Geo tagging
-
లే అవుట్ డౌటే!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో భూసేకరణ నిలిచిపోయింది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములను సేకరించి లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలను రూపొందించారు. పలు చోట్ల రైతుల నుంచి భూసేకరణ కూడా చేపట్టారు. లేమూరు, ఇనుముల్‌నర్వ వంటి చోట్ల లే అవుట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా లే అవుట్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ.. ప్రభుత్వం మారడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. భూ సేకరణపై కొత్త సర్కారు సమీక్షించి నిర్ణయం తీసుకొంటే తప్ప ముందుకెళ్లడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. వెయ్యి ఎకరాల సేకరణకు ప్రణాళికలు.. కోకాపేట్, మోకిలా, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో అదే పద్ధతిలో మరిన్ని భూములను అభివృద్ధి చేయాలని భావించారు. ఔటర్‌కు అన్ని వైపులా సుమారు 1000 ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్ భగాయత్‌లో మూడుసార్లు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన లభించింది. అన్ని చోట్లా అంచనాలకు మించి ఆదాయం లభించింది. దీంతో హెచ్ఎండీఏ ఎక్కడ భూమి లభిస్తే అక్కడ లే అవుట్‌ను అభివృద్ధి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉప్పల్ భగాయత్ తరహాలో ప్రతాపసింగారంలో భారీ లే అవుట్‌కు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సుమారు 250 ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు రైతులు సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు, హెచ్ఎండీఏకు మధ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణంలో ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాలు లే అవుట్‌కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. రెండు దఫాలుగా రైతులతో చర్చలు జరిపారు. మరోసారి చర్చించి ఒప్పందం చేసుకోవాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయి. ప్రతాపసింగారం, బోగారంలతో పాటు కుర్మల్‌గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నర్వ, కొర్రెముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్‌నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాలను సేకరించారు. కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు పైగా భూములను గుర్తించగా, ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు అంచనాలు వేశారు. కానీ ప్రభుత్వ మార్పుతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తూర్పు వైపు విస్తరణపై దృష్టి.. ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు,పలు అంతర్జాతీయ సంస్థలు పడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు సైతం ఇటు వైపు ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల తర్వాత బుద్వేల్ హాట్‌కేక్‌గా మారింది. ఇప్పటికే ఈ రెండు చోట్ల విక్రయాలు పూర్తి కావడంతో హెచ్ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో స్థలాలను విక్రయించారు. సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లేఅవుట్లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు, ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు భారీ లేఅవుట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుపయోగంగా ఉన్న భూములను సేకరించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు తదితర సదుపాయాలతో నివాసయోగ్యమైన వెంచర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం భూములను తిరిగి వారికే అప్పగిస్తారు. 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ‘భూ సేకరణ తిరిగి మొదటికొచి్చంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే తప్ప తిరిగి చేపట్టడం సాధ్యం కాదు’ అని ఒక అధికారి చెప్పారు. హెచ్ఎండీఏ భూములకు జియో ట్యాగింగ్ హెచ్ఎండీఏ భూములకు త్వరలో జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో హెచ్ఎండీఏకు ఉన్న భూములపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే జియో ట్యాగింగ్‌కు శ్రీకారం చుడతారు. ఇదే జరిగితే ఆన్లైన్లో నిరంతరం భూములను పర్యవేక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు వెలసినా, కబ్జాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన వెంటనే హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగుతుంది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, తదితర విభాగాల సాయంతో భూముల రక్షణకు చర్యలు చేపడుతుంది. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు పైగా భూములు ఉన్నట్టు అంచనా. అయితే కొంతకాలంగా ఈ భూముల రక్షణ పెద్ద సవాల్‌గా మారింది. ఒక్క జవహర్‌నగర్‌లోనే దాదాపు 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అంచనా. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక చోట్ల హెచ్ఎండీఏ భూములు అదృశ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గతంలో హెచ్ఎంటీ ప్రాంతంలో ఉన్న వంద ఎకరాలకు పైగా భూమికి రక్షణ చర్యలు చేపట్టారు. కాగా.. శంషాబాద్‌లో అన్యాక్రాంతమైన భూముల కోసం హెచ్ఎండీఏ పెద్దఎత్తున న్యాయ పోరాటం చేయాల్సివచి్చంది. ఇటీవల ఆ భూములపై సుప్రీంకోర్టులోనూ హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఇలా సొంత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకే తాజాగా జియో ట్యాగింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! ముందే చేయించుకుంటే ఆఫర్..
