఉంటుంది. ఈ వారం, మూలధన లాభాల నుండి పన్ను భారం లేకుండా బైటపడటం ఎలాగో తెలుసుకుందాం. ఇల్లు అమ్మి, మరో ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు. ఈ మినహాయింపనేది వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకే వర్తిస్తుంది. ఇల్లు అంటే ఇల్లు అలాగే అనుబంధమైన స్థలం అని అర్థం. ఫ్లాటు, దానితో పాటు జాగాలో ఉండే అన్‌డివైడెడ్ వాటా. ఈ ఇంటిని ఇదివరకే ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులలో అసెస్మెంట్ చేయించాలి. అంటే డిక్లేర్ చేయాలి. æ ఇల్లు అమ్మిన వెంటనే మన దేశంలో వేరే .. అంటే కొత్త ఇల్లు నిర్మాణం మూడు సంవత్సరాల లోపల చేయాలి. అంటే గెయిన్స్ మొత్తం వెచ్చించాలి. ఖర్చు పెట్టాలి. ఇల్లు నిర్మాణం పూర్తితో నిమిత్తం లేదు. తగిన కాగితాలు ఉండాలి. లేదా అమ్మిన తేదీ నుండి వెనక్కి వెళ్తారు. ఒక సంవత్సరం వరకూ .. ఒక సంవత్సరం ముందు ఇన్వెస్ట్ చేసినా చాలు. రెండు సంవత్సరాల లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంతో వెసులుబాటు ఉందని గమనించాలి. æఎంత లాభం వచ్చిందో అంతే అయినా లేక అంతకన్నా ఎక్కువగా అయినా ఇన్వెస్ట్ చేయాలి. తక్కువగా చేస్తే ఆ తక్కువ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసెస్సీకి జీవితకాలంలో ఒకే ఒకసారి ఓ అవకాశం ఉంది. లాభాలు రూ. 2 కోట్లు దాటితే, ఒక ఇల్లు బదులు రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు కుటుంబంలో భార్య, సంతానం పేరు మీద కొనవచ్చు. ఈ మేరకు ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు. మొత్తం ప్రతిఫలం చేయనవసరం లేదు. మిగిలిన మొత్తాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల ఇల్లు కొనకపోతే, ఇల్లు అమ్మిన సంవత్సరం నుంచి ఏడాది ముందు కానీ లేదా రిటర్నులు వేయడానికి గడువు తేదీ లోపల కానీ వెంటనే బ్యాంకులో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీకు మినహాయింపు లభిస్తుంది. అలా చేయకపోతే పన్ను పడుతుంది. మీరు కొన్న కొత్త ఇంటిని 3 సంవత్సరాలు అమ్మకూడదు. అలా అమ్మితే పన్ను వేస్తారు. జాగా కొని, స్వయంగా కట్టుకోవచ్చు. మినహాయింపులు పొంది స్వంత ఇంటి కల సాకారం చేసుకోండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను ఎలా వేస్తారంటే? -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్‌తో ఆధార్ లింక్ చేశారా!..చేయకపోతే..!
అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్ ఉంది. త్వరపడండి. ► వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. ► అడ్వాన్స్ ట్యాక్స్ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. ► ఇక ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్మెంట్లు.. సేవింగ్స్.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ..సేవింగ్స్..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్‌లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. ► ఇక నాలుగోది.. పాన్‌తో ఆధార్ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి. దీన్ని పాటించకపోతే సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం. -
TAX SAVINGS: బంగారం .. సొంత ఇల్లు.. జాగా..
చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు .. అయ్యా సేవింగ్స్ బోలెడంత ఉన్నాయి .. అబ్బాయి అమెరికా నుండి పంపారు. అక్కడ సంవత్సరానికి రూపాయి కూడా వడ్డీ రాదు. ఇండియాలో ఎక్కువ ఆదాయం వస్తుంది .. మమ్మల్ని ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు .. ఎంతవరకు చెయ్యాలి అని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలో .. ఈ వారం ‘ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్‘లో కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న .. లేదా చేసిన సేవింగ్స్‌ను ఎలా పొదుపు చేశారన్న దానిపై మీరు వివరణ ఇవ్వాలి. అది పన్ను చెల్లించగా మిగిలిన మొత్తమా .. పీఎఫ్ విత్డ్రాయలా, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ మొత్తమా, జీవిత బీమా నుండి వచ్చిందా .. మీ పుత్రరత్నం విదేశాల నుండి మీకు పంపినదా .. ఏదైనా ఫర్వాలేదు. సోర్సు అంటూ ఒకటి ఉండాలి. అదీ పక్కాగా ఉండాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఉండి తీరాలి. ఇక బంగారమా.. భవంతా .. లేక జాగానా.. ఏదైనా మీ ఇష్టం. రాయితీలు లేవ్.. అయినా సరే బంగారం కొనడం వల్ల ఎటువంటి రాయితీలు, మినహాయింపులు రావు. ఇన్‌కం ట్యాక్స్ చట్టంలో వీటి గురించి ఎటువంటి ప్రస్తావనా లేదు. మీరు కొన్న బంగారం ధరకి ‘సోర్స్‘ ఉండాలి. వివరణ ఇవ్వాలి. బంగారం ధర పెరగవచ్చు. తగ్గవచ్చు. ఈ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. అమ్మతే లాభం వస్తే ఆ లాభాన్ని లేదా నష్టాన్ని మూలధనం లాభనష్టాల్లా భావిస్తారు. దీర్ఘకాలికం అయితే 20 శాతం రేటు చొప్పున పన్ను వేస్తారు. దీర్ఘకాలికం కాకపోతే శ్లాబుని బట్టి రేటు ఉంటుంది. సెస్సు అదనం. బంగారమైనా ఆభరణాలైనా ఇదే తీరు. కొంటున్నప్పుడు ఎటువంటి రాయితీలు రావు. అమ్మినప్పుడు పన్ను భారం ఉంటుంది. పన్ను భారం చెల్లించితే మిగతా చాలా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ .. ఆలికి సింగారం.. అదనుకి బంగారం అన్న పాత సామెత ఈ రోజుకీ వర్తిస్తుంది. జాగా విషయంలో జాగా/ఫ్లాటుకి కూడా బంగారంలాగానే. కొన్నందుకు ఎటువంటి మినహాయింపు ఉండదు. అమ్మితే పన్ను భారం ఉంటుంది. వేలల్లో కొని కోట్లలో అమ్మిన సందర్భాలు ఉన్నా ఎంతో లాభం ఉంటుంది. అందులో 20 శాతం ప్రభుత్వానికి పోతుంది. మిగతా అంతా మనదే. ఇంత పెద్ద మొత్తంతో చక్కటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సొంతిళ్లు సొంత ఇల్లు ఎంతో మందికి కల. ఆ కల సాకారం అవ్వటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు. ఇంటి గురించి అంటే ఫ్లాటు లేదా ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం వంటివి వస్తాయి. సేవింగ్స్ / స్వంత డబ్బులతో కొంటే ఎటువంటి రాయితీలు రావు. ఎటువంటి మినహాయింపులు రావు. అప్పు చేసి కడితే / కొంటే ఆ అప్పు మీద వడ్డీ కట్టాల్సి ఉంటే .. వడ్డీకి మినహాయింపు ఉంది. అప్పు ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. ఇచ్చే వ్యక్తికి ‘సోర్స్‘ సామర్థ్యం ఉండాలి. కాగితాలు ఉండాలి. ఈ అప్పుని తిరిగి చెల్లించినందుకు గాను కూడా మినహాయింపు పొందవచ్చు. రుణం చెల్లించేటప్పుడు నిర్దేశించిన వారి నుంచే అప్పులు తీసుకుని ఉండాలి. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 దాకా మినహాయింపు ఇస్తారు. వడ్డీ నిమిత్తం రూ. 2,00,000 దాటితే ఇవ్వరు. మీరే ఆలోచించుకోండి. నిర్ణయం ఏదైనా చట్టబద్ధం అవ్వాలి. బ్లాక్ వ్యవహారాలు చేయకండి. మీ కుటుంబ అవసరాలు, ప్రాధాన్యతలు, మీ బాధ్యతలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: కష్టపడినా.. ఆదాయం పెరగడం లేదా? అయితే.. -
ఒమిక్రాన్ వ్యాప్తి, ప్రపంచ పరిణామాలు...! స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయా..?
