Flashback 2018
-
2018 : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
-
2018 బిజినెస్ రౌండప్
-
నింగికేగిన దిగ్గజాలు.. చారిత్రక నిర్ణయాలు..మహిళా విజయాలు
-
2018.. పరుగుల కింగ్ కోహ్లినే
-
2018.. భారత్ ఆట.. పతకాల వేట
-
2018 : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
ఆధునిక సమాజంలో సమాచార రంగంలో మహత్తర విప్లవానికి కారణమైన సోషల్ మీడియా 2018లో ఎన్నో సరికొత్త సంచలనాలకు కేంద్రంగా మారింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు గణనీయంగా పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం విస్తృతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల మధ్య సమాచారం అందించుకోవడంలో సోషల్ మీడియా వహిస్తున్న పాత్ర విశేషంగా పెరిగింది. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్టు, 2018లో ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసిన సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తల ప్రచారంతో అపకీర్తిని మూటకట్టుకున్నాయి. తమ కంటికి తప్పనిపించిందో ఫేస్బుక్ సీఈఓ అయినా సరే డేటా చోరి వంటి ఘటనలపై నెటిజనులు నిప్పులు చెరిగారు. సీఎం స్థానాల్లో ఉండి నోరుజారినా, రెండు నాల్కల ధోరణిలను ప్రదర్శించినా సరే ఓ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్చేసి వారి నోరు మూయించారు. ఎక్కడో సిరియాలో తుపాకుల తూటాల నడుమ బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలకు నెటిజన్లు చలించారు. జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం వంటి ఘటనలను నెటిజన్లు తమ క్రియేటివిటీ జోడించి ఓ ఆట ఆడుకున్నారు. ఓరకంట చూస్తూ ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు, ఓవర్ నైట్ స్టార్‌నే చేసేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా సమస్య అయినా, సంఘటనైనా తమకు మంచి అనిపిస్తే పొగడటం, తేడా అనిపిస్తే కడిగిపాడేయడమే అంటూ మూడు కామెంట్లు ఆరు లైకులు అన్నచందంగా నెటిజన్లకు గత ఏడాది గడిచిపోయింది. 2018 ఏడాదిలో సోషల్‌మీడియాలో వైరల్ అయినవి.. జనవరి 1) ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు! అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2) ఎఫ్బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్ జమ్మూకశ్మీర్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 3)వాట్సప్ క్రాష్ ; న్యూఇయర్ విషెష్ వెల్లువెత్తడంతో.. ప్రఖ్యాత మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సప్ క్రాష్‌డౌన్ కావడంతో 2018 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్ విషెస్ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4)కిరాక్ డాన్స్‌తో కేక పుట్టించిన మాజీ ఎంపీ వరంగల్ క్లబ్లో జరిగిన న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్చేశారు. రాజయ్య చేసిన కిరాక్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. 5)నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు.. ప్రదీప్ వైరల్ వీడియో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్.. తాను తప్పుచేసినట్లు అంగీకరించి, ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 6)పెళ్లికొడుకు వెక్కివెక్కి ఏడుపు.. ఎందుకంటే.. బిహార్‌లో సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయనమైన ఓ యువకుడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 7)చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం సొంత కంపెనీ హెరిటేజ్ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం నిప్పులు చెరిగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. 8)సెల్ఫీ పోజు.. అతనికేం కాలేదంట! వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్టు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ ఆ తర్వాత తెలిసింది. ఫిబ్రవరి 1)ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్ గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురిశాయి. మంత్రి కేటీఆర్ వారికి ట్వీటర్ ద్వారా అభినందనలు తెలిపారు. 2)యువభారత్‌పై ప్రశంసల జల్లు అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువభారత్‌పై ప్రశంసల జల్లు కురిసింది. దేశం గర్వించదగ్గ సమయమిదని రాజకీయ ప్రముఖుల, క్రికెటర్లు, సినీతారాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తారు. 3)తన పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు పెళ్లిరోజు సైతం సెలవుపెట్టకుండా ఓ పాకిస్థాన్ జర్నలిస్టు ఉద్యోగం చేశాడు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా బ్రేకింగ్ న్యూస్ అంటూ పెళ్లికొడుకు కాస్త రిపోర్టర్ అవతారమెత్తాడు. సిటీ 41 చానెల్లో పనిచేసే హనాన్ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. 4)గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం! అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమయింది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్ చేశారు. 5) అబ్బాయిల గుండెల్ని పేల్చేసింది! ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలోని ఓ వీడియో సాంగ్ విడుదలై సెన్షన్ క్రియేట్ చేసింది. ఒక్క వీడియోతో ప్రియాప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్ నేషనల్ స్టార్ అయిపోయింది. ఒక ఫ్లయింగ్ కిస్ని గన్లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్ విలవిలలాడుతాడు. నిజానికి ఆమె విసిరిన ఫ్లయింగ్ కిస్కు అబ్బాయిల గుండెలు పేలిపోయాయంటూ నెటిజన్లు స్పందించారు. 6)మంత్రివర్యా.. నీకిది తగునా? స్వచ్ఛ భారత్ కోసం మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్‘స్వచ్చ్ భారత్ అభియాన్’కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని చూస్తూంటే.. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 7)బాత్‌టబ్‌లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం! శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం, బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. 8)ఆ చిన్నారుల కోసం తల్లడిల్లుతున్న సోషల్ మీడియా! సిరియాలో తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించాయి. యుద్ధక్షేత్రంగా మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టించాయి. 9)కాంగ్రెస్ సంతాప ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ‘యూపీఏ హయాంలో పద్మశ్రీ అవార్డు’ అని ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. 10) లైవ్‌లోనే న్యూస్ రీడర్ల మధ్య వాగ్వాదం పాకిస్థాన్‌లో లైవ్‌లోనే ఇద్దరు న్యూస్ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్లో జోరుగా చక్కర్లు కొట్టింది. ‘ఈమెతో నేనేలా బులిటెన్ చదవాలి?’ అంటూ యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్ అయింది. 11)శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు.. ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 1) వీర్యంతో దాడులా?.. ఛాన్సే లేదు హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే అదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ నెటిజన్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2)నిన్నటి వరకు గొప్ప కవి.. నేడు వేశ్యనా? సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే. 3) అందుకే దూరంగా ఉన్నా: యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలోకి వస్తానని బుల్లితెర యాంకర్ అనసూయ స్పష్టం చేశారు. సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్ పగలగొట్టడంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు కొంత కాలం దూరంగా ఉన్నారు. 4)అద్వానీని అవమానించిన మోదీ! వైరల్ వీడియో త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ వీడియో వైరల్ అయింది. అద్వానీ చేతులు దండం పెడుతూనే ఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో‘గురువును విస్మరించిన శిశ్యుడు..’,, ‘అద్వానీని అవమానించిన మోదీ..’ , ‘పెద్దాయనను చూస్తే జాలేస్తోంది..’ అంటూ ఈ వీడియోకు నెటిజన్లు రకరకాల భాష్యాలు జోడించారు. 5)‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌కు తలొగ్గిన బీసీసీఐ ‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌తో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేసిన ఉద్యమానికి బీసీసీఐ దిగొచ్చింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ వేదికను మార్చారు. 6) స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా! బాల్ ట్యాంపరింగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా ( బ్రెయిన్ ఫేడ్) అంటూ గత భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు. ఏప్రిల్ 1) ఫేస్బుక్ సీఈఓపై జోకులే జోకులు.. డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనూహ్యంగా స్పందించారు. 2) రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్! కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. 3)తివారి బౌలింగ్ యాక్షన్‌పై జోకులే జోకులు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్ ఆటగాడు మనోజ్ తివారి. యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్ యాక్షన్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చారు. మే 1) నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!! బాహుబలి-ది కంక్లూజన్ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లాక్ పాంథర్‌ను కలిసిన ప్రభాస్.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్ చేసిన ఫొటోలు ఆకట్టుకున్నాయి. 2) చంద్రబాబు డబుల్ గేమ్ : నాడు అలా.. నేడు ఇలా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి మరోమారు బయటపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడిన చంద్రబాబు.. తిరిగి నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు. బాబు రెండు నాల్కల ధోరణిపై నెటిజన్లు మండిపడ్డారు. 3)మీరు ఫిట్‌గా ఉన్నారా? చాలెంజ్ ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’అనే చాలెంజ్‌కు కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్లకు సవాల్ విసిరారు. జూన్ 1) అంకుల్... ఇరగదీశావ్ పో! 40 ఏళ్లకు పైబడిన ఓ ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటలో గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పించారు. 2) తెలుగుకు తెగులు పట్టించిన లోకేష్ తన సహజ ధోరణితో మంత్రి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో తెలుగు భాషకు తెగులు పట్టించారు. తెలుగును సరిగ్గా ఉచ్ఛరించలేక పలుమార్లు అర్థ రహితంగా మాట్లాడారు. దీంతో సభలో ఉన్న మహిళలు లోకేష్ ప్రసంగిస్తుండగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. 3) వామ్మో.. వరుసబెట్టి హగ్ ఇచ్చిన యువతి.! రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి లక్నోలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో యువతి హగ్ కోసం యువకులు పోటీ పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 4) ఎక్కడికి పోతారు సార్? తమిళనాడులో తాము ఎంతగానో అభిమానించే ఉపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్‌పై మరో చోటకు బదిలీపై వెళుతుండగా, మిమల్ని వెళ్లనివ్వం సార్.. అంటూ విద్యార్థులు ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది. జూలై 1) ట్రైలర్‌కు బదులుగా ఫుల్ మూవీ అప్లోడ్.. రెడ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉండగా.. జాన్ మథ్యూస్ దర్శకత్వం వహించిన ‘ఖాళీ ద కిల్లర్’ మూవీ లింక్‌ను సోని సంస్థ పొరపాటున షేర్ చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్నెట్లో మూవీని చూసిన ఉత్సాహంలో కొందరు సోనీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. 2) ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి సోషల్ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి. 3) తప్పు నాదే.. మన్నించండి ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లి, ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా వాళ్లను కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేయడంతో అది వైరల్ అయింది. 4) యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేశారు. 5) ఆధార్ నంబర్ ట్వీట్ చేసి.. చాలెంజ్ ! ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి.. సవాల్ విసిరారు. 12 అంకెల తన ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అయితే, శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నంబర్, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తుండటం కొసమెరుపు. ఆగష్టు 1) పంద్రాగస్టు: కోహ్లి సరికొత్త చాలెంజ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు. 2) అనుష్కశర్మపై కుళ్లు జోకులు! వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘సూయి ధాగా’. చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఓ సన్నివేశంలో అనుష్కశర్మ భావోద్వేగానికి లోనైన ఫొటోకు నెటిజన్లు క్యాప్షన్లు జతచేసిన ఫోటోలు తెగవైరల్ అయ్యాయి. 3) వైరల్ వీడియో : హ్యాట్సాప్ ఇండియన్ ఆర్మీ భారీ వర్షాలతో అతలాకుతలమయిన కేరళలో భారత ఆర్మీ అందించిన సేవలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. గర్బిణీ, దివ్యాంగుడు, బాలుడు ఇలా చాలామందిని హెలికాప్టర్ సహాయంతో కాపాడిని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 4) హరికృష్ణతో సెల్ఫీ.. నెటిజన్ల ఫైర్ సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తించారు. నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు. 5) కీకీ ఛాలెంజ్.. అవార్డు మనోళ్లదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కీకీ ఛాలెంజ్‌కు తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన యువకులు దేశీ టచ్ ఇచ్చారు. ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 1)వైరల్‌గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్ నటి సమంత సరికొత్త చాలెంజ్‌ను పరిచయం చేశారు. ‘యూటర్న్’ చిత్ర ప్రమోషన్లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన కర్మ థీమ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన సమంత #యూటర్న్‌డాన్స్‌చాలెంజ్ పేరిట సవాల్ విసిరారు. 2) ఫేస్బుక్ వేదికగా అమృత పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని సోషల్‌మీడియాలో ప్రారంభించారు. అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది. 3) స్వలింగ సంపర్కం నేరం కాదు రాజ్యాంగంలోని సెక్షన్ 377 పౌరుల సమానత్వ, గౌరవ హక్కులను ఉల్లంఘిస్తున్నదని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సోషల్‌మీడియాలో ఎల్జీబీటీక్యూ వర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో #Section377Verdict ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్గా నిలిచింది. అక్టోబర్ 1) బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. 2) సీఎం రమేశ్ రాజభవనం చూశారా? టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్‌లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. రమేష్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్‌పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి. 3) ఓటుకు నోట్లు ఇంగ్లీష్ రిపీట్ మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్.. లాంటి పదాలు వినగానే గుర్తొచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఇంగ్లీష్‌లో ప్రసంగించారు. చంద్రబాబు ఇంగ్లీష్‌పైనే కాకుండా వాయిస్‌పైన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపించారు. ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. 4) మావోల దాడి: డీడీ ఉద్యోగి సెల్ఫీ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తన తల్లిని ఉద్దేశించి లైట్ అసిస్టెంట్ మొర్ముక్త్ శర్మ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 1) డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు! భారత్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో సమన్వయ లోపంతో హోప్ అవుటయ్యాడు. అయితే హెట్‌మైర్, హై హోప్‌లు పరుగు కోసం ఒకేవైపు పరుగెత్తడంతో డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2) ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం! ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో ఎవ్వరికీ తెలియని ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. 3) ఐర్లాండ్‌లో అండర్వేర్ ఉద్యమం.! అండర్వేర్ ఉద్యమం ఐర్లాండ్‌ను కుదిపేసింది. ThisIsNotConsent... అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ మహిళలు అండర్వేర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీశారు. 4) బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్! ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. 5) బుల్లెట్లు దించినవాడి కడుపులో తలపెడతావా? ఒకప్పుడు విప్లవ రాజకీయాలతో మమేకమై.. తన ఆటాపాటతో చైతన్యం తీసుకొచ్చి.. ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. ఇటీవల పంథా మార్చుకున్నారు. ఒకప్పుడు తన కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబునాయుడు కడుపులోనే గద్దర్ తాజాగా తలపెట్టడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. డిసెంబర్ 1) వాట్సాప్‌లో ఎన్నికల లొల్లి! తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాట్సాప్ గ్రూప్‌లు దద్దరిల్లాయి. 2) వైరల్: బుల్బుల్ బాలయ్య..! మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ మరోసారి నవ్వుల పాలయ్యారు. హిందీలో మాట్లాడాలని ప్రయత్నించి.. సారేజహాసె అచ్చా పాటను ఖూనీ చేయడంతో..బుల్బుల్ బాలయ్య అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందించారు. 3) మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్ ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇక లేరన్న వార్త ఆమె అభిమానులను బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్సైట్లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్మా ’ వీడియో వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. 4) వైరలవుతున్న వజ్రాల విమానం..!? ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. 5)బండ్ల గణేశా.. ఎక్కడా? బండ్ల గణేశ్‌పై సోషల్‌మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలాయి. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి టీవీ చానెళ్లలో హడావుడి చేస్తూ అందరిదృష్టిని ఆకర్షించిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఇప్పుడు కనబడటం లేదంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 6) వైరల్: చంద్రుడు ఐయామ్ కమింగ్ ‘‘ఔర్ మిష్టర్ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్ కమింగ్ టూ ఆంధ్రప్రదేశ్.. సిద్దంగా ఉండూ’’ అంటూ సినిమాటిక్ స్టైల్లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన డైలాగ్ నెట్టింట హల్చల్ చేసింది. -
2018: ప్రజా సంకల్పయాత్ర రౌండప్
