Financial system
-
పీనోట్ పెట్టుబడులు హైజంప్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను ప్రతిబింబిస్తూ క్యాపిటల్ మార్కెట్లలో పారి్టసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా పెట్టుబడులు జోరు చూపుతున్నాయి. 2023 మే చివరికల్లా రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గత ఐదేళ్లలోనే అత్యధికంకాగా.. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పెట్టుబడులు విస్తరించాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం వరుసగా మూడో నెలలోనూ పీనోట్ పెట్టుబడులు పుంజుకున్నాయి. వీటిని దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ఇన్వెస్టర్లకు జారీ చేస్తుంటారు. అయితే ఇందుకు తగిన అంశాలను పరిశీలించాక మాత్రమే పీనోట్లను జారీ చేస్తారు. సెబీ వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా పీనోట్ పెట్టుబడుల విలువ రూ. 95,911 కోట్లుగా నమోదుకాగా.. మే నెలకల్లా రూ. 1,04,585 కోట్లను తాకాయి. అంతక్రితం మార్చికల్లా ఇవి రూ. 88,600 కోట్లుకాగా.. ఫిబ్రవరిలో రూ. 88,398 కోట్లు, జనవరి చివరికల్లా రూ. 91,469 కోట్లుగా నమోదయ్యాయి. 2018 మార్చి తదుపరి ఈ మే నెలలో పీనోట్ పెట్టుబడులు భారీగా లభించాయి. దేశ ఆర్థిక పటిష్టతకుతోడు.. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు విశ్లేషకులు తెలియజేశారు. -
రిలయన్స్ నుంచి.. ప్రత్యేక కంపెనీగా జియో ఫైనాన్షియల్
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసులను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల సందర్భంగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. వెరసి సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్(ఆర్ఎస్ఐఎల్)ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్) పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ షేరుకీ ఒక జేఎఫ్ఎస్ఎల్ షేరుని జారీ చేయనుంది. కంపెనీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ చేయనుంది. జేఎఫ్ఎస్ఎల్.. కన్జూమర్, మర్చంట్ రుణాల బిజినెస్‌తోపాటు.. బీమా, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ బ్రోకింగ్ తదితర విభాగాలలోకి ప్రవేశించనున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా విస్తరణ, భాగస్వామ్య సంస్థల ఏర్పాటు, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలను చేపట్టనున్నట్లు తెలియజేసింది. డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ అనుమతిగల జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్(ఆర్ఐఐహెచ్ఎల్)లో పెట్టుబడులను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించింది. చదవండి: ఆర్ధిక మాంద్యంపై ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే -
ఆర్థిక మోసాలు.. నయా రూటు!
గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్‌గా చేస్తున్నాం. మొబైల్ నుంచే షాపింగ్ చేస్తున్నాం. కొన్ని క్లిక్‌లతో ఇన్‌స్టంట్‌గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఫోన్ కాల్ వెరిఫికేషన్ టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్ నంబర్, పాన్, ఆధార్‌తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్‌ను డిస్కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు.. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్ఎంఎస్ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్ కాల్ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి. అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు. ఏంటి మార్గం..? ఆధార్, పాన్ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్‌కు వచ్చే ఎస్ఎంఎస్ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్అప్లికేషన్ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఫీజు ఎత్తివేత 2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్ కార్డు అయినా ఉంది. క్రెడిట్ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్ కట్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్‌కు వరుసగా వచ్చే డెబిట్ లావాదేవీల ఎస్ఎంఎస్లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు. ఏంటి మార్గం..? తెలియని వ్యక్తులు కాల్ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్ కనెక్ట్ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి, మీ క్రెడిట్ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్‌ను కట్ చేయాలి. బ్యాంకు యాప్‌లోకి వెళ్లి కార్డు ఆన్లైన్ లావాదేవీల యాక్సెస్‌ను, అంతర్జాతీయ యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్‌ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక
తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో అఫ్గనిస్తాన్ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. యూఎన్ డెవలప్మెంట్ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్ డాలర్ల విలువైన గూడ్స్, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే. అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్డీపీ నివేదికలో పేర్కొంది. ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్డీపీ అభిప్రాయపడింది. మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్, డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
ప్రజల్లో ఆర్థిక విజ్ఞానం పెంచాలి
ముంబై: ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఆర్బీఐ ముందుకు వచ్చింది. ‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020– 2025’ (ఎన్ఎస్ఎఫ్ఈ) పేరుతో ఆర్బీఐ గురువారం డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది. తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్ (సమాచారం), కొలాబరేషన్ (సహకారం)ను ప్రధానంగా ఆర్బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉన్న విషయం గమనార్హం. ‘‘ఆర్థిక అక్షర జ్ఞానం ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడుతుంది. అదే విధంగా కస్టమర్లు అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది’’ అంటూ ఆర్బీఐ ఎన్ఎస్ఎఫ్ఈ నివేదిక వివరించింది. ఎన్‌ఎస్‌ఎఫ్‌ఈలో పేర్కొన్న అంశాలు ► వివిధ వర్గాల ప్రజల్లో (విద్యార్థులు, టీచర్లు, యువత, మహిళలు, ఉద్యోగాల్లో కొత్తగా చేరే వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వృద్ధు లు, వికలాంగులు తదితర) ఆర్థిక అంశాల పట్ల అవగాహనకు ప్రత్యేకంగా పాఠాలు బోధించాలి. ► ఆర్థిక లక్ష్యాలకు వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో పాల్గొనేలా చేయాలి. పొదుపును ప్రోత్సహించాలి. ► రుణాలకు సంబంధించి క్రమశిక్షణను అభివృద్ధి చేయాలి. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్న సంస్థల ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ► డిజిటల్ ఆర్థిక సేవలను మరింత భద్రమైన, సురక్షితంగా వాడుకునేలా మెరుగుపరచాలి. ► జీవితంలోని వివిధ దశల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా (రిస్క్ మేనేజ్మెంట్) తగినంత బీమా కవరేజీ, వృద్ధాప్య జీవనం కోసం అనుకూలమైన పెన్షన్ ఉత్తులను తీసుకునే ప్రణాళిక అవసరాన్ని తెలియజేయాలి. ► స్కూల్ పాఠ్యాంశాల్లో ఆర్థిక విద్యను భాగం చేయాలి. ఇందుకు సంబంధించి 9, 10వ తరగతుల్లో కంటెంట్‌ను మెరుగుపరచాలి. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో సమగ్ర ఆర్థిక విద్యను భాగం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సైతం ఆర్థిక విషయాలపై శిక్షణ ఇవ్వాలి. ► ఆర్బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ) సంస్థ ఎన్ఎస్ఎఫ్ఈ 2020–25ని రూపొందించింది. ► ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతు..: ‘‘ఎన్ఎస్ఎఫ్ఈ డాక్యుమెంట్ ఉద్దేశం.. భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థల లక్ష్యానికి మద్దతునివ్వడమే. వివిధ వర్గాల్లోని ప్రజల్లో తగినంత విజ్ఞానాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వారిలో ప్రవర్తనపరమైన మార్పులు తీసుకురావడం వల్ల.. తమ ద్రవ్యపరమైన అంశాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడంతోపాటు, భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోగలరు’’అని ఆర్బీఐ పేర్కొంది. -
భారత్‌కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం
న్యూఢిల్లీ: చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్‌కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్‌కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి. ► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్‌లో ఎగుమతులు భారీగా మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్‌లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం. ► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్ చెల్లింపుల సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉండనుంది. ► భారత్ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా. దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. -
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ముంబై: ఆర్థికంగా, ఆరోగ్య పరంగా గడిచిన వందేళ్లలో ప్రపంచం ఎన్నడూ ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కోవిడ్‌తో ఉద్యోగాలు, ఉత్పత్తి, సంక్షేమం వంటి అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఎన్నెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలిచిన భారత ఆర్థి క, ద్రవ్య వ్యవస్థలకు ఇది అత్యంత విషమ పరీక్ష’ అన్నారాయన. శనివారమిక్కడ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ కాన్క్లేవ్లో దాస్ మాట్లాడారు. దేశ ద్రవ్య వ్యవస్థను చక్కదిద్దడానికి ఆర్బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన చర్యలు ఫలితాలనిస్తున్నాయన్నారు. లాక్‌డౌన్‌లోను, తదనంతరం కూడా ఆర్థిక వృద్ధి క్షీణించిందని, ఫలితంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగాయని దాస్ చెప్పారు. బ్యాంకుల మూలధనం క్షీణించిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. పరిశ్రమ మెరుగ్గా స్పందించింది ‘ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విశ్వాసాన్ని పెంపొందించడం, వృద్ధిని పునరుద్ధరించడం ఆర్బీఐ తక్షణ కర్తవ్యాలు. నిజానికి సంక్షోభ సమయంలో భారతీయ పారిశ్రామిక రంగం, సంస్థలు మెరుగైన రీతిలో స్పందించాయి. చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు ఎలాంటి ఆటుపోట్లకు గురికాకుండా నిలిచాయి’ అని దాస్ వ్యాఖ్యానించారు. సప్లయ్ చెయిన్ పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? డిమాండ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేదెప్పుడు? ఆర్థికాభివృద్ధిపై కరోనా ప్రభావం ఎలా ఉండనుంది వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని పరిరక్షిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకూ లోను కాకుండా చూస్తూ.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఆర్బీఐ కృషి చేస్తోందన్నారు. ఫైనాన్షియల్ రంగం మాత్రం ఆంక్షల సడలింపుల కోసం ఎదురు చూడకుండానే తిరిగి మామూలు స్థితికి రావాల్సిన అవసరముందని చెప్పారు. రిజల్యూషన్ కార్పొరేషన్.. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలతో వ్యవహరించడానికి చట్టబద్ధత కలిగిన ’రిజల్యూషన్ కార్పొరేషన్’ అవసరమని శక్తికాంత దాస్ చెప్పారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆయా సంస్థలను ముందుగానే గుర్తించి హెచ్చరిండానికి, వీలైతే పునరుద్ధరించడానికి వీలుంటుందన్నారు. ‘దీని ఏర్పాటుతో పాటు ఇతర నిబంధనలతో కూడిన ఫైనాన్షియల్ రిజొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్ఆర్డీఐ) బిల్లును ప్రభుత్వం 2017లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే, డిపాజిటర్ల డబ్బు కు రక్షణ ఉండదంటూ వ్యతిరేకత వ్యక్తం కావడంతో దాన్ని వెనక్కి తీసుకుంది’ అని వివరించారు. కానీ రిజల్యూషన్ కార్పొరేషన్ అవసరం చాలా ఉందన్నారు. -
ఎకానమీ కోసం మరో ప్యాకేజ్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారీగా దెబ్బతింటున్న ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరిచేందుకు మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. లాక్డౌన్ తరువాత ఆర్థిక రంగంలో నెలకొననున్న వివిధ పరిస్థితులను బేరీజు వేస్తోంది. అయితే, మరో ప్యాకేజ్‌ను ప్రకటించే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లాక్డౌన్ అనంతర పరిస్థితులను అంచనా వేసే పనిలో ఉన్నామన్నారు. అలాగే, కొన్ని సంక్షేమ, ఇతర ప్రభుత్వ పథకాలను లాక్డౌన్ అనంతర పరిస్థితులకు అనుగుణంగా మార్చే అవకాశాలపై కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఏదైనా నిర్ణయం ప్రకటిస్తే.. అది కేంద్రం తీసుకున్న మూడో నిర్ణయమవుతుంది. ప్రధాని మోదీ మార్చి 24న లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి కొద్ది గంటల ముందు.. ఆర్థికమంత్రి పన్ను చెల్లింపుదారులు, పారిశ్రామిక వేత్తలకు కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించారు. రెండు రోజుల తరువాత మార్చి 26న కరోనా ప్రభావిత రంగాలను ఆదుకోవడం కోసం రూ. 1.7 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజ్‌ను కూడా ప్రకటించారు. కోవిడ్ 19పై పోరు కోసం ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన 10 సాధికార బృందాల్లో ఒకటి ఆర్థిక రంగ పునరుత్తేజంపై పని చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా లాక్డౌన్ అనంతర పరిస్థితులను సమీక్షిస్తోంది. -
ఇన్వెస్ట్ చేయాలా..? విక్రయించాలా..?
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ‘లాక్’ వేసి పోరాటం సాగిస్తున్నాయి!. మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లౌక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, సేవలు మినహా మిగిలిన పరిశ్రమలు, వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. దీంతో ఎంతోమంది జీవనోపాధి అనిశ్చితిలో పడింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రధాన సూచీలు వాటి గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే 60 శాతానికి పైగా క్షీణించినవీ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆత్మరక్షణలోకి నెట్టేవే. అదనంగా ఇన్వెస్ట్ చేయాలా..? లేక ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. వాటికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. భయపడక్కర్లేదు... తమ పెట్టుబడులను సమీక్షించుకునేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ గరిష్టం నుంచి 40 శాతం వరకు పడిపోయి గత వారం కొంత రికవరీ చూపించింది. నిజానికి ఈ తరహా భారీ కరెక్షన్ను 2008లోనూ చూశాం. అయినా ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనం చూసి భయపడిపోయి ఉన్న ఈక్విటీ పెట్టుబడులను అమ్మేసుకుని వెళ్లిపోవడం ఈ తరుణంలో చేయాల్సిన పని కాదంటున్నారు విశ్లేషకులు. ‘‘నగదుకు అత్యవసరం లేకపోతే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో తమ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) కొనసాగించుకోవాలి’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకురాలు దీపాలిసేన్ పేర్కొన్నారు. ఈ రెండూ కొనుగోలు ఖర్చును సగటుగా మారుస్తాయని, మార్కెట్ కరెక్షన్లో మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్పడు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని పరిశీలించొచ్చన్నారు. అది కూడా బ్యాంకు సేవింగ్స్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యి, డెట్ ఫండ్స్, ఇతర నిల్వలన్నీ అడుగంటిన తర్వాతే ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏక మొత్తంలో పెట్టుబడులను కూడా ఈ తరుణంలో చేసుకోవచ్చని, కాకపోతే ఒకే విడత కాకుండా పలు విడతలుగా చేసుకోవాలని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు. అత్యవసరాలు చూసుకోవాలి... ఈ సమయంలో జీవన అవసరాల కోసం నిధులు కావాల్సిన వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు ఈపీఎఫ్ బ్యాలన్స్‌ను కొంత వెనక్కి తీసుకోవడాన్ని తాను సూచిస్తానని మ్యాక్స్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ప్రహరాజ్ తెలిపారు. ఈపీఎఫ్ సభ్యులు తమ భవిష్య నిధి నుంచి 75 శాతాన్ని లేదా మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తం అయితే ఆ మేరకు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లౌక్‌డౌన్ సమీప కాలంలో వృద్ధి అవకాశాలను దెబ్బతీయగా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, వైరస్ నివారణ చర్యలతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పట్ల ఉన్న భయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రస్తుతం చౌకగా మార్చేశాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పేర్కొంది. పీఈ, పీబీవీ, జీడీపీలో మార్కెట్ క్యాప్ కొలమానాల ఆధారంగా ఈ సంస్థ రూపొందించిన వ్యాల్యూషన్ ట్రాకర్ మార్చి 23న 72.6 స్థాయికి చేరింది. అంటే దూకుడుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది దీని సంకేతం. చివరిగా ఈ స్థాయిలో వ్యాల్యూషన్ ట్రాకర్ కనిపించింది 2008–09లోనే కావడం గమనార్హం. మిగులు నిధులు కలిగిన వారు, రోజువారీ ఖర్చులకు సరిపడా పక్కన పెట్టేసి, అలాగే అత్యవసర పరిస్థితులకు కొంత కేటాయించుకున్న తర్వాత.. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల కోసం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడుల కేటాయింపు దోహదపడుతుందా? లేదా అని ఓ సారి సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు కూడా చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్గం.. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులను ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చే స్పందన ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయమనే. ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాల కోసం వేచి చూసేవారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సిప్ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్స్ ధరల్లో దిద్దుబాటుతో అవి చాలా ఆకర్షణీయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్‌కేర్, టెలికం రంగాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించగలవన్న అంచనాతో ఉన్నారు. ఇన్వెస్టర్లు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని, వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుందని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఈవో సందీప్‌సిక్కా తెలిపారు. మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి, సీజన్ వారీగా ఇన్వెస్ట్ చేసే వారికి ఇండెక్స్ ఫండ్స్ అనుకూలమైనవిగా సిక్కా పేర్కొన్నారు. యాక్టివ్‌గా నిర్వహణతో కూడిన ఫండ్స్‌తోపాటు, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకోవాలన్నారు. ‘‘మార్కెట్లు రికవరీ అయినప్పుడు ముందుగా సూచీల్లోనే అది ప్రతిఫలిస్తుంది. ప్రతీ పతనం తర్వాత బలమైన రికవరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటీఎఫ్‌లు చక్కని ఆప్షన్’’ అని సిక్కా వివరించారు. ఈక్విటీల్లో పెట్టుబడులు.. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలని, మిగులు నిధులు ఉంటే దీర్ఘకాలం కోసం క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని యస్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో కన్వర్ వివేక్ సూచించారు. ‘‘స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు బేర్ మార్కెట్లు ఎంతో అనుకూలమైనవి. మార్కెట్ల పనితీరు దారుణంగా ఉందంటే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్నట్టే’’ అని ఆశికా వెల్త్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌జైన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న నిధుల్లో 40 శాతాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలి. ఇవి 7–8 శాతం వరకు రాబడులను ఇస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను మిడ్‌క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్‌లో వచ్చే ఆరు నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి’’ అని అమిత్‌జైన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా డయాగ్నస్టిక్స్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇంటి నుంచే పని చేస్తున్నందున డేటాకు డిమాండ్ భారీగా ఉంటుందని కనుక టెలికం కంపెనీలను సైతం పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం తక్కువే ఉంటుందన్నారు. -
ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి, ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థపై మందగమనం ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శుక్రవారం వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే ఉందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 4.5 శాతంతో జీడీపీ ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబరు ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ తన వృద్ధి అంచనాను 240 బేసిస్ పాయింట్లు తగ్గించి 5 శాతంగా పేర్కొంది. గ్లోబల్ రిస్క్‌లు, స్థూల ఆర్థిక పరిస్థితులపై రిస్క్ పర్సెప్షన్స్, ఫైనాన్షియల్ మార్కెట్ రిస్క్‌లు లాంటి ప్రధాన రిస్క్ గ్రూపుల ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై సాధారణ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఏదేమైనా, దేశీయ వృద్ధి, ఆర్థిక, కార్పొరేట్ రంగం, బ్యాంకుల ఆస్తి నాణ్యత వంటి వివిధ రంగాల్లోని నష్టాల అవగాహన 2019 ఏప్రిల్ -అక్టోబర్ మధ్య పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. -
కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్ సీడ్ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు పేరుకుపోవడం కార్వీ ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు ఒకరిని చూసి ఒకరు కార్వీపై ఫిర్యాదులు చేస్తున్నారు. తన ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను బ్యాంకు ఖాతాకు మళ్లించాల్సిందిగా కోరితే, సర్వర్ సమస్య అంటూ దాటవేస్తున్నారని దీపక్ ముంద్రా అనే ఇన్వెస్టర్ ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు కోరినా సర్వర్ సమస్య అంటున్నారని, కారీ్వలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినా చెల్లింపులు జరపడం లేదని, కార్వీ చర్యలతో నమ్మకం కోల్పోయామని పుణే ఇన్వెస్టర్ బందియా షా ఆవేదన వ్యక్తం చేశారు. కార్వీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సాయం చేయాలంటూ సెబీని కోరారు. 20 రోజులుగా వెంటపడుతున్నా స్పందించడం లేదంటూ ఎంకేఆర్ అనే ఇన్వెస్టర్ ఆరి్థక శాఖకు విన్నవించారు. వందకుపైగా కాల్స్ చేసినా ఫలితం లేదని గీతేష్ యోలే అనే ఇన్వెస్టర్ ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ‘భారత్‌లో అసలేం జరుగుతోంది. బీఎంఏ దారిలో కార్వీ’ అని ట్వీట్ చేశారు. -
ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దాదాపు 14వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. అలాగే మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ. 8 వేల కోట్ల బిల్లులనూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. హడావిడిగా మార్చి 18, 19, 20వ తేదీల్లో బిల్లులను సమర్పించడం అంటే వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ బిల్లులను స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రూ. 8 వేల కోట్ల బిల్లులను తిరస్కరిస్తూ మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా బిల్లులు సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సూచించింది. ఇవన్నీ కూడా వివిధ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులతో పాటు వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న నిధులకు సంబంధించిన బిల్లులని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలలకే ఓటాన్ అకౌంట్ కేటాయింపులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి ఆయా శాఖలకు నాలుగు నెలలకు కేటాయించిన నిధులు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది పలు పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ. 4 వేల కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించేశారని, ఇప్పుడు ఆ నిధులనూ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చంద్రబాబు అతి తెలివితేటలకు, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ఖజానాను అస్థవ్యస్తం చేసేశారనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విభాగాల్లో అదే తీరు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన బిల్లులు రాకపోవడంతో అనేకమంది ఇప్పుడు సచివాలయంలోని ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘వివిధ రంగాల కార్పొరేషన్లకు చెందిన నిధులను లాగేసుకోవడంతో ఆయా కార్పొరేషన్ల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఆఖరికి గ్రామీణాభివృద్ధి సెస్‌ను కూడా దారి మళ్లించేశారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల మేరకు కాకుండా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యం మేరకు నిధులు ఇవ్వడంతో ఆ బడ్జెట్‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ఆర్థిక ఏడాది కేటాయింపులు గతేడాది బిల్లుల చెల్లింపులకే సరిపోతాయి. ప్రస్తుతం వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త ప్రభుత్వానికి చాలా సమయం.. ‘గతేడాది పేదల గృహ నిర్మాణాలకు బిల్లులను చెల్లించలేదు. విద్యుత్ సబ్సిడీ కూడా చెల్లించకుండా ట్రాన్స్‌కో ద్వారా బయట అప్పులు చేయించారు. రేషన్ బియ్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులనూ ఇవ్వకుండా పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు చేస్తున్న అప్పుల నుంచి సబ్సిడీ భరించాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తలకిందులైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లారంటే పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5న రూ. 92.08 కోట్లు, 6న రూ. 2,513.77 కోట్లు, 9న రూ. 650.61 కోట్ల మేర ఓడర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం గమనార్హం. -