దేశ రాజధాని నగరం ఢిల్లీ దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. స్థానికులకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మందికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ముందే చేయించుకుంటే రాయితీ ఎంసీడీ పరిధిలోని ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుల పూర్తి, కచ్చితమైన సమాచారం లభిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. మేరకు అన్ని ప్రాపర్టీలకు జియోట్యాగింగ్ తప్పినిసరి అని వాటి యజమానులకు స్పష్టం చేసింది. అంతేకాకుండా 2024 జనవరి 31 లోపు జియోట్యాగింగ్ చేయించుకున్న వారికి ఆస్తిపన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాపర్టీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరినీ సంప్రదించుకుండా, యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. -
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
క్యూఆర్ కోడ్ బందోబస్త్
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని చెరువులు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాన్నీ ఈ కోడ్‌లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్ చేశారు. వీటిని ఈ క్యూఆర్ కోడ్‌కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్ కోడ్‌లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్ టైంలో తెలిసిపోతాయి. ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా.. సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్ డీఎస్ చౌహాన్ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. -
జియో ట్యాగింగ్‌కు ‘అగ్రి’ అవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్‌తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. యాక్టివిటీ లాగర్ యాప్... రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియో ట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్‌లోకి వెళ్లి ‘మార్క్ మై ప్రెజెన్స్’అని నొక్కి ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్ ఏంటి? క్రాప్ బుకింగ్, రైతు బీమా, సీడ్ పర్మిట్ స్లిప్‌లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్డేట్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్‌ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్‌టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్‌లో ఈవ్‌టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్‌లో జియోట్యాగింగ్‌ను చేర్చారు. మ్యాప్‌పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్‌పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్‌లో ఈవ్‌టీజింగ్ హాట్‌స్పాట్స్‌ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్‌స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్‌ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్‌లోకి.. ఈవ్‌టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్‌లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్‌లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
కేపీ ఉల్లి: అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు!
వైవీయూ: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే నానుడి తెలుగునాట ఎంతో ప్రాచుర్యం.. అలాంటి ఉల్లిలో ప్రత్యేకమైన కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఉల్లిపై వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం) వృక్షశాస్త్ర విభాగం చేపట్టిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు కేపీ ఉల్లిని ఈ ప్రాంత పంటగా జియోట్యాగ్ కోసం వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్లో పరిశోధక పత్రం ప్రచురితమై ఖ్యాతిని మరింత విస్తరించేలా చేసింది. కేపీ ఉల్లిగా కృష్ణాపురం ఉల్లి వైఎస్సార్ జిల్లా మైదుకూరు పరిధిలోని కృష్ణాపురంలో రైతులు ఉల్లి పంటను ఎక్కువగా పండించడంతో కృష్ణాపురం ఉల్లి (కేపీ ఉల్లి)గా ప్రసిద్ధికెక్కింది. కేపీ ఉల్లిని సలాడ్స్, సాస్, సూప్‌లలో విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల పేర్లతో ఉల్లి వంగడాలను పండిస్తున్నప్పటికీ కేపీ ఉల్లి ఎగుమతి కావడానికి ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు. వ్యాధి నిరోధకత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. కేపీ ఉల్లిలో ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో పాటు అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా ఇందులో వ్యాధి నిరోధకతను పెంచే సామర్థ్యం ఉన్నట్లు వైవీయూ వృక్షశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ మార్గదర్శకంలో డాక్టర్ జి. విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్, నేషనల్ కౌన్సెల్ పరిశోధకులు సంయుక్తంగా కేపీ ఉల్లిపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో కేపీ ఉల్లికి ఒక ప్రత్యేకత ఉందని.. దీనికి సంబంధించిన విశిష్టతలను తెలియజేస్తూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్’లో పరిశోధక వ్యాసం ప్రచురితమైంది. అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన కేపీ ఉల్లిని ప్రత్యేక వంగడం (లాండ్‌రేస్)గా పరిశోధకులు పేర్కొన్నారు. ప్లేవనాయిడ్ కంటెంట్, యాంటి యాక్సిడెంట్లు ఇందులో ఎక్కువని పరిశోధనల్లో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటానికి కారణం అందులోని ఆంథోసైనిన్ అని గుర్తించారు. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ప్లావినాయిడ్స్ రోగ నిరోధకతను కల్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. ఇందులోని లక్షణాలు మరే ఇతర రకాల్లో లభించవని పరిశోధకులు స్పష్టంచేశారు. జియోట్యాగ్ కోసం ప్రయత్నం.. కేపీ ఉల్లికి జియోట్యాగ్ (భౌగోళికపరమైన గుర్తింపు) పొందేందుకు వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. జియోట్యాగ్ వస్తే కేపీ ఉల్లికి న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. ఈ వంగడాన్ని ఇతరులు అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ ప్రాంత ఉత్పత్తిదారులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల ప్రభుత్వ గుర్తింపు సంస్థలు, రిజిస్టర్డ్ రైతు సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించి జియోట్యాగ్ లభించేలా చూడాలని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ కోరారు. మరోవైపు.. కేపీ ఉల్లిపై పరిశోధనలు చేసిన డాక్టర్ విజయలక్ష్మి దాని పుష్పాల నుంచి ఉల్లి మొక్కలు సృష్టించడం విశేషం. -
ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇళ్ల నిర్మాణ వేగం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆ మేరకు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అవసరమై నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై నిర్లక్ష్యం వహించకుండా వాటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కన్పించకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వసతుల కల్పనపై నివేదిక ఇవ్వండి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా చర్చించారు. పట్టణాల్లో ఏవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామో అదే తరహాలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లోనూ వసతులు కల్పించాలని చెప్పారు. ఆ మేరకు తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. తామే ఇళ్లు నిర్మించుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని చెప్పారు. స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొత్త కాలనీల రూపు రేఖలు, అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, కల్పిస్తున్న వసతులు, డిజైన్లపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. -
నాలుగో సింహానికి నాలుగు సవాళ్లు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా.. త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్‌గా వారికి సలామ్ చేస్తున్నాను. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం. –జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు. దేవదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్‌కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, సిట్ అధికారి జీవీజీ అశోక్‌కుమార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ డి.పాల్‌రాజ్, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలకు పోలీసు రక్ష