ప్రజల సమస్యలపై అహర్నిశలూ పోరాటం చేస్తూ.. వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. అశేష జనవాహిని సాక్షిగా కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రను మరొకసారి గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్.. 01–01–2018 ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో యాత్ర ముగిసింది. 02–01–2018 పాదయాత్రలో 50వ రోజున పాదయాత్ర చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ మైలురాయి దాటింది. 06–01–2018 పాదయాత్రలో 54వ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు వద్ద ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 07–01–2018 పాదయాత్రలో 55వ రోజున చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌కు అసాధారణ రీతిలో స్వాగతం పలికిన ప్రజలు, అభిమానులు. చంద్రబాబు సొంత మండలంలో జగన్ వెంట ‘జన సునామీ’.. 7 కి.మీ పొడవునా అడుగడుగునా అభిమానం. మంగళహారతులు, మేళతాళాలు, కోలాటాలు, కర్రలపై నడకలు. 09–01–2018 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 10–01–2018 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలోని నల్లవెంగనపల్లి వద్ద పాదయాత్రలో 800 కి.మీ పూర్తి చేసిన వైఎస్ జగన్. 11–01–2018 చిత్తూరు జిల్లాలోనే చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మళ్లగుంటపల్లి వద్ద వైఎస్ జగన్.. రైతులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలపై చర్చించారు. 12–01–2018 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి హరిజన వాడ మీదుగా ఎన్ఆర్ కమ్మపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపు పొలాల్లో రైతులతో కలిసి కలివిడిగా తిరిగారు. ఆ తర్వాత చంద్రబాబు అనే రైతుకు చెందిన పొలంలో మినీ ట్రాక్టర్ నడిపిన ఆయన వరి నాట్లు వేశారు. 13–01–2018 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 17–01–2018 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపనాయుడుపేట వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 21–01–2018 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, చెర్లోపల్లి వద్ద పాదయాత్రలో 900 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజా సంకల్పయాత్ర. అదే రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. 23–01–2018 రాయలసీమలో పాదయాత్ర ముగించి కోస్తాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. యాత్ర 69వ రోజున నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద కోస్తాలోకి అడుగు పెట్టిన జననేత. 24–01–2018 నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 28–01–2018 నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 29–01–2018 నెల్లూరు జిల్లా వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు వద్ద పాదయాత్రలో 1000 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర. ఈ సందర్భంగా అక్కడి కైవల్య నది పక్కన నిర్మించిన 25 అడుగుల ‘విజయ సంకల్ప స్థూపం’ను జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిఆవిష్కరించారు.పాదయాత్రలో 1000 కి.మీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఇదే రోజున అన్ని చోట్లా పార్టీ శ్రేణులు ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించాయి. 30–01–2018 నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలిచేడుకు ముందు శివారులో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 31–01–2018 నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 03–02–2018 నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం, సౌత్ మోపూర్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 04–02–2018 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుముడి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్. ఆ తర్వాత దేవరపాలెం ప్రారంభ శివారులో వైశ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 05–02–2018 నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో బహిరంగ సభలో పాల్గొన్నజగన్. 06–02–2018 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 07–02–2018 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేట మండలం, కొలిమెర్ల క్రాస్ రోడ్స్ వద్ద 1100 కి.మీ మైలురాయి దాటిన ప్రజా సంకల్పయాత్ర. 10–02–2018 నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం బోదగుడిపాడులో బహిరంగ సభలో పాలొన్న వైఎస్ జగన్. 13–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 14–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, అదే మండలంలోని జంగాలపల్లిలో ఉదయగిరికి చెందిన హస్త కళాకారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించిన వైఎస్ జగన్. హస్త కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 15–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేనుమాలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. 16–02–2018 ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలంలోని రామకృష్ణాపురం వద్ద పాదయాత్రలో 1200 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 18–02–2018 ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని అదే మండల కేంద్రంలో వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. 20–02–2018 ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం శివారులో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న వైఎస్ జగన్. 24–02–2018 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 25–02–2018 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నందనమారెళ్ల వద్ద పాదయాత్రలో 1300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 26–02–2018 ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 28–02–2018 ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని చీమకుర్తిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. మరోవైపు అదే రోజున ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 03–03–2018 ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని తాళ్లూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు అదే నెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలకు ఆయన ఆరోజు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శివరాంపురం వద్ద సమావేశమైన జననేత ఆ తర్వాత వారి వాహనశ్రేణికి జెండా ఊపి, ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. 04–03–2018 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 05–03–2018 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని నాగులపాడు వద్ద 1400 కి.మీ మైలురాయి దాటిన జననేత పాదయాత్ర. 06–03–2018 ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 10–03–2018 ప్రకాశం జిల్లా చీరాలలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 12–03–2018 ప్రకాశం జిల్లాలో యాత్ర ముగించుకుని గుంటూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రజా సంకల్పయాత్ర. 110వ రోజు పాదయాత్రలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని స్టూవర్టుపురం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. 14–03–2018 గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 1500 కి.మీ మైలురాయిని దాటింది. 17–03–2018 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను శివారులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 19–03–2018 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొమ్మూరు వద్ద ప్రజాసంకల్ప మానవహారంలో పాల్గొన్న వైఎస్ జగన్. అదే రోజు సాయంత్రం పెదనందిపాడులో బహిరంగ సభలో పాల్గొన్నారు. 21–03–2018 గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 24–03–2018 సాక్షి పత్రిక 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గంలోకి ఇర్లపాడు క్రాస్ వద్ద వైఎస్ జగన్ ప్రత్యేకంగా కేక్ కట్ చేశారు. 27–03–2018 గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు వద్ద పాదయాత్రలో 1600 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 28–03–2018 గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుడిపూడి ప్రారంభ శివారులో బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 29–03–2018 గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 31–03–2018 గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 03–04–2018 గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న కింగ్ హోటల్ సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 04–04–2018 గుంటూరు రూరల్ మండలం (ప్రత్తిపాడు నియోజకవర్గం) లోని మధ్యాహ్న భోజన శిబిరం వద్ద వైఎస్ జగన్‌ను కలిసిన హోదా సాధన సమితి నాయకులు. సమితి నేత చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో జననేతను కలిసిన నాయకులు. హోదా కోసం నాలుగేళ్లుగా నిరంతర పోరాటం చేసిన, చేస్తున్న వైఎస్సార్సీపీని అభినందించిన వారు, హోదా సాధన కోసం పోరాడుతున్న పార్టీలు, సంఘాలన్నింటినీ కలుపుకుని నేతృత్వం వహించాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. 07–04–2018 గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం, అదే మున్సిపల్ పరిధిలోని సుల్తానాబాద్ వద్ద పాదయాత్రలో 1700 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 10–04–2018 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం (పట్టణం)లోని ఒక స్కూల్ గ్రౌండ్స్‌లో చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 11–04–2018 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన సతీష్ వైఎస్సార్సీపీలో చేరారు. అదే రోజున తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 14–04–2018 పాదయాత్ర 136వ రోజున కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్. ఆయన వెంట జన ప్రభంజనం కొనసాగడంతో కంపించిన వంతెన. వారధి వద్ద జగన్‌ను కలిసిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్సీపీలో చేరారు. అదే రోజున సాయంత్రం విజయవాడ నగర పరిధిలోని విజయవాడ పశ్చిమం నియోజకవర్గం, చిట్టినగర్ సెంటర్లో బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 17–04–2018 కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 18–04–2018 కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, అదే మండలంలోని గణపవరం వద్ద పాదయాత్రలో వైఎస్ జగన్ 1800 కి.మీ. పూర్తి చేశారు. 21–04–2018 కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 22–04–2018 రాజీనామా చేసిన పార్టీ ఎంపీలతో పాటు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి శిబిరంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 24–04–2018 కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 28–04–2018 కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 29–04–2018 కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తాడంకి వద్ద తన ప్రస్థానంలో 1900 కి.మీ పూర్తి చేసుకున్న జననేత ప్రజా సంకల్పయాత్ర. 30–04–2018 ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించిన వైఎస్ జగన్. ఘన నీరాజనం పలికిన ప్రజలు. గ్రామ సమస్యలపై స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ బంధువులు. 01–05–2018 కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం (పట్టణం)లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 02–05–2018 కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పొట్లపాడులో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 05–05–2018 కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 06–05–2018 కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని కౌతవరం, గుడ్లవల్లేరు మధ్య న్యాయవాదులతో జననేత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 07–05–2018 కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నవైఎస్ జగన్. 09–05–2018 కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం, పెరికగూడెంలో దళితులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 10–05–2018 కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న జననేతను మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌తో పాటు, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. 12–05–2018 కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 13–05–2018 కృష్ణా జిల్లాలో యాత్ర ముగించుకున్న జననేత కలకర్రు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. 14–05–2018 ఏలూరు నియోజకవర్గం, వెంకటాపురం వద్ద పాదయాత్రలో 2000 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 15–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ 18–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజెర్లలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 19–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం వద్ద గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 21–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జననేత పాల్గొన్నారు. 22–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పిప్పర వద్ద 2100 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న విపక్షనేత. 23–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 25–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరయ్యారు. 27–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 30–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద పాదయాత్రలో 2200 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. అదే రోజు పట్టణంలో బహిరంగ సభలో పాల్గొన్న జననేత. 01–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభకు హాజరైన వైఎస్ జగన్. 03–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం, పెనుగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 05–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 09–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా నిడుదవోలు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 10–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, మల్లవరం వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనం. 11–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ వద్ద పాదయాత్రలో 2300 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 12–06–2018 రైల్ కమ్ రోడ్ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర. 4.25 కి.మీ పొడవైన వంతెనపై అశేష జనవాహిని మధ్య రాజమండ్రిలోకి ప్రవేశించిన జననేత.అదే రోజు సాయంత్రం రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ. 15–06–2018 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బహిరంగ సభ. 18–06–2018 తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 20–06–2018 తూర్పు గోదావరి జిల్లా రాజోలులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 21–06–2018 తూర్పు గోదావరి జిల్లా లక్కవరం క్రాస్ వద్ద పాదయాత్రలో 2400 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 26–06–2018 తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 27–06–2018 200వ రోజుకు చేరుకున్న పాదయాత్ర. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జననేత ప్రజా సంకల్ప యాత్ర. 30–06–2018 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 07–07–2018 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ పాదయాత్ర. 08–07–2018 తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, పసలపూడి వంతెన వద్ద పాదయాత్రలో 2500 కి.మీ ప్రస్థానం చేరుకున్న జననేత. 09–07–2018 తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండల కేంద్రంలో బహిరంగ సభ. 11–07–2018 మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరిక. 14–07–2018 తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో బహిరంగ సభ. 18–07–2018 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని సంతచెరువు ఎస్ఆర్కే సెంటర్ వద్ద బహిరంగ సభ. ఆ తర్వాత నగరంలో పర్యటన. 21–07–2018 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అచ్చంపేట జంక్షన్లో మత్స్యకారులతో ఆత్మీయ సమ్మేళనం. 25–07–2018 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, వేములవారి సెంటర్లో బహిరంగ సభ. 28–07–2018 ప్రజా సంకల్పయాత్రలో 100వ నియోజకవర్గం అయిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట చేరుకున్న వైఎస్ జగన్. సరిగ్గా అదే పట్టణంలో పాదయాత్రలో 2600 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 31–07–2018 తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 05–08–2018 తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో బహిరంగ సభ. 11–08–2018 తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు పట్టణంలోని సినిమా రోడ్డు వద్ద పాదయాత్రలో 2700 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్ జగన్. 14–08–2018 విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. నర్సీపట్నం నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన జననేత. 18–08–2018 విశాఖ జిల్లా నర్సీపట్నంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 20–08–2018 విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభ. 24–08–2018 విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద పాదయాత్రలో 2800 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 29–08–2018 విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 30–08–2018 250వ రోజుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర. విశాఖ జిల్లా అనకాపల్లిలో జననేత పర్యటన. 01–09–2018 విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 03–09–2018 విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో బహిరంగ సభ. 05–09–2018 విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు అదే మండలంలోని పెదనాయుడుపాలెం పాత రోడ్డు వద్ద పాదయాత్రలో 2900 కి.మీ. పూర్తి చేసుకున్న జననేత. 09–09–2018 విశాఖపట్నం–ఉత్తరం నియోజకవర్గం, కంచరపాలెం, మెట్టు సెంటర్ వద్ద బహిరంగ సభ. 10–09–2018 విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గంలోని విజ్ఞాన్ కళాశాల వేదికగా బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం. 12–09–2018 గ్రేటర్ విశాఖ పరిధి, విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గం అరిలోవ వద్ద ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనం. 17–09–2018 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల కేంద్రంలో బహిరంగ సభ. 24–09–2018 విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. ఎస్.కోట నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్తవలస మండలం, దేశపాత్రునిపాలెం వద్ద పాదయాత్రలో 3000 కి.మీ ప్రస్థానం చేరిన జననేత పాదయాత్ర. 30–09–2018 విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 01–10–2018 విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్లో బహిరంగ సభ. 03–10–2018 విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలోని మొయిద జంక్షన్ వద్ద బహిరంగ సభ. 07–10–2018 విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండల కేంద్రంలో బహిరంగ సభ. 08–10–2018 విజయనగరం జిల్లా గుర్ల మండలం, ఆనందపురం క్రాస్ వద్ద పాదయాత్రలో 3100 కి.మీ మైలురాయి దాటిన జననేత. 10–10–2018 విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 17–10–2018 విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 22–10–2018 విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 24–10–2018 విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, అదే మండలంలోని బాగువలస వద్ద పాదయాత్రలో 3200 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 25–10–2018 విశాఖపట్నం విమానాశ్రయంలోని విఐపీ లాంజ్‌లో జగన్‌పై హత్యాయత్నం. 12–11–2018 17రోజుల విరామం తర్వాత తిరిగి పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయకపాడు నుంచి యాత్ర పునః ప్రారంభం. 17–11–2018 విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. విశాఖలో హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన వైఎస్ జగన్. 18–11–2018 300వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో జననేత పర్యటన. 20–11–2018 విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 24–11–2018 విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో పాదయాత్రలో 3300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర. 25–11–2018 శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. జిల్లాలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద పాలకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేత. 28–11–2018 శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 03-12–2018 శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 0612–2018 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, చిలకపాలెంలో బహిరంగ సభ. మరోవైపు ఎచ్చెర్ల వద్ద పాదయాత్రలో 3400 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 08–12–2018 శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జననేత. 11–12–2018 శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 16–12–2018 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 22–12–2018 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. అదే మండలంలోని రావివలస శివారులో పాదయాత్రలో 3500 కి.మీ ప్రస్థానం చేరిన ప్రజా సంకల్పయాత్ర. 24–12–2018 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం, మెళియాపుట్టి మండలం కేంద్రంలో బహిరంగ సభ. 30–12–2018 శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో బహిరంగ సభ. ఇతర వివరాలు డిసెంబరు 30వ తేదీ, ఆదివారం నాటికి 333వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర. డిసెంబరు 29వ తేదీ, శనివారం సాయంత్రానికి 3550.3 కి.మీ నడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 జిల్లాలలో పూర్తి చేసుకుని చివరిదైన 13వ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర 135 నియోజకవర్గాలలో పూర్తైన పాదయాత్ర. 136వ నియోజకవర్గం ‘పలాస’లో కొనసాగుతోంది. మొత్తం 123 సభలు, సమావేశాలు 42 ఆత్మీయ సమ్మేళనాలు -
సంచలనాలు, వివాదాలు.. కోలీవుడ్ 2018