భారత్ నెత్తిమీద ఆర్థిక పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వం హయాంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందంటూ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. అప్పుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 58 పైసల నుంచి 62 పైసల మధ్య ఊగిసలాడింది. ఇప్పుడు అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో గురువారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ మొన్నెన్నడు లేనివిధంగా 69.10 రూపాయలకు పడిపోయింది. డాలర్ విలువ పడిపోవడం అంటే భారత్ దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ఆర్థిక భారం అధికమవుతుందన్నది అర్థం. ముఖ్యంగా మనం దిగుమతి చేసుకునే 80 శాతం చమురుపై అధిక ఆర్థిక భారం పడుతుంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం శాతం పెరిగిపోయి సామాన్య మానవులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. నేడు చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడపోవడం వల్ల ముంచుకొచ్చే మరో ప్రమాదం గురించి తెల్సిందే. భారత్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెనక్కి పోతాయి. గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దేశం నుంచి 670 కోట్ల డాలర్ల పెట్టుబడులను విదేశీయులు ఉపసంహరించుకున్నారు. రూపాయి మారకం విలువ పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల ఇప్పటికే దేశాన్ని పీడిస్తున్న సమస్యలు రెట్టింపు అవుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు తీవ్రమవుతున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ ఏటా 60 లక్షలకు మించి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు (అవి కూడా ఖాళీ అవుతున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారానే). దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం కూడా మందగమనంతోనే నడుస్తోంది. జాతీయ స్థూల ఉత్పత్తి కూడా గతేడాది 6.5 శాతమే. జీడీపీని రెండంకెలు దాటిస్తామంటూ మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ గత నాలుగేళ్లుగా జీడీపీ వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 6.5 శాతం మధ్యనే కొట్టుమిట్టాడుతోంది. మోదీ ప్రభుత్వానికి ముందు అంటే, 2013–2014 ఆర్థిక సంవత్సరంలో జీడీపి రేటు 7.5 శాతం నమోదయింది. మరోపక్క బ్యాంకుల్లో మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు ఆందోళనకరంగా పెరిగి పోతున్నాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతం గత మార్చి నెల నాటికి 11. 6 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి 12.2 శాతానికి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూలిగే నక్కమీద తాడి పండు పడ్డట్లు అమెరికా ఒత్తిళ్లకు లొంగిన భారత్ గురువారం నాడు ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తామని ప్రకటించింది. భారత్‌కు చమురును దిగుమతి చేస్తున్న మూడవ అతిపెద్ద దేశం ఇరాన్. ఇరాన్ నుంచి దిగుమతులను నిలిపివేస్తే చమురు దిగుమతులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. చమురు ధరలు పెరుగుతున్నా, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలు బెడిసికొట్టినా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా కుప్పకూలకపోవడం అదృష్టమేనని, ఇది మరెంతో కాలం కొనసాగే అవకాశం లేదని ‘జేపీ మోర్గాన్’ చీప్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమిస్ట్ జహంగీర్ అజీజ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన భారత్‌లో ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానన్నది నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి. ఇప్పుడాయన ఆర్థిక వ్యవస్థ గురించి అసలు పట్టించుకోకుండా ప్రధానంగా రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆయన హయాంలో అరుణ్ జైట్లీ పార్ట్‌టైమ్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తుండగా, ప్రధాన ఆర్థిక వ్యూహకర్త (చీఫ్ స్టాటిస్టిసియన్) మొదటి నుంచి లేరు. ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ ఇటీవలనే తన రాజీనామాను ప్రకటించారు. -
దేశానికి ఆదర్శంగా నిలిచాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిపాలనపై పట్టు సాధించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించేందుకు బుధవారం కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని, ఆర్థిక శాఖ కేవలం నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు మనం నిలదొక్కుకోగలమా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ నేడు దేశ మన్ననలు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకున్నారంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌ను మంత్రి అభినందించారు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు చెల్లిస్తే సొమ్ము భద్రంగా ఉంటుందనే భావన అందరిలోనూ వచ్చిందని, అందుకే చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో పురోగతి సాధిం చామన్నారు. నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధి కల్పనలోనూ వృద్ధి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని వివరించారు. -
సెంట్రల్ ఎక్సైజ్ శాఖ పాత్ర కీలకం
హైదరాబాద్: సెంట్రల్ ఎక్సైజ్ శాఖ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ డాక్టర్ సతీశ్‌చంద్ర అన్నారు. గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 74వ సెంట్రల్ ఎక్సైజ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీశ్‌చంద్ర మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారుల పట్ల అధికారులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిం చారు. జీఎస్టీ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, ఆ బిల్లు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిద్దామని అన్నారు. ఒలంపిక్ రజత పతక గ్రహీత పి.వి. సింధు మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుకు ప్రచారకర్తగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఎంపిక తన భవిష్యత్‌పై మరింత బాధ్యతను పెంచిం దన్నారు. కమిషనర్ సందీప్ ఎం. భట్నాగర్ మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు రావడంతో అధికారుల్లో ఆందోళనగా ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు తెలిపారు. పన్ను వసూళ్లలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
మాల్యాకు రుణాలిప్పించింది వారే..
మన్మోహన్, చిదంబరంలపై బీజేపీ ఆరోపణలు న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ సంచలన అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీకి యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి చిదంబరంలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సాయం చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలను మన్మోహన్, చిదంబరంలు కొట్టిపడేశారు. మన్మోహన్‌కు మాల్యా లేఖలు కింగ్ఫిషర్కు అప్పులు ఇప్పించేందుకు జోక్యం చేసుకోవాలంటూ మాల్యా.. మన్మోహన్‌కు లేఖలు రాశారని, తర్వాత ఆ కంపెనీకి రుణాలు అందాయని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో చెప్పారు. ‘2011 నవంబర్ 14న అలాంటి ఒక లేఖ రాసిన తర్వాత.. కింగ్‌ఫిషర్ ఇబ్బందులనుంచి గట్టెక్కేందుకు మార్గాలు అన్వేషించాలని మన్మోహన్ మీడియాతో చెప్పారు.. బ్యాంకుల నుంచి నిధులు విడుదల చేయించాలని మాల్యా మరో లేఖ రాశారు. కింగ్‌ఫిషర్.. డియాజియో కంపెనీతో ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నప్పుడు.. ఎస్బీఐ నుంచి నిరభ్యంతర పత్రం పొందేందుకు జోక్యం చేసుకోవాలని మాల్యా 2013 మార్చిలో చిదంబరానికి లేఖ రాశారు. మాల్యాకు అప్పులు ఇప్పించేలా చేసిన అవినీతి చేతులు చిదంబరం, మన్మోహన్లవే. ఇందులో 10, జన్‌పథ్(సోనియా నివాసం) పాత్ర కూడా ఉందా?’ అని పాత్రా అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగా లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిశోధన విభాగం తయారు చేసిన ‘రియల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ 2017’ డాక్యుమెంట్‌ను ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విడుదల చేసి ప్రసంగించారు. ‘భారత ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో లేదన్నది స్పష్టం. ఐఎంఎఫ్ కూడా మన స్థూల జాతీయోత్పత్తి(జడీపీ) వృద్ధి రేటును తగ్గించింది. అది 7.6 శాతంగా కాకుండా 6.6 శాతం కంటే తక్కువగా నమోదవనుంది’ అని అన్నా రు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం చెబుతున్న జీడీపీ లెక్కలు సందేహాస్పదమన్నారు. -
ఆదాయపు పన్నుపైనే ఆశలు!