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రత వార్తలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశా నిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్, ఓపెక్ సమావేశ నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు ఓ కన్నేయొచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది(2021) చివరి వారంలో మార్కెట్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొన్నప్పటికీ.., రెండు శాతం ర్యాలీ చేసింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 1,130 పాయింట్ల, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘గత రెండు వారాలుగా మార్కెట్ రికవరీ దశలో ఉంది. అయినంత మాత్రాన పరిస్థితులు చక్కబడ్డాయనే అంచనాకు రావడం తగదు. ఒమిక్రాన్ వేరియంట్ అసాధారణ వేగంతో వ్యాప్తి చెందుతోంది. ట్రేడర్లు అప్రమతత్త వైఖరి కొనసాగిస్తూ.., రక్షణాత్మకంగా హెడ్డింగ్ పొజిషన్లను తీసుకోవడం ఉత్తమం. సాంకేతికంగా నిఫ్టీ నిర్ణయాత్మకమైన 17350 స్థాయిని చేధించి 17354 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులతో అమ్మకాలు జరిగితే దిగువస్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది.’’ రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను పరిశీలిస్తే.., ఒమిక్రాన్ ప్రభావం.. ఒమిక్రాన్ వేరియంట్ రోజుకు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. గతేడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత అత్యధిక ఈ ఏడాది తొలిరోజు(జనవరి 1న) 22,775 కేసుల నమోదయ్యాయి. కేసుల కట్టడికి దేశంలో ఇప్పటికే ప్రధాన రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంక్షలను మరి కొంతకాలం పొడిగించే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, కెనడా దేశాల్లో రోజుకు రెండు లక్షల చొప్పున కేసులు నమోదుతున్నాయి. కేసుల సంఖ్య పెరిగితే ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిళ్లు పెరిగి, అనిశ్చితికి దారి తీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు స్టాక్ మార్కెట్ ముందుగా ఇప్పటికే విడుదలైన డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు, జీఎస్టీ వసూళ్లపై స్పందించాల్సి ఉంది. భారత్‌తో పాటు యూరోజోన్, అమెరికాలు నేడు (సోమవారం) డిసెంబర్ మార్కిట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేటాను విడుదల చేయనున్నాయి. ఇవే దేశాలు బుధవారం(జనవరి 5న) సేవా రంగ పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. ఓపెక్ దేశాలు సమావేశం మంగళవారం జరగనుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పా లసీ కమిటీ మినిట్స్ బుధవారం వెలువడున్నాయి. యూరోజోన్ రిటైల్ డేటా.., అమెరికా ఉద్యోగ గ ణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈ కీ లకమైన ఈ స్థూల గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. విదేశీ, దేశీయ విక్రయాల ప్రభావం గత రెండు నెలల ట్రెండ్‌ను కొనసాగిస్తూ డిసెంబర్లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. మొత్తం రూ.35,494 ల కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నా యి. 2021 ఏడాదిలో రూ.91,600 కోట్ల షేర్లను ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐల వరుస విక్ర యాలు సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు)ను ప్రభావితం చేయలేకపోయాయి. డీఐఐలు డిసెంబర్లో రూ.31,231 కోట్ల షేర్లను, గత సంవత్సరంలో రూ.94,800 కోట్ల కొన్నారు. కేంద్ర బడ్జెట్, అసెంబ్లీ ఎన్నికలు, ఒమిక్రాన్ కేసులు, వడ్డీరేట్ల వంటి పరిణామాల నేపథ్యంలో., భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకం కానుంది. చదవండి: కొత్త ఏడాదిలో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..! -
Pension Tax: పెన్షన్‌పైనా పన్ను వసూలు తప్పదా?
ప్రశ్న: నా పెన్షన్ రూ. 3,60,000. సేవింగ్స్ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్ మీద పన్ను పడుతుందా? : యం. మంగతాయారు, రాజమండ్రి సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్ లిమిట్ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్ లిమిట్ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్ లిమిట్ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు. ----------- ప్రశ్న: నేను గత వారం ఆదాయపు పన్ను రిటర్న్ వేసి రిఫండ్ క్లెయిమ్ చేశాను. ఈ రోజు రిఫండ్ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు / ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? : యం. శంకరరావు, సికింద్రాబాద్ సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. చెక్ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్మెంట్ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్మెంట్ చేస్తారు. ---------------- ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్ అప్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు? : జె.వి.యస్. యన్. మూర్తి, హైదరాబాద్ సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు. పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిఫుణులు -
Stock Market: లాభాల స్వీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నిఫ్టీ 17,350 స్థాయిని నిలుపుకుంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ కొనసాగితే 17,500–17,600 శ్రేణిని పరీక్షించవచ్చు. దిగువ స్థాయిలో 17,260 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,600 వద్ద మరో కీలక మద్దతు ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ తెలిపారు. సూచీల కదలికకు ఇవే కీలకం.. దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలే సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయని వారంటున్నారు. ఫెడ్ ట్యాపరింగ్, కరోనా కేసుల నమోదు వార్తలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారింవచ్చు. సానుకూలతలూ ఉన్నాయ్... జీడీపీతో సహా ఇటీవల కేంద్రం విడుదల విడుదలు చేసిన స్థూల ఆరి్థక గణాంకాలన్నీ మార్కెట్ వర్గాలను మెప్పించాయి. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో తిరిగి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ అంశాలతో అంతర్లీనంగా సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు దేశీయంగా అన్ని రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడంతో గతవారంలో సెన్సెక్స్ 2005 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 618 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. భారత్ వైపు ఎఫ్ఐఐల చూపు ... భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. డెట్ విభాగంలో ఆగస్టు పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత్, అమెరికా బాండ్ ఈల్డ్స్ మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. డాలర్ రూపాయి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈక్విటీ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలను విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలుగా మలుచుకున్నారు. అని జియోజిత్ ఫైనాన్స్ సరీ్వసెస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూ బాటలో వ్యాప్కోస్ జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్కోస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్కోస్లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. ఇదే యోచనలో నేషనల్ సీడ్స్ : కాగా.. ఇదే ఐపీఓ బాటలోనే మరో పీఎస్‌యూ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్(ఎన్ఎస్సీ)లోనూ 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రతిపాదించిన విషయం విదితమే. -
మీరు వ్యాపారస్తులా..ఐతే ఇది మీకోసమే...!