సందేశాలు, సాంకేతిక అంశాలు పక్కన పెడితే.. క్షణం తీరికలేని దినచర్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే సగటు మనిషి కాస్త స్వాంతన కోసం వచ్చేది సినిమాకే. వారికి రెండు గంటల పాటు ఆహ్లాదాన్ని అందించడమే సినిమా ప్రధాన లక్ష్యం. అందులో ఎంత వరకు చిత్ర పరిశ్రమ సక్సెస్ అయ్యిందన్నది ప్రశ్నార్థకమే. ఈ ఏడాది కోలీవుడ్ మనుగడ కూడా అలాగే గడిచిపోయింది. కోలీవుడ్ చిత్రపరిశ్రమ 2018లో జీఎస్టీ పన్ను విధానం, చిత్ర పరిశ్రమ సమ్మె వంటి సంఘటనలను ఎదుర్కొంది. దాదాపు 170 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది విజయాల శాతం కొంచెం (10 శాతం) ఎక్కువే అన్నది సంతోషించాల్సిన విషయం. పెద్దా, చిన్న చిత్రాల్లో విజయాలపై అంచనాలు పెట్టుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇక కొన్ని చిత్రాలయితే పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి రాబట్టలేకపోయాయి. దెయ్యం ఇతివృత్తాలతో హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలు వెల్లువెత్తాయి. తక్కువ ఖర్చు, అధిక లాభార్జన కారణం. చిత్ర జయాపజయాల విశ్లేషణ గురించి ప్రముఖ పంపిణీదారుడు తిరుపూర్ సుబ్రమణియం మాట్లాతూ ఈ ఏడాది భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్ చిత్రాలన్ని కలిసి 170 విడుదలైనా విజయాల సంఖ్య తక్కువేనన్నారు. కొన్ని చిత్రాలైతే నిర్మాణ వ్యయాన్ని సైతం రాబట్టలేక నష్టాలనే మిగిల్చాయన్నారు. చెన్నైలో ‘2.ఓ’దే అగ్రస్థానం ఈ ఏడాది అధిక చిత్రాలు విడుదలైనా, చాలా తక్కువ చిత్రాలే లాభాలను తెచ్చిపెట్టాయని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే విజయ్ నటించిన సర్కార్ చిత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే చెన్నై వరకూ అగ్రస్థానం రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రానిదే. ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో 2.ఓ చిత్రమే సత్తా చాటుకుంది. ఇక నటుడు కార్తీ నటించిన కడైకుట్టి సింగం వసూళ్ల సాధనలో మూడోస్థానంలో నిలిచింది. విశాల్ నటించిన ఇరుంబుతిరై, విజయ్‌సేతుపతి నటించిన 96, నయనతార నటించిన కోలమావు కోకిల, ఇమైకా నోడిగళ్ వంటి చిత్రాలు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. చిన్న చిత్రాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం రాక్షసన్. ఇకపోతే సక్సెస్ అనిపించుకున్న చిత్రాల్లో గులేబకావళి, ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్, నాచియార్, కాట్రిన్ మొళి, స్కెచ్, కలగలప్పు 2, ఒరు కుప్పకథై, కాలా, టిక్ టిక్ టిక్, ప్యార్ ప్రేమ కాదల్, యూటర్న్, వడచెన్నై, మారి–2 వంటి చిత్రాలు ఉన్నాయి. సూపర్‌స్టార్ నటించిన కాలా, కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం– 2 వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. సంచలనాలు, వివాదాలు పలు సంచలనాలకు, వివాదాలకు ఈ ఏడాది నిలయం అయ్యిందనే చెప్పాలి. ఏడాది ఆరంభంలోనే జనవరి 15న గీత రచయిత వైరముత్తు ఆండాళ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. వైరముత్తుపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సంచలన నటి అమలాపాల్ ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. జనవరి 28న ఈ వ్యవహారంలో కొచ్చిలో ఆమె అరెస్ట్ అయి తరువాత విడుదలైంది. అదే నెల 31న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కింది. గాయని చిన్మయి గీత రయియిత వైరముత్తు, నటుడు రాధారవిలపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వివాదంగా మారాయి. ఇక నటి శ్రీరెడ్డి దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటుడు రాఘవ లారెన్స్ వంటివారిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న మక్కళ్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. డిజిటల్ సంస్థలు అధిక ధరలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ నిర్మాతల మండలి 47 రోజుల పాటు సమ్మె చేయడంతో చిత్ర షూటింగ్‌లు రద్దు కొత్త చిత్రాల విడుదలను నిలిపేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఏప్రిల్ 13న శ్రీదేవి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. జూలై 15న పైయనూర్‌లో ఫెఫ్సీ ఆధ్వర్యంలో స్టూడియోనే ప్రారంభించారు. ఆగస్ట్ 29న విశాల్ ప్రజా సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 20న నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి శ్రుతీహరిహరన్ ఆరోపణలు చేసింది. రాజకీయ దుమారం నవంబర్ 8న నటుడు విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విమర్శించారంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గజ తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీలోకం తరలి వచ్చింది. ఇక సర్కార్ చిత్ర వ్యవహారంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెన్నై హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు ససేమిరా అన్న ఏఆర్ మురుగదాస్ కేసును ఎదుర్కొంటానని మరు పిటిషన్లో పేర్కొన్నారు. అధిక చిత్రాల హీరో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా విజయ్‌సేతుపతి నిలిచారు. జీవీ.ప్రకాశ్, ప్రభుదేవా, కార్తీక్ గౌతమ్,విక్రమ్‌ప్రభు,విక్రాంత్ ఉన్నారు. రజనీ కాంత్, విక్రమ్, విశాల్, ధనుష్, జయంరవి, విష్ణువిశాల్, అధర్వ, అరవిందస్వామి రెండు చిత్రాలే చేశారు. కమల్, సూర్య, విజయ్, శివకార్తి్తకేయన్, కార్తీ, శింబు, జీవా ఒక్క చిత్రంతోనే సరి పెట్టుకున్నారు. హీరోయిన్లలో కీర్తీదే అధిక్యం హీరోయిన్లలో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన రికార్డు యువనటి కీర్తీసురేశ్‌దే. ఈ బ్యూటీ ఏకంగా 5 చిత్రాల్లో నటించింది. వీటిలో మహానటి(నడిగైయార్ తిలగం) చిత్రం కీర్తీ సినీ కెరీర్లో గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇక నటి ఐశ్వర్యరాజేశ్, వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా తలా ఐదు చిత్రాల్లో నటించారు. నటి సమంత, సాయిషా, జ్యోతిక 3 చిత్రాలు చేశారు. అగ్రనటి నయనతార, త్రిష, హన్సిక, అమలాపాల్, సాయిపల్లవి రెండేసి చిత్రాల్లో నటించారు. తమన్నా, అంజలి ఒక్కో చిత్రానికే పరిమితం అయ్యారు. కాగా నటి త్రిషకు ‘96’చిత్రం అనూహ్య విజయాన్ని అందించింది. అదే విధంగా సూపర్‌స్టార్‌తో నటించాలనే తన చిరకాల కోరిక ఏడాది ‘పేట’చిత్రంతో నెరవేరింది. 2018 త్రిషకు మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. దివికేగిన తారలు ఇక విషాద కరమైన సంఘటన ఆగస్ట్ 7న డీఎంకే అధినేత, సినీ రచయిత కరుణానిధి తుదిశ్వాస విడిచారు. నిర్మాత పట్టియల్ శేఖర్, నటుడు దేసింగురాజా, కొల్లం అజిత్, హాస్య నటుడు నీలు, సిలోన్ మనోహర్, నటి శ్రీదేవి, కృష్ణకుమారి, ఎడిటర్ పీఎస్.నాగరాజ్, ఎడిటర్ అనిల్‌మల్నాడ్, ఎడిటర్ శేఖర్, చాయాగ్రహకుడు సురేశ్‌కుమార్, సీవీ.రాంజేంద్రన్, గాయని ఎంఎస్. రాజ్యలక్ష్మి, రచయిత బాలకుమార్, సీనియర్ దర్శక నిర్మాత ముక్తాశ్రీనివాసన్, దర్శకుడు ఆర్.త్యాగరాజన్, గాయని రాణి, దర్శకుడు శివకుమార్, నటుడు వెల్లైసుబ్బయ్య, నటుడు రాకెట్ రామనాథన్, నిర్మాత ఎంజీ.శేఖర్, నటుడు కోవై.సెంథిల్, నటుడు కెప్టెన్‌రాజు వంటి సినీ ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. -
రసవత్తరం.. ఈయేటి భారతం
2018 సంవత్సరం భారత రాజకీయాల్లో పలు మార్పులకు నాంది పలికింది. సంవత్సర ఆరంభంలో బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. సంవత్సరాంతానికి వచ్చేసరికి మూడు రాష్ట్రాల్లో పరాజయంతో కుదేలైంది. అయితే.. బీజేపీకి జరిగిన నష్టాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు తమ సత్తాచాటుకోవడం దేశ రాజకీయాల్లో మరో మలుపునకు నాంది పలికింది. మరోవైపు ప్రధానిగా మోదీ జనాదరణ తగ్గకపోయినా.. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నాటికి బీజేపీ, దాని మిత్రపక్షాలు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, సంవత్సరం చివరకు వాటి సంఖ్య 16కు పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎదురులేని స్థితి నుంచి బీజేపీ జోరు నెమ్మదించింది. ఒకప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైనా.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. పదిహేనేళ్లుగా అధికారంలో లేని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఎన్డీయే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం వంటి పరిణామాలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం.. మళ్లీ ఎన్డీఏకే అధికారం రావచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఫలితాన్ని ఇప్పుడే ఊహించడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. మొదట బీజేపీ విజయ పరంపర ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో.. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. త్రిపురలో కమ్యూనిస్టుల బలమైన కోటను కూల్చి మరీ అధికారాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. త్రిపుర తొలి కాషాయపార్టీ సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. మేఘాలయాలో కాంగ్రెస్ పరాజయంపాలైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్పీపీకి చెందిన కన్రాడ్ సంగ్మా సీఎం అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఓడిపోయింది. బీజేపీతో కలిసి నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) మెజారిటీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెయిఫియూ రియో ప్రమాణం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య భారతంలో బీజేపీకి మొదలైన విజయాలు ఇలా ముందుకు కొనసాగాయి. కర్ణాటకతో కథ మారింది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు దక్కపోయినా.. బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పక్షంగా అవతరించింది. గవర్నర్ ఆహ్వానంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు వచ్చిన సీట్లలో సగం కూడా గెలుచుకోని జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధమవడంతో.. కూటమి సర్కారు ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సందర్భంగా.. బీజేపీ వ్యతిరేకపార్టీలు (జాతీయ, ప్రాంతీయ) బెంగళూరులో బలప్రదర్శన చేశాయి. సోనియా, రాహుల్లతోపాటుగా మమతా బెనర్జీ (తృణమూల్), కేజ్రీవాల్ (ఆప్), చంద్రబాబు (టీడీపీ) అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) సహా సీపీఎం, సీపీఐ నాయకులు సహా అనేక మంది ప్రతిపక్షాల నేతలు కుమారస్వామి ప్రమాణానికి హాజరయ్యారు. ఇంత మంది ప్రతిపక్ష నేతలు ఒకే వేదిక మీద కనిపించడం 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీపై ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థి ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. అప్పటినుంచి ఈఅంశం ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకే బీజేపీ వ్యతిరేక మహాఘట్ బంధన్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం) జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ పార్టీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ బాఘేల్ సీఎం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కన్నా బీజేపీ ఒక శాతం ఓట్లు ఎక్కువ సాధించినా.. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. సీఎం సీటుకోసం యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడినప్పటికీ.. వయసు, అనుభవం, రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కమల్‌నాథ్‌కే ఈ పీఠం దక్కింది. రాజేను తిరస్కరించిన రాజస్తాన్ రాజస్తాన్‌లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు అధికారపీఠం నుంచి కిందకు దించారు. రాజేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుందనుకున్నప్పటికీ.. బీజేపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వచ్చాయిగానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 101 సీట్లు రాకున్నా చిన్న పార్టీలు, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం సీటును ఆశించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు ఆశాభంగం తప్పలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌కే అధిష్టానం సీఎల్పీ నాయకత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు పైలట్ అంగీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వం కోసం రగిలిన వివాదం సమసిపోయింది. మొత్తంమీద కాంగ్రెస్ కన్నా ఒక శాతం తక్కువ ఓట్లు సంపాదించిన బీజేపీ 73 సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా రాజస్తాన్ కొనసాగించింది. ‘చే’జారిన ఈశాన్యం ఐదేళ్లుగా ఈశాన్యంలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. ఈ ప్రాంతంలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలోనూ ఓటమిపాలైంది. కాంగ్రెస్ సీఎం లాల్ థాన్వాలా పోటీచేసిన రెండు సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. మెజారిటీ సీట్లు సాధించిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నేత జోరంతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంత లోకాలకు అటల్జీ... ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దేశ ప్రధానిగా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. 1996లో 13 రోజులు, 1998–99 మధ్య 13 నెలలపాటు ఆయన ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1999–2004 మధ్యలో మూడోసారి ప్రధానిగా (ఐదేళ్లపాటు) పని చేశారు. 1924, డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయి తన వాక్చాతుర్యంతో పార్టీలకతీతంగా అభిమానం సంపాదించారు. అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారు. సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా ఉంటూ భాగస్వాముల్లో ఎలాంటి అసంతృప్తి రేగకుండా వ్యవహరించడమే.. వాజ్‌పేయి రాజకీయ సమర్థతకు నిదర్శనం. ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు ప్రయత్నించడం ద్వారా ప్రపంచ దేశాల నేతలకు కూడా అభిమానపాత్రుడయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అటల్.. ప్రధాని హోదాలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి ఇరు దేశాలమధ్య సత్సంబంధాలకు కృషి చేశారు. కరుణానిధి అస్తమయం తమిళనాడుకు దాదాపు రెండు దశాబ్దాలు సీఎంగా పని చేసిన డీఎంకే అధినేత కరుణానిధి ఆగస్టు 7న చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ప్రబలడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. 1924, జూన్ 3న జన్మించిన కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు సినీ రచయితగా ఉన్నారు. 1969లో డీఎంకే తొలి సీఎం అన్నాదురై ఆకస్మిక మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. 1976లో అవినీతి తదితర ఆరోపణలపై కరుణానిధి సర్కారును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత 1989లో మళ్లీ కరుణ అధికారంలోకి వచ్చారు. శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై 1991లో ఆయన ప్రభుత్వాన్ని కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.1989లో కేంద్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటులో కరుణానిధి కీలక పాత్ర పోషించారు. మళ్లీ 1996–98 మధ్య కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. రఫేల్‌పై కాంగ్రెస్‌కు మొట్టికాయలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారత్–ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రధానిపై రాహుల్ గాంధీ పలు వేదికల ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మోదీ వ్యవహరించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ ఒప్పందంలో అవినీతిపై విచారించాలంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. ఈ ఒప్పందంలో అవినీతి కనిపించడం లేదని.. లోపాలేమీ లేవని, దీనిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం లేదని డిసెంబర్ 14న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఫేల్ పేరుతో రెండు ఇంజన్లు కలిగిన యుద్ధవిమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ డసో ఏవియేషన్ సంస్థ నుంచి 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారతదేశంలో తయారు చేయాలని 2012లో యూపీఏ ప్రభుత్వం, డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ.526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు. 126కి బదులుగా 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. 59 వేల కోట్లకు రఫేల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను ఇండియాకు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో మోదీ తెలపాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందంపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణలో వైమానిక దళం అధికారులు సహా పలువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందాన్ని సమర్థిస్తూ, కాంగ్రెస్ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ కారణంగా సుప్రీం తీర్పు వచ్చిందని, దీనిపై జేపీసీని నియమించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంటులో రోజూ గొడవ చేస్తూనే ఉన్నాయి. కౌగిలింత ఆపై కన్నుగీత.. జూలై 20న పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను కౌగలించుకున్నారు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన తర్వాత రాహుల్ అనూహ్యంగా మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దాంతో మోదీ సహా పార్లమెంటు సభ్యులంతా క్షణకాలం అవాక్కయ్యారు. ఆ తరువాత తన సీటు వద్దకు తిరిగొచ్చిన రాహుల్.. సన్నిహితులవైపు చూసి కన్నుగీటారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
తొడగొట్టకుండానే సవాల్!
మీసం మెలేసి, తొడగొట్టే సవాళ్లకు కాలం చెల్లింది. సామాజిక మాధ్యమాల్లో సవాల్ విసిరితే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా సవాళ్లు ఎక్కువైపోతున్నాయి. 2018లో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన చాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సవాళ్లు నెట్లింట్లో హల్చల్ చేశాయి. కొన్ని సవాళ్లు భయపెట్టగా, మరికొన్ని హాస్యాన్ని పంచాయి. సమాజానికి మేలు చేసే చాలెంజ్‌లు ప్రముఖులతో పాటు సామాన్యులను కదిలించాయి. కీకీ చాలెంజ్ ‘హట్‌లైన్ బ్లింగ్’ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదల సందర్భంగా ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి వదిలారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటు వారు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. ఈ చాలెంజ్ ప్రమాదకరంగా పరిణమించడంతో చాలా రాష్ట్రాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల యువకులు మాత్రం తమదైనా శైలిలో కీకీ చాలెంజ్‌ను స్వీకరించి నవ్వులు పూయించారు. నిమ్మకాయ సవాల్ క్యాన్సర్ బాధితులకు సహాయపడేందుకు సృష్టించిన ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’కు మంచి ఆదరణ లభించింది. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ సవాల్‌ను తెరపైకి తెచ్చింది. సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు లేదా మిత్ర బృందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు. ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ అబ్రైగ్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి. ఫిట్‌గా ఉన్నారా? భారతీయులు ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కీడా శాఖ మంత్రి, ఒలింపిక్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఫిట్నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ ఆయన విసిరిన సవాల్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగిన వారందరు కూడా కసరత్తుల వీడియోలతో తెగ సందడి చేశారు. మాస్టర్ బ్లాస్టర్ కూడా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు ఓ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్ పేరు 'కిట్ అప్ చాలెంజ్'. ఈ చాలెంజ్‌ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేయాలి. తాను క్రికెట్ ఆడుతోన్న వీడియోను షేర్ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లి పేర్లను ‘మాస్టర్ బ్లాస్టర్’ ట్యాగ్ చేశారు. సచిన్ సవాల్‌కు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు స్పందించారు. మొక్కలు నాటే చాలెంజ్ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణలో ‘గ్రీన్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఓ స్వచ్చంద సంస్థ విసిరిన ఈ సవాల్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నుంచి సామాన్య ప్రజల వరకు పెద్ద సంఖ్యలో చాలెంజ్‌ను స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సెలబ్రిటీలు కూడా ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ పచ్చదనాన్ని పాదుకొల్పారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా మొక్కలు నాటి స్ఫూర్తి నింపారు. మోమో.. వామ్మో! గతేడాది బ్లూవేల్ చాలెంజ్ నెటిజన్లను భయపెడితే ఈ ఏడాది మోమో చాలెంజ్ ఆన్లైన్ ప్రియులను హడలెత్తించింది. అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అసలు ఈ మోమో అన్నది ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారన్న వివరాలు వెల్లడికాలేదు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్ ఇచ్చి.. మెసేజ్ పంపుతూ చాట్ చేయాలంటూ చాలెంజ్ విసురుతారు. మనం పంపితే.. భయానక చిత్రాలు.. హింసాత్మక సందేశాలు వస్తాయి. పలు పనులు పూర్తి చేయాలంటూ వరుసగా సవాళ్లు వస్తాయి. స్వీయ హాని చేసుకునేలా ఇవి ప్రోత్సహిస్తుంటాయి. చాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు కూడా వచ్చాయి. ‘వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్’ వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్ తీసుకున్న వ్యక్తులు తమ నిజ జీవితంలో వేటినైయితే అత్యంత భద్రంగా చూసుకుంటారో.. వేటిని ఎక్కువగా ప్రేమిస్తారో.. ఇంకో రకంగా చెప్పాలంటే తమ సంపదగా భావించే వాటిని రోడ్డు మీద పడేయ్యాలి. క్రెడిట్ కార్డ్స్, డబ్బు, జ్యూవెలరి, డిజైనర్ బట్టలు, చెప్పులు, బ్యాగ్‌లు, వృత్తికి సంబంధించినవి, వస్తువులు, జంతువులు, మనషులతో సహా. వాటిని రోడ్డు మీద పడేయాలి. తర్వాత కార్ నుంచి బయటకు వచ్చి పడేసిన వాటి మధ్య పడుకోని ఫోటో దిగాలి. ఏదో ఫోటోషూట్‌కి ఫోజ్ ఇస్తున్నట్లు కాకుండా.. స్పృహతప్పి కింద పడిపోయినట్లు పేవ్మెంట్ వైపుగా ముఖం పెట్టి పడిపోవాలి. తర్వాత ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. లిప్ సింక్ బాటిల్ చాలెంజ్, వ్యాట్ ది ఫ్లఫ్ చాలెంజ్, ఇన్విజిబుల్ చాలెంజ్, ది డెలె అలీ హ్యాండ్ చాలెంజ్, ది నెయ్మార్ చాలెంజ్, స్నూట్ సవాళ్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేశాయి. వీటిలో ఒకట్రెండు మినహా మిగతావన్నీ యూజర్లకు హాస్యాన్ని పంచాయి. సమాజ హితానికి తోడ్పడే సవాళ్లు ఎన్ని విసిరినా ఫర్వాలేదు గానీ ప్రాణాలతో చెలగాటమాడే చాలెంజ్‌లు మాత్రం వద్దని నెటిజన్లు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మేలు చేసే సోషల్ మీడియా సవాళ్లు వైరల్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వివాదాల కీలాద్రి!