బేసిక్ లిమిట్‌ను పెంచాలంటున్న నిపుణులు 10 శాతం శ్లాబును మరింత విస్తరించాలి కొనుగోళ్లను పెంచటం తక్షణ కర్తవ్యం అలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు దానికి పన్ను మినహాయింపులే శరణ్యం ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు ఈ సారి అరుణ్ జైట్లీ పెట్టబోయే బడ్జెట్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి... ఫిబ్రవరి నెలాఖరుకు బదులు ఈ సారి ఫిబ్రవరి నెల మొదట్లోనే పెడుతున్నారు. రెండోది పెద్ద నోట్లను రద్దు చేసి... డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికంటూ పలు చర్యలు చేపట్టాక ఈ బడ్జెట్‌ను తెస్తున్నారు. మూడోది... పెద్ద నోట్ల రద్దుతో ఇపుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదనే విమర్శలొస్తున్న తరుణంలో, ఎకానమీకి ఊతమివ్వటానికి ఈ బడ్జెట్లో పలు చర్యలు తీసుకోవచ్చనే అంచనాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు... ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో జైట్లీ ఈ సారి గత రెండు బడ్జెట్లకు భిన్నమైన బడ్జెట్ తెస్తారని ఫిక్కీ, సీఐఐ, డెలాయిట్, కేపీఎంజీ వంటి ఆర్థిక సంస్థలతో సహా వివిధ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చి పరుగులు పెట్టించాలంటే ప్రధానంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మినహాయింపులు తప్పనిసరి అన్నది వారి విశ్లేషణ. వారి ప్రతిపాదనల వివరాలివీ... ఫిక్కీ, ఏసీఏఐ ప్రతిపాదనలు 1. ఆదాయపు పన్ను ప్రాథమిక మినహాయింపు ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలి. 2. మినహాయింపులు పోగా ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఉండే పన్ను చెల్లించాల్సిన ఆదాయంపై 10 శాతం పన్ను విధిస్తున్నారు. దీన్ని రూ.10 లక్షల ఆదాయం వరకూ వర్తింపజేయాలి. 3. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉటే దానిపై 20 శాతం పన్ను విధిస్తున్నారు. ఆ పరిమితిని రూ.20 లక్షల వరకూ వర్తింపజేయాలి. 4. ఇక రూ.10 లక్షలు పైబడి పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉంటే... వారు ప్రస్తుతం 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. దాన్ని రూ.20 లక్షలు పైబడ్డ వారికి మాత్రమే వర్తింపజేయాలి. డెలాయిట్ సర్వేలో తేలిందిదీ... ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో... రూ.2.50 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పలువురు సూచించారు. దీనివల్ల ప్రజల వద్ద నగదు మిగులుతుందని, కొనుగోళ్లు పెరుగుతాయని, పొదుపు పెరిగి పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని సంస్థ అంచనా వేస్తోంది. అలాగే ఐటీ చట్టం 80సీ మినహాయింపుల్ని రూ.1,50,000 నుంచి రూ.2,50,000కు పెంచాలన్నది మరో సూచన. అంతేకాక నేషనల్ పింఛన్ పథకం, భవిష్య నిధి(పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణపై పూర్తిగా పన్ను మినహాయించాలి. ముందస్తు పన్ను చెల్లింపునకు మినహాయింపును మరింత పెంచాలి. వైద్య ఖర్చుల మినహాయింపు రూ. 15,000 నుంచి రూ.50,000కు పెంచాలి. ట్రావెలింగ్ అలవెన్స్‌పై రూ. 5,000 వరకు మినహాయింపు ఇవ్వాలి. శ్లాబుల్ని సవరించాలి: సీఐఐ పన్ను శ్లాబుల్ని సవరించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, శ్లాబుల్ని కూడా సవరించాలని సీఐఐ కోరింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ అవసరం వినియోగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచడం, డిజిటలైజేషన్‌కు ప్రోత్సాహం, పన్ను పరిధిని విస్తరించడం, అధిక వృద్ధి సాధించేలా మొత్తంగా 2017 కేంద్ర బడ్జెట్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌గా ఆశిస్తున్నాం. గార్, పన్ను మినహాయింపులు, జీఎస్టీలకు సంబంధించి విధానాల్ని స్పష్టంగా నిర్వచించాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం మరో కీలకాంశం. అలాగే వ్యవసాయం, మౌలిక వసతులు, సేవా రంగాలపై మరింత దృష్టిపెడతారని ఆశిస్తున్నాం. – ఎన్.ఎహెచ్.భన్సాలీ, సీఈవో, ఇమామీ లిమిటెడ్(ఫైనాన్స్,స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) జూలై తరవాతే జీఎస్టీ: కేపీఎంజీ ప్రముఖ ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 750 మంది పాల్గొన్నారు. వారందరి అభిప్రాయాల్ని క్రోడీకరించిన అనంతరం సంస్థ తన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం... ► దాదాపు సగం మంది నిపుణులు ఈ సారి గార్ (జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్)ను వాయిదా వేయాలని కోరారు. గార్ నిబంధనల్ని 2012 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అయితే సరైన రీతిలో నిబంధనలు రూపొందించకపోవడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే గార్‌ను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే ఆదాయం లెక్కింపు, వెల్లడి నిబంధనలను (ఐసీడీఎస్) వాయిదా వేయాలని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► నోట్ల రద్దు సమీప భవిష్యత్తులో తమ వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం లేదని పలువురు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఆదాయపు పన్ను వసూళ్లు పెరుగుతాయని దాదాపు 82 శాతం మంది అంచనా వేశారు. ► జీఎస్టీ అమలుకు 1, జులై 2017 అనువైనదని 49 శాతం మంది చెప్పగా... 43 శాతం మంది మాత్రం జులై తర్వాతే జీఎస్టీ అమలు చేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ నమూనా చట్టం ఆమోదించాలని 68 శాతం సూచించగా... జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రాయితీ ఇవ్వాలని 82 శాతం మంది కోరారు. జీఎస్టీ ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని 95 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 85 శాతం మంది వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు ఆశిస్తున్నారు. 94 శాతం ఈ బడ్జెట్లో పన్ను మినహాయింపుల్లో ఉపశమనం దక్కవచ్చని భావిస్తున్నారు. ప్రత్యక్ష పన్నుల్లో సంస్కరణలు ఆశిస్తున్నాం ఈ బడ్జెట్ దేశానికే కాకుండా, బీజేపీ ప్రభుత్వానికి చాలా కీలకమైంది. జీడీపీ వృద్ధి అంచనాల్ని అందుకోవడం, నల్లధనం వెలికి తీసేందుకే నోట్ల రద్దు నిర్ణయమని నిరూపించుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎజెండాలు.. ఈ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు, భూముల రిజిస్ట్రేషన్ సంస్కరణలతో పాటు డిజిటలైజేషన్‌కు మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. ఆర్థిక సమానత్వ సాధనకు, మేకిన్ ఇండియా కోసం కొత్త పథకాలు ప్రవేశపెడతారని ఆశిస్తున్నాం – సంజయ్ సేథీ, సీఈవో, షాప్‌క్లూస్ -
సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది
పసిడి నిల్వలతోనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ♦ ప్రస్తుతం బంగారంపై అనేక అపోహలు నెలకొన్నాయి ♦ కడ్డీలు, బిస్కెట్లు భారీగా ఉంటేనే నల్లధనంగా గుర్తించాలి ♦ ప్రజల ఆభరణాలకు భరోసా ఉండాలి ♦ ఘనంగా ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సాక్షి, హైదరాబాద్: దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో బంగారం నిల్వలు మన ఆర్థిక వ్యవస్థను ఆదుకొన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చెప్పారు. విదేశాల తరహాలో బంగారాన్ని కేవలం ఒక మారక వస్తువుగా అంచనా వేయడం సరికాదని, దేశ చరిత్ర, సంస్కృతిలో దానికి గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోరోజు జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘గోల్డ్: బ్లాక్, వైట్ అండ్ ఎల్లో’ అన్న అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘హోటల్‌కు వెళ్లి రూ.10 వేలు ఖర్చు చేసినట్లుగా బంగారాన్ని ఖర్చు చేయడం సరైంది కాదు. బంగారం నిల్వలు పుష్కలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మన వద్ద ఉండే బంగారం నిల్వలపైన ఆధారపడే ప్రపంచ దేశాల్లో మనకు ఒక హోదా లభిస్తుంది. 