సాక్షి, అమరావతి: మతపరమైన అంశాలను వివాదం చేసి అలజడులు సృష్టించే ప్రయత్నాలకు చెక్ పెట్టడంలో ఏపీ పోలీసులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వాటి బందోబస్తుతోపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించేలా నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. పోలీస్ శాఖ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఆలయాల నిర్వాహకులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ధర్మకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద సీసీ కెమెరాలు, బందోబస్తు ఏర్పాట్లను పక్కాగా చేపట్టారు. మతపరమైన సంస్థల విషయంలో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు ఇవీ.. ► అన్ని ఆలయాల్లో అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ► మొత్తంగా 57,270 మతపరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్‌తో మ్యాపింగ్ చేశారు. ► సంబంధిత 9,268 ప్రాంతాల్లో ఇప్పటివరకు 31వేల సీసీ కెమెరాలు అమర్చారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు తాజాగా నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. గతంలో 54 ఆలయాల్లో జరిగిన నేరాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ► ప్రార్థనామందిరాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేశారు. వారిపై హిస్టరీ షీట్లు తెరిచి నిఘా ఉంచారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన ఆలయాల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాం. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పక్కా కార్యాచరణ చేపట్టాం. సీసీ కెమెరాల ఏర్పాటు, బందోబస్తు చర్యలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలయాల వద్ద అలజడులు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
దేవాలయాలకు జియో ట్యాగింగ్
-
దేవాలయాలకు జియో ట్యాగింగ్: డీజీపీ
సాక్షి, విజయవాడ: దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు. గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియాలో వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (చదవండి: 100 ఏళ్లు ఉండేలా కొత్త రథం) (చదవండి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా) -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్‌లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్‌ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్‌లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్‌గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్‌కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
సచివాలయాల్లో జాబితాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. అభ్యంతరాలుంటే 25లోగా తెలపాలి.. ► ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలను ఈనెల 25లోగా తెలియచేయాలి. ► అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీలకు జాబితాను పంపించాలి. కలెక్టర్ అనుమతితో బీసీ కార్పొరేషన్ ఈడీలు ఈ జాబితాను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఎండీ, కాపు కార్పొరేషన్ ఎండీ కార్యాలయాలకు పంపిస్తారు. ► వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 45 – 60 ఏళ్ల లోపు మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. మూడు వర్గాలకు ‘చేదోడు’... ► జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల షాపులకు వలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్ చేయించాలి. జియో ట్యాగింగ్ చేయించకుంటే మంజూరు ఉత్తర్వులు ఆపివేస్తారు. ► జగనన్న చేదోడు పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు మండలాలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు తెలిపారు. ► ఈ పధకానికి 1,29,749 మంది దర్జీలు, రజకులు 81,815 మంది, 38,643 మంది నాయీ బ్రాహ్మణులు ఎంపికయ్యారు. వీరికి వృత్తి పనుల కోసం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తుంది. -
అన్నీ ఉంటేనే అనుమతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అందించాలి. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. ► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్స్పెక్షన్ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్లైన్లో సమర్పించాలి. ► ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్వర్డ్ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. ► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. ► భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్ డీడ్లను పరిశీలిస్తారు. ► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. ► పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. ► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