రాజకీయ జోక్యం అధికం కావడం.. అధికారుల మధ్య ఆధిపత్య పోరు.. పాలకవర్గం పెద్దల చర్యలు వెరసి ఇంద్రకీలాద్రిపై వ్యవహారాలు 2018లో భక్తుల మెప్పు పొందలేకపోయాయి. వివిధ కారణాలతో నలుగురు ఈవోలను మార్చడం.. అభివృద్ధి పనుల అంశంగా ఎవరి ధోరణి వారిదన్నట్లు నడుచుకోవడం ఇబ్బందికర పరిస్థితులకు దారితీశాయి. పవిత్ర దుర్గగుడి వ్యవహారాల్లో వర్గపోరుకు పాలకపక్షం ఆజ్యం పోసిందన్న విమర్శలు మిన్నంటాయి. సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వివాదాలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి సభ్యుల చర్యల వల్ల దేవస్థానం ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది. ఒకే ఏడాది నలుగురు ఈవోలను మార్చి దేవస్థానం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాయీబ్రాహ్మణులు రోడ్డెక్కి ధర్నా చేసి చివరకు ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు ఐటీ మంత్రి నారా లోకేష్ కోసం గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పత్రికలు కోడై కూశాయి. ఈ అంశం వివాదం కావడంతో ఈ ఏడాది జనవరి 7న అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటుపడింది. అయితే దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన వాస్తవాలను ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఈవో వర్సెస్ ఏఈవో.. దసరా ఉత్సవాల్లో జరిగిన జ్ఞాపికల స్కాం చివరకు ఏఈవో అచ్యుతరామయ్య సస్పెక్షన్ వరకు వెళ్లింది. దీంతో ఈవో కోటేశ్వరమ్మకు, ఏఈవో అచ్యుతరామయ్యకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఈవో నియామకం చెల్లదంటూ ఏఈవో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు జోక్యంతో ఏఈవోనే ఒకడుగు దిగి వచ్చి ఈవో కోటేశ్వరమ్మకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. భక్తులకు సౌకర్యాలు.. ప్రస్తుతం దుర్గగుడి నిధులు తరిగిపోవడంతో భక్తుల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డు, మల్లికార్జున మహామండపంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు వేయించారు. అన్నదాన భవానాన్ని మల్లికార్జున మహామండపంలోకి మార్చడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ఒకే ఏడాది నలుగురుకార్యనిర్వహణాధికారులు ఒకే ఏడాదిలో నలుగురు ఈఓలు మారడంతో దేవస్థానం అభివృద్ధికి ఆటంకంగా మారింది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగిన నేపథ్యంలో ఈవో ఎ.సూర్యకుమారిని జనవరి 7 బదిలీ చేశారు. అదే రోజు తాత్కాలిక ఈవోగా అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 29న మొవ్వ పద్మను ఈవోగా నియమించారు. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత చీర మాయం చేసిన ఘటనలో మొవ్వ పద్మను పదవి నుంచి తప్పించారు. ఆగస్టు 17న వి.కోటేశ్వరమ్మ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఈవోలను మార్చడం చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మను దర్శించుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్.. జూన్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుర్గమ్మను దర్శించుకుని ముక్కెరను బహూకరించారు. తమిళనాడు డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసిన పాలకమండలిదేవాలయం ప్రతిష్టను దేవస్థానం పాలకమండలి దెబ్బతీసింది. పాలకమండలి సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా ప్రవర్తించారు. జూన్ రెండో వారంలో దేవస్థానంలో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య కేశఖండనశాలలోని ఒక క్షురకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో క్షురకులంతా రోడ్డెక్కారు. చివరకు ఈ వివాదం ముదిరి క్షురకులు తమకు వేతనాలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. క్షురకులంతా వెళ్లి చంద్రబాబును కలసి ఆయన్ను నిలదీయడం.. నాయీబ్రాహ్మణులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 5న దుర్గగుడిలో భక్తులు సమర్పించిన ఖరీదైన చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాయం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ వివాదం ముదిరి కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి తొలగించారు. ఈ ఘటనలతో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింది. చిన్నారి మిస్సింగ్.. మహిళల డ్రస్సింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు అమ్మవారి దర్శనానికి వచ్చిన చిన్నారి నవ్య శ్రీ జూన్ 17న మల్లికార్జున మహామండపం సమీపంలో మాయమైంది. సీసీ కెమెరాల సహాయంతో బాలిక ను ఒక మహిళ గుంటూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈలోగా ఆ మహిళ నవ్యశ్రీని పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జూన్ 25న దుర్గగుడికి చెందిన ఓ కాటేజీలో మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరకు కెమెరాలు తొలగించారు. -
జీహెచ్ఎంసీ ‘అప్ అండ్ డౌన్స్’
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికలు జీహెచ్ఎంసీపై పెనుప్రభావం చూపాయి. దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా అందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమవడంతో నాలుగునెలల పాటు ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డిని బదిలీ చేశాక ఎం.దానకిశోర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లు ఆరు జోన్లుగా రూపాంతరం చెందాయి. 30 సర్కిళ్లను 48 సర్కిళ్లకు, ఆరు జోన్లను 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, వారి ఏర్పాటు మాత్రం సాధ్యం కాలేదు. నలుగురు యువ ఐఏఎస్‌లు భారతి హొళికేరి, ముషారఫ్, శ్రుతి ఓజా, సిక్తా పట్నాయక్ లు బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చారు. వీరిలో భారతి హొళికేరి స్వల్ప కాలంలోనే జీహెచ్ఎంసీ నుంచి బదిలీ కాగా.. ఆమె స్థానంలో మరో ఐఏఎస్ సందీప్‌కుమార్ ఝా వచ్చారు. అక్రమ కట్టడాల నిరోధం, విపత్తు నిర్వహణ తదితర పనుల కోసం కొత్తగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి యువ ఐపీఎస్ విశ్వజిత్‌ను డైరెక్టర్‌గా నియమించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తూ ఫుట్‌ఫాత్‌లపై దాదాపు 12 వేల ఆక్రమణలను తొలగించారు. విపత్తుల నివారణకు ప్రత్యేక వాహనాలు, యంత్ర సామగ్రిని సమకూర్చుకున్నారు. బార్లు, పబ్బులపైనా కొరడా ఝళిపించారు. అయితే, ఎన్నికల ప్రకటనతో ఆయా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. భవన నిర్మాణ అనుమతుల్లో ఈసీబీసీని అమల్లోకి తెచ్చారు. వివిధ ప్రాజెక్టుల కవసరమైన నిధులు చెల్లించేందుకు ఖజానాలో నిధులు లేకపోవడంతో టీడీఆర్(అభివృద్ధి బదలాయింపు హక్కు)ను విస్తృతంగా ప్రచారం చేశారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి నాలుగురెట్లు పరిహారంతో దీన్ని అమల్లోకి తెచ్చారు. అందుబాటులోకి అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో అయ్యప్ప సొసైటీ, చింతల్‌కుంట, మైండ్‌స్పేస్ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్లు పూర్తిచేసి అందుబాటులోకి తేవడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఉపశమనం లభించింది. నిధుల లేమితో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. ఓటర్ల జాబితా నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడ్డాక వీవీప్యాట్ స్లిప్‌లు బయటకు రావడం దాకా ఎన్నికల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఘనవ్యర్థాల నిర్వహణలో నంబర్–1 రహదారుల కోసం పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట రూ.720 కోట్లు మంజూరైనా నిధులు విడుదల కాక పనులు ముందుకు సాగలేదు. ప్రజలకు రోడ్ల పాట్లు తప్పలేదు. భూసేకరణ సమస్యలతో నాలాల ఆధునీకరణ పనులూ ముందుకు సాగలేదు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో జీహెచ్ఎంసీ గత ఏడాది కంటే దిగజారిపోయింది. గత సంవత్సరం 22వ ర్యాంకు రాగా, ఈ సంవత్సరం 27వ ర్యాంకు లభించింది. ఘనవ్యర్థాల నిర్వహణలో మాత్రం రాజధాని నగరాల్లో ప్రథమస్థానం పొందింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పనుల్లో పురోగతి సాధించింది. సాలార్జంగ్ మ్యూజియం వద్ద పాలికాబజార్ తరహాలో ఐకానిక్ బ్రిడ్జి, చార్మినార్ వద్ద అమృత్సర్ తరహా ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. ‘టీమ్ యాప్’ వినియోగంలోకి రాలేదు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏసీ బస్టాపులు ప్రచార పటాటోపాలుగా మిగిలాయి. ఎఫ్‌ఓబీలు తదితరమైనవి వాస్తవరూపం దాల్చలేదు. రూ.13,500 కోట్లతో భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, సగం నిధులు కూడా సమకూరలేదు. నెలనెలా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కూడా కష్టంగా మారింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
రాజకీయ రణరంగం
ముందస్తు ఎన్నికలతో 2018 చివరి ఐదు నెలలు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల నామ సంవత్సరం అధికార టీఆర్ఎస్ను మరింత ఉత్తేజితం చేసి అధికారాన్ని అప్పగించింది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్ వ్యూహాలతో.. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. జమిలి ఎన్నికల నినాదం దేశమంతటా వినిపిస్తున్న వేళ ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎంచుకున్నారు. దీనికితోడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటూ కేసీఆర్ ఈఏడాదిలోనే ‘ఫెడరల్ ఫ్రంట్’జాతీయనేతగా తన ప్రయాణాన్ని మొద లుపెట్టారు. అటు, టీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తయిపోయాయి. కాంగ్రెస్ మరోమారు పరాభవం పొందగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా కమలనాథులు రాష్ట్రంలో కనీస ప్రతిభ చూపలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు, అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు, తెలంగాణ జనసమితి పేరిట ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ, సీపీఎం జాతీయ మహాసభలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం, ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎన్నికల వేళ రాజకీయ హడావుడి, జంపింగ్‌లు జపాంగ్‌లతో పార్టీలు మారిన నేతలు వంటి ఘటనలతో 2018 ఎన్నికలనామ వత్సరంగా మిగిలిపోయింది. టీఆర్ఎస్ అడ్డాగా తెలంగాణ 2018 సంవత్సరం టీఆర్ఎస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్కు.. 2018 మరో అతిపెద్ద విజయాన్ని అందించింది. కుటుంబ పాలన, అవినీతి అక్రమాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజానీకం కేసీఆరే తమ ఛాంపియన్‌గా నిర్ణయించారు. 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న సాహసో పేత నిర్ణయానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిపించిన టీఆర్ఎస్కు ఇప్పుడు ఏకంగా 88 స్థానాలను కట్టబెట్టి తెలంగాణ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అనే రీతిలో తీర్పునిచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు వచ్చి బలీయశక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నలుగురు మంత్రులు మాత్రమే ఓటమి పాలుకాగా, చాలా మంది కొత్త నేతలు శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై పట్టును నిరూపించుకున్న టీఆర్ఎస్.. హైదరాబాద్‌లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. ఎలాగూ ఉత్తర తెలంగాణలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో లభించిన అనూహ్య విజయంతో పూర్తిస్థాయిలో కుదురుకుంటుందనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇక పార్టీ పరంగా కూడా కీలక మార్పులకు 2018 వేదిక అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగింది. రెండు, మూడేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తికావడంతో టీఆర్ఎస్కు రెండోబాస్గా కేటీఆర్ మరింత క్రియాశీలమవుతున్నారు. దీంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి పావులు కదుపుతుండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రెండో‘సారీ’ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా వరుసగా రెండోసారి ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అధికారం దక్కుతుందనే కోటి ఆశలతో టీడీపీ సహా పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోరాడినా పెద్దగా కలసిరాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటలో పయనిస్తే ఇక్కడ మాత్రం బోల్తాకొట్టింది. ఎన్నికల్లో ఓటమితో కేడర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా, కనీసం ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ముందుకు రాకపోవడం, సమీక్షించుకుని మళ్లీ రణరంగంలో దిగేందుకు టీపీసీసీ ముఖ్యులు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసివచ్చిందేమీ లేదు. ఎన్నికలు జరిగినప్పటికీ పార్టీ నుంచి ఎంత మంది వచ్చారో.. అంతే మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం లాంటి పరిణామాలు తప్ప పెద్దగా జరిగిందేమీ లేకపోవడం గమనార్హం. మీ సోపతి.. మాకొద్దు ‘బాబో’య్ రాష్ట్ర రాజకీయాల్లో 2018లో జరిగిన కీలక పరిణామం.. తెలంగాణ ప్రజలు చంద్రబాబుతో సావాసాన్ని అంగీకరించకపోవడమే. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ను కలిపి కుమ్మేశారు. చంద్రబాబు ప్రచార పటాటోపాలకు ఏమాత్రం తలొగ్గని తెలంగాణ ప్రజలు ఆయనతో సోపతి మాకు వద్దంటే వద్దని తేల్చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న టీడీపీ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేతలు పార్టీ మారినా కేడర్పోలేదని, తమ ఓట్లు తమకున్నాయని గొప్పలు చెప్పుకున్న తమ్ముళ్ల గూబగుయ్‌మనేలా ప్రజలు తీర్పునిచ్చారు. పైన ఉన్నా.. ఇక్కడ సున్నా 2018 కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతోనయినా కొంతమేర గట్టెక్కుదామని ఆశించిన రాష్ట్ర బీజేపీ నేతలకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దక్షిణ భారతదేశంలో కాషాయదళం పాగా వేసేందుకు ప్రయోగాత్మకంగా తెలంగాణను బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం ఉన్నస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని స్వీకరించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో మళ్లీ సున్నా నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పలేదు. ఇక, పార్టీ పరంగా కూడా ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామాలేవీ సంభవించలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు రాని నేతలు ఎన్నికల వేళ పార్టీలో చేరడం మినహా బీజేపీకి 2018లో కలిసివచ్చిందేమీ కనిపించలేదు. కమ్యూనిస్టులు ఖతమే! ఈ ఏడాది రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్‌తో గుడ్డిగా పొత్తు కుదుర్చుకుని సీపీఐ, సామాజిక న్యాయం ఎజెండా అంటూ బీఎల్ఎఫ్ పేరుతో కూటమి కట్టిన సీపీఎంలు బొక్కబోర్లా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో అసెంబ్లీలోనే వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష ఓట్లు చీలుస్తామని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేమని తెలిసినా కులాల వారీ టికెట్లు కేటాయించి సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకోగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎంఐఎంకు మాత్రం 2018 మంచి మిత్రుడిని తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ రూపంలో లభించిన దోస్తానాతో మంచి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పాతబస్తీలో మరోమారు తన పట్టు నిరూపించుకుంది. 2018లో జరిగిన ముఖ్య రాజకీయ ఘటనలు మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం. మార్చి 13: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెన్షన్. ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా చర్యలు. మార్చి 23: జె.సంతోశ్, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక. ఏప్రిల్ 2: తెలంగాణ జనసమితి పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం. అదే నెల4వ తేదీన పార్టీ జెండావిష్కరణ. ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం. ఐదు రోజుల పాటు సభలు. ఏప్రిల్ 27: కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ. హైదరాబాద్‌లోనే ఉండి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్. మే 2: ఫెడరల్‌ఫ్రంట్ రూపకల్పనలో భాగంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. మే 23: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం. తొలిసారి బహిరంగంగా ఒకేచోట కనిపించిన రాహుల్, చంద్రబాబు. జూన్ 28: విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్. వజ్రఖచిత ముక్కుపుడక సమర్పణ. జూలై 27: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా ప్రభుత్వ భూమి కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఆగస్టు 4: ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్. జమిలి ఎన్నికలపై చర్చ. ఆగస్టు 13, 14: హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. స్వయం సహాయక సంఘాల మహిళలు, సెటిలర్లతో భేటీలు. సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ గర్జన. ఆగస్టు 22: ప్రగతి భవన్లో మంత్రివర్గ సహచరులతో ఏడుగంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించిన మంత్రివర్గ సహచరులు. ఆగస్టు 24: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయిన కేసీఆర్. ఆగస్టు 25: ఢిల్లీ వెళ్లి ప్రధానితో కేసీఆర్ ముందస్తుపై భేటీ. సెప్టెంబర్ 2: కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రగతినివేదన సభ. సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో సన్నబియ్యం, సొంతిల్లు లాంటి ప్రజాకర్షక హామీలు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. సెప్టెంబర్ 6: శాసనసభను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం. 8 నెలల 26 రోజుల ముందే సభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు అందజేసిన సీఎం కేసీఆర్. వెంటనే 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. సెప్టెంబర్ 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెప్టెంబర్ 19: ఎన్నికల సైన్యాన్ని ప్రకటించిన కాంగ్రెస్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం నియామకం. అక్టోబర్ 4: ఎన్నికల నగారా ఆలంపూర్ నుంచి ప్రారంభించిన కాంగ్రెస్. అక్టోబర్ 10: రాష్ట్రంలో ఎన్నికలకుషెడ్యూల్ విడుదల. నవంబర్ 5: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ. నవంబర్ 12: 65 మందితో కాంగ్రెస్, 9 మందితో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల. నవంబర్ 20: టీఆర్ఎస్కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా. నవంబర్ 23: మేడ్చల్ కాంగ్రెస్ బహిరంగసభ. హాజరయిన సోనియా, రాహుల్. నవంబర్ 27: నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీ బహిరంగసభలు. ప్రజాకూటమి మేనిఫెస్టో విడుదల. డిసెంబర్ 7: ప్రశాంతంగా శాసనసభకు ఎన్నికలు. డిసెంబర్ 11: ఎన్నికల ఫలితాలు విడుదల. 88 స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు. డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్. మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ. డిసెంబర్ 14: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎన్నిక. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