1990లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొనిపోయినప్పుడు బంగారమే కాపాడింది. ప్రభుత్వం వద్ద బంగారం నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, ఆభరణాలు ఎంతో ఆదుకున్నాయి. అయితే నల్లధనం కూడా బంగారం రూపంలోనే ఉంది. 1990 వరకు ఉన్న నల్లధనం అంతా బంగారం రూపంలోనే బయటకు వచ్చింది. 1997లో బంగారంపై ఒక విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకు లావాదేవీల్లో దీన్ని వినియోగిస్తున్నారు’’ అని చెప్పారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఏది నల్లధనం కిందకు వస్తుంది? ఏది రాదు అన్న అంశంపై స్పష్టత అవసరమని అన్నారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో భారీ ఎత్తున ఉన్న నిల్వలనే నల్లధనం కింద గుర్తించాలన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భరోసా ఉండాలని పేర్కొన్నారు. 11 మంది జీవిత గాథలతో హర్షమందిర్ పుస్తకం ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నేత, రచయిత హర్షమందిర్ ఇటీవల రచించిన ‘ఫాటల్ యాక్సిడెంట్స్ ఆఫ్ ఎ బర్త్’ పుస్తకంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అణచివేతకు, హింసకు గురవుతున్న సామాజిక వర్గాలకు చెందిన 11 మంది వ్యక్తుల వాస్తవిక జీవితాలను ఆయన తన పుస్తకంలో కథలుగా రాశారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములకు ఆ పుస్తకాన్ని అంకితం చేసినట్లు హర్షమందిర్ వివరించారు. ‘‘ఏ మనిషి కూడా ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ కులంలో పుట్టాలో తెలుసుకొని పుట్టడు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది వారి కులం, పరిస్థితుల వల్ల హింసకు, వివక్షకు గురవుతున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముగిసిన వేడుకలు మూడ్రోజులపాటు కన్నులపండువగా జరిగిన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వేడు కలు ఘనంగా ముగిశాయి. సుమారు 16 వేల మందికి పైగా సందర్శకులు తరలి వచ్చారు. 11 దేశాల నుంచి 139 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీల్లో మహిళల అక్రమ రవాణా: సునీతా కృష్ణన్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల అక్రమ రవాణా ప్రమాద కరంగా ఉందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సునీతా కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాపై జరిగి న చర్చలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ వంటి రాజధాని నగరంలోనూ మనుషుల అక్రమ రవాణా మాఫియా వేళ్లూనుకుంద న్నారు. ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చట్టాలు అవసరమ న్నారు. తన 15వ ఏటా సామూహిక అత్యా చారానికి గురైనప్పుడు సమాజం నుంచి వివక్షకు, బహిష్కరణకు గురయ్యా నని ఆమె చెప్పారు. బెంగళూరులో మిస్‌వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పుడు జైలుకు వెళ్లానని అప్పుడు తన సొంత కుటుంబం నుంచే వివక్షను ఎదు ర్కోవలసి వచ్చిందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ కుంగిపోకుండా బలంగా నిలబడి పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 17 వేల మందికిపైగా మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారం నుంచి విముక్తులను చేసి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. -
'పెద్ద నోట్ల రద్దుతో బీజేపీకే ప్రయోజనం'
-
బీజేపీ ‘మిత్రులకు’ ముందే తెలుసు
- పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ - సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ అని వ్యాఖ్య న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కామని... కేంద్రంలోని అధికార బీజేపీ ‘మిత్రులకు’ దీనిపై ముందే సమాచారముందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులు, చిన్నమొత్తాల పొదుపులపై సర్జికల్ స్ట్రైక్స్ అని... నల్ల ధనం, బ్లాక్ మార్కెటర్లపై కాదని పేర్కొన్నారు. ‘బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ అధినేత సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు ఒక రోజు ముందే రూ.2,000 నోటును సామాజిక మాధ్యమంలో పెట్టారు. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ స్థారుులో డబ్బు డిపాజిటరుుంది. అధికార పార్టీ వారికి నోట్ల రద్దుపై ముందే సమాచారం అందడం వల్లే డిపాజిట్లు జరిగాయని స్పష్టమవుతోంది’ అని ఆరోపించారు. ‘నల్ల ధనం పేరుతో దేశంలో పెద్ద కుంభకోణం జరుగుతోంది. ఏటీఎంలలో డబ్బు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ఇప్పుడున్న ఏటీఎంలు పంపిణీ చేయలేవు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను కేంద్రం ఎలా మార్చగలదు? విషయం తెలిసే సంక్షోభం సృష్టించారు. మోదీ దృష్టిలో నల్లధనం అంటే ఏది? అంబానీ, అదానీ, శరద్‌పవార్, సుభాష్ చంద్ర, బాదల్ వంటి బడా పారిశ్రా మికవేత లు కూడబెట్టిన నల్లధనమా? లేదంటే రైతులు, రిక్షావారు, కూలి చేసుకు బతికేవారు సంపాదిం చిందా..’ అని ప్రశ్నించారు. కొత్త నోట్లు ఇచ్చేం దుకు ప్రజల నుంచి కమీషన్లు తీసుకొంటున్న వారితో పాటు ముందుగానే విషయం తెలుసు కుని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకున్న ‘మిత్రు ల’ జాబితా బయటపెట్టాలన్నారు. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం... ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, చివరకు నిరుద్యో గానికి దారితీస్తుందని హెచ్చరించారు. ‘ప్రజ ల్లో భయాందోళనలు నెలకొన్నారుు. వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది సరైన నిర్ణయ మనిపించుకోదు’ అని అన్నారు. నల్ల ధనాన్ని మళ్లీ పంపిణీ చేసుకోవడానికే ఇది ఉపయో గపడుతుందన్నారు. ‘నల్ల’కుబేరులకు ఆప్ వత్తాసు: బీజేపీ నల్ల కుబేరులకు మద్దతు తెలుపుతోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొ ట్టింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిని ప్రజలు పట్టించుకోరని బేజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇది బీజేపీ మరో జిమ్మిక్కు: కాంగ్రెస్ పెద్ద నోట్ల రద్దు బీజేపీ మరో జిమ్మిక్కని... నిజంగా నల్ల ధనం వెలికి తీయాలనే ఆలోచనే ఉంటే రాబోయే యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టే ఖర్చెంతో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2014 ఎన్నికల ఖర్చుపై లెక్క తేల్చేందుకు విచారణ కమిషన్‌ను వేయాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కోరారు. ఎలాంటి ప్రణాళికా లేకుండా బీజేపీ తీసుకున్న తొందరపాటు నిర్ణయమి దన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2005కు ముందు నోట్లను రద్దు చేయాలనుకొం టున్నామని ప్రకటిస్తే బీజేపీ దాన్ని పేదల వ్యతిరేక నిర్ణయమని అభివర్ణించిందన్నారు. పూర్తిస్థారుులో కరెన్సీ ముద్రణ: ఆర్బీఐ ముంబై: ప్రస్తుతమున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రింటింగ్ ప్రెస్సుల్లో పూర్తి స్థారుులో నోట్లను ముద్రిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కేంద్రాల్లో నోట్లు అందుబాటులో ఉంచామని, వాటిని బ్యాంకుల బ్రాంచీలతో అనుసం ధానించామని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకు లపై ఒత్తిడి తగ్గించడానికి ప్రజలు క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో లావాదేవీలు జరపాలని కోరింది. -
మా పట్ల ఔదార్యం చూపండి