‘క్వారంటైన్’ ఇళ్లకు జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా కొందరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిపై పటిష్ట నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. దీని కోసం తెలంగాణ పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లో హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిని జియో ట్యాగ్ చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లివచ్చిన వారి వివరాలను పోలీసు విభాగం వివిధ మార్గాల్లో సేకరించింది. ఈ జాబితాను స్టేషన్ల వారీగా క్షేత్ర స్థాయి అధికారులకు అందించింది. ఈ జాబితాల్లోని వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్తున్న గస్తీ సిబ్బంది చిరునామాలను సరిచూస్తున్నారు. ఆపై ఆ ఇంటిని అక్షాంశం, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. క్వారంటైన్ అయిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను దీనికి అనుసంధానిస్తున్నారు. 22 వేల మంది వివరాలు... శనివారం నాటికి ఇలా మొత్తం 22 వేల మంది వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా టీఎస్ కాప్ యాప్‌లోని లింక్‌లో పొందుపరిచారు. ఫలితంగా ప్రతి గస్తీ సిబ్బంది, ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారులు అనునిత్యం ఆ ఇళ్లను, క్వారంటైన్ అయిన వ్యక్తుల్ని పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా క్వారంటైన్ అయిన వ్యక్తుల కదలికల్ని పోలీసు విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వీరిలో ఎవరైనా తమ ఇంటిని దాటి గరిష్టంగా 50 మీటర్లు వెళితే ఆ విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు విభాగం తక్షణం గుర్తిస్తుంది. క్వారంటైన్ అయిన వ్యక్తి పరిధి దాటిన విషయం పోలీసులకు టీఎస్ కాప్ యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ సిబ్బందికి తెలుస్తుంది. అక్కడి వారు క్షేత్రస్థాయి అధికారులకు దీనిపై సమాచారం ఇవ్వడం ద్వారా అప్రమత్తం చేస్తారు. ఆ అధికారులు గస్తీ టీమ్ సహకారంతో కొన్ని నిమిషాల్లోనే బయటకు వచ్చిన క్వారంటైన్ వ్యక్తిని గుర్తించి, ఆ ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకుంటారు. వీరిపై ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. -
ఇకపై ఇంటర్ కళాశాలల గుర్తింపు,అడ్మిషన్లకు ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యా సంస్థల్లో అక్రమాలకు చరమగీతం పాడుతూ విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు పడేలా పలు చర్యలను చేపట్టనుంది. ఆయా కళాశాలలకు గుర్తింపు, అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు ఇంతకుముందే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదముద్ర పడగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమల్లోకి తేనున్నారు. కాలేజీలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని గుర్తింపునకు అనుమతులు పొందుతున్నాయి. కేవలం కాగితాలపై నిర్ణీత సదుపాయాలు అన్నీ ఉన్నట్లు చూపుతున్నా వాస్తవానికి ఆయా కాలేజీల్లో అవేవీ ఉండడం లేదు. కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఒక కాలేజీకి, పరిమిత సెక్షన్లకు అనుమతులు తీసుకొని రెండు మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో పెట్టి బోధన సాగిస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నిర్ణీత రుసుములు కూడా చెల్లించకుండా పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటికి ముకుతాడు వేసేందుకు వీలుగా గుర్తింపు ప్రక్రియను ఇకపై ఆన్లైన్ చేయనున్నారు. ప్రతి కాలేజీ అనుమతి కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. కాలేజీ భవనం ఉన్న ప్రాంతంతోపాటు, తరగతి గదులు, దానికి అనుబంధంగా ఆటస్థలం, లైబ్రరీ, లేబొరేటరీ వంటి వసతులన్నిటినీ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియెట్ బోర్డు వీటిని జియోట్యాగింగ్ చేస్తుంది. కాలేజీ పేర్కొన్న స్థలంలో భవనం, ఆటస్థలం ఉన్నట్లు తేలితేనే గుర్తింపు వస్తుంది. కోచింగ్‌లకు కాలేజీలకు సంబంధం లేదు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ఇంటర్ పాఠ్యాంశాల బోధన తప్ప ఇతర కోచింగ్‌లకు ఆస్కారం లేకుండా బోర్డు చర్యలు చేపడుతోంది. కాలేజీలకు, కోచింగ్‌లకు సంబంధం లేదని ఇప్పటికే విద్యా శాఖ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అలాగే హాస్టళ్లలోని పరిస్థితులు దారుణంగా ఉంటున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా కొన్ని సంస్కరణలకు వీలుగా ప్రతిపాదనలు అందించింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు తమ ఇష్టానుసారం అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మహిళలకు నిర్ణీత కోటాలో సీట్లు కేటాయించాల్సి ఉన్నా వాటిని బేఖాతరు చేస్తున్నాయి. ఫీజులను కూడా కాకుండా ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. వీటికి ఇకపై చెక్ పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వసూళ్లను ఆన్లైన్లో నిర్వహించేలా ఇంటర్ బోర్డ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు నీట్, ఎంసెట్ తరహాలో ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించనుంది. రాష్ట్రంలో బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీలు, వాటిలో సెక్షన్లు, కోర్సు గ్రూపుల సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్లో విద్యార్థులు,తల్లిదండ్రులకు తెలిసేలా ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. టెన్త్ పాసయ్యే విద్యార్థులు దీని ద్వారా తమ మండలం, జిల్లా, రాష్ట్రంలోని ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరాలనుకుంటారో ఆ మేరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆ విద్యార్థి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి కాలేజీలో సీటు ఆన్లైన్లో అలాట్ అవుతుంది. -
టెక్నికల్ గణేషా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే... గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్‌ను సిటీ కాప్స్ ఆన్లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్లైన్లోనే దాఖలు చేసి దాని ప్రింట్‌ఔట్‌తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. తనిఖీలపై పర్యవేక్షణ... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్‌ను టీఎస్ కాప్ యాప్‌లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. మండపాల జియో ట్యాగింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్‌కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. -
మగ్గాలపై మలిసంధ్య బతుకులు
చేనేతను నమ్ముకుని పనిచేస్తున్న ఆఖరితరం - సిరిసిల్లలో మొత్తం 175 చేనేత మగ్గాలు - కార్మికులు 225 మంది మాత్రమే - ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి - చేనేతను మింగిన మర నేత ఈ చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు మామిడాల చంద్రయ్య (92). భార్య పేరు కమలమ్మ. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. సిరిసిల్ల విద్యానగర్వాసి. ఒకప్పుడు బాగానే బతికాడు. ఇల్లు కట్టుకోవడంతోపాటు కుమారులు, కూతురుకు పెళ్లిళ్లు చేశాడు. వీరు ఎవరికి వారే బతుకుతున్నారు. ఈ వృద్ధుడిది ఇప్పుడు సాతగాని పానం.. బొక్కలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడించాలంటే రెక్కల్లో సత్తువ లేదు. తన ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్ట నేస్తున్నాడు. రోజూ పొద్దుగాల 10 గంటలకు వచ్చి చేనేతమగ్గంపై 4 మీటర్ల బట్టను సాయంత్రం 5 గంటల వరకు ఉత్పత్తిచేసి వెళ్తాడు. ఒక్కో మీటరుకు రూ.17 చొప్పున రోజూ రూ.68 కూలి వస్తుంది. నెలకు రూ.1,500 – రూ.1,800 మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.1,000 ఇస్తుంది. ఈ సొమ్ముతోనే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలతో పూటగడవాలి. ఆరోగ్యం సహకరించకున్నా చేనేతమగ్గంపై బట్ట నేసి అంతో ఇంతో సంపాదించడం తప్ప మరోమార్గంలేదు. ఇది ఒక్క చంద్రయ్య– కమలమ్మ దంపతుల పరిస్థితే కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 225 మంది చేనేత కార్మికుల దుస్థితి. సిరిసిల్ల: ‘చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు’.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికులు మరోపని చేతకాక.. వయసు పైబడినా.. కళ్లు కనిపించ కపోయినా.. ఒళ్లు సహకరించకున్నా.. జానెడు పొట్ట కోసం.. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్ట నేస్తున్నారు. 58 ఏళ్లవయసు నిండితే ప్రభుత్వం రిటైర్మెంట్ను ప్రకటి స్తోంది. కానీ చేనేత కార్మికులంతా 60 దాటి 95 ఏళ్ల వయసున్న వారు ఇంకా మగ్గంపై శ్రమిస్తూ.. పొట్టపో సుకుంటున్నారు. తక్కువ కూలి ఉన్నా.. కుటుంబ అవసరాల కోసం మగ్గాన్నే నమ్ముకుని మలి సంధ్య లోనూ పనిచేస్తున్నారు. సిరిసిల్లలో మూడు చేనేత సహకార సంఘాలు ఉండగా.. 