‘మహా’భాగ్యం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రూపంలో ఈ ఏడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం చేకూరింది. ఈ సంస్థ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని నింపాదిగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యను నిలువరించేందుకు మంగళ్‌పల్లి, బాటాసింగారంలో లాజిస్టిక్ పార్కులు, బాలానగర్ ఫ్లైఓవర్ పనులు నింపాదిగా సాగుతున్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లతో శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది పూర్తికావాల్సి ఉన్నా.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి పక్కన బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో రూ.35 కోట్లు, మంగళ్‌పల్లి వద్ద 22 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనాలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్క్‌లు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పెద్ద పెద్ద ట్రక్కులు, ఇతర సరుకు రవాణ వాహనాలు నగరంలో ప్రవేశించకుండా అక్కడ ఏర్పాటు చేసే గోడౌన్లలో ఖాళీ చేసే వీలు కలుగుతుంది. ఆయా సరుకులను మినీ ట్రక్కుల ద్వారా ఆయా కేంద్రాలకు చేరుస్తారు. దీంతో నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు వివిధ మార్గాలలో లారీల రాకపోకలను నగరం బయటే నియంత్రించే వీలుంది. అంతే కాకుండా మినీ ట్రక్కుల ఉపయోగం వల్ల కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. అయితే ఈ లాజిస్టిక్ పార్కు పనులు పూర్తికావల్సి ఉన్నా పనులు మాత్రం నింపాదిగా సాగుతుండటం అధికారుల ఆలసత్వానికి నిదర్శనంగా మారింది. నత్తనడకన బాలానగర్ ఫ్లైఓవర్ పనులు .. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తప్పించే బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం హెచ్ఎండీఏ రూ.384 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కి.మీ. పొడవునా ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఏడాది క్రితం మొదలుపెట్టింది. ఈ ఫ్లైఓవర్ కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 59 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.104.53 కోట్లవుతుండగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్‌ను బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దక్కించుకుంది. అయితే భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో పనులు నింపాదిగా జరుగుతున్నాయి. శివారు మౌలిక వసతులకు ప్రాధాన్యం నగరశివారు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భాగస్వామ్యం అవుతోంది. తద్వారా శివారుల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఎల్ఆర్ఎస్ ద్వారా హెచ్ఎండీఏకు వచ్చిన రూ.1,000 కోట్ల ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లు ప్రజల మౌలిక వసతులకు ఖర్చుబెడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల స్థానిక సంస్థల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్చెరులో రూ.మూడు కోట్లతో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల వసతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో రూ.6.59 కోట్లతో రెండు కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు చేస్తున్నారు. రూ1.09 కోట్లతో 2.6 కి.మీ. మేర రిచ్–1 సెంట్రల్ మీడియన్ పనులను, రూ.1.09 కోట్ల వ్యయంతో 2.6 నుంచి 5.4 కిలోమీటర్ల మేర రిచ్–2 సెంట్రల్ మీడియన్ పనులు చేస్తున్నారు. 5.5 కి.మీ. మేర సెంట్రల్ మీడియన్‌లో రూ.1.34 కోట్లతో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. నందిగామ గ్రామంలో రూ.48 లక్షల వ్యయంతో 400 మీటర్లు డ్రైనేజీ లైన్, 1.3 కి.మీ. మేర సీసీ రోడ్డు పనులు చేస్తున్నారు. రూ.3.59 కోట్లతో అమీన్‌పూరాలో రోడ్డు పనులు ఊపందుకున్నాయి. రూ.15 కోట్లతో భువనగిరి మున్సిపాలిటీల్లో సెంట్రల్ మీడియన్ నిర్మాణం, నాలుగు కి.మీ. మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనుల్లో వేగం పెరిగింది. రూ.5 కోట్లతో చౌటుప్పల్‌లో రూ.56 కోట్లతో కుంట్లూరులో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6.80 కోట్లతో కిస్మత్‌పూర బ్రిడ్జి, రూ.6.50 కోట్లతో హుస్సేన్‌సాగర్ కూకట్పల్లి కాలువ వద్ద ఐ అండ్ వో స్ట్రక్చర్, రూ.7.50 కోట్లతో లక్ష్మీగూడ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రేడియల్ రోడ్డు మార్గంలో అసంపూర్తిగా ఉన్న కిలోమీటర్ మేర పనులను చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులోని ఇంజాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి వై జంక్షన్ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.2.95 కోట్లను మంజూరు చేసింది. రూ.5 కోట్లతో పటాన్చెరులో ట్రక్కు పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. కోట్లు కురిపించిన ప్లాట్ల వేలం హెచ్ఎండీఏ ప్లాట్ల ఆన్లైన్ వేలం కోట్ల వర్షం కురిపించింది. 211 ప్లాట్లకు నిర్వహించిన వేలంలో హెచ్ఎండీఏకు దాదాపు రూ.380 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మాదాపూర్‌లో గజానికి రూ.1,52,000 పలుకగా, షేక్‌పేటలో రూ.1,11,700, సరూర్‌నగర్ రెసిడెన్సియల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో రూ.73,000, మియాపూర్‌లో రూ. 73,000 పలికింది. హెచ్ఎండీఏ నిర్ధారించిన అప్సెట్ ధరను మించి రెండింతలు, మూడింతల ధరను కోట్ చేసి కొనుగోలుదారులు సొంతం చేసుకోవడంతో అధికారులు ఊహించిన రూ.250 కోట్ల కన్నా మరో రూ.130 కోట్లు ఎక్కువగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా వేలంలో అత్తాపూర్ రెసిడెన్సియల్ లే అవుట్, అత్తాపూర్ ముష్క్ మహల్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లోనూ గజానికి రూ.1,42,000 పైనే పలికింది. దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరే ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. అలాగే లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల ద్వారా సంస్థకు నెలకు దాదాపు రూ.25 కోట్ల చొప్పున హెచ్ఎండీఏ ఖజానాకు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
తమిళ్ మున్నేట్ర పడమ్
2018లో సినిమాలు చూశాం.గొప్పగా చెప్పుకున్నాం.2019లోనూ పక్కవాళ్ల సినిమాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుందాం.2018లో తమిళులు సినిమాల్లో ముందడుగు ఎలా వేశారో తెలుసుకుందాం.మున్నేట్రమ్ అంటే ముందడుగు.ఇంద(ఈ) తమిళ్ మున్నేట్ర పడమ్ పాక్కలామ్ (చూద్దాం). సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాది మొదలుపెట్టాలంటే ఈ ఏడాది ఎలా గడిచిందో విశ్లేషించుకోవాలి. మన సినిమాలకు సంబంధించిన లెక్కలు మొదలుపెట్టేశాం. ప్లస్సులు, మైనస్సులు, లాభ నష్టాలు అన్నీ లెక్క తేలుతున్నాయి. మనం ఎలా ఉన్నామో తెలియడానికి స్వీయ విశ్లేషణ ఒక్కటే సరిపోదు... మనం ఎక్కడున్నామో తెలియాలంటే పక్క ఇండస్ట్రీ వాళ్లతో పోల్చి చూసుకుంటే తప్పు లేదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘పడమ్’(సినిమా)ల ప్రస్తావన.ఈ ఏడాది మొదటి సినిమా సీజన్‌ను విక్రమ్, సూర్య మొదలెట్టారు. పొంగల్‌కు పోటీగా రిలీజ్ అయిన ‘స్కెచ్’, తానా సేంద కూట్టమ్(గ్యాంగ్)’ చిత్రాలు యావరేజులుగా నిలిచాయి. ‘తానా సేంద కూట్టమ్’ పాటలు మార్కెట్‌ను విపరీతంగా ఊపేసినా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ కాలేదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క ‘భాగమతి’ ఏకకాలంలో తమిళంలోనూ విడుదలైంది. అక్కడ కొంత శాతం మాత్రమే ప్రేక్షకులు భయపడడంతో యావరేజ్‌గా నిలిచింది. అలా గ్రాండ్ స్టార్ట్ లేకుండానే 2018లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది తమిళ పరిశ్రమ. హంగామా లేదు ఫిబ్రవరిలో విజయ్ సేతుపతి ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా నిహారిక కొణిదెల తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. జీవా, జై, శివ, కేథరీన్, నిక్కీ గల్రానీలతో దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ‘కలకలప్పు 2’ అనుకున్నంత ఆడలేదు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన కుమార్తెను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘సొల్లి విడవా’ సరిగ్గా ఆడలేదు. ‘36 వయదినిలే’తో కమ్‌బ్యాక్ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత బాల దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నాచ్చియార్’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించారు జ్యోతిక. సినిమా బాగానే ఆడింది. మొదటి నెల లానే రెండో నెల కూడా కలకలప్పు (హంగామా) లేకుండా మామూలుగా గడిచింది. బొమ్మ పడలేదు మధ్యలో ఏర్పడ్డ థియేటర్ల సమస్య కారణంగా రిలీజ్లు పల్చబడ్డాయి. పూర్తిగా బంద్ అయ్యాయి కూడా. దాంతో వెండితెరపై బొమ్మ పడలేదు. బాక్స్‌లన్నీ ల్యాబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత ఆగిపోయిన చిత్రాలన్నీ కూడా గేటు వదిలిన నీళ్లలా వారానికి 4,5 చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న కథ– స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందిస్తాడనే పేరు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్కురీ’తో వచ్చాడు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సైలెంట్ సినిమాకు మంచి చప్పట్లే పడ్డాయి. ‘మహానటి’ని ఏకకాలంలో ‘నడిగయర్ తిలగమ్’గా తమిళంలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి ప్రశంసలు వినపడ్డా అక్కడక్కడా జెమినీ గణేశన్ పాత్ర తీర్చిదిద్దిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. మన ఫోన్లో ఉన్న సమాచారంతోనే మనల్ని ఎలా మభ్యపెట్టొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఇరుంబుదురై’ (అభిమన్యుడు) చిత్రం విశాల్‌కు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లూ రాబట్టింది. కార్తీ రైతుగా కనిపించిన ‘కడైకుట్టి సింగం’ (చినబాబు) దెబ్బకు థియేటర్స్‌ను కన్నీటి పర్యంతం చేసేసింది. ఉద్వేగభరిత కుటుంబ కథా చిత్రంగా వంద రోజులాడేసింది. తమిళంలో మంచి హిట్ సాధించి, తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ అయింది. తమిళ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫార్ములాని పేరడీ చేసి తెరకెక్కించిన చిత్రం ‘తమిళ పడమ్ 2’. ‘తమిళ పడమ్’కు సీక్వెల్. బాగానే నవ్వుకున్నారు ఆడియన్స్. మన తెలుగు ‘సుడిగాడు’కు ఈ చిత్రమే ప్రేరణ. కామెడీ డాన్‌గా విజయ్ సేతుపతి చేసిన ‘జుంగా’ పెద్ద నష్టాన్నే మిగిల్చింది. యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి తీసిన ‘ప్యార్ ప్రేమ కాదల్’కు పాస్ మార్కులు పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌కు ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ చిత్రానికి తెలుగులో మంచి స్పందన రాకపోయినా తమిళంలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన నయనతార ‘ఇమైక్క నొడిగళ్’ మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారానే రాశీ ఖన్నా తమిళ ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ ‘సీమరాజా’ పండగ సినిమాగా మిగిలిపోయింది. సమంత ‘యు టర్న్’ మంచి హిట్‌గా నిలిచింది. సీక్వెల్స్ ‘సామీ స్క్వేర్ (సామి 2), సండైకోళి 2 (పందెం కోడి 2) ఫస్ట్ పార్ట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయాయి. విజయ్ దేవరకొండ ‘నోటా’కు మన దగ్గర అనుకున్నన్ని ఓట్లు పడకపోయినా తమిళంలో మంచి మెజారిటీ సాధించింది. ‘జయం’ రవి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది. చాలా కాలం తర్వాత మణిరత్నం సినిమా సూపర్ హిట్ టాక్ని తీసుకొచ్చింది. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘చెక్క చివంద వానమ్’(నవాబ్) మంచి సక్సెస్‌గా నిలిచింది. విజయ్ – మురగదాస్ కాంబినే షన్లో వచ్చిన ‘సర్కార్’ సినిమా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. అందులో రాజకీయ వివాదాల సహాయం కూడా లేకపో లేదు. జ్యోతిక ‘కాట్రిన్ మొళి’ పర్వాలేదనిపించింది.ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న సైకో థ్రిల్లర్ ‘రాక్షసన్’. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అద్భుతమైన రివ్యూలను సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నితిన్. ఇలాంటి రివ్యూస్ అందుకున్న మరో సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’. దళిత సిద్ధాంతాలతో, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ చిత్రం కూడా మంచి రివ్యూలను అందుకుంది.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన గ్రాఫికల్ సృష్టి చిట్టి. ‘2.0’ చూసిన ప్రేక్షకులు ‘హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది’ అని అభినందించారు. ఆ ఆనందాన్ని కోట్లతో కలెక్షన్ల రూపంలో తెలియజేశారు. గత శుక్రవారం సుమారు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మారీ 2, అడంగామారు, కానా, సిలుక్కువారిపట్టి సింగం’ సినిమాలు విడుదలయ్యాయి. మామూలుగా తమిళనాడులో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల నిషిద్ధం. రూల్ బ్రేక్ చేసి, థియేటర్లకొచ్చిన ఈ ఐదు సినిమాలూ వసూళ్లు పంచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది స్టార్ హీరోలు ఫార్ములానే నమ్ముకుంటే.. యంగ్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో దూసుకుపోయారు. బాక్సాఫీస్ ఆకలి తీర్చడానికి స్టార్ హీరోల సినిమాలు.. వంక పెట్టడానికి వీల్లేకుండా రివ్యూలు సాధించిన చిన్న సినిమాలూ ఉన్నాయి. మార్కెట్ ఉన్న హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. అలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మార్చుకుంటూ, కొత్త కథలను ఇచ్చి పుచ్చుకుంటూ.. బైలింగువల్స్గా కొనసాగాలని కోరుకుందాం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం పైకి తీసుకెళ్లడానికి కిందుండి (భౌగోళికంగా) కృషి చేద్దాం. గ్యాంగ్స్ట్టర్ ఇయర్ ఈ ఏడాది ధనుష్ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడ చెన్నై’ రిలీజ్ అయింది. నార్త్ చెన్నైలోని ఓ గ్యాంగ్ గురించి చర్చించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అనిపించింది. అలాగే ‘మారి’ సీక్వెల్‌గా రూపొందిన ‘మారి 2’ను రిలీజ్ చేశారు. మరోవైపు ‘రాక్షసన్, పరియేరుమ్ పెరుమాళ్’ వంటి పేరు సంపాదించిపెట్టిన రెండు చిత్రాల దర్శకులు తమ నెక్ట్స్ సినిమాలను ధనుష్‌తో చేస్తున్నట్టు ప్రకటించేశారు. రజనీ ఎక్స్‌ప్రెస్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కసారి కనిపించడమే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి విడుదలలో జాప్యం అవుతూ వచ్చి ఈ ఏడాది రిలీజ్ అయింది. అలాగే పా. రంజిత్ తెరకెక్కించిన ‘కాలా’ జూలైలో రిలీజ్ అయింది. ‘కబాలీ’ తర్వాత రజనీతో తీసిన ‘కాలా’ సినిమాతో రంజిత్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను రంజింపచేయలేకపోయారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ చేస్తున్న ‘పేట్టా’ షూటింగ్ కూడా అనుకున్నదానికంటే 15 రోజుల ముందే కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. లేడీ సూపర్ స్టార్ రెండు డిఫరెంట్ జానర్ల సినిమాలతో ఈ ఏడాది స్క్రీన్‌పై కనిపించారు నయనతార. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇమైక్క నొడిగళ్’, డార్క్ కామెడీ ‘కోకో’ (కోలమావు కోకిల) చిత్రాలు రెండూ సూపర్‌హిట్. స్టార్ హీరోలకు సమానంగా ‘కోకో’కు చెన్నైలో ఉదయం నాలుగు గంటల షోలు ఏర్పాటు చేయడం విశేషం. నయన్ ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం. పాంచ్ పటాకా ఈ మధ్య తమిళ సినిమాల గుర్తించి ప్రస్తావించాలంటే కచ్చితంగా డిస్కస్ చేయాల్సిన పేరులా విజయ్ సేతుపతి మారిపోయారు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్‌ల ఎంపికే. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో కనిపించారు సేతుపతి. (రెండు గెస్ట్ రోల్స్). ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) సినిమాతో ఓపెన్ చేసి ‘జుంగా, చెక్క చివంద వానమ్, 96, సీతకాత్తి’, సినిమాల్లో కనిపించారు. ‘జుంగా’లో అల్లరి డాన్‌గా కనిపిస్తే, ‘చెక్క చివంద వానమ్’లో పోలీస్ ఆఫీసర్ రసూల్‌గా కనిపించి, పవర్ కోసం పరిగెడుతున్న అన్నదమ్ములను ఏరిపారేశారు. ఆ తర్వాత టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ అయిన ‘96’లో కనిపించారు. జానకి, రామచంద్రన్ అనే ఇద్దరి ప్రేమకథను టేప్రికార్డర్లో పెట్టి రివైండ్ బటన్ నొక్కి అందర్నీ పాత జ్ఞాపకాల్లో పడేసిన సినిమా ఇది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన 8 సంవత్సరాల్లోనే సేతుపతి 25వ సినిమా (సీతకాత్తి) మైలు రాయి అందుకోవడం విశేషం. -
2018.. భారత్ ఆట.. పతకాల వేట
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా దీటుగా బదులిస్తూ.. వారిని బోల్తా కొట్టిస్తూ.. అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతూ.. మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది కంటే మెరుగ్గా అద్భుత ఫలితాలు నమోదు చేశారు. భారత క్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాలే అందుకు నిదర్శనం. ఇండోనేసియా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ 69(15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు) పతకాలు సాధించింది. ఓవరాల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అలానే మరికొన్ని ప్రముఖ ఈవెంట్లలో సైతం భారత్ సత్తా చాటి పతకాల వేటను కొనసాగించింది. వాటిలో కొన్నింటిని ఓ లుక్కేద్దాం. 1. పీవీ సింధు: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించింది. ఫలితంగా బ్యాడ్మింటన్ టోర్నీని బంగారు పతకంతో ముగించింది. ఈ సీజన్లో ఆమెకు ఇదే తొలి టైటిల్ కాగా, అంతకుముందు వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ టోర్నీల్లో రజత పతకాలు సాధించింది. ఇక థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం సింధు రజత పతకాల్ని సాధించింది. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఘనతను సింధు సొంతం చేసుకుంది. 2. సైనా నెహ్వాల్: ఈ ఏడాది మరో మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం మంచి ఫలితాల్ని సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు ఏషియన్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే నాలుగు టోర్నీల్లో(కామన్వెల్త్ గేమ్స్, డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, సయ్యద్ మోదీ) సైనా ఫైనల్‌కు చేరింది. 3. సైనా-కశ్యప్‌ల వివాహం: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న సైనా-కశ్యప్‌లు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో డిసెంబర్14వ తేదీన వివాహం చేసుకున్నారు. రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంట.. ఆపై ఘనంగా హెచ్ఐసీసీలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. 4. సమీర్‌వర్మ: ఈ సీజన్లో భారత షట్లర్ సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించాడు. లక్నోలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన లు గాంగ్జును ఫైనల్లో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి హన్ యు చేతిలో సైనా ఓటమి పాలైంది. 5. అంగద్ వీర్ సింగ్ బజ్వా: ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్ స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ అంగద్ వీర్ సింగ్ బజ్వా ప్రపంచ రికార్డు స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. కాంటినెంటల్, ప్రపంచస్థాయి స్కీట్ ఈవెంట్లలో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా అంగద్ రికార్డులకెక్కాడు. కువైట్ సిటీ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండల్ అంగద్ 60కి 60 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత జోడి ఎలవెనిల్ వలరివాన్-హ్రిదయ్ హజరికాలు గోల్డ్ సాధించారు. 6. స్వప్న బర్మన్: ఏషియన్ గేమ్స్‌లో 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ సాధించింది. ఇండోనేసియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. హై జంప్, జావెలిన్ త్రోలలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్ , లాంగ్ జంప్ లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులోనాలుగో స్థానంలో, 200మీ. పరుగులో సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... నాలుగో స్థానంలో నిలిచినా మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. 7. అర్పిందర్ సింగ్: ఆసియా క్రీడల్లో భాగంగా ట్రిపుల్ జంప్‌లో భారత జంపర్ అర్పిందర్ 16.77 మీటర్ల దూరం దూకి స్వర్ణంతో మెరిశాడు. కనీసం ఈ పోటీల్లో జాతీయ రికార్డును సవరిస్తే చాలు అనుకున్న అర్పిందర్ ఏకంగా పసిడిని పట్టేయడం విశేషం. దీంతో ఈ విభాగంలో 48 ఏండ్లుగా ఊరిస్తు వస్తున్న స్వర్ణ ఆశలకు తెరదించాడు. 2014 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క పతకం కూడా గెలువని అర్పిందర్.. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పసిడిని సాధించి అందరినీ అబ్బురపరిచాడు. 8. తేజిందర్ పాల్ సింగ్: ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ స్వర్ణాన్ని సాధించాడు. రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. దీంతో ఒత్తిడికి గురైన తేజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో మాత్రం మళ్లీ 19.96 మీటర్లు విసిరి మునుపటి లయని అందుకున్నాడు. ఐదోసారి కసితో ఆడి ఆసియా క్రీడల్లోనే రికార్డు నెలకొల్పేలా గుండును 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. 9. రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడికి స్వర్ణం: ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందిన బోపన్న–శరణ్ జోడి పసిడి సాధించింది. ఫలితంగా తమ కెరీర్లో ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని తొలిసారి సొంతం చేసుకుంది. 10. వుషూలోనూ మెరిశారు: ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల వుషూ ఈవెంట్లో భారత్ నాలుగు కాంస్య పతకాల్ని సాధించింది. ఇది ఏషియన్ గేమ్స్ వుషూ చరిత్రలో భారత్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2014లో రెండు క్యాంస పతకాల్ని మాత్రమే సాధించగా.. ఈసారి దాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వుషూలో పతకాలు సాధించిన వారిలో రోషిబినా దేవీ(60 కేజీల కేటగిరీ), సంతోస్ కుమార్(56 కేజీల కేటగిరీ), సూర్య భాను ప్రతాప్ సింగ్(60 కేజీల కేటగిరీ), నరేందర్ గ్రావెల్(65 కేజీల కేటగిరీ)లు ఉన్నారు. 11. సెపక్తక్రా: ఆసియాగేమ్స్ సెపక్‌తక్రాలో ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఆసియాగేమ్స్‌లో భాగంగా భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో సెపక్తక్రా క్రీడాంశంలో భారత్ కనీసం కాంస్య పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. 12. వినేశ్ ఫొగాట్: ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత పసిడి పట్టు పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 13. బజరంగ్ పూనియా: ఆసియా క్రీడల్లో రెజ్లర్ బజరంగ్ పూనియా గోల్డ్ సాధించాడు. 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్ రెజ్లర్ తకాతాని దైచిని ఓడించిన పూనియా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 14. గోల్డెన్ జాన్సన్: ఆసియా క్రీడల్లో జిన్సన్ జాన్సన్ స్వర్ణం ఒడిసిపట్టాడు.1500 మీ. పరుగులో జాన్సన్ పసిడితో మెరిశాడు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్...1500 మీ. పరుగులో మాత్రం అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని సాధించాడు. 15.జెరెమీ లాల్రిన్గుంగా: అర్జెంటీనా వేదికగా జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో భారత్ టీనేజ్ వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. వెయిట్‌లిఫ్టింగ్ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. 16. తబాబి దేవి: యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి జూడోలో పతకం లభించింది. 44 కిలోల కేటగిరిలో తంగ్జమ్ తబాబి దేవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ లేదా యూత్ స్థాయిలో పరంగా చూసిన జూడోలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 17. దీపా కర్మాకర్: టర్కీలో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్కప్లో భారత జిమ్నాస్ట్ దీపాకర్మాకర్ స్వర్ణాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఈ గేమ్స్‌లో భారత్ తరపున పసిడి సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. 18. సునీల్ ఛెత్రి: జూన్ నెలలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రెండోస్థానం పొందాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌తో లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. 19.నవజ్యోత్ కౌర్: భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 20. సానియా మీర్జాకు పుత్రోత్సాహం: అక్టోబర్ నెలలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుత్రుడికి జన్మనిచ్చింది. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరగ్గా.. ఈ ఏడాది ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగింది. 21. సాక్షి మాలిక్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి మాలిక్(57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. 22. మేరీకోమ్: ముప్పై ఐదేళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి అయినా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని మహిళా బాక్సర్ మేరీకోమ్ తన ప్రదర్శనతో నిరూపించింది. నవంబర్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరికోమ్ పసిడి సొంతం చేసుకుంది. తద్వార ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ స్వర్ణంతో ఈ మణిపురి మణిపూస క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి సొంతం చేసుకున్న మేరీ.. ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో రజతం సరిపెట్టుకుంది. సెప్టెంబర్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేరికోమ్‌ను గిరిజనుల ప్రచారకర్తగా నియమించింది. ఇదే నెలలో పొలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం నాలుగు గంటల్లో రెండు కిలోలు తగ్గి ఔరా అనిపించింది. -