♦ చట్టంలోనివేగాక ఇతరత్రా సాయమూ చేయండి ♦ అసెంబ్లీ సీట్లను 225కు పెంచండి ♦ కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు వినతి ♦ హోదా, ఆర్థికసాయం సహా పదిహేడు అంశాలతో తీర్మానం ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పన్నమైన సమస్యల పరి ష్కారానికి కేంద్రం ఉదారత చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలతోపాటు ఇతరత్రా సాయమూ అందించాలని కోరారు. నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర శాసనసభలో 77వ నిబంధన కింద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంకెలతోసహా వివరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించే సందర్భంలో.. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని త్వరగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్థికసాయం, పోల వరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయడం, పారిశ్రామిక రంగానికి పన్నురాయితీలు, ప్రోత్సాహకాలు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖలో రైల్వేజోన్, ఆస్తులు, అప్పుల పంపిణీ, స్థానికత, శాసనసభ సీట్లను 175 నుంచి 225కు పెంచడంసహా మొత్తం 17 అంశాలతో ఆయన తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనంతరం అందులోని ఒక్కో అంశాన్ని వివరించారు. తలసరి ఆదాయం తక్కువే.. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.35 నుంచి రు.40 వేలు తక్కువగా ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత తలసరి ఆదాయం రూ.95,689గా ఉంటే తెలంగాణలో 1,29,182గా ఉందన్నారు. అయినప్పటికీ 10.99 శాతం వృద్ధిని రాష్ట్రం సాధించిందని వివరించారు. అయితే నిర్మాణాత్మక మార్పులు రాకుండా ఆదాయం పెరిగే అవకాశం లేదన్నారు. వ్యవసాయాదాయం ఎక్కువగా ఉన్నచోట తక్కువ పన్నులు(ట్యాక్స్‌లు) వస్తాయని చెప్పారు. విభజన నాటికి ఆడిటర్ జనరల్ లెక్కప్రకారం రాష్ట్ర ఆర్థిక లోటు రూ.16,079 కోట్లుగా ఉంటే కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 2,303 కోట్లే వచ్చాయని, ఇంకా రూ.13,776 కోట్లు రావాల్సి ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం.. 2019 వరకు కూడా రాష్ట్రం ఆర్థిక లోటు నుంచి తేరుకునే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర నిధులు వ్యయం చేసినా కేంద్రం నుంచి తిరిగి రాబడతామని చెప్పారు. ఉత్తరాఖండ్, బుందేల్‌ఖండ్, హిమాచల్‌కు ఇచ్చిన ప్యాకేజీలు తమకూ ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సీట్ల పెంపు పెద్ద కష్టం కాదు... అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు అన్నారు. బిల్లులో పెట్టాలని కోరామని, పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. డీలిమిటేషన్‌కు, అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధం లేదన్నారు. సీట్ల పెంపువల్ల ఎటువంటి ఆర్థిక భారమూ ఉండబోదన్నారు. పార్లమెంటు సీట్లకు, దీనికి సంబంధం ఉండదన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపడం ద్వారా సీట్లు పెరుగుతాయన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఏర్పాటుకు ఎంత వ్యయమవుతుందో అంత డబ్బు ఇమ్మని కోరినట్టు ఆయన తెలిపారు. ఆస్తులు-అప్పుల పంపిణీపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలసి కూర్చుని ఏడాదిలోగా పరి ష్కరించుకోవాల్సి ఉన్నా.. అది జరగనందున కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకోవాలన్నారు. ఎవరికీ అన్యాయం జరక్కుండా పంపిణీ చేయాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేవరకూ ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రాభివృద్ధికి, మెరుగైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు అందరూ కలసి రావాలన్నారు. తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవం గా ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేశారు. -
ఖజానా ఖాళీ!
♦ ప్రస్తుతం రూ.3.5 కోట్లు మైనస్‌లోకి ♦ తగ్గిన రాబడి.. పెరిగిన ఖర్చులు ♦ గండికొట్టిన కొత్త మున్సిపాలిటీలు ♦ చక్కదిద్దే పనిలో యంత్రాంగం ♦ కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయం జిల్లా ప్రజాపరిషత్ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఒకప్పుడు రూ.కోట్లతో కళకళలాడిన జెడ్పీ ఖజానా ఇప్పుడు లోటు బడ్జెట్‌తో డీలా పడింది. రాబడి భారీగా తగ్గుతుండగా.. ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణ పద్దు కింద చేపట్టే పనులు భారీగా పెరగడంతో తాజాగా ఖజానా రూ.3.5కోట్ల లోటుకు పడిపోయింది. దీంతో ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు కొత్తగా పనులు చేపట్టవద్దని జెడ్పీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్‌కు పలు పద్దుల కింద రాబడి ఉంటుంది. నగరం చుట్టూ విస్తరించి ఉండడం.. రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో స్టాంపుడ్యూటీ పద్దులో ఏటా రూ.20కోట్ల వరకు ఆదాయం ఉండేది. అంతేకాకుండా పన్నుల రూపంలో వ చ్చే ఆదాయంలో తలసరి గ్రాంటు కింద ఏటా రూ.42లక్షలు, సీనరేజీ కింద రూ. 1.5కోట్ల వరకూ రాబడి వచ్చేది. పట్టణీకరణ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో జిల్లా పరిషత్ ఆదాయం క్రమంగా తగ్గుతోంది. ఇటీవల కొత్తగా ఐదు నగరపంచాయతీలు ఏర్పాటయ్యాయి. జనాభా ప్రాతిపదికన గణాంకాలన్నీ మున్సిపల్ పరిధిలోకి చేర్చడంతో ఆదాయం అంతా మున్సిపాలిటీలకు దక్కుతోంది. ఈ క్రమంలో జెడ్పీ ఆదాయానికి భారీగా గండిపడింది. 2014-15 వార్షిక సంవత్సరంలో జెడ్పీకి వివిధ పద్దుల కింద రూ.15.03 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత వార్షికంలో ఇప్పటివరకు కేవలం రూ. 5.42 కోట్లు మాత్రమే సమకూరింది. జెడ్పీ సాధారణ నిధుల కింద రోడ్లు, ఇతర కమ్యునిటీ హాళ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర నిర్మాణాలు భారీగా చేపట్టారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల సంఖ్య గతంతో పోల్చితే ప్రస్తుతం అధికార పార్టీకి భారీ మెజార్టీ ఉంది. ఈక్రమంలో సభ్యుల డిమాండ్ల మేరకు పనులు పెద్ద సంఖ్యలో మంజూరు చేశారు. అయితే రాబడి భారీగా తగ్గడంతో తాజాగా జెడ్పీ ఖజానా లోటుకు చేరుకుంది. ప్రస్తుతం వివిధ పనులకు సంబంధించి రూ.3.5కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే జెడ్పీ ఖజానా నిండుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నా ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి జెడ్పీకి నిధులు రావాల్సి ఉన్నప్పటికీ.. లోటును భర్తీ చేయాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుందని జెడ్పీ అధికారవర్గాలు చెబుతున్నాయి. -
వృద్ధిబాటలో ఉన్నది మనమే
ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా భారత్‌లో వేగంగా అభివృద్ధి ♦ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇవే చెబుతున్నాయి ♦ దయానంద్ సరస్వతి జయంతి కార్యక్రమంలో మోదీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ప్రతిపక్షాల విమర్శలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంటే భారత్ మాత్రమే తమ ప్రభుత్వ విధానాల కారణంగానే అభివృద్ధిపథంలో వడివడిగా ముందుకెళ్తోందన్నారు. ‘‘ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సహా అందరూ ఇదే చెబుతున్నారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే కేవలం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పెద్ద ఆర్థిక దేశాల్లోకెల్లా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంగా నిలిచినట్లు ప్రపంచ దేశాల ప్రజలు చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు. 1875లో ఆర్య సమాజ్ను స్థాపించిన స్వామి దయానంద్ సరస్వతి జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ముద్ర పథకం ద్వారా 2 కోట్ల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందారని, రూ. లక్ష కోట్లకుపైగా ఆర్థిక తోడ్పాటు అందించామన్నారు. 21వ శతాబ్దం విజ్ఞాన శకమని...విజ్ఞాన రంగంలో భారత్ యావత్ ప్రపంచానికి సారథ్యం వహించిందని గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం ఉండగా తాము వ్యక్తిగత రంగాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఉద్యోగాలు కోరుకునే వారిలా కాకుండా ఉద్యోగాలిచ్చేలా ఎదిగేందుకు స్వీయ సమృద్ధి, స్వీయ ఉపాధి సాధించాలన్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని...అందువల్ల దేశాభివృద్ధికి యువత శక్తిని ఉపయోగించుకోవడంపై దృష్టిసారించామన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టి దాని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని తెలిపారు. -
వృద్ధిలో ఈ ఏడాది... చాంపియన్ ఇండియానే!