114 మంది కార్మికులు చేనేత మగ్గాలపై ఆధారపడ్డవారే.. మరమగ్గాలపై వేగం గా బట్ట ఉత్పత్తి అవుతుండగా.. చేనేతమగ్గంపై కాళ్లు, చేతులు ఆడిస్తూ.. ఎంతశ్రమించినా మరమగ్గాలతో పోటీపడలేక పోతున్నారు. అత్యంత కష్టమైన ఈ పనిలో వయోవృద్ధులు శ్రమించడం బాధాకరం. ఈ పనిని కొత్తగా ఎవ్వరూ నేర్చుకోకపోవడంతో ఈ తరం తనువు చాలిస్తే.. చేనేత మగ్గాలు మూలన పడాల్సిందే. ఇప్పుడు మరణశయ్యపై చేనేత మగ్గాలు ఆఖరితరం చేతిలో బట్టనేస్తున్నాయి. మిగిలినవి కొన్నే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గా లు ఉన్నాయి. వీటికి చేనేత, జౌళిశాఖ అధి కారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ రంగంపై 175 మంది కార్మికులు, మరో 50 మంది అను బంధ రంగాల కార్మికులు ఆధారపడ్డారు. సిరిసి ల్లలో అత్యధికంగా 135 మంది ఉండగా.. వేము లవాడ, మామిడిపల్లి, బోయినపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో మిగతావారు పని చేస్తున్నారు. వీరికి టెస్కో ద్వారా నూలు సరఫరా అవుతోంది. దీని ఆధారంగా బట్టనేసి ఇస్తున్నారు. ‘ఆసరా’ అంతంతే.. ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు మర మగ్గాల కార్మికులకు కొంతైనా దరి చేరుతున్నాయి. కానీ, నిజమైన చేనేత కార్మికులకు చేయూత లభించడంలేదు. 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంలేదు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇవ్వాలనే నిబంధన.. వృద్ధాప్యంలో ఉన్న దంప తుల్లో ఒక్కరికే వర్తిస్తోంది. మగ్గం నేసే కార్మికుడు, ఇంట్లో ఉండే వృద్ధురాలు ఇద్దరూ పింఛన్‌కు అర్హులే. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఈ నిబంధనను సడలించింది. చేనేత కార్మికులకు ఆం క్షలు ఉండడంతో సామాజిక భద్రత కరువైంది. ఆసరా పిం ఛన్లు, అంత్యోదయ కార్డులివ్వాలని వేడుకుంటున్నారు. -
వీధి కుక్కలకు జియోట్యాగింగ్
– శునకాల నియంత్రణకు ఆండ్రాయిడ్ యాప్ – దేశంలోనే మొదటిసారిగా తిరుపతిలో అమలు తిరుపతి మెడికల్: దేశంలోనే మొట్టమొదటి సారిగా వీధి కుక్కల నియంత్రణకు జియోట్యాగింగ్ పద్ధతిని తిరుపతిలో అమలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ సమన్వయంతో తిరుపతికి చెందిన యానిమల్ కేర్ ల్యాండ్ సంస్థ ఈ ఆధునిక సాంకేతిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ‘ఆండ్రాయిడ్ యాప్ ’ద్వారా వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తిరుపతి కేంద్రంగా యానిమల్ కేర్‌ల్యాండ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్.వి. శ్రీకాంత్ బాబు 14 ఏళ్లుగా రేబిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 110 మున్సిపాలిటీల్లో యాప్ సేవలు.. ఈ పద్ధతిని పారదర్శకంగా అమలుచేసేందుకు యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి నగరపాలక సంస్థతో సమన్వయంతో పనిచేస్తోంది. ఈ పద్ధతిలో భాగంగా టీకాలు వేసిన ప్రతి శునకాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ ద్వారా జియోట్యాగ్ చేస్తారు. ఒక సారి యాప్‌ను ఉపయోగించి శునకాలను పట్టినప్పుడు, శస్త్ర చికిత్సలు చేసినప్పుడు, తిరిగి వాటి స్థానాల్లో వదిలినప్పుడు మొత్తం 3 ఫొటోలతో జియోట్యాగింగ్ చేస్తారు. దీనిని నేరుగా సీఎం డాష్ బోర్డుకు అనుసం«ధానం చేస్తారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు ఆసక్తి చూపించారు. అందులో భాగంగానే డాక్టర్ శ్రీకాంత్‌బాబుతో చర్చించి రాష్ట్రంలోని 110 మున్సిపాలీటీల్లో .. 1.79లక్షల శునకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోనే ఆదర్శంగా... తిరుపతి కేంద్రంగా యానిమల్ కేర్ ల్యాండ్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1370 ఫిర్యాదులు తమ దష్టికి వచ్చాయి. వీధి శునకాల నియంత్రణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్‌ను రూపొందించాం. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమలుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ ఎన్.వి.శ్రీకాంత్ బాబు, కో–ఆప్షన్ సభ్యులు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా -
సాగు కనెక్షన్లకు జియోట్యాగింగ్