2018.. పరుగుల కింగ్ కోహ్లినే
గతేడాది జరిగిన సిరీస్‌ల్లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది. ప్రధానంగా స్వదేశంలో ఘన విజయాల్ని సాధించిన టీమిండియా.. విదేశీ పర్యటనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న విరాట్ సేన.. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆటగాళ్ల ర్యాంకు పరంగా చూస్తే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి టెస్టులతో పాటు, వన్డేల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వన్డే బౌలింగ్ విభాగంలో బూమ్రా టాప్‌లో ఉన్నాడు. 1. దక్షిణాఫ్రికా పర్యటన : ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. భారత జట్టు 1-2 తేడాతో సఫారీల చేతిలో ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. చివరి టెస్టులో మాత్రం గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఆపై వన్డే సిరీస్‌ను భారత్ 5-1తో కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 10న జరిగిన నాలుగో వన్డేలో మినహా అన్నింటిల్లోనూ భారత్ విజయాలు నమోదు చేసింది. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. టీ 20 సిరీస్‌లోనూ భారత్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్త చేసింది. 2. నిదహాస్ ట్రై సిరీస్: శ్రీలంక వేదికగా మార్చి నెలలో జరిగిన నిదహాస్ ట్రై సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక, భారత్‌తో పాటు బంగ్లాదేశ్ ఈ సిరీస్‌లో పాల్గొంది. 3. అఫ్గాన్‌తో ఏకైక చారిత్రాత్మక టెస్ట్‌లో భారత్ విజయం(జూన్ 14 నుంచి 18 వరకు జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో టీమిండియా విజయం). ఈ టెస్టు మ్యాచ్‌కు అజింక్యా రహానే నేతృత్వం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. 4. ఐర్లాండ్ రెండు టీ20ల సిరీస్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. జూన్27వ తేదీన జరిగిన తొలి టీ20లో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టీ20లో 143 పరుగులతో జయభేరి మోగించింది. 5. ఐర్లాండ్ సిరీస్ ముగించుకుని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్‌కు శుభారంభం లభించింది. టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. అటు తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. తొలి వన్డేలో గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్‌లో భారత్ 4-1తో కోల్పోయింది. ఆగస్టు 18 నుంచి 22 వరకూ నాటింగ్హమ్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. 6. ఆసియాకప్ భారత్ కైవసం: దుబాయ్ వేదికగా ఆరు దేశాల పాల్గొన్న ఆసియాకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ కప్‌ను ముద్దాడింది. పాకిస్తాన్,అఫ్గానిస్తాన్‌లు సూపర్-4 దశతోనే సరిపెట్టుకోగా, శ్రీలంక లీగ్ దశలోనే నిష్క్రమించింది. 7. విండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్: సెప్టెంబర్ చివరి వారంలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ టెస్టు సిరీస్‌తో పాటు వన్డే, టీ20 సిరీస్‌ను కోల్పోయి స్వదేశానికి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 క్లీన్‌స్వీస్ చేసిన భారత్.. ఐదు వన్డేల సిరీస్ 3-1తో సాధించింది. రెండో వన్డే టైగా ముగియగా, మూడో వన్డేలో విండీస్ విజయం నమోదు చేసింది. ఇక మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 8. ఆసీస్‌తో ద్వైపాక్షిక సిరీస్: ఆసీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా టీ20 సిరీస్‌ను ఆడింది. నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవగా, రెండో టీ20 వర్షం వల్ల రద్దయ్యింది. దాంతో సిరీస్ సమం అయ్యింది. ఆపై నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, డిసెంబర్ 14వ తేదీ నుంచి 18 వరకూ జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 9. గౌతం గంభీర్ రిటైర్మెంట్: టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రంజీ ట్రోఫీ మ్యాచే గంభీర్‌కు చివరిది. 2016లో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ఆడిన గంభీర్.. చివరి వన్డేను 2013లో ఇంగ్లండ్‌తోనే ఆడాడు. 10. రిషబ్ పంత్: ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన టీమిండియా యువ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు క్యాచ్‌లను అందుకున్న నాల్గో భారత కీపర్‌గా గుర్తింపు పొందాడు. మరొకవైపు ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రిషభ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రిషభ్ పట్టిన క్యాచ్‌లు 11. ఫలితంగా టీమిండియా తరుఫున ఇప్పటివరకూ సాహా పేరిట ఉన్న రికార్డును రిషభ్ బ్రేక్ చేశాడు. 11. అండర్-19 వరల్డ్‌కప్‌లో రికార్డు: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అండర్-19 వరల్డ్‌కప్‌లో కొత్త చరిత్రను లిఖించింది. పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు.. పటిష్టమైన ఆసీస్‌ను మట్టికరిపించి కప్‌ను సగర్వంగా అందుకుంది. ఈ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఈ ఓవరాల్ టోర్నీలో అత్యధిక సార్లు కప్‌ల జాబితా ప్రకారం భారత్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ ఆసీస్ మూడు వరల్డ్‌కప్‌లతో రెండో స్థానంలో ఉంది. 12. పృథ్వీ షా రికార్డులు: ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ కెరటం పృథ్వీషా పలు రికార్డులు సాధించాడు. భారత్ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే షా ఈ ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్ క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు సాధించాడు. 13. మిథాలీ-పొవార్‌ల వివాదం: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తర్వాత అవమానకర రీతిలో తనతో ప్రవర్తించారని హైదరాబాద్ ప్లేయర్ కన్నీళ్లపర్యంతమైంది. కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్ తెలపడం మరింత అగ్గి రాజేసింది. ఇక్కడ మరొకసారి పొవార్‌ను కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోరడం కొసమెరుపు. 14. పరుగుల కింగ్ కోహ్లినే: ఈ ఏడాది డిసెంబర్ 27 వరకు లెక్కలు తీసుకుంటే టెస్టుల్లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2018లో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 23 ఇన్నింగ్స్‌లకు గాను 1322 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన ఏకైక టెస్ట్ బ్యాట్స్‌మన్ కోహ్లి. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లినే తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 14 వన్డేలు ఆడిన భారత కెప్టెన్.. 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. . మరొకవైపు విదేశాల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇక టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించి సచిన్ రికార్డును(130 ఇన్నింగ్స్‌లు) బ్రేక్ చేశాడు. -
2018.. కేరళను ముంచెత్తిన వరదలు
2018 ఆరంభంలో చప్పగా సాగినప్పటికీ చివరికొచ్చే సరికి దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలు, 2019 సంవత్సరం అత్యంత ఆసక్తికర సన్నివేశాలకు శ్రీకారం చుట్టనుంది. సీబీఐలో జగడం, సుప్రీం జడ్జీల మధ్య వివాదం... పలు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు... 2018 ని ఒక్కసారి తరిచి చూస్తే.... (సాక్షి రౌండప్) థియేటర్లలో జాతీయ గీతం (జనవరి 9) సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30 న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సుప్రీంకోర్టులో సంక్షోభం (జనవరి 12) దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయముర్తులు మీడియా ముందుకు వచ్చారు. సీజేఐ తీరును ఆక్షేపిస్తూ సీనియర్ జడ్జిలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది నెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంధించిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కీలక కేసుల కేటాయింపుల విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు సంధించారు. కావేరీ జలాలపై కీలక తీర్పు (ఫిబ్రవరి 16) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది. కమల్ హాసన్ కొత్త పార్టీ (ఫిబ్రవరి 21) ప్రఖ్యాత హీరో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధురైలో తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కల్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం (మార్చి09) సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ (48) ప్రమాణం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం సంపాదించుకుంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) 8 సీట్లు గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 39 మందిని చంపిన ఉగ్రవాదులు (మార్చి 20) ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం( జూన్ 15, 2014) ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణ సమీపంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు (ఏప్రిల్ 5) కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (52)కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. సల్మాన్‌ను దోషిగా నిర్దారిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హమ్ సాథ్ హై షూటింగ్ సమయంలో (1998) రాజస్తాన్‌లోని కంకిణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. కర్ణాటకలో కొలువుతీరిన సంకీర్ణం (మే 15) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకోగా, జేడీఎస్ 37 స్ధానాల్లో గెలుపొందింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. స్టెరిలైట్ ఆందోళనలు హింసాత్మకం (మే 23) స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో వంద రోజుల పాటు సాగిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తూత్తుకుడి ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. దుమ్ము తుపాన్‌తో 17 మంది మృతి (జూన్ -3) యూపీలో చెలరేగిన దుమ్ము తుఫానులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాన్ దాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో బస్పులో... 48 మంది మృతి (జూలై 1) ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోయలో పడటంతో 48 మంది మరణించారు. 28 సీట్లుండే బస్సులో 58 మంది ప్రయాణించడంతో ప్రమాదం సంభవించింది. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు (జూలై 18) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళలు కూడా పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాలు స్వాగతించగా.. సంప్రదాయవాదులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరుణానిధి అస్తమయం (ఆగస్ట్ 7) డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి (94) మరణంతో యావత్ తమిళనాడు శోకసంద్రంలో మునిగింది. ద్రవిడ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన దిగ్గజం సెలవంటూ అనంతలోకాలకు తరలింది. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కరుణానిధికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళను కుదిపిన భారీ వర్షాలు (ఆగస్ట్ 8) కేరళను భారీ వర్షాలు కుదిపివేశాయి. తీరప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 26 మంది మరణించారు. వరద తాకిడికి 24 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కనీవినీ ఎరుగని వరదలతో 26 ఏళ్ల తర్వాత చెరుతోని డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. వాజ్‌పేయి కన్నుమూత (ఆగస్టు 16) మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణంతో యావత్‌దేశం శోకసంద్రంలో మునిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు (సెప్టెంబర్ 6) స్పలింగ సంపర్కం ఇక నేరం కాదని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్ 377తో సమానత్వపు హక్కుకు విఘాతమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో శృంగారం చేసుకోవడం నేరం కాదని పేర్కొంది. సీబీఐలో జగడం (అక్టోబర్ 24) సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలపై కేంద్రం వేటు వేసింది. కీచులాటలతో దర్యాప్తు ఏజెన్సీని దిగజార్చినందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలకు కత్తెర వేసి ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. అయోధ్య వివాదంపై విచారణ..!! (అక్టోబర్ 29) అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. పటేల్ విగ్రహావిష్కరణ (అక్టోబర్ 31) భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ 143 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల (597అడుగులు) పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంక్ సమీపంలో సాధజెట్ అనే దీవిలో ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. శబరిమల తీర్పు నిలిపివేతకు నో (నవంబర్ 13) శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు జనవరి 22న విచారిస్తామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు (నవంబర్ 21) జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ - కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సెమీఫైనల్స్‌లో సత్తా చాటిన కాంగ్రెస్ (డిసెంబర్ 11) సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టగా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి భంగపాటు ఎదురైంది. కీలక హిందీ రాష్ట్రాల్లో పట్టుసాధించిన కాంగ్రెస్ మూడు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి పాలన షురూ.. (డిసెంబర్ 20) డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. జూన్‌లో విధించిన గవర్నర్ పాలన డిసెంబర్ 19తో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. -
2018 : ప్రకృతి విలయాలు.. చారిత్రక ఘటనలు
అనేక ఘటనలు, సంఘటనలు - ఆయా దేశాల్లోని పరిణామాలు ఆందోళన కలిగించాయి. అనేక ఆటుపోటుల మధ్య అంతర్జాతీయంగా 2018 సంవత్సరం పలు చేదు జ్ఞాపకాలను మిగిల్చడంతో పాటు పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచింది. కీలకమైన అంతర్జాతీయ పరిణామాలపై సాక్షి రౌండప్...!!! అఫ్గాన్‌లో మారణహోమం (జనవరి 30) అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 151 మంది గాయపడ్డారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే. స్వీడన్‌తో బంధం బలోపేతం (ఫిబ్రవరి 5) రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్లు నిర్ణయించాయి. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఘోర విమాన దుర్ఘటన (మార్చి 13) నేపాల్‌లోని ఖట్మాండు విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ఖట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 50మంది ప్రయాణికులు మరణించారు. విశ్వవిజేత స్టీఫేన్ హాకింగ్ మరణం (మార్చి 14) మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8 న జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మదినం రోజైన మార్చి 14న కన్నుమూశారు. విశ్వాంతరాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని ఆయన హెచ్చరించారు. సిరియాలో మరో విష దాడి (ఏప్రిల్ 8) అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. 257 మంది దుర్మరణం (ఏప్రిల్ 11) ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. కూచిభోట్ల దోషికి జీవిత ఖైదు (మే 6) అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017, ఫిబ్రవరి 22 న కన్సాస్‌లోని ఒక బార్లో కూచిభొట్ల, అతని స్నేహితుడిపై.. నిందితుడు ఆడం ప్యూరింటన్ (52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ వివాహం (మే 19) బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ (33), అమెరికా నటి మేఘన్ మార్కల్ (36)లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. వివాహానికి మన దేశం నుంచి నటి ప్రియాంక చోప్రా, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. ట్రంప్ - కిమ్ చారిత్రాత్మక భేటీ (జూన్ 12) కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్– ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ట్రంప్ ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా నుంచి కిమ్ హామీ పొందారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ (జూన్ 24) కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వచ్చాయి. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున అధిక సంఖ్యలో మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష (జూలై 6) అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. కానీ సెప్టెంబర్‌లో షరీఫ్ జైలు శిక్షను రద్దు చేసి.. అతన్ని విడుదల చేశారు. నాటో దేశాల సరసన భారత్ (ఆగస్టు 1) భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హైటెక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 (ఎస్టీఏ- 1)’ ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే అవకాశాన్ని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ (ఆగస్టు 18) పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, తెహ్రీక్-ఇ-న్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ 22 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకృతి విలయం.. 832 మంది మృతి (సెప్టెంబరు 29) ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 832 మంది చనిపోయారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేశారు. నోబెల్ శాంతి బహుమతి విజేతలు (అక్టోబరు 5) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంగా కల్లోలంగా మారిన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరాటం జరుపుతున్న... కాంగో వైద్యుడు డెనిస్ మక్వీజ్ (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్ (25) లకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాగా డెనిస్ లైంగిక బానిసలకు బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. మలేసియాలో మరణశిక్ష రద్దు (అక్టోబరు 10) తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. సెనెట్ నీది హౌస్ నాది (నవంబర్ 8) అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశం కాగా.. ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. సీనియర్ బుష్ కన్నుమూత (డిసెంబరు 1) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ (94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా సుపరిచితులైన ఆయన 1989- 1993 మధ్య కాలంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. మిస్ వరల్డ్‌గా మెక్సికన్ సుందరి (డిసెంబరు 8) ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ (26) ఎంపికయ్యారు. చైనాలో జరిగిన ఈ అందాల పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇక మిస్ ఇండియా 2018 అనుకృతి వ్యాస్ టాప్ - 30లో చోటు దక్కించుకున్నారు. ఐర్లాండ్‌లో.. ఇక అబార్షన్ చట్టబద్ధం (డిసెంబరు 13) అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాగా ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ భారతీయురాలు సవిత చేసిన విన్నపాన్ని ఐరిష్ ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరి (డిసెంబరు 17) మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజులాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సిరియాపై ట్రంప్ సంచలన ప్రకటన (డిసెంబరు 19) సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా సిరియాలో ఐఎస్ సృష్టిస్తున్న అలజడి కారణంగా మారణహోమం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మృత్యు సునామీ (సాక్షి 2018 రౌండప్) (డిసెంబర్ 23) ఇండోనేషియాను మళ్లీ జల విలయం ముంచెత్తింది. సముద్రం నుంచి ఉప్పెనలా దూకొచ్చిన మృత్యు అలల కారణంగా... ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దాదాపు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది జాడ ఇంకా తెలియరాలేదు. ఈ అలల సునామీకి పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులు అతలాకుతలం కాగా 15 వందలకుపైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