ఈ వారం ఐటీఆర్ ఫారం 3 గురించి తెలుసుకుందాం. ఈ ఫారం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు దాఖలు చేయవచ్చు. వ్యాపారం మీద కానీ, వృత్తిపరంగా గానీ ఆదాయం ఉన్నవారు మాత్రమే దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు మాత్రమే వేయడానికి ఈ ఫారం పనికొస్తుంది. అన్ని ఆదాయాలు .. అంటే.. జీతం, ఇంటిపై ఆదాయం, వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.. ఈ ఐదు ఉన్న వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. వ్యాపారం/వృత్తుల మీద కొంత టర్నోవరు/వసూళ్లు దాటిన వారు అకౌంట్స్ ఆడిట్ చేయించాలి. మిగతా వారికి ఆడిట్ వర్తించదు. ఆడిట్ ఉన్నా లేకపోయినా ఈ ఫారం దాఖలు చేయవచ్చు. ఫారం 1, ఫారం 2 కన్నా దీని నిడివి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని అంశాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఫారం నింపే ముందు సూచనలు/మార్గదర్శకాలను క్షుణ్నంగా చదవండి. దీని దాఖలుకు గడువుతేది 2021 సెప్టెంబర్ 30. డిజిటల్ సంతకం.. డిజిటల్ సంతకం నమోదు చేయించుకుని, ఈ ఫారంను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. అప్పుడు సంతకం అవసరం ఉండదు. ఆన్లైన్లో వేసి పాన్‌తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్లు అక్నాలెడ్జ్మెంట్ (దీన్నే ఫారం V అని అంటారు) మీద సంతకం పెట్టి, సకాలంలో బెంగళూరు పంపాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయపు వివరాలు సమగ్రంగా ఇవ్వాలి. వ్యాపారం వివరాలు, ఆస్తి.. అప్పుల పట్టీ, ఉత్పత్తి ఖాతా, లాభనష్టాల ఖాతా .. ఇలా సమస్త వివరాలూ ఇవ్వాలి. ఆడిట్ అవసరం లేకపోయినా పలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆడిట్ వర్తించే పక్షంలో మరిన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో వందకు పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆచితూచి సమాధానం ఇవ్వాలి. యస్/నో అన్న జవాబులు ఆలోచించి ఇవ్వాలి. అంకెలు అటూ, ఇటూ అయితే పెద్ద తలనొప్పి తప్పదు. అందుకే జాగ్రత్త వహించాలి. అవసరమైతే అసెస్మెంటు ఆన్లైన్లో మెషీన్ ద్వారా జరుగుతుంది. ఎదురుగా రాసినదాన్ని మెషీను పరిగణనలోకి తీసుకుంటుంది. తప్పొప్పుల వలన ఎంతో మందికి నోటీసులు వస్తాయి. ఈ అసెసీలకు కొన్ని STANDARDS (10) వర్తిస్తాయి. విదేశాల్లో ఆస్తి వివరాలు, ఆదాయాల వివరాలు ఇవ్వాలి. స్థిరాస్తులు, చరాస్తుల గురించి తెలియజేయాలి. జీఎస్టీలో డిక్లేర్ చేసిన టర్నోవరు వివరాలు ఇవ్వాలి. ఈ టర్నోవరుని ఆదాయపు పన్ను టర్నోవరుతో పోల్చి చూసినప్పుడు తేడాలు వస్తే ఆరా తీస్తారు. అంతే గాకుండా ఒక సంవత్సర కాలంలో వ్యాపా రానికి సంబంధించిన అన్ని కరెంటు ఖాతాల నుంచి రూ. కోటి దాటిన విత్‌డ్రాయల్ వివరాలు, సంవత్సర కాలంలో విదేశీయానం చేసినట్లయితే .. ఆ ఖర్చు రూ. 2,00,000 దాటితే ఆ వివరాలు, సంవత్సర కాలంలో విద్యుత్ బిల్లులు రూ. 1,00,000 దాటితే ఆ సమాచారం.. ఇవన్నీ తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త వహించి, ఈ ఫారం వేయాలి. సమాచారాన్ని సేకరించుకుని, సమీక్షించుకుని, సమగ్రంగా దాఖలు చేయండి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి , ట్యాక్సేషన్ నిపుణులు కె.వి.ఎన్ లావణ్య -
ఆదాయపు పన్ను చెల్లించే వారికి కొంత ఊరట..!
కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆదాయపు పన్ను చెల్లించే అసెస్సీలకు ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. ఇటు కోవిడ్ అటు వెబ్సైటు మొరాయించడం తదితర కారణాల వల్ల ఎన్నో అంశాల్లో గడువు పొడిగించింది. దీనితో తొందరపడకుండా నిదానంగా మన పని చేసుకోవచ్చు. ఉద్యోగికి ఊరటనిచ్చే విషయాలు ఓసారి చూస్తే.. కోవిడ్ నేపథ్యంలో చాలా మంది యజమానులు తమ కింద పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా సహాయం చేశారు. కొంతమంది.. ఉద్యోగులను ఆదుకున్నారు. కొంతమంది కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టారు. తాజా మార్పుల ప్రకారం 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లోనూ, ఆ తర్వాత యజమాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉద్యోగి విషయంలో మినహాయింపుగా భావిస్తారు. దీనిపరంగా ఉద్యోగికి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఎవరైనా ఉద్యోగి కోవిడ్ బాధితుడై మరణిస్తే, ఆ సమయంలో యజమాని ఆ కుటుంబానికి ఇచ్చిన నష్టపరిహారం.. ఎక్స్‌గ్రేషియా మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇది కూడా ఊరట కలిగించే అంశమే. పాన్ కార్డుతో, ఆధార్ అనుసంధానానికి గడువు తేది 2021 జూన్ 30. దీన్ని కూడా కేంద్రం 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించింది. ఇక్కడ సమస్య సమయానిది కాదు. ఆధార్ నిర్వాహకులు, ఇన్‌కం ట్యాక్స్ విభాగం మధ్య సమాచారం విషయంలో సయోధ్య, సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఎవరి మటుకు వారే తమ సమాచారమే కరెక్ట్ అని, సర్దుబాటుకు ఒప్పుకోవడం లేదు. అసెసీ మాట విన డం లేదు. అసెసీ నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుని ముగించాల్సిన అనుసంధాన ప్రక్రియను ‘అసెస్మెంట్‘ అంత కష్టం చేస్తున్నారు. దీని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. ముందుగా చెప్పినట్లు చాలా అంశాల్లోలాగే ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద చెల్లింపులకు కూడా గడువు తేదిని పొడిగించారు. అయితే, మరింత సమయం లభిస్తున్నప్పటికీ.. మీరు తగిన సమాచారం, కాగితాలతో సిద్ధంగా ఉండటం శ్రేయస్కరం. ఆ తర్వాత పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండదు. మూలధనం మీద పన్ను లెక్కించడం కోసం, మినహాయింపు పొందడం కోసం ఇల్లు కొనడం, బాండ్లు కొనడం వంటి వాటికి మీమీ లావాదేవీలను బట్టి గడువు ఉంటుంది. ఈ గడువును 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 దాకా పొడిగించారు. ఉదాహరణకు బాండ్లు కొనడానికి గడువు తేది 30–6–2021తో ముగిసినట్లయితే, దాన్ని ఇప్పుడు 30–9–2021 దాకా పొడిగించారు. మీరు బాండ్లను 30–9–2021లోగా కొని, మూలధన లాభాల విషయంలో మినహాయింపులు పొందవచ్చు. ప్రస్తుతానికైతే ఇవి ఊరట కలిగించే అంశాలు. సందేహం లేదు. సమయానుకూలంగా గడువు తేదిని మళ్లీ పొడిగించవచ్చు. కానీ దాని కోసం ఎదురు చూడకుండా అన్నీ అమర్చుకుని సిద్ధంగా ఉండండి. వెబ్సైటు అందుబాటులోకి రాగానే ఫైల్ చేయండి. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు చదవండి: Stockmarket:లాభాల రింగింగ్,బ్యాంక్స్, ఐటీ గెయిన్