– ఎస్ఈ భార్గవరాముడు – 12లోగా పూర్తి చేయాలని ఆదేశం కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను జియోట్యాగింగ్‌తో అనుసంధానించాలని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవ రాముడు సూచించారు. స్థానిక కేవీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న పవర్ హౌస్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జియోట్యాగింగ్ వ్యవస్థను ఈనెల 12వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి నెలా నిర్ణీత గడువులోగా స్పాట్ బిల్లింగ్ పూర్తి చేసి వసూలుపై దష్టి సారించాలని ఆదేశించారు. సంస్థ నిబంధనల ప్రకారం పాత బకాయిలను ప్రతి నెలా 10శాతం మేరకు వసూలు చేయాలన్నారు. అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేసి వర్క్ అర్డర్లు క్లోజ్ చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే గ్రామీణ ప్రాంతాల్లో 24గంటలు, పట్టణ ప్రాంతాల్లో 12గంటల్లోపు కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు–1, 2, రూరల్స్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు ఏడీఈలు టీఎన్ ప్రసాద్, రంగస్వామి, నవీన్ బాబు, విజయసారథి, జయశంకర్, రామ సుబ్బారెడ్డి, ఏఈలు, ఏఏఓలు పాల్గొన్నారు. -
వారంలో జియో ట్యాగింగ్ పూర్తి
డ్వామా పీడీ హరిత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని రైతులకు చెందిన అన్ని రకాల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ టెక్నికల్ సిబ్బంది వారం లోపు జియోట్యాగింగ్‌ను పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం దర్గామిట్టలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిల్టర్ పాయింట్లు, బోరు బావులు, ఓపెన్ బావులు, కాలువలపై ఉంచిన మోటార్ల కనెక్షన్లకు సంబంధించి 100 శాతం జియోట్యాగింగ్‌ను వారం లోపు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 1,61,376 కనెక్షన్లు ఉన్నాయని, గత రెండు రోజుల్లో 21,800 కనెక్షన్లు జియోట్యాగింగ్ చేశార ని తెలిపారు. దీని వల్ల రైతులు వేసిన పంటల రకాలు, భూవిస్తీర్ణం, మెట్ట, మాగాణి తదితర వివరాలతోపాటు విద్యుత్ ఖర్చు, నీటి వినియోగం, కరువు పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు. -
‘సర్వే’జనా.. ‘దుఖమే’ భవిష్యత్తు
సంక్షేమ పథకాల కుదింపు సర్వే టీవీ, ఫ్రిడ్జ్ ఉంటే పేదలు కానట్లే సాధికార సర్వేలో ఇదే ‘లోగుట్టు’...! వివరాలు చెప్పడానికి జనం నిరాకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడానికే టీడీపీ సర్కారు సాధికార సర్వే చేయిస్తోందా..? సంక్షేమ పథకాలను కొందరికే పరిమితం చేయడానికి ప్రణాళిక వేసిందా..? ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు ఉండే కుంటుంబాలు ప్రభుత్వం దృష్టిలో సంపన్న కుటుంబాలా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్న ప్రజాసాధికార సర్వే కొందరికే సాధికారికతను చేకూర్చేలా ఉందనే విమర్శలను తెచ్చిపెడుతోంది. చిత్తూరు (అర్బన్): కుటుంబ ఆదాయ వనరులు, ఆర్థిక పరిస్థితులు, పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిదారులు..తదితర లెక్కలు సేకరించడానికే ప్రజాసాధికారత సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలను 2,745 బ్లాకులుగా విభవించారు. ఒక్కో బ్లాకుకు ఎన్యుమరేటరును నియమించారు. సర్వే తీరును పరిశీలించడానికి 317 మందిని అదనంగా నియమించారు. ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యింది. వారం రోజుల్లో అధికారులు పూర్తిచేసిన బ్లాకులు రెండంకెలు కూడా దాటలేదు. సీఎం డాష్ బోర్డులో చిత్తూరు జిల్లా నుంచి యాభై బ్లాకులు కూడా పూర్తి చేయలేదనే సమాచారం కనిపిస్తోందని సర్వే చేస్తున్న అధికారులపై, పర్యవేక్షకులు రోజూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలున్నప్పటికీ చాలా చోట్ల ప్రజలు వ్యక్తిగత వివరాలు చెప్పడానికి నిరాకరించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ వివరాలు ఎందుకో.. సర్వేలో ప్రతి కుటుంబంలోని వ్యక్తిని ఫొటో తీయాలి. ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, హీటర్, సెల్‌ఫోన్, సైకిల్, స్కూటర్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది. కులాల వివరాలు సైతం చెప్పాలి. దారిద్య్రరేఖకు దిగువగా (బీపీఎల్), దారిద్య్ర రేఖకు ఎగువగా (ఏపీఎల్) ఉన్న కుటుంబాలుగా ప్రజల్ని విభజించడమే సర్వే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. టీవీ, రిఫ్రిజిరేటర్ ఆధారంగా ప్రజల్ని బీపీఎల్, ఏపీఎల్‌గా విడగొట్టడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొందరికే చేకూర్చాలన్నదని ప్రభుత్వ ఉద్దేశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో కులాల ప్రస్తావన ఉండటం వెనుక కాపులను బీసీల్లో చేరస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌కు సాధికార సర్వేలో కులాల వారీగా తీసిన వివరాలను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రామాణికం లేకుండా చేస్తున్న సర్వేలో కాపుల సంఖ్యను తక్కువగా చూపిస్తూ బీసీల్లో చేర్చడానికి వీల్లేదనే విధంగా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.