2018 బిజినెస్ రౌండప్ : స్కాంల హోరు, వివాదాల జోరు
పెరిగిన డాలర్ - తగ్గిన రూపాయి, మండిన పెట్రోలు - భగ్గుమన్న ధరలు, హెచ్చుతగ్గుల మార్కెట్, మైమరింపించిన పెట్టుబడులు, భారీ రుణాలు - బ్యాంకుల కుంభకోణాలు, బంగారం ధరల దోబూచులాట... లాంటివి అనేకం 2018లో మరిచిపోలేని వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రభావం చూపిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో సాగిన బిజినెస్ పై సాక్షి రౌండప్...!!! వణికించిన చమురు : మండిన పెట్రోలు ఆకాశాన్నంటిన చమురు ధరలు ప్రపంచదేశాలను వణికించాయి. బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ 86.74 డాలర్లు వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దేశీయంగా పెట్రో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు అక్టోబరులో చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. పెట్రోలు లీటరు ధర ముంబైలో ఏకంగా రూ.90స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబరు 22 నాటికి బ్రెంట్ ఆయిల్ 53.50 డాలర్లకు చేరింది. 2018 స్టాక్‌మార్కెట్లు : 2017 ఏడాదిలో కీలక సూచీలు బీఎస్సీ సెన్సెక్స్ 26,494 వద్ద ఉండగా, 2018 జనవరిలో 36, 957 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 11వేల రికార్డ్ స్థాయిని తాకింది. అయితే ఈ ఏడాది మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఏడాదంతా ఒడిదుడుకులను చవి చూసాయి. ఆగస్టులో 38,800 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 11,760 కి ఎగువన నిఫ్టీ చారిత్రక గరిష్టాలను తాకియి. అయితే ఏడాది చివరికి 2018 జనవరి నాటి స్థాయిలోనే కొనసాగుతుండటం విశేషం. ఉసూరుమనిపించిన రూపాయి : ఈ ఏడాది జనవరిలో డాలరు మారకంలో రూపాయి 63.8 వద్ద నిలిచింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు ప్రభావంతో 74. 49 వద్ద ఆల్‌టైం కనిష్టానికి చేరింది. ఒకదశలో 75 రూపాయల స్థాయిని దాటి పతనంకానుందని ఆందోళన కూడా నెలకొంది. అయితే మళ్లీ చమురు ధరలు కాస్త చల్లబడటంతో రూపాయికి బలమొచ్చింది. అయినా గత ఏడాదితో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ దిగజారింది. ప్రస్తుతం 70రూపాయల స్థాయి వద్ద కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్ల హవా : స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లలో హల్చల్ చేశాయి. ప్రధానంగా భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ షావోమీ డివైస్లవైపే యూజర్లు మొగ్గు చూపారు. దీంతో షావోమి నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. అలాగే ఒప్పో, వివో లెనోవా, వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు భారీ విక్రయాలను నమోదు చేశాయి. భారీ స్ర్కీన్లు, అతిపెద్ద స్టోరేజ్ కెపాసిటీ, భారీ, డ్యుయల్ రియర్, సెల్ఫీ కెమెరా ఈ ఏడాదిలో ప్రముఖంగా నిలిచాయి. ఫోల్డబుల్ ఫోన్ : ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శాంసంగ్, యాపిల్, ఎల్జీ, హువావే లాంటి దిగ్గజాలకు షాకిస్తూ చైనాకంపెనీయే ముందుగా ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాయ్లీ కార్పొరేషన్ అనే సంస్థ విడుదల చేసింది. పడిలేచిన పసిడి : బంగారానికి డిమాండ్ బాగా తగ్గింది. 2018 ఏడాదంతా బులియన్ మార్కెట్లో విలువైన లోహాలు వెండి, బంగారం ధరలు అక్కడక్కడే కదలాడాయి. 25 జనవరి 2018న 24 కారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.30,454 గా ఉంది. డిసెంబరు 22 నాటికి స్వల్పంగా పుంజుకుని పది గ్రాముల పుత్తడి రూ.31,197 గా నిలిచింది. వెండి ధర మాత్రం బాగా పడిపోయింది. ఏడాది ఆరంభంలో 42 వేలు పలికిన వెండి కిలో ధర డిసెంబరు 22 నాటికి రూ. 37,276 స్థాయికి చేరింది. కుంభకోణంలో చిక్కిన పీఎన్బీ : ఏడాది ఆరంభంలోనే దేశంలో నేషనల్ బ్యాంకు కుంభకోణం ప్రకంపనలు రేపింది. బ్యాంకులోని సీనియర్ అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్కైన డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చెక్సీ (గీతాంజలి గ్రూప్) 13వేల 600 కోట్ల రూపాయలకు బ్యాంకు ముంచేసి విదేశాలు చెక్కేసారు. ఈ కేసులో కేసులు నమోదు, చార్జిషీట్లు, ఆస్తులు స్వాధీనంలాంటి చర్యల్లో సీబీఐ, ఐడీ బిజీగా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ సెగ అది పెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐని కూడా తాకింది. గీతాంజలి గ్రూపునకు వేలకోట్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వివాదంలో ఇరుక్కుంది ఐసీఐసీఐ వీడియోకాన్ కుంభకోణం : పీఎన్బీ కుంభకోణానికి తోడుగా ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ రుణ కుంభకోణం బ్యాంకింగ్ రంగ నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్ సాయం చేశారని ఆరోపణలు చెలరేగాయి. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు కొచర్ రుణాలిచ్చారని, తద్వారా భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి లబ్ది చేకూరిందనేది ప్రధాన ఆరోపణ. బోర్డు పదేపదే చందా కొచర్ అండగా నిలిచినప్పటికీ, తుదకు చందాకొచర్ పదవిని వీడక తప్పలేదు. భారీ డీల్స్ : దేశీయ ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం వాల్‌మార్ట్‌ల మెగా డీల్ ఇ-కామర్స్ రంగంలో ప్రముఖంగా నిలిచింది. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు ఇద్దరూ అనూహ్యంగా కంపెనీని వీడడం విశేషం. డీల్ ముగిసిన వెంటనే సచిన్ బన్సల్ తన వాటాను అమ్ముకొని కంపెనీ నుంచి నిష్ర్కమించారు. అటు మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ కూడా అనివార్య పరిస్థితుల్లో సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చింది. వోడాఫోన్, ఐడియా డీల్ టెలికాం రంగంలో మెగా డీల్‌కు సాక్ష్యంగా నిలిచింది. వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు విలీనమై వోడాఫోన్ ఐడియా పేరుతో దేశీయంగా అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాయి. తద్వారా టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన జియో దెబ్బతో కుదేలైన దేశీయ అతిపెద్ద టెల్కో ఎయిర్‌టెల్‌ను మరింత వెనక్కి నెట్టేసింది. కీలక నిష్క్రమణ : శిఖా శర్మ - భారీ నష్టాలు, నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణలు రావడం లాంటి పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖాశర్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2018మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీకాలం ముగియనుండగా, నాలుగవసారి ఆమెను ఎండీగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే దీనిపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 31, 2018నుంచి బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖా శర్మ ప్రకటించారు. ఉషా అనంత సుబ్రమణియన్ : పీఎన్బీ స్కాంకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో అలాహాబాద్ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ పేరు చేర్చడంతో ఆమె పదవిని కోల్పోయారు. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం 2016లో గీతాంజలి గ్రూప్‌నకు అనుమానాస్పద ఈ రుణాల కేటాయింపులపై (రూ.5,280 కోట్లు) సీబీఐ అధికారులు ఆమెను చార్జ్‌షీట్‌లో చేర్చారు. అరుంధతి భట్టాచార్య : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తొలి మహిళా ఛైర్మన్‌గా విజయవంతంగా బాధ్యతలను నిర్వహించిన అరుంధతి భట్టాచార్య అక్టోబర్‌లో 2018లో రిటైర్ అయ్యారు. ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసరుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె నాలుగు దశాబ్దాలు పాటు బ్యాంకుకు విశేష సేవలందించారు. 2018 బిజినెస్ రౌండప్ : బ్యాంకుల విలీనం : గత ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకుతోపాటు అయిదు బ్యాంకులను విలీనంచేసిన కేంద్రం, రుణవితరణ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు బ్యాంకులను బలోపేతం చేయడాని కంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.14.82 లక్షల కోట్లతో దేశంలో మూడవ అతిపెద్ద సంస్థగా అవతరించ నుంది. అయితే ఈ మెర్జర్‌ను బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. పరారైన కార్పొరేట్ నేరస్తులు : విజయ్ మాల్యా : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వ్యవహారం 2018లో బ్రిటన్ కోర్టుకు చేరింది. 2016, మార్చిలో మాల్యా లండన్‌కు పారిపోయిన మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్, బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దేశం వదిలి పారిపోయిన మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు నానా తంటాలు పడుతోంది. అయితే తాను బ్యాంకుల వద్ద తీసుకున్న మొత్తం రుణాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ, మీడియానే తన మీద తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాల్యా పాత పాటే పాడుతున్నాడు. మరోవైపు బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య 58కి చేరింది. విజయ్ మాల్యాతో పాటు వివిధ స్కాంలలో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఒసీ), ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ చేశామని కేంద్రం ప్రకటించడం గమనార్హం. అయితే అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దేశానికి రప్పించడంలో కేంద్రం విజయం సాధించింది. వివాదాల చట్రంలో ఆర్బీఐ : దేశ ఆర్థికరంగానికి ఆయువు పట్టులాంటి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా తీవ్ర చర్చల్లో నానింది. ముఖ్యంగా కేంద్రం, ఆర్బీఐ మధ్య వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. అప్పటివరకు గుంభనంగా ఉన్న విభేదాలు డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య బహిరంగంగా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై వ్యాఖ్యలు చేయడంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరింత రాజుకుంది. చివరకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన గవర్నర్‌గా మాజీ ఆర్థికమండలి సలహా సభ్యుడు శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించింది. హెచ్చు తగ్గుల మధ్య జీఎస్టీ : ఒకే దేశం ఒకే పన్ను పేరుతో గత ఏడాది తీసుకొచ్చిన పన్ను సంస్కరణల చట్టం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం రేట్ల శ్లాబులలో మార్పులను ప్రకటించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించినట్టు ప్రకటించింది. 33 వస్తువులను 12, 5 శాతం శ్లాబుల్లోకి, 28 రకాల విలాస వస్తువులపై 28 శాతం జీఎస్టీ రేటుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై 55 వేల కోట్ల భారం పడనుందని ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ట్రాయ్ కొత్త నిబంధనలు : వినియోగదారులపై రెట్టింపు భారం సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కొత్త కేబుల్ టారిఫ్ అమలు కానుందని, డిసెంబర్ 29 తర్వాత వివిధ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయనే వార్తలు కేబుల్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. తాజా ఆర్డర్‌తో ఛానల్‌కు 19 రూపాయిలు చొప్పున గరిష్టంగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ట్రాయ్. 20నెలల ముందే అంటే 2017 మార్చిలోనే ఈ చట్టం వచ్చినప్పటికీ 2018, జులై 3న వాటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. ఈ నెల 29 తర్వాత కొత్త కేబుల్ నిబంధనల వల్ల టీవీ ఛానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని, కొంత సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈ నిబంధనలను కేబుల్ ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. -
2018 : సినిమా సంగతులపై ఓ లుక్కేద్దాం...!
చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించగా.. పెద్ద సినిమాలు చతికిలపడ్డాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా చిన్న సినిమాలు అదరగొట్టాయి. అతిలోక సుందరి శ్రీదేవి, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సినీ ఇండస్ట్రీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మీటూ ఉద్యమంతో సినీ పరిశ్రమ వేడెక్కింది. కొత్త దర్శకులకు, హీరోయిన్లకు ప్రేక్షకులు రెడ్‌కార్పెట్ పరిచారు.. ఈ ఏడాది సినిమా సంగతులపై ఓలుక్కెద్దాం... 1. ఈ ఏడాది టాలీవుడ్ కొత్త దర్శకులకు ఘనంగా స్వాగతం పలికింది. ఛలో(వెంకీ కుడుముల), ఆర్ఎక్స్ 100(అజయ్ భూపతి) లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం (వెంకటేష్ మహా), చిలసౌ (రాహుల్ రవీంద్రన్) లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దర్శకులకు కూడా మంచి విజయాలు దక్కాయి. అ! కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. 2. 2018లో కొంత మంది క్రేజీ హీరోలు వెండితెరకు ముఖం చాటేశారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భల్లాలదేవ రానా, అక్కినేని యువ కథనాయకుడు అఖిల్‌లు ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. 3. ఈ ఏడాది భారతీయ సినీ పరిశ్రమను కుదిపేసిన సంఘటన అతిలోక సుందరి మరణం. దుబాయ్‌లో బందువుల వివాహ వేడుకలకు హజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారు. ఈ సంఘటనతో బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. 4. ఈ ఏడాది హిందీ సినీ పరిశ్రమలో పెళ్లి బాజాలు కాస్త గట్టిగానే వినిపించాయి. బాలీవుడ్ టాప్ స్టార్స్‌గా కొనసాగుతున్న భామలు పెళ్లి బంధంలో ముడిపడిపోయారు. అంతేకాదు అందరూ ప్రేమ వివాహాలకే ఓటేయడం విశేషం. సోనమ్ కపూర్.. ఆనంద్ అహూజాను, దీపిక పదుకొనే.. రణవీర్ సింగ్‌ను, ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌లను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు మీడియాలోనూ విస్తృతమైన కవరేజ్ లభించింది. 5. 2018లో సౌత్ ఇండస్ట్రీలోనూ పెళ్లి సందడి బాగానే కనిపించింది. ముఖ్యంగా అందాల నటి శ్రియ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకుండా మీడియాకు, ఆర్భాటాలకు దూరంగా పెళ్లి చేసుకుంది శ్రియ. ఇక తెలుగింటి అమ్మాయి స్వాతి కూడా తన మనసుకు నచ్చిన వికాస్‌తో ఏడడుగులు నడిచేసింది. వివాదస్పద నటి శ్వేతాబసు ప్రసాద్, మలయాళ నటి భావన, తెలుగు, కన్నడ చిత్రాలు చేసిన మదాలస శర్మ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. 6. ఈ ఏడాది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి శ్రీ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా మీటూ పోరాటాన్ని ప్రారంభించిన శ్రీరెడ్డి.. ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగటం తీవ్ర దుమారాన్ని రేపింది. తరువాత పవన్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో ఈ అంశం మరింత రసాభాసగా మారింది. 7. బాలీవుడ్‌లోనూ మీటూ వివాదం తీవ్ర దుమారం రేపింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై చాలా కాలంగా చర్చ నడుస్తున్నా మాజీ నటి తను శ్రీ దత్త ఆరోపణలతో పరిస్థితి మరింత వేడెక్కింది. బాలీవుడ్ అగ్రనటుడు నానా పటేకర్‌పై ఆమె ఆరోపణలు చేయటంతో ఆయన పలు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను శ్రీ బాటలో మరింత మంది నటీమణులు దర్శకులు, నటులపై ఆరోపణలకు దిగటంతో బాలీవుడ్లో మీటూ వివాదం తారాస్థాయికి చేరింది. 8. ఈ ఏడాదిలో బాలీవుడ్‌ను కుదిపేసిన మరో అంశం ఇద్దరు తారలు క్యాన్సర్ బారిన పడటం. హిందీలో విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కనిపిస్తున్న ఇర్ఫాన్ ఖాన్, తను ఓ అరుదైన వ్యాది బారిన పడినట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే నటి సోనాలి బ్రిందే కూడా తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్టుగా ప్రకటించటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. 9. 20 సంవత్సరాలుగా సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణ జింకల కేసులో ఈ ఏడాది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు ఏప్రిల్ 5న ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. వెంటనే ఏప్రిల్ 7న సల్మాన్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో సైఫ్ అలీఖాన్, సొనాలి, నీలమ్, టబులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 10. ఈ ఏడాది సాండల్‌వుడ్‌ను కుదిపేసిన సంఘటన రెబల్ స్టార్ అంబరీష్ మరణం. కన్నడ నాట స్టార్ హీరోగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను సాదించిన అంబరీష్ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఆయన నవంబర్ 24న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. 11. ఈ ఏడాది బాలీవుడ్ వెండితెర మీద కొత్త అందాలు తళుక్కుమన్నాయి. ముఖ్యంగా స్టార్ వారసుల ఎంట్రీతో బాలీవుడ్ కళకళలాడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దడక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. సైఫ్ గారాల పట్టి సారా అలీఖాన్ కేదార్నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. షాహిద్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో పాటు సౌత్ టాప్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 12. వెండితెరకు ఎంతో మంది సూపర్ హీరోలను పరిచయం చేసిన ప్రముఖ హాలీవుడ్ రచయిత స్టాన్లీ 95 ఏళ్ల వయసులో నవంబర్ 12న కన్నుమూశారు. హాలీవుడ్లో స్పైడర్ మేన్, ది హల్క్, థోర్, ఐరన్ మేన్, ఎక్స్ మేన్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సూపర్ హీరో పాత్రలను సృష్టించి మార్వెల్ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు స్టాన్లీ. 13. ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులకు తగిలిన షాక్ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన అభిమానులను ఈ ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సినిమాతో త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్త్తాయి. నా పేరు సూర్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 14. బాహుబలి 2ను మించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2.ఓ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌కు ఫ్లాప్ టాక్ రాగా.. 2.ఓ కు డివైడ్ టాక్ వచ్చింది. ఎన్నో వివాదాలకు కారణమైన మరో భారీ బడ్జెట్ సినిమా పద్మావత్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15. 2018 టాలీవుడ్ లో డెబ్యూ హీరోయిన్లకు చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు తొలి సినిమాతోనే స్టార్ లీగ్‌లో చేరిపోయారు. భరత్ అనే నేను తో కియారా అద్వానీ, ఛలో తో రష్మిక మందన్న, సమ్మోహనంతో అదితిరావ్ హైదరీ, ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్‌లు టాలీవుడ్ హాట్ ఫేవరెట్స్‌గా మారిపోయారు. 16. ఈ ఏడాది చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. బాండ్ తరహా కథాంశంతో వచ్చిన గూడచారి, సందేశాత్మకంగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ, ప్రయోగాత్మక చిత్రం కేరాఫ్ కంచరపాలెంతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కిన ఛలో, తొలిప్రేమ, గీత గోవిందం కూడా చిన్న సినిమాలుగా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాదించాయి. 17. ఈ ఏడాది టాలీవుడ్ నటులు ప్రయెగాలకు ఓటేశారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కొత్త కథలను ఎంచుకున్నారు. నోటా లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన రంగస్థలంతో, మహేష్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన భరత్ అనే నేనుతో, సుమంత్ మిస్టరీ థ్రిల్లర్‌గా సుబ్రహ్మణ్యపురం సినిమాలతో అలరించారు. హీరోయిన్ సమంత కూడా తొలిసారిగా యు టర్న్ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాల ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది. 18. ఈ ఏడాది బాలీవుడ్ ఖాన్లకు ఏమాత్రం కలిసిరాలేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రేస్3 ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆమిర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ హైప్‌ను క్రియేట్చేయగా.. ఈ ఏడాది బాలీవుడ్ డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత కొంత కాలంపాటు సరైన విజయం లేక ఈ ఏడాది జీరో లాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది కూడా మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. మొత్తంగా ఖాన్‌త్రయానికి ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. -
థాయ్ గుహ నుంచి అందరూ క్షేమంగా..