ప్రపంచ బ్యాంక్ నివేదిక * వృద్ధిరేటు అంచనా 7.8 శాతం * వృద్ధి వేగంలో భారత్ తర్వాత చైనా, అమెరికా ఐక్యరాజ్య సమితి: భారత్ 2016లో కూడా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి రేటును గత జూన్‌లో 7.9 శాతంగా అంచనావేయగా దానిని 7.8 శాతానికి తగ్గించింది. ఈ స్థాయి వృద్ధి రేటును కూడా భారత్మినహా ఏ దేశం సాధించలేదని పేర్కొంది. కాగా ప్రపంచం మొత్తంమీద వృద్ధి రేటును జూన్‌లో 3.3 శాతంగా అంచనావేయగా, దానిని తాజాగా 2.9 శాతానికి కుదించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... * భారత్ తరువాత వృద్ధి స్పీడ్‌లో చైనా ఉంది. 2016లో 6.7 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. 2017లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ రేటు వరుసగా 2.4 శాతం, 2.2 శాతంగా ఉంటుంది. * భారత్ 2017 వృద్ధి రేటు అంచనా 7.9 శాతం. సంస్కరణల వేగం నెమ్మదించినప్పటికీ ఈ స్థాయి వేగం నమోదవుతుంది. అయితే 2018 వృద్ధిరేటు అంచనాను సైతం 8 శాతం నుంచి 7.9 శాతానికి కుదించింది. ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చిచూస్తే... భారత్ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకునే పరిస్థితి ఉంది. దేశీయ వాణిజ్యం పటిష్టమయ్యే సూచనలు ఉన్నాయి. తగిన పాలసీ నిర్ణయాల రూపకల్పన సామర్థ్యం ఉంది. * అయితే కొన్ని సవాళ్లూ ఉన్నాయి. ముఖ్యంగా సంస్కరణల విషయంలో ఈ సవాళ్లను ప్రస్తావించుకోవచ్చు. ఎగువ సభలో పాలకపార్టీకి మెజారిటీ లేకపోవడం- సంస్కరణల విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితిని సృష్టిస్తోంది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఆయా అంశాల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడుతోంది. భూ సంస్కరణలు నెమ్మదించడం పెట్టుబడుల జాప్యానికి సైతం దారితీస్తోంది. దేశంలో పారిశ్రామిక రంగం మందగమనాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. అయితే ప్రభుత్వ చొరవల కారణంగా పెట్టుబడుల ప్రక్రియ ముఖ్యంగా మౌలిక రంగంలో క్రమంగా పుంజుకుంటోంది. * దేశంలో మౌలిక రంగం పురోగతికి, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అమెరికా కఠిన ద్రవ్య విధానం ప్రభావం పడే అవకాశం ఉంది. * అంతర్జాతీయంగా ముడి చమురు ధరల దిగువస్థాయి ధోరణి భారత్ సంస్థలకు ఇంధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం ఇది. * కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రాక వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. -
ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ
4 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి * సెప్టెంబర్‌లో వృద్ధి రేటు 3.6 శాతం * అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5% న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతంగా నమోదయ్యింది. ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. తయారీ రంగంతోపాటు, కాస్మొటిక్స్ వంటి నాన్-డ్యూరబుల్స్ వినియోగ వస్తువుల విభాగం పేలవ పనితీరు ఐఐపీ గణాంకాలు అంతంతమాత్రంగా నమోదుకావడానికి కారణం. గడచిన నాలుగు నెలల్లో ఇంత దిగువస్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టు నెలలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మాత్రం ఈ రేటు 2.6 శాతంగా ఉంది. ఇదిలావుంటే... ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) చూస్తే... ఈ రేటు 2.9 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. జూన్ (4.2 శాతం), జూలై (4.1 శాతం), ఆగస్టు (6.2 శాతం) ఫలితాలు దీనికి కారణం. కీలక విభాగాల ఉత్పత్తి ఇలా... తయారీ: వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్‌లో వృద్ధి రేటు 2.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది. మొత్తం సూచీలో 75 శాతం వాటా ఉన్న ఈ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం మాత్రమే సెప్టెంబర్‌లో వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. కాగా ఆరు నెలల్లో ఈ రేటు 2.2 శాతం నుంచి 4.2 శాతానికి ఎగసింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 0.1% నుంచి 3%కి ఎగసింది. ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 1.7 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. విద్యుత్: సెప్టెంబర్‌లో ఈ రేటు 3.9 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది. అయితే ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 10.4 శాతం నుంచి 4.5 శాతానికి దిగింది. కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, డిమాండ్‌కు సూచికగా ఉన్న ఈ భారీ ఉత్పత్తుల విభాగంలో వృద్ధి 12.3 శాతం నుంచి 10.5 శాతానికి పడింది. ఆరు నెలల్లో వృద్ధి మాత్రం 6% నుంచి 7.9%కి పెరిగింది. వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల విభాగం - 4.0 శాతం క్షీణత నుంచి 0.6 శాతం వృద్ధికి మళ్లింది. ఇందులో ఒక విభాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి కూడా -11.1% క్షీణత నుంచి 8.4 శాతం వృద్ధి బాటకు మళ్లింది. కాగా కన్జూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా -4.6 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 సెప్టెంబర్‌లో ఈ విభాగం వృద్ధి 1.3 శాతం. ఈ మూడు విభాగాలనూ ఆరు నెలల్లో చూస్తే... మొత్తం వినియోగ వస్తువుల విభాగం -2.4 శాతం క్షీణత నుంచి 2.4 శాతం వృద్ధికి మళ్లింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం -12.5 శాతం క్షీణత నుంచి 7.6 శాతం వృద్ధికి మారింది. నాన్-డ్యూరబుల్స్ విభాగం 1.9 శాతం వృద్ధి నుంచి -0.9 శాతం క్షీణతకు పడిపోయింది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కఠిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సామాన్యుడిపై ధరల భారం అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% పెరగ్గా, ఆగస్టులో ఇది 4.41 శాతం. తాజాగా ముగిసిన నెలలో ఆహార ఉత్పత్తులు, పానీ యాల విభాగంలో ధరల పెరుగుదల స్పీడ్ (రేటు) గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 5.34 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 42.20 శాతం ఎగశాయి. 4 శాతం పైన పెరిగిన ఆహార ఉత్పత్తులను చూస్తే... సుగంధ ద్రవ్యాలు (10 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ (7 శాతం), మాంసం, చేపలు (5 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5 శాతం), చమురు, వెన్న పదార్థాలు (5 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4 శాతం) ఉన్నాయి. కూరగాయల ధరలు 2.5 శాతం ఎగశాయి. చక్కెర, తత్సంబంధ ఉత్పత్తుల ధరలు మాత్రం 10 శాతం పైగా తగ్గాయి. సీపీఐలో మిగిలిన విభాగాలు చూస్తే... పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 5.62 శాతం, హౌసింగ్ 5 శాతం పెరగ్గా, ఇంధన, విద్యుత్ విభాగంలో రేటు 5 శాతం పైగా ఎగసింది. 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5.8 శాతం.