కొరియాలో శాంతి గీతాలాపన, సౌదీ అరేబియాలో స్టీరింగ్ చేతపట్టి మహిళల స్వేచ్ఛాగానం, హాలీవుడ్ సినిమాను తలపించేలా థాయ్ గుహలో ఆపరేషన్, పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ కొత్త ఇన్నింగ్స్, తమకు తిరుగే లేదని నిరూపించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అంగరంగవైభవంగా ప్రిన్స్ హ్యారీ వివాహం, వీల్ చైర్ నుంచే విశ్వరహస్యాలపై ప్రయోగాలు చేసిన స్టీఫెన్ హాకింగ్ అస్తమయం, ఇండోనేసియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ లాంటి మర్చిపోలేని ఘటనలను మిగిల్చింది 2018. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొన్ని ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం.. ట్రంప్, కిమ్ శిఖరాగ్ర సదస్సు నా టేబుల్ మీద అణుబాంబుని పేల్చే మీట ఉందని ఒకరంటే నా టేబుల్‌పై అంతకంటే పెద్ద అణుబాంబు బటన్ ఉందంటూ మరొకరు మాటల తూటాలు పేలుస్తూ ప్రపంచ దేశాల గుండెల్లో అణుబాంబుల్ని పేల్చారు. చివరికి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్ ఉన్ జూన్‌లో సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని నేతలిద్దరూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కొరియాలో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయన్న ఆశలు చిగురించాయి. విశ్వ శోధకుడు హాకింగ్ అస్తమయం అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాల్ని నిరంతం శోధించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 14న కన్నుమూశారు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దరిచేరవచ్చని తెలిసినా స్టీఫెన్ విశ్వానికి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన హాకింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి తరతరాలకి పదిలం. మనిషి భూమిని వదిలి కొత్త గ్రహాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తాను అనంతలోకాలకు తరలిపోయారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు ప్రదర్శించిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. కేవలం ఒక్క సీటుతో మొదలు పెట్టి 22 ఏళ్ల కృషితో తాను కన్న కలల్ని సాకారం చేసుకున్నారు ఇమ్రాన్. పాక సైన్యం చెప్పుచేతల్లో ఉంటారన్న ఆరోపణలు ఉన్న ఇమ్రాన్ ప్రధాని పీఠంపై కూర్చోగానే కశ్మీర్ విషయంలో భారత్ అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామంటూ ప్రకటించి శాంతి మంత్రం ఆలాపించారు. నాలుగోసారీ.. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం 2018లోనూ అప్రతిహతంగా కొనసాగింది. ఈ ఏడాది మేలో ఆయన వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గత పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా పీఠంపై కొనసాగుతారు. జిన్‌పింగ్.. శాశ్వత అధ్యక్షుడు ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనల్ని చైనా పార్లమెంటు తిరగరాసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ శాశ్వతంగా దేశాధ్యక్షుడిగా కొనసాగడం కోసమే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. దానికి చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయడంతో జిన్‌పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా మారారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు జిన్ పింగ్. క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ డేటా లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొన్నారు. సెనేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక జుకర్‌బర్గ్ సారీ చెప్పారు. ఫేస్బుక్ నుంచి సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ బుష్ కన్నుమూత వృద్దాప్యం కారణంగా 94ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నవంబర్ 30న కన్నుమూశారు. అమెరికాలో కీలక పరిణామాల సమయంలో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్ యుద్ధం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలోనూ, ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో బుష్ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. సౌదీలో డ్రైవింగ్ చేసిన మహిళలు సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. స్టీరింగ్ చేతపట్టి ఆత్మవిశ్వాసంతో రయ్ రయ్‌మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాది వారికి బహుమతిగా ఇచ్చింది. తరతరాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్ 24న ఎత్తివేసింది. దీంతో అర్ధరాత్రి అని కూడా చూడకుండా చాలా మంది సౌదీ మహిళలు రోడ్లపైకి వచ్చి కార్లలో షికారు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. థాయ్ గుహలో చిన్నారుల రెస్క్యూ అందరూ క్షేమంగా ఉన్నారు.. ఈ ఒక్క మాట ఈ ఏడాది కోట్లాది మందిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. 12 మంది ఫుట్‌బాల్ యువ క్రీడాకారులు, వారి కోచ్ 18 రోజులు థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన ఘటన నరాలు తెగేలా ఉత్కంఠకు కారణమైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. గుహలోపల నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమన్న చిన్నారుల క్షేమసమాచారాల కోసం ప్రపంచం యావత్తూ కోట్ల కళ్లతో ఎదురు చూసింది. గుహ నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రపంచంలోని అసాధారణ నేవీ బృందాలు, థాయ్ నేవీ సీల్స్ చేసిన సాహసానికి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేశాయి. జర్నలిస్టు ఖషోగ్గి హత్య సౌదీలో ప్రముఖ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గి దారుణ హత్య ఈ ఏడాది సంచలనం సృష్టించింది. అక్టోబర్‌లో వ్యక్తిగత పనుల నిమిత్తం టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లాక ఆయన అదృశ్యమయ్యారు. సౌదీ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి రాయబార కార్యాలయంలోనే యాసిడ్‌లో కరిగించారని వార్తలు వచ్చాయి. ఖషోగ్గి అదృశ్యం, హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ ప్రపంచమంతా ఆ పెళ్లి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ ఈ ఏడాది మే 19న ఒక్కటయ్యారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్ గ్లామర్ జతకూరడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వీరిద్దరి వివాహానికి అంతర్జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. శ్రీలంక సంక్షోభం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ ఏడాది సెగలు పొగలు కక్కింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రే ప్రధాని కుర్చీ నుంచి రణిల్ విక్రమసింఘేను దింపేసి మహిందా రాజపక్సను కూర్చోబెట్టారు. కానీ రాజపక్స రెండు సార్లు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. కానీ పార్లమెంటును రద్దు చేయడం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాజపక్స రాజీనామా చేయడం, తిరిగి విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగాయి. అమెరికా షట్‌డౌన్ అమెరికాలో ఈ ఏడాది మూడుసార్లు షట్‌డౌన్ జరిగింది. ట్రంప్ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణం కోసం 500 కోట్ల డాలర్లు వెచ్చించాలంటూ ట్రంప్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించకపోవడం తాజాగా డిసెంబర్లో పాలన స్తంభించింది. జనవరి, జూన్ నెలల్లోనూ కొన్నాళ్లు షట్‌డౌన్ జరిగింది. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడమనేది గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇండోనేసియాపై విరుచుకుపడిన సునామీ 2018 వెళ్లిపోతూ వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇండోనేసియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలై పర్వతంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలింది. దీంతో భారీ అలల మొదలై సునామీగా మారి జావా, సుమత్రా తీర ప్రాంతంలో ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయంలో దాదాపుగా 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బ్రెగ్జిట్.. థెరిసాకి సవాల్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందం(బ్రెగ్జిట్ డీల్)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒకే చేసిన ముసాయిదా ఒప్పందంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆమోదం పొందడం కష్టమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బ్రెగ్జిట్ ఒప్పందానికి మార్పులు చేర్పులు చేసి పార్లమెంటుకు సమర్పించే యోచనలో థెరిసా ఉన్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సిరియాపై అమెరికా వార్ గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాపై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆధీనంలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. అసద్ గద్దె దిగితేనే సిరియాలో శాంతిస్థాపనకు ఆస్కారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నారులు మరణించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. జీరో టాలరెన్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన జోరో టాలరెన్స్ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దుల్లో శరణార్థుల పడిగాపులు, తల్లీ బిడ్డల్ని వేరు చేసిన దృశ్యాలు మనసుల్ని పిండేశాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని 2000 మంది పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హోమ్స్‌కి తరలించారు. చివరికి ట్రంప్ సర్కార్‌పై ఒత్తిడి పెరగడంతో తల్లీ బిడ్డల్ని వేరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. -
కొన్ని మెరుపులు.. కాసిన్ని మరకలు
2018లో బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన సుప్రీం కోర్టు అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని అనుమతించాలంది. జస్టిస్ లోయ అనుమానాస్పద మృతి, మానవ హక్కుల నేతల అరెస్ట్‌పై పిటిషన్లను కొట్టివేసింది. బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై విచారణ, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధత, అలోక్ వర్మ పిటిషన్లతో 2019 స్వాగతం పలుకుతోంది. కొన్ని మంచి రోజులున్నట్టే... కొన్నిసార్లు గడ్డు రోజులు కూడా దాపురిస్తాయి. సుప్రీం కోర్టుకు సంబంధించినంత వరకు 2018 ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులకు చెందిన సంవత్సరం. సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అనూహ్యంగా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేయడంతో ఈ ఏడాది మొదలయ్యింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి తమకు కేసులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని వారు ఆ సమావేశంలో ఆరోపించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఇప్పుడు మన ఏడాది చివరికి వచ్చేశాం. ఆ నలుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు పదవీ విరమణ చేయగా, నాలుగోవారైన జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఏడాది ప్రారంభంలో పైస్థాయి న్యాయవ్యవస్థలో చాలా నియమాకాలు అపరిష్కృతంగా ఉండేవి. అయితే, అక్టోబర్‌లో గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అక్టోబర్ నుంచి వివిధ హైకోర్టుల్లో వందలాది నియామకాలు జరిగాయి. సుప్రీం కోర్టులో కూడా కొన్ని ఖాళీలు భర్తీ చేశారు. బాధ్యతలు స్వీకరించినవారిని చూసి కొంతమంది కళ్లెగరేశారు, మరికొందరు పెదవి విరిచారు. ఆయా పదవులను చేపట్టిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. అనూహ్యమైన తీర్పులు ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టుకు 2018 చాలా కీలకమైన సంవత్సరం. ఎన్నో విభిన్నమైన కేసులను ఈ ఏడాది సుప్రీం కోర్టు విచారించింది. బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన న్యాయస్థానం అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన సందర్బాలను కూడా గుర్తుచేసుకుంటే బావుంటుంది. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల దిశగా న్యాయస్థానం ముందడుగు వేసింది. 1961నాటి ఎన్నికల నిబంధనలను మార్పు చేయాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు, వారి అనుయాయుల ఆదాయ వివరాల అఫిడవిట్‌ను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ççహదియా కేసుగా అందరికీ తెలిసిన షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తనకు నచ్చినవారిని వివాహం చేసుకునే హక్కు వారికుందని పునరుద్ఘాటించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే దిశగా తీర్పు వెలువరిస్తూ కోర్టు సంరక్షకుడి పాత్ర పోషించింది. ‘సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అయితే, ఆ విలువలు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకంటే ఎక్కువకాదని’ సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వ్యాఖ్యానించింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రతి భారతీయుడికీ హుందాగా మరణించే హక్కుందని పేర్కొంది. నిరంతరం మిషన్ల సహాయంతో మాత్రమే జీవించగలిగేవారికి, వాటిని తొలగించడం ద్వారా సహజంగా మరణించే అవకాశం కల్పించవచ్చని తీర్పు చెప్పింది. అయితే, ఇందుకు అవసరమైన విధానపరమైన సూచనలను కూడా సవివరంగా వెల్లడించింది. స్టే కాలపరిధి ఆరు నెలలే ఆసియన్ రిసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ వర్సెస్ సీబీఐ కేసులో సివిల్, క్రిమినల్ కేసుల విచారణ సుదీర్ఘకాలం ఆలస్యం కాకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్నిసార్లు స్టేను కేసు విచారణను సాగదీయడానికి వాడుకుంటున్న నేపథ్యంలో; సివిల్, క్రిమినల్ కేసుల విచారణలో ఇచ్చే స్టే ఆరు నెలల తర్వాత రద్దవుతుందని పేర్కొంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కేసును ముగించడం కంటే, స్టేను కొనసాగించడమే ముఖ్యమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తహ్సీన్ పూనావాలా పిటిషన్‌ను విచారించిన కోర్టు దేశంలో మూకదాడులు ఎక్కువైపోవడంపై స్పందిస్తూ నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. సెప్టెంబర్ చివరికొచ్చేసరికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ చరిత్రాత్మకమైన తీర్పు వెలు వరించింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 497 కొట్టివేస్తూ భార్య భర్త సొత్తుకాదని, వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. దీనివల్ల మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అంతేకాదు, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో శబరిమలలో మహిళా ప్రవేశాన్ని అనుమతించాలని తీర్పు చెప్పింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు కలిగిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. అన్నీ అనుకూలమైనవి కావు ఇటీవలి ఈ తీర్పులన్నీ దేశంలోని పౌరులందరికీ మేలు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్నవే. ఈ తీర్పులపై వ్యాఖ్యానించే ముందు కోర్టు పెద్దన్న తరహాలో హక్కులను ధారాదత్తం చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రాజ్యాంగంలో పొందుపరిచిన వాటినే మరోసారి పునర్నిర్వచించింది. అంతమాత్రనా కోర్టు ప్రతి సందర్భంలోనూ పౌరుడి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పడం కాదు. ఆధార్ కార్డు చెల్లుబాటును సవాల్ చేసిన కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జనవరి నుంచి వాదనలు సాగాయి. చివరికి సుప్రీం కోర్టు ఆధార్ కార్డుకు చట్టబద్ధత కల్పించింది. ప్రైవేట్ పార్టీలు కూడా ఆధార్ కార్డును డిమాండ్ చేయడం వంటి అంశాలను మాత్రం కొట్టివేసింది. చీకటి కోణాలు కొన్ని కేసుల విషయంలో అనేక వివాదాలు ఈ ఏడాది సుప్రీం కోర్టును చుట్టుముట్టాయి. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఐదుగురు మానవ హక్కుల నేతలను అరెస్ట్ చేయడంపై సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ప్రభుత్వం రఫెల్ విమానాల కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. సీల్డ్ కవర్లో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించే విధానాన్ని అవలంబించడం చాలా చర్చకు తావిచ్చింది. ఈ తీర్పు విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కాగ్ సమర్పించే నివేదికపై కోర్టు ఆధారపడింది. అయితే, అటువంటి నివేదిక ఏదీ అప్పటికి కాగ్ సమర్పించలేదు. దీంతో తీర్పులో తప్పులను దిద్దాలంటూ కేంద్రం దరఖాస్తు చేసుకుంది. రాబోయే 2019వ సంవత్సరం కూడా కీలకంగానే కనిపిస్తోంది. కోర్టు ప్రారంభం కాగానే బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై కేసు విచారణకు తేదీ ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధతపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అలాగే, సీబీఐ డైరెక్టర్‌గా తనను తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషనపై కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి మరో ఏడాది 2018 కూడా కాలప్రవాహంలో కలిసిపోతోంది. సుప్రీంకోర్టు ఈ ఏడాది తనను తాను ఒక బృంద సంస్థగా నిలబెట్టుకుంది. ఎవరో ఒకరు పెత్తనం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడలేకపోయినా, సామాజిక నైతిక చట్రం నుంచి పౌరులను కాపాడే విషయంలో అండగా నిలిచింది. రాజ్యాంగ నైతికతను కాపాడటానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, అస్పష్ట భావనతో, ఇంద్రియ జ్ఞానంకంటే వ్యక్తిత్వంపైనే ఎక్కువ ఆధారపడుతుంది. కొన్ని మంచి సమయాలు, మరి కొన్ని చెడు సమయాలు. వ్యాసకర్తలు: సంజయ్ హెగ్డే, ప్రెంజాల్ కిషోర్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు – ‘ది వైర్’ సౌజన